Saturday, August 29, 2020

బహుముఖీన సాహిత్య సృజనకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

 ప్రముఖ కవి, కథకుడు, విమర్శకుడు, చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు అయిన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

బొల్లోజు బాబా

****

బహుముఖీన సాహిత్య సృజనకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

ఆనందోపదేశాలే సాహిత్యప్రయోజం అని విశ్వసిస్తూ నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగం సాగిసున్నారు ప్రముఖ కవి, విమర్శకులు, చిత్రకారుడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్. వ్యక్తిగా శ్రీ మాకినీటి సూర్యభాస్కర్ సౌమ్యులు, స్నేహశీలి, మృధుభాషి. ఆత్మవిశ్వాసానికి, నిజాయితీకి నిండైన రూపం వీరు. పద్యం, కవిత్వం, గేయం, చిత్రలేఖనం, కథలు, పరిశోధనా వ్యాసాలు, విమర్శలాంటి వివిధ ప్రక్రియలలో ఉత్తమప్రమాణాలతో కూడిన రచనలు చేసే శ్రీమాకినీడి సూర్యభాస్కర్ వేయిచేతులతో విరాజిల్లే కార్తవీర్యార్జునుడిలా కనిపిస్తారు.

1. చిత్రకారుడు, చిత్రకళా విమర్శకుడు

చిత్రకారుడి గా మాకినీడి స్థానం చాలా గొప్పది. వీరు లిఖించిన అనేక చిత్రాలు వివిధ జాతీయ చిత్రకళా ప్రదర్శనలలో చోటుచేసుకొన్నాయి. క్యూబిజం అనే టెక్నిక్ లో వీరు చిత్రించిన మహాత్మా గాంధి చిత్రం జాతీయ స్థాయి బహుమతి పొందింది.

చిత్రకళా విమర్శకునిగా మాకినీడి 12 పుస్తకాలు వ్రాసారు. తెలుగు సాహిత్యలోకంలో సంజీవ్ దేవ్ తరువాత కళావిమర్శలో అంతటి స్థానాన్ని పొందిన వ్యక్తి మాకినీడి తప్ప మరొకరు కనిపించరు. వీరు ఇటీవల రచించిన “దామెర్ల-కళ-వారసత్వం” పుస్తకంలో ప్రముఖ తెలుగు చిత్రకారుడు శ్రీ దామెర్ల రామారావు జీవితాన్ని, వారి చిత్రాలలోని అంతఃసౌందర్యంతో సమన్వయపరుస్తూ చాలా పరిణిత శైలీ విన్యాసం కనపరుస్తారు. రామారావు గారు చిత్రించిన ఒక్కో చిత్తరువులోని రంగుల మేళవింపును వాటిలోని గుఢార్ధాలను వివరించిన రీతి అబ్బురపరుస్తుంది. చిత్రకళా విమర్శకునిగా వీరిపుస్తకాలలో “రామారావు నుంచి రామారావు దాకా” (2009), “దామెర్ల-ఆధునికాంధ్ర చిత్రకళ ఆద్యుడు”, “సంజీవ్ దేవ్- ప్రకృతి గీతాలపకుడు”, “డా. పి.ఆర్. రాజు చిత్రాలు –సౌందర్య వర్ణగీతాలు” వంటి పుస్తకాలు వీరికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తెలుగు సాహిత్యరంగంలో చిత్రకళా విమర్శకునిగా మాకినీడి సూర్యభాస్కర్ ది వేరెవరూ భర్తీ చేయలేని స్థానం.

2. బాల సాహిత్యవేత్త

శ్రీమాకినీడి సూర్యభాస్కర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రతిరోజు అసెంబ్లీలో చదవటానికై అప్పటికప్పుడు సూక్తులను పద్యాలరూపంలో వ్రాసి విద్యార్ధులకు ఇచ్చి చదివించేవారట. ఒకరోజు స్కూల్ కి వచ్చిన సాహితీపోషకులు శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు, ఈయన వ్రాస్తున్న పద్యాలను చూసి బాగున్నాయని మెచ్చుకొని బాల గేయాలు వ్రాయండి అని ప్రోత్సహించారు. అలా వ్రాసిన బాలగేయాలను కలిపి 1996 లో “జ్యోతిబాల” పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. జ్యోతిబాల గేయాలు పిల్లల భావనాశక్తిని పెంచుతూ, విజ్ఞానాన్ని అందిస్తాయి. శ్రీ మాకినీడి ఇంతవరకూ 6 బాల సాహిత్య పుస్తకాలను వెలువరించారు.

3. ఆర్థ్రకవిత్వపు చిరునామా

సుమకవితాంజలి పేరుతో పద్య ఖంఢకావ్యాన్ని వెలువరించారు. చిన్న చిన్న పదాలతో గంభీరమైన భావాలను పొదిగించి వ్రాసిన ఈ పద్యాలు పలువురి మన్ననలు పొందాయి. ఈ పద్యాల గురించి నాగభైరవ కోటేశ్వర రావు “ఈ పద్య ప్రసూనాలకి మంచి రంగు ఉంది, మంచి రుచీ ఉంది. మంచి వాసన ఉంది. చిత్రకారుడు కాబట్టి రంగును అద్దాడు. రుషీత్వం ఆవహించి రుచిని అద్దాడు. వాక్సతీ కటాక్షవీక్షణంలో తడిసి వాసననూ రుద్దాడు” అంటారు.

వచన కవిగా పది సంపుటాలు వెలువరించారు శ్రీ మాకినీడి. ఇవి సుమకవితాంజలి (1997), ప్రకృతి గీసిన వికృత చిత్రం (2002), సెలవ రోజు (2003), కలల పెదవుల నవ్వుల్లోకి (2009), సామెతకో పద్యం (2009), పాపికొండల్లో పడవ పాట (2011), ఆమె (2012), తడితడిగా ఆలోచించే (2013), నాకు నేను దొరికిన క్షణాలు (2016). అనేకులుగా (2019). వీరి కవితా సంపుటుల్లోంచి కొన్ని వాక్యాలు

//పువ్వులో శీర్షాసనం వేస్తేనే
తేనెటీగలకు మధువు దొరికేది
తలకిందులై ముక్కుతో
జలగర్భం చీలిస్తేనే
కింగ్ ఫిషర్ కు చేపలు దొరికేది

మనిషీ!
నువ్వూ లోనికి
లోలోనికి…నీలోనికి//
శీర్షాసనం వెయ్యాలి (శీర్షాసనం) బాహ్యదృష్టే ప్రధానంగా, అంతర్ దృష్టి పనికిమాలినిదిగా స్థిరపడుతున్న ఆధునిక సంస్కృతికీ వాక్యాలు చెంపపెట్టు.

బాల్యం పుప్పొడి రాలిన
వృద్ధాప్యపు పుష్పాలు
వంగి ప్రశ్నలుగా మిగిలిపోయిన
ఆశ్చర్యార్ధకాలు! (వృద్ధాప్యపు పుష్పాలు) వృద్దాప్యాన్ని వర్ణించే చక్కని పదచిత్రం. దీనిలోని ఆర్ధ్రత, వ్యంజన కదిలిస్తాయి. శ్రీమాకినీడి కవిత్వం ఆర్థ్రంగా ఉండి హృదయాన్ని రంజింపచేస్తుంది, ఆలోచనలను రేకెత్తిస్తుంది.

మాకినీడి సూర్యభాస్కర్ మంచి కథకుడు కూడా. అంతఃస్సౌందర్యం పేరిట 2003 లో కథల సంపుటి తీసుకొచ్చారు.

4. సునిశిత విమర్శకుడు

విమర్శకునిగా శ్రీ మాకినీడి అనితరసాధ్యమైన కృషి చేసారు. సమకాలీన విషయాలపై సాధికారిక అభిప్రాయాలు వెల్లడించే విషయంలో ఒక విమర్శకుడిగా వీరి గొప్పతనం తెలుస్తూంది. తెలుగులో హైకూల ప్రక్రియ ప్రారంభం అవుతున్న తొలిరోజులలో “హైకూ కవిత్వం-అనుశీలన, ఒక అవగాహన” పేరిట విశ్లేషణాత్మక విమర్శనా పుస్తకాన్ని వెలువరించారు. హైకూలపై వచ్చిన మొదటి పుస్తకం ఇదే. ఆ తరువాత నానీలు, రెక్కలు, నానోలపై కూడా తొలి విమర్శనా వ్యాసాలు వ్రాసారు.

ముప్పై ఆరు కథలను తీసుకొని వ్రాసిన విశ్లేషణాత్మకమైన విమర్శనా వ్యాసాల గ్రంధం “కంచికి చేరని కథ”. ఈ పుస్తకంలో వివిధ కథలలోని కథలోని శిల్పం, ప్లాట్, కథనం, పాత్రలను చాలా లోతుగా విశ్లేషించారు. ప్రతీ విమర్శనా వ్యాసం క్రిందనా ఆయా కథకుల వివరణాత్మక అభిప్రాయాలు కూడా జతచేయటం వల్ల ఈ పుస్తకానికి అదనపు విలువ వచ్చింది.

‘రచన-రసన” పేరుతో సినారె, అద్దేపల్లి, మిరియాల లాంటి లబ్దప్రతిష్టులైన కవుల సాహిత్యవ్యక్తిత్వ సమీక్ష రాయటానికి ఎంతో తెగువ, తెలివిడి ఉండాలి. ఈ పుస్తకంలో సినారె గురించి “కాలాన్ని కత్తిరించి ప్రయోజనకరంగా ఉపయోగించుకోగల నిలువెత్తు క్రమశిక్షణ సినారె” అంటారు మాకినీడి. ఎంత చక్కని మానవీయ దర్శనం అనిపించక మానదు.

అలాగే వివిధ కవితాసంపుటులపై వ్రాసిన వంద సమీక్షావ్యాసాలను “కవిత్వం చిరునామా” పేరిట ఒక గ్రంధాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో అంతవరకూ వివిధపత్రికలు ప్రచురించిన వీరి మొత్తం సమీక్షావ్యాసాలలో నాలుగువంతు మాత్రమే ముద్రిస్తున్నానని ముందుమాటలో అనటాన్ని బట్టి మాకినీడి ఏమేరకు సాహితీ కృషి జరిపారో ఊహించుకోవచ్చు.

వీరి విమర్శ ఎంత మృధువుగా ఉంటుందో అవసరపడినప్పుడు అంతే కఠినంగానూ ఉంటుంది. ఉదాహరణకు; డాలీ రాసిన కొన్ని హైకూలను విమర్శిస్తూ “అవి హైకూలా ? ఆ పేరుతో రాసినా కైకూలా? వీటిలో ఏ మార్మికతా లేదు, మరే తాత్విక ప్రేరణా కనబడదు” అంటారు. సందర్భం వచ్చినపుడు నిక్కచ్చిగా మాట్లాడటం విమర్శకునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అది శ్రీమాకినీడిలో పుష్కలంగా ఉంది.

విమర్శకునిగా మాకినీడి కళాసాహితీ తోరణం (1998), హైకూ కవిత్వం అనుశీలన (1999), కలం కలలు (2003), దృక్కోణం (2003), రెండు ఎలిజీల మధ్య (2004), తాత్విక రెక్కలు (2008), అద్దేపల్లి కవిత్వం-వ్యక్తిత్వం, తత్వం (2006), పద్యం-హృద్యం (పద్యకావ్యాలపై విమర్శనా వ్యాసాలు-2014), సత్యాన్వేషణలో (2003) లాంటి వివిధ పుస్తకాలను రచించారు. విమర్శకునిగా మాకినీడి కృషి సామాన్యమైనది కాదు. చాలా వ్యాసాలలో తనదైన శైలిని నిలుపుకొంటూనే నచ్చని చోట నిర్మొహమాటంగా చెప్పటం ఈయన పద్దతి.

5. మంచి అకడమిషియన్

సాధారణంగా కవిగానో, చిత్రకారునిగానో ఎక్కువ సమయాన్ని వెచ్చించే ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు అకడమిక్ గా వెనుకపడిపోతారు. కానీ బయాలజి ఉపాద్యాయునిగా పనిచేస్తున్న మాకినీడి, టిటిసి విద్యార్దులకొరకు టెక్స్ట్ బుక్స్ రచించారు. సైంటిఫిక్ టెంపర్, కొలెస్టిరాల్, ఏయిడ్స్ నియంత్రణ బుర్రకథ లాంటి శాస్త్రీయ అవగాహన పెంచే రచనలు చేసారు. ఇవి వారి జ్ఞాన తృష్ణ ను ప్రతిబింబిస్తాయి.

6. మాకినీడి సాహిత్యంపై వచ్చిన ఇతరుల పుస్తకాలు

మాకినీడి రచనల పరిధి చాలా విస్తారమైనది. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా ఈయన పోషించిన వివిధ పాత్రలలోని వైవిధ్యం పలువురు సాహితీవేత్తలను ఆకట్టుకోవటం వల్ల వీరి రచనలపై ఇతరులు వ్రాసిన గ్రంధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరిరచనలు పరిశోధకులను అనంతమైన గని వలే అన్వేషించుకోమ్మని ఆహ్వానిస్తాయి ఎం. శేఖర్ “మాకినీడి వచన కవితా సంపుటాలు-పరిశీలన” పేరుతో ఎం.ఫిల్ చేసారు. “సంపాదకునిగా మాకినీడి” అనే శీర్షికతో ర్యాలి శ్రీనివాస్ ఎం.ఫిల్ చేసారు. “మాకినీడి సమగ్ర సాహిత్యం” పేరిట వి విజయకుమార్ పి.హెచ్.డి పొందారు. ప్రముక కవి కథకుడు శ్రీహస్త “మనసున్న మాకినీడి” పేరుతో వ్యాస సంపుటి వెలువరించారు.

***

ఇన్ని బహుముఖీన రంగాలలో ప్రతిభా,వ్యుత్పత్తులను కలిగి ఉన్న మాకినీడి సూర్యభాస్కర్ తో పోల్చదగిన మరొక సాహితీమూర్తి తెలుగుసాహిత్యంలో ఆరుద్ర ఒకరే కనిపిస్తారనటం అతిశయోక్తి కాబోదు. నాలుగు దశాబ్దాల కాలంలో సుమారు ఎనభై పుస్తకాలు వెలువరించటం సామాన్యమైన విషయం కాదు. అవి కూడా భిన్నరంగాలలో, ఉన్నతప్రమాణాలతో, పరిశోధనా స్థాయిలతో వ్రాయటం అత్యంత కష్టతరమైన విషయం. అదంతా శ్రీమాకినీడి వారి అకుఠింత శ్రమ, అవిరళ కృషి, నిర్విరామ సాధనలకు నిదర్శనం.

ఆనందోపదేశాలే సాహిత్యప్రయోజనం నమ్మి, ఆ భూమికపైనే నిలబడి సృజనచేసిన సాహితీవేత్త శ్రీ మాకినీడి సూర్యభాస్కర్.

రాత్రి పన్నెండు గంటలకు మేల్కొని తెల్లవరేవరకూ సాహిత్యం కొరకే శ్రమించటం శ్రీ మాకినీడి పాటించే క్రమశిక్షణ. అలా నలభై ఏళ్లపాటు జీవితాన్ని సృజనకొరకే అర్పించి వివిధ రంగాలలో సుమారు ఎనభై పుస్తకాలను వెలువరించిన ఈ సాహితీ మూర్తికి – ఈ సమాజం తిరిగి ఏమిచ్చిందీ అని ప్రశ్నించుకోవాల్సి రావటం దురదృష్టకరం.Image may contain: 1 person, standing, outdoor and water

బొల్లోజు బాబా
17/8/2019

No comments:

Post a Comment