Monday, December 12, 2016

‘వెలుతురు తెర ‘ కవి బొల్లోజు బాబా

నా "వెలుతురు తెర" కవిత్వ సంపుటిపై ప్రముఖ కవి, విమర్శకులు, శ్రీ తూముచర్ల రాజారాం గారు చేసిన సమీక్ష కవిసంగమం ఈ క్రిందిలింకులో కలదు.
నా కవిత్వంపై సమగ్రంగా, లోతుగా చేసిన విశ్లేషణకు శ్రీ రాజారాం గారికి సదా కృతజ్ఞుడను. వారు నాపట్ల చూపిన అవ్యాజమైన ప్రేమకు ధన్యవాదములు.
భవదీయుడు
బొల్లోజు బాబా

యానాం లో జరుగబోతున్న కవిత్వోత్సవ సందర్భంలో యానాం కవైనా బొల్లోజు బాబా కోసం
“వెలుతురు తెర మీద ఊహించినదాన్ని దృశ్యమానం చేసే కవి బొల్లోజు బాబా “
ఈ వారం కవితాంతరంగంలో ‘వెలుతురు తెర ‘ కవి బొల్లోజు బాబా
రాజారామ్ .
“ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయియైన లోకాలున్నాయి
ఎంతదృష్టం ! “
గాయాల్ని ఇముడ్చుకునే హృదయం,ఆ హృదయపు గాయాల్ని నయం చేసే కాలపు మలాము,ఆ కాలాన్ని వేటాడే జీవితం ,నిత్యం స్వప్నించే కనులు లేకపోతే ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని దాటడం ఎంత కష్టమో ? – ఈ మాటల్లోని ఏదో తాత్వికత కట్టి పడేసింది నన్ను బాధలన్ని కలగలిపి చుట్టేసినప్పుడు. ఆ సమయంలో బొల్లోజు బాబా పంపిన ఈ ‘వెలుతుర తెర ‘నా కళ్ళ ముందున్న దుఃఖపు తెరను చించేసింది. కవిత్వం ఏం చేయ గలదు అనే వాళ్ళకి నా జవాబు ఏమైనా చేయగలదని.
నేను ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ రాష్ట్ర నాయకత్వంలో వున్నప్పుడు బొల్లొజు బాబా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ .నేను ఆయన ఎరుకలో వున్నానో లేదో తెలీదు కానీ అకడమిక్ వాయిస్ అనే మా సంఘ పత్రిక నడపాలని అనుకున్నప్పుడు ఆయన పేరును తూర్పు గోదావరి జిల్లా సంఘ ప్రతినిధి ఎవరో సూచించినట్టు లీలగా జ్ఞాపకం.
బొల్లోజు బాబా మంచి భావుకుడు.’ ఆకు పచ్చని తడి గీతం ‘ ఈయన మొదటి కవితా సంపుటి. ఎడారి అత్తరుల పరిమళాల్ని ,ఇరవై ప్రేమ కవితల విషాద గీతాల దుఃఖపు తడిని తన అనువాదంతో తెలుగు కవిత్వ ప్రియుల గుండెలకు అద్దిన కవి బొల్లోజు బాబా.
ఈ కవికి తన అనుభవాలను గులాబీ రేకుల్లాంటి పదాల సమూహంతో, ఒకానొక జీవన కాంక్ష తో కవిత్వం చేసే నేర్పుంది. హృదయ వేదిక మీద పేరుకున్న జ్ఞాపకాల శకలాల్ని పేర్చి నెమలీక లాంటి కవిత్వం చేయగల కళ వుంది ఈ కవిలో.
హృదయాన్ని కదిలించి మెదిలించే పాటలు విన్నప్పుడు కలిగిన అనుభూతుల్ని పట్టుకొని కవిత్వంలోకి వొంపిన కవులున్నారు. పాట వింటున్నప్పుడు రసించగల హృదయం ప్రపంచాన్ని మరచిపోతుంది. పాట లోకాన్ని మరపింప చేస్తుంది. ఈ బాబా కూడా ఒక పాట విన్నాడు. ఆ పాట కాలేజ్ లో తన క్లాస్ మేట్ పాడిన పాట. ఆ పాటని ఇట్లా కవిత్వం చేస్తాడు ఈయన.
“మా అందరి కొరికపై ఆమె
కాలేజి గార్డెన్ బెంచీపై బాచీమఠం వేసుకొని
తలపైకెత్తి కనులు మూసుకొని,గొంతు నరాలు ఉబ్బిస్తూ
ఎన్ని పాటలు వొంపిందో ఆ సాయంత్రపు చెవుల్లోకి.
ఆనాటి ఆ సాయంత్రం ఇప్పటికీ
మట్టిని మోసుకెళ్ళే కందిరీగలా నా దేహంలో
అదే పనిగా ఎగురుతూంటుంది గుర్తొచ్చినప్పుడల్లా “
బాచీ మఠం వేసుకోవడం ,తల పైకెత్తడం ,గొంతు నరాలు ఉబ్బించడం ఇవన్నీ ప్రధానంగా శాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళ ఆంగీక హావభావాలు. ఈ కవి ఆ సంగీతపు మూడ్ కి దృశ్యరూపం కల్పిస్తాడు తన వర్ణనతో. ఆ సాయంత్రాన్ని ’ ఇప్పటికి మట్టిని మోసుకెళ్ళే కందీరీగలా నా దేహంలో “ అని ఈ కవి అనడంలో ఆమె పాట తన మనసులోని విషాదభరితమైనవో సంతోష భరితమైనవో ఏవో పాత జ్ఞాపకాలను రేపి కల్లోల్లాన్ని సృష్టిస్తోంది అనే భావానికీ కవితాత్మక వ్యక్తీకరణ చేస్తాడు.
“శ్రావణ శుక్రవారం పూట
చేతికి తోరం చుట్టుకొని పట్టు పరికిణీ కట్టుకొని
సాంబ్రాణి వాసన చిమ్మే కురులతో,మెరిసే కాటుక కళ్ళతో
ఆమె నడచి వచ్చిన అలనాటిఉ ఆ దృశ్యం నేటికీ
జ్ఞాపకాల పేజీల మధ్య దాచుకొన్న
నెమలీక లాంటి చందమామ శకలం.”
ఈ పై మాటల్ని బట్టి ఆ జ్ఞాపకాలు సంతోషభరితమైనవేనని స్ఫుటమవుతుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమెను కలిశాకా ఈ కవి ఇలా అంటాడు.
“మేం కలుసుకోకుండా ఉంటే ఎంత బాగుణ్ణు
అనిపిస్తోంది ఈ మధ్య పదే పదే.”
అది ఎందుకో కవి చెప్పడు. చదువరుల ఊహకే వదిలేస్తాడు.బొల్లోజు బాబా కు పదప్రయోగ ఔచిత్యం కూడా బాగా తెలుసు. మాములుగా చేతికి తోరం కట్ట్టుకొని అని అంటుంటారు. కానీ వెంటనే పట్టు పరికీణి కట్టుకొని అని చెప్పాల్సివుంది ఈ కవి. కాబట్టే చేతికి తోరం చుట్టుకొని అన్నాడు.నిజానికి పరికిణి నడుముకు చుట్టుకున్న..పరికిణి కట్టుకున్నారని అంటేనే ఔచిత్యంగా వుంటుంది. కాబట్టే ఈ కవి తోరం చుట్టుకొని , పరికీణీ కట్టుకొని రాశాడు.ఇలా పనికట్టుకొని ఆలోచించి రాస్తారా అని అంటే ..ప్రతిభావంతుడైన కవి కలం నుండి యాధృఛ్ఛికంగానే జాలువారుతుందేమో ?
కవిత్వమనేది ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ అని అంటున్న కవి ఇతను.పైగా ‘యానాం విమోచనోద్యమం, ఫ్రెంచి పాలనలో యానాం అనే చరిత్ర పుస్తకాలు రాసినవాడు కూడా. అందుకేనేమో ‘చరిత్ర ‘ అనే కవితలో ఎవరు చరిత్రలో నిలిచిపోగలరనే ఒకానొక సత్యాన్ని శివారెడ్డి గారన్నట్లు “కాల సందర్భాల్ని వస్తువుగా మార్చి – మూడు బొమ్మల ద్వారా / images ద్వారా వ్యక్త పరచడం “ లో ఆకవితను లోతైన కవిత్వంగా ఈ కవి మలచడమే కాదు ‘కనుల లోతుల్లోకి ఒక దృశ్యం రాలి పగిలి శకలాలై ‘ పొరలు పొరలుగా విడిపోయి అనేక ఆలోచనలతో అన్వయించుకునేట్లుగా చేస్తాడు.
“ ఈ సొరంగం చివర
వెలుతురు ఉండి తీరాలి” – అన్నాడతను
“ఒకప్పుడు ఉండేదట!
చెదలు తినేశాకా వెలుతురంతా
అయుఇపోయింది” అన్నారు కొంతమంది వృద్ధులు ‘
అంటూ మొదలవుతుంది ‘చరిత్ర ‘ – అనే కవిత. ఇది ఒకటో బొమ్మ.వెలుతురును వెతుక్కొంటూ సాగిన ఆ యువకుడు చెదపురుగులకు బలయ్యాడు.బలైపోయిన ఆ యువకున్ని మూర్ఖుడని అయినవాళ్ళే చాలకాలం అతన్ని గురించి గుస గుసలతో చర్చించుకున్నారు. ఇది రెండో బొమ్మ.
“కొన్నేళ్ళ తరువాత
వెలుతురు రాజ్యంలో,నగరం మధ్యలో
ఆ యువకుని విగ్రహం
“వెలుతుర్ని స్వప్నించిన సాహసి”
అనే అక్షరాలతో .”
ఈ పాదాలు మూడో బొమ్మ.ఒకప్పుడు గేలిచేయబడిన వారే రాబోయే కాలంలో చరిత్ర నిర్మాతలవుతారన్న విషయాన్ని ఎంతో సమర్థవంతంగా బొల్లోజు బాబా కవిత్వం చేశాడు. వెలుతుర్ని చెదలు తినడం అంటే నిజాన్ని సత్యాన్ని మింగేయడం. వెలుతురు జ్ఞానానికి ప్రతీక. మూడు ఇమేజెస్ తో ఒక సార్వకాలిక సత్యాన్ని నిలబెట్టాడు కవిత్వంగా. పొరల్ని ఒలుచుకుంటూపోయేకొద్ది ఈ కవిత లోతు తెలుస్తుంది. ముందుండే చీకటి ని చీల్చుకుంటూ చెదల్లాంటి కష్టాలని ఓర్చుకుంటూ అన్వేషణ సాగించిన వారే జ్ఞాన సామ్రాజ్య సామ్రాట్టులవుతారన్న స్పృహ నిస్తాడు.
ప్రకృతికి మానవత్వ ఆరోపణలు చేయడం ద్వారా అనూహ్యమైన సంఘటనలు ఊహించడం ద్వారా కూడా బొల్లోజు బాబా కవిత్వాన్ని సృజించగలడు మధుర పదాల తేనె వానల్ని కురిపించగలడు.’ తపస్సు ‘ అనే కవిత చూడండి.
“చెట్ల ఆకులు
ధ్యాన ముద్రలో ఉన్నాయి
కొలను అలలు కూడా వాటిని
కలచ సాహసించడం లేదు
నీడ పొడలు నిశ్శబ్దంగా
తొంగి చూస్తున్నాయి
పరిమళాల సంచారం
నిలిచిపోయింది ‘
ధ్యానం చేయడం మానవ లక్షణం.దాన్నీ ఈ కవి చెట్ల ఆకులకు ఆపాదించాడు. ధ్యానం చేసే వాళ్ళను భంగ పరచడం మానవ నైజం.ఆ నైజాన్ని కొలను లోని అలలకు ఆరోపిస్తాడు.చివర్లో “ ఆకులు గలగలా నవ్వేశాయి ధ్యానం ఫలించినందుకు” – అని అంటాడు. ఆకులు నవ్వవు. మనిషే నవ్వేది. కానీ నవ్వాయని అందులోను గల గలా నవ్వాయని మానవత్వ లక్షణాన్ని ఆ ఆకులకు ఆపాదించి చిక్కని కవిత్వాన్ని అందించాడు.
జూపాక సుభద్ర గారు ‘ మగ గొట్టాలకు కత్తెర్లేయండి “ అంటూ ఛత్తీస్ ఘడ్ మహిలలపై జరిగిన కుటుంబ నియంత్రణ హత్య కాండకు,స్త్రీల పట్ల చూపే వివక్షకు నిరసనగా ఒక గొప్ప కవిత రాశారు. బొల్లోజు బాబా కూడా ఈ దేశం లో విచ్చల విడిగా జరిగే గర్భ సంచి తొలగింపు ఆపరేషన్స్ ను నిరసిస్తూ “ఒక హిస్టరెక్టమీ “ అనే కవిత రాశాడు. ఈ కవిత చదివితే కారణాలేమయిన కానీ కనపడని గర్భ సంచిని తొలగించిన ఒకానొక వేదన కలుగటమే కాదు ఒక నిట్టుర్పు విడుస్తాం.
“ కారణాలేమయిన కానీ
నెలకో రక్త పుష్పాన్ని
రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకలించారు “
నాగరీకుడైన ఈ వైద్యుని ప్రయోగ శాలలో స్త్రీ దేహమెప్పుడు ఒక గినియా పిగ్గే నని వైద్యంలో కూడా స్త్రీల పట్ల వున్న వివక్షను చెబుతాడు. యానాం తో ఏర్పడ్డ అనుబంధం చాలా గాఢంగా వింత అనుభూతిని వెదజల్లుతూ బొల్లోజు బాబా కవిత్వంలో కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడి ప్రకృతి దానికి ప్రధాన కారణమేమో ?.నిరసన కూడా సుకుమారంగా మార్దవంగా వుంటుంది. తీవ్ర ధ్వనితో వుండదు.
“అప్పుడెప్పుడో సాయంత్రపు నడకలో చెరువు గట్టున
ముద్దులొలికే ఓ స్నేహం పిల్లను చూశాను “
అని అంటున్న ఈ కవి ఆ స్నేహం పిల్ల మట్టి పొరల్ని చీల్చుకొని విప్పారిన పత్రాలతో లోకాన్ని చూసిన వైనాన్ని కవిత్వం చేయడమే కాదు ఆకుల్ని రాల్చుకొని రాల్చుకొని వేళ్ళని పాదుకొని పాదుకొని అది ఎదిగిపోయిన దృశ్యాన్ని అతి తేలిక మాటల్తో దృశ్యమానం చేస్తాడు .ఏదో ఒక రోజున ఈ స్నేహం చెట్టు సైక శిల్పంలా కూలిపోయినా సరే అదే నా జీవితాదర్శం అని స్నేహపు విలువను ప్రతిష్టిస్తాడు.
ఒక సన్నివేశాన్నో సంఘటననో సృష్టించి చాలా భాగం చదివేవాళ్ళ అనుభవానికో ఆలోచనకో వదిలేస్తాడు ఆ తరువాత అంశాల్ని ఈ కవి కొన్ని కవితల్లో. కవిత్వం అనే కవితను చూడండి. ఆమె వచ్చి కూర్చున్న సన్ని వేశాన్ని చెప్పి, జరిగిన సంఘటనని చూపిస్తాడు పదాల్తో. తన నిస్సహాయ చూపుల్ని విడిపించుకొని వెళ్ళిన ఆవిడ గురించి మన ఊహకే వదిలేస్తాడు. ఈ కవిత్వానికి ఈ కవిత్వం ఒక కిరీటం.
ఈ కవి అధ్యాపకుడు కావడం మూలానా కొన్ని వృత్తికి సంబంధించి కూడా కవితలు వచ్చాయి ఆయన సృజనలోంచి. ప్రభుత్వ కళాశాలల్లో చదివేది అత్యధిక శాతం పేదవాళ్ళే. ఏదో ఒక పని చేసుకొంటూ జీవనాన్ని సాగిస్తూ చదువును కొనసాగిస్తుంటారు. ఆ కారణంగా హాజర్ శాతం తక్కువై చాలా మంది వాళ్ళకొచ్చే ఉపకార వేతనం కోల్పోతుంటారు.
ఈ సంఘటనని అధ్యాపకుడైన ఈ కవి “ఎందుకో తెలియటం లేదు లేదు …” అనే శీర్షికతో మమ మనసంతా నుజ్జు నుజ్జు అయ్యేటట్లు కవిత్వం చేశేసాడు. బాబా కవిత్వం చాలా వరకు సంభాషణాత్మకంగా నడుస్తుంది. అందుకు ఈ కవిత కూడా ఒక ఉదాహరణే. అట్లా కవితను నడిపే కవులు తక్కువే వర్తమానంలో.
“అటెండెన్స్ సరిపోలేదని
స్కాలర్ షిప్ నిలుపు చేశేసారు సార్
డబ్బు చాల అవసరం హెల్ప్ చేసి పెట్టండి సార్” అని
అభ్యర్థించిన ఆ కుర్ర వాని కనులే
జ్ఞాపకం వస్తున్నాయి “
చ్చాన్నాళ్ళ తరువాత ఆటో నడుపుతూ కనిపించిన ఆ కుర్రాడు దేవును కృప వల్లా అంతో ఇంతో సంపాదిస్తున్నాకదా నువ్వింకా రిక్షా తొక్కడం మానేయమంటే మా నాన్న వినలేదు సార్ – అన్నప్పుడు అధ్యాపకుడైనా ఈ కవి ఇలా అంటాడు.
“క్లాస్ రూమ్స్ లో ఎప్పటికిఒఇ నేర్వలేని పాఠాలవి
ఆ రోజు వాడెంత ముద్దొచ్చాడనీ !”
ఉపాధ్యాయులకీ,అధ్యాపకులకీ వాళ్ళ విధ్యార్థులు ముద్దొచ్చే రోజు ఎప్పుడొస్తుందో . “మూల్యాంకనం” , ‘సమతుల్యత’ మున్నగునవి వృత్తికి సంబంధించిన ప్రవృత్తి ని తెలిపే కవితలే.
“ స్వప్నమునందు నిదురించువారు ధన్యులు..” – అనే కవితలో కవికి కవి అంతరాత్మకు జరిగిన సంఘర్షణ ను బొల్లోజు బాబా కళాత్మక భాష లో భాషాతీతంగా కవిత్వం చేసి దాన్ని సార్వత్రిక సత్యావిష్కరణకి ద్వారం చేస్తాడు.
“నాకూ నా అంతరాత్మకు
ఈ మధ్య అస్సలు పడటం లేదు
నే చేసే పనుల పట్ల
వాడు చాలా కోపంగా ఉంటున్నాడు
అరచి గోల చేస్తున్నాడు
నేనో హరిత పంజరంలో చిక్కుకొన్న
పక్షినని ఎంత చెప్పినా వినడు
“నాతో చెప్పొద్దు,నీ ఇష్టం
వచ్చినట్లు చేసుకో” అంటో
చీదరించుకుంటాడు “
కవిత చివర్లో అంతరాత్మతో కవి మాట్లాడి కళ్ళమ్మట నీరు కార్చుకొన్నాకా ..చాలా సేపు మౌనం తరువాత ఆ అంతరాత్మ “ నువ్వు మాత్రం ఏం చేస్తావులే “- అని గొణుక్కోవడం ఈ పద్యం ఒక సత్యావిష్కరణకీ తెరిచిన ద్వారం.
“గడియారం టిక్కు టిక్కు మంటో దగ్గుతున్నట్లుగా .. ఒక మంచి పోలిక జీవిస్తున్నట్లు చెప్పడానికి.
మనిషి దేన్నో ఒకదాన్ని పెంచుకోవడమే తప్ప అందరితో కలసి పంచుకోవడం నేర్చుకోలేదింకా. ఎప్పటికి నేర్చుకొంటాడో అని ఒక విసురు. ప్రకృతిలో అన్ని ఒకదానితో ఒకటి చక్కగా పంచుకోవడం బొల్లోజు బాబా ఎట్లా కవిత్వం చేశాడో చూడండి.
“వేకువనీ
తలోముక్కా చక్కగా
పంచుకున్నాయి పక్షులు.
కిరణాల్ని
ఏ పేచి లేకుండా పత్రాల సంచుల్తో
పంచుకొన్నాయి తరువులు
ఇంధ్ర ధనువుని
పొరలు పొరలుగా ఒలుచుకొని
పంచుకున్నాయి పూలు
పూలనీ పుప్పొడి గుప్పెళ్ళతో తుమ్మెదలు పంచుకొన్నాయట. రాత్రి హార్మోనియం పై మోహ పరిమళాల రాగాల్ని పలికించినట్లు అనిపించట్లేదూ చదువుతుంటే,..
వెలుతురు తెర అంటే పొరలు పొరలుగా ఒలుచుకొని ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు.అయితే ఈ కవితలో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ . చెట్టు నీడలో కూర్చున్న విద్యార్థుల గుంపు వెలుతురు తెరలోకి దూరి వైఫై సముద్రంలో తేలిందని అనడం వల్లా అట్లా అర్థం చేసుకోవచ్చు.ఈనాడు గుంపులో కూడా మనిషి ఒంటరి లా వున్నాడు.కారణం అరచేతిలో ప్రపంచం ఒకటి ఇంటర్నెట్ మరొకటి.అది ఇంట్లో గానీ,వీధిలో గానీ,కాలేజ్ క్యాంపస్ లో కానీ సమూహం నుంచి విడివడిన వాడు మళ్ళీ గుంపులోకి రావాలంటే వైఫై లింక్ తెగిపొవాలంటాడు ఈ కవి. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగిపోయిన విద్యార్థి ని ఇట్లా పోలుస్తాడు ఈ కవి.
“దారాన్ని స్రవించుకొని
కాళతో పేనుకొంటూ తన చుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్థీ తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు “
వైఫై లింక్ తెగిపోతే ఒక్కో విద్యార్థీ మాటల ప్రపంచంలోకి మెల మెల్లగా మేల్కొంటాడు.కానీ ఇప్పుడు ప్రతి కాలేజ్ క్యాంపస్ లో వైఫై ని వుంచి యాజమాన్యాలు రంగు రంగు మాటల చిలుకలు క్యాంపస్ అంతా రెక్కలల్లార్చుకొంటూ తిరక్కుండా చేస్తున్నాయి.
“ ఫ్రాగ్మెంట్స్ “ – అనే శీర్షికతో ఓ మూడు దాకా కవితలున్నాయి. ఫ్రాగ్మెంట్స్ అంటే శకలం లేక ముక్క. పూర్వ కవులు కూడా ‘ముక్తకాలు’ రాశారు . ముక్తకం అంటే పై పద్యంతో కానీ కింది పద్యంతో కానీ అన్వయ సంబంధం లేకుండా వేటికదే ప్రత్యేక అర్థాన్ని కలిగి వుండటం. ఈ ప్రాగ్మెంట్స్ లో కూడా ఒక్కొక్క ప్రాగ్మెంట్ వేటికదే ఒక ప్రత్యేక భావ సంచయంతో వెలిగిపోయాయి. ప్రతి ప్రాగ్మెంట్ కవిత్వపు ఫ్రాగ్రెన్స్ ను వీడకుండా పరిమళుఇంచాయి.మచ్చుకు ఒకటి.
“ జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసి పోయింది
ఆ ముఖం పై ముడుతలన్నీ
దాని పాదముద్రలే “
బొల్లోజు బాబాలో భాషా సౌందర్యం, శబ్ద మాధుర్యం వంటివి పుష్కలంగా వున్నాయి.కవిత్వపు వాసన వేసే పదాల ప్రయోగం వుంది. వెరసీ గాఢమైన కవిత్వం చెప్పగలిగే నేర్పు వుంది. మట్టితో పక్షుల బొమ్మలో ఇంకో బొమ్మలో చేసి వాటిని అమ్మి జీవనం సాగించే వారు వుంటారు. వాళ్ళు ఆ బొమ్మల్ని ఏ చెట్టు నీడనో వీధిలోనో తట్టలోనో బుట్టల్లోనో పెట్టి అమ్ముకోవడం చూసిన ఈ కవి రాసిన మంచి కవిత “ పక్షి ప్రేమికులు “.
“ప్రతి రోజు అతను తట్ట నిండా దయను మోసుకొచ్చి ప్లాట్ ఫార్మ్ పై పేర్చి ఒక మూలగా కూర్చొని దారిన పోయే వాళ్ళ కళ్ళలోకి చూస్తుంటాడు “ – ఈ వాక్యాలు పైన పేర్కొన్న ‘పక్షి ప్రేమికులు ‘ అనే కవిత లోనివి. ఇవి మాములు వచనంలా అనిపించవచ్చు కానీ వచనమై తేలిపోని కవిత్వమవుతుంది ఆ తరువాతి పంక్తులతో.
దయంటే ఏమీ కాదూ
వాని జీవితంలోని కొంత భాగమూ
కొన్ని చెమట చుక్కలు
కాస్తా పల్లెటూరి మట్టి అంతే”
ఇట్లా మాములు వచనాన్ని కూడా కవిత్వం చేయగల శక్తి బొల్లోజు బాబాలో దాగివున్న శిల్ప రహస్యం.
గాయపడ్డ గీతాన్ని తన దేహంలోకి తీసుకొని స్వస్థ పరిచే కవి, ఓ రాత్రిని అనుగ్రహించు ..ఓ రాత్రయినా సందర్భోచితంగా వుంటుందని అనుకుండే వాడు, జేబులోని గులాబి రేకుల గర గరల్ని తడుముకొని తడుముకొని తనేమిటో ఆవిష్కరించుకున్న వాడు బొల్లోజు బాబా.
మధ్యాహ్నపు నిదురలో ఓ స్వప్నం కంటున్నవాడు, కొన్ని పదాల గురించి ఒక జ్ఞాపకం ..ను కవిత్వంగా మార్చిన వాడు, పూల చుంబనాలతో చెట్లు అమరత్వం పొందినట్లు స్వప్నాలతోనే జీవిస్తానని చెప్పేవాడు , అమ్మకై వెచ్చని కన్నీరు ను కవిత్వంగా పేర్చిన వాడు బొల్లోజు బాబా.
అట్లాంటి ఈ కవిని శివారెడ్డి ఇలా అన్నాడు “అతనొక తేనే పిట్ట – తేనే పువ్వుల మీద వాలకుండా గాల్లో తేలుతూ తేనే పీల్చడం ఎంత గొప్ప విద్యో” – ఆ విద్య తెలిసిన వాడు ఈ కవి. అందుకే నేనంటున్నా ఈ కవిని ‘ వర్తమాన రంపం పరా పరా కోస్తున్నా సౌకుమార్యం ఏ మాత్రం కోల్పోకుండా కొలను అలలపై ఏటవాలు కాంతి పుంజంలా తన ఆత్మ కోయిల వినిపించిన పాటను కవిత్వం చేసిన వాడని. వచ్చే వారం కలుద్దాం.

No comments:

Post a Comment