Wednesday, April 27, 2022
Dunya Mikhail నీడ ఇంకా అక్కడే ఉంది
Dunya Mikhail నీడ ఇంకా అక్కడే ఉంది
.
కవిత్వం మందు కాదు. అది ఒక ఎక్స్ రే. గాయం ఎక్కడుందో చెప్పి దాన్ని అర్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది - Dunya Mikhail
.
Dunya Mikhail ఇరాకి-అమెరికన్ కవయిత్రి. ఈమె 1965 లో బాగ్ధాద్ లో జన్మించింది. కొంతకాలం బాగ్దాద్ అబ్జర్వర్ అనే పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసింది. ఇరాక్ యుద్ధ సమయంలో చెలరేగిన నియంతృత్వ పోకడల వల్ల దున్యా ప్రాణాలు అరచేతపెట్టుకొని అమెరికాకు వలసవెళ్ళి, అక్కడ ఉన్నతచదువులు కొనసాగించింది. ఈమె మొదటి పుస్తకం The War Works Hard (2005). The Iraqi Nights (2014) కవిత్వ సంకలనం ఈమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుతెచ్చిపెట్టింది.
దున్యా కవిత్వంలో యుద్ధం, వలస, విస్మృతి, జీవన భీభత్సం లాంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. యుద్ధ ఫలితంగా ప్రజలు కట్టుబట్టలతో వలసపోవటం వలన కలిగే క్షోభను ఈమె కవిత్వం శక్తివంతంగా వ్యక్తీకరిస్తుంది.
సంక్షిప్తరూపంలో వెలువరించే కవితలకు ఈమె Tablets అనే పేరు పెట్టారు. ఇవి రెండు నుంచి ఆరేడు లైన్ల వరకూ ఉండే మిని కవితల లాంటివి.
ఈ టేబ్లెట్స్ ను అరబిక్ నుంచి Kareem James Abu-Zeid ఇంగ్లీషులోకి అనువదించారు.
.
Tablets - Dunya Mikhail
నా హృదయం చాలా చిన్నది
అందుకే
తొందరగా నిండిపోతుంది
***
నీరు నీరుతో కలవటానికి
ఖాళీ ప్రదేశాలను నింపటానికి
యుద్ధాలు అవసరం లేదు
***
అతను టివి చూస్తున్నాడు
ఆమె ఒక నవల చదువుతూన్నది
ఆ నవల కవర్ పేజిపై
ఒక అతను టివి చూస్తున్నాడు
ఒక ఆమె నవల చదువుతూన్నది.
***
కొత్తసంవత్సరపు మొదటి రోజున
మనం అందరం
పాత సూర్యుడినే చూస్తాం
***
ఈ పిట్టను పట్టించుకోకు
అది ప్రతిరోజు వచ్చి
ఆ కొమ్మచివర కూర్చొని
ఒక గంటో రెండుగంటలో
పాటలు పాడి వెళిపోతుంది
అంతే… అంతకు మించేమీ లేదు
అది ఎవరికీ సంతోషం కాదు
***
ఇంటి తాళాలు
ఐడెంటిటీ కార్డులు
రంగువెలసిన ఫొటోలు
ఇవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి
సామూహిక ఖననం జరిగిన చోటులో
***
అరబిక్ భాషకు
సుదీర్ఘ వాక్యాలు
పొడవైన యుద్ధాలు ఇష్టం.
ఎడతెగని పాటలు
అర్ధరాత్రి కబుర్లు
శిథిలాలను చూస్తూ
రోదించటం ఇష్టం.
అరబిక్ భాష
కష్టపడటాన్ని ఇష్టపడుతుంది
చిరకాల జీవితం కొరకు
చిరకాల మరణం కొరకు
***
సరిహద్దులను మేం మేఘాల్లా దాటేస్తాం
మమ్మల్నెవరూ మోసుకొని వెళ్ళరు
మేమే
ఇంకో దేశపు
వానను
ఒక భాషను
ఒక జ్ఞాపకాన్ని
మోసుకొని వెళతాం
***
కలలు రెండు రకాలు
నిలువు, అడ్డం
నీ కల ఆకారం చెప్పు
నువ్వెక్కడనుంచి వచ్చావో నేను చెబుతాను.
***
నీ కెమేరా
ఆ తల్లి పిచ్చుక కళ్ళల్లోని
భయాన్ని బంధించగలదా?
ఆమె కళ్ళల్లో
పగిలిన గుడ్లు కనబడుతున్నాయా?
***
ఆమె నీడ
ఇంకా అక్కడే ఉంది
పక్షులకు గింజలు మేపుతో
***
ఆమె మరణించింది
ఆమెను గాఢంగా ప్రేమించే వారి
కాలం నిలిచిపోయింది
ఆమె వాచ్ మాత్రం తిరుగుతూనే ఉంది
***
పిల్లలందరూ కవులే
లేని సీతాకోకచిలుకలను
వెంబడించటం మానేసేంత వరకూ
***
సూర్యుడు లేనపుడు
పువ్వు కాంతిని కోల్పోతుంది
ఆ లేకపోవటం సుదీర్ఘమైతే
పువ్వు లోనికి చూసుకొంటుంది
మరో కాంతి కోసం
***
అతని ఆలోచన వారికి నచ్చలేదు
నుదిటిపై తుపాకి పెట్టి కాల్చి చంపేసారు
ఆ బుల్లెట్ రంద్రంలోంచి
అతని ఆలోచన ప్రపంచాన్ని చేరి
తీగమొక్కలా విచ్చుకొంటుంది
***
ఆమె రాత్రిని అడిగింది
“నువ్వెందుకు చీకటిగా ఉన్నావు?”
రాత్రి బదులిచ్చింది
“నక్షత్రాల కాంతి నిన్ను చేరటానికై”
***
జీవితం
రెక్కనుండి బలవంతంగా పెరకిన ఈక లా
అందంగా బాధాకరంగా ఉంటుంది
.
మూలం: Dunya Mikhail
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment