Saturday, May 14, 2022

ఊహల కొంగలు కవిత్వ గూటికి చేరేవేళ



డా. కాళ్ళకూరి శైలజ గారి "కొంగలు గూటికి చేరే వేళ" కవితా సంపుటి పై వ్రాసిన సమీక్షా వ్యాసం. ఇది పాలపిట్ట ఏప్రిల్, 2022 సంచికలో ప్రచురింపబడింది. ఎడిటర్ శ్రీ గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
బొల్లోజు బాబా
.
ఊహల కొంగలు కవిత్వ గూటికి చేరేవేళ

.
డా. కాళ్ళకూరి శైలజ గారు వక్తగా, విశ్లేషకురాలిగా ఇప్పటికే ప్రసిద్ధులు. వృత్తిరీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న వైద్యులు. ఇప్పుడు “కొంగలు గూటికి చేరేవేళ” అనే ఈ కవిత్వ సంపుటితో మంచి కవయిత్రిగా మనముందు నిలిచారు. ఇది వీరి మొదటి కవిత్వ సంపుటి.
శైలజ గారు చదువుకునే వయసునించీ గొప్ప సాహిత్యాభిమాని, విస్త్రుతమైన చదువరి. ఈ సంపుటిలోని కవితలు- ఊదాపూలు, నాచుట్టూ, వ్యధార్తగాథలు, అస్తిత్వం అని నాలుగు భాగాలుగా ఉన్నాయి. ఊదాపూలలో 19 కవితలు, నాచుట్టూ లో 9 కవితలు, వ్యధార్తగాథలు అనే విభాగంలో 8 కవితలు, అస్తిత్వం అనే చివరి భాగంలో 2 కవితలు ఉన్నాయి.

I. ఊదాపూల… Confessions

సాహిత్యంలో ఊదారంగు ప్రేమని, నిజాయితీని, మార్మికతను, జ్ఞాపకాలను సూచిస్తుంది. ఈ 19 కవితలలో అవే అంశాలు ప్రతిబింబించటం గమనించవచ్చు.
శైలజగారు తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించారు. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని అంటారు. ఆ కోణం లోంచి చూసినపుడు వీరు Confessional Poetess గా కనిపిస్తారు. ఈ విభాగంలోని మొదటి అయిదు కవితలు చాలా విశిష్టంగా కనిపిస్తాయి. ఇవి కవయిత్రి తాలూకు మనఃస్థితిని, కవిత్వం వైపు ఆమె చేసిన ప్రయాణాన్ని సూచిస్తాయి.
గతించిపోయిన పుత్రుని తాలూకు జ్ఞాపకాలు మొదటి మూడు కవితలలో చాలా లోతుగా వ్యక్తీకరించబడ్డాయి. ఒక బలమైన వేదనను ప్రతిబింబించాయి. అదొక పెనుదుఃఖం. ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసిన శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు, నేను ఆ మొదటి మూడు కవితల వద్ద చాలాసార్లు ఆగిపోతూ వచ్చాను అన్నారు. మొదటి మూడు కవితలలో తన పుత్రశోకాన్ని….

పచ్చి గాయం మీద
జ్ఞాపకాల లేపనం పూసి
కాలంతో రాజీ పడాలి…. అంటూ ఒకచోట
వెలవెల బోయిన అమావాస్య నిశిలో
తేలిపోయిన విత్తు
మరెక్కడో మొలకెత్తే ఉంటుంది …. అంటూ మరో చోట నిర్వేదంతో సమాధానపడటం గమనిస్తాం.
 
“కలలు కన్నీళ్ళు దాయటానికి పదాలను మించిన సురక్షిత స్థలాలు లేవు ఈ ప్రపంచంలో” అని ముందుమాటలో శ్రీ సీతారాం అన్నట్లు - ఆ వేదననుండి, ఆ వేదనామయ బరువైన జ్ఞాపకాలనుండి ఆమెకు సాంత్వన కవిత్వంలో లభించినట్లు నాల్గవ కవిత డేజావూ లో అర్ధమౌతుంది. ఏదైన ఒక కొత్త ప్రదేశానికి వచ్చినపుడు, ఇదివరకెన్నడో ఆ ప్రదేశాన్ని చూసామని, అక్కడ సంచరించామనీ అనిపించటాన్ని డే జావూ అంటారు.

ఓహో! ఇదే ఆ చోటు
కలతలు, కన్నీళ్ళ సాక్షిగా
అల్లనల్లన ఎగిరే మనసుకు
కంటిచెమ్మ తుడిచి
కలల చీకట్లు చెరిపి
జన్మజన్మ స్మృతుల బాటలో
దర్శించిన క్షణకాలపు “ఆనంద సీమ” ఇదే
ఇక్కడే!
అడవిలో మిణుగురు నేనే
తోటలో తేనెపిట్టా నేనే
వెన్నెల వర్షంలో క్రీనీడల నడుమ మెత్తని చీకటి నేనే
తూర్పుకొండల నారింజ రశ్మి నేనే (డే జావు)

ఇదొక అపురూపమైన సందర్భం. జీవితంలోని డిప్రెస్సింగ్ మొమెంట్స్ ని కవిత్వం తిరిగి జీవన క్షణాలుగా మార్చటం, -- అల్లనల్లన ఎగిరే మనసుకు కంటిచెమ్మ తుడిచి, చీకట్లు చెరిపి “ఆనంద సీమ” ను దర్శింపచేయటం, ఇదంతా ప్రకృతి చేసే మాయ అనే ఎరుక కలిగించటం- ఒక గొప్ప మానవానుభవం. విశ్వసిస్తే దైవీక ఘటన కూడా. ఆ మేరకు శైలజగారు కవిత్వానికి ఒక ప్రొడిగల్ డాటర్ గా అనిపిస్తారు.

ఇక ఐదవ కవితలో శైలజగారు తాను కవిత్వం వైపు చేసిన ప్రయాణానికి తనకు మార్గదర్శిగా ఎవరున్నారో ఇలా చెబుతున్నారు.

మరి నా గురువో?
జటాధారి, మౌని కాదు.
ఉధ్గ్రంథ సారమూ కాదు!
సుతిమెత్తని ఇసుకలో తగిలే ములుకు
నమ్మకాన్ని ప్రశ్నించే బాధ
విశ్వాసాన్ని నిలదీసే విషాదం
పాలలో నీటిని వేరుచేసే రాయంచ
కలలో మెలుకవ
మెలుకవలో ఎరుక… (మార్గదర్శి). ….. మొత్తం మీద జీవనానుభవాలే తన కవిత్వానికి నేపథ్యం అంటున్నారు. అందుకనే ఈ సంపుటిలోని అనేక కవితల వెనుక స్పందించే ఒక దయామయి హృదయం ఉండటం స్పష్టంగా గమనించవచ్చు.

ఊదాపూల విభాగంలోని మిగిలిన కవితలలో ఎక్కువగా నాస్టాల్జియా, ప్రకృతి, మానవ సంబంధాలు, ఆత్మవిశ్వాసము, సహానుభూతి లాంటివి వస్తువులుగా ఉన్నాయి. నువ్వొచ్చివెళ్ళిన సాయింత్రం, అప్పుడు, కేరింత, మిస్సింగ్ లాంటి కవితలను కథనాత్మక శైలిలో చెప్పారు. నేడు కవిత్వాన్ని కథనాత్మక పద్దతిలో చెప్పటానికి ప్రాముఖ్యత పెరుగుతున్నది. కథనాత్మక శైలి పఠితల్ని ఆకర్షిస్తుంది. చెపుతున్న సంఘటననో దృశ్యాన్నో మనో ఫలకంపై చిత్రించుకోవటం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది.

ఒకానొక శరత్ పూర్ణిమరోజున ఇంటిల్లపాదీ పిల్లాపాపలతో డాబాపైకి వెన్నెలలో భోజనాలు చేసిన సందర్భాన్ని ఒక కథలా చెప్పిన ఈ కవితా సౌందర్యం చూడండి

వెన్నెల భోజనానికి అంతా సిద్దం
డాబామీద చాప, పళ్ళెంలో పాల బువ్వ
గిరికీలు కొడుతున్న మిణుగురుల్లా
పసికేరింతలు//
పెరుగన్నం పులుముకున్న వేళ్లకొనలకు
అందక పరుగులు తీసే
చిట్టికూనల పాదాలు//
పందిరి కింద పడక్కుర్చీలో నాన్న,
పైకీ కిందకీ అమ్మ
కలబోసుకున్న కబుర్ల అక్కాచెల్లెళ్ళు//
ఎక్కడిదో సాంబ్రాణిధూపం//
ఇప్పటికీ శరత్ పూర్ణిమ నిండుకుండ
చేదుకున్న కొద్దీ వెలుగు నీడల సైయాట
నింగిని ఎదలో వెలిగించే పెన్నిధి. (అప్పుడు)

పై కవితలో సామాజిక స్పృహ ఏది? సామాజిక ప్రయోజనం ఏమేరకు నెరవేరుతుందీ? అంటూ ఆధునిక విమర్శకుడు ప్రశ్నించవచ్చు. పై కవితలో వేల సంవత్సరాలుగా కాపాడుకొంటూ వచ్చిన భారతీయ సంస్కృతి ఉంది. మనిషిని మనిషితో బంధించిన మానవ సంబంధాలు ఉన్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవటం, మానవసంబంధాలను నిలుపుకోవటాన్ని మించిన సామాజిక ప్రయోజనం ఏమీ ఉండదు ఏ కాలంలోనైనా. ఈ రెండు పనులు చేయటానికి సాహిత్యం వినా మరో మార్గం లేదు.

II. నాచుట్టూ … నేనే

ఈ విభాగంలో తొమ్మిది కవితలు ఉన్నాయి. ఇవి కవి చుట్టూ ఉన్న సమాజిక జీవనం పట్ల చేసిన పరిశీలనాపూర్వక వ్యాఖ్యానాలు. ఈ విభాగంలో -పల్లెలకు దూరమై పట్నంలో పరాయీకరణ పాలౌతున్న మనిషిగురించి రెండు కవితలు, ప్రకృతి వైపరీత్యాలలో పేదల అగచాట్లపై రెండు, వృద్ధాప్యంపై రెండు, దివ్యాంగులపై ఒకటి, రాత్రి పహారా కాచే గూర్కాపై ఒకటి, సరిహద్దు సైనికునిపై ఒకటి ఉన్నాయి.
 
నేడు మానవుడెంత పరాయీకరణకు గురయ్యాడో చెప్పకుండా ఆధునిక జీవనాన్ని చెప్పటం సాధ్యపడదు. గుంపులో ఏకాకితనం, అమానవీకరణ, హిపొక్రిసి, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత, పల్లె లేదా బాల్యజ్ఞాపకాలను తలచుకోవటం, నిరాశ వంటివన్నీ పరాయికరణ వివిధ స్థాయిలు.

చీకటి కవల కవితలో నగరభీభత్స సౌందర్యం వివిధ మెటఫర్లలో ఇలా దర్శనమిస్తుంది

నగరం ఒక భీతావహ సత్యం/
జూదగృహం పట్నం/
కృత్రిమ ఆటబొమ్మ/
దేహాన్ని బేరం పెట్టమంటుంది
మోసం, మోహం కలనేసిన మలిన వస్త్రం నగరం/
చీకటి కవల నగరం.
 
నగరాన్ని చీకటికి కవల అనటం ఒక నవ్యమైన ఊహ.

రచ్చబండ అనే కవితలో జ్ఞాపకాల్లోంచి ఒకనాటి పల్లె సామాజిక జీవనాన్ని ఇలా పునర్నిర్మించుకొంటారు శైలజగారు.

అనగనగా మా ఊరు
ఊరికి పెద్దన్న రావిచెట్టు/
ఆ చెట్టుకింద చదునైన రాయి
అదే ఆ ఊరికి గరిభనాభి//
బాటసారి వేసట, ముచ్చట్ల తీరిక
బైరాగిపాట, సన్యాసి విశ్రాంతి,
తలా ఒక ఆకుగా రాలిపడినది అక్కడే – (రచ్చబండ)

పల్లెటూరిలో గడచిన బాల్యపు జ్ఞాపకాలు తలచుకోవటం ఆధునిక మనిషి మీద అనివార్యంగా పడిన పరాయీకరణను తెలుపుతున్నాయి.

III. వ్యధార్తగాధల…చీకటి వెలుగులు

వ్యధార్తగాథలు అనే విభాగంలో 8 కవితలున్నాయి. శైలజగారు వృత్తిరీత్యా వైద్యులు. ప్రాణం శ్వాసపోసుకోవటాన్ని దగ్గరనుండి చూస్తారు. ఆ నేపథ్యంలోంచి రాసిన కవితలు ఈ విభాగంలో ఉన్నాయి. ఈ కవితలలోని వస్తుశిల్పాలు హృదయాన్ని కంపింపచేస్తాయనటంలో సందేహం లేదు.

రెక్కలు సాచి రివ్వుమందామనే ప్రాణంకి
మత్తిచ్చి మాయచేసి, లాలిస్తుంటారు
ఏ రక్తసంబంధం లేనివారు
రక్తపు సీసా కోసం పరుగులు తీస్తుంటారు//
ఎన్ని అరచేతులు కావాలి!
ఒక ప్రాణదీపం వెలిగించేందుకు --(ఆపరేషన్ థియేటర్)

ఎమర్జెన్సీ వార్డులో జరిగే ఒక దినచర్యను కవిత్వీకరించారు. కవిత చివరలో ఆ వ్యక్తి బ్రతికితే "గది అమ్మలా కళ్ళువొత్తుకొంటుంది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే గుండెల్లో బాణం దిగిన గాయం జ్ఞాపకమై సలుపుతుంది - అనటం ద్వారా వైద్యవృత్తిలో ఉండే మానవీయకోణాన్ని ఆవిష్కరించారు.
 
నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొనేది ఎక్కువగా స్త్రీలే. ఎందుకో పురుషులు అలాచేసుకోవటం పెద్దగా చూడం. అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఒక స్త్రీ నిప్పంటించుకొని కాలిన గాయాలతో హాస్పటల్ కు వచ్చిన సంఘటనను దగ్ధపరిమళం అనే కవితగా మలచారు.

అన్నం వండిన చేయి మోడై
మరణవాగ్మూలంలో సంతకం పెట్టలేక
నిరాశ తెరవెనుకనుంచి సైతం
క్షమాభిక్ష పెట్టేందుకు గొంతుసవరించుకొంటుంది
కాబోయే పెళ్ళికొడుకు మాత్రం తెలివిగా తప్పించుకుపోతాడు. (దగ్ధపరిమళం)

అలాంటి పరిస్థితులలో కూడా ఆ స్త్రీ ఆ భర్తకు క్షమాభిక్షపెట్టేందుకు సిద్ధపడినట్లు చెప్పటం ద్వారా మానవసంబంధాలలోని అనూహ్యతను, అపాత్రదానాన్ని అక్షరబద్ధం చేస్తారు శైలజగారు.
ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటాన్ని “తొలి ఊపిరి” పేరుతో ఒక కవితా సందర్భం చేసారు శైలజగారు.

పురుటిగది సంద్రంలో
సుడిగుండాల మాయవిడినపుడు
ప్రాణం రూపుకడుతుంది.
“అమ్మా” అనే కేక మోగుతుంది
ఒక్క తల్లికే జన్మనివ్వడం తెలుస్తుంది

మాయవిడినపుడు అన్న మాటలో “మాయ” అనే పదానికి వేదాంతపరమైన మాయ అనే అర్ధంతో, శాస్త్రీయంగా పిండత్వచం/Placenta అనే అర్ధంతో కూడా అన్వయం చేసుకోవచ్చు. ఇది కవి ప్రతిభ.
ఏ మనిషైనా ఒంటరిగా బ్రతకలేడని, అనేకమంది క్రమశిక్షణతో సైన్యం వలే పనిచేస్తేనే అతని జీవనం సాధ్యమౌతుందనే సత్యాన్ని ఈ సంపుటి చివరికవిత “నీకై పోరాడే సైన్యం” ద్వారా ఆవిష్కరించారు.
 
ఆసుపత్రి గోడలు, ఆలయాల కంటే ఎక్కువ ప్రార్ధనల్ని విని ఉంటాయి అంటాడు రూమీ.

ఆసుపత్రి అంటేనే ఒక ఉద్యమం
ఆఖరుక్షణందాకా పోరాడే
అత్యున్నత పోరుభూమి
ప్రార్ధనలన్నిటికీ ప్రాణాన్ని
కానుకగా ఇచ్చే దివ్యలోకం – అంటూ శైలజ గారు ఆసుపత్రికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఈ కవితలో.

VI. నా అస్తిత్వం … నా కవిత్వమే

ఈ విభాగంలో అల్కెమి, సౌమ్యవాది అనే పేర్లతో రెండు కవితలు ఉన్నాయి.

వేపపూత ఏటా తొలి సంతకం చేసినట్టు
ఓటమిలోంచి
వికసించే రహస్యం పట్టుబడింది
విషాదం కన్నా జీవితం తియ్యనిది (అల్కెమి)

“కవిత్వం ఒక అల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు” అని తిలక్ అన్నాడు. అప్పటినుంచి తెలుగు సాహిత్యంలో అల్కెమి అనేపదం కవిత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది. అల్కెమి అనే పేరుతో ఉన్న ఈ కవితలో ఓటమిలోంచి తిరిగి ఫీనిక్స్ పక్షిలా తాను పైకి లేవటానికి కవిత్వం సహాయపడిందనే రహస్యాన్ని పొందుపరచారు శైలజగారు.
 
ఇదే విభాగంలోని రెండవకవితైన సౌమ్యవాదిలో

నువ్వున్నచోటును పదేళ్ళ తర్వాత 
ఎలా ఉంటుందో దర్శించే
ఒకే ఒక్కడున్నాడు//
వాడు కవి, వాడే రవి
తూర్పున కాదు,
మార్పున ఉదయిస్తాడు – అంటూ ఒక కవిని నిర్వచించారు. 

ఈ రెండు కవితలద్వారా తన అస్తిత్వంలో ఓటమిలోంచి వికసించిన కవిత్వాన్ని వినిపించే సౌమ్యవాద కవి దాగి ఉన్నదంటూ అన్యాపదేశంగా తన కవిత్వ తత్వాన్ని చెబుతున్నారు.
ఈ సంపుటిలోని కవితల వరుసక్రమాన్ని, వివిధ విభాగాలుగా వాటిని కూర్చిన విధానంలో అంతస్సూత్రంగా ఒక నెరేటివ్ ఉండటం విశేషం.
***
పదచిత్రాల సౌందర్యం, ఆర్థ్రత, జీవితానికి చేసిన లోతైన వాఖ్యానం, పదబంధాల నవ్యత్వం, తాత్వికత, కాళ్ళకూరి శైలజ గారి కవిత్వంలో పొటమరిస్తూ


ఉన్నాయి. చక్కని చిక్కని కవిత్వం ఇష్టపడేవారికి “కొంగలుగూటికి చేరే వేళ” తప్పక నచ్చుతుంది. ఈ పుస్తకాన్ని అనల్ప వారు ప్రచురించారు. అందమైన ప్రింటు, ఖరీదైన పేపరు. వెల 150/- రూపాయలు. ఈ పుస్తకం కావలసిన వారు 7193800303 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
బొల్లోజు బాబా