Friday, December 30, 2016

రహస్య ప్రియురాలు


నాకెప్పుడో
ఇసకలో దొరికిన గవ్వతో
ఏకాంతం దొరికినప్పుడల్లా
మాట్లాడుకొంటాను.
తనకే అర్ధమయ్యే భాషలో
పాటలు పాడి వినిపిస్తాను.
మాకు మాత్రమే వినబడే
శబ్దాలతో గుసగుసలాడుకొంటాం
సముద్రం పెదవిపై
గవ్వా నేనూ ఒక్కోసారి
జంటగువ్వలమౌతాం.
నాకెప్పటినుంచో ఓ అనుమానం
మమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని
బొల్లోజు బాబా



Secret Lover

When alone,
I speak to the cowry
that I found long back
on a sandy shore.
I sing many songs in the language
Only she can understand
We whisper in low voices
Only we can hear
Cowry and myself
become a pair of birds
And roam on the sandy lip of Sea
I have a suspicion since long
That Someone is watching us.
Bolloju Baba

Siva Racharla gaaru, thank you so much

Siva Racharla gaaru, thank you so much for the surprise and great honour. Feeling very happy.

Bolloju Babaగారు:-
చరిత్రను తవ్వుకుంటూ పోతే అస్థిపంజరాలు తప్ప మరేం మిగలవు.ఏ రాజూ దయాళువు కాదు.అప్పటి పాలనా అవసరాల కోసం ప్రతీ పాలకుడు తన శత్రువులనుకొన్న వారిని ఊచకోత కోయించాడు. చరిత్రనుంచి మనమెలా ఉండకూడదో నేర్చుకోవాలి కానీ పాత బాకీలు తీర్చుకుంటాం అనటం సమంజసం కాదు -- ఇవి బోల్లోజు బాబాగారి వ్యాఖ్యలు.
చరిత్రపట్ల ఇంత నికచ్చి దృక్పథం వుండటం వలన బాబాగారి రచనలతో నేను కనెక్టయ్యాను.
గడచిన మేలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సంధర్భంగా పాండిచ్చేరి గురించి రాస్తు,ఆరాష్ట్రం భౌగోళిఖంగ వివిధ రాష్ట్రాలలో అంటే యానం-ఆంద్రప్రదేశ్,కారకైల్-తమిళనాడు,మాహే-కేరళ తీరాలలో వున్న పాత ఫ్రెంచ్ కాలనీలతో పాండిచ్చేరి ఏర్పడిందని రాసినప్పుడు మిత్రులు ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆయా పాంతాలను సరిహద్దు రాష్ట్రాలలో ఎందుకు కలపలేదు అని అడిగారు.నేను క్లుప్తంగా ఫ్రెంచ్ ప్రభుత్వంతో వున్న ఒప్పందాలు అని సమాధానం చెప్పాను.
బొల్లోజు బాబాగారు యానాం వాసిగా యానం చరిత్రను "ఫెంచ్ పాలనలో యానం" పేరుతో సమగ్రంగా పుస్తకాన్ని రాశారు.చరిత్రను తెలుస్కుంటే అలా సమగ్రంగా తెలుసుకోవాలి.అలా తెలుసుకుంటేనే మన ఆలొచనలు పరిపూర్ణత వైపు ఎదుగుతాయి.ఆసక్తి వున్నవారు బాబాగారి యానం పుస్తకం PDFను ఇక్కడ download చెసుకోండి http://kinige.com/book/French+Palanalo+Yanam.
బొల్లోజు బాబాగారు కేవలం చరిత్రకారులే కాదు గొప్ప కవి.కవిత్వం పుస్తకాలు రాశారు,ఎన్నో అనువాదాలు చేశారు."గాధాసప్తమి" మీద అనేక వ్యసాలు రాశారు.
బాబాగారి కవిత్వంలో సామాజిక సృహ ఎక్కువ..."మేకింగ్ చార్జీలు లేవు" అన్న కవిత one of the best,please see photo for poetry.
బాబాగారు వృతిరీత్య Zoology Lecturer.తన వృత్తి గురించి బాబాగారి మాటలు-శాస్త్రీయ దృక్ఫధం అనేది ఒక అలవాటు.దాన్ని పిల్లలలో పెంపొందించటంలో సైన్స్ టీచర్ల బాధ్యత ఎక్కువ.ఇది ఎంత ఎక్కువగా జరిగితే సమాజంలో అంత ఎక్కువ సామరస్యత నెలకొంటుందని నా విశ్వాసం.
తప్పు అని నిరూపింపబడేదే నిజమైన శాస్త్రం,
హంసలన్నీ తెల్లగా ఉంటాయి అని చేసే ఒక ప్రతిపాదన, ఒక్క నల్ల హంస కనపడగానే వీగిపోతుంది.--wonderful sir.
చివరగా సందేశంలాంటి ఒక రూమి,
ఇది నీ దారి, నీది మాత్రమే
ఈ దారిపై ఇతరులు నీతో కలిసి నడుస్తారు కానీ
ఎవరూ నీకొరకు నడవరు!
బొల్లోజు బాబా సార్,ఫ్రెంచ్ వారి రాకకు ముందు యానం డచ్ కేంద్రం అని నా నమ్మకం.నేను నిరూపించలేను కాబట్టి నమ్మకం అంటున్నాను.కోరమండల్కు యానంకు వున్న సంబంధాలకు ఆధారలు దొరికితే యానం డచ్ వారి పూర్వ కేంద్రం అని నిరూపించవచ్చు.డచ్ వారి వలస కోస్తా తీరంలొ ఉత్తరం నుంచి దక్షిణానికి జరిగింది అనటానికి మాత్రం అధారలు వున్నాయి.

Sunday, December 25, 2016

Yes and No -----Margarita Aligher (Russian Poetess)


నేను మరలా యవ్వనంలోకి వెళ్ళగలిగితే
పదిహేడు ఏళ్ళ వయసూ…. అలా,
ఖచ్చితంగా “కాదు” అని ఉండేదానిని.
ఒకవేళ ఇప్పుడు
నాకు ఇరవై రెండు ఏళ్ల వయసు ఉంటే
సందేహమే లేదు, వెంటనే చెప్పెసే దానిని
“అవును” అని.
ఆ తరువాత జరిగిన సుదీర్ఘ జీవనయానంలో
“అవును” “కాదు” అన్న ఆ రెండు చిన్నమాటలు
ఏనాడూ తగినంత శక్తినివ్వలేదు.
ఏంజరిగిందో చెప్పటానికి
అనుభూతులన్నీ బలహీనంగా ఉన్నాయి.
నన్నేమీ అడగకండి, నేనేమీ మాట్లాడకపోతే
బలవంతం చేయకండి.
స్వేచ్ఛానువాదం : బొల్లోజు బాబా

రెండు దేహాలు Two Bodies by Octavio Paz


ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రేమో ఒక సముద్రం
ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు రాళ్ళు
రాత్రి ఒక ఎడారి
ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రాత్రిలోకి అల్లుకొన్న
రెండు వేర్లు
ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు కత్తులు
రాత్రి మెరుపులు ఝుళిపిస్తూంటుంది
ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఖాళీ ఆకాశంలోకి పడిపోతున్న
రెండు నక్షత్రాలు
ఆక్టావియో పాజ్
Telugu Translation - Bolloju Baba

Thursday, December 15, 2016

new poems 2016

వేడుక

పాపం పసివాడు
లోకం
ఎదురుపడ్డప్పుడల్లా
శోకంతో
కన్నీరు మున్నీరయ్యేవాడు

వాడి బాధ చూడలేక
ఓ దేవత వాడి నేత్రాలపై
బీజాక్షరాలను లిఖించి
కన్నీటి బిందువులు కవిత్వంగా మారే
వరమిచ్చింది

విషయాన్ని పసికట్టినలోకం
మరిన్ని దృశ్యాలను
అతని కళ్ళలోకి వంపి
కవిత్వాన్ని పిండుకొంటోంది
వేడుకగా

అతని కళ్ళలోకి చల్లి
కవిత్వాన్ని పండించుకొంటోంది
వేడుకగా





Night Visit  by Wadih Saadeh- translated from arabic by Anne Fairbairn
 They were telling their children about the guardian angel of plants; about a nightingale that had fown there at dawn to sing in the mulberry tree above their window. They were telling them about the grapes they would sell to buy new clothes. About the special surprise the children would fnd under their pillows at bedtime. But some soldiers arrived, stopped their stories, leaving red splashes on the walls as they departed.

రాత్రి ఆపద  Night Visit  by Wadih Saadeh- translated from arabic by Anne Fairbairn

వాళ్లు తమ పిల్లలతో
మొక్కలను కాపాడే దేవత గురించి
ఉదయాన్నే కిటికీవద్దఉన్న
మల్బరీ చెట్టుపై వాలి
పాటలు పాడే కోయిల గురించి
రేపు ద్రాక్షలు అమ్మి కొనబోతున్న
కొత్తబట్టల గురించి మాట్లాడుకొంటున్నారు.

పిల్లలు నిద్రలేచాకా వారి తలగడల క్రింద
కనుక్కోబోతున్న ప్రత్యేక ఆశ్చర్యాల
గురించి కూడా మాట్లాడుతున్నారు

కానీ కొంతమంది సాయుధులు వచ్చి
వారి కథలను ముగింపచేసి
గోడలపై ఎర్రని మరకలు చిందించి
వెళ్లిపోయారు.

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా



Leaf    -  by Wadih Saadeh- translated from arabic by Anne Fairbairn

They carried him in silence, leaving him in an open place of crosses and gravestones, in a vast, open space with his sleeping friends. He had said, ‘I’ll be back, the key is under a fowerpot.’ A leaf from the fower was still in his hand.

దళం  Leaf by Wadih Saadeh-

వారు అతన్ని మౌనంగా మోసుకొని
అతని స్నేహితులు శయనిస్తున్న
విశాలమైన మైదానంలోకి తీసుకెళ్లారు
అక్కడన్నీ శిలువలూ, సమాధిఫలకాలు

"నేను తిరిగి వస్తాను,  తాళం చెవి
పూల కుండీ క్రింద ఉంది" అన్నాడు అతను
ఆ పువ్వుకి చెందిన ఒక రేక
అతని చేతిలో ఇంకా ఉంది.

translated from arabic by Anne Fairbairn
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా



Absence    by Wadih Saadeh- translated from arabic by Anne Fairbairn
 That day under an oak tree in an open square, only two stone seats were unoccupied. These seats were silent, gazing at each other, weeping.

లేకపోవటం    -  Absence    by Wadih Saadeh

ఆ రోజు పార్కులో
ఒక ఓక్ చెట్టు క్రింద ఉన్న
రెండు రాతికుర్చీలు మాత్రమే
ఖాళీగా ఉన్నాయి

అవి మౌనంగా ఉన్నాయి
ఒకదాన్నొకటి
తేరిపార చూసుకొని
భోరున విలపించాయి

translated from arabic by Anne Fairbairn
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా



A Tree   by Wadih Saadeh

  He took two steps forward to touch a tree he had planted the day before. Blood fowed from his palm into the sap. Leaves in his mind appeared on the branches. When he tried to step backwards, he remained where he was standing. His feet had become roots.

ఒక చెట్టు    A Tree   by Wadih Saadeh

రెండడుగులు ముందుకు వేసి
అతను నిన్నపాతిన మొక్కను తాకాడు

వేలికొసలనుండి అతని రక్తం
మొక్క పసరులోకి ప్రవహించింది

అతని మనసులో ఉన్న పత్రాలు
కొమ్మలపై మొలిచాయి

వెనుతిరుగుదామని ప్రయత్నిస్తే
అతనెక్కడ నిలబడ్డాడో అక్కడే ఉండిపోయాడు
అతని కాళ్ళు వేర్లుగా మారిపోయాయి.

translated from arabic by Anne Fairbairn
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Words       by Wadih Saadeh
Words he had spoken were on the chairs, beds, near cupboards and walls. A maid was brought in to tidy the house, to clean the furniture, dishes and walls. They brought paint and new voices. But they still could hear his words.

పదాలు  Words       by Wadih Saadeh

అతను మాట్లాడిన మాటలు
కుర్చీలపైన, మంచాలమీద,
బీరువాలలో, గోడలపైనా ఉండిపోయాయి.

ఇల్లు సర్దటానికి,
ఫర్నిచర్, గిన్నెలు, గోడలు
శుభ్రం చేయటానికి
ఒక పనిపిల్లను తీసుకువచ్చారు

గోడలకు సున్నం
కొత్తగొంతుకల్నితీసుకొచ్చారు

అయినా అతని పదాలు
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

translated from arabic by Anne Fairbairn
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా



The Companion   by Wadih Saadeh
 He only went outside on sunny days, so that he had a companion – his shadow. He would look at it over his shoulder to talk to it and smile. He would quickly turn his face towards it on the steps, in case it slipped into a house. He would repeat some spicy gossip to prevent it from growing bored and slipping away. At breakfast he would pour two cups of milk; at lunch two plates of food. He would return home at sunset, sit on a stone and weep until sunrise



My Father
Before his face became like a forest, he had cared for thousands of trees. He seemed like the paths he would gaze upon when perched on his ladder. He seemed like the rocks of his house which appeared to be leaning. He was gentle and meek like the grass. He was like the migrating hawks. He said nothing before his face became like a forest. Some trees turned white like snow thawing on the mountain. Some trees spread their roots and bushes emerged from his soil


రెండు దేహాలు   Two Bodies by Octavio Paz

ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రేమో ఒక సముద్రం

ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు రాళ్ళు
రాత్రి ఒక ఎడారి

ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రాత్రిలోకి అల్లుకొన్న 
రెండు వేర్లు

ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఒక్కోసారి రెండు కత్తులు
రాత్రి మెరుపులు ఝుళిపిస్తూంటుంది

ఎదురెదురుగా ఉన్న రెండుదేహాలు
ఖాళీ ఆకాశంలోకి పడిపోతున్న
రెండు నక్షత్రాలు


ఆక్టావియో పాజ్

Wednesday, December 14, 2016

She repeats herself


"ఈ ఫొటోలో ఉన్నది
ఎవరో చెప్పు చూద్దాం" అంటూ
తన ఆరేళ్ళవయసు నాటి 
ఫొటోను చూపుతూఅడిగిందామె
తన మూడేళ్ళ కూతుర్ని
"నేనే కొంచెం పెద్దయ్యాకా"
అందా పాపాయి తడుముకోకుండా

బొల్లోజు బాబా

(Inspired by an anecdote from "Life is like that- readers digest)

Monday, December 12, 2016

“వెలుతురు తెర” తీస్తే స్మృతి చిహ్నాలు, స్వప్న శకలాలు.

ప్రముఖ కవి శ్రీ బొల్లోజు బాబా "వెలుతురు తెర" కవితా సంపుటిపై నా సమీక్ష ఈ నెల 'చినుకు' పత్రికలో ప్రచురితమైంది.
“వెలుతురు తెర” తీస్తే స్మృతి చిహ్నాలు, స్వప్న శకలాలు.
బొల్లోజు బాబా - డిసెక్షన్ టేబుల్ పై జీవిని ప్రదర్శించి అంతర్గతనిర్మాణాన్నిబోధించే అధ్యాపకుడు. అపారదర్శక దేహంలో దాగిన అంతరంగాన్ని అన్వేషించి అందులో అవకాశమున్నంత మేరా ఆహ్లాదాన్ని నింపాలని తపించే సృజనకారుడు. ఈ రెంటికీ మించి వెలుపలా, లోపలా ఒకేలా ఉండగల అద్వైతి. బహుశా, ఈ మూడవ లక్షణమే మొదటి రెండురంగాలలో వారి ప్రభావానికి కారణమని నా అభిప్రాయం.
పదుగురిలో ఉన్నపుడు తానో విద్యావేత్తగానో; సాహిత్యకారునిగానో బయటపడకుండా జాగ్రత్త పడతారు కానీ ఒంటరిగా కూర్చుని కవిత రాసుకుంటున్నపుడు తనలోని “మాష్టారు, మనిషి” అవసరమైనంతగా చొరబడుతుంటే మాత్రం అచేతనంగా అంగీకరిస్తారు. ఈ బలహీనతే వీరి కవిత్వాన్ని మనసు పెట్టి చదివిస్తుంది. మనసుపట్టి కుదిపేస్తుంది.
***
బాబా కవిత్వాన్ని మనం మనలాగే ఉంటూ చదవడం అంత సులభం కాదు. “ఒక సమాంతర కాలంలోకి అనంతంగా ప్రవహిద్దాం వస్తావా!” అని ఆహ్వానిస్తున్నట్లు ఆ పయనం అతనితో సమాంతరం, అనంతం. అంతవరకూ సరే, ఈ ప్రవహించడం ఏమిటి? అప్పటికే హృదయ ద్రవీభవనం జరిగాక మరో మాటెలా అనగలడు కవి?
“ఇంద్ర ధనస్సుని పొరలు పొరలుగా ఒలుచుకొని పంచుకొన్నాయి పూలు” అని ఓ కవితలోనూ, “క్రోటన్ మొక్కలు ఇంద్రధనుస్సుని పగలగొట్టుకొని పంచుకొన్నట్లున్నాయి” అని fragment గానూ రాసి పక్క పక్క పేజీల్లో ప్రచురించడం, కవికి ఇది పునరుక్తి అని తెలియకకాదు. ఒకే సామ్యాన్ని వివిధ సందర్భాలుగా కవిత్వీకరించగల తన అన్వయశక్తిని ప్రకటించడం. ఒకే భావన అక్కడ పొరలు పొరలుగా ఒలవబడి కవితైతే, ఇక్కడ పగిలి లఘురూపాన మెరిసింది.
కొందరి సహవాసంలో జీవితంలో ప్రతిక్షణ౦ నూతనత్వాన్ని అలముకుంటుంది. అవే పరిసరాలు, అవే సంగతులు అయితేనేం? నిన్నటిని రేపు తలచుకుంటున్నపుడు దాచుకోడానికి కొన్ని జ్ఞాపకాలు కనిపిస్తాయి. ఇంతటి వైవిధ్యాన్ని జీవితంలో నింపిన వ్యక్తులు హటాత్తుగా దూరమైతే? అనుక్షణం సంబరంగా గడవాల్సిన జీవితం సాధారణ సన్నివేశ౦గా మారిపోతుంది. అలాంటి ఓ సమయంలో “నీ నిష్క్రమణ తరువాత రోజులన్నీ ఒకేలా ఉన్నాయి, మరోసారి ఏడవటం తప్ప మరేం చేయగలను చిన్నమ్మా!” అంటాడు కవి. “జానెవాలే కభీ నహీ ఆతే, జానెవాలోంకి యాద్ ఆతీ హై” అనే పార్సీకవి వాక్యాన్ని పరిచయంచేస్తారు తన “యాది” లో శ్రీ సామల సదాశివ. అవును, పోయినవారు రాలేరు. కానీ, వారి జ్ఞాపకాలు కళ్ళెదుట కదలాడతాయి, కవితలకు ప్రేరణవుతాయి.
జీవితమంటే ఐకాంతిక వర్తనం కాదు. సామూహిక ఉత్సవం. కవులంతా అంతర్వర్తునులే అని కొన్నిసార్లు కొందరు generalize చేసినా, వినడానికో, విమర్శించడానికో వాళ్ళకీ ఓ నలుగురు కావాలి. అందుకే, “ఎవరూ నడవని దారి కదాని ఉత్సాహంగా ముందుకు పోతుంటే జీవితం నవ్వుతో ఓయ్ పిచ్చి మొద్దూ నేనిక్కడుంటే అటేక్కడికి పోతున్నవ్? అంది వెనుకనుంచి” అని స్వీయానుభవంగా చెప్పుకుంటాడు కవి.
అన్ని నవ్వులూ ఆనందాన్ని పంచవు. అన్ని కన్నీళ్ళు బాధించవు. నవ్వు, ఏడుపు ఈ రెండు మాత్రమే ప్రతిస్పందనకు ఉద్దీపనలుగా సరిపోవేమో. వాటి వెనుక స్థితిగతులే ప్రధాన కారకాలేమో. నిజమేననిపిస్తుంది “ఆ కాన్సర్ పిలగాని నవ్వు కన్నీళ్ళ కన్నా ఎక్కువ బాధిస్తోంది” అనే వాక్యం చదివినపుడు.
‘సమీక్ష’ దృష్టితో చదివేటపుడు, ఓ సంపుటిలోని కవితల అంతస్తత్వాన్నిబట్టి వాటిని వివిధ తరగతులుగా వర్గీకరించి విడి విడిగా పరిశీలించి కవిని అందుకోడానికి ప్రయత్నిస్తాం. “అన్ని నిర్ణయాలు ముందే అయిపోయాయి. ఏదో కాలక్షేపానికి జీవించాలి అంతే”. “ప్రకృతి పొరల్లో ప్రాణాన్ని గింజను చేసి పాతిపెట్టే మృత్యువుంది .. ఎంతదృష్టం?” ఇలాంటి వాక్యాలు ఎదురైనపుడు మాత్రం ఇది వేదాంతమా? జీవితం నేర్పిన రాజీపాఠమా? సంపూర్ణ సంతృప్తి వ్యక్తపరచడమా? - ఇలా పరమార్థం తెలీక సమీక్ష మాట అటుంచి కాసేపు సంబరపడిపోతాం.
“ఇంటికెళ్ళ లేక పోవటం ఒక విషాదం / పెద్ద పులిని నమ్మించలేకపోయిన ఆవుకోసం / లేగదూడ జీవితాంతం అరుస్తూ౦టుంది” ఇక్కడ ‘జీవితాంతం’ అనే పదాన్ని ప్రాధాన్యరహితంగా భావిస్తే కవితలో అనేక అన్వయాలకు ఆస్కారం ఉంటుంది. మరోసారి పై పదాన్ని ఒకింత దృష్టి సారించి పలికితే - పెద్దపులి యముడని, తాను ఆవునని, వెళ్ళకపోవడానికి కారణం మరణమని, ఇంటిదగ్గర ఎదురుచూస్తూన్న వారంతా లేగదూడలని, వారి అరుపులు జ్ఞాపకాలని తెలిసిపోతుంది. ఇంత తెలిసాక, వెంటనే పక్క పేజీలోకెళ్ళి మరో కవిత చదివేస్తే, పాఠకునిగా మనమెక్కడో ఫెయిలవుతున్నట్లు లెక్క.
***
తన అనుభవాల జేబులో ఇప్పటికీ దాచిన యవ్వన దశలోని “గులాబీరేకల గరగరల్ని”;
నాయనమ్మ, అమ్మ, భార్యల మూడు తరాల గృహ నిర్వహణా సామర్థాన్ని;
పరీక్ష పత్రాల్ని దిద్దుతున్నపుడు మెదడుతో తూకం వేస్తూ, హృదయంతో మూల్యాంకన చేస్తూ, ఖాళీ జవాబు పత్రంలో విద్యార్ధిని జీవితం సంధిoచిన ప్రశ్నలను వెతుకగల తన బహుముఖ విన్యాసాన్నీ, ........ పనిగట్టుకుని పెంచాలనో, కావాలని కుదించాలనో తాపత్రయ పడకుండా ప్రతీ అనుభూతినీ, తానో కవితలో అన్నట్లు ‘మట్టిని మోసుకెళ్ళే కందిరీగ’లా శ్రద్ధగాతెచ్చి మన గుండెల్లో గూడు కట్టేసాక, ఆలోచించేందుకు మనకంటూ ఏమీ మిగలవిక - “ జేబుడు పదాలు, గుప్పెడు కలల ముక్కలు తప్ప”. బతుకు ఉత్సవం కావడానికి ఇవి చాలవా?
- అవధానుల మణిబాబు.

‘వెలుతురు తెర ‘ కవి బొల్లోజు బాబా

నా "వెలుతురు తెర" కవిత్వ సంపుటిపై ప్రముఖ కవి, విమర్శకులు, శ్రీ తూముచర్ల రాజారాం గారు చేసిన సమీక్ష కవిసంగమం ఈ క్రిందిలింకులో కలదు.
నా కవిత్వంపై సమగ్రంగా, లోతుగా చేసిన విశ్లేషణకు శ్రీ రాజారాం గారికి సదా కృతజ్ఞుడను. వారు నాపట్ల చూపిన అవ్యాజమైన ప్రేమకు ధన్యవాదములు.
భవదీయుడు
బొల్లోజు బాబా

యానాం లో జరుగబోతున్న కవిత్వోత్సవ సందర్భంలో యానాం కవైనా బొల్లోజు బాబా కోసం
“వెలుతురు తెర మీద ఊహించినదాన్ని దృశ్యమానం చేసే కవి బొల్లోజు బాబా “
ఈ వారం కవితాంతరంగంలో ‘వెలుతురు తెర ‘ కవి బొల్లోజు బాబా
రాజారామ్ .
“ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయియైన లోకాలున్నాయి
ఎంతదృష్టం ! “
గాయాల్ని ఇముడ్చుకునే హృదయం,ఆ హృదయపు గాయాల్ని నయం చేసే కాలపు మలాము,ఆ కాలాన్ని వేటాడే జీవితం ,నిత్యం స్వప్నించే కనులు లేకపోతే ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని దాటడం ఎంత కష్టమో ? – ఈ మాటల్లోని ఏదో తాత్వికత కట్టి పడేసింది నన్ను బాధలన్ని కలగలిపి చుట్టేసినప్పుడు. ఆ సమయంలో బొల్లోజు బాబా పంపిన ఈ ‘వెలుతుర తెర ‘నా కళ్ళ ముందున్న దుఃఖపు తెరను చించేసింది. కవిత్వం ఏం చేయ గలదు అనే వాళ్ళకి నా జవాబు ఏమైనా చేయగలదని.
నేను ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ రాష్ట్ర నాయకత్వంలో వున్నప్పుడు బొల్లొజు బాబా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ .నేను ఆయన ఎరుకలో వున్నానో లేదో తెలీదు కానీ అకడమిక్ వాయిస్ అనే మా సంఘ పత్రిక నడపాలని అనుకున్నప్పుడు ఆయన పేరును తూర్పు గోదావరి జిల్లా సంఘ ప్రతినిధి ఎవరో సూచించినట్టు లీలగా జ్ఞాపకం.
బొల్లోజు బాబా మంచి భావుకుడు.’ ఆకు పచ్చని తడి గీతం ‘ ఈయన మొదటి కవితా సంపుటి. ఎడారి అత్తరుల పరిమళాల్ని ,ఇరవై ప్రేమ కవితల విషాద గీతాల దుఃఖపు తడిని తన అనువాదంతో తెలుగు కవిత్వ ప్రియుల గుండెలకు అద్దిన కవి బొల్లోజు బాబా.
ఈ కవికి తన అనుభవాలను గులాబీ రేకుల్లాంటి పదాల సమూహంతో, ఒకానొక జీవన కాంక్ష తో కవిత్వం చేసే నేర్పుంది. హృదయ వేదిక మీద పేరుకున్న జ్ఞాపకాల శకలాల్ని పేర్చి నెమలీక లాంటి కవిత్వం చేయగల కళ వుంది ఈ కవిలో.
హృదయాన్ని కదిలించి మెదిలించే పాటలు విన్నప్పుడు కలిగిన అనుభూతుల్ని పట్టుకొని కవిత్వంలోకి వొంపిన కవులున్నారు. పాట వింటున్నప్పుడు రసించగల హృదయం ప్రపంచాన్ని మరచిపోతుంది. పాట లోకాన్ని మరపింప చేస్తుంది. ఈ బాబా కూడా ఒక పాట విన్నాడు. ఆ పాట కాలేజ్ లో తన క్లాస్ మేట్ పాడిన పాట. ఆ పాటని ఇట్లా కవిత్వం చేస్తాడు ఈయన.
“మా అందరి కొరికపై ఆమె
కాలేజి గార్డెన్ బెంచీపై బాచీమఠం వేసుకొని
తలపైకెత్తి కనులు మూసుకొని,గొంతు నరాలు ఉబ్బిస్తూ
ఎన్ని పాటలు వొంపిందో ఆ సాయంత్రపు చెవుల్లోకి.
ఆనాటి ఆ సాయంత్రం ఇప్పటికీ
మట్టిని మోసుకెళ్ళే కందిరీగలా నా దేహంలో
అదే పనిగా ఎగురుతూంటుంది గుర్తొచ్చినప్పుడల్లా “
బాచీ మఠం వేసుకోవడం ,తల పైకెత్తడం ,గొంతు నరాలు ఉబ్బించడం ఇవన్నీ ప్రధానంగా శాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళ ఆంగీక హావభావాలు. ఈ కవి ఆ సంగీతపు మూడ్ కి దృశ్యరూపం కల్పిస్తాడు తన వర్ణనతో. ఆ సాయంత్రాన్ని ’ ఇప్పటికి మట్టిని మోసుకెళ్ళే కందీరీగలా నా దేహంలో “ అని ఈ కవి అనడంలో ఆమె పాట తన మనసులోని విషాదభరితమైనవో సంతోష భరితమైనవో ఏవో పాత జ్ఞాపకాలను రేపి కల్లోల్లాన్ని సృష్టిస్తోంది అనే భావానికీ కవితాత్మక వ్యక్తీకరణ చేస్తాడు.
“శ్రావణ శుక్రవారం పూట
చేతికి తోరం చుట్టుకొని పట్టు పరికిణీ కట్టుకొని
సాంబ్రాణి వాసన చిమ్మే కురులతో,మెరిసే కాటుక కళ్ళతో
ఆమె నడచి వచ్చిన అలనాటిఉ ఆ దృశ్యం నేటికీ
జ్ఞాపకాల పేజీల మధ్య దాచుకొన్న
నెమలీక లాంటి చందమామ శకలం.”
ఈ పై మాటల్ని బట్టి ఆ జ్ఞాపకాలు సంతోషభరితమైనవేనని స్ఫుటమవుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమెను కలిశాకా ఈ కవి ఇలా అంటాడు.
“మేం కలుసుకోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు
అనిపిస్తోంది ఈ మధ్య పదే పదే.”
అది ఎందుకో కవి చెప్పడు. చదువరుల ఊహకే వదిలేస్తాడు.బొల్లోజు బాబా కు పదప్రయోగ ఔచిత్యం కూడా బాగా తెలుసు. మాములుగా చేతికి తోరం కట్ట్టుకొని అని అంటుంటారు. కానీ వెంటనే పట్టు పరికీణి కట్టుకొని అని చెప్పాల్సివుంది ఈ కవి. కాబట్టే చేతికి తోరం చుట్టుకొని అన్నాడు.నిజానికి పరికిణి నడుముకు చుట్టుకున్న..పరికిణి కట్టుకున్నారని అంటేనే ఔచిత్యంగా వుంటుంది. కాబట్టే ఈ కవి తోరం చుట్టుకొని , పరికీణీ కట్టుకొని రాశాడు.ఇలా పనికట్టుకొని ఆలోచించి రాస్తారా అని అంటే ..ప్రతిభావంతుడైన కవి కలం నుండి యాధృఛ్ఛికంగానే జాలువారుతుందేమో ?
కవిత్వమనేది ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ అని అంటున్న కవి ఇతను.పైగా ‘యానాం విమోచనోద్యమం, ఫ్రెంచి పాలనలో యానాం అనే చరిత్ర పుస్తకాలు రాసినవాడు కూడా. అందుకేనేమో ‘చరిత్ర ‘ అనే కవితలో ఎవరు చరిత్రలో నిలిచిపోగలరనే ఒకానొక సత్యాన్ని శివారెడ్డి గారన్నట్లు “కాల సందర్భాల్ని వస్తువుగా మార్చి – మూడు బొమ్మల ద్వారా / images ద్వారా వ్యక్త పరచడం “ లో ఆకవితను లోతైన కవిత్వంగా ఈ కవి మలచడమే కాదు ‘కనుల లోతుల్లోకి ఒక దృశ్యం రాలి పగిలి శకలాలై ‘ పొరలు పొరలుగా విడిపోయి అనేక ఆలోచనలతో అన్వయించుకునేట్లుగా చేస్తాడు.
“ ఈ సొరంగం చివర
వెలుతురు ఉండి తీరాలి” – అన్నాడతను
“ఒకప్పుడు ఉండేదట!
చెదలు తినేశాకా వెలుతురంతా
అయుఇపోయింది” అన్నారు కొంతమంది వృద్ధులు ‘
అంటూ మొదలవుతుంది ‘చరిత్ర ‘ – అనే కవిత. ఇది ఒకటో బొమ్మ.వెలుతురును వెతుక్కొంటూ సాగిన ఆ యువకుడు చెదపురుగులకు బలయ్యాడు.బలైపోయిన ఆ యువకున్ని మూర్ఖుడని అయినవాళ్ళే చాలకాలం అతన్ని గురించి గుస గుసలతో చర్చించుకున్నారు. ఇది రెండో బొమ్మ.
“కొన్నేళ్ళ తరువాత
వెలుతురు రాజ్యంలో,నగరం మధ్యలో
ఆ యువకుని విగ్రహం
“వెలుతుర్ని స్వప్నించిన సాహసి”
అనే అక్షరాలతో .”
ఈ పాదాలు మూడో బొమ్మ.ఒకప్పుడు గేలిచేయబడిన వారే రాబోయే కాలంలో చరిత్ర నిర్మాతలవుతారన్న విషయాన్ని ఎంతో సమర్థవంతంగా బొల్లోజు బాబా కవిత్వం చేశాడు. వెలుతుర్ని చెదలు తినడం అంటే నిజాన్ని సత్యాన్ని మింగేయడం. వెలుతురు జ్ఞానానికి ప్రతీక. మూడు ఇమేజెస్ తో ఒక సార్వకాలిక సత్యాన్ని నిలబెట్టాడు కవిత్వంగా. పొరల్ని ఒలుచుకుంటూపోయేకొద్ది ఈ కవిత లోతు తెలుస్తుంది. ముందుండే చీకటి ని చీల్చుకుంటూ చెదల్లాంటి కష్టాలని ఓర్చుకుంటూ అన్వేషణ సాగించిన వారే జ్ఞాన సామ్రాజ్య సామ్రాట్టులవుతారన్న స్పృహ నిస్తాడు.
ప్రకృతికి మానవత్వ ఆరోపణలు చేయడం ద్వారా అనూహ్యమైన సంఘటనలు ఊహించడం ద్వారా కూడా బొల్లోజు బాబా కవిత్వాన్ని సృజించగలడు మధుర పదాల తేనె వానల్ని కురిపించగలడు.’ తపస్సు ‘ అనే కవిత చూడండి.
“చెట్ల ఆకులు
ధ్యాన ముద్రలో ఉన్నాయి
కొలను అలలు కూడా వాటిని
కలచ సాహసించడం లేదు
నీడ పొడలు నిశ్శబ్దంగా
తొంగి చూస్తున్నాయి
పరిమళాల సంచారం
నిలిచిపోయింది ‘
ధ్యానం చేయడం మానవ లక్షణం.దాన్నీ ఈ కవి చెట్ల ఆకులకు ఆపాదించాడు. ధ్యానం చేసే వాళ్ళను భంగ పరచడం మానవ నైజం.ఆ నైజాన్ని కొలను లోని అలలకు ఆరోపిస్తాడు.చివర్లో “ ఆకులు గలగలా నవ్వేశాయి ధ్యానం ఫలించినందుకు” – అని అంటాడు. ఆకులు నవ్వవు. మనిషే నవ్వేది. కానీ నవ్వాయని అందులోను గల గలా నవ్వాయని మానవత్వ లక్షణాన్ని ఆ ఆకులకు ఆపాదించి చిక్కని కవిత్వాన్ని అందించాడు.
జూపాక సుభద్ర గారు ‘ మగ గొట్టాలకు కత్తెర్లేయండి “ అంటూ ఛత్తీస్ ఘడ్ మహిలలపై జరిగిన కుటుంబ నియంత్రణ హత్య కాండకు,స్త్రీల పట్ల చూపే వివక్షకు నిరసనగా ఒక గొప్ప కవిత రాశారు. బొల్లోజు బాబా కూడా ఈ దేశం లో విచ్చల విడిగా జరిగే గర్భ సంచి తొలగింపు ఆపరేషన్స్ ను నిరసిస్తూ “ఒక హిస్టరెక్టమీ “ అనే కవిత రాశాడు. ఈ కవిత చదివితే కారణాలేమయిన కానీ కనపడని గర్భ సంచిని తొలగించిన ఒకానొక వేదన కలుగటమే కాదు ఒక నిట్టుర్పు విడుస్తాం.
“ కారణాలేమయిన కానీ
నెలకో రక్త పుష్పాన్ని
రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకలించారు “
నాగరీకుడైన ఈ వైద్యుని ప్రయోగ శాలలో స్త్రీ దేహమెప్పుడు ఒక గినియా పిగ్గే నని వైద్యంలో కూడా స్త్రీల పట్ల వున్న వివక్షను చెబుతాడు. యానాం తో ఏర్పడ్డ అనుబంధం చాలా గాఢంగా వింత అనుభూతిని వెదజల్లుతూ బొల్లోజు బాబా కవిత్వంలో కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడి ప్రకృతి దానికి ప్రధాన కారణమేమో ?.నిరసన కూడా సుకుమారంగా మార్దవంగా వుంటుంది. తీవ్ర ధ్వనితో వుండదు.
“అప్పుడెప్పుడో సాయంత్రపు నడకలో చెరువు గట్టున
ముద్దులొలికే ఓ స్నేహం పిల్లను చూశాను “
అని అంటున్న ఈ కవి ఆ స్నేహం పిల్ల మట్టి పొరల్ని చీల్చుకొని విప్పారిన పత్రాలతో లోకాన్ని చూసిన వైనాన్ని కవిత్వం చేయడమే కాదు ఆకుల్ని రాల్చుకొని రాల్చుకొని వేళ్ళని పాదుకొని పాదుకొని అది ఎదిగిపోయిన దృశ్యాన్ని అతి తేలిక మాటల్తో దృశ్యమానం చేస్తాడు .ఏదో ఒక రోజున ఈ స్నేహం చెట్టు సైక శిల్పంలా కూలిపోయినా సరే అదే నా జీవితాదర్శం అని స్నేహపు విలువను ప్రతిష్టిస్తాడు.
ఒక సన్నివేశాన్నో సంఘటననో సృష్టించి చాలా భాగం చదివేవాళ్ళ అనుభవానికో ఆలోచనకో వదిలేస్తాడు ఆ తరువాత అంశాల్ని ఈ కవి కొన్ని కవితల్లో. కవిత్వం అనే కవితను చూడండి. ఆమె వచ్చి కూర్చున్న సన్ని వేశాన్ని చెప్పి, జరిగిన సంఘటనని చూపిస్తాడు పదాల్తో. తన నిస్సహాయ చూపుల్ని విడిపించుకొని వెళ్ళిన ఆవిడ గురించి మన ఊహకే వదిలేస్తాడు. ఈ కవిత్వానికి ఈ కవిత్వం ఒక కిరీటం.
ఈ కవి అధ్యాపకుడు కావడం మూలానా కొన్ని వృత్తికి సంబంధించి కూడా కవితలు వచ్చాయి ఆయన సృజనలోంచి. ప్రభుత్వ కళాశాలల్లో చదివేది అత్యధిక శాతం పేదవాళ్ళే. ఏదో ఒక పని చేసుకొంటూ జీవనాన్ని సాగిస్తూ చదువును కొనసాగిస్తుంటారు. ఆ కారణంగా హాజర్ శాతం తక్కువై చాలా మంది వాళ్ళకొచ్చే ఉపకార వేతనం కోల్పోతుంటారు.
ఈ సంఘటనని అధ్యాపకుడైన ఈ కవి “ఎందుకో తెలియటం లేదు లేదు …” అనే శీర్షికతో మమ మనసంతా నుజ్జు నుజ్జు అయ్యేటట్లు కవిత్వం చేశేసాడు. బాబా కవిత్వం చాలా వరకు సంభాషణాత్మకంగా నడుస్తుంది. అందుకు ఈ కవిత కూడా ఒక ఉదాహరణే. అట్లా కవితను నడిపే కవులు తక్కువే వర్తమానంలో.
“అటెండెన్స్ సరిపోలేదని
స్కాలర్ షిప్ నిలుపు చేశేసారు సార్
డబ్బు చాల అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్” అని
అభ్యర్థించిన ఆ కుర్ర వాని కనులే
జ్ఞాపకం వస్తున్నాయి “
చ్చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన ఆ కుర్రాడు దేవును కృప వల్లా అంతో ఇంతో సంపాదిస్తున్నాకదా నువ్వింకా రిక్షా తొక్కడం మానేయమంటే మా నాన్న వినలేదు సార్ – అన్నప్పుడు అధ్యాపకుడైనా ఈ కవి ఇలా అంటాడు.
“క్లాస్ రూమ్స్ లో ఎప్పటికిఒఇ నేర్వలేని పాఠాలవి
ఆ రోజు వాడెంత ముద్దొచ్చాడనీ !”
ఉపాధ్యాయులకీ,అధ్యాపకులకీ వాళ్ళ విధ్యార్థులు ముద్దొచ్చే రోజు ఎప్పుడొస్తుందో . “మూల్యాంకనం” , ‘సమతుల్యత’ మున్నగునవి వృత్తికి సంబంధించిన ప్రవృత్తి ని తెలిపే కవితలే.
“ స్వప్నమునందు నిదురించువారు ధన్యులు..” – అనే కవితలో కవికి కవి అంతరాత్మకు జరిగిన సంఘర్షణ ను బొల్లోజు బాబా కళాత్మక భాష లో భాషాతీతంగా కవిత్వం చేసి దాన్ని సార్వత్రిక సత్యావిష్కరణకి ద్వారం చేస్తాడు.
“నాకూ నా అంతరాత్మకు
ఈ మధ్య అస్సలు పడటం లేదు
నే చేసే పనుల పట్ల
వాడు చాలా కోపంగా ఉంటున్నాడు
అరచి గోల చేస్తున్నాడు
నేనో హరిత పంజరంలో చిక్కుకొన్న
పక్షినని ఎంత చెప్పినా వినడు
“నాతో చెప్పొద్దు,నీ ఇష్టం
వచ్చినట్లు చేసుకో” అంటో
చీదరించుకుంటాడు “
కవిత చివర్లో అంతరాత్మతో కవి మాట్లాడి కళ్ళమ్మట నీరు కార్చుకొన్నాకా ..చాలా సేపు మౌనం తరువాత ఆ అంతరాత్మ “ నువ్వు మాత్రం ఏం చేస్తావులే “- అని గొణుక్కోవడం ఈ పద్యం ఒక సత్యావిష్కరణకీ తెరిచిన ద్వారం.
“గడియారం టిక్కు టిక్కు మంటో దగ్గుతున్నట్లుగా .. ఒక మంచి పోలిక జీవిస్తున్నట్లు చెప్పడానికి.
మనిషి దేన్నో ఒకదాన్ని పెంచుకోవడమే తప్ప అందరితో కలసి పంచుకోవడం నేర్చుకోలేదింకా. ఎప్పటికి నేర్చుకొంటాడో అని ఒక విసురు. ప్రకృతిలో అన్ని ఒకదానితో ఒకటి చక్కగా పంచుకోవడం బొల్లోజు బాబా ఎట్లా కవిత్వం చేశాడో చూడండి.
“వేకువనీ
తలోముక్కా చక్కగా
పంచుకున్నాయి పక్షులు.
కిరణాల్ని
ఏ పేచి లేకుండా పత్రాల సంచుల్తో
పంచుకొన్నాయి తరువులు
ఇంధ్ర ధనువుని
పొరలు పొరలుగా ఒలుచుకొని
పంచుకున్నాయి పూలు
పూలనీ పుప్పొడి గుప్పెళ్ళతో తుమ్మెదలు పంచుకొన్నాయట. రాత్రి హార్మోనియం పై మోహ పరిమళాల రాగాల్ని పలికించినట్లు అనిపించట్లేదూ చదువుతుంటే,..
వెలుతురు తెర అంటే పొరలు పొరలుగా ఒలుచుకొని ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు.అయితే ఈ కవితలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ . చెట్టు నీడలో కూర్చున్న విద్యార్థుల గుంపు వెలుతురు తెరలోకి దూరి వైఫై సముద్రంలో తేలిందని అనడం వల్లా అట్లా అర్థం చేసుకోవచ్చు.ఈనాడు గుంపులో కూడా మనిషి ఒంటరి లా వున్నాడు.కారణం అరచేతిలో ప్రపంచం ఒకటి ఇంటర్నెట్ మరొకటి.అది ఇంట్లో గానీ,వీధిలో గానీ,కాలేజ్ క్యాంపస్ లో కానీ సమూహం నుంచి విడివడిన వాడు మళ్ళీ గుంపులోకి రావాలంటే వైఫై లింక్ తెగిపొవాలంటాడు ఈ కవి. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగిపోయిన విద్యార్థి ని ఇట్లా పోలుస్తాడు ఈ కవి.
“దారాన్ని స్రవించుకొని
కాళతో పేనుకొంటూ తన చుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్థీ తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు “
వైఫై లింక్ తెగిపోతే ఒక్కో విద్యార్థీ మాటల ప్రపంచంలోకి మెల మెల్లగా మేల్కొంటాడు.కానీ ఇప్పుడు ప్రతి కాలేజ్ క్యాంపస్ లో వైఫై ని వుంచి యాజమాన్యాలు రంగు రంగు మాటల చిలుకలు క్యాంపస్ అంతా రెక్కలల్లార్చుకొంటూ తిరక్కుండా చేస్తున్నాయి.
“ ఫ్రాగ్మెంట్స్ “ – అనే శీర్షికతో ఓ మూడు దాకా కవితలున్నాయి. ఫ్రాగ్మెంట్స్ అంటే శకలం లేక ముక్క. పూర్వ కవులు కూడా ‘ముక్తకాలు’ రాశారు . ముక్తకం అంటే పై పద్యంతో కానీ కింది పద్యంతో కానీ అన్వయ సంబంధం లేకుండా వేటికదే ప్రత్యేక అర్థాన్ని కలిగి వుండటం. ఈ ప్రాగ్మెంట్స్ లో కూడా ఒక్కొక్క ప్రాగ్మెంట్ వేటికదే ఒక ప్రత్యేక భావ సంచయంతో వెలిగిపోయాయి. ప్రతి ప్రాగ్మెంట్ కవిత్వపు ఫ్రాగ్రెన్స్ ను వీడకుండా పరిమళుఇంచాయి.మచ్చుకు ఒకటి.
“ జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసి పోయింది
ఆ ముఖం పై ముడుతలన్నీ
దాని పాదముద్రలే “
బొల్లోజు బాబాలో భాషా సౌందర్యం, శబ్ద మాధుర్యం వంటివి పుష్కలంగా వున్నాయి.కవిత్వపు వాసన వేసే పదాల ప్రయోగం వుంది. వెరసీ గాఢమైన కవిత్వం చెప్పగలిగే నేర్పు వుంది. మట్టితో పక్షుల బొమ్మలో ఇంకో బొమ్మలో చేసి వాటిని అమ్మి జీవనం సాగించే వారు వుంటారు. వాళ్ళు ఆ బొమ్మల్ని ఏ చెట్టు నీడనో వీధిలోనో తట్టలోనో బుట్టల్లోనో పెట్టి అమ్ముకోవడం చూసిన ఈ కవి రాసిన మంచి కవిత “ పక్షి ప్రేమికులు “.
“ప్రతి రోజు అతను తట్ట నిండా దయను మోసుకొచ్చి ప్లాట్ ఫార్మ్ పై పేర్చి ఒక మూలగా కూర్చొని దారిన పోయే వాళ్ళ కళ్ళలోకి చూస్తుంటాడు “ – ఈ వాక్యాలు పైన పేర్కొన్న ‘పక్షి ప్రేమికులు ‘ అనే కవిత లోనివి. ఇవి మాములు వచనంలా అనిపించవచ్చు కానీ వచనమై తేలిపోని కవిత్వమవుతుంది ఆ తరువాతి పంక్తులతో.
దయంటే ఏమీ కాదూ
వాని జీవితంలోని కొంత భాగమూ
కొన్ని చెమట చుక్కలు
కాస్తా పల్లెటూరి మట్టి అంతే”
ఇట్లా మాములు వచనాన్ని కూడా కవిత్వం చేయగల శక్తి బొల్లోజు బాబాలో దాగివున్న శిల్ప రహస్యం.
గాయపడ్డ గీతాన్ని తన దేహంలోకి తీసుకొని స్వస్థ పరిచే కవి, ఓ రాత్రిని అనుగ్రహించు ..ఓ రాత్రయినా సందర్భోచితంగా వుంటుందని అనుకుండే వాడు, జేబులోని గులాబి రేకుల గర గరల్ని తడుముకొని తడుముకొని తనేమిటో ఆవిష్కరించుకున్న వాడు బొల్లోజు బాబా.
మధ్యాహ్నపు నిదురలో ఓ స్వప్నం కంటున్నవాడు, కొన్ని పదాల గురించి ఒక జ్ఞాపకం ..ను కవిత్వంగా మార్చిన వాడు, పూల చుంబనాలతో చెట్లు అమరత్వం పొందినట్లు స్వప్నాలతోనే జీవిస్తానని చెప్పేవాడు , అమ్మకై వెచ్చని కన్నీరు ను కవిత్వంగా పేర్చిన వాడు బొల్లోజు బాబా.
అట్లాంటి ఈ కవిని శివారెడ్డి ఇలా అన్నాడు “అతనొక తేనే పిట్ట – తేనే పువ్వుల మీద వాలకుండా గాల్లో తేలుతూ తేనే పీల్చడం ఎంత గొప్ప విద్యో” – ఆ విద్య తెలిసిన వాడు ఈ కవి. అందుకే నేనంటున్నా ఈ కవిని ‘ వర్తమాన రంపం పరా పరా కోస్తున్నా సౌకుమార్యం ఏ మాత్రం కోల్పోకుండా కొలను అలలపై ఏటవాలు కాంతి పుంజంలా తన ఆత్మ కోయిల వినిపించిన పాటను కవిత్వం చేసిన వాడని. వచ్చే వారం కలుద్దాం.