పార్శ్వనాథుడు
కాకినాడ పిఆర్ కళాశాల లైబ్రేరిలో ఒక స్తంభాానికి సిమెంటు చేయబడిన జైన విగ్రహం ఉంది. పి.ఆర్. కాలేజ్ నూటనలభై ఏండ్లక్రితం స్థాపించారు. ఈ జైన విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్తంభానికి ఆ తరువాత కాలంలో చొప్పించినట్లు అర్ధమౌతుంది. బహుసా కళాశాల ప్రాంగణంలో ఏదైనా కొత్త నిర్మాణాలు చేపట్టటానికి తవ్వకాలు జరపగా దొరికిన విగ్రహాన్ని జాగ్రత్తగా స్తంభానికి అతికించి ఉంటారు పూర్వులు. ఆ విగ్రహం అక్కడకి ఎలా వచ్చింది అని ఒకరిద్దరు పెద్దవాళ్ళను సంప్రదించినా ఎవరూ తెలియదు అన్నారు.
ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తే జైన ఐకనోగ్రాఫికల్ లక్షణాలు స్పష్టంగా తెలుస్తాయి.
1. దిగంబర పద్మాసన ధ్యాన భంగిమ.
2. ఆ మహాపురుషుడు ఒకప్పుడు విలువైన కర్ణాభరణాలు ధరించిన వ్యక్తి అని, అన్ని సంపదలను త్యజించి జైన ధర్మాన్ని అవలంబించాడనటానికి సూచనగా చెవులు నిలువునా సాగి ఉండటం
3. తలపై జుత్తు రింగులు రింగులుగా ఉండటం
4. ఛాతీపై ఉన్న శ్రీవత్స ముద్ర హృదయ జ్ఞానానికి సంకేతం. (ఆత్మజ్ఞానం). బుద్ధుని విగ్రహాలకు జైన విగ్రహాలకు తేడా తెలియటానికి కుషానుల కాలం ( క్రీశ.1-4 శతాబ్దాలు) నుండి వక్షస్థలంపై శ్రీవత్స ముద్ర (నాలుగుదళముల పువ్వు ఆకారం) చెక్కడటం చేసేవారు. ఈ విగ్రహ వక్షస్థలంపై శ్రీవత్స ముద్రలేదు కానీ అది ఉండాల్సిన స్థానంలో ఒక గాడిలాంటి గుంట కలదు. బహుసా ఈ గుంటలో బంగారంతో చేసిన శ్రీవత్స ముద్రను ఉంచేవారని భావించాలి. (Jaina Bibliography, Sathya Ranjan Benarjee, p 627). పిఠాపురంలో సన్యాసిరాళ్ళ పేరుతో కొలవబడుతున్న జైనప్రతిమలలో ఇదేవిధమైన గాడులు ఉన్నాయి.
5. తలపై ఏడు సర్పముల గొడుగు ఉండటం పార్శ్వనాథుని ప్రతిమను గుర్తించే ప్రధాన లక్షణము. పార్శ్వనాథుని ప్రతిమలపై ఉండే పాము పడగను వివరించే జైన కథ ఒకటి ఉన్నది. పార్శ్వనాథుడు పూర్వజన్మలో ఒక రాజుగా ఉన్న కాలములో యాగములో పడి ఆహుతి అవుతున్న ఒక సర్పాన్ని కాపాడాడట. మరుజన్మలో ఆ రాజు పార్శ్వనాథునిగా జన్మించగా, ఆ పాము ధరణేంద్ర అనే సర్పరాజుగా జన్మించారట. ఒకనాడు మేఘనాథుడు (Cloud Prince) పార్శ్వనాథుడు చేస్తున్న తపస్సును పెద్దతుఫానును సృష్టించి, భగ్నం చేయబూనినపుడు ఆ సర్పరాజు తనపడగను విప్పి పార్శ్వనాథునికి రక్షణగా నిలిచిందట.
యోగపద్మాసనం,శ్రీవస్త ముద్ర, శరీర నిర్మాణం బట్టి ఇది జైన విగ్రహం అని గుర్తించవచ్చు. తలపైన సర్పముల పడగ ఉండటాన్ని బట్టి ఆ విగ్రహం ఇరవైనాలుగవ జైన తీర్ధంకరుడైన శ్రీ పార్శ్వనాథునిదిగా పోల్చుకొనవచ్చును.
పార్శ్వనాథుడు క్రీపూ తొమ్మిదో శతాబ్దానికి చెందిన వాడని చెపుతాయి జైన మత గ్రంధాలు. చరిత్రకారులు ఇతనిని క్రీపూ. ఎనిమిదోశతాబ్దానికి చెందినవాడుగా గుర్తించారు. బుద్ధుని సమకాలీనుడైన మహావీరునికి 273 సంవత్సరాలకు పూర్వం పార్శ్వనాథుడు జీవించాడు.
పార్శ్వనాథుడు వారణాసిలో జన్మించాడు. ఇతని శరీరవర్ణం నీలంగా, నల్లగా ఉండేదట.
పార్శ్వనాథుడు నాలుగు ప్రధాన జీవనమార్గాలను ప్రతిపాదించాడు. అవి
1. అహింస 2. భౌతిక సంపదలను దరిచేరనివ్వకపోవటం 3. దొంగతనం చేయకుండుట 4. సత్యమునే మాట్లాడుట
ఈ నాలుగింటికి తోడు బ్రహ్మచర్యాన్ని చేరుస్తాడు తరువాతి జైన తీర్ధంకరుడైన వర్ధమాన మహావీరుడు - మహాత్మగాంధి ఈ బోధనలనుండే ప్రేరణ పొందాడు.
పార్శ్వనాధుడు చెప్పిన నాలుగు జీవనమార్గాలను తరువాత క్రమంలో వచ్చిన బౌద్ధమతం స్వీకరించింది. అదే విధంగా ఈయన ప్రతిపాదించిన కర్మసిద్ధాంత భావనను హిందూమతం గ్రహించింది. (వేదాలలో ధార్మిక విధులు కర్మలుగా చెప్పబడ్డాయి. మరీ ముఖ్యంగా యజ్ఞకాండలు. వీటిని బుద్ధుడు నిరసించాడు. జైనులు వ్యతిరేకించారు. జైనం పాపపుణ్యాలను, కర్మ సంచయాన్ని, పునర్జన్మను, మోక్షాన్ని విస్త్రుతంగా చర్చించింది. ఈ భావనలను జైనం హిందూమతం నుంచి స్వీకరించలేదు. అవి జైనానికే చెందిన వర్జిన్ భావాలు. ఆ భావనలు క్రమేపీ హిందూ ధర్మంలోకి వచ్చి చేరాయి)
పార్శ్వనాథుని విగ్రహం కాకినాడ పిఆర్. కళాశాలలో దొరకటం వెనుక రెండువేల ఏండ్ల క్రితం నడిచిన ఈ ప్రాంత చరిత్రను తలచుకోవాలి.
***
జైన గాథలప్రకారం క్రీస్తుపూర్వం ఆరోశతాబ్దం నాటికే జైనమతం ఆంధ్రదేశంలో కళింగరాజుల ద్వారా విస్తరించింది. ఇరవైనాలుగవ తీర్థంకరుడైన వర్ధమానమహావీరుడు కళింగరాజ్యాన్ని సందర్శించి తన బోధనలు చేసినట్లు జైన గాథలు, ఆ తరువాత వ్రాయబడిన శాసనాలు చెపుతున్నాయి. (Epigraphia Indica Vol. XX p88).
క్రీపూ.తొమ్మిదో శతాబ్దానికి చెందిన కళింగ రాజు Karakandu జైనాన్ని ఆదిలోనే ప్రోత్సహించాడు. ఒకప్పుడు కళింగ రాజ్యానికి తూర్పుగోదావరి జిల్లాలోని పిష్టపురం/పిఠాపురం రాజధానిగా ఉండేది కనుక ఈ జిల్లాలో జైనం ప్రబలంగా విస్తరించింది. నేటికీ జిల్లాలోని ఆర్యావటం, పిఠాపురం, ద్రాక్షారామం, రామచంద్రపురం, బిక్కవోలు, కాజులూరు, జల్లూరు, రాజోలు,తాటిపాక, లాంటి అనేక చోట్ల జైన విగ్రహాలు కలవు. అక్కడక్కడా కొత్తవి బయటపడుతూనే ఉన్నాయి.
కళింగరాజులు జైనానికి ఇచ్చిన ప్రోత్సాహం క్రీపూ రెండో శతాబ్దం నాటి కళింగరాజైన ఖారవేలుని వరకూ కొనసాగింది.
ఆ తరువాత ఆంధ్రను పాలించిన శాతవాహనులు బౌద్ధాన్ని ప్రోత్సహించారు. ఆ పిదప వచ్చిన సాలంకాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు హిందూమతాన్ని ఆదరించారు. అందుచేత జైన మత వ్యాప్తి ఆరోశతాబ్దం వరకూ ఆంధ్రలో పెద్దగా జరగలేదు. అంతే కాక పల్లవరాజైన ముక్కంటీశ్వరుడు ఆరోశతాబ్దంలో వందల జైన ఆలయాలను, బసతులను ఖిలము చేసి, వేలమంది జైనులను ఊచకోత కోయించాడు. ఈ ఘర్షణల సమయంలోనే ఆంధ్రనుండి బౌద్ధమతం సంపూర్ణంగా వైదొలగింది.
జైనమతావలంబకులైన తూర్పుచాళుక్య కుబ్జవిష్ణువర్ధన మహారాజు ఏడో శతాబ్దంలో పిఠాపురంను రాజధానిగా చేసుకొని పరిపాలన మొదలుపెట్టినప్పటినుంచి తూర్పుగోదావరి జిల్లాలో మరలా జైన ప్రాబల్యం పెరిగింది. కుబ్జవిష్ణువర్ధనుని భార్య మహాదేవి విజయవాడలో నదుంబవసతి అనే బసతిని జైనులకొరకు స్థాపించింది. జైనమత వ్యాప్తి కొరకు అనేక దానధర్మాలు చేసారు వీరిరువురు. ఈ కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన హుయాన్ త్సాంగ్ ఇక్కడ జైనమతం పరిఢవిల్లుతూ ఉన్నదని వ్రాసాడు. ఇదే రకమైన జైన మత ఆదరణ అటుపిమ్మట వచ్చిన చాళుక్య రాజులందరూ తొమ్మిదో శతాబ్దం వరకూ కొనసాగించారు.
ఆ తరువాత వచ్చిన చోళులు హిందూ మతాన్ని ఆదరించటంతో క్రమేపీ జైనమత ప్రాబల్యం అంతరించింది. రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెనిగించటం ప్రజలను జైన మతప్రభావం నుండి మళ్ళించి హిందూ ధర్మం వైపు ఆకర్షించటానికి చేసిన ప్రయత్నమని అంటారు.
జైన పండితుడైన అధర్వణాచార్యుడు తాను తెలుగులోకి అనువదించిన మహాభారతగ్రంధాన్ని బాగోగులు చూడమని నన్నయభట్టారకుని కోరాడట. దానిని చదివిన నన్నయ అతని అనువాదం తనదానికన్నా చాలా మెరుగుగా ఉండటంతో అసూయతో అగ్నిలోకి విసిరేయగా ఆ జైన పండితుడు తన కృతిని రక్షించుకోవటానికి చేసిన ప్రయత్నంలో అగ్నికి ఆహుతి అయ్యాడట. ఆ అపరాధన భావంతో నన్నయకు మతిభ్రమించటంతో మహాభారత రచన అసంపూర్తిగా మిగిలిపోయిందంటూ ఒక కథ జనశృతిలో ఉంది. (రి. కవిజీవితములు-గురజాడ శ్రీరామమూర్తి)
ఈ కాలంలో జైనం అటు హనుమకొండ నుండి ఇటు అనంతపురం వరకూ తెలుగునాట అంతటా విస్తరించింది.
ఆ తరువాత విస్తరించిన వీరశైవ మతం జైన మతాన్ని సమూలంగా తొలగించింది. శ్రీశైలంలో వీరశైవభక్తుడైన లింగ అనే వ్యక్తి "తాను అసంఖ్యాకమైన జైనుల తలలను తెగనరికాను" అని క్రీశ. 1512 లో వేయించుకొన్న ఒక శాసనం ద్వారా జైన మతానికి ఆంధ్రప్రాంతంలో దాదాపు తెరపడినట్లు అర్ధమౌతుంది.
ఆ తరువాత రెండుమూడు శతాబ్దాలపాటు జైన మతం దాదాపు ఉనికి లేకుండా పోయింది.
తవ్వకాలలో దొరికే జైన విగ్రహాలు హిందూమతానికి చెందినవి కావు జైనమతానివి అని కాలిన్ మెకంజీ చెప్పేవరకూ బ్రిటిష్ అధికారులు వాటిని హిందూమతానికి చెందినవిగా రికార్డు చేసేవారట.
***
పి.ఆర్. కాలేజీ లో కనిపించిన పార్శ్వనాథుని విగ్రహం పై ఎక్కడా ఏవిధమైన రాతలు లేవు. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుండి క్రీస్తుశకం ఆరో శతాబ్దానికి మధ్యకాలానికి చెంది ఉంటుందను కోవచ్చు, ఎందుకంటే ఆ కాలంలో ఈ ప్రాంతంలో జైనం ఉచ్ఛస్థితిలో ఉండటమే కాక పిఠాపురం జైనాన్ని ఆదరించిన రాజులకు రాజధానిగా ఉండేది.
మనిషి సృష్టించిన శాస్త్రాలకు ప్రతీకగా నిలిచే పుస్తకాలమధ్య నేడు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు - ఒకప్పుడీ శిల ఎన్నెన్ని పూజలందుకొందో, ఎన్నెన్ని కోర్కెలను విన్నదో, ఎందరెందరికి పారమార్దిక జ్ఞానాన్ని ప్రసాదించి ఉంటుందో కదా అని అనిపించక మానదు.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకం
Jainism in South India and some Jaina Epigraphs
by Desai, P.B..
No comments:
Post a Comment