Monday, December 12, 2016

“వెలుతురు తెర” తీస్తే స్మృతి చిహ్నాలు, స్వప్న శకలాలు.

ప్రముఖ కవి శ్రీ బొల్లోజు బాబా "వెలుతురు తెర" కవితా సంపుటిపై నా సమీక్ష ఈ నెల 'చినుకు' పత్రికలో ప్రచురితమైంది.
“వెలుతురు తెర” తీస్తే స్మృతి చిహ్నాలు, స్వప్న శకలాలు.
బొల్లోజు బాబా - డిసెక్షన్ టేబుల్ పై జీవిని ప్రదర్శించి అంతర్గతనిర్మాణాన్నిబోధించే అధ్యాపకుడు. అపారదర్శక దేహంలో దాగిన అంతరంగాన్ని అన్వేషించి అందులో అవకాశమున్నంత మేరా ఆహ్లాదాన్ని నింపాలని తపించే సృజనకారుడు. ఈ రెంటికీ మించి వెలుపలా, లోపలా ఒకేలా ఉండగల అద్వైతి. బహుశా, ఈ మూడవ లక్షణమే మొదటి రెండురంగాలలో వారి ప్రభావానికి కారణమని నా అభిప్రాయం.
పదుగురిలో ఉన్నపుడు తానో విద్యావేత్తగానో; సాహిత్యకారునిగానో బయటపడకుండా జాగ్రత్త పడతారు కానీ ఒంటరిగా కూర్చుని కవిత రాసుకుంటున్నపుడు తనలోని “మాష్టారు, మనిషి” అవసరమైనంతగా చొరబడుతుంటే మాత్రం అచేతనంగా అంగీకరిస్తారు. ఈ బలహీనతే వీరి కవిత్వాన్ని మనసు పెట్టి చదివిస్తుంది. మనసుపట్టి కుదిపేస్తుంది.
***
బాబా కవిత్వాన్ని మనం మనలాగే ఉంటూ చదవడం అంత సులభం కాదు. “ఒక సమాంతర కాలంలోకి అనంతంగా ప్రవహిద్దాం వస్తావా!” అని ఆహ్వానిస్తున్నట్లు ఆ పయనం అతనితో సమాంతరం, అనంతం. అంతవరకూ సరే, ఈ ప్రవహించడం ఏమిటి? అప్పటికే హృదయ ద్రవీభవనం జరిగాక మరో మాటెలా అనగలడు కవి?
“ఇంద్ర ధనస్సుని పొరలు పొరలుగా ఒలుచుకొని పంచుకొన్నాయి పూలు” అని ఓ కవితలోనూ, “క్రోటన్ మొక్కలు ఇంద్రధనుస్సుని పగలగొట్టుకొని పంచుకొన్నట్లున్నాయి” అని fragment గానూ రాసి పక్క పక్క పేజీల్లో ప్రచురించడం, కవికి ఇది పునరుక్తి అని తెలియకకాదు. ఒకే సామ్యాన్ని వివిధ సందర్భాలుగా కవిత్వీకరించగల తన అన్వయశక్తిని ప్రకటించడం. ఒకే భావన అక్కడ పొరలు పొరలుగా ఒలవబడి కవితైతే, ఇక్కడ పగిలి లఘురూపాన మెరిసింది.
కొందరి సహవాసంలో జీవితంలో ప్రతిక్షణ౦ నూతనత్వాన్ని అలముకుంటుంది. అవే పరిసరాలు, అవే సంగతులు అయితేనేం? నిన్నటిని రేపు తలచుకుంటున్నపుడు దాచుకోడానికి కొన్ని జ్ఞాపకాలు కనిపిస్తాయి. ఇంతటి వైవిధ్యాన్ని జీవితంలో నింపిన వ్యక్తులు హటాత్తుగా దూరమైతే? అనుక్షణం సంబరంగా గడవాల్సిన జీవితం సాధారణ సన్నివేశ౦గా మారిపోతుంది. అలాంటి ఓ సమయంలో “నీ నిష్క్రమణ తరువాత రోజులన్నీ ఒకేలా ఉన్నాయి, మరోసారి ఏడవటం తప్ప మరేం చేయగలను చిన్నమ్మా!” అంటాడు కవి. “జానెవాలే కభీ నహీ ఆతే, జానెవాలోంకి యాద్ ఆతీ హై” అనే పార్సీకవి వాక్యాన్ని పరిచయంచేస్తారు తన “యాది” లో శ్రీ సామల సదాశివ. అవును, పోయినవారు రాలేరు. కానీ, వారి జ్ఞాపకాలు కళ్ళెదుట కదలాడతాయి, కవితలకు ప్రేరణవుతాయి.
జీవితమంటే ఐకాంతిక వర్తనం కాదు. సామూహిక ఉత్సవం. కవులంతా అంతర్వర్తునులే అని కొన్నిసార్లు కొందరు generalize చేసినా, వినడానికో, విమర్శించడానికో వాళ్ళకీ ఓ నలుగురు కావాలి. అందుకే, “ఎవరూ నడవని దారి కదాని ఉత్సాహంగా ముందుకు పోతుంటే జీవితం నవ్వుతో ఓయ్ పిచ్చి మొద్దూ నేనిక్కడుంటే అటేక్కడికి పోతున్నవ్? అంది వెనుకనుంచి” అని స్వీయానుభవంగా చెప్పుకుంటాడు కవి.
అన్ని నవ్వులూ ఆనందాన్ని పంచవు. అన్ని కన్నీళ్ళు బాధించవు. నవ్వు, ఏడుపు ఈ రెండు మాత్రమే ప్రతిస్పందనకు ఉద్దీపనలుగా సరిపోవేమో. వాటి వెనుక స్థితిగతులే ప్రధాన కారకాలేమో. నిజమేననిపిస్తుంది “ఆ కాన్సర్ పిలగాని నవ్వు కన్నీళ్ళ కన్నా ఎక్కువ బాధిస్తోంది” అనే వాక్యం చదివినపుడు.
‘సమీక్ష’ దృష్టితో చదివేటపుడు, ఓ సంపుటిలోని కవితల అంతస్తత్వాన్నిబట్టి వాటిని వివిధ తరగతులుగా వర్గీకరించి విడి విడిగా పరిశీలించి కవిని అందుకోడానికి ప్రయత్నిస్తాం. “అన్ని నిర్ణయాలు ముందే అయిపోయాయి. ఏదో కాలక్షేపానికి జీవించాలి అంతే”. “ప్రకృతి పొరల్లో ప్రాణాన్ని గింజను చేసి పాతిపెట్టే మృత్యువుంది .. ఎంతదృష్టం?” ఇలాంటి వాక్యాలు ఎదురైనపుడు మాత్రం ఇది వేదాంతమా? జీవితం నేర్పిన రాజీపాఠమా? సంపూర్ణ సంతృప్తి వ్యక్తపరచడమా? - ఇలా పరమార్థం తెలీక సమీక్ష మాట అటుంచి కాసేపు సంబరపడిపోతాం.
“ఇంటికెళ్ళ లేక పోవటం ఒక విషాదం / పెద్ద పులిని నమ్మించలేకపోయిన ఆవుకోసం / లేగదూడ జీవితాంతం అరుస్తూ౦టుంది” ఇక్కడ ‘జీవితాంతం’ అనే పదాన్ని ప్రాధాన్యరహితంగా భావిస్తే కవితలో అనేక అన్వయాలకు ఆస్కారం ఉంటుంది. మరోసారి పై పదాన్ని ఒకింత దృష్టి సారించి పలికితే - పెద్దపులి యముడని, తాను ఆవునని, వెళ్ళకపోవడానికి కారణం మరణమని, ఇంటిదగ్గర ఎదురుచూస్తూన్న వారంతా లేగదూడలని, వారి అరుపులు జ్ఞాపకాలని తెలిసిపోతుంది. ఇంత తెలిసాక, వెంటనే పక్క పేజీలోకెళ్ళి మరో కవిత చదివేస్తే, పాఠకునిగా మనమెక్కడో ఫెయిలవుతున్నట్లు లెక్క.
***
తన అనుభవాల జేబులో ఇప్పటికీ దాచిన యవ్వన దశలోని “గులాబీరేకల గరగరల్ని”;
నాయనమ్మ, అమ్మ, భార్యల మూడు తరాల గృహ నిర్వహణా సామర్థాన్ని;
పరీక్ష పత్రాల్ని దిద్దుతున్నపుడు మెదడుతో తూకం వేస్తూ, హృదయంతో మూల్యాంకన చేస్తూ, ఖాళీ జవాబు పత్రంలో విద్యార్ధిని జీవితం సంధిoచిన ప్రశ్నలను వెతుకగల తన బహుముఖ విన్యాసాన్నీ, ........ పనిగట్టుకుని పెంచాలనో, కావాలని కుదించాలనో తాపత్రయ పడకుండా ప్రతీ అనుభూతినీ, తానో కవితలో అన్నట్లు ‘మట్టిని మోసుకెళ్ళే కందిరీగ’లా శ్రద్ధగాతెచ్చి మన గుండెల్లో గూడు కట్టేసాక, ఆలోచించేందుకు మనకంటూ ఏమీ మిగలవిక - “ జేబుడు పదాలు, గుప్పెడు కలల ముక్కలు తప్ప”. బతుకు ఉత్సవం కావడానికి ఇవి చాలవా?
- అవధానుల మణిబాబు.

No comments:

Post a Comment