భారతీయ దళిత ఆత్మకథలు” అంశంపై మా కాలేజి హింది ప్రొఫసర్ శ్రీ హరిరామ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్ లో సమర్పించిన పత్రం)
.
దడాల రఫేల్ రమణయ్య - స్వాతంత్య్ర పోరాటయోధుని ఆత్మకథ
దళిత సాహిత్య చరిత్రలో ఆత్మకథా ప్రక్రియ ప్రత్యేకమైనది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వ్రాసుకొన్న ఇతర ఆత్మకథలతో పోల్చినపుడు, దళిత ఆత్మకథలు భిన్నంగా ఉంటాయి. భారతీయ దళిత ఆత్మకథల్లో అంబేద్కర్ పూర్వ, తదనంతర సమాజాలలోని మూడుతరాల దళిత జీవనశైలుల చిత్రణ జరుగుతుంది. సమాజంలో ఉండే కులపరమైన వివక్ష, అగ్రకుల ఆధిపత్యం, పేదరికం, అంటరానితనం వంటివి దళిత ఆత్మకథలలో సహజంగా ప్రతిబింబించే అంశాలు. పీడితుల చరిత్రను దళిత ఆత్మకథలు అక్షరీకరిస్తాయి.
యానానికి చెందిన శ్రీ దడాల రఫేల్ రమణయ్య “My Struggle for freedom of French Provinces in India - An Autobiography’ పేరుతో 1974 లో ఇంగ్లీషులో వెలువరించిన ఆత్మకథ ద్వారా ఒకనాటి ఫ్రెంచి ఇండియా యొక్క అనేక చారిత్రిక, సామాజికాంశాలు తెలుస్తాయి. క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన ఒక దళిత క్రిష్టియన్ జరిపిన స్వాతంత్య్రపోరాటాన్ని మనకళ్ళముందు నిలుపుతుందీ రచన.
శ్రీ దడాల జీవనయానం
శ్రీ దడాల రఫేల్ రమణయ్య యానాంకు చెందిన పరంపేట అనే గ్రామంలో 30 జూన్, 1908న ఓ దళిత రైతుకూలి కుటుంబంలో జన్మించారు. నాలుగు సంవత్సరాల వయసులో తండ్రిగారిని కోల్పోవటంతో నాయినమ్మ ఇంటపెరిగారు. చిన్నవయసులోనే యానాం చర్చిలో తోటమాలికి సహాయకునిగా పనికి కుదిరారు. చదువుపట్ల ఇతనికి ఉన్న జిజ్ఞాసను గుర్తించి చర్చి ఫాదర్ శ్రీ గాంగ్లాఫ్, దడాలను చేరదీసి పాండిచేరి పంపి ఉన్నత చదువు చెప్పించారు. చదువు పూర్తయ్యాకా శ్రీ దడాల కొద్దికాలం టీచర్గా పనిచేసి, పోటీపరీక్ష పాసయి పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని చేపట్టారు. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా అనేక సాహసోపేతమైన పనుల ద్వారా ఉన్నతాధికారుల మన్ననను పొందారు. వీటిలో ఫ్రెంచి గవర్నర్ శ్రీ మెనార్డ్ను ఆందోళనకారులనుండి కాపాడటం, పాండిచేరీలో ఒక సభలో అప్పటి జాతీయనాయకుడు శ్రీ వి.వి. గిరి పై దుండగులు దాడిచేసినపుడు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించటం వంటివి ప్రముఖమైనవి.
1947 లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించి నిష్క్రమించింది. ఫ్రెంచివారు మాత్రం పాండిచేరి, మాహె, కారైకాల్ మరియు యానాం ప్రాంతాలను ఇంకా పరిపాలించేవారు. ఈ ఫ్రెంచికాలనీల ప్రజలలో స్వాతంత్య్రకాంక్ష బలపడి ఫ్రెంచివారికి వ్యతిరేకంగా ఉద్యమించటం మొదలెట్టారు.
జాతీయభావాలు కలిగిన శ్రీ దడాల తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆ ఉద్యమంలో చేరారు. అనేకమంది యువకులను కూడగట్టి ‘ఫ్రెంచి ఇండియా విమోచన కూటమి’ అనే సంస్థను స్థాపించి దానిద్వారా ప్రజను చైతన్యపరుస్తూ పాండిచేరీ స్వాతంత్రోద్యమాన్ని నడిపించారు. తన సొంతఊరు అయిన యానాం ఈ ఉద్యమంలో వెనుకపడి ఉందని భావించి, 14 ఏప్రెల్, 1954 న యానాం చేరి అక్కడి ప్రజలలో జాతీయోద్యమ భావాలు పెంపొందించారు. 13 జూన్, 1954న శ్రీ దడాల, వేలమంది కార్యకర్తలతో యానాం స్థానిక పరిపాలనా ఆఫీసును ముట్టడించి, అధికారాలను కైవసం చేసుకొని, ఫ్రెంచి జండాను తొలగించి భారతదేశపతాకాన్ని ఎగురవేసి- యానాం ఫ్రెంచి పాలననుండి విమోచమైందని ప్రకటించారు. ఆనాటి ప్రముఖ పత్రికలన్నీ ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి.
16 జనవరి, 1955న అప్పటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ పాండిచేరీ వచ్చినపుడు జరిపిన బహిరంగ సభలో శ్రీ దడాల మాట్లాడుతూ .....‘ యానాన్ని అభివృద్ధి చేయమని, వ్యక్తిగతంగా పర్యవేక్షించమని’ నెహ్రూను కోరారు. ఆ తరువాత ఆంధ్రా ఎక్సైజ్ ఇనస్పెక్టరుగా ఉద్యోగం చేసి 1963లో పదవీవిరమణ పొందారు. 5 మే, 1991న శ్రీ దడాల తనువు చాలించారు.
శ్రీ దడాల స్వీయచరిత్ర విశ్లేషణ
దయాపావర్ రచించిన ‘బుతా’, నరేంద్ర జాధవ్, ‘ఔట్ కాస్ట్ ఎ మెమొయిర్’, బేబీ కాంబ్లే ‘ప్రిజన్స్ వియ్ బ్రోక్’ వంటి ప్రముఖ భారతీయ దళిత ఆత్మకథలలో - తెలుగులో జాషువా రచించిన ‘నా కథ’, బోయిభీమన్న ‘పాలేరునుండి పద్మశ్రీ వరకు’, తలమర్ల కళానిథి ‘ఆత్మకథ’, వై. సత్యనారాయణ వెలువరించిన ‘మా నాయిన బాలయ్య’ వంటి వివిధ స్వీయచరిత్రలలో, దళిత సంస్కృతి, ఆత్మవిశ్వాసంతో తమను తాము పునర్నిర్మించుకొన్న ఒక ప్రయత్నం, తాము ఎదుర్కొన్న వివక్ష, లాంటి విషయాలు కనిపిస్తాయి.
శ్రీ దడాల స్వీయచరిత్రలోపై అంశాలేవీ కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగించక మానదు. కులవివక్ష ప్రస్తావన ఒకే ఒక సందర్భంలో తప్ప మరెక్కడా కనపడదు. ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చి పాండిచేరీ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతగా భారతప్రభుత్వం శ్రీ దడాలకు సెక్రటరీ స్థాయి ఉద్యోగం ఇమ్మని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుకు రికమెండ్ చేస్తే, ఒక వదరుబోతు ప్రభుత్వాధికారి కులదురహంకారంతో ఇతనికి ఇనస్పెక్టర్ స్థాయి ఉద్యోగం మాత్రమే వచ్చేలా చేసాడట. ఈ సంఘటన మినహా ఎక్కడా తన జీవితంలో కులపరమైన భేదభావం ఎదురకొన్నట్లు తెలుపరు. అంతేకాక ఫ్రెంచి అధికారులు తనను ప్రేమగా చూసుకొనేవారని కూడా అంటారు. భారతదేశ దళిత ఆత్మకథలకు భిన్నంగా ఉంటుందీ కోణం. ఆ విధంగా శ్రీ దడాల ఆత్మకథ మిగిలిన భారతీయ దళిత ఆత్మకథతో పోల్చినపుడు ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది.
దీనికి ఈ కారణాలు ఊహించవచ్చు
1. ఫ్రెంచిపాలనలో కులవివక్ష పెద్దగా లేదని భావించటం. యానాంలో 1849 నుంచి కులమతాలకు అతీతంగా విద్యాబోధన ఉండేది` అప్పట్లో యానాంలో విద్యాభ్యాసం చేసిన ప్రముఖ తెలుగుకవి శ్రీ చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి యానాం స్కూలులో మాల మాదిగలతో కలిసి కూర్చోవలసి వచ్చేదని ఒక వ్యాసంలో అంటారు. యానానికి చెందిన ప్రముఖ సమకాలీన కవి శిఖామణి ఒక చోట ‘‘నేను యానాంలో పుట్టి పెరగటం వలన కులపరమైన వివక్షను పెద్దగా ఎదుర్కొన లేదు’’ అని ఒక ఇంటర్వూలో చెపుతారు. ఇవన్నీ ఈ ప్రతిపాదనకు ఆధారాలుగా నిలుస్తాయి.
2. విదేశీయుడైన ఫాదర్ గాంగ్లాఫ్ సంరక్షణలో శ్రీ దడాల పెరగటం వలన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి విశామైన ఫ్రెంచి ఆదర్శాలను వంటపట్టించుకొని ఉండొచ్చు.
3. సామాజికంగా ఎదుర్కొనే కులవివక్షను ఏ మాత్రమూ ఖాతరు చేయని దృఢచిత్తం కలిగిఉండి, మహోన్నత ఆశయాలకొరకు జీవితాంతం శ్రీ దడాల పాటుపడి ఉండవచ్చు. బహుసా తాను ఎదుర్కొన్న కులపరమైన అవమానాలు తన లక్ష్యసాధన ముందు చిన్నవిషయాలుగా శ్రీ దడాల భావించారని కూడా అనుకోవచ్చు.
ఈ నేపథ్యంలోంచి శ్రీ దడాల స్వీయచరిత్రను పరిశీలించినపుడు ఆయన జీవితంలో దళిత వెతలు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగించదు. కానీ శ్రీ దడాలకు దేశవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన, సహానుభూతి ఉన్నాయి. అందుకనే ఈ పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాటలో ` ‘ నేను 1963 లో పదవీవిరమణ చేసి నా పూర్వీకుల వృత్తి అయిన వ్యవసాయాన్ని చేపట్టాను, ఒక కూలీగా కాదు, ఒక భూస్వామిగా. ఇన్నేళ్ళ నా శ్రమఫలాల్ని నేను ఇపుడు అనుభవిస్తున్నాను. కానీ 150 మిలియన్ల నా దళిత, ఆదివాసీ సహోదరల దుస్థితి పట్ల నాకేమాత్రం ఉదాశీనత లేదు. ఆకలితో, పీడనతో, సజీవదహనాలతో, హత్యలతో, నా సహోదరులు చనిపోవటాన్ని నేను ఉపేక్షించలేను. నా జాతి స్త్రీలు బలాత్కరింపబడుతున్నారు, రోడ్లపై నగ్నంగా ఊరేగింపబడుతున్నారు’` అని ఎంతో ఆవేదనతో అంటారు. అంతేకాక యునైటెడ్ నేషన్స్ చార్టర్ 55 మరియు 56 ఆర్టికిల్ ప్రకారం అస్పృశ్యత, జాతివివక్ష, జనహననం వంటివి అంతర్జాతీయ నేరాలు... మన జాతిని కాపాడుకోవటానికి యు.ఎన్.ఒ. ను ఆశ్రయించాని సూచిస్తారు. ఇది ఆదర్శప్రాయమైన, గొప్ప ప్రాపంచిక అవగాహన కలిగిన ఒక దళిత ఆలోచనాపరుని దృక్పథం.
ఈ ఆత్మకథలో మనకు - స్వీయ అస్థిత్వాన్ని అన్వేషిస్తూ ఒక దళితయోధుడు చేసిన సాహస ప్రయాణం కనిపిస్తుంది. తరతరాలుగా అణచివేతకు గురయిన తన జాతికి చరిత్రలో ఒక సగౌరవ స్థానం కల్పించటానికి ఒక దళితదార్శనికుడు చేసిన పోరాటం తెలుస్తుంది. స్వేచ్ఛ స్వతంత్రాలకొరకు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఉద్యమం సాగించి విజయం సాధించిన గొప్ప దేశభక్తుడు దర్శనమిస్తాడు. తనప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఉద్యమంవల్ల తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని కలగకూడదని వారిని సురక్షితంగా కాపాడుకొన్న మంచి కుటుంబపెద్ద కనిపిస్తాడు. అప్పట్లో బ్రిటిష్ పాలనలోని భారతీయ అధికారులు ప్రభుత్వపక్షాన చేరి తమ సహోదరుల పట్ల దమనకాండ సాగించేవారు. భారతస్వాతంత్య్రపోరాట చరిత్రలో ఉన్నత పోలీసు ఉద్యోగాన్ని ఒదిలి స్వాతంత్య్రపోరాటంలో పాల్గన్న ఒకే ఒక వ్యక్తి శ్రీ దడాల మాత్రమే. దీనికి ఆయన ఎంతో గర్వపడేవారు. ఇవన్నీ ఉత్తమ మానవవిలువలు. ప్రతిఒక్కరూ స్ఫూర్తి పొందగలిగిన లక్షణాలు.
తన ఆత్మకథ ఎందుకు వ్రాసానో శ్రీ దడాల చెపుతూ ‘ నేను దళిత క్రిష్టియన్ ని. నేనేదో గొప్ప విషయాన్ని సాధించానని చెప్పుకోవటం లేదు. కానీ నా వినమ్ర జీవితంలోని విషయాలను తెలుసుకొని ఏ కొద్దిమంది యువతీయువకులైనా, ముఖ్యంగా నా దళిత సహోదరులు స్ఫూర్తినొందుతారని నా ఆశ ’ అంటారు. శ్రీదడాల తన జీవితంలో ప్రదర్శించిన పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటపటిమను భావితరాలకు తెలియచెప్పటానికి యానాం ప్రభుత్వం- శ్రీ దడాల రఫేల్ రమణయ్య గారి నిలువెత్తు కాంశ్య విగ్రహాన్ని యానాం, ఫెర్రీరోడ్డులో 1993లో ప్రతిష్టింపచేసి, తన గౌరవాన్ని చాటుకుంది.
రిఫరెన్సులు
1. My Struggle for freedom of French Provinces in India - An Autobiography’ by Sri. Dadala Raphael Ramanayya
2. Cultural study of dalit autobiographies in India. by Landage, Ramesh, - source Shodhganga
3. మరాఠీ దళిత ఆత్మకథా ప్రక్రియ, డా. జి.వి. రత్నాకర్ 26-3-12 సూర్య దినపత్రిక/డా.దార్ల వెంకటేశ్వర రావు బ్లాగు
4. ఫ్రెంచి ఇండియా విమోచకుడు, దడాల రమణయ్య, 29 జూన్, 2008 ఆంధ్రజ్యోతి లో ప్రముఖ కవి శిఖామణి వ్యాసం
5. కథలు గాథలు, చెళ్ళపిల్ల వెంకటశాస్త్రి, పేజి నంబరు 403
6. ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం, బొల్లోజు బాబా
. --- బొల్లోజు బాబా
No comments:
Post a Comment