Friday, April 29, 2022

పెండ్లికూతురు మొదటి మూడు రాత్రులు....


ఒక బ్రాహ్మణ తండ్రి తన కూతురిని ఒళ్ళోకూర్చోబెట్టుకొని కన్యాదానం చేస్తున్న ఫొటోని పురోహితుడి కామం  అంటూ ట్రోలింగ్ చేసారు ఈ మధ్య కొందరు.  అలా విపరీతమైన దృష్టితో ఆలోచించటానికి - “శూద్రకులాలలో వివాహం అయ్యాకా పెండ్లికూతురు మొదటి మూడురాత్రులు పురోహితునితో గడపాలి అనే నియమం ఉండేదని, దానిని బ్రిటిష్ వారు 1819 లో ఒక చట్టం ద్వారా నిషేదించారని” ఒక కథనం ప్రచారంలో ఉండటం కారణంగా చెప్పుకోవచ్చు.

చిత్రంగా అనిపించే ఈ వింత ఆచారం “శూద్రులలో” ఉన్నట్లు మధ్యయుగపు సాహిత్యంలో కానీ, శాసనాలలో కానీ ఎక్కడా కనిపించదు. సాధారణంగా జంతు ప్రపంచంలో  పురుషజీవి తన జన్యువులే తరువాతి తరంలోకి చేరాలనే కాంక్షతో సాటి పురుషజీవులతో ఒక యుద్ధమే చేస్తుంది.  సింహాలలో అలా నెగ్గిన సింహం ముందు జతకట్టిన సింహానికి పుట్టిన పిల్లలను స్వయంగా కొరికి చంపివేసిన తరువాత మాత్రమే, ఆ ఆడసింహంతో సంపర్కం జరిపి తన జన్యువులు కలిగిన పిల్లలు కలిగేలా చూసుకొంటుంది.  అలాంటిది భార్యను తొలి మూడు రాత్రులు మరొక పురుషుని వద్దకు పంపి తనకు కాక ఆ వ్యక్తికి కలిగిన పిల్లలను తనపిల్లలుగా పొందాలనుకోవటం ఆశ్చర్యం కలిగించకమానదు.

పెళ్ళిమంత్రాలు

అధర్వవేదం లోని ఈ శ్లోకంలో ఈ అంశానికి సంబంధించిన ఛాయలు కనిపిస్తాయి

సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర: 

తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:

అంటే ఆ కన్యను మొదటగా చంద్రుడు, తరువాత గంధర్వుడు, తరువాత అగ్ని వరించారని ఇప్పుడు  నాలుగవ భర్తగా ఆ కన్యను  ఆ పెండ్లికొడుకు  వరిస్తున్నట్లు అర్ధం.   

ఈ శ్లోకానికి వివరణ - ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల వయసువరకు చంద్రుని రక్షణలోను, పదేళ్ల వయసు వరకు గంధర్వ విశ్వవసు రక్షణలోను, పన్నెండేళ్ల వయసువరకు అగ్ని దేవుని రక్షణలోను ఉంటుందని ఆ విధంగా ఆమెకు ఆ ముగ్గురు అప్పటివరకు రక్షకులుగా ఉన్నారని ఆ తరువాత వివాహసమయంలో నాల్గవ వ్యక్తిగా మనుజుడైన భర్త రక్షణలోకి ఆమె చేరుతుందని పరాశర స్మృతి (7:4,5) లో  చెప్పబడింది. 

బహుసా పై శ్లోకానికి అనుగుణంగా కాబోలు,  పూర్వకాలంలో పెండ్లి అయిన తరువాత మూడురోజుల వరకు భార్యా భర్తలకు శృంగారం నిషేదంగా ఉండేది. నాల్గవరోజున  Gandharva-rāja Utthāpanam పేరిట హోమం చేసి వారికి శోభనం జరిపించేవారు.  ఇదే ఆచారం ఉత్తరభారతదేశంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది.  ఆ నాల్గవ రోజును వివాహ చతుర్ధి/మిథిలా చతుర్ధి అని పిలుస్తారు. 

వేదకాలం నాటి ఈ ఆచారం కాలక్రమేణా ఎలా పరిణమించి ఉండొచ్చు అనేది ఆసక్తి కలిగించకమానదు.  మధ్యయుగాల భారతదేశంలో “పెండ్లి తరువాత తొలి మూడురాత్రులు” ఏంజరిగేది అనే అంశం కొందరు విదేశి యాత్రికుల రచనలలో కనిపిస్తుంది

1. Ludovico Di Varthema

        వార్థెమా1503-1508 మధ్యలో ఇండియాలో ప్రయాణించి తన అనుభవాలను The Travels of Ludovico Di Varthema అని గ్రంధస్థం చేసాడు. ఇతడు మలబార్ తీరంపై ప్రయాణించినపుడు అక్కడి బ్రాహ్మణుల గురించి ఇలా అన్నాడు

        "బ్రాహ్మణులు విశ్వసించదగిన మర్యాదస్తులు.  మహారాజు వివాహం చేసుకొన్నప్పుడు యోగ్యుడైన ఒక బ్రాహ్మణుని ఎంపిక చేసి అతనితో తన భార్యకు శోభనం జరిపిస్తాడు. ఈ పనిని బ్రాహ్మణుడు ఉచితంగా చేయడు. దీనికి మహారాజు అతనికి నాలుగు లేదా అయిదు వందల వరహాలు బహుమతిగా ఇవ్వాలి. --- బ్రాహ్మణునితో భార్య కన్నెచెర విడిపించే విధానాన్ని మహరాజు మాత్రమే పాటిస్తాడు ఇతరులు ఈ ఆచారాన్ని పాటించరు"-- —Voyages of Varthema Vol I, p. 141.  

 2. Alexander Hamilton

            ఇతను ఒక వ్యాపారి నౌకా కెప్టైన్.  1688 నుండి 1723 మధ్య ఇతడు చేసిన ప్రయాణాలు, పరిశీలనలను  New Account Of The East-indies పేరిట అక్షరబద్దం చేసాడు. 1695 లో హామిల్టన్ కాలికట్ ప్రాంతంలో ప్రయాణించాడు.  అక్కడి రాజు జమొరిన్ (Samoothiri) వివాహానంతరం తన భార్యను నంబూద్రి బ్రాహ్మణునితో మూడురోజుల పాటు నిద్రింపచేస్తాడు.  తన భార్య కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకోవటం అనేది ఒక    పవిత్రమైన చర్యగా  ఆ రాజు భావించేవాడు.  ఈ పద్దతిని పాటించటానికి  కులీనులు ఇష్టపడరు. బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చేంత స్తోమత  సామాన్యులకు ఉండదు- అంటూ ఆనాటి ఆచారాలను  రికార్డు చేసాడు.  (A New Account Of The East-indies  Vol.2 పే.నం. 308 by Hamilton, Alexander). 

హామిల్టన్  సామాన్య ప్రజలలో పెళ్ళి ఎలా జరుగుతుందో ఇలా వర్ణించాడు

“వధూవరులకు ఆరు ఏడు ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెద్దలు పెళ్ళిళ్ళను నిర్ణయిస్తారు.  పెండ్లికొడుకు తల్లిదండ్రులు కానుకలతో పెండ్లికూతురు ఇంటికి బంధుమిత్రులతో వెళతారు. పెండ్లి అనంతరం వధూవరులను ఊరంతా ఊరేగింపుగా తిప్పుతారు. చిన్న వయసులో పెండ్లి అయినప్పటికి కాపురానికి మాత్రం అమ్మాయికి 12 ఏళ్ళ వయసు అనంతరం మాత్రమే పంపిస్తారు.”  (A New Account Of The East-indies  Vol.1 p.n 157 by Hamilton, Alexander)

            పై రెండు ఉటంకింపులను బట్టి వివాహానంతరం భార్యను నంబూద్రి బ్రాహ్మణునితో సంగమింపచేయటం అనే తంతు రాజకుటుంబానికి మాత్రమే పరిమితమని  అర్ధమౌతుంది.

3. Buchnan

            జమురిన్ రాజవంశ స్త్రీలు నంబూద్రి బ్రాహ్మణులు లేదా పెద్ద హోదాలలో ఉండే నాయర్ లతో  మాత్రమే కలుస్తారని, వారి భర్తలతో కాపురం చేయకుండా ఆ రాజవంశ స్త్రీల యొక్క సోదరులు కాపలా కాస్తుంటారని Buchnan అనే మరో యాత్రికుడు అన్నాడు.  (A General Collection Of The Voyages And Travels  Vol. 8 పే.నం. 734 by Pinkerton, John)

4. Admiral Verhoeven

            ఇతను 1608 లో కాలికట్ ను సందర్శించాడు.  బ్రాహ్మణులు ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీల కన్యత్వాన్ని స్వీకరిస్తారు తప్ప  సామాన్య ప్రజలజోలికి వెళ్ళరు అని చెప్పాడు. (The History Of Human Marriage Vol. 1 Ed. 3rd  by Atal, Yogesh పే.నం. 171)

5. Thomas Herbert

            1626 లో భారతదేశంలో ప్రయాణించిన  Thomas Herbert – మలబార్ నాయర్ కులస్థులలో పెండ్లి కూతురు మొదటి రాత్రి బ్రాహ్మణునితో గడిపే ఆచారం కొంతకాలం క్రితం ఉండేది, కానీ నేడు ఆ ఆచారాన్ని ఎవరూ పాటించటం లేదని చెప్పాడు. (Herbert, Travels into Divers parts of Africa, and Asia the Great, P- 337 )

***

            పై వివరాలను బట్టి పెళ్ళికూతురు పురోహితునితో కన్నెరికం చేయించుకోవటమనే ఆచారం రాజవంశ స్త్రీలలో ఉన్నట్లు స్పష్టమౌతుంది తప్ప ఇతర శూద్ర కులస్థులలో ఉన్నట్లు ఆధారాలు కనిపించవు. 

6. బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా జరిగే ఆచారాలు

            జమోరిన్ రాజవంశపు అమ్మాయిలు పెద్దమనిషి కాగానే, నాయర్ కులంలోని యువకులను ఆహ్వానించి వారికి కానుకలు సమర్పించి ఆ అమ్మాయితో మొదటి రాత్రి జరిపించేవారని Lopez అనే పోర్చుగీస్ వ్యాపారి తెలియచేసాడు. (The History of Human Marriage Vol I p.n172). 

         పదిహేడో శతాబ్దంలో మలబార్ రాజ్యంలో ఎవరైనా పెండ్లి చేసుకొన్న తరువాత భార్యను రాజుగారికి సమర్పించుకొని పేలస్ లో ఎనిమిది రోజుల పాటు ఉంచేవారట. తన భార్యతో రాజుగారు కూడటం గొప్ప అదృష్టంగా భావించి గడువు ముగిసాక ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళేవారట. (ibid)

            1495-1496 లలో Hieronimo Di Santo Stefano అనే ఇటాలియన్ వ్యాపారి కాలికట్ లో ప్రయాణించి ఒక ఆసక్తి కరమైన పరిశీలన రికార్డు చేసాడు. కాలికట్ లోని పురుషులు కన్యలను వివాహం చేసుకోవటానికి విముఖత చూపించేవారట.  ఒక వేళ ఒక కన్యతో వివాహ నిశ్చయం జరిగితే ఆమెను  ఇరవై రోజుల పాటు మరొక పురుషుని వద్దకు పంపి ఆమె కన్యత్వం కోల్పోయిన తరువాత మాత్రమే వివాహం చేసేవారట. ఆ అమ్మాయి తల్లి యువకులను అభ్యర్ధించి తన కూతురుకి కన్నెరికం చేయించేదట. (Account of the Journey of Hieronimo dI Santo Stefano, p.5)

               పై ఉదాహరణల ద్వారా పెండ్లికుమార్తె కన్యత్వం స్వీకరించటమనే సంప్రదాయం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం కాదని ఈ ప్రక్రియలో రాజులు, నాయిర్ పురుషులు కూడా భాగస్వామ్యమయ్యారని తెలుస్తుంది. 

7. భారతదేశం వెలుపల ఈ ఆచారం

            మధ్యయుగాల యూరప్, చైనా లలో ఫ్యూడల్ వ్యవస్థలో  తమ క్రింద పనిచేసే స్త్రీల వివాహమైన మొదటి రాత్రి భూస్వామి వారితో గడిపి వారి కన్యాత్వాన్ని గ్రహించే ఆచారం ఉండేది.  దీన్ని  droit du seigneur అని పిలిచేవారు. ఇదే కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు శోభనం  జరుపుకొనేందుకుగాను వారినుండి చర్చి కొంత రుసుము వసూలు చేసేది. (The History of Human Marriage Vol I p.n177).

            పన్నెండో శతాబ్దానికి చెందిన“The Book of Leinster” అనే ఒక పాత ఐరిష్ వ్రాతప్రతి  లో Ulster అనే రాజ్యానికి రాజు తన రాజ్యంలోని మొత్తం స్త్రీలకు వివాహమైన తొలిరాత్రి వారి కన్యాత్వాలను స్వీకరించాడని ఉంది.  ఈ పని ఏదో శారీరిక సుఖంకొరకు కాక, రాజ్య విధులలో భాగంగా చెప్పటం గమనార్హం. (ibid. పే.నం. 184)

8. ఎందుకీ ఆచారం వచ్చి ఉండవచ్చు?

            కన్యత్వం తొలగిపోయే వేళ కన్నెపొర చిరిగి రక్తం చిందటం అశుభమని, దానికి కారణమైన ఆ పురుషుని దుష్టశక్తులు పీడిస్తాయని ఒక నమ్మకం ఆనాటి ప్రజలలో ఉండేది. ఇదే భావన వేద వాజ్మయంలో కూడా ఆ రక్తం విషంతో సమానం అని చెప్పబడింది. జర్మన్స్, మొరక్కన్స్, గ్రీన్ లాండర్స్ కూడా అదేవిధంగా విశ్వసిస్తారు. (The History Of Human Marriage Vol. 1  by Atal, Yogesh p.n 190-191)  

            అందుచే  అధికమొత్తంలో ధనం, కానుకలు ఆశచూపి బాలికల కన్నెచెరవిడిపించేవారు.  రాజు, పురోహితుడు, వేరే కులానికి చెందిన యువకులు ఈ కార్యం నిర్వహించేవారు. 

            ఇలాంటి ఆచారాలు మలబార్ తీరవాసులలో ఉన్నట్లు అనేక ఉటంకింపులు కనిపిస్తాయి కానీ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అమలులో ఉన్నట్లు సాహిత్యంలోకానీ, శాసనాలలో కానీ కనిపించక పోవటం ఆశ్చర్యకరం.  భారతదేశంలోని వివిధ కులాలు వాటి భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలను అద్భుతంగా రికార్డు చేసిన Castes and Tribes of Southern India by Edgar Thurston;  Hindu Manners, Customs, and Ceremonies by Abbe J. A. Dubois లాంటి పుస్తకాలలో  ఇలాంటి సంప్రదాయం గురించి ప్రస్తావనలు కనిపించవు.

9. ఈస్ట్ ఇండియా కంపనీ 1819 లో చేసిన చట్టం 

            శూద్రుల వివాహసమయంలో పెండ్లికుమార్తెతో పురోహితుడు మూడు రాత్రులు గడిపే దురాచారాన్ని,  ఈస్ట్ ఇండియా కంఫనీ 1819 లో ఒక చట్టం ద్వారా నిషేదించటంతో ఈ ఆచారం నమసిపోయిందని ఈ అంశానికి సంబందించి ప్రచారంలో ఉన్న మరొక సంగతి. 

            ఈస్ట్ ఇండియా కంపనీ 1819 లో "Regulation VII of AD 1819" అనే చట్టాన్ని చేసింది.  ఈ చట్టంలో – వయసుకు రాని అమ్మాయిలను వారి తండ్రి లేదా భర్త అనుమతిలేకుండా ఎత్తుకొనిపోయి మాయమాటలు చెప్పి వ్యభిచారవృత్తిలోకి దింపే నేరాలకు విధించాల్సిన శిక్షలను; చిన్నపిల్లలను పెంచి వారిని వ్యభిచార వృత్తిలోకి దింపేవారికి విధించే శిక్షలను; భార్యాపిల్లలను పోషించకుండా సోమరిగా తిరిగే భర్తకు విధించాల్సిన శిక్షలను గురించి- ఇంకా లేబర్ చట్టాలు, ఒప్పందాలు చేసుకొని వాటిని ఉల్లంఘించినందుకు విధించాల్సిన శిక్షలను గురించి చర్చించింది (REGULAR CASES, VOL. 8 – p.no. 364, 375, Notes on Indian Affairs Vol 2 p.no. 407).

            సమాజంలో లైంగిక నేరాలను అరికట్టటానికి, ఒప్పందాల ఉల్లంఘనలు నివారించటానికి, వెట్టిచాకిరీ నియంత్రణ కొరకు చేసిన  చట్టమిది. అంతే తప్ప ఈ చట్టంలో ప్రత్యేకించి శూద్రుల వివాహసమయంలో పెండ్లికుమార్తెతో పురోహితుడు మూడు రాత్రులు గడిపే దురాచారాన్ని నిర్మూలించటానికి ఈ శాసనాన్ని  తెస్తున్నట్లు ఏ ప్రస్తావనా లేదు.  

10. ముగింపు

            శూద్రవివాహాలలో పెళ్ళికూతురు మొదటి మూడు రాత్రులు పురోహితునితో గడపాలి అనే ఆచారం అనేది మలబార్ తీర ప్రాంత రాజవంశ స్త్రీలలో ఉండేదని, శూద్ర స్త్రీలలో లేదని వివిధ విదేశీ యాత్రికుల కథనాల ద్వారా తెలుస్తుంది.  అంతే కాక ఆనాటి ప్రజలకు స్త్రీ కన్యత్వం పట్ల అపోహలు ఉండేవని, కన్య అయిన స్త్రీ ని వివాహం చేసుకోవటం అరిష్టమని భావించేవారని కొన్ని ఉటంకింపులు కనిపిస్తాయి. ఈ అంశం నలుపు తెలుపుల్లో కాక భిన్న పొరలలో దర్శనమిస్తుంది.

            ప్రచారంలో ఉన్నట్లు ఈ దురాచారాన్ని రూపుమాపటానికి ప్రత్యేకంగా  1819 లో ఒక చట్టాన్ని చేసారనటం కూడా సత్యదూరంగానే అనిపిస్తుంది. సమాజంలోని అనైతిక ప్రవర్తనలను నిరోధించటానికి జనరల్ గా చేసిన చట్టం అది. 

            శూద్ర పెళ్ళికూతురు పురోహితునితో మూడు రాత్రులు గడపటం అనే ఒక హిస్టారికల్ నెరేటివ్ లో శూద్రులు లేరని, ఆ మూడు రాత్రులు గడిపింది బ్రాహ్మణులు మాత్రమే కాదని, ఈ ఆచారం ఆసేతు హిమాచలం విస్తరించిన సంప్రదాయం కాదని అర్ధం చేసుకోవాలి. 

            ఆ సత్యదూర కథనం ప్రజలలో ఎంత లోతుకు చొచ్చుకొని పోయిందంటే ఒక సమకాలీన పెండ్లి తంతులో తండ్రి కూతుర్ల మధ్య sexual abuse ని atribute చేసేంతగా మన మనసుల్ని కలుషితం చేసింది. నిజానికి ఇలా మాట్లాడటం ద్వారా పూర్వీక శూద్ర స్త్రీలను అవమానిస్తున్నామన్న స్పృహకూడా  లేకపోవటం శోచనీయం.

.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment