Monday, August 31, 2020

Imported post: Facebook Post: 2020-08-31T20:47:17

"On Making Tea" by Rohith ఇస్మాయిల్ గారు ఓ కవితలో తేనీరు సమయంగురించి చెపుతారు. ఒక మామూలు అనుభవాన్ని కవిత్వంలోకి తెచ్చేపద్దతికి అదొక చక్కని ఉదాహరణ. చాన్నాళ్లకు మరలా టీ గురించి చదివిన గొప్ప కవిత ఇది. Rohith అచ్చమైన తెలుగబ్బాయి.... ఇంగ్లీషులో కవిత్వం రాస్తారు. పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురింపబడ్డాయి ఇతని కవితలు. వొలుచుకొన్న కొలదీ పొరలు పొరలుగా విచ్చుకొంటూ చివరకు వచ్చేసరికి ఒక గాఢ జీవనపరిమళంమేదో గుండెల్ని కుదిపేస్తుంది. Life goes on for every one. For a poet it is like a rebirth at each move. This poem captures such moment brilliantly. *** టీ కాచుకోవటం గురించి - "On Making Tea" by Rohith మొదట్లో మా నాయినమ్మ టీ తో నన్ను నిద్రలేపేది అది ప్రతీసారి ఒకే రుచిని కలిగి ఉండేది తూకమేసినట్లు తియ్యదనం పాలు. ఒకరోజు, ఆమె గతించాక ఈ ప్రపంచంతో అంగీకారానికి వచ్చేక్రమంలో దుఃఖం టీ రుచిలా అనిపించేది: ఆ రుచిని మరచిపోదామని ప్రయత్నించేవాడిని కానీ టీ తాగిన ప్రతీసారి- ఒక పరాయితనాన్ని రుచి చూస్తున్నట్లు ఉండేది, అది నేరుగా నన్ను మా నాయినమ్మ వద్దకు తీసుకొనిపోయేది. ఆ పరాయితనం నాలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది అది నాకొక కొత్త చర్మాన్ని ఇచ్చింది. వేరే పొర. మెల్లమెల్లగా నేను టీ తయారుచేసుకోవటం నేర్చుకొన్నాను. ఖచ్చితమైన పాళ్లలో... నా సొంత టీ. Source: On Making Tea by Rohith అనువాదం: బొల్లోజు బాబా

Saturday, August 29, 2020

లార్డ్ కన్నెమెరా కాకినాడ సందర్శనం - 1889

 లార్డ్ కన్నెమెరా కాకినాడ సందర్శనం - 1889

.
రాబర్ట్ బర్క్ 1882 నుంచి 1890 వరకు మద్రాసు గవర్నరుగా పనిచేసాడు. ఇతను ఐర్లాండు లోని కన్నెమెరా అనే ప్రాంతానికి బారన్ (జమిందారు). ఇతనిని లార్డ్ ఆఫ్ కన్నెమెరా అని పిలిచేవారు. ఇతని పేరుమీదనే మద్రాసులోని కన్నెమెరా లైబ్రేరి నెలకొల్పబడింది. మద్రాసు నుంచి కలకత్తాకు రైల్వేలైను ఇతని హయాంలోనే పొడిగింపబడింది.

లార్డ్ కన్నెమెరా కు ప్రయాణాలంటే ఇష్టం. మద్రాసు గవర్నరుగా పనిచేసిన కాలంలో మద్రాసు ప్రొవిన్స్ అంతటా విస్తృతంగా ప్రయాణాలు చేసాడు. ఇతని సెక్రటరీ జె.డి రీస్ ఆ ప్రయాణాలను ఆద్యంతం ఆసక్తికరమైన ట్రావెలాగ్స్ గా రచించాడు. లార్డ్ కన్నెమెరా 19 డిసంబరు 1889 న మద్రాసులో Sirsa అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసాడు. ఆ వివరాలు JD Rees వ్రాసిన Narratives of Tours in India అనే పుస్తకంలో ఇలా ఉన్నాయి...
@@@
మద్రాసులో పోలీసుల గౌరవవందనం స్వీకరించాకా ఉదయాన్నే Sirsa ఓడలో గవర్నరు గారు మేము బయలుదేరాం. ఒక పగలూ ఒక రాత్రీ ప్రయాణించాక 20 డిసంబరున మచిలీపట్నం చేరుకొన్నాం. ముప్పైవేలమంది ప్రజల మరణాలకు, పదిహేనుమైళ్ళ వరకూ తీరాన్ని ముంచెత్తిన ఉప్పెనకు కారణమైన 1864 నాటి తుఫాను కలిగించిన విధ్వంసపు ఆనవాళ్ళు ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి జింకలు, బాతులు King Charles కు కానుకగా తీసుకెళ్ళేవారు ఆనాటి వర్తకులు. "King Charles బాతులకు ఆహారం అందిస్తూ ఆనందంగా గడిపిన రోజులు" అనే పేరుగల పెయింటింగ్ నేడు బ్రిటన్ అంతా చాలా ప్రఖ్యాతి గడించింది. ఆ చిత్రంలోని బాతులు మచిలీపట్నం నుంచి తీసుకెళ్ళబడి ఉండవచ్చు.

మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పదిమైళ్ళ దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాం. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరంనుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాల రంగురంగుల జండాలు ఎగురుతూన్నాయి.

కలక్టర్ Mr. Power వచ్చి ఓడలో గవర్నరుగారిని కలిసాడు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము. ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట వలన కాకినాడలో వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 1862 లో కాకినాడలో 3 లక్షల రూపాయిలు విలువచేసే ఎగుమతులు దిగుమతులు జరిగేవి. 1872 నాటికి అవి ఏడు లక్షల నలభైవేలు, 1888 నాటికి పదిహేను లక్షలకు పెరిగాయి. విజయవాడ నుండి కాకినాడ వరకూ విస్తరించనున్న ఈస్ట్ కోస్ట్ రైలు మార్గం ఈ వ్యాణిజ్యానికి మరింత దోహదం చేయవచ్చు.

మేము రేవు దిగగానే జరీ దుస్తులు ధరించిన జమిందార్లు, ఇంగ్లీషు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, రంగురంగు తలపాగాలు చుట్టుకొన్న సామాన్య జనం మాకు స్వాగతం పలికారు. గవర్నరు గారు నేలపై కాలుమోపగానే పదిమంది పండితులు సంస్కృత శ్లోకాలు చదువుతూ ఆహ్వానించారు. వచ్చిన పెద్దలందరూ ఈస్ట్ కోస్ట్ రైల్వేలైను ను ఈ ప్రాంతానికి ప్రభుత్వము వారిచేత ఆమోదింప చేయించినందుకు గవర్నరుగారికి అనేక ధన్యవాదాలు తెలుపగా దానికి గవర్నరుగారు స్పందిస్తూ రైల్వే లైను రావటం వలన ఈ ప్రాంత అభివృద్ది జరుగుతుందని; కాలువల రవాణకు కేమీ నష్టం జరగదనీ; గోదావరి జిల్లా, గంజాం, విశాఖపట్టణాలకు రైలు మార్గం లేని లోటు దీనితో తీరబోతున్నదని; ప్రస్తుతం బెజవాడనుంచి సామర్లకోట వరకూ రైల్వేలైను నిర్మాణం జరుగుతున్నదని దీనిని ముందుముందు కటక్ వరకూ విస్తరింపచేయనున్నామని అన్నారు.

కాకినాడ నగరం ఇలాంటి సందర్భాలకు అనుగుణంగా సుందరంగా అలంకరించుకొంది. ఎక్కడ చూసిన తోరణాలు, పూలదండలు. గవర్నరుగారు నడుస్తూంటే అందమైన తెలుగు అమ్మాయిలు పళ్ళాలలోని పూలను ఆయనపై చల్లుతూన్నారు.
మధ్యాహ్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో Connemara అనే పేరుపెట్టిన ఆవిరి డ్రెడ్జర్ ను గవర్నరు గారు ప్రారంభించారు. షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసి, ఒక తాడును చేతితో కొద్దిగా లాగగా - ఆ ఆవిరి ఓడ నెమ్మదినెమ్మదిగా నీటిలోకి ప్రవేశించిన దృశ్యం అందరిని సంతోషపరచింది.

ఇక అధికారిక విషయాలకు వస్తే - సంతృప్తికరంగా లేని మున్సిపల్ కౌన్సిలర్స్ పనితీరు; ఆసుపత్రులలో ఇంగ్లీషు వైద్యం చేయించుకోవటానికి ప్రజలు చూఫిస్తున్న అయిష్టం; ప్రభుత్వం ఇచ్చే రుణాలను రైతులు తీసుకోకపోవటం లాంటి విషయాలు చర్చకు వచ్చాయి.
***
ఆ మరునాడు కాకినాడ సమీప గ్రామాలను సందర్శించాము. ఇసకనేలలు, తాటి తోపులు, జీడిమామిడి, జామ తోటలు ఎక్కువగా ఉన్నాయి.
ఒక పల్లెలో మాకు కల్లుగీత కార్మికులు ఎదురయ్యారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న కల్లుగీత/ఎక్సైజ్ చట్టాల పట్ల వారికున్న అభ్యంతరాలను గవర్నరు గారికి తెలియచేసారు వారు.

ఒక గ్రామంలో మాకు కొంతమంది పశుల కాపరులు కనిపించారు. అందులో ఒక ముసలివ్యక్తి గవర్నరు గారితో - "ఆ వంతెన సరిగ్గా లేదు, జాగ్రత్తగా చూసుకొని నడవమని" చెప్పాడు.
కొద్దిదూరంలో రజకులు బట్టలు ఉతుకుతూ కనిపించారు. వారు సోడా కలిపిన మట్టితో బట్టలు రుద్దుతున్నారు. బహుసా అది సోపు కు ప్రత్యామ్నాయం కావొచ్చు.

ఆదివారం అమ్మాయిల బడి, హాస్పటల్, చర్చిలను దర్శించాము. మహిళా వైద్యవిద్య ఎలా సాగుతున్నదని ఆరాతీసారు గవర్నరు గారు. హాస్పటలు లో పనిచేస్తున్న నర్స్ వద్దకు నెలకు ఇరవైమంది మాత్రమే వైద్యం చేయించుకోవటానికి వస్తున్నట్లు తెలిపింది. చర్చికి రిపేర్లు చేయించమని గవర్నరుగారు ఆదేశించారు.

23 వతారీఖు ఉదయాన్నే కాకినాడనుంచి కాలువ మార్గం ద్వారా రాజమండ్రికి బయలుదేరాం. మేమున్న ఫామిలీ బోటును Arthor Cotton పేరుగల స్టీమరుకు తగిలించగా అది మమ్ములను రాజమండ్రి వరకూ లాక్కుని వెళ్ళింది.
ధవళేశ్వరం బేరేజ్ వద్ద గోదావరి థేమ్స్ నదంత వెడల్పుగా ఉంది. కాటన్ బేరేజ్ ద్వారా ఆరులక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. సుమారు రెండువేల చదరపు మైళ్ళకు నీరు అందుతోంది. 1852 లో ధవళేశ్వరం బేరేజ్ లక్షా యాభై వేల పౌండ్లతో నిర్మించబడింది. ఈ ఆనకట్ట కట్టకముందు 1847 లో ఈ జిల్లా స్థూల ఉత్పత్తి లక్షాడబ్బై వేల రూపాయిలుండగా 1887 నాటికి అది పదిహేను లక్షల రూపాయిల పైచిలుకు చేరటం గమనార్హం.

మా బోటు ప్రయాణిస్తూండగా ఒక చిన్నపడవద్వారా మాకు ఆ రోజునాటి తపాలా అందచేయబడింది. బొంబాయిలోని ఒక వ్యాపారస్థుడు పంపిన ప్రకటనల కేటలాగు అది. చికాకు కలిగి దానిని కాలువలోకి విసిరేసాను. అది పొరపాటున జారిపడిపోయిందనుకొన్న ఒక సిబ్బంది నీళ్ళలోకి దూకి దాన్ని తిరిగి మాకు ఇచ్చాడు. ప్రకటనల నుంచి తప్పించుకోవటం చాలా కష్టం.

రాజమండ్రిలో దిగగానే పాతకోట శిధిలాలు మాకు కనిపించాయి. సామాన్యప్రజలు రంగురంగుల తలపాగాలు చుట్టుకొని కనిపించారు. ఎక్కువగా ముదురు ఎరుపురంగులో ఉన్నాయవి. చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారు. మాకు జడ్జి గారి ఇంటిలో బస ఏర్పాటు జరిగింది. రాత్రిపూట కోలాటం బృందనాట్యం మాకొరకు ఏర్పాటు చేసారు. ఈ కోలాటం ఆట నాకు Seoul లో చూసిన అదే తరహా నృత్యాన్ని గుర్తుకు తెచ్చింది.
గవర్నరు గారి కొరకు వివిధ తమాషా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక దాంట్లో ఒక వ్యక్తి " పురప్రజలారా ఇదిగో చూడండి గవర్నరుగారు, తమ పల్లకి ఎక్కి గవర్నమెంటు బంగ్లాకు వెళుతున్నారు.... ఇదిగో చూడండి" అని ప్రకటించగా... గవర్నరుగారి వేషం వేసుకొన్న ఒక వ్యక్తి గవర్నరుగారిలా నడుచుకొంటూ పల్లకిలో ఎక్కినట్లు అభినయం చేసాడు. మేమంతా నవ్వుకొన్నాం.
ఆ మరునాటి ఉదయం గోదావరినదిపై వ్యాహ్యాళికి వెళ్లాం. ఆ అందాలను చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు. ప్రతీచోటా కాసేపు ఆగి వాటిని ఆస్వాదించాల్సిందే. ...
@@@

ఆ తరువాత లార్డ్ కన్నెమెరా బృందం ఏలూరు, బెజవాడ, సింగరేణి, హైదరాబాదు వెళ్ళిన ఉదంతాలు కలవు.

ఈ విషయాల ద్వారా ఆనాటి ఆర్ధిక, సామాజిక పరిస్థితులను అర్ధంచేసుకొనవచ్చును. కొన్ని ఆసక్తికర అంశాలు

1. జలమార్గాలే ప్రధాన రవాణా సౌకర్యం గా ఉండటం.
2. రైల్వేలు వస్తే జలమార్గాల ప్రాధాన్యం తగ్గిపోదని హామీ ఇచ్చినా ఆ తరువాత వచ్చిన ట్రాన్స్ పోర్ట్ ఇండస్ట్రీ లాబీయింగ్ వలన జలమార్గాలు క్రమేపీ అంతరించిపోయాయి.
3. కాటన్ బేరేజి వ్యయం అది ఇచ్చిన ఫలితాలు
4. ప్రకటనల ప్రహసనం
5. ఇంగ్లీషు వైద్యాన్ని ప్రజలు నమ్మకపోవటం
6. ప్రభుత్వం రుణాలిస్తానన్నా రైతులు ముందుకు రావకపోవటం.

ఆనాటి సమాజంలోకి ఇదొక ఆసక్తికరమైన historical peeping.

బొల్లోజు బాబా

ఫొటోలు:
1. Episode of the Happier Days of Charles I. (1600 – 1649) Illustration for The Illustrated Times, 17 October 1857. రాజకీయకారణాల వల్ల పార్లమెంటు ఇతనికి మరణశిక్ష విధించింది.
2&3 మద్రాసు గవర్నర్ లార్డ్ కన్నెమెరా.

Image may contain: one or more people, sky, outdoor and waterImage may contain: 1 person

కొప్పర్తి కవిత్వం - ఒక నిరంతర సత్యాన్వేషణ


కొప్పర్తి కవిత్వం - ఒక నిరంతర సత్యాన్వేషణ

.
(ప్రముఖ కవి శ్రీ కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారికి సోమసుందర్ లిటరరీ అవార్డు వచ్చినసందర్భంగా చేసిన ప్రసంగపాఠం. ఈ వ్యాసం "కవిసంధ్య పత్రికలో ప్రచురింపబడింది. సంపాదకవర్గానికి ధన్యవాదములు)
***
.
కొప్పర్తి రాసింది మూడు పుస్తకాలు మాత్రమే. అవి పిట్టపాడే పాట, విషాదమోహనం, యాభైఏళ్ళవాన. అప్పుడప్పుడూ కొన్ని వ్యాసాలు వ్రాసారు కానీ అవి పుస్తకరూపంలోకి రాలేదు. ఈ మూడు కవితాసంకలనాలను పరిశీలిస్తే- పిట్టపాడే పాట రాళ్లమధ్య గలగలమంటూ పారుతూ ఈ ప్రపంచాన్ని నిబిడాశ్చర్యంతో చూస్తూ సాగే సెలయేరులాగ; విషాదమోహనం సుళ్ళుతిరుగుతూ, పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే వరద గోదావరి ఉద్రేకం లాగ; యాభై ఏళ్లవాన నింగినీ నేలనూ తాకుతూ నిశ్చలంగా అనంతంగా విస్తరించిన ఒక తాత్విక సముద్రంలాగా కనిపిస్తాయి.

మూడు పుస్తకాలతో కొప్పర్తి తెలుగు కవిత్వంపై వేసిన ముద్ర చాలా బలమైనది. ఎంతబలమైనదీ అంటే వీరి కవిత్వంలో ఉండే స్పష్టత, గాఢత, విభిన్నత తెలుగు కవిత్వంలో ఒక గీటురాయిగా నిలిచాయి.

సమకాలీన కవిత్వాన్ని పరిశీలిస్తే ఒక్కొక్కకవిది ఒక్కొక్క శైలి. శిఖామణి కవిత్వంలో మానవసంబంధాలు ఆర్థ్రంగా పలుకుతాయి. శివారెడ్డి కవిత్వానికి సామాజిక సంఘర్షణ ప్రధాన ముడిసరుకు. ఆశారాజు కవిత్వానికి లాలిత్యం స్థానీయతా నేపథ్యంగా ఉంటాయి. వాటిని ఆయా కవుల ముద్ర లేదా స్టాంప్ లుగా బావించవచ్చు.
కొప్పర్తి కవిత్వంలో చక్కని పదచిత్రాలు ఉంటాయి. అద్భుతమైన ఉపమానాలు ఉంటాయి. వస్తువులో నవ్యత అమోఘంగా ఉంటుంది. ఇది కాక మరే ఇతర లక్షణాలు ఈ కవిత్వాన్ని ఇతరుల కవిత్వం నుండి వేరు చేస్తున్నది అని పరిశీలించినపుడు - చరిత్ర, తర్కం అనే రెండు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ రెండు లక్షణాలు కొప్పర్తి కవిత్వానికి విశిష్టతను సంతరించిపెట్టాయి అనిపిస్తుంది.
***

1. చరిత్ర శకలాలను పొదువుకొన్న కవిత్వం
.
చారిత్రిక సంఘటనలను వర్తమానంతో పోల్చి వాటి రిలవెన్స్ ను విశ్లేషించి చెప్పటం చరిత్రకారుల బాధ్యత. ఈ కవి వృత్తిరీత్యా చరిత్ర అధ్యాపకుడు. కవిగా ఇతనికి అదొక వెసులుబాటు. బహుసా అందుకేకావొచ్చు కొప్పర్తి అనేక కవితలలో చారిత్రిక అంశాలను సందర్భోచితంగా అల్యూడ్ చేయటం, చారిత్రిక వ్యక్తుల ప్రాసంగితను కవిత్వం చేయటం కనిపిస్తుంది.

విషాదమోహనం సంపుటిలోని “చిత్రలిపి” అనే కవిత భారతదేశ చరిత్రకు ఒక మొజాయిక్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఒక మహా అరణ్యాన్ని నలభై పంక్తులలో మొలిపించటం అల్యూజన్ అనే కవిత్వ టెక్నిక్ వల్ల సాధ్యపడింది.
.
భూమి పుత్రుడి మీద నుంచి
మూడు పాదాలు బలంగా నడిచివెళ్లిన చిహ్నాలు కనిపిస్తాయి
దండకారణ్యంలో
ఒక తెగిపడ్డ బొటనవేలు దొరుకుతుంది ... అనే వాక్యాలలో ఆర్య అనార్య సిద్ధాంతం ధ్వనింపచేస్తాడు కవి. (ఈ సిద్ధాంతం తప్పా ఒప్పా అనేది వేరే చర్చ) ఆర్యులు వ్యాప్తిచేసిన వేద సంప్రదాయం, భూమిపుత్రుడి సంస్కృతిని, ఉనికిని విస్మరించింది అని సూచిస్తున్నాడీ కవి.
.
ఒక్కడు మాత్రం
ప్రశ్నించి కోపించి దుఃఖించి శాసించి
పద్యాలల్లుకుంటూ దిశమొలతో సాగిపోతాడు - సాహిత్యం ద్వారా సంఘాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన వారిలో వేమనను మించిన వారుండరు. దురాచారాల్ని,మూఢనమ్మకాల్ని పురాణాల వైరుధ్యాల్ని, వేదాంతపు డొల్లతనాన్ని, మానవ బలహీనతల్ని వేమన తన పద్యాలతో ఖండించి, ప్రశ్నించి సాగిపోయిన వైనం తెలుస్తుందీ పంక్తులలో.

ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి
చిరుజల్లు తుఫానౌతుంది
రైతులు పాలికాపులై, పాలెకాపులు కూలీలౌతారు
కానీ ఓడలు మాత్రం బండ్లు కావు .... ఈ పాదాలలో బ్రిటిష్ వారు ఓడలపై చిరుజల్లుగా వచ్చి తుఫానై కబళించారని చెపుతున్నాదు కవి. తరువాత పాదంలో థామస్ మన్రో రైత్వారి సంస్కరణల ద్వారా ఉత్పత్తి రంగానికి సంబంధించి జరిగిన పునర్వవస్థీకరణ చెప్పబడింది. ఓడలు బండ్లు కాలేదనటంలో ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారన్న చారిత్రిక సత్యం ఉంది.

సెయింట్ ఒకడు నడుచుకుంటూ వెళ్ళి
పిడికెడు సముద్ర స్ఫటికాల్ని గుప్పిటపడతాడు
ఆస్తి పంపకాలు జరుగుతాయి
తెలుపుకూ నలుపుకూ తేడాలేకుండా పోతుంది
పాతబస్తీలు చుండూరులు ఫలితాన్ననుభవిస్తాయి//
ఉప్పుసత్యాగ్రహం చేసిన గాంధిమహాత్ముని సెయింట్ అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. ఆస్తి పంపకాలు అంటే దేశవిభజన. స్వపరిపాలన వచ్చినా సామాన్యుని జీవితంలో వచ్చిన మార్పేమీ లేదని కవి ప్రకటన. అదే దోపిడీ, అదే దాష్టీకం, అదే దౌర్జన్యం ల ఫలితంగా పాతబస్తీ మతకలహాలు, చుండూరులో కుల ఘర్షణలు లాంటి సంఘటనలు జరుగుతూండటం పట్ల తన ఆవేదన వ్యక్తంచేస్తాడు.
.
ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధియన్ ఫిలాసఫీ ఒక త్రోవ చూపగలదని మేధావుల అంచనా. భారతీయసాహిత్యంలో ప్రముఖ మళయాలీ కవి శ్రీ సచ్చిదానందన్, గాంధియన్ ఫిలాసఫీపై అనేక కవితలు వ్రాసారు. యాభై ఏళ్లవానలో కొప్పర్తి గాంధియన్ ఫిలాసఫీ వైపు ప్రయాణించటం గమనించవచ్చు. ఈ సంపుటిలో మూడు కవితలలో గాంధీతత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

వొక యుద్ధం-వొక ప్రత్యామ్నాయం అనే కవిత ఇలా మొదలౌతుంది
వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నిలుచున్నారు
వాడివెనుక ఏడేడు ఉప్పు సముద్రాలు
అతని వెనుక ఒక్కటే జనసముద్రం
వాడు చేత్తో లాఠీపట్టుకొని
పైపుకాలుస్తూ గుప్పుగుప్పున పొగ వదుల్తూ నిలబడితే
ఉప్పుసముద్రాలు దాటొచ్చిన ఆవిరిఓడలా ఉన్నాడు
అతను కొల్లాయి కట్టి అనాచ్ఛాదిత వక్షంతో
చేతిలో ఎవరికీ కనిపించని ఆయుధం పట్టుకొని నిలబడితే
జనసముద్రానికి ఎత్తిపట్టిన వృక్షపు నీడలా ఉన్నాడు.//

దెబ్బల వర్షం కురిసింది
వాడు కొట్టికొట్టీ అలసి
ఆయాసంతో రొప్పుతూ
విజయగర్వంతో నిలబడ్డాడు
అతను రక్తమై, సిక్తమై అరుణమై
విరబూసిన మందారమొక్కై
వొరిగిపోయాడు//
హింస పిరికివాడి ఆయుధం అనీ
అత్యంత శక్తివంతుడు మాత్రమే
అహింసను ఆయుధంగా ధరించగలడనీ
సమరోత్సాహంతో పలికిందీ నేల.

చుట్టతాగే చర్చిల్ ను పొగలు కక్కే ఆవిరి ఓడగా, ఎవరికీ కనిపించని ఆయుధంగా అహింసను, గాంధీని చెట్టునీడగా పోల్చుతూ ఒక దృశ్యాన్ని రూపుకట్టించటం కొప్పర్తి అనన్యమైన ప్రతిభ. చివరకు హింస పిరికివాడి ఆయుధంగా, అహింస శక్తివంతుడి ఆయుధంగా చెప్పటం మొత్తం గాంధీ ఫిలాసపీని రెండు ముక్కల్లో కుదించటమే.
అంతిమ సత్యం అనే కవిత లో

తుపాకి పేల్చినవాడా
నీకు ధన్యవాదాలు//
నువ్వు పేల్చాకా కూడా అతను బతకగలిగి ఉంటే
నిన్నుకూడా తప్పకుండా బతికించి ఉండేవాడు
అప్పుడతని అంతిమ సత్యం నువ్వే అయ్యిండేవాడివి (అంతిమ సత్యం) - పై వాక్యాలలో గాంధీ బ్రతికుంటే గాడ్సే ని క్షమించి ఉండేవాడనే ఊహ చేస్తాడు కొప్పర్తి. ఏమో బహుసా అలాగే జరిగి ఉండేదేమో. అప్పుడు గాడ్సే ఖచ్చితంగా గాంధీ ఇచ్చిన సందేశంగా మిగిలిపోయి ఉండేవాడు. ఈ ఊహలన్నీ ఒఠి కల్పనలు కావొచ్చు, కానీ ఆ ఊహలు గాంధీ సిద్ధాంతాన్ని మరింత ప్రకాశవంతం చేస్తున్నాయి.

జెండర్ పాలిటిక్స్ అనే కవితలో ఈ వాక్యాలు ఆలోచింపచేస్తాయి.
జోన్ ఆఫ్ ఆర్క్
కాకతిరుద్రమ
లక్ష్మిబాయ్ ఆఫ్ ఝాన్సీ
పురుషులుగా మారిన స్త్రీలు

బుద్ధుడు
అశోకుడు
జీసస్
స్త్రీలుగా మారిన పురుషులు (జెండర్ పాలిటిక్స్) ఇదే కవితలో “గాంధీ కూడా పురుషుడు కాదు, స్త్రీ, తనలోని కరుకుదనాన్ని కరిగించి కరిగించి ఏకకాలంలో మృదువుగా ధృఢంగా మారిన స్త్రీ” అనే వాక్యాలలోని తాత్వికత గాంధియన్ ఫిలాసఫీని కొత్తకోణంలో ఆవిష్కరింపచేస్తుంది.

కొప్పర్తి తొలికవిత్వసంపుటి పిట్టపాడే పాటలో కూడా చరిత్ర శకలాలు కవితలుగా రూపుదిద్దుకోవటం కనిపిస్తుంది.
ప్రశ్న జవాబు వేరు వేరు కాదు
ప్రశ్నించడం అంటే జవాబు చెప్పడమే
క్రీస్తు, బుద్ధుడూ, మార్క్సూ
ప్రశ్నలుగా పుట్టి జవాబులుగా నిష్క్రమించారు//
ప్రశ్నల పోరాటంలో
స్పార్టకస్, గెలీలియోలు, ఫ్యూ జిక్ లు, మొలాయిజేలు
కూలిపోతూంటారు. (ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి).

ప్రశ్నలుగా పుట్టి జవాబులుగా నిష్క్రమించటం అనే వాక్యంలో మొత్తం మానవజాతి సృష్టించిన జ్ఞానమంతా ఇమిడిపోయింది. రెండో వాక్యంలో ప్రశ్నలపోరాటంలో ఉండే ఘర్షణను పట్టిచూపుతుంది. స్పార్టకస్ రాజ్యాన్ని ప్రశ్నించినందుకు, గెలిలియో మతాన్ని ప్రశ్నించినందుకు, ఫ్యూజిక్, మొలాయిజేలు నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకు చంపబడ్డ వ్యక్తులు. అయినా ఈ ప్రపంచం ప్రశ్నించటాన్ని ఆపేయలేదు అనే చారిత్రిక సత్యం పైకవితలో దొరుకుతుంది.

కవికి చారిత్రిక స్పృహ ఉంటే అతను వ్రాసే కవిత్వానికి గొప్ప లోతు, కాలిక స్పృహ వస్తుంది. ఈ రహస్యం కొప్పర్తికి తెలుసు. అందుకే బహుసా “కవి తాత్వికుడే కాదు చరిత్రకారుడు కూడా కావాల్సిందే” అంటాడు ఊరూవాడ కవితలో. నదీ, చరిత్రా, కాలమూ పర్యాయపదాలు అంటాడు మరో కవితలో (రహస్యనది). గొంతునులిమి చరిత్ర చేత అబద్దం పలికించొచ్చునేమోగానీ/చరిత్రగోడలమీద జారిన నెత్తుటి చారికలు మాత్రం అబద్దం చెప్పవు అంటాడు ఇంకో కవితలో (త్రిశూలం).

తెలుగు కవిత్వానికి చరిత్ర సంబంధ దృక్పథాన్ని అద్ది దాన్ని దేదీప్యమానం చేసిన కవిగా కొప్పర్తి గుర్తుండిపోతారు.

2. కొప్పర్తి కవిత్వంలో తర్కం

సాధారణంగా కల్పన అనేది కవిత్వ లక్షణంగాను, తర్కం,కథనాత్మకత అనేవి వచనలక్షణాలుగా చెపుతారు. తర్కం ద్వారా ఒక సత్యం ఆవిష్కరించబడుతుంది. అంటె కల్పనకు అది వ్యతిరేకం. తాత్విక చింతనలలో Inductive logic, Deductive logic అనే పద్దతులను ఉపయోగించి తీర్మానాలను చేస్తారు. కొప్పర్తి కూడా ఈ పద్దతులలో ఆధారంగా చేసుకొని అనేక తార్కిక సారూప్యాలు తీసుకొస్తారు. ఇవి చదువుతున్నంతసేపూ విభ్రమ కలిగిస్తాయి. ప్రాచీనాలంకారికులు విభ్రమను ఒక కవిత్వలక్షణంగా చెప్పారు.

ఉదాహరణకు సింధునది అనే కవిత ఇలా ముగుస్తుంది.

పంచపాండవులంటే
మంచంకోళ్లలాగా ముగ్గురంటూ రెండు వేళ్లు చూపించి
నల్లబల్లపైన ఒకటి వేసిన
ఉపాద్యాయుడిది తెలివితక్కువతనం కాదు. (సింధునది)
ఈ వాక్యాలను విడిగా చదివితే ఒక అర్ధంలేని వాదనగా అనిపించక మానదు. కానీ కవితను మొత్తం చదివినపుడు ఆ ప్రతిపాదన ఔచిత్యం అర్ధమౌతుంది. ఇందులో మనకు Inductive Logic కనిపిస్తుంది. అంటే ఒక specific అంశాన్ని ఒక General అంశంతో ముడివేసి రెండు ఒకటే అని చెప్పటం.

తొంభైలలో దళిత, బహుజన కవిత్వం విరివిగా వచ్చింది. ఆ సందర్భంగా వ్రాసిన కవిత ఇది. సింధుదేశంలో ప్రవహించిన అయిదునదుల గురించి వర్ణిస్తూ ఒక్కోనదినీ ఒక్కో వర్ణానికి ప్రతీకగా తీసుకోవటం అబ్బురపరుస్తుంది. నిజానికి ఈ ఐదునదుల్లో సింధు, గంగ, యమున బ్రహ్మపుత్ర నదులు మాత్రమే జీవనదులు. ఐదవది అయిన సరస్వతి నది ఎండిపోయి అంతర్జలలా ప్రవహిస్తున్నది.

వాటిలో ఒకటి సూర్యుడికి అర్ఘ్యమైంది
ఒకటి నెత్తురై ప్రవహించింది
ఒకదాని మీద సరుకుల ఓడలు లంగరెత్తాయి
ఒకటి చెమట కాల్వగా బీడుల్ని మాగాణుల్ని చేసింది.
ఇంకిపోయిన ఐదోదిప్పుడు
ఊటలు ఊటలుగా ఉబికి యేరై పరవళ్ళు తొక్కుతోంది
ఇప్పుడా ఐదూ సంగమించి
ఒక మహా ప్రవాహం కావాలి. (సింధు నది)

పై పంక్తులలో నాలుగు నదులు చతుర్వర్ణాలకు ప్రతీకలై నిలువగా, దళిత కవిత్వం ఉత్తుంగ తరంగంలా వెల్లి విరియటాన్ని అయిదోనది తొక్కుతోన్న పరవళ్ళుగా వర్ణిస్తాడు. అంతే కాక ఆ అయిదు నదులూ సంగమించి ఒక మహా ప్రవాహం కావాలనటం ద్వారా సరిహద్దులు చెరిపేసి “మనిషితనం” భూమికగా ఉండే మరో ప్రపంచాన్ని స్వప్నిస్తున్నాడు. కవిత పూర్తిగా చదివాక, చివరలో చెప్పిన ఉపాద్యాయుడు చేసిన పని తార్కికంగా ఆలోచిస్తే తెలివితక్కువ తనం కాదని అంగీకరించక తప్పదు. ఇది కొప్పర్తి తర్కం ద్వారా సాధించిన విభ్రమ.

నిరపేక్షం అనే కవిత పూర్తిగా తర్కాన్ని ఆధారంగా చేసుకొని వ్రాయబడింది.
మొదలూ లేదు చివరా లేదు
మొదలంటే రెండు చివరల మధ్య నుండటమే
చివరంటే రెండు ఆరంభాల మధ్య నిలవడమే ......... అంటూ మొదలయిన కవిత
మధ్యనుండటంలో
మధ్యన అన్నది నిజం కాదు ఉండటం ఒక్కటే నిజం
ఉండటం ఒక్కటే నిజమైనప్పుడు
లేకపోవడం కూడా నిజమే అవుతుంది ........... అంటూ ముగుస్తుంది.

కవిత ఎత్తుగడ చివరకు వచ్చేసరికి దాదాపు యు టర్న్ తీసుకొంటుంది. ఇక మధ్య భాగం లో కనిపించే పోలికలు, ప్రతీకలు అన్నీ విషయాన్ని క్రమక్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ తారాస్థాయికి తీసుకెళ్ళి వదుల్తాయి. అద్భుతమైన శిల్పనైపుణ్యానికి ఈ కవిత మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ తరహా తర్కాన్ని Deductive Logic అంటారు. అంటే ఒక General అంశాన్ని ఒక specific అంశంతో ముడివేసి రెండు ఒకటే అని చెప్పటం.
దాదాపు ఇట్లాంటిదే విస్మృతి పేరుతో మరోకవిత యాభైఏళ్లవానలో ఉంది

అల్లంత దూరాన
ఒక ఊళ్ళో
ఒక పాప పుట్టింది
వెళ్ళిచూడాలనుకొనే వాళ్ళం
వీలయ్యింది కాదు
వెళ్ళనూ లేదు
చూడనూ లేదు
ఈలోగా
పాప
ప్రపంచాన్ని ఖాళీచేసి
వెళిపోయింది

ఎట్లా ఉంటుందో తెలీని పాప
ఎట్లా లేకుండా పోతుంది

అందుకని ఇప్పటికీ
ఎప్పటికప్పుడు
వెళ్ళి చూడాలనే అనుకుంటున్నాం (విస్మృతి)
ఎట్లా ఉంటుందో తెలీని పాప, ఎట్లా లేకుండా పోతుంది అనే ఒక్క తార్కిక వాక్యం వల్ల కవిత నిలబడింది. దీనిలో ఇండక్టివ్ లాజిక్ కనిపిస్తుంది. (Specific to General)

అలాగే నిర్నిద్రం అనే కవితలో
చీకటనీ వెలుతురనీ
రెండుంటాయంటాం కానీ
ఉండేది చీకటే
వెలుతురు వచ్చి వెళుతుంది అనే వాక్యంలోని తర్కం కూడా చకితుల్ని చేస్తుంది.
కొప్పర్తి కవితానిర్మాణంలో కనిపించే తర్కం అతని కవిత్వాన్ని ప్రతిభావంతం చేస్తుంది. ఇది పారడాక్సికల్ వ్యక్తీకరణ కాదు. భిన్న విరుద్ధ భావాలను తీసుకొని రెండూ ఒకటే అనే తార్కిక ప్రతిపాదన చేయటం. ఇది కొప్పర్తి స్టాంప్ అనుకొంటాను.
****
స్పందించాల్సిన సమయాలలో కొప్పర్తి సూటిగా స్పష్టంగానే స్పందించాదు.
దళితకవిత్వంలో బూతు పదాల వాడకం పెరిగినపుడు “సాతాను దేవుడు కానట్లే, బూతు కవిత్వం కాదు” అని కుండబద్దలు కొట్టాడు.
తెలుగునాట కవులందరూ సాయుధవిప్లవాన్ని సమర్ధిస్తూ వ్రాసే రోజుల్లో కొప్పర్తి “పోరాటం రాజ్యంతో అయితే, యుద్దం పోలీసులతోనా” అని ప్రశ్నించి నక్సలైట్ ఎదురుకాల్పుల్లో మరణించిన పోలీసుల పక్షాన నిలిచాడు. అది ఆ కాలానికి ఎదురీతలాంటిది.

ప్రత్యేక తెలంగాణ సమయంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటును సమర్ధిస్తూ “ఈ దేశం/లోపలి పదార్ధమంతా ఒకేలా ఉండే యాపిల్ లా లేదు//ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉండే తెల్లతొనల నారింజలా ఉంది//ఇపుడు ఎర్రగింజల దానిమ్మలా పరిపక్వమౌతుంది…. అంటాడు. మరిన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడి అన్నికలసి ఎర్రగింజల దానిమ్మలా ఉండాలని కవి ఆకాంక్షించాడు. ఇవన్నీ కొప్పర్తి తన అభిప్రాయాలను చెప్పటానికి ఏనాడూ సంశయించలేదు అనే విషయాన్ని నిరూపిస్తాయి.

రక్తం యుద్ధానికి చిహ్నమైతే కన్నీళ్ళు మనిషితనానికి చిహ్నమని చెప్పే కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్; సామూహిక మరణాల గురించి గొప్ప దృక్కోణాన్ని అందించే మరణవైయక్తికం లాంటి కవితలు లోతైన ఆలోచనలను ప్రతిపాదిస్తాయి.

మీ చేతుల్లో రీడర్స్ డైజెస్ట్ ని ఇలస్ట్రేటెడ్ వీక్లీని
చార్లెస్ డికెన్స్ నూ, థామస్ హార్డీని చూసిన నాకు
చివరిరోజుల్లో హిందూ పేపర్ ను
తిరగేసి చూస్తున్నప్పుడు
తలక్రిందులౌతున్న మీ ప్రపంచాన్ని
ఎట్లా నిలబెట్టాలో తెలీలేదు --- అని కొప్పర్తి తన తండ్రిగారి గురించి వ్రాసిన వాక్యాలను చదివినపుడు హ్రుదయం ద్రవిస్తుంది. కొప్పర్తి తన సతీమణిపై వ్రాసిన సుశీల అనే కవితలో పలికించిచ స్త్రీ పట్ల ప్రేమ Burden of women in poetry కాదు Beauty of human relationships.

3. తెలుగు కవిత్వంలో కొప్పర్తి స్థానం ఎక్కడ?

సాధారణంగా ఒక కవి యొక్క కవిత్వాన్ని మదింపు చేసేటపుడు అతను ఎక్కడ ఉన్నాడు అనేదానిపై కూడా ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి ఒక కవిని ఏదో ఒక చట్రంలో ఇరికించలేం.

తెలుగు కవిత్వంలో శిఖామణి అనే కవి లేకపోతే మానవసంబంధాల కవిత్వం అనే అర అసంపూర్ణంగా ఉండేది అని ఒకచోట అన్నాను.
ఒకసారి ఇస్మాయిల్ గారిని ఒక ఇంటర్వ్యూలో మీరు అనుభూతి కవా అని ప్రశ్నిస్తే “నేను అనుభూతి కవిని కాను, నాకు లేబుళ్ళు తగిలించొద్దు” అన్నారాయన. అంతే కాదు మీరు “లేబుళ్ళు తగిలించినా నా మొఖాన అంత జిడ్డు లేదు కనుక అవి అంటుకోవు” అని కూడా మరోసందర్భంలో అంటారు. ఇదే విషయాన్ని కొప్పర్తి కవిత్వానికి కూడా అన్వయించుకోవచ్చు.

“వస్తువు గురించిన నిబద్దతా భావం ఎపుడు వెనుకబడుతుందో అపుడు రూపం, అనుభూతి, శిల్పం మొదలైన విషయాలు ముందుకు వస్తై” అన్న అజంతా మాటలు కొప్పర్తి కవిత్వానికి చక్కగా సరిపోతాయి. ఎందుకంటే ఈ కవి ఏ సిద్దాంతాలను తలకెత్తుకోక జీవితంలోంచి కవిత్వానుభవాలను ఏరుకొన్నాడు. వాటికి తర్కం, చరిత్రాత్మకత అనే జవసత్వాలను ఇచ్చి గొప్ప కవిత్వాన్ని సృజించాడు. మొదటి సంపుటిలో కొంత మార్క్సిష్టు భావజాలం కనిపించినప్పటికీ, మూడవ సంపుటివద్దకు వచ్చేసరికి ఇతని ప్రయాణం గాంధీ తాత్వికత వైపు సాగటం గమనించవచ్చు. ఇదొక మెటమార్ఫోసిస్. ఒక సత్యాన్వేషణ.

సత్యాన్వేషణ అనేది పరమసత్యం దర్శనమయ్యేవరకూ సాగాల్సిందే.

బొల్లోజు బాబా
16/11/2019

దడాల రఫేల్ రమణయ్య - స్వాతంత్య్ర పోరాటయోధుని ఆత్మకథ

 భారతీయ దళిత ఆత్మకథలు” అంశంపై మా కాలేజి హింది ప్రొఫసర్ శ్రీ హరిరామ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్ లో సమర్పించిన పత్రం)

.
దడాల రఫేల్ రమణయ్య - స్వాతంత్య్ర పోరాటయోధుని ఆత్మకథ


దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ప్రత్యేకమైనది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వ్రాసుకొన్న ఇతర ఆత్మకథలతో పోల్చినపుడు, దళిత ఆత్మకథలు భిన్నంగా ఉంటాయి. భారతీయ దళిత ఆత్మకథల్లో అంబేద్కర్ పూర్వ, తదనంతర సమాజాలలోని మూడుతరాల దళిత జీవనశైలుల చిత్రణ జరుగుతుంది. సమాజంలో ఉండే కులపరమైన వివక్ష, అగ్రకుల ఆధిపత్యం, పేదరికం, అంటరానితనం వంటివి దళిత ఆత్మకథలలో సహజంగా ప్రతిబింబించే అంశాలు. పీడితుల చరిత్రను దళిత ఆత్మకథలు అక్షరీకరిస్తాయి.

యానానికి చెందిన శ్రీ దడాల రఫేల్ రమణయ్య “My Struggle for freedom of French Provinces in India - An Autobiography’ పేరుతో 1974 లో ఇంగ్లీషులో వెలువరించిన ఆత్మకథ ద్వారా ఒకనాటి ఫ్రెంచి ఇండియా యొక్క అనేక చారిత్రిక, సామాజికాంశాలు తెలుస్తాయి. క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన ఒక దళిత క్రిష్టియన్ జరిపిన స్వాతంత్య్రపోరాటాన్ని మనకళ్ళముందు నిలుపుతుందీ రచన.

శ్రీ దడాల జీవనయానం

శ్రీ దడాల రఫేల్ రమణయ్య యానాంకు చెందిన పరంపేట అనే గ్రామంలో 30 జూన్, 1908న ఓ దళిత రైతుకూలి కుటుంబంలో జన్మించారు. నాలుగు సంవత్సరాల వయసులో తండ్రిగారిని కోల్పోవటంతో నాయినమ్మ ఇంటపెరిగారు. చిన్నవయసులోనే యానాం చర్చిలో తోటమాలికి సహాయకునిగా పనికి కుదిరారు. చదువుపట్ల ఇతనికి ఉన్న జిజ్ఞాసను గుర్తించి చర్చి ఫాదర్ శ్రీ గాంగ్లాఫ్, దడాలను చేరదీసి పాండిచేరి పంపి ఉన్నత చదువు చెప్పించారు. చదువు పూర్తయ్యాకా శ్రీ దడాల కొద్దికాలం టీచర్గా పనిచేసి, పోటీపరీక్ష పాసయి పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని చేపట్టారు. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా అనేక సాహసోపేతమైన పనుల ద్వారా ఉన్నతాధికారుల మన్ననను పొందారు. వీటిలో ఫ్రెంచి గవర్నర్ శ్రీ మెనార్డ్ను ఆందోళనకారులనుండి కాపాడటం, పాండిచేరీలో ఒక సభలో అప్పటి జాతీయనాయకుడు శ్రీ వి.వి. గిరి పై దుండగులు దాడిచేసినపుడు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించటం వంటివి ప్రముఖమైనవి.

1947 లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించి నిష్క్రమించింది. ఫ్రెంచివారు మాత్రం పాండిచేరి, మాహె, కారైకాల్ మరియు యానాం ప్రాంతాలను ఇంకా పరిపాలించేవారు. ఈ ఫ్రెంచికాలనీల ప్రజలలో స్వాతంత్య్రకాంక్ష బలపడి ఫ్రెంచివారికి వ్యతిరేకంగా ఉద్యమించటం మొదలెట్టారు.
జాతీయభావాలు కలిగిన శ్రీ దడాల తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆ ఉద్యమంలో చేరారు. అనేకమంది యువకులను కూడగట్టి ‘ఫ్రెంచి ఇండియా విమోచన కూటమి’ అనే సంస్థను స్థాపించి దానిద్వారా ప్రజను చైతన్యపరుస్తూ పాండిచేరీ స్వాతంత్రోద్యమాన్ని నడిపించారు. తన సొంతఊరు అయిన యానాం ఈ ఉద్యమంలో వెనుకపడి ఉందని భావించి, 14 ఏప్రెల్, 1954 న యానాం చేరి అక్కడి ప్రజలలో జాతీయోద్యమ భావాలు పెంపొందించారు. 13 జూన్, 1954న శ్రీ దడాల, వేలమంది కార్యకర్తలతో యానాం స్థానిక పరిపాలనా ఆఫీసును ముట్టడించి, అధికారాలను కైవసం చేసుకొని, ఫ్రెంచి జండాను తొలగించి భారతదేశపతాకాన్ని ఎగురవేసి- యానాం ఫ్రెంచి పాలననుండి విమోచమైందని ప్రకటించారు. ఆనాటి ప్రముఖ పత్రికలన్నీ ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి.

16 జనవరి, 1955న అప్పటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ పాండిచేరీ వచ్చినపుడు జరిపిన బహిరంగ సభలో శ్రీ దడాల మాట్లాడుతూ .....‘ యానాన్ని అభివృద్ధి చేయమని, వ్యక్తిగతంగా పర్యవేక్షించమని’ నెహ్రూను కోరారు. ఆ తరువాత ఆంధ్రా ఎక్సైజ్ ఇనస్పెక్టరుగా ఉద్యోగం చేసి 1963లో పదవీవిరమణ పొందారు. 5 మే, 1991న శ్రీ దడాల తనువు చాలించారు.

శ్రీ దడాల స్వీయచరిత్ర విశ్లేషణ

దయాపావర్ రచించిన ‘బుతా’, నరేంద్ర జాధవ్, ‘ఔట్ కాస్ట్ ఎ మెమొయిర్’, బేబీ కాంబ్లే ‘ప్రిజన్స్ వియ్ బ్రోక్’ వంటి ప్రముఖ భారతీయ దళిత ఆత్మకథలలో - తెలుగులో జాషువా రచించిన ‘నా కథ’, బోయిభీమన్న ‘పాలేరునుండి పద్మశ్రీ వరకు’, తలమర్ల కళానిథి ‘ఆత్మకథ’, వై. సత్యనారాయణ వెలువరించిన ‘మా నాయిన బాలయ్య’ వంటి వివిధ స్వీయచరిత్రలలో, దళిత సంస్కృతి, ఆత్మవిశ్వాసంతో తమను తాము పునర్నిర్మించుకొన్న ఒక ప్రయత్నం, తాము ఎదుర్కొన్న వివక్ష, లాంటి విషయాలు కనిపిస్తాయి.

శ్రీ దడాల స్వీయచరిత్రలోపై అంశాలేవీ కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగించక మానదు. కులవివక్ష ప్రస్తావన ఒకే ఒక సందర్భంలో తప్ప మరెక్కడా కనపడదు. ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చి పాండిచేరీ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతగా భారతప్రభుత్వం శ్రీ దడాలకు సెక్రటరీ స్థాయి ఉద్యోగం ఇమ్మని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుకు రికమెండ్ చేస్తే, ఒక వదరుబోతు ప్రభుత్వాధికారి కులదురహంకారంతో ఇతనికి ఇనస్పెక్టర్ స్థాయి ఉద్యోగం మాత్రమే వచ్చేలా చేసాడట. ఈ సంఘటన మినహా ఎక్కడా తన జీవితంలో కులపరమైన భేదభావం ఎదురకొన్నట్లు తెలుపరు. అంతేకాక ఫ్రెంచి అధికారులు తనను ప్రేమగా చూసుకొనేవారని కూడా అంటారు. భారతదేశ దళిత ఆత్మకథలకు భిన్నంగా ఉంటుందీ కోణం. ఆ విధంగా శ్రీ దడాల ఆత్మకథ మిగిలిన భారతీయ దళిత ఆత్మకథతో పోల్చినపుడు ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.

దీనికి ఈ కారణాలు ఊహించవచ్చు

1. ఫ్రెంచిపాలనలో కులవివక్ష పెద్దగా లేదని భావించటం. యానాంలో 1849 నుంచి కులమతాలకు అతీతంగా విద్యాబోధన ఉండేది` అప్పట్లో యానాంలో విద్యాభ్యాసం చేసిన ప్రముఖ తెలుగుకవి శ్రీ చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి యానాం స్కూలులో మాల మాదిగలతో కలిసి కూర్చోవలసి వచ్చేదని ఒక వ్యాసంలో అంటారు. యానానికి చెందిన ప్రముఖ సమకాలీన కవి శిఖామణి ఒక చోట ‘‘నేను యానాంలో పుట్టి పెరగటం వలన కులపరమైన వివక్షను పెద్దగా ఎదుర్కొన లేదు’’ అని ఒక ఇంటర్వూలో చెపుతారు. ఇవన్నీ ఈ ప్రతిపాదనకు ఆధారాలుగా నిలుస్తాయి.

2. విదేశీయుడైన ఫాదర్ గాంగ్లాఫ్ సంరక్షణలో శ్రీ దడాల పెరగటం వలన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి విశామైన ఫ్రెంచి ఆదర్శాలను వంటపట్టించుకొని ఉండొచ్చు.

3. సామాజికంగా ఎదుర్కొనే కులవివక్షను ఏ మాత్రమూ ఖాతరు చేయని దృఢచిత్తం కలిగిఉండి, మహోన్నత ఆశయాలకొరకు జీవితాంతం శ్రీ దడాల పాటుపడి ఉండవచ్చు. బహుసా తాను ఎదుర్కొన్న కులపరమైన అవమానాలు తన లక్ష్యసాధన ముందు చిన్నవిషయాలుగా శ్రీ దడాల భావించారని కూడా అనుకోవచ్చు.

ఈ నేపథ్యంలోంచి శ్రీ దడాల స్వీయచరిత్రను పరిశీలించినపుడు ఆయన జీవితంలో దళిత వెతలు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగించదు. కానీ శ్రీ దడాలకు దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన, సహానుభూతి ఉన్నాయి. అందుకనే ఈ పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాటలో ` ‘ నేను 1963 లో పదవీవిరమణ చేసి నా పూర్వీకుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేపట్టాను, ఒక కూలీగా కాదు, ఒక భూస్వామిగా. ఇన్నేళ్ళ నా శ్రమఫలాల్ని నేను ఇపుడు అనుభవిస్తున్నాను. కానీ 150 మిలియన్ల నా దళిత, ఆదివాసీ సహోదరల దుస్థితి పట్ల నాకేమాత్రం ఉదాశీనత లేదు. ఆకలితో, పీడనతో, సజీవదహనాలతో, హత్యలతో, నా సహోదరులు చనిపోవటాన్ని నేను ఉపేక్షించలేను. నా జాతి స్త్రీలు బలాత్కరింపబడుతున్నారు, రోడ్లపై నగ్నంగా ఊరేగింపబడుతున్నారు’` అని ఎంతో ఆవేదనతో అంటారు. అంతేకాక యునైటెడ్ నేషన్స్ చార్టర్ 55 మరియు 56 ఆర్టికిల్ ప్రకారం అస్పృశ్యత, జాతివివక్ష, జనహననం వంటివి అంతర్జాతీయ నేరాలు... మన జాతిని కాపాడుకోవటానికి యు.ఎన్.ఒ. ను ఆశ్రయించాని సూచిస్తారు. ఇది ఆదర్శప్రాయమైన, గొప్ప ప్రాపంచిక అవగాహన కలిగిన ఒక దళిత ఆలోచనాపరుని దృక్పథం.

ఈ ఆత్మకథలో మనకు - స్వీయ అస్థిత్వాన్ని అన్వేషిస్తూ ఒక దళితయోధుడు చేసిన సాహస ప్రయాణం కనిపిస్తుంది. తరతరాలుగా అణచివేతకు గురయిన తన జాతికి చరిత్రలో ఒక సగౌరవ స్థానం కల్పించటానికి ఒక దళితదార్శనికుడు చేసిన పోరాటం తెలుస్తుంది. స్వేచ్ఛ స్వతంత్రాలకొరకు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఉద్యమం సాగించి విజయం సాధించిన గొప్ప దేశభక్తుడు దర్శనమిస్తాడు. తనప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఉద్యమంవల్ల తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని కలగకూడదని వారిని సురక్షితంగా కాపాడుకొన్న మంచి కుటుంబపెద్ద కనిపిస్తాడు. అప్పట్లో బ్రిటిష్ పాలనలోని భారతీయ అధికారులు ప్రభుత్వపక్షాన చేరి తమ సహోదరుల పట్ల దమనకాండ సాగించేవారు. భారతస్వాతంత్య్రపోరాట చరిత్రలో ఉన్నత పోలీసు ఉద్యోగాన్ని ఒదిలి స్వాతంత్య్రపోరాటంలో పాల్గన్న ఒకే ఒక వ్యక్తి శ్రీ దడాల మాత్రమే. దీనికి ఆయన ఎంతో గర్వపడేవారు. ఇవన్నీ ఉత్తమ మానవవిలువలు. ప్రతిఒక్కరూ స్ఫూర్తి పొందగలిగిన లక్షణాలు.

తన ఆత్మకథ ఎందుకు వ్రాసానో శ్రీ దడాల చెపుతూ ‘ నేను దళిత క్రిష్టియన్ ని. నేనేదో గొప్ప విషయాన్ని సాధించానని చెప్పుకోవటం లేదు. కానీ నా వినమ్ర జీవితంలోని విషయాలను తెలుసుకొని ఏ కొద్దిమంది యువతీయువకులైనా, ముఖ్యంగా నా దళిత సహోదరులు స్ఫూర్తినొందుతారని నా ఆశ ’ అంటారు. శ్రీదడాల తన జీవితంలో ప్రదర్శించిన పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటపటిమను భావితరాలకు తెలియచెప్పటానికి యానాం ప్రభుత్వం- శ్రీ దడాల రఫేల్ రమణయ్య గారి నిలువెత్తు కాంశ్య విగ్రహాన్ని యానాం, ఫెర్రీరోడ్డులో 1993లో ప్రతిష్టింపచేసి, తన గౌరవాన్ని చాటుకుంది.

రిఫరెన్సులు

1. My Struggle for freedom of French Provinces in India - An Autobiography’ by Sri. Dadala Raphael Ramanayya
2. Cultural study of dalit autobiographies in India. by Landage, Ramesh, - source Shodhganga
3. మరాఠీ దళిత ఆత్మకథా ప్రక్రియ, డా. జి.వి. రత్నాకర్ 26-3-12 సూర్య దినపత్రిక/డా.దార్ల వెంకటేశ్వర రావు బ్లాగు
4. ఫ్రెంచి ఇండియా విమోచకుడు, దడాల రమణయ్య, 29 జూన్, 2008 ఆంధ్రజ్యోతి లో ప్రముఖ కవి శిఖామణి వ్యాసం
5. కథలు గాథలు, చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి, పేజి నంబరు 403
6. ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం, బొల్లోజు బాబాImage may contain: 1 personNo photo description available.

. --- బొల్లోజు బాబా

శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు గారికి, వారి సతీమణి గారికి నా నివాళులు

 గొప్ప సహృదయులు, పండితుడు, విజ్ఞానఖని, నిరంతర సాహితీకృషీవలుడు శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు గారికి, వారి సతీమణి గారికి నా నివాళులు

శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు గారు 15 సంవత్సరాలు విజయవాడ ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా పనిచేసి 1977 లో సహకారశాఖలో డిప్యూటి రిజిస్ట్రారుగా ప్రవేశించి చివరగా జాయింట్ రిజిస్ట్రారుగా 1998 జూన్ లో పదవీవిరమణ చేసారు. వీరు చరిత్ర, సాహిత్య విషయాలపై సుమారు 400 వ్యాసాలు, పలుగ్రంధాలు వ్రాసి సాహిత్యవేత్తగా పేరుగాంచారు.

శ్రీ ఏకాంబరాచార్యులు 9-9-1940 లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లెపాలెం గ్రామంలో శ్రీమతి గున్నమ్మ, శ్రీ రామస్వమి దంపతులకు జన్మించారు. స్వగ్రామంలో ప్రాధమిక విద్య, కోలంకలో హైస్కూలు విద్య, నర్సాపురం వై.ఎన్ కాలేజీలో ఉన్నత చదువులు అభ్యసించారు.

వీరి రచనలు
1. భారతదేశ చరిత్ర (ఇది ఆంధ్రవిశ్వవిద్యాలయ కరస్పాండెన్స్ కోర్సు వారికొరకు వ్రాయబడినది
2. గణితబ్రహ్మ - లక్కోజు సంజీవరాయశర్మ
3. ప్రసంగ తరంగిణి
4. సుప్రసిద్ధ చరిత్ర శాసన పరిశోధకులు శ్రీ బి.ఎన్. శాస్త్రి
5. వ్యాసకేదారం
6. కొప్పరపు సోదర కవులు
7. మల్లంపల్లి సోమశేఖర శర్మ
8. విశ్వబ్రాహ్మణ సర్వస్వము
9. అవధాన సర్వస్వం

2009 లో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ పొందారు.
వీరి అర్ధాంగి శ్రీమతి రుక్మిణి. ఈ దంపతులకు రాపాక వెంకట గోపాల్, రఘురామ్, సత్యనారాయణమూర్తి, రాపాక కనకమ్మ అనే సంతానం కలదు. వీరికి సాహితీ సుత్రామ అనే బిరుదు కలదు.Image may contain: 2 people, text that says "డా|| రాపాక ఏకాంబరాచార్యులు, శ్రీమతి రాపాక రుక్మిణి"

బొల్లోజు బాబా

బహుముఖీన సాహిత్య సృజనకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

 ప్రముఖ కవి, కథకుడు, విమర్శకుడు, చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు అయిన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

బొల్లోజు బాబా

****

బహుముఖీన సాహిత్య సృజనకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

ఆనందోపదేశాలే సాహిత్యప్రయోజం అని విశ్వసిస్తూ నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగం సాగిసున్నారు ప్రముఖ కవి, విమర్శకులు, చిత్రకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్. వ్యక్తిగా శ్రీ మాకినీటి సూర్యభాస్కర్ సౌమ్యులు, స్నేహశీలి, మృధుభాషి. ఆత్మవిశ్వాసానికి, నిజాయితీకి నిండైన రూపం వీరు. పద్యం, కవిత్వం, గేయం, చిత్రలేఖనం, కథలు, పరిశోధనా వ్యాసాలు, విమర్శలాంటి వివిధ ప్రక్రియలలో ఉత్తమప్రమాణాలతో కూడిన రచనలు చేసే శ్రీమాకినీడి సూర్యభాస్కర్ వేయిచేతులతో విరాజిల్లే కార్తవీర్యార్జునుడిలా కనిపిస్తారు.

1. చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు

చిత్రకారుడి గా మాకినీడి స్థానం చాలా గొప్పది. వీరు లిఖించిన అనేక చిత్రాలు వివిధ జాతీయ చిత్రకళా ప్రదర్శనలలో చోటుచేసుకొన్నాయి. క్యూబిజం అనే టెక్నిక్ లో వీరు చిత్రించిన మహాత్మా గాంధి చిత్రం జాతీయ స్థాయి బహుమతి పొందింది.

చిత్రకళా విమర్శకునిగా మాకినీడి 12 పుస్తకాలు వ్రాసారు. తెలుగు సాహిత్యలోకంలో సంజీవ్ దేవ్ తరువాత కళావిమర్శలో అంతటి స్థానాన్ని పొందిన వ్యక్తి మాకినీడి తప్ప మరొకరు కనిపించరు. వీరు ఇటీవల రచించిన “దామెర్ల-కళ-వారసత్వం” పుస్తకంలో ప్రముఖ తెలుగు చిత్రకారుడు శ్రీ దామెర్ల రామారావు జీవితాన్ని, వారి చిత్రాలలోని అంతఃసౌందర్యంతో సమన్వయపరుస్తూ చాలా పరిణిత శైలీ విన్యాసం కనపరుస్తారు. రామారావు గారు చిత్రించిన ఒక్కో చిత్తరువులోని రంగుల మేళవింపును వాటిలోని గుఢార్ధాలను వివరించిన రీతి అబ్బురపరుస్తుంది. చిత్రకళా విమర్శకునిగా వీరిపుస్తకాలలో “రామారావు నుంచి రామారావు దాకా” (2009), “దామెర్ల-ఆధునికాంధ్ర చిత్రకళ ఆద్యుడు”, “సంజీవ్ దేవ్- ప్రకృతి గీతాలపకుడు”, “డా. పి.ఆర్. రాజు చిత్రాలు –సౌందర్య వర్ణగీతాలు” వంటి పుస్తకాలు వీరికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తెలుగు సాహిత్యరంగంలో చిత్రకళా విమర్శకునిగా మాకినీడి సూర్యభాస్కర్ ది వేరెవరూ భర్తీ చేయలేని స్థానం.

2. బాల సాహిత్యవేత్త

శ్రీమాకినీడి సూర్యభాస్కర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రతిరోజు అసెంబ్లీలో చదవటానికై అప్పటికప్పుడు సూక్తులను పద్యాలరూపంలో వ్రాసి విద్యార్ధులకు ఇచ్చి చదివించేవారట. ఒకరోజు స్కూల్ కి వచ్చిన సాహితీపోషకులు శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు, ఈయన వ్రాస్తున్న పద్యాలను చూసి బాగున్నాయని మెచ్చుకొని బాల గేయాలు వ్రాయండి అని ప్రోత్సహించారు. అలా వ్రాసిన బాలగేయాలను కలిపి 1996 లో “జ్యోతిబాల” పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. జ్యోతిబాల గేయాలు పిల్లల భావనాశక్తిని పెంచుతూ, విజ్ఞానాన్ని అందిస్తాయి. శ్రీ మాకినీడి ఇంతవరకూ 6 బాల సాహిత్య పుస్తకాలను వెలువరించారు.

3. ఆర్థ్రకవిత్వపు చిరునామా

సుమకవితాంజలి పేరుతో పద్య ఖంఢకావ్యాన్ని వెలువరించారు. చిన్న చిన్న పదాలతో గంభీరమైన భావాలను పొదిగించి వ్రాసిన ఈ పద్యాలు పలువురి మన్ననలు పొందాయి. ఈ పద్యాల గురించి నాగభైరవ కోటేశ్వర రావు “ఈ పద్య ప్రసూనాలకి మంచి రంగు ఉంది, మంచి రుచీ ఉంది. మంచి వాసన ఉంది. చిత్రకారుడు కాబట్టి రంగును అద్దాడు. రుషీత్వం ఆవహించి రుచిని అద్దాడు. వాక్సతీ కటాక్షవీక్షణంలో తడిసి వాసననూ రుద్దాడు” అంటారు.

వచన కవిగా పది సంపుటాలు వెలువరించారు శ్రీ మాకినీడి. ఇవి సుమకవితాంజలి (1997), ప్రకృతి గీసిన వికృత చిత్రం (2002), సెలవ రోజు (2003), కలల పెదవుల నవ్వుల్లోకి (2009), సామెతకో పద్యం (2009), పాపికొండల్లో పడవ పాట (2011), ఆమె (2012), తడితడిగా ఆలోచించే (2013), నాకు నేను దొరికిన క్షణాలు (2016). అనేకులుగా (2019). వీరి కవితా సంపుటుల్లోంచి కొన్ని వాక్యాలు

//పువ్వులో శీర్షాసనం వేస్తేనే
తేనెటీగలకు మధువు దొరికేది
తలకిందులై ముక్కుతో
జలగర్భం చీలిస్తేనే
కింగ్ ఫిషర్ కు చేపలు దొరికేది

మనిషీ!
నువ్వూ లోనికి
లోలోనికి…నీలోనికి//
శీర్షాసనం వెయ్యాలి (శీర్షాసనం) బాహ్యదృష్టే ప్రధానంగా, అంతర్ దృష్టి పనికిమాలినిదిగా స్థిరపడుతున్న ఆధునిక సంస్కృతికీ వాక్యాలు చెంపపెట్టు.

బాల్యం పుప్పొడి రాలిన
వృద్ధాప్యపు పుష్పాలు
వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన
ఆశ్చర్యార్ధకాలు! (వృద్ధాప్యపు పుష్పాలు) వృద్దాప్యాన్ని వర్ణించే చక్కని పదచిత్రం. దీనిలోని ఆర్ధ్రత, వ్యంజన కదిలిస్తాయి. శ్రీమాకినీడి కవిత్వం ఆర్థ్రంగా ఉండి హృదయాన్ని రంజింపచేస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది.

మాకినీడి సూర్యభాస్కర్ మంచి కథకుడు కూడా. అంతఃస్సౌందర్యం పేరిట 2003 లో కథల సంపుటి తీసుకొచ్చారు.

4. సునిశిత విమర్శకుడు

విమర్శకునిగా శ్రీ మాకినీడి అనితరసాధ్యమైన కృషి చేసారు. సమకాలీన విషయాలపై సాధికారిక అభిప్రాయాలు వెల్లడించే విషయంలో ఒక విమర్శకుడిగా వీరి గొప్పతనం తెలుస్తూంది. తెలుగులో హైకూల ప్రక్రియ ప్రారంభం అవుతున్న తొలిరోజులలో “హైకూ కవిత్వం-అనుశీలన, ఒక అవగాహన” పేరిట విశ్లేషణాత్మక విమర్శనా పుస్తకాన్ని వెలువరించారు. హైకూలపై వచ్చిన మొదటి పుస్తకం ఇదే. ఆ తరువాత నానీలు, రెక్కలు, నానోలపై కూడా తొలి విమర్శనా వ్యాసాలు వ్రాసారు.

ముప్పై ఆరు కథలను తీసుకొని వ్రాసిన విశ్లేషణాత్మకమైన విమర్శనా వ్యాసాల గ్రంధం “కంచికి చేరని కథ”. ఈ పుస్తకంలో వివిధ కథలలోని కథలోని శిల్పం, ప్లాట్, కథనం, పాత్రలను చాలా లోతుగా విశ్లేషించారు. ప్రతీ విమర్శనా వ్యాసం క్రిందనా ఆయా కథకుల వివరణాత్మక అభిప్రాయాలు కూడా జతచేయటం వల్ల ఈ పుస్తకానికి అదనపు విలువ వచ్చింది.

‘రచన-రసన” పేరుతో సినారె, అద్దేపల్లి, మిరియాల లాంటి లబ్దప్రతిష్టులైన కవుల సాహిత్యవ్యక్తిత్వ సమీక్ష రాయటానికి ఎంతో తెగువ, తెలివిడి ఉండాలి. ఈ పుస్తకంలో సినారె గురించి “కాలాన్ని కత్తిరించి ప్రయోజనకరంగా ఉపయోగించుకోగల నిలువెత్తు క్రమశిక్షణ సినారె” అంటారు మాకినీడి. ఎంత చక్కని మానవీయ దర్శనం అనిపించక మానదు.

అలాగే వివిధ కవితాసంపుటులపై వ్రాసిన వంద సమీక్షావ్యాసాలను “కవిత్వం చిరునామా” పేరిట ఒక గ్రంధాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో అంతవరకూ వివిధపత్రికలు ప్రచురించిన వీరి మొత్తం సమీక్షావ్యాసాలలో నాలుగువంతు మాత్రమే ముద్రిస్తున్నానని ముందుమాటలో అనటాన్ని బట్టి మాకినీడి ఏమేరకు సాహితీ కృషి జరిపారో ఊహించుకోవచ్చు.

వీరి విమర్శ ఎంత మృధువుగా ఉంటుందో అవసరపడినప్పుడు అంతే కఠినంగానూ ఉంటుంది. ఉదాహరణకు; డాలీ రాసిన కొన్ని హైకూలను విమర్శిస్తూ “అవి హైకూలా ? ఆ పేరుతో రాసినా కైకూలా? వీటిలో ఏ మార్మికతా లేదు, మరే తాత్విక ప్రేరణా కనబడదు” అంటారు. సందర్భం వచ్చినపుడు నిక్కచ్చిగా మాట్లాడటం విమర్శకునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అది శ్రీమాకినీడిలో పుష్కలంగా ఉంది.

విమర్శకునిగా మాకినీడి కళాసాహితీ తోరణం (1998), హైకూ కవిత్వం అనుశీలన (1999), కలం కలలు (2003), దృక్కోణం (2003), రెండు ఎలిజీల మధ్య (2004), తాత్విక రెక్కలు (2008), అద్దేపల్లి కవిత్వం-వ్యక్తిత్వం, తత్వం (2006), పద్యం-హృద్యం (పద్యకావ్యాలపై విమర్శనా వ్యాసాలు-2014), సత్యాన్వేషణలో (2003) లాంటి వివిధ పుస్తకాలను రచించారు. విమర్శకునిగా మాకినీడి కృషి సామాన్యమైనది కాదు. చాలా వ్యాసాలలో తనదైన శైలిని నిలుపుకొంటూనే నచ్చని చోట నిర్మొహమాటంగా చెప్పటం ఈయన పద్దతి.

5. మంచి అకడమిషియన్

సాధారణంగా కవిగానో, చిత్రకారునిగానో ఎక్కువ సమయాన్ని వెచ్చించే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు అకడమిక్ గా వెనుకపడిపోతారు. కానీ బయాలజి ఉపాద్యాయునిగా పనిచేస్తున్న మాకినీడి, టిటిసి విద్యార్దులకొరకు టెక్స్ట్ బుక్స్ రచించారు. సైంటిఫిక్ టెంపర్, కొలెస్టిరాల్, ఏయిడ్స్ నియంత్రణ బుర్రకథ లాంటి శాస్త్రీయ అవగాహన పెంచే రచనలు చేసారు. ఇవి వారి జ్ఞాన తృష్ణ ను ప్రతిబింబిస్తాయి.

6. మాకినీడి సాహిత్యంపై వచ్చిన ఇతరుల పుస్తకాలు

మాకినీడి రచనల పరిధి చాలా విస్తారమైనది. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా ఈయన పోషించిన వివిధ పాత్రలలోని వైవిధ్యం పలువురు సాహితీవేత్తలను ఆకట్టుకోవటం వల్ల వీరి రచనలపై ఇతరులు వ్రాసిన గ్రంధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరిరచనలు పరిశోధకులను అనంతమైన గని వలే అన్వేషించుకోమ్మని ఆహ్వానిస్తాయి ఎం. శేఖర్ “మాకినీడి వచన కవితా సంపుటాలు-పరిశీలన” పేరుతో ఎం.ఫిల్ చేసారు. “సంపాదకునిగా మాకినీడి” అనే శీర్షికతో ర్యాలి శ్రీనివాస్ ఎం.ఫిల్ చేసారు. “మాకినీడి సమగ్ర సాహిత్యం” పేరిట వి విజయకుమార్ పి.హెచ్.డి పొందారు. ప్రముక కవి కథకుడు శ్రీహస్త “మనసున్న మాకినీడి” పేరుతో వ్యాస సంపుటి వెలువరించారు.

***

ఇన్ని బహుముఖీన రంగాలలో ప్రతిభా,వ్యుత్పత్తులను కలిగి ఉన్న మాకినీడి సూర్యభాస్కర్ తో పోల్చదగిన మరొక సాహితీమూర్తి తెలుగుసాహిత్యంలో ఆరుద్ర ఒకరే కనిపిస్తారనటం అతిశయోక్తి కాబోదు. నాలుగు దశాబ్దాల కాలంలో సుమారు ఎనభై పుస్తకాలు వెలువరించటం సామాన్యమైన విషయం కాదు. అవి కూడా భిన్నరంగాలలో, ఉన్నతప్రమాణాలతో, పరిశోధనా స్థాయిలతో వ్రాయటం అత్యంత కష్టతరమైన విషయం. అదంతా శ్రీమాకినీడి వారి అకుఠింత శ్రమ, అవిరళ కృషి, నిర్విరామ సాధనలకు నిదర్శనం.

ఆనందోపదేశాలే సాహిత్యప్రయోజనం నమ్మి, ఆ భూమికపైనే నిలబడి సృజనచేసిన సాహితీవేత్త శ్రీ మాకినీడి సూర్యభాస్కర్.

రాత్రి పన్నెండు గంటలకు మేల్కొని తెల్లవరేవరకూ సాహిత్యం కొరకే శ్రమించటం శ్రీ మాకినీడి పాటించే క్రమశిక్షణ. అలా నలభై ఏళ్లపాటు జీవితాన్ని సృజనకొరకే అర్పించి వివిధ రంగాలలో సుమారు ఎనభై పుస్తకాలను వెలువరించిన ఈ సాహితీ మూర్తికి – ఈ సమాజం తిరిగి ఏమిచ్చిందీ అని ప్రశ్నించుకోవాల్సి రావటం దురదృష్టకరం.Image may contain: 1 person, standing, outdoor and water

బొల్లోజు బాబా
17/8/2019

వెండి ఇటుక


దేవదేవుని అనిమీలిత నేత్రాల ముందు
మోకరిల్లిన భిక్షుక సమూహం.
భక్తి ఒక జీవన మార్గం.

ఒకానొక విజయోత్సవ సంరంభంలో
ఉద్రిక్త సమూహంచే తునియలైన
మందిరం.
నా దైవం.... నా దైవం అంటూ ఆక్రోశించిన గొంతుకలన్నీ
రక్త గుండానికి ఆహుతయ్యాయి.

మరో వెండి ఇటుక ఉదయించింది.

దేవదేవుని నిమీలిత నేత్రకాంతుల ధారలో
మోకరిల్లిన భక్త సమూహం
భక్తి ఒక ముక్తి మార్గం.

ఒకానొక విజయోత్సవ సంరంభంలో
ఉద్రిక్త సమూహంచే తునియలైన
మందిరం.
నా దైవం.... నా దైవం అంటూ ఆక్రోశించిన స్వరాలన్నీ
ఖడ్గ చాలనానికి బలి అయినాయి

మరో వెండి ఇటుక మొలకెత్తింది.

దేవదేవుని ఇచ్ఛకు అంకితమైన
భక్త సమూహం
భక్తి ఒక గ్రంధం చూపే మార్గం.

ఒకానొక విజయోత్సవ సంరంభంలో
ఉద్రిక్త సమూహంచే తునియలైన
మందిరం
నా మందిరం ... నా మందిరం అన్న గళాలు
తంత్రానికి తలొగ్గాయి.

నేడు తళ తళ లాడుతూ
మరో వెండి ఇటుక.
***

కాలానికిదేం కొత్తకాదు
మరో వెయ్యేళ్ళకు
వెండి ఇటుక చేతులు మారొచ్చు.

బొల్లోజు బాబా

మూడో కన్నీటిచుక్క కవిత్వసంపుటి "పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం -2020"

 మూడో కన్నీటిచుక్క కవిత్వసంపుటి "పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారం -2020" పొందటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నిర్వాహకులు డా. పాతూరి అన్నపూర్ణ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

న్యాయనిర్ణేతగా వ్యవహరించిన డా. పెరుగు రామకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారములు. నా సహ గ్రహీతమిత్రులైన శ్రీ దేశరాజుకు, శ్రీ అనిల్ డానీకి అభినందనలు.

వెన్నుతట్టి ప్రోత్సహించే మిత్రులు, పెద్దలకు సదా కృతజ్ఞుడను.Image may contain: 1 person, text

Sunday, August 23, 2020

కవి కులవత్సలుడు హాలుడు

 కవి కులవత్సలుడు హాలుడు - పార్ట్ 14

సప్తశతి గాథలను హాలుడు అనే శాతవాహన రాజు సేకరించాడు. ఇతనికి సంబంధించిన నాణాలు, శాసనాలు లేకపోవటంతో అది మారుపేరు కావొచ్చునని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. హాలుడు, శాతవాహనుడు అనే పేర్లు పర్యాయపదాలుగా సాహిత్యంలో కనిపిస్తాయి.

సప్తశతీ గాథలు ఎలా పుట్టాయో వివరించే కథ ఒకటి చెపుతారు. హాల చక్రవర్తి సరస్వతి దేవిని నిత్యం పూజించేవాడట. ఒకనాడు ఆమె ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మని అనగా తన రాజ్యంలో సరస్వతిదేవిని శాశ్వతంగా ఉండిపొమ్మని కోరుకొన్నాడట. ఆమె మూడురోజులు ఉండెదనని వరమిచ్చిందట. ఆ మూడురోజుల పాటు రాజ్యంలోని ప్రజలందరూ కవులుగా మారి అద్భుతమైన కవిత్వం చెప్పారట. అలా కొన్ని కోట్ల గాథలు పుట్టాయి. వాటిలోంచి హాలుడు ఉత్తమమైన ఏడువందల గాథలను ఎంపిక చేసి సప్తశతిగా కూర్చాడంటారు.

ఈ కథ బహుసా ఈ క్రింది గాథలో ఉన్న కోటానుకోట్ల అన్న పదానికి అందంగా చెప్పిన అన్వయంగా అనిపిస్తుంది.
.
ఈ ప్రపంచంలో కోటానుకోట్ల గాథలున్నాయి
వాటిలోంచి ఏడువందలు ఏరి
సప్తశతిగా కూర్చెను
కవికులవత్సలుడు హాలుడు (3)
.
పై కథ ద్వారా సప్తశతి అనేది ఒక సమిష్టి కృషి అని, దైవత్వాన్ని ఆపాదించటం ఈ గాథలను అజరామరం చేయటానికేనని అర్ధం చేసుకోవాలి. మరొక గాథలో శాతవాహన చక్రవర్తి పేరు ప్రస్తావన కనిపిస్తుంది. రాజు దైవస్వరూపుడు అనే భావనకు అతి ప్రాచీనరూపమిది.
.
కష్టకాలంలో మనలను కాపాడేది
ఇద్దరే ఇద్దరు
ఒకరు గౌరి వల్లభుడు
మరొకరు శాతవాహన చక్రవర్తి (567)
.
సప్తశతి గాథలలో వచ్చే మరొక రాజు విక్రమాదిత్యుడు. మొదటి విక్రమాదిత్యుడు క్రీపూ 57 కు చెందిన రాజు.

వీరోచితంగా పోరాడిన సైనికునికి విక్రమాదిత్యుడు లక్షవరహాలు బహూకరించినట్లుగా ఆమె తన పాదాలను కడిగినందుకు పారాణి గుర్తులను అతని చేతులకు బహూకరించింది. (564)
***
గాథాసప్తశతి వ్రాయబడిన కాలంలో శాతవాహన సామ్రాజ్యం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తరువాత వరుసగా వచ్చిన నలుగురు రాజులు మొత్తం పన్నెండేళ్ళు మాత్రమే పాలించారు. అదంతా సంక్షోభసమయం. యవనులు, శకులు, పహ్లావాలు లాంటి వివిధ శత్రురాజులు శాతవాహన రాజ్యాన్ని అన్నివైపులనుంచీ ముట్టడించటంతో అది చాలా మేరకు క్షీణించింది. తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో పునర్వైభవం పొందింది. ఈ రాజకీయపరమైన సంక్షోభాలను గూర్చి ఏ రకమైన ప్రస్తావనలు గాథలలో లేకపోవటం గమనార్హం.
సాహిత్యపరంగా శాతవాహనుల పాలన అనంతరం సంస్కృతభాష క్రమేపీ పైచేయి సాధించింది.
***

1. హాలుని కాలం
.
శాతవాహనుల పాలనాకాలంపై ఈనాటికీ చర్చ జరుగుతూ ఉన్నది. శాసనాధారాల ఆధారంగా శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుని పాలనా కాలం క్రీస్తు పూర్వం 120-96 అనుకొంటే హాలుడు క్రీశ. 20-24 మధ్య పాలించిన రాజుగా భావించవచ్చు. పురాణాలలో చెప్పబడిన ముప్పై మంది శాతవాహన రాజులలో హాలుడు పదిహేడవ వాడు. హాలుడు నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు

సప్తశతి గాథలు రచింపబడిన కాలం ఒకటో శతాబ్దం కాకపోవచ్చని D.R. Bandarkar ప్రతిపాదించారు. దీనికి ఆధారంగా సప్తశతిలోని 261 వ గాథలో మంగళవారం అన్న పదాన్ని, 89 వ గాథలో "రాధాకృష్ణుల ప్రేమ"ని చెప్పటాన్ని ఉదహరిస్తారు. ఎందుకంటే- రోజులను వారాలుగా వ్యవహరించే పద్దతి మొదటిసారిగా క్రీశ 398 లో వ్రాసిన శ్రీలంకకు చెందిన ఒక శాసనములో కనిపిస్తుందని, రాధాకృష్ణుల భక్తిభావన అయిదో శతాబ్దంలో వ్రాయబడిన పంచతంత్ర లో మొదటగా కనిపిస్తుందనీ ఆధారాలుగా చూపిస్తారు.

1881 లో వీబర్ సేకరించిన వివిధ వ్రాతప్రతులలో మొత్తం 430 గాథలు అన్నింటిలో ఉండగా మిగిలిన గాథలు మారుతూ వచ్చాయి. మొత్తం నేడు సుమారు తొమ్మిది వందల గాథలు లభిస్తున్నాయి. ఆ మిగిలినవి అన్నీ తదుపరి శతాబ్దాలలో చేర్చిన ప్రక్షిప్తాలు కావొచ్చునని పండితులు నిర్ధారించారు.

***

2. ఇతరకావ్యాలలో హాలుని గురించిన ప్రస్తావనలు
.
* క్రీశ 620 లో బాణుడు తన హర్షచరిత కావ్యంలో -

“సాతవాహనుడు మేలిమి రత్నాల్లాంటి
గాథలను సేకరణ జరిపాడు” ........ అంటూ చేసిన వ్యాఖ్య చరిత్రలో సంకలనకర్తగా హాలుని గురించి చేసిన తొలి ప్రస్తావన.

* క్రీశ 779 లో జైన పండితుడైన ఉద్యోదనసూరి తన కువలైమాల గ్రంధంలో -

“మత్తెంక్కించే మాటలతో
పామరులను కూడా కవులను చేసిన
హాలుని గాథలు ఉండగా ఇక కవిత్వం వ్రాసి
ప్రయోజనం ఏముంది? ....... అంటూ హాలుని సప్తశతిగాథల సాహిత్యవిలువను కీర్తించాడు.

* తొమ్మిదో శతాబ్దానికి చెందిన అభినందుడు తన రామచరిత కావ్యంలో శ్రీ హర్షుడు "హాలుని వలె" కవుల ప్రతిభను చాటే గాథలసంకలనాన్ని కూర్చాడని వర్ణించాడు.

* పన్నెండో శతాబ్దానికి చెందిన గోవర్ధనుడు తన ఆర్యసప్తశతి కావ్యంలో హాలుని గాథాసప్తశతిని ప్రస్తావించాడు.

*హర్షచరిత వ్రాసిన భాణభట్టు హాలుని ప్రస్తావన చేసాడు.

* భోజరాజు వ్రాసిన ఒక కావ్యంలో హాలుని ప్రసక్తి ఇలా ఉన్నది
హరిచంద్ర, హాలుడు వీరిరువురే కవులు. మనలాంటి వారందరమూ కవులుగా పిలవబడుతున్నవారం అంతే. (భోజ చక్రవర్తి వ్రాసిన శృంగార ప్రకాశ కావ్యం. 100)

* 5వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు రచించిన వజ్జలగ్గసప్తశతి కూడా గాథాసప్తశతిలాంటి కావ్యమే. వజ్జలగ్గలో హాలుని ప్రస్తావన ఒక గాథలో కనిపిస్తుంది.

హాల మహాచక్రవర్తి మరణించినా
ప్రతిష్టానపురం గోదావరి నదీతీరంపైనే ఉన్నది. (vajjalagga 468).

ఈ గాథద్వారా హాలుడి రాజధాని ప్రతిష్టానపురమని (మహారాష్ట్ర) తెలుస్తుంది. రాజు మరణించినా రాజ్యం మరణించదు అనే ప్రాపంచిక సత్యం ప్రకటించబడింది.
***
.
3. లీలావతి కావ్యంలో హాలుని పెళ్ళి

ప్రాచీనకాలంలోని విక్రమార్కుడు, భోజుడు వంటి రాజులను కథానాయకులుగా చిత్రించిన కథలు అనేకం కలవు. అదొక సాహిత్య సాంప్రదాయము. ఎనిమిదో శతాబ్దానికి చెందిన కుతూహలుడు హాలుని ప్రధానపాత్రగా తీసుకొని వ్రాసిన కావ్యం పేరు లీలావతి (లీలావాయ్).
.
లీలావతి కావ్యం గోదావరి - సముద్రంలో కలిసే చోటులో జరిగింది.
ఈ కావ్యంలో హాలుడు కథానాయకుడు. ఇతను గోదావరి తీరంపై ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఇతని మంత్రులు పోట్టిస, భట్ట కుమారి లు కాగా ఇతని సైన్యాద్యక్షుడు విజయానంద. హాలుని గురువు పేరు నాగార్జనుడు.

హాలుని వద్ద సేనానిగా పనిచేస్తున్న విజయానందుడు, మంత్రి పొట్టిస ఒకరోజు ప్రతిష్టానపురం నుంచి బయలుదేరి పాండ్యరాజ్యం మీదుగా ధనుష్కోటి చేరుకొని రామేశ్వరాలయంలో పూజలు చేసి తిరిగి బయలు దేరేసమయానికి వీరు ప్రయాణిస్తున్న ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొంటుంది. వీరు ఆ తుఫానులో కొట్టుకుపోయి గోదావరి నది సముద్రంలో కలిసేచోట ఒడ్డుకు చేరుకొంటారు.

ఇక్కడ వారు అడవిలో కొద్దిసేపు ప్రయాణించి భీమేశ్వర దేవుని ఆలయానికి చేరుకొని, దైవ దర్శనం చేసుకొని దానికి దక్షిణం వైపు ఉన్న ఒక మఠంలో బస చేస్తారు.
అక్కడ వీరు హాలుని పెండ్లాడాలని బయలుదేరిన సింహళ దేశ రాకుమారి అయిన లీలావతిని కలుస్తారు.
ఈ విషయాలన్నీ ప్రతిష్టానపురం వెళ్ళి హాలునికి చెప్పగా, హాలుడు బయలుదేరి సప్తగోదావరీ తీరాన కల భీమేశ్వర ఆలయానికి వచ్చి లీలావతిని భీమేశ్వర స్వామి సన్నిధిలో పరిణయమాడటం తో కావ్యం ముగుస్తుంది.

ఇందులో పైన చెప్పబడిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు ఇవి


లీలావతి కావ్యంలో హాలుని వివాహం జరిగిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని; సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు.

1. లీలావాయి గ్రంధంలో నౌకాభంగం జరిగి హాలుని అనుచరులు ఒడ్డుకు కొట్టుకొని వచ్చి కొద్దిదూరం అరణ్యంలో నడిచి భీమేశ్వర ఆలయాన్ని చేరుకొన్నట్లు ఉన్నది. భీమేశ్వర ఆలయం కల ద్రాక్షారామంకు పదికిలోమీటర్ల దూరంలో ప్రాచీన ఓడరేవు ఇంజరం కలదు. (పదహారోశతాబ్దంలో ఇంజరం ఒక బ్రిటిష్ ఫాక్టరీ/రేవుపట్టణం).

ఒక గోదావరి పాయ ఇంజరం, యానాం, గాడిమొగ ల మీదుగా ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది నేటికీ. కనుక సముద్రంలో నౌకాభంగం జరిగి వీరు ఈ పాయగుండా ఇంజరం వద్ద తీరాన్ని చేరుకొని, అక్కడనుంచి పదికిలోమీటర్లు ఉన్న ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని చేరుకొని ఉండవచ్చును. కరీంనగర్ నుంచి సమీప సముద్రతీరానికి కనీసం 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

2. లీలావాయి కావ్యంలో సప్తగోదావరి తీరంపై కల భీమేశ్వర ఆలయం అని మాత్రమే ఉన్నది ద్రాక్షారామము అనిలేదు అది భౌగోళికంగా నేటి ధర్మ పురి వద్ద కలదు అని నరసయ్యగారు అన్నారు. ప్రాచీనకాలంలో ధర్మపురివద్ద గోదావరికి సప్తగోదావరి అన్న పేరుకానీ, అక్కడ ప్రసిద్ధిచెందిన భీమేశ్వర ఆలయం కానీ ఉన్నట్లు మరే ఇతర సాహిత్య ఆధారాలు నరసయ్యగారు చూపలేదు.

3. స్కంద, బ్రహ్మ, వామన, దేవిభాగవత పురాణాలలో సప్తగోదావరి ప్రస్తావనలు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే నేడు ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. ఈ ఏడునదులు సంగమించి అంతర్వాహినులుగా ప్రవహించే ఒక పుష్కరిణి భీమేశ్వర ఆలయంలో ఉన్నది. సప్తగోదావరి పేరిట కల పుష్కరిణి గూర్చిన వర్ణనలు పదిహేనోశతాబ్దంలో శ్రీనాథుడు రచించిన భీమేశ్వరపురాణంలో కలవు.
ఈ ప్రాచీన ఉటంకింపులు అన్నీ నరసయ్యగారు చెపుతున్న కరీంనగర్ సప్తగోదావరి ప్రతిపాదన ఊహాజనితమని నిరూపిస్తాయి.

4. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ లభించే శాసనాలలో అతి పురాతమైనది క్రీశ తొమ్మిదోశతాబ్దానికి చెందినది. అంతకు పూర్వమిక్కడ బౌద్ధ ఆరామం ఉండి ఉండవచ్చుననే వాదన ఉంది.

5. అప్పటికే ఉన్న ఒక వాదనను తిరస్కరించేటపుడు తగిన సమర్ధన ఆధారాలు చూపటం శాస్త్రీయం. లీలావాయిలో చెప్పబడిన సప్తగోదావరి, భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం లో ఉన్నది కాదు అది కరీంనగర్ కు చెందినది అని ప్రతిపాదించేటపుడు అందుకు తగినన్ని ప్రాచీన సాహిత్య ఆధారాలు కానీ, భౌగోళిక ఆధారాలుకానీ, శాసన ఆధారాలు కానీ, పౌరాణిక ఆధారాలు కానీ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ చేయకుండా నరసయ్యగారు తమ వాదనలో గోదావరికి వరదలు ఎక్కువ కనుక ఆ వరదల్లో ఆధారాలు శిథిలమైపోయి ఉండవచ్చు అనే వాక్యంతో సరిపుచ్చటం శాస్త్రీయం కాదు.
***

హాలుడుఒక కుంభకారుని కొడుకు అని; సంస్కృత పాండిత్యము లేని రాజు అని; వాత్సాయనుడి కామసూత్రలో దుష్టుడైన రాజుయొక్క స్నేహితుడని; నాగార్జనాచార్యుడు వ్రాసిన సుహృల్లేఖలలో హాలుని ప్రస్తావన ఉన్నదని; గుణాడ్యుడు వ్రాసిన బృహత్కథను మొదట తిరస్కరించి తరువాత తప్పుతెలుసుకొని ఆ కథలను అగ్నికి ఆహుతికాకుండా కాపాడిన రాజు అని; గొప్ప పండితుడని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సత్యాసత్యాలు విచారించటానికి ఆధారాలు మృగ్యం. కానీ గాథాసప్తశతి సంకలనకర్తగా హాలుని పాత్ర నిర్వివాదాంశం.

హాలుడు ప్రతిష్టానపురం నుంచి సప్తగోదావరి తీరాన కల భీమేశ్వర ఆలయానికి లీలావతిని పెండ్లాడటానికి బయలుదేరినపుడు అతని వెంట వందమంది కవులు ఉన్నారని లీలావతి కావ్యం చెపుతుంది. దీనిని బట్టి హాలుడు కవులను ఆదరించేవాడని కవిజన వత్సలుడు అన్న బిరుదు సబబే అని అనిపించకమానదు. సప్తశతిలో సుమారు నలభై గాథలు హాలుని విరచితములు.

బొల్లోజు బాబా

Monday, August 10, 2020

సప్తశతి గాథలలో ఆర్ధిక లావాదేవీలు - పార్ట్ 13 .

 సప్తశతి గాథలలో ఆర్ధిక లావాదేవీలు - పార్ట్ 13

.
ప్రాచీన భారతదేశములో బలమైన బాంకింగ్ వ్యవస్థ ఉండేదని అనేక శాసనాధారాలు కనిపిస్తాయి. అప్పుకు ఏడాదికి 15% నుండి 69% వరకు వడ్డి చట్టసమ్మతమని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందిన కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఉన్నది. అంతకు మించి వడ్డీ వసూలు చేసే వ్యాపారిని దండించ వచ్చునని చెబుతుంది. వివిధ వృత్తుల వారు Guilds (వ్యాపార సంఘాలు) ఏర్పరచుకొని వ్యాపారాలు నిర్వహించేవారు. కులీనులు ఈ Guilds వద్ద ధనాన్ని దాచుకొనేవారు. అలా దాచుకొన్న ధనానికి 9-12% వడ్డీ లభించేది. దీన్ని ఒకరకంగా నేటి షేర్ మార్కెట్టు డివిడెండ్లతో పోల్చుకొనవచ్చును.

Ushavadata అనే క్షత్రప రాజు 3000 బంగారు నాణాలను Guild of Weavers (చేనేత సంఘం) వద్ద Deposit చేసి- దానిపై ఏడాదికి 12% చొప్పున వచ్చే వడ్డీ ధనాన్ని, వానాకాలంలో ఓ గుహలో ఆశ్రయం పొందే 20 మంది భౌద్ధ భిక్షుకుల అన్నవస్త్రాలకు వినియోగించాలని వేయించిన శాసనం నాసిక్ లోని 10వ నంబరు గుహగోడలపై కలదు. ఇది రెండవ శతాబ్దమునకు చెందిన శాసనం. భౌద్ధ భిక్షుకులు ఊరూరా తిరుగుతూ భౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేవారు. ఆ సమయంలో వీరిపోషణ యాచన ద్వారా చేసుకొనేవారు. వానాకాలంలో వీరి సంచారానికి ఆటంకం ఏర్పడేది. ఆ సమయంలో వీరు గుహలలో తాత్కాలికంగా నివసించి వానలు తగ్గాక మరలా దేశాటనకు బయలుదేరేవారు. వానాకాలంలో భౌద్ధ ప్రచారకుల పోషణ కొరకు రాజు చేసిన ఏర్పాట్లను పై శాసనం తెలుపుతుంది.
***
.
సప్తశతి కొన్ని గాథలలో ఆనాటి బాంకింగ్ వ్యవస్థ గురించి పరోక్ష ప్రసక్తులు కనిపిస్తాయి.
.
బాలకా! తొందరపడకు
బధ్రపరచమని ఉంచటానికి ఇది సరైన చోటు కాదు
నాకు తెలిసున్నంతమేరకు
ఇక్కడ దాచుకొన్న హృదయాల్ని
ఎవ్వరూ తిరిగిపొందలేదు - (154)
.
బహుసా జారిణులను ప్రేమించకు అని ఒక యువకునికి ఇవ్వబడిన ఒక సలహా కావొచ్చు పై గాథ. కానీ between the lines గమనిస్తే, అప్పట్లో భద్రపరచే వ్యక్తులుండేవారని, వారిలో కూడా మంచి బాంకర్లు చెడ్డ బాంకర్లు ఉంటారని తెలుస్తుంది. అంతే కాక చెడ్డ బాంకర్ వద్ద చేసిన Deposit తిరిగి రాదు అనే హెచ్చరిక కూడా కనిపిస్తుంది.

విలువైన వస్తువులను ఇతరుల వద్ద బధ్రపరచటాన్ని నిక్షేపం/Deposit అంటారు. నిక్షేపం తీసుకొన్న వ్యక్తి మోసం చేస్తే దొంగకు విధించే శిక్షనే అతనికీ విధించాలని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. యుద్ధం, దోపిడీలు, అగ్నిప్రమాదం, వరదలు, ఓడలు మునిగిపోయిన సందర్భాలలో Diposits లో కొంతభాగమే ఇవ్వొచ్చు లేదా పూర్తిగా ఇవ్వనక్కరలేదని ఉన్నది.
***
.
ఎవరి ముఖవర్చస్సు దినదినం వృద్దినొందుతూ ఉంటుందో
తండ్రి అప్పు పుత్రులకు సంక్రమించినట్లు
ఎవరి స్నేహసంపత్తి అప్రయత్నంగా పెరుగుతుందో
అలాంటి వారీ లోకంలో అరుదుగా ఉంటారు. (113)
.

తండ్రి చేసిన అప్పు కొడుక్కి వారసత్వంగా వచ్చినట్లు స్నేహితులను తన ప్రయత్నం లేకుండా పొందగలగటం సుగుణంగా చెప్పబడిందీ గాథలో. ఇక్కడ అప్పు, సంపద పోలిక అన్వయదోషంగా అనిపిస్తూన్నా అప్రయత్నసిద్ధిని గురించి చెపుతున్నట్లుగా భావించాలి.
అప్పుతీసుకొన్న వ్యక్తి మరణించిన పక్షంలో అతని జ్యేష్ట కుమారుడిని మాత్రమే దానికి బాధ్యుడిని చేయాలని కౌటిల్యుని అర్ధశాస్త్రం చెపుతుంది.
***

గుప్త నిధుల గురించిన పరోక్ష ప్రస్తావనలు అనేక గాథలలో కనిపిస్తాయి. అప్పట్లో కొద్దిమంది తమ సంపదలను ఇతరుల వద్ద నిక్షేపం (Deposit) చేయటంపట్ల నమ్మకంలేక వాటిని రహస్యంగా భూమిలో పాతర వేసుకొనేవారు.

ఎవరికైనా దొరికిన అలాంటి నిధి లక్ష పణాల కంటే ఎక్కువ ఉంటే రాజుకు చెందుతుందని; తక్కువ ఉంటే ఆ నిధిని కనుగొన్న వానికి దానిలో ఆరవ వంతు బహుమానం రాజు ఇవ్వాలని; ఆ నిధి తమ పూర్వీకులదని నిరూపించుకోగలిగితే అది ఎంత పెద్దమొత్తమైనా పూర్తిగా అతనే పొందవచ్చునని; అలాకాక రహస్యంగా ఏదైనా నిధిని రాజుకు చెప్పకుండా తీసివేసుకొంటే నిధిని స్వాధీన పరచుకోవటమే కాక ఆ వ్యక్తికి వెయ్యిపణాల జరిమానా విధించాలనీ కౌటిల్యుని అర్ధశాస్త్రం చెపుతున్నది.

అయినప్పటికీ నిధి దొరకటం గొప్ప భాగ్యంగా భావించేవారు ఆనాటి ప్రజలు.
.
దుస్తులు గాలికి పైకి లేవటంతో
ఆమె తొడలపై ఉన్న పంటిగాట్లు వెల్లడయ్యాయి
వాటిని చూసిన ఆమె తల్లి
గుప్తనిధి దొరికినంత సంబరపడింది (508)
.
పెళ్ళియిన తరువాత కూతురు కాపురం సుఖంగా సాగాలని అందరూ కోరుకొంటారు. సుఖసంసారానికి భూమిక శృంగారం కూడానని నేడు బహిరంగంగా అంగీకరించలేకపోవచ్చు.... కానీ ఆనాటి ప్రజలు దాన్ని అంగీకరించారు, తమ సంతోషాన్ని ప్రకటించుకొన్నారు. పై గాథలో గుప్తనిధి దొరకటం అనే ఉపమానం ఆకర్షిస్తుంది. గుప్తనిధులు దొరకటం ఏ కాలంలోనైనా గొప్ప అదృష్టమే కదా!
***
.
భార్య చనిపోవటంతో ఇల్లంతా బోసి పోయింది.
ఒకనాడు వారు రతికేళి జరిపిన చోట్లన్నీ
నిధులను ఎవరో తవ్వుకుపోయినట్లు ఖాళీగా ఉన్నాయి
ఆ రైతు వాటినే తదేకంగా చూస్తూ మౌనంగా దుఃఖిస్తున్నాడు. (373)
.
సాధారణంగా కొంతమంది తమ సంపదను ఇంట్లో కానీ ఎవరూ సంచరించని ప్రదేశాలలో కానీ దాచుకొనేవారు. అలా దాచుకొన్న నిధులను దొంగలో లేక ఇతరవ్యక్తులో తవ్వుకొని పోవటం జరిగేదని పైగాథ ద్వారా ఊహించుకోవచ్చు. మానవ సంబంధాలలోని ఆర్థ్రతను ఈ గాథ కరుణరసాత్మకంగా ఆవిష్కరిస్తుంది.


***



.
యోధుని భార్య చన్నులవైపు ఆశగా, కోర్కెతో
దొంగచూపులు చూస్తున్నాడా బందిపోటు
గుండ్రంగా నిండుగా సర్పాలచే కాపాడబడుతున్న
లంకెబిందెల్లా ఆకర్షిస్తున్నాయవి (577)
.
గుప్తనిధులను కాపాడుకోవటం కోసం ఆనాటి కులీనులు తంత్రవిద్యలను ఆశ్రయించేవారని తెలుస్తుంది. సర్పబంధనం ద్వారా రహస్యంగా దాచుకొన్న తమ సంపదలను కాపాడుకోవచ్చునని విశ్వసించేవారు. ఇటీవల పద్మనాభస్వామి ఆలయమాళిగలలో ఒక దానిని తెరవక పోవటానికి సర్పబంధనాన్ని ఒక కారణంగా చూపిన సంగతిని ఇక్కడ గుర్తుచేసుకొనవచ్చును.

పై గాథలో యోధుని పరాక్రమం ఆమెను కాపాడే రక్షణ అని చేసిన ఊహ రమ్యమైనది. Tieken, Basak ల అనువాదాల్లో బందిపోటు అన్న పదానికి Kidnapper, Ravisher అనే పదాలు వాడారు. అప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళుతున్న అర్ధం ధ్వనిస్తుంది. ఆ సమయంలో కూడా Kidnapper భయపడుతున్నాడంటే యోధుని పరాక్రమం అమోఘంగా వర్ణించబడినదని భావించాలి.
***
.
ఆమె చనుద్వయం
ప్రేమను దాచుకొన్న
బంగారు లంకెబిందెలు
ఒక్కోదాని పైనా మన్మధుని
తేనెరంగు అధికార ముద్ర. (813)
.
స్త్రీ స్తనాల areola ల యొక్క రంగు, రూపానికి హృద్యమైన భాష్యం ఈ గాథ. ఇక్కడ అధికార ముద్ర అన్న పదం విశిష్టమైనది.
కౌటిల్యుని అర్ధశాస్త్రంలో - దేశ సరిహద్దుల్లో ఆపత్సమయాల్లో ఉపయోగపడటానికి మరణదండన విధించిన వారితో గుప్తంగా ధనాన్ని పాతరవేయించి దాచుకోవాలని, ఆ పని పూర్తయిన తరువాత వారికి విధించిన మరణదండనం ద్వారా చంపించివేస్తే ఆ రహస్యం బయటపడదని - ఉన్నది. అంటే రాజులు కూడా రహస్యంగా నిధులను ఏర్పాటు చేసుకొనేవారని అర్ధమౌతుంది. బహుసా అలాంటి లంకెబిందెలకు అధికారికంగా రాజ ముద్రలు (Seals) వేసేవారేమో! తరవాత దొరికితే రాజసంపద అని గుర్తించటానికి.
***
.
సప్తశతి కాలానికి శాతవాహనులు వివిధ సముద్రపోర్టుల ద్వారా విదేశీ వ్యాపారాలు సాగించారు. కానీ వారు చేసిన వ్యాపారాలకు సంబంధించి ఏ రకమైన ప్రస్తావనలు ఈ గాథలలో కనిపించవు.

అనేక గాథలలో పురుషులు భార్యాపిల్లలను విడిచి దూరదేశాలకు ప్రయాణాలు కట్టటం; అక్కడనుండి వారు తమ భార్యలకు ఉత్తరాలు వ్రాయటం; జవాబులు అందుకోవటం; వానాకాలం లోపులో ఇంటికి చేరుకోవాలని తొందరపడటం; ఇంటివద్ద అతని భార్య తన భర్త వచ్చే రోజుకోసం ఎదురుచూడటం లాంటి వర్ణనలు కనిపిస్తాయి. అలాచేసే దేశాటన వ్యాపారం కొరకు అని భావించవచ్చు.

అప్పట్లో Paithan, Junnar, Tagars, Karahakata, Nasik, Govardhana, Dhannakataka, Vijayapura, Kevurura, Kotilingala Chadaka లు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. గ్రామాలలో భార్యా పిల్లలను విడిచిపెట్టి నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటమో చేసేవారని అనుకోవాలి.

అలా దూరదేశం వెళ్ళిన భర్త ఇంటికి ఎంతో కొంత డబ్బునో, సంపదలనో తీసుకొస్తాడని ఆశించిన ఒక భార్య బాధ ఈ గాథలో తెలుస్తుంది.
.
అతను లేకపోవటం కన్నా
ఇక్కడ నేను పడ్డ దురవస్థ కన్నా
తను ఏ ప్రయోజనమూ సాధించకుండా
తిరిగి రావటమే నన్నెక్కువ బాధిస్తున్నది (76)
.
పై గాథను బట్టి అలా దూరదేశం వెళ్ళిన వ్యక్తులు డబ్బు సంపాదించటం కొరకే వెళ్లారని అనుకోవచ్చు.
***

అప్పటికి కొన్ని వందల సంవత్సరాలుగా నాణాల వాడుక ఉన్నప్పటికీ, సప్తశతి గాథలలో ఆశ్చర్యకరంగా డబ్బుల/నాణాల ప్రసక్తి ఎక్కడా కనిపించదు సరికదా ఒక గాథలో వస్తుమార్పిడి గురించి ఉన్నది.
.
మాఘమాసపు చలిసమయాలలో
పొగలేకుండా వెచ్చదనాన్ని ఇచ్చే
తన భార్య ఎత్తైన చన్నులను నమ్ముకొని
ఆ రైతు తన కంబళిని ఇచ్చేసి
ఎద్దును బదులుగా పుచ్చుకొన్నాడు (238)
.
ఈ గాథలో ఆ రైతు కంబళిని పక్కన పెట్టేసి తానే బలిష్టమైన ఎద్దుగా మారాడు అనే శృంగారపరమైన ధ్వని ఉండొచ్చు గాక, కానీ తీసుకొన్న ఉపమానంలో ఉన్న వస్తుమార్పిడి అనే పదం గమనించదగినది. నిన్నమొన్నటి వరకూ గ్రామాలలో స్వయం ఉత్పత్తుల వస్తు మార్పిడి జరిగిన సంగతి మరచిపోరాదు.

బొల్లోజు బాబా