Monday, May 9, 2022

అంతర్ధానమైన ఆజీవిక మతం

    భారతదేశానికి సంబంధించి క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం చారిత్రికంగా చాలా విశేషమైనది. సుమారు 62 వివిధ మతాలు అప్పటికి ఆవిర్భవించాయి. వీటిలో బుద్ధిజం, జైనిజం నేటికి నిలిచి ఉన్నాయి. అదే కాలంలో పుట్టి మరో రెండువేల సంవత్సరాలపాటు మనుగడలో ఉండి మధ్య యుగాలలో సమూలంగా అంతరించిపోయిన మరొక మతం ఆజీవిక మతం.

ఆజీవక మతానికి మూల పురుషుడు మఖలి గోశాల. ఇతను జైన మహావీరుని శిష్యుడు. మఖలి గోశాల (Makkhali Gosaala) ఆజీవిక మతానికి 24 వ తీర్థంకరుడు అనే అభిప్రాయం కలదు.

మఖలి గోశాల, గౌతమ బుద్ధుడు, జైన మహావీర తీర్థంకరుడు ముగ్గురు సమకాలీనులు.

ఆజీవక మతానికి సంబంధించిన ఏ విధమైన రచనలు అందుబాటులో లేవు. వీరి గురించిన సమాచారం జైన, బౌద్ధ గ్రంధాల ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇవి ఆజీవక మతానికి ప్రత్యర్ధి మతాలు కనుక వీటిలో ఆజీవిక మతం గురించి గర్హనీయ అంశాలు తప్ప మంచి విషయాలు పెద్దగా కనిపించవు.

మఖలి గోశాల

మఖలి గోశాల తండ్రి పేరు మఖలి. జైన మతావలంబి. ఇతను దేవతల బొమ్మలను ఒక పెట్టెలో ఉంచి వాటిని ప్రదర్శిస్తూ, భక్తిగీతాలు పాడుకొంటూ జీవనం సాగించేవాడు. ఇతను ఒక దాసితో వ్యభిచరించిన ఫలితంగా ఆమె ఓ పశువులపాకలో ఒక మగ బిడ్డను కన్నది. మఖలి కి జన్మించాడు కనుక ఆ బిడ్డకు మఖలి పుత్రుడని, గోశాలలో పుట్టాడు కనుక మఖలి గోశాల అని పేర్లు కలిగాయి.

బుద్ధఘోషుని రచన ప్రకారం - ఈ మఖలి గోశాల తండ్రివలే దాస్యజీవనం సాగించాడట. ఒకనాడు నెత్తిపై ఒక నూనె కుండతో బురదగా ఉండే నేలపై నడుస్తుండగా యజమాని “జాగ్రత్తగా నడు” అని హెచ్చరిస్తున్నప్పటికీ అజాగ్రత్తతో ఆ నూనెకుండ నేలపాలు చేసాడట. దీనికి కోపించిన యజమాని మఖలి గోశాలని తరమగా పంచెమాత్రం చేతికి చిక్కిందట. అలా గోశాల నగ్నంగా పరిగెత్తుకొంటూ వెళ్ళి దిగంబర సన్యాసిగా అవతారమెత్తాడని, క్రమేపీ ఆజీవిక మతాన్ని స్థాపించాడని అంటూ బుద్ధఘోషుడు ఆజీవిక మత స్థాపకుడి పూర్వవృత్తాంతాన్ని తెలియచేసాడు.

బౌద్ధ జైన మతాలు ఆజీవిక మతాన్ని వ్యతిరేకించాయి. కనుక అతని పుట్టుక నీచమైనది అనే అర్ధం వచ్చేలా పై బౌద్ధ రచన సాగటం ఆశ్చర్యం కలిగించదు.

గోశాల ఆరేళ్ళు వర్ధమాన జైన మహావీరుని వద్ద శిష్యరికం చేసాడు. కలహించి విడిపోయాడు. పదహారేళ్ళు శ్రావస్తిలో బోధకునిగా జీవితం గడిపాడు. తన సన్యాసి జీవితంలో అధికభాగం శ్రావస్తి లో హాలహల అనే పేరు కల ఒక కుమ్మరి స్త్రీ కార్ఖానాలో తన శిష్యులతో బసచేసేవాడు.

    ఇతను శ్రావస్తి నగరంలో బుద్ధుడు నివసించే జేత వనానికి వెనుక నివసించేవాడు. గౌతమ బుద్ధుడే స్వయంగా, మఖలి గోశాల ని “ఇంద్రియ లోలుడని, మూర్ఖుడని, కేశకంబళి లాంటి వాడని అంటూ భిన్నసందర్భాలలో ప్రస్తావించటాన్ని బట్టి ఇతను బౌద్ధ మతానికి జైన మతం కన్నా బలమైన పోటీగా నిలిచాడని అర్ధం చేసుకొనవచ్చు.

    ఒకనాడు జైన మహావీరుడు మఖల గోశాల ఎదురెదురు పడి, ఒకరినొకరు శపించుకొన్నారు. మహావీరుడు ఆరునెలల్లోగా మరణిస్తాడని గోశాల శపించగా, మంఖలి గోశాల 7 రోజుల లోగా మరణిస్తాడని జైన మహావీరుడు శపించాడట. దాని ఫలితంగా గోశాలకు మతిస్థిమితం తప్పి ఉన్మత్తంగా ప్రవర్తించసాగాడట. ( టైఫాయిడ్ లాంటి విషజ్వరం వల్ల చనిపోయాడని మరో కథనం)

    తనకు అంత్య సమయం సమీపించిందని గ్రహించిన మఖలి గోశాల తన శిష్యులను రెండు కోర్కెలు కోరాడు. ఒకటి తన అంతిమ సంస్కారం అంగరంగవైభవంగా జరగాలని, రెండు “తాను నిజమైన సన్యాసిని కానని, తానొక దొంగనని, మోసగాడినని, నిజమైన జినుడు మహావీరుడని- అతనిని వ్యతిరేకించినందుకు తన శవం కాలికి తాడు కట్టి, ఈ విషయం చాటుతూ శ్రవస్తి అంతా ఊరేగించమని” కోరాడు. గోశాల మరణించాక అతని శిష్యులు రెండో కోర్కెను తీర్చటం ఇష్టం లేక- గృహంలోనే నేలపై శ్రవస్తి నగర పటం గీచి అక్కడే గోశాల శవాన్ని అటూ ఇటూ తిప్పి, అంగరంగవైభవంగా అంతిమ సంస్కారాలు జరిపించారట.

    పై కథనాలను ద్వారా అప్పట్లో మఖలి గోశాల పట్ల ఏమేరకు ఈర్ష అసూయలు ప్రత్యర్ధి మతాలైన బౌద్ధ జైనాలలో ఉండేవో అర్ధం చేసుకొనవచ్చు.బుద్ధుని నిర్యాణం క్రీపూ 483 అనుకొంటే గోశాల క్రీపూ 484 లో మరణించి ఉండవచ్చని, అదే విధంగా మహావీరుడు క్రీపూ468 గా చరిత్రకారులు గుర్తించారు

ఆజీవకునిగా సన్యసించే ప్రక్రియ

    ఆజీవక సన్యాసి జీవితంలోకి ప్రవేశించటం చాలా కష్టతరమైన ప్రక్రియ. జంబుక అనే ఒక వ్యక్తి ఆజీవక దీక్ష పొందిన విధానం బుద్ధఘోషుడు ఇలా వర్ణించాడు.

    "జంబుకని ఒక గోతిలో మెడవరకూ పాతిపెట్టారు. తలపట్టే రంద్రము కలిగిన ఒక చెక్కను అతని భుజాలపై నిలిపి దానిపై ఆజీవిక సన్యాసులు కొందరు కూర్చుని అతని తలపై వెంట్రుకలను కుదుళ్ళతో సహా పెరకి ముండనము గావించారు."

    ఇదే ఆచారం జైనులకు కూడా ఉంది. (అలా కుదుళ్ళతో సహా పెరికిన వెంట్రుకలు సరిగ్గ ఎదగవు. జైన విగ్రహాల తలలపై శిరోజాలు రింగులు తిరిగి ఉండటానికి ఇదే కారణం).

ఆజీవిక సంఘంలోకి స్త్రీలకు కూడా ప్రవేశం కలదు.

దిగంబర జీవనం

వివిధ పాళి రచనల ద్వారా ఆజీవికులు దిగంబరంగా జీవించేవారని తెలుస్తుంది. బుద్ధుని పరినిర్వాణ ఘట్ట శిల్పాలలో మహాకశ్యపుని తో మాట్లాడుతున్నట్లు కనిపించే నగ్న సన్యాసిని ఆజీవకునిగా గుర్తించారు. ఆజీవికులు పూర్తి నగ్నంగా ఉంటారని కనీసం కౌపీనం కూడా ధరించరని బుద్ధుని దివ్యావదాన కథల (Divyavadana narratives) ద్వార విదితమౌతుంది.

వీరు చేతిలో ఒక దండాన్ని ధరించి సంచరించేవారు కనుక వీరిని “ఏకదండి” లు అని పిలిచేవారు.

ఆజీవిక సన్యాసి జీవితం

    ఆజీవిక సన్యాసి జీవితం చాలా కఠినంగా ఉండేది. లోమహంస జాతక (Lomahamsa Jataka) లో ఒక ఆజీవకుని జీవన విధానం ఇలా వర్ణించబడింది.

    “ఆజీవికులు నగ్నంగా, ఒంటరిగా సంచరిస్తూ, మనుషులను చూడగానే భీతహరణిలా భయపడెదరు. దట్టమైన అడవుల్లో నివసిస్తారు. చలి, మంచు వానలు, ఎండలను ఓర్చుకొంటూ తమ కఠోర తపస్సు కొనసాగిస్తారు”.

    ఆజీవకులు -నేలపైకూర్చుని; గబ్బిలంలా వేలాడుతూ; ముళ్లపై పడుకొని; పంచాగ్నులను (కామాగ్ని, బడబాగ్ని, ఉదరాగ్ని, మందాగ్ని, శోకాగ్ని) జయించి తపస్సు చేస్తారని నంగుత్త జాతక (Nanguttha jataka) లో ఉంది.

    భిక్షను స్వీకరించటంలో పాటించే నియమాల ఆధారంగా ఆజీవిక భిక్షుకులు వివిధ రకాలు-దుఘరంతరియాలు వీరు వీధిలో ప్రతి మూడవ ఇంటినుంచి మాత్రమే భిక్షను అంగీకరిస్తారు. అలాగే తిఘరంతరీయాలు నాలుగవ ఇంటినుంచి, సత్తఘరంతరీయాలు ఎనిమిదవ ఇంటినుంచి, ఉప్పల బెంతియాలు తామర ఆకులలో మాత్రమే భిక్షను స్వీకరిస్తారు. విజ్జుఅంతరియా భిక్షకులు పగలు భిక్ష కోరరు.

    ఆజీవిక సంఘ సభ్యులు (Ajiviya-sangha) నియమిత ప్రదేశాలలో గుమిగూడి ఆథ్యాత్మిక చింతనలు చేసేవారు. అట్టి ప్రదేశాలను “ఆజీవిక సభ” (Ajiviya sabha) అని పిలిచేవారు. మఖలి గోశాల హాలహల అనే పేరు కల ఒక కుమ్మరి స్త్రీ కార్ఖానాలో తన శిష్యులతో బసచేసేవాడు. ఇది బహుశా ఊరిచివర విశాలంగా తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ప్రదేశం కావొచ్చును.

    సంగీత వాయిద్యాలతో భక్తి పాటలు పాడుతూ, తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఆథ్యాత్మిక సభలను జరుపుకొవటం ఆజీవకులు ప్రారంభించిన ఒక ఆథ్యాత్మిక సంప్రదాయంగా చెబుతారు. వీరు మృత్యువుని చివరి గానం, చివరి నృత్యంగా అభివర్ణించారు. (carime geye and carime natte)

బుద్ధభగవానుడు ఒకరోజు తనశిష్యులలో ఒకరిని- ఆజీవకులు ఎలా జీవిస్తారని అడిగాడు. దానికి అతను ఇలా బదులిచ్చాడు

"ఆ దిగంబరులా? (acelakas), వారు ఎవరి మాట వినరు. ఎవరైనా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే పోరు. వారికొరకు ఎవరైనా ఆహారం వండితెస్తే స్వీకరించరు. సహపంక్తి భోజనాన్ని అంగీకరించరు. గర్భిణులనుంచి, బాలింతలనుంచి, అప్పుడే శృంగారము జరిపినటువంటి స్త్రీలనుంచి వారు భిక్ష స్వీకరించరు. ఈగలు వాలుతున్న ఆహారాన్ని , కుక్క ఆశగాచూస్తున్న ఆహారాన్ని వారు తీసుకోరు. చేపలను, మద్యమాంసాదులను స్వీకరించరు”

అశోకుని కాలంలో ఆజీవిక మతారాధన

    మఖల గోశాల నిర్యాణ అనంతరం ఆజీవిక మతం శ్రావస్తి నుంచి చాలా వేగంగా దేశంలోని ఇతరప్రాంతాలకు విస్తరించింది. క్రీపూ. నాలుగో శతాబ్దానికి చెందిన పాదుకాభయ అనే శ్రీలంక రాజు అనురాధపురలో ఆజీవకులు నివసించటానికి ఒక గృహాన్ని నిర్మించాడు. (Ajivikanam geham).

    అశోకుని తండ్రి బిందుసారుడు ఆజీవిక మతాన్ని అవలంబించాడు. ఇతని కొలువులో జనసాన పేరుగల ఒక ఆజీవిక జ్యోతిష్కుడు ఉండేవాడు ఇతను అశోకుడు రాజు అవుతాడని భవిష్యత్తు చెప్పాడని ఒక కథ కలదు. నిజానికి అశోకునికి రాజయ్యే అవకాశం లేదు. అశోకుని సోదరుడైన సుషిమ ను రాజుగా బిందుసారుడు ప్రకటించగా, అశోకుడు తన 99 మంది సోదరులను వధించి తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. ఈ మొత్తం ఉదంతంలో అశోకుడు రాజు అవుతాడని ముందే జోశ్యం చెప్పిన ఆజీవిక సన్యాసి చరిత్రలో నిలిచిపోయాడు.

    అశోకుడు కూడా తండ్రివలే ఆజీవక మతాన్ని సమాదరించాడు. అశోకుని స్తూప శాసనాలలో ఏడవ దాంట్లో -బౌద్ధ, బ్రాహ్మన ఆజీవిక, జైన ఇంకా వివిధ ఇతర సంప్రదాయాల పట్ల తాను సమాదరణ కలిగి ఉన్నానని పేర్కొన్నాడు. ఆ వరుసక్రమంలో ఆజీవిక మతాన్ని ఇతర సంప్రదాయాలలో కలిపేయకుండా జైన, బ్రాహ్మన బౌద్ధాలతో సమానస్థాయిలో చెప్పటాన్ని బట్టి అప్పటికి ఆజీవిక మతం ప్రముఖమైన మతంగా ఉండేదని ఊహించుకోవచ్చును.

    బీహార్ లో ఉన్న బరాబర్ గుహలు రాతిని తొలిచి నిర్మించిన అత్యంత ప్రాచీన గుహలు. ఇవి మొత్తం 7 గుహలు. వీటిలో మూడింటిని అశోకుడు తన 12 వ పాలనా సంవత్సరంలో ఆజీవకులకు దానంగా ఇచ్చాడు. అప్పటికి అశోకుడు ఇంకా బౌద్ధాన్ని స్వీకరించలేదు. మిగిలిన నాలుగింటిని అశోకుని మనుమడు దశరథుడు ఆజీవికులకొరకు నిర్మింపచేసినట్లు శాసనాలు కలవు.

    బౌద్ధ మతాన్ని స్వీకరించాక, అశోకుడు – గౌతమబుద్ధుడిని అవహేళనచేస్తూన్న రాజ్యంలోని ఆజీవకులను నిర్మూలించమని ఆదేశాలు ఇచ్చాడట. ఆ విధంగా 18000 ఆజీవిక మతస్థులు వధింపబడినట్లు, అనేక ఆజీవిక శిల్పాలను నాశనం చేయించినట్లు అశోకవదనుడు పేర్కొన్నాడు.

    కాలక్రమేణా ఈ గుహల నుంచి ఆజీవికులను బయటకు పంపి, బౌద్ధులు, హిందువులు ఆక్రమించుకొన్నట్లు, ఆజీవికుల పేరుతో ఉన్న శాసనాలను చెరిపివేయటానికి ప్రయత్నించినట్లు ఆర్కియాలజి శోధనల ద్వారా తెలుస్తున్నది (ఈ బరాబర్ గుహ గోడలు అద్దం వలె ప్రతిబింబాన్ని చూపగలిగేంత నునుపైన పాలిష్ తో ఉండటం నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంది)

సంస్కృత రచనలలో ఆజీవకుల ప్రస్తావన

    బౌద్ధం పాలి భాషను ఆదరించినట్లుగా హిందూమతం సంస్కృతాన్ని ప్రోత్సహించింది. హిందూమతం ప్రారంభంలో దుష్టశిక్షణ పేరుతో హింసాత్మక అవతారాలతో చాలా అగ్రెసివ్ గా విస్తరిస్తూ వచ్చింది. దీనికి ఆజీవిక, బౌద్ధ, జైన మతాలు సహజంగానే ప్రతిపక్షంగా కనిపించకమానవు. ఆమేరకు దుష్ట శిక్షణ జరిగి ఉంటుందనటానికి పెద్దగా సందేహ పడక్కరలేదు. అందుకనే బౌద్ధ, జైన రాతలలో విస్తారంగా ప్రస్తావించబడిన ఆజీవిక మతం సంస్కృత రచనల్లో అసలు కనిపించదు. ఉన్న ఒకటి రెండు ప్రస్తావనలు కూడా ఆజీవికుల్ని తక్కువ చేస్తూ కనిపిస్తాయి.

    ఎవరైనా గృహస్తు తల్లిదండ్రులకు పిండప్రధానం చేసేటపుడు ఆజీవకులకు కానీ శాక్యులకు కానీ అన్నదానం చేసినట్లయితే అతనికి వంద పణాల అపరాధం విధించాలి అని క్రీపూ మూడో శతాబ్దానికి చెందిన కౌటుల్యుని అర్ధ శాస్త్రంలో ఉంది. (3.20.16).

    ఆజీవికులు అహింసమార్గాన్ని అనుసరిస్తూ శాఖాహార జీవనాన్ని గడుపుతారని జైన, బౌద్ధ రచనలలో ఉండగా వాయుపురాణంలో ఆజీవకులు మతపరమైన క్రతువులలో మద్యమాంసాలు స్వీకరిస్తారని ఉంది. ఇదే వాయుపురాణం- ఆజీవకులు రాత్రివేళల పాడుబడిన భవనాలలో, రహదారులపైనా అనుమానాస్పదంగా పిశాచుల్లా తిరుగుతూంటారని, వీరు వర్ణ, ఆశ్రమ ధర్మాలను సంకరం చేస్తుంటారని చెప్పింది.

    ఆరో శతాబ్దానికి చెందిన కుమారదాస అనే సంస్కృత కవి (శ్రీలంక రాజు) రచించిన జానకి హరణ అనే కావ్యంలో రావణాసురుడు సీతను ఎత్తుకొనిపోవటానికి ఆజీవక సన్యాసి వేషంలో వచ్చినట్లు వర్ణించాడు.

    ఆజీవక మతం ఉఛ్ఛ స్థితిలో ఉన్నకాలంలోనే మహాభారతం వ్రాయబడింది. అయినప్పటికీ ఎక్కడా ఆజీవక మత ప్రస్తావన కనిపించదు. కానీ “ఎక్కడైనా, ఎప్పుడైనా మానవప్రయత్నము ఫలించినట్లు కనిపించినా నిజానికి అది విధి తప్ప అన్యము కాదు” అనే ఆజీవక తత్వవాక్యం శాంతి పర్వంలో మంకి అనే పాత్ర ద్వారా చెప్పించటం గమనించవచ్చు. ఈ మంకి అన్న పాత్రపేరు కూడా ఆజీవిక తీర్థంకరుడైన మఖలి పేరుకి దగ్గరగా ఉండటం కూడా గమనార్హం. ఆజీవక మతాన్ని విస్మరించినా, దానిద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయిన తత్వాలను మాత్రం విస్మరింపవీలుకాని పరిస్థితి ఉందని అర్ధం చేసుకోవచ్చు.

    పన్నెండో శతాబ్దానికి చెందిన జైన పండితుడు నేమిచంద్ర సన్యాసులను ఐదు రకాలుగా వర్గీకరించాడు. ఎ. నిర్గ్రంధులు/జైనులు బి. శాక్యులు/బౌద్ధులు సి. తపస్విలు/బ్రాహ్మన మునులు డి. గురు/త్రిదండులు ఇ. ఆజీవికులు

    పై విభజనద్వారా మఖలి గోశాల అనుచరులు పన్నెండోశతాబ్దం వరకూ ఉత్తర భారతదేశంలో ఆజీవక సంప్రదాయాన్ని ఒక ప్రధాన సంప్రదాయ స్రవంతిలా కాపాడుకొంటూ వచ్చారని అర్ధమౌతుంది.

    జైనమతంలో దిగంబర జైనం ఒక శాఖ. కొంతమంది చరిత్ర కారులు ఆజీవిక మతస్థులు దిగంబరంగా ఉంటారు కనుక వీరు దిగంబరజైనులు ఒకటే అని ఒక ప్రతిపాదన చేసారు. పైన చెప్పిన నేమిచంద్ర దిగంబర శాఖకు చెందిన జైనుడు. అతను చేసిన ఈ వర్గీకరణలో జైనులను ఆజీవికులను విడివిడిగా చూపటాన్ని బట్టి జైనులు ఆజీవికులు ఒకటి కాదు అని నిర్ధారించవచ్చును. కానీ కాలక్రమేణా ఆజీవికులు దిగంబరజైన శాఖలో కలిసిపోయి ఉండవచ్చునని ప్రముఖ ఇండాలజిస్ట్ Johannes Bronkhorst ప్రతిపాదించాడు.

    పదిహేనోశతాబ్దానికి చెందిన జ్యోతిష్యాస్త్ర పండితుడైన వైద్యనాథ దీక్షితులు రచించిన జాతక పారిజాత మనే గ్రంధంలో బుధుడు ఉచ్ఛదశలో ఉండగా పుట్టినవారు ఆజీవికులుగా మారతారని చెప్పాడు. చారిత్రికంగా ఇదే ఆజీవికుల చివరి ప్రస్తావన.

తమిళనాట ఆజీవిక మతం

తమిళనాట ఆజీవిక మతం ప్రబలంగా ఉండేదని మనిమేఖలై, శిలప్పదికారం లాంటి కావ్యాలు, క్రీస్తుశకం అయిదో శతాబ్దం నుండి పదిహేను శతాబ్దం మధ్య వేయించిన అనేక శాసనాల ద్వారా తెలుస్తుంది.

దక్షిణభారతదేశంలో ఆజీవికుల ప్రస్తావనలు కలిగిన కొన్ని శాసనాలు ఇవి

క్రీశ 446 లో పల్లవరాజైన సింహవర్మన్ విలవట్టి అనే గ్రామాన్ని విష్ణుశర్మ అనే బ్రాహ్మణునికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామం నెల్లూరు జిల్లాలోని విడవలూరు గా గుర్తించారు. ఈ దాన శాసనంలో - ఇనుము, తోలు, బట్టలు, తాళ్ళ అమ్మకాలపై వచ్చే పన్నులతో పాటుగా ఆజీవికుల నుండి వచ్చే పన్నులు అంటూ ప్రత్యేకంగా ఆజీవికులను పేర్కొనటం జరిగింది. (Epi. Ind. xxiv, pp. 296-308) అప్పట్లో ఒక గ్రామంలో ఆజీవిక మతాన్ని అవలంబించినందుకు పన్ను ఉండేదని అనుకోవాలి.

తూర్పు చాళుక్య రెండవ అమ్మరాజు (క్రీశ 945-970) విజయవటి లోని ఒక ఆలయానికి దానంగా ఇచ్చిన గుంటూరులోని నాలుగు గ్రామాలలో ఒక గ్రామం పేరు ఆజీవులపర్రు. ఇది ఆజీవులకొరకు ఏర్పరచిన గ్రామం అయి ఉండవచ్చు. (Epi. Ind. xxiii, pp. 161-170.)

క్రీశ. 1072 లో రాజేంద్రచోళుడు మైసూర్ కోలార్ జిల్లాలో ఒక ఆలయంలో వేయించిన ఒక శాసనంలో ఆ ప్రాంత ఆజీవిక ప్రజలు ఒక కాసు పన్ను కట్టాలని, అలా కట్టలేకపోతే మరొక కాసు అపరాధంగా చెల్లించాలని పేర్కొన్నాడు. (Epi. Carn. vol. X Mulbagal 49)

విరించిపురం పెరుమాళ్ ఆలయంలో మూడవ రాజేంద్రుడు (1233-34) వేయించిన శాసనంలో ఆజీవుకుల పన్ను ప్రస్తావన కలదు. (SII.I, no. 59)

దక్షిణభారతదేశంలో లభించిన శాసనాల ఆధారంగా ఆజీవుకులు గుంటూరు నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారని అర్ధమౌతుంది. ఈ అన్ని శాసనాలలో ఉన్న Acuvakkatamai అనే పదాన్ని Dr. Hultzch ఆజీవికుల పన్ను గా తప్పుగా అనువదించాడని, భిక్షమెత్తుకొంటూ జీవనం సాగించే ఆజీవిక సన్యాసులు పన్నులు ఎలా కడతారని- బహుశా అప్పట్లో ఆజీవికులు కుమ్మరి వృత్తి నెరపి ఉండవచ్చు, ఆమేరకు వారిపై వృత్తి పన్ను వేసి ఉండవచ్చు అని ఎ. చక్రవర్తి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు.

సామాన్య ప్రజలపై ఇల్లు ఒక్కింటికి పన్ను పావు కాసు కాగా ఆజీవికుల తల ఒక్కింటికి వేసిన పన్ను ఒక కాసు (28 గింజలు=1.6 grams). అంటే హిందూ మతానికి చెందిన వ్యక్తి కంటే ఆజీవిక మతాన్ని పాటించే వ్యక్తి ఇరవై నుంచి ముప్పై రెట్లు ఎక్కువ మొత్తంలో పన్ను కట్టవలసి రావటం గమనార్హం. ఇది ఒకరకంగా ఒకనాటి మతపరమైన వివక్ష. ((History and Doctrines of the Ajivikas A.L. Basham pn195)

క్రీశ. రెండో శతాబ్దపు తమిళ మహాకావ్యం శిలప్పదికారం లో మధురై లో ఆజీవిక సన్యాసులు చేస్తున్న కఠోరమైన తపస్సులు గురించిన వర్ణనలు కలవు.

ఇదే కాలంలో రచించిన మణిమేఖలై కావ్యంలో కథానాయిక ఆథ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని వివిధ ఆత్మాత్మిక గురువులను కలిసి వారి బోధనలను విని చివరకు బౌద్ధ సన్యాసినిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆజీవిక సిద్ధాంతాలను కూడా కథానాయిక తెలుసుకొని, ఆ గురువుతో వివిధ అంశాలు చర్చించినట్లు ఈ రచన ద్వారా తెలుస్తుంది.

ఆజీవిక మత బోధనలు

ఆజీవిక మతానికి సంబంధించిన బోధనలు నేడు అలభ్యం. బౌద్ధ జైన రచనలలోని పరోక్ష ఆధారాలే నేడు లభిస్తున్నాయి. దక్షిణభారత ఆజీవికుల బోధనలు మణిమేఖలై లాంటి కావ్యాల ద్వారా తెలుస్తున్నాయి. . ఆజీవిక మతానికి శ్రామిక, వ్యాపార వర్గాలనుంచి ఆదరణ వచ్చింది. మఖలి గోశాల తరువాత శ్రేణిలో అనేకమంది బహుజనులు ఆజీవిక మతాన్ని నడిపించారు. వీరిలో రధకారుడైన పాండుపుత్ర; గోశాలకు 16 ఏండ్లపాటు ఆశ్రయం ఇచ్చిన హలాహల కుంభకార స్త్రీ; అత్యంత ధనకారుడైన సద్దాలపుత్ర అనే కుంభకారుడు లాంటివారు ముఖ్యులు.

మఖలి గోశాల బోధనలు ఇలా ఉన్నాయి.

  • ఆజీవిక మతం నియతి వాదాన్ని ప్రతిపాదిస్తుంది. నియతి వాదం అంటే “అన్నిటికి విధే కారణమని నమ్మటం” మనిషి పుట్టినప్పుడే అతని విధి నిర్ణయించబడి ఉంటుందని; ఈ విధిని/నియతిని ఎవరూ తప్పించలేరని; మనిషి తాను ప్రయత్నించానని అనుకొంటాడు కానీ ఫలితం ముందే నిర్ణయమైపోయి ఉంటుందని నియతి వాదం బోధిస్తుంది.
  • నియతి వాదం హిందూ, బౌద్ధ, జైన మతాలలో కనిపించదు. ఇవి కర్మభావనను నమ్ముతాయి. మనిషి చేసిన కర్మల వలన అతని జీవనం నిర్ణయమౌతుందని విశ్వసిస్తాయి. నియతివాదం కర్మలకు ప్రాధాన్యత ఇవ్వదు. కర్మను ఆజీవికులు తిరస్కరించారు. మనిషి జీవితం కొండపైనుండి క్రిందకు విడిచిన ఒక దారపు బండి వంటిదని, దారం అయ్యేవరకూ అది ఎలాగైతే పగ్గాల్లేకుండా పరుగులు తీస్తుందో మనిషి జీవితం కూడా పుట్టుక చావుల మధ్య అతని ప్రమేయం లేకుండానే పరుగులు తీస్తుందని ఉదహరిస్తారు ఆజీవికులు.
  • లాభ నష్టాలు, సుఖదుఃఖాలు, జీవన్మరణాలు అనే ఆరు ముఖ్యమైన కారకాలు ప్రతిమనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
  • పునర్జన్మ ఉంది. మరణించే సమయాన పుణ్య భద్ర, మణి భద్ర పేర్లు గల యక్షులు వచ్చి మనుషులను పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నెగ్గితే ఆ వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఓడిపోతే తిరిగి మరలా జన్మించాలి.
  • మనుషులు వారి ప్రమేయం లేకుండా పాపాత్ములు అయినట్లుగానే పుణ్యాత్ములు కూడా అవుతారు. పుణ్యం సంపాదించటం కొరకు వారు కాని, వారితరపున ఎవరైనా కానీ ఏ రకమైన పాపవిమోచన క్రతువులు చెయ్యక్కరలేదు.
  •  అప్పటికే నిర్ణయించబడి ఉన్న సుఖదుఃఖాలు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా తగ్గవు, పెరగవు.
  • నియతి వాదం విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తుంది అనే విమర్శకు- కఠోరమైన తపస్సు ద్వారా విచ్చలవిడితనాన్ని అరికట్టాలి అని సమాధానం చెప్పారు ఆజీవికులు.
  • ఈ భూమిపై మొత్తం 1,406,600 వివిధ జాతుల జీవులు జీవిస్తున్నాయని ఆజీవిక మత విశ్వాసం. పదార్ధములు అణువులతో నిర్మితమై ఉంటుందని వీరు ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని ఆ తరువాతి వైశేషిక సిద్ధాంతులు స్వీకరించారు.

ముగింపు

    క్రీ.పూ నాలుగో శతాబ్దానికి చెందిన మెగస్తనిస్ భారతదేశంలోని పండితులు బ్రాహ్మణులు, శ్రమణులు ( బౌద్ధులు, జైనులు, ఆజీవకులు, నాస్తికులు, లోకాయతులు, చార్వాకులు అంటూ శ్రమణులు వివిధ రకాలు) అనే రెండువర్గాలుగా ఉన్నారని చెప్పాడు.

    క్రీపూ. రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు, పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.

    బృహదారణ్య పురాణంలో ఈ శ్రమణకులను దొంగలుగా, గర్భవిచ్ఛిత్తి చేసే వైద్యులుగా, చండాలురుగా, పుళిందులుగా వర్ణించబడ్డారు. (The hindus an alternate history, Wendy doniger p.no 226).

    ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ప్రవేశపెట్టినట్లు చెప్పే, పంచాయతన పూజావిధానం ద్వారా వివిధ ఆరాధనాపద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందుమత భావన కలిగింది. శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు.

        ఈ వెల్లువలో అనేక ప్రాచీన సంప్రదాయాలు కొన్ని హిందూమతంలో కలిసిపోయాయి, మరికొన్ని కనుమరుగు అయ్యాయి. దాని ప్రభావం ఏ మేరకు అంటే- వైదిక క్రతువులకు వ్యతిరేకంగా పుట్టిన జైన, బౌద్ధ మతాలను కూడా హిందూ మతంలో అంతర్భాగంగా చూసేటంతగా మిగిలిన ఆరాధనవిధానాలు తమ అస్థిత్వాలను కోల్పోయాయి. ఆజీవిక, చార్వాక, కాలముఖ లాంటి శాఖలు మొత్తానికి అంతర్ధానమైపోయాయి.

***

        బుద్ధుని సమకాలీనులలో, అజితకేశ కంబల్, పూరణ కశ్యప, పకుధకచ్ఛాయన్, మంఖలి గోశాల సంజయబేలత్తిపుత్త, నిగంఠనాతపుత్త అనే ఆరుగురు సన్యాసులు ఆధ్యాత్మిక వ్యవహారాలలో జటాసత్తు అనే రాజుకు సలహాలు ఇచ్చేవారని పాళి రచనల ద్వారా తెలుస్తున్నది. వీరిలో మఖలి గోశాల (Makkhali Gosaala) ఆజీవిక మతానికి 24 వ తీర్థంకరుడు. ఇతనికి పూర్వం ఆజీవిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో నంద వచ్చ, కిస సంగిచ్చ లు ముఖ్యులు.

         ఉత్తరభారతదేశంలో ఆజీవిక సంప్రదాయం క్రమక్రమంగా క్షీణిస్తూ రాగా దక్షిణభారతదేశంలో కొంతకాలం కొనసాగింది.

        ఈ ఆజీవిక సంప్రదాయం ఆంధ్రదేశంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఒకప్పుడు ఉన్నట్లు శాసనాధారాలు కలవు. ప్రముఖ తమిళ చరిత్రకారుడు శ్రీ కె. నెడుంజెళియన్ “ఆసీవగం అయ్యర్” (ఆజీవక స్వామి) అనే పేరుతోవ్రాసిన అయిదువందల పేజీల పుస్తకంలో ఆజీవిక మతస్థాపకుడైన మఖలిగోశాలర్ తమిళుడని, అతను తమిళనాటే నిర్యాణం చెందాడని ప్రతిపాదించాడు.

    దక్షిణభారతదేశంలో ఆజీవిక, జైన సంప్రదాయాలు పక్కపక్కనే నడుస్తూ రావటం వల్ల ఆజీవికులు క్రమక్రమంగా జైన మతంలో కలిసిపోయారు.

సంప్రదించిన పుస్తకాలు

1. History and Doctrines of The Ajivikas by A.L. Basham
2. The Ajivikas by B.M. Barua
3. The Riddle of the Jainas and Ajivikas in early Buddhist Literature by Johannes Bronkhorst
4. Ajivika by Jarl Charpentier
5. Ashoka in Ancient India bynayanjot lahiri
6. Hindus an Alternate History by Wendy Doniger






















No comments:

Post a Comment