Friday, September 30, 2022

సేల్స్ టార్గెట్





విశాలమైన మైదానం
ఓ వేటకుక్క కుందేలును తరుముతోంది
పరిగెత్తి పరిగెత్తి ఒక్కసారిగా
మలుపుతీసుకొంది కుందేలు
వేటకుక్క బాలెన్స్ తప్పి తడబడింది
గాలిలోకి దుమ్ము లేచింది
తేరుకొని మరలా పరుగు
మొదలైంది
ఒకదానివెంట మరొకటి
ఎన్నిసార్లు
తప్పించుకోగలదు కుందేలు?
కుందేలు దేహాన్ని బుట్టలో వేసుకొని
కుక్క తల నిమిరాడు
వేటగాడు ప్రేమతో
.
బొల్లోజు బాబా

Wednesday, September 28, 2022

మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు - బెందాళం క్రిష్ణారావు



థేరీ గాథలు*****
మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు
- బెందాళం క్రిష్ణారావు
------------------------------------
చరిత్ర అంటే ఎవరికి ఆసక్తి ఉండదు..ప్రతి ఒక్కరికీ దానిని తెలుకోవాలన్న తపన తప్పక ఉంటుంది. అయితే అది కల్పనల్లో కూరుకుపోతే తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో గానీ నిజమైన ఆసక్తినీ, జిజ్ఞాసనీ అందించలేదు. ప్రాచీన భారత దేశ చరిత్రకు మూలాధారాల్లో అత్యంత కీలకమైనది బౌద్ధ సాహిత్యం. ..సంఘం శరణం గచ్ఛామి..అనే భావనలో జనించిన బౌద్ధం ఎప్పడూ నేలవిడిచి సాము చేయలేదు. అందుకే ఇది కాల్పనికతకు దూరంగా మానవ జీవన నైతికతతో మనసు కేంద్రంగా ధార్మిక పరిమళాలను ఈ లోకంలో వెదజల్లింది.
బుద్ధుని మహా పరినిర్యాణం తరువాత ఆనాటి మగధ రాజధాని రాజగృహ సమీపంలోగల సప్తపర్ణిక అనే గుహలో సమావేశమైన భిక్షువులు సుత్త, వినయ పిటకాలను క్రోడీకరించారు. అందులో సుత్త పిటకంలోని ఐదో భాగమైన ఖుద్ధక నికాయ నందున్న 18 గ్రంథాల సముదాయంలో ‘థేరీ గాథలు’ కూడా ఒకటి. ఆనాటి పాళీ భాష నుంచి ఇవి వందేళ్ల కిందట 1909లో తొలిసారిగా ఇంగ్లీష్ లోకి తర్జుమా అయినాయి. వాటన్నింటినీ పరిశీలించిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు, రచయిత బొల్లోజు బాబా ఈ పుస్తకాన్ని ‘థేరీ గాథలు’ పేరిట తెలుగులో తాజాగా అనుసృజన చేశారు. ఇందులోని కవిత్యరూప గాథలన్నీ 2600 సంవత్సరాల నాటి సమాజాన్ని మహిళా దృక్కోణంలో మన ముంగిట ఆవిష్కరిస్తాయి.
ఇందులోని కవితా వాక్యాలకు మూలకర్తలైన భిక్షుణిల పేర్లు బౌద్ధ సాహిత్యంలో ఎన్నో చోట్ల మనకు తారసపడతాయి. వీరంతా గౌతమ బుద్ధుని సమకాలికులు. తొలి భిక్షుణి సంఘం వీరితోనే ఆరంభమైంది. కొంతమంది ఆరంభమైన తర్వాత చేరినవారు కూడా ఉన్నారు. ప్రజాపతి గౌతమి ప్రోద్బలంతోనే బుద్ధుడు భిక్షుణి సంఘాన్ని ఆరంభించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సంఘంలో మొత్తం భిక్షుణి (థేరీ)లు ఎంతమంది అనే కచ్చితమైన సంఖ్య తెలియకపోయినా 73మంది థేరీల గాథలను ఇందులో చదవవచ్చు.
 
ఈ థేరీలంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కారు. సమాజంలో అట్టడుగు స్థితి నుంచి రాజమాతల వంటి ఉన్నత స్థాయికి చెందినవారు ఉన్నారు. తమ తమ జీవన నేపథ్యాలు ఎంతో విభిన్నమైనవి అయినప్పటికీ వీరందరినీ సద్ధమ్మమే కలిపింది.
 
ఈ థేరీ గాథల్లో ఐదు పంక్తుల కవితా వాక్యాల నుంచి ఏడు పేజీల వరకూ 68 గాథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. థేరీల మధ్య జరిగిన సంభాషణలు, వారికి బుద్ధుడు ఇచ్చిన ఉపదేశాలు. ఈ గాథల్లో ఎంతో రమణీయంగా తొణికిసలాడుతుంటాయి. ఆనాటి సామాజిక జీవితాన్ని, రాజకీయ పరిస్థితుల్ని ఈ గాథలు చదువరుల కళ్లముందు నిలుపుతాయి. ఆ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
 
దు:ఖ మూలాలను అర్ధం చేసుకోవడంలో, వాటిని అధిగమించడంలో తధాగతుని మార్గంలో ఎలా పయనిస్తున్నామో థేరీలు కవితాత్మకంగా ఈ గాథల్లో అభివ్యక్తీకరించారు. రెండున్నర సహస్రాబ్ధాల కిందట, అంతకు వందేళ్ల ముందే మహిళల మానసిక అనుభవాలు, భావ వ్యక్తీకణ, ధార్మిక అవగాహన ఎంత స్పష్టంగా, సూటిగా, లోతుగా ఉందో చెప్పడానికి ఈ థేరీ గాథలే చారిత్రక సత్యాలు. వారికి ఆ మనో స్పష్టతని, చైతన్యాన్ని ఇచ్చింది తధాగతుడు ఉపదేశించిన బౌద్ధ ధమ్మమే తప్ప వేరొకటి కాదు.
 
బుద్ధుని కాలానికి చేతిరాత గ్రంథాలు లేవు. ఆయా సమయాల్లో, వివిధ సందర్భాల్లో చేసిన బోధనలను విని జ్ఞప్తిలో ఉంచుకోవడానికి పదేపదే మననం చేసుకోవడం తప్ప ఇంకెలాంటి సౌలభ్యం లేదు. అయినా ఈ గాథలు ఎప్పటికప్పుడు రాసుకుని ఉన్నవాటిగా అనిపిస్తాయి. థేరీలు ‘శీల- సమాధి- ప్రజ్ఞ’లతో జీవితాలను, అంతరంగాలను మమేకం చేసుకుని అష్టాంగమార్గంలో ముందుకుసాగడం వల్లే ఈ గాథలు ఇంతటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
 
విద్యను మహిళలకు, శూద్రులకు ఎంతో దూరం చేసిన ఆనాటి సమాజపు కారుచీకట్లలో ఈ థేరీలు ధార్మిక విద్యుల్లతలై ఈ కవితా గాథలను ప్రకాశవంతం చేశారు. ఈ గాథలతో పాటు ‘ఎండ్ నోట్స్’ పేరిట రచయిత బొల్లోజు బాబా 32 పేజీల్లో ఎంతో ఉపయుక్తమైన అంశాలను అందించారు. ఇందులో ఆయన ఇచ్చిన సమాచారం, విశ్లేషించిన విషయాలు థేరీ గాథలకు ఒక పరిపూర్ణతని తీసుకొచ్చాయి. ఆనాటి మానవ సంబంధాలను, సామాజిక సంబంధాలను బౌద్ధ సాహిత్య వెలుగుల్లో వివరిస్తూ మంచి విశేషాలను అందించారు. ఆనాటి మహిళల జీవితాల్లో ఆవరించిన దు:ఖం, విషాద సందర్భాలు, నిస్సహాయత ఎలాంటివో ఈ గాథలు తట్టిలేపుతాయి. ఎంతో ఆధునిక ప్రపంచంలో ఉన్నామని భావిస్తున్న నేటికాలంలో కూడా మహిళల జీవితాలను అడుగడునా సవాల్ చేస్తున్న దు:ఖం, విషాదాలు, కన్నీళ్లు, కలతలు, ప్రేమ రాహిత్యం, నిస్సహాయత వంటివన్నీ ఆనాటికి ముందు నుంచే రకరకాల రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయని అర్ధమైన తర్వాత మనసు ఎంతో ఆర్ద్రతకు లోనవుతుంది. మార్పు రావాల్సింది బయట ప్రపంచంలో మాత్రమే కాదని..ముందు అది మనసు లోలోతుల్లోంచి జనించాలని మరోసారి స్పష్టమౌతుంది.
ఈ పుస్తకానికి భిక్ఖు ధమ్మరక్ఖిత బంతే అర్ధవంతమైన ముందుమాటని, ప్రసిద్ధ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు చివరి కవర్ పేజీపై ఇందులోని అంశాల నేపథ్యాన్ని తనదైన శైలిలో పరిచయ రూపంలో అందించారు.
 
ఇటీవల వస్తున్న పుస్తకాల శ్రేణిలో ‘థేరీ గాథలు’ ఎంతో విలువైన పుస్తకం అని భావిస్తున్నాను. 182 పేజీల్లో ఉన్న ఈ పుస్తకాన్ని ఒకసారి చదివి పక్కన పెట్టేయడానికి వీలు కుదరదు. కేవలం కళ్లు, నోటితో మాత్రమే కాదు. పదేపదే మనసుతో చదవాల్సిన పుస్తకమిది. అప్పుడే చదువరులు థేరీల మనోస్పందన వినగలరు. ఈ పుస్తకం కోసం హైదరాబాద్ లోని ఛాయ రిసోర్స్ కేంద్రం వారిని 7093165151 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చును.
 
**************



Tuesday, September 27, 2022

నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో



ఈ క్రింది వాక్యాలు ఇటీవల చాలా పాపులర్ అయిన ఒక ఫోక్ సాంగ్ లోవి
.
నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ
నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
పురుషుడు స్త్రీని ఆకర్షించి ఆమె పొందు పొందాలనుకోవటం ఒక అనాది వ్యవహారం. అలాంటి ఓ సందర్భంలో - నేను మామూలు ఆడదానిని కాదు. నువ్వు పిలిస్తే నేను రాను. జాగ్రత్త చూస్కో మరి అని ఓ చక్కని పడుచు చెప్పటం చాలా అందమైన భావన.
ఇదే వ్యవహారాన్ని దాదాపు1300 సంవత్సరాల క్రితం ఒక ప్రాచీనకవి ఇలా వర్ణించాడు
.
లేతపెదవుల్ని మునిపంటితో నొక్కిపెట్టి
ద్రాక్షలతల్లాంటి కనుబొమల్ని ముడివేసి
“ఏయ్ దగ్గరకొచ్చావో జాగ్రత్త” అంటూ
తర్జని ఆడిస్తూ కీచుగొంతుకతో హెచ్చరించే
కోడెవయసు చిన్నదాని నుండి
దొంగిలించిన ముద్దే అమృతం
సాగరాన్ని మధించిన దేవతలు ఉత్త వెర్రివాళ్ళు (అమరుశతకం)
.
పై పద్యంలో "నేను అట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో" అనే ఊహ ను మానవ మేధ ఎంతదూరం తీసుకెళ్ళగలదో అంత దూరమూ నడిపిస్తాడు ఆ ప్రాచీన కవి.
అలా రాను అంటూ చూపుడు వేలుతో బెదిరిస్తూ హెచ్చరించే చిన్నదానినుండి దొంగిలించిన ముద్దు అమృతం అట. అంతే కాదు అలాంటి ముద్దుసంపాదించుకొన్న మగవానితో పోల్చినపుడు అమృతం కోసం సాగరాన్ని మధించిన దేవతలు ఉత్త వెర్రివాళ్ళట. ఇది కదా కవిత్వం అంటే.
నేను మామూలు ఆడదాన్ని కాదు అన్న ఊహను ఇంతకు మించిన ఎత్తులకు తీసుకెళ్ళగలిగే కవి ఎవరైనా ఉన్నారంటే అది మళ్ళా ఈ ప్రాచీన కవే అయి ఉంటాడు ఖచ్చితంగా.
.
బొల్లోజు బాబా




అమరుకశతకం

Thursday, September 22, 2022

థేరీ గాథలు – తొలితరం బౌద్ధ సన్యాసినుల గాథలు



చాన్నాళ్ళ క్రితం మిత్రులు అద్దేపల్లి ప్రభు, థేరీగాథలు చదివారా అని అడిగారు. అప్పటికి వాటిగురించి విన్నాను తప్ప చదవలేదు. నెట్ లో వెతికితే శ్రీ వాడ్రేవు వీరభద్రుడు గారి వాల్ పై థేరీ గాథలపై వ్రాసిన అద్భుతమైన వ్యాసం కనిపించింది. రెండువేల ఆరువందల సంవత్సరాల క్రితం జీవించిన బౌద్ధ సన్యాసినులు తమ జీవితానుభవాలకు ఇచ్చుకొన్న కవిత్వ రూపం ఈ థేరీగాథలు. మూలాలకోసం అన్వేషిస్తే చాలానే కనిపించాయి. శ్రద్ధగా చదూకొన్నాను. ఆనాటి స్త్రీలు, వారి జీవనం, చారిత్రిక నేపథ్యం చదువుతూ దివ్యానుభూతి పొందాను.
 
నా ఆనందాన్ని అనువదించాలనే లౌల్యం నన్ను నిత్యం బతికిస్తూ ఉంటుంది.

అలా "థేరీగాథలు-తొలితరం బౌద్ధ సన్యాసినుల గాథలు" ఈరోజు పుస్తకరూపంలో మీ ముందు ఉన్నది. ఆనాటి బౌద్ధ సన్యాసినుల కవితలే కాక అవసరమైన చోట్ల వాటి చారిత్రిక నేపథ్యాన్ని విపులంగా ఎండ్ నోట్స్ రూపంలో ఇచ్చాను.

నాకు బౌద్ధ పరిభాషపై పట్టు లేదు. పుస్తక జ్ఞానమే. ఈ పుస్తకరాతప్రతిలో వాడిన బౌద్ధ పరిభాషలో దొర్లిన అనేక దోషాలను పూజ్య బిక్ఖు ధమ్మరఖిత స్వామి సరిదిద్దారు. ఆశీపూర్వక ముందుమాట కూడా వ్రాసారు. వారికి వినయపూర్వక నమస్కారాలు.

శ్రీ గిరిధర్ చక్కని కవర్ పేజ్ ఇచ్చారు వారికి ధన్యవాదములు
క్రాంతి గారు అందంగా పేజ్ సెటప్ చేసారు వారికి కృతజ్ఞతలు.
నాపై వాత్సల్యంతో అట్టవెనుక బ్లర్బ్ రాసి ఇచ్చిన భద్రుడు గారికి నమస్సులు.

ఇంకా శ్రీ అవధానుల మణిబాబు, శ్రీ గనారా, ప్రభు, మార్ని చౌదరిగారు, అనిల్ డానీ, సుంకర్ గోపాల్, పుప్పాల శ్రీరామ్, డా. కాళ్ళకూరి శైలజ గారు, అగ్రజులు మధునాపంతుల గారు, దాట్ల రాజు గారు, బాల్యమిత్రుడు ముమ్మిడి చిన్నారి, నా గురువు శిఖామణి గారికి అనేకానేక కృతజ్ఞతలు,
***
ఈ పుస్తకం ఛాయా ప్రచురణల ద్వారా వస్తున్నది. మోహన్ గారికి ధన్యవాదములు.
ప్రింటింగ్ మేకప్ చాలా బాగా ఉంది. చేతిలో ఇమిడిపోయే సైజు. తేలిక పేపరు. చాలా డిఫరెంటుగా, అందంగా వచ్చింది.
 
182 పేజీల పుస్తకం వెల 150 రూపాయిలైనా లాంచింగ్ ఆఫర్ గా ఈ నెలాఖరు వరకూ 100 రూపాయిలకే ఇస్తున్నారు. 40 రూపాయిల పోస్టేజ్.

మొత్తం 140 రూపాయిలు
 
9848023384 నంబరుకు ఫోన్ పే చేసి పుస్తకం పొందవచ్చును.
ఈ పుస్తకం కవిత్వ పరంగా, చరిత్ర పరంగా మీ ఆసక్తిని నిరాశపరచదు.
9848023384 నంబరుకు 140/- ఫోన్ పే చేసి పుస్తకం పొందవచ్చును.
దయచేసి ఆదరించండి.
 
భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, September 18, 2022

ఒంటరి గోరీలు



ఒంటరి గోరీలు

అకస్మాత్తుగా వాన
చెట్టునీడకు చేరాను
పక్కనే పాడుపడిన గోరీలు

తుంపర్ల మధ్య మెరుస్తోన్న
ఒకనాటి
జీవన వైభోగపు శకలాలు
శిథిలమౌతూ
నేలలోకే కూరుకుపోతూ
అక్షరాలు కరిగి పోయి
నగిషీలు అలుక్కుపోయి
బంధువుల రాక తగ్గిపోయి
కాలం బుగ్గపై
మొలిచిన మెటిమల్లా ...

ఒణికే వేళ్లు
చేతికర్రపై బిగుసుకొన్నాయి
వానవెలసింది
భారంగా ముందుకు కదిలాను


బొల్లోజు బాబా

Sunday, September 11, 2022

గురువుకు ఒక శిష్యుడు ఎత్తిన హారతి - " నది కాలం అతడు "



గురువుకు ఒక శిష్యుడు ఎత్తిన హారతి - " నది కాలం అతడు "
ఇస్మాయిల్ గారు తెలుగు కవిత్వలోకంలో నిలువెత్తు మనిషి. ఆయన మార్గం అపూర్వమైనది. వీరి కవిత్వంలో యుటోపియన్ స్వర్గాలు ఉండవు. నేలవిడిచి సాముచెయ్యటం కనిపించదు. జీవితాన్ని యధాతథంగా స్వీకరించి కవిత్వం చేసిన గొప్ప కవి ఇస్మాయిల్. ఇస్మాయిల్ దృక్ఫధం ఒకప్పుడు ఒక సంచలనం. ఎన్ని విమర్శలు ఎదురైనా తుదివరకూ తనమార్గాన్ని వీడని కవిత్వశూరుడు ఇస్మాయిల్.
ఈ క్రమంలో ఎందరో యువకులు ఇస్మాయిల్ కవిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ఇస్మాయిల్ గారు ఎవరినీ తన శిష్యులుగా చెప్పుకపోయిన, ఆయన కవిత్వాన్ని తమకు దిక్సూచిగా భావించారు అనేకమంది కవులు. వీరంతా ఇస్మాయిల్ వారసత్వాన్ని కొనసాగించే ప్రేమికులు, దూతలు, భక్తులు. వారిలో రవూఫ్ ఒకరు. కాకినాడలో మెడికోగా ఉండే రోజుల్లో రవూఫ్ ఇస్మాయిల్ గారిని నిత్యం కలుస్తూ, కవిత్వం గురించి చర్చిస్తూ ఒక రకంగా వారింట్లో మనిషిలా మెసిలారు. రవూఫ్ ‘అంతర్నేత్రం’ కవిత్వసంపుటికి ఇస్మాయిల్ గారు మొదటిసారిగా ముందుమాట వ్రాసారు. ఆ ముందుమాటలోనే "తెరుచుకొన్న పద్యాలు" అన్న కొత్త భావనను తెలుగు కవిత్వానికి అందించారు. అప్పట్లో అదొక సంచలనం. 'మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా" అని వాద ప్రతివాదనలు నడిచాయి.
ఇదంతా గతం. ప్రస్తుతానికి వస్తే - " నది కాలం అతడు " అనే పేరుతో ఇస్మాయిల్ కవిత్వతత్వానికి రవూఫ్ అక్షరరూపాన్ని ఇచ్చారు. ఇది నిజానికి ఇస్మాయిల్ జీవిత చరిత్ర. వారికవిత్వం లోనే వారి జీవితం ఉంది. జీవితాన్ని కవిత్వాన్ని ఆయన ఏనాడూ వేరుగా చూడలేదు. తెలుగులో ఒక కవి జీవితం గురించి, అతని కవిత్వం గురించి ఒక కవితా సంపుటి తేవటం బహుసా ఇదే మొదలు కావొచ్చు. అదీకాక ఆ కవి గతించి పదిహేనేళ్ళు గడిచిన తరువాత. ఇదొక ప్రేమపూర్వక కాన్క.
ఒకే తూలికలు కల్గిన పక్షులు గుంపు కడతాయి అన్నట్లు రవూఫ్ కవిత్వంలో ఇస్మాయిల్ కవిత్వ ఛాయలు కనిపిస్తాయి. అందుకనే ఆయన ఇస్మాయిల్ గారికి ఇష్టుడైనాడు. ఈ పుస్తకంలో ఇస్మాయిల్ గారి కవితాత్మను అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.
ఇస్మాయిల్ కవిత్వంలో ఆయన జీవితం పరచుకొని ఉంటుంది. సహచరి సహనం, మనవల అల్లరి, సన్నిహితుల స్నేహం, సాయింత్రపు నడకలు, టాగోర్, కృష్ణ శాస్త్రి, చలం లపై ఉన్న భక్తి, టీసమయాలు లాంటి సామాన్య జీవనాంశాలు వారి కవిత్వంలో సహజంగా ఒదిగిపోయాయి. రవూఫ్ వీటన్నిటిని చాలా ఒడుపుగా పట్టుకొని, గొప్ప నైపుణ్యంతో నేతగాని పనితనంతో చిక్కని కవిత్వంగా మలచారు.
రాళ్లు కూడా పుష్పిస్తాయనీ
శిల్పాలై విచ్చుకొంటాయనీ
ఇస్మాయిల్ కు బాగా తెలుసు
బాధని వ్యక్తపరచడు
చిర్నవ్వులే చిందిస్తాడు-- (రాళ్లూ-పూలూ). ఇస్మాయిల్ గారు ఆర్ధికంగా ఇబ్బందులు పడిన సందర్భాలలో ఏనాడూ మిత్రులను సహాయం అర్ధించలేదని సన్నిహితులు చెపుతారు. చివరి దశలో టౌన్ లో ఇల్లు అమ్ముకొని ఊరిచివర వలసపాకల అనే ప్రాంతానికి మారిపోయారు. ఆ సందర్భాన్ని ఓ కవితలో--
వలస పాకల లోని
ఒంటరి ఆకాసంలో
కుంగిపోయిన పక్షి ఒకటి
గిరికీలు కొడుతూ
దుఃఖ సముద్రాన్నీదుతుంది (వలస-పాకనాటి ఒంటరి పక్షి ఒకటి) అంటూ చాలా ఆర్థ్రంగా రవూఫ్ వర్ణిస్తారు.
విచ్చుకొన్న పూల సున్నితత్వం
ఒకవైపు
గుచ్చుకున్న ఖడ్గకాఠిన్యం
ఇంకొకవైపు - (ఇస్మాయిల్). ఇస్మాయిల్ గారి కవిత్వం ఎంత సున్నితంగా హృదయాన్ని తాకుతుందో కవిత్వంపై వీరి అభిప్రాయాలు అంతే నిష్కర్షగా, కుండబద్దలుకొట్టినట్లు ఉంటాయి. " ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు" అంటూ ఇస్మాయిల్ వెలిబుచ్చిన పై అభిప్రాయం అప్పట్లో చాలామందికి గుచ్చుకొంది. వీరిని ప్రధాన స్రవంతి కవులనుండి వెలివేసేటట్లు చేసింది. తాను నమ్మిన అభిప్రాయం చెప్పటానికి ఎంతటి ఖడ్గకాఠిన్యం ఉండాలి!
అయినా అనుక్షణం జీవితమొక
మహోత్సవం అయినవాడికీ
సతతహరిత వృక్షానికీ
వయోకొలమానం ఏమిటీ? -- (విరమణ @55). అప్పట్లో యాభై అయిదేళ్లకే ప్రభుత్వోద్యోగులను బలవంత పదవీవిరమణ చేయించినపుడు ఇస్మాయిల్ గారు కూడా ఒక బాధితుడు. ఆ సమయానికి వీరు పి.ఆర్. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కవి, సహృదయుడు అయిన శ్రీ గోదావరి శర్మ "55 ఏళ్లకే పచ్చని చెట్టును కొట్టేస్తారా? అని వ్యాసం వ్రాసారు. రెండేళ్ల తరువాత ఆ జి.వొ రద్దు చేయగా, తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినపుడు ఇస్మాయిల్ గారు తిరస్కరించారని అంటారు.
ఆమె గొంతు ముడి విప్పి
పాడుతుంటే
ఆ గళమాధుర్యంలో పడి
కొట్టుకు పోతూ
అతను అస్తిత్వం కోల్పోతాడు
అది అతనికి తెలుసు - (కవి-గాయని) ఇస్మాయిల్ గారికి గాయని ఐన ఒక స్నేహితురాలు ఉండేవారు. ఆమె పాటల మాధుర్యాన్ని ఓ కవితలో ఇస్మాయిల్ గారు ఇలా వర్ణించారు. హాయిగా గొంతుముడి విప్పి పాడు/ రయిక ముడి విప్పి/చంటి బిడ్డకు/చన్నిచ్చే తల్లిలా// నీ అంతరాళాల్లో/నీ రక్తసంధ్యలో లేచిన/తెల్లటి పాట పావురాన్ని/నా రక్త సంధ్యలో వాలనీ./వెలిగే పగళ్ళతో ఉభయ సంధ్యల్నీ కలపనీ.// (పాటకత్తెకి) . ఈ విషయాన్నే పై కవితలో రవూఫ్ వర్ణించారు. ఆమె గాత్రంలో కొట్టుకుపోయి తన అస్తిత్వాన్నే కోల్పోయిన విషయం ఆయనకు తెలుసు అని ఒక కవి, గాయని అలౌకికానుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రవూఫ్.
ఇస్మాయిల్ చలాన్ని దర్శించినపుడు, ఎదురెదురుగా కూర్చొని ఎవరూ మాట్లాడుకోలేదట. మౌనంగా ఉండిపోయారట.
మమేకమైన రెండు హృదయాల
కల్లోలానికి మాటలతో పనిలేదు
కాబోలు
మౌనం పూనిన భిన్న తీరాల
నడుమ-
గడ్డకట్టిన మంచులాంటి
మాటల నది
నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది (మౌన సంభాషణం) అంటూ ఆ సందర్భాన్ని హృద్యంగా దృశ్యమానం చేసారు. రవూఫ్.
ఈ పుస్తకంలో ఇంకా ఇస్మాయిల్ స్నానం, సాయింత్రపు నడకలు, ఆయన నివశించిన లచ్చిరాజు వీధి, అందంగా వ్రాసే వారి ఉత్తరాలు, పని చేసిన కాలేజి వాడిన సైకిల్ లాంటి అనేక విషయాలపైనా, సమకాలీనులైన ఉమర్ ఆలిషా, వజీర్ రెహ్మాన్, పంతులు గారు స్మైల్ వంటి వ్యక్తులతో ఇస్మాయిల్ అనుబంధాన్ని వర్ణిస్తూనూ అనేక అందమైన కవితలున్నాయి.
తెలుగు సాహిత్యంలో ఇదొక గొప్ప ప్రయోగం. గతించిన ప్రముఖ కవుల ఇళ్లను ప్రజలు, ప్రభుత్వాలు కలిసి భద్రపరచుకోవటం వారి పేరిట మ్యూజియములు నెలకొల్పుకోవటం లాంటివి ప్రపంచంలో చాలా చోట్ల నిబద్దతతో చేస్తారని వింటాం. అవెలాగూ తెలుగునాట జరిగే విషయాలు కావని నిరూపణ అయిపోయింది. కనీసం అక్షరాలలోనైనా ఒక మహాకవి జీవించిన స్థల, కాలాదులను బ్రతికించుకొనే ప్రయత్నం చేసిన రవూఫ్ గారు ఎంతైనా అభినందనీయులు.
నావంటి వాడిని శిష్యునిగా పొందే భాగ్యం నన్నయకు లేదు తిక్కనకు లేదు మా గురువుగారైన చెళ్లపిళ్ల వారికి మాత్రమే దక్కింది అని విశ్వనాధవారు అన్నారట. అది అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇస్మాయిల్ గారిని ఇతివృత్తంగా తీసుకొని వెలువరించిన "నది కాలం అతడు " కవిత్వసంపుటి రవూఫ్ గారు తన సాహితీ గురువుకు ఎత్తిన ప్రేమ పూర్వక హారతి.
ఈ పుస్తకానికి శ్రీ విన్నకోట రవిశంకర్, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ శిఖామణి ఆత్మీయతతో కూడిన ముందుమాటలు వ్రాసారు. అందమైన ముఖచిత్రాన్ని బ్రహ్మం భావన గ్రాఫిక్స్ వారు అందించారు. ఇస్మాయిల్ కవిత్వాన్ని ఇష్టపడేవారికి, ఇస్మాయిల్ కవిత్వతీరాన్ని చేరుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం ఒక దీపస్థంభం.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం పాలపిట్ట నవంబరు సంచికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు

 తెలియచేసుకొంటున్నాను)




Tuesday, September 6, 2022

ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.



ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.
.
ఇప్పుడు పుస్తక పరిచయాలే తప్ప సమీక్షలు రావటం లేదు. చాలారోజుల తరువాత ఒక మంచి సమీక్ష చదివాను. అది నా పుస్తకం పైనే కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


నేను రచించిన “ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంపై శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చేసిన సమీక్ష సెప్టెంబరు-2022 సాహిత్య ప్రస్థానం పత్రికలో వచ్చింది. ప్రచురించినందుకు ఎడిటర్ గారికి ధన్యవాదములు


పెద్దాపురంలో జరిగిన ఒక సభలో జోశ్యుల కృష్ణబాబు గారు శ్రీ ప్రసాదు గారిని నాకు పరిచయం చేసారు. “ప్రసాద్ గారు మంది మేధావి, రాసిన అన్ని కాంపిటిటివ్ పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులను పొందారు, ప్రస్తుతం ఉపాధ్యాయునిగా చేస్తున్నారని, అతనిని నా శిష్యుడని చెప్పుకోవటానికి నేను గర్వపడతానని” –అని చెప్పారు.


ఈ రోజు ప్రసాద్ గారు వ్రాసిన ఈ వ్యాసం చదువుతుంటే ఆ మాటలు అక్షరసత్యాలు అనిపిస్తుంది.
.
ఈ సమీక్షలో శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చరిత్రలో భిన్నపార్శ్వాలను కలిగిఉండే రెండు మూడు చర్చనీయాంశాలను ప్రస్తావించారు. వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. వినమ్రంగా అంగీకరిస్తున్నాను.
.
“ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరిజిల్లా” పుస్తకాన్ని రచించాకా…. దీన్నెవరైనా చదివారా అనే అనుమానం ఉండేది. ఈ రివ్యూ చదివాకా నా కడుపు నిండిపోయింది. కరువు తీరింది.


ప్రసాద్ గారికి అనంతానంతా ధన్యవాదములతో….
.
బొల్లోజు బాబా


పిఎస్. లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


.


తూర్పుగోదావరి జిల్లా ఒక పరిశీలన
- పేపకాయల ప్రసాద్,


ఇప్పుడు లేని మనుషుల స్మృతులను, వారు జీవించిన నాటిసంగతులను, సంస్కృతులను, ఇప్పటిమట్టిపొరలలోంచి వారునిర్మించిన కట్టడాల శిథిలాలలోంచి, వారు సంతరించిన సాహిత్యం తదితరాలనుంచి వెలికి తీయాలని, వాటిపై వెలుగులు ప్రసరింపచేయాలని తపిస్తాడు చరిత్రకారుడు. చరిత్ర పరిశోధన ట్రీట్మెంట్ లేని అడిక్షన్. ఆ అడిక్షన్లో నుంచి చరిత్రకారుడు పుట్టుకొస్తాడు. ఆయా రాజవంశాల మీద సాగినంత లోటైన పరిశోధన మనదేశంలో స్థానిక చరిత్రల మీద జరగలేదు.


ఒకప్పటి రాజుల ఉనికికి, సామ్రాజ్యాల మనికికి ఆధారమైన-ఆర్ధ్కవనరులు, ఉత్పత్తి శక్తులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల కార్యకలాపాలకు నిలువరమైన పట్టణాల చరిత్ర ఆయా పట్టణాల దాపునే ఉంటూ వాటి పరిపుష్టికి అవసరమైన వనరులు అందించిన పల్లెల చరిత్రగురించి మనకు తెలిసింది చాల తక్కువ. హేతుబద్దమైన దృక్ఫథంతో వెలువడిన స్థానిక చరిత్రలు అరుదుగా ఉన్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాచీనపట్టణాల చరిత్రపై 10-15 ఏళ్లుగా రచనలు వస్తున్నాయి. భౌగోళికంగా ఈ జిల్లానే ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చెబితే… దాట్లదేవదానం రాజు-యానాం చరిత్ర, బొల్లోజుబాబా-యానాంవిమోచనోద్యమం, ఫ్రెంచిపాలనలో యానాం, వంగలపూడి శివకృష్ణ-చారిత్రక పెద్దాపురం:కథలు గాథలు, బండిరాజకుమార్-మన పిఠాపురం పుస్తకాలు వాటిలో విలువైనవి.


తూర్పుగోదావరి జిల్లాలో పలురాజ్యాలకు ఒకప్పుడు రాజధానులుగా విలసిల్లిన రాజమండ్రి, పిఠాపురం వంటిపట్టణాలపై 50 ఏళ్ళ కిందటే లోతైన పరిశోధనలు జరిగాయి. మంచి వ్యాసాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆయా ప్రాంతాల విశేషాలలో తెలియవలసిన పార్శ్వాలు ఇప్పటికీ మరుగునే పడిఉన్నాయి. వాటి చీకటి కోణాలను తెలియచెప్పటానికి ఆయా ప్రాంతాల్లో జరగవల్సిన పురావస్తు తవ్వకాలు ఈనాటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్ల దొరికిన వాటి ఆధారంగా తెలియని చరిత్రను ఊహించుకోవల్సి వస్తుంది.


2021 లో వెలువడిన బొల్లోజు బాబా గారి “ప్రాచీణపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంలో 13 ప్రాచీనపట్టణాల వివరాలు ఉన్నాయి. వాటి శీర్షికలు ఇవి : ఒకనాటి ఆంధ్ర రాజధాని పిఠాపురం, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, అపురూప ఆలయసంపదకు నిలయం బిక్కవోలు, చరిత్రపుటలలో కోరంగి మహాపట్టణం, ఆంధ్ర వేదాద్రి కోరుకొండ, ఆదుర్రు, చాళుక్యభీమవరం, సర్పవరం, ద్రాక్షారామం, బెండపూడి, పలివెల, తొలితిరుపతి, పెద్దాపురం.


పాఠకుడికి ఎక్కడా విసుగు కలుగనీయకుండా విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటం, చెబుతున్న విషయంపై సాధికారత కోసం విస్తృత పరిశోధన చేసి, వివిధ ఆరాలన్నిటినీ ఒకచోటకి చేర్చి, పుస్తకానికి మంచి ఆకారాన్నివ్వటంలో బాబా నిష్ణాతులని వారి గత రచనలు రుజువు చేసాయి. సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బాబా గత 3 దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ కవిగా, రచయితగా మంచి గుర్తింపు పొందారు. హేతుబద్దమైన దృక్ఫథంతో సమాజాన్ని పరిశీలించటం అలవాటైన వారు కాబట్టి తనలోని బుద్ధిజీవిని సంతృప్తి పరచటానికి ఆయన చరిత్ర రచనలోకి వచ్చి ఉంటారు.
ఈ పుస్తకం తొలివ్యాసంలో పిఠాపురం విశేషాలను 3 భాగాలుగా వింగడించి, క్రీ.పూ. 6 వ శతాబ్దం నుంచి 1951 వరకు గల వివిధ విశేషాలను కాలక్రమంలో పొందుపరిచారు రచయిత. శాతవాహనుల కాలం నాటి కొడవలి శాసనం, సముద్రగుప్తును అలహాబాద్ ప్రశస్తి ఈ ప్రాంతం ఉనికిని తెలిపే ప్రాధమిక ఆధారాలు. ఒకనాటి కళింగ రాజ్యానికి దక్షిణంగా చివరిప్రాంతమైన ఈ పట్టణాన్ని వివిధ కాలాల్లో చిన్న, పెద్ద రాజవంశాలెన్నో పాలించాయి. తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపన జరిగింది. పిఠాపురం చాళుక్యులనే పేరుకి మాత్రం పరిమితమై, ప్రభవాన్ని కోల్పోయింది కూడా ఈ పట్టణంలోనే!


తూర్పుచాళుక్యుల కాలంనుంచి జమిందారీ యుగం వరకు సాహిత్యానికి మంచి ఆదరణ లభించిన తెలుగు ప్రాంతాల్లో పిఠాపురానికున్న స్థానం ప్రత్యేకం. బౌద్ధం జైనం, శైవం, శాక్తం, వైష్ణవం, గురుసంప్రదాయాల్లో దేశం మొత్తంళో ప్రాధాన్యమున్న అరుదైన ఆథ్యాత్మిక కేంద్రం పిఠాపురం. చరిత్రకారులకు పనికి వచ్చే విలువైన శాసనాలెన్నిటినో గర్భాన ధరించిన ఊరిది. ఈ పట్టణానికి సంబంధించిన అన్ని విశేషాలను చక్కగా అక్షరీకరించిన రచయిత-చారిత్రకంగా ఎంతో కీలకమైన విషయాలను అందించారు. జైన రాజు ఖారవేళుడు క్రీ.పూ. 183 లో తన హాథిగుంఫ శాసనంలో తెలిపిన “పిథుండ పట్టణం”, జైన గ్రంథం ఉత్తరాధ్యాయన సూత్రంలో చెప్పబడిన వ్యాపార కేంద్రం “పిహుండ”, టాలెమి సూచించిన “పిటిండ్రా రేవుపట్టణం” ఇక్ష్వాకుల శాంతమూలిడి పాత గండిగూడెం తామ్రశాసనంలో ప్రసక్తమైన “పిథుండ బౌద్ధ క్షేత్రం”- పిఠాపురమేనని ఆధారాలు చూపారు. హు యాన్ చాంగ్ తెలిపిన ఆంధ్రుల రాజధాని “ఫింగ్-కి-లో” కూడా పిఠాపురమేనని రుజువులు చూపారు.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో రాజమండ్రి నగర నిర్మాత—అందరూ అనుకుంటున్నట్లు అమ్మరాజో, రాజరాజ నరేంద్రుడో కాదని, రాజమండ్రి కైఫీయతులో చెప్పబడినట్లు గుణగ విజయాదిత్యుడే ఆ నగరాన్ని నిర్మించాడని తెలిపారు. క్రీ.శ. 9-13 శతాబ్దుల నడుమ రాజమండ్రి జగరానికి “జననాథ నగరమని” పేరుండేదని శాసనాథారాలు చూపారు. తూర్పుచాళుక్యుల చేతకానితనం వల్ల, ఇక్కడి సంపద వందల ఏళ్ళపాటు తమిళదేశానికి ఎలా తరలిపోయిందో ఆధార సహితంగా వివరించారు.


బిక్కవోలు గురించి రాస్తూ—ఆ ఊరి నిర్మాణాల వైశిష్ట్యాన్ని, గుణగ విజయాదిత్యుని గొప్పతనాన్ని చక్కగా వివరించారు. సాతలూరి శాసనం, ఇతర సమకాలీన ఆధారాలతో అక్కడి బృహత్ గణపతి విగ్రహం, కొన్ని ప్రాచీన ఆలయాలు గుణగుని నిర్మాణాలయి ఉంటాయని తేల్చారు. ఊలపల్లి వెళ్ళేదారిళోని 9వ శతాబ్దపు ఆలయంపై కనిపించే లకులీశ శివుని శిల్పం బిక్కవోలులో పాశుపత శైవం వర్ధిల్లిందనటానికి నిదర్శనమని తెలిపారు.


వెయ్యేళ్లకు పైగా ఓడరేవుగా, గొప్ప నౌకా నిర్మాణ కేంద్రంగా విరాజిల్లి, ఆనాటి గుర్తులు మచ్చుకైనా లేకుండా మరుగునపడిపోయిన ఓ మహా పట్టణం, సముద్ర తీరపు మట్టిదిబ్బల అడుగుపొరల్లో దగున్న సత్యాన్ని…. 1787, 1839 లలో వచ్చిన భీకర తుఫానులు, పెను ఉప్పెన ఆ పట్టణపు మహా వైభవాన్ని తుడిచిపెట్టేసిన వైనాన్ని కళ్లకు కట్టారు “కోరంగి మహా పట్టణం” వ్యాసంలో.


కాకతీయుల తర్వాత స్వతంత్రులై, ఈ ప్రాంతపు రాజకీయాలలో ప్రత్యేకతను సాధించిన కోరుకొండ పాలకులు కూనయ, ముమ్మడి సింగయ, గన్నయ నాయకుల విశేషాలను, ముమ్మడి నాయకుడి కాలంలో రామనుజ సంప్రదాయం నెలకొని, కోరుకొండ వైష్ణవ క్షేత్రంగా రూపొందిన క్రమాన్ని కథనం చేసారు…. “ఆంధ్ర వేదాద్రి కోరుకొండ”వ్యాసంలో.


అశోకుని కుమార్తె సంఘమిత్ర నిర్మింపజేసిన ఆదుర్రు బౌద్ధ స్తూపం విశిష్టతను, స్థానిక పాలకుడు పృథ్వీమూలుడి విశేషాలను ఆదుర్రు వ్యాసంలో అందించారు.
మొదటి చాళుక్యభీముడు నివసించిన చాళుక్యభీమవరం (సామర్లకోట ప్రాంతం) పై ఉన్న ఐతిహ్యాలతో పాటు కాడవ (ర్) వంశస్థుడైన కొప్పెరు చింగ శాసనాలు, మండయసెట్టి నిర్మించిన రాజనారాయణాలయ విశేషాలను అందించారు మరో వ్యాసంళో.
తీరాంధ్ర దేశంలో వైష్ణవం విస్తరించటానికి దోహదపడిన ఆలయాల్లో సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ఒకటని, అద్భుత శిల్పంతో పాటు ప్రాచీన సంప్రదాయాన్ని చాటి చెప్పే విశేషాలు సైతం ఇక్కడి శాసనాలలో ఉన్నాయని చెబుతూ జలగడియారం గురించి ఆసక్తిదాయకంగా వివరించారు.


ఆలయాలు సంపద చలామణి సంస్థలుగా వ్యవహరించిన తీరును దాక్షారామం పట్టణంలో చూడవచ్చని దాక్షారామం ఓ మహాపట్టణంగా రూపుదిద్దుకోవడంలో “భక్తి-వాణిజ్యం” ఎలా ఉపకరించాయో చెప్పడంతో పాటు-శాసనాలలో సాహిత్యంలో దాక్షారామం ప్రస్తావనలను ఆ ఊరిని గురించి రాసిన వ్యాసంలో చెప్పారు. కాకతీయులు, రెడ్డి రాజుల కాలం నాటి బెండపూడి విశేషాలను, పలివెల వారకాంతల అంతిమసంస్కారాలకు పలివెల కొప్పు లింగేశ్వర స్వామి గుడి నుంచి అగ్నిని తీసుకువెళ్ళే వింత ఆచారాన్ని, తిరుమల కంటే ప్రాచీనమని చెప్పబడే తొలి తిరుపతి (పెద్దాపురం మండలం) వృత్తాంతాన్ని, ఈవి-ఠీవి కలిగిన పెద్దాపురం రాజుల చరిత్రను తరువాతి వ్యాసాల్లో తెలియజేసారు. ఆయా ప్రాంతాలకు వేర్వేరుకాలాల్లో ఉన్న రాజకీయ, భౌగోళిక విభజనలను సూచించే… “నాడు, స్థలము, విషయము” వంటి పేర్లు పాఠకులను గందరగోళానికి గురిచేస్తాయి కనుక వాటి జోలికి పెద్దగా పోకుండా అటువంటి వివరాలను అవసరమైన మేరకు పుస్తకం చివర్లో అనుబంధ వ్యాసాలుగా ఇచ్చారు.


అయితే వివిధ వ్యాసాల్లో రచయిత తెలిపిన విషయాలను చదువుతున్నపుడు కుతూహలంతో పాటు చిన్నచిన్న సందేహాలు కూడా కలుగుతాయి. ఆయా విషయాలపై సంపూర్ణ చర్చకు ఇది తగిన సందర్భం కాదని భావిస్తూ, ఈ వ్యాసం యొక్క పరిమితులను దృష్టిలో ఉంచుకొని వాటిని సంక్షిప్తంగానే చర్చిస్తాను.

బాబా గారు ఈ పుస్తకంలో పిఠాపురంపై రాసిన వ్యాసంలో (పుట14) పిథుండ పట్టణాన్ని గురించి చెబుతూ”ఖారవేలుడు గోదావరిని దాటి కృష్ణానదీ తీరం ప్రవేశించాలంటే అప్పటికే ఈ ప్రాంతాన్ని ఏలుతున్న శాతవాహనులను దాటుకొని వెళ్లాలి. అదే జరిగి ఉన్నట్లయితే అదొక చరిత్రాత్మక విశేషం అవుతుంది. శాతవాహన శాసనాల్లో కాని, ఖాఅరవేలుని శాసనంళో కాని అలాంటి ప్రస్తావనలు కనిపించవు” అన్నారు. కానీ ఖారవేలుడు తన రెండవ పరిపాలన సంవత్సరంలో శాతకర్ణిని లెక్కచేయకుండా పెద్దసైన్యంతో కృష్ణానదివరకు వెళ్ళి మూషిక నగరాన్ని నాశనం చేసాడని హాథిగుంఫ శాసనంళో ప్రస్తావన ఉంది. (ఎపిగ్రాఫియా ఇండికా – 10). ఈ శాసన లేఖనం స్పష్టంగా లేనందున చరిత్రకారులలో భేదాభిప్రాయాలు కలిగినప్పటిఖీ కె.పి. జయస్వాల్, ఆర్.డి బెజర్జి ప్రకటించిన శాసనపాఠం ప్రకారం మొదటి శాతకర్ణి కాలంలో ఖారవేలుడో, అతడి సైన్యమో శాతవాహన సామ్రాజ్యంలోకి ప్రవేశించారని అత్యధికులు ఆమోదించారు. గుంటుపల్లి గుహల్లో లభించిన స్తంభశాసనం కూడా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖారవేలుని ఉనికిని చాటుతోంది. (jain Monuments of Andhra-G Jawahar Lal: page 51).


మరో వ్యాసంలో- తూర్పుచాళుక్య వీరుడు గుణగ విజయాదియుని విజయాల్లో కీలకంగా వ్యవహరించిన సేనానుల్లో ఒకరు కాదేయరాజు అని ఇచ్చారు రచయిత. అతడు కాదేయరాజు కాడు. కడియరాజు బోయకొట్టాలను సాధించిన పండరంగనికి తండ్రి ఈ కడియరాజు. బహుశ అతడి పేరనే ఈనాటి కడియం ఏర్పడి ఉంటుందేమో.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో పంచగిరులను పేర్కొంటూ గతంలో గుండవరపు లక్ష్మినారాయణ, తల్లావఝుల పతంజలి శాస్త్రి ఇచ్చిన వివరాలే దాదాపు యధాతథంగా ఈ పుస్తకంలోను ఇచ్చారు బాబా. వీరంతా ఊహించినట్లు ఈ గిరులలో “రామగిరి, భద్రగిరి నగరానికి దూరంగా కాకుండా నగరంలోపలే ఉండి, తక్కిన గిరుల లాగే అవికూడా కాలక్రమాన నశించి ఉండవచ్చుననిపిస్తోంఇద్. స్థానికంగా ఇప్పటికీ వాడుకలో ఉన్న ప్రదేశాలపేర్లు, శ్రీనాథుని భీమఖండంలోని వివరాలూ ఈ ఆలోచనకు ఉపబలకాలు. రాజమండ్రిలోని గిరులు ఐదు కాదు, ఏడు. (హేమగిరి, ధవళగిరి, పుష్పగిరి/కమలాచలం, భద్రగిరి, వేదగిరి, శేషగిరి) ఉండేవని భావించాల్సి వస్తుంది.
ఈ పుస్తకంలో ఆంధ్రవేదాద్రి కోరుకొండ అనే మరొక వ్యాసంలో ముమ్మడి నాయకుడు పాలించిన ప్రాంతాలను పేర్కొంటూ కురవాట సీమ వేంగి సమీపంలోనిది లేదా కాకినాడవద్ద ఉన్నది అని రాసారు రచయిత. మంగిపూడి ముమ్మడి నాయకుడి శాసనాలలోని కురవాటసీమ కాకినాడ వద్ద ఉన్న కూరాడ కాదు. ఈ సీమ వేంగిసమీపంలోనిదే అనటానికి ప్రబలమైన ప్రమాణం క్రీడాభీరామంలోని మధుమావతి వృత్తాంతం (ఆధారం: ప్రాచీనాంద్ర భూగోళము-శ్రీకందూరి ఈశ్వరదత్తు)


సర్పవరం వ్యాసంలో రచయిత-రాజరాజ నరేంద్రుని మనుమడు, చోళ చాళుక్య ప్రభువు అయిన వీరచోడుడు వైష్ణవాన్ని ఆదరించాడని, గత పరిశోధకుల నిర్ధారణను పునరుద్ఘాటిస్తూ- క్రీశ. 1092 లో ఆ రాజు వేయించిన్ అపిఠాపురం శాసన విశేషాలను పొందుపరచారు. ఈ శాసనం ద్వారా ‘వీరచోడ చతుర్వేది మంగలం”పేరుతో వీరచోడుడు దానమిచ్చిన పొన్నతొర్ర, మాలవెల్లి, ఆలమి తదితర గ్రామాల సముదాయాన్ని తొండంగి మండలంలోని “పెరుమాళ్ళపురం” (పెరుమాళ్ అంటే విష్ణువు, వీరచోడుని శాసనంలో ప్రస్తావించబడిన దాన గ్రహీతలలో వైష్ణవులున్నారు కాబట్టి) బొల్లోజు బాబా ఊహించారు. కానీ ఈ ఊహ సరైనది కాదనిపిస్తోంది. ఉప్పాడ సమీపంలోని ఆ గ్రామాలు చిన్నచిన్నమార్పులతో దాదాపుగా 11వ శతాబ్దినాటి పేర్లతోనే ఇప్పటికీ పిలువబడుతున్నాయని నా పరిశీలనలో తేలింది. రచయిత కథనం చేయటంళో దిట్టకావటం మూలాన…. చరిత్రలో ఏ కొంతో పరిచయం, ఆసక్తి ఉన్నవారినే తప్ప సామాన్య పాఠకుల పఠనాన్ని- నేను పేర్కొన్న విషయాలేవీ అంతగా అడ్డలేవు.


క్రీస్తుకు పూర్వం నుంచీ ఎన్నో ఆధారాలున్న పిఠాపురం చరిత్రను కథనం చేయటంతో పుస్తకాన్ని మొదలుపెట్టి…. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న వివిధ పట్టణాల చరిత్రను సాధికారికంగా, ఆసక్తికరంగా చెప్పటంతో ఈ పుస్తకానికి ఉత్తమ పరిశోధక గ్రంథంగా ప్రత్యేక స్థానం దక్కినట్టే! కళింగ రాజ్యానికి దక్షిణ హద్దు పిఠాపురమని, పిఠాపురంలో వెలసిన శివుని పేరులో భాగమైన ‘కుక్కుట’, ఆ దేవాలయం లోపలి కొలనుకు పేరైన ’పాదగయ’ అనే మాటలు కలిసిన ‘కుక్కుట పాదగిరి’ (గుర్పా) అనే ప్రదేశం బీహార్ లోని బోధగయ సమీపంలో ఉందని, బుద్ధుని శిష్యుడైన మహా కాశ్యపుడి పార్థివదేహం ఇప్పటికీ అక్కడే భద్రపరచబడి ఉందని తెలిసినపుడు-పిఠాపురం పాదగయ క్షేత్రానికి – బీహార్ బోధ్ గయతో ఉన్న బౌద్ధ్ అధర్మ పరమైన సంబంధం అర్ధమౌతుంది.


పిఠాపురం ప్రాచీనబౌద్ధ క్షేత్రం అయి ఉంటుందనే పరిశోధకుల మాట అక్షర సత్యమని తెలుస్తుంది.


వేంగి సామ్రాజ్య పాలకులు చోళులకు విధేయులై ఇక్కడనుంచి ఏటా 340 కళాంజుల బంగారాన్ని, లక్షా 10 వేల కలామ్స్ వరి ధాన్యాన్ని తంజావూరు ఆలయ భాంఢాగారానికి తరలించుకు పోయేవారన్న వాస్తవం విస్మయం కలిగిస్తుంది.


బిక్కవోలులోని కాంచనగుడి -గుణగ విజయాదిత్యుని విజయ చిహ్నమని, మన దేశంలో అరుదుగా కానవచ్చే శిల్పసంపదలోకి చేర్చదగిన శిల్పరీతులు బిక్కవోలు ఆలయాలపై కనిపిస్తాయని తెలిసినపుడు ఆశ్చర్యం కలుగక మానదు. సామర్లకోట, సర్పవరం, పిఠాపురం వైష్ణవ క్షేత్రాల విశేషాలు; బిక్కవోలు, దాక్షారామం, చాళుక్య భీమవరం, పిఠాపురం శైవ క్షేత్రాలు- ఈ ప్రాంతపు సంస్కృతిలో తూర్పు చాళుక్యుల విశిష్ట పాత్రను తెలియజేస్తాయి.


ఇలాంటి ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలను సందర్భోచితంగా చెబుతూ ఈ తరం పాఠకుల్లో కూడా చరిత్రపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారు రచయిత. 142 పుటల్లో ఓ విజ్ఞాన సర్వస్వాన్ని ఇమిడ్చే సాహసం చేసిన రచయిత బాబా తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి.


ముందుమాటలో డా.కె.ఎస్.కామేశ్వరరావు గారన్నట్లు….ఇది చరిత్రపై మక్కువపెంచే రచన. ఇలాంటి మరిన్ని ప్రామాణిక రచనలు బొల్లోజు బాబా నుంచి వస్తాయని ఆశిద్దాం.


పేపకాయల ప్రసాద్