Monday, September 28, 2015

చరిత్ర



“ఈ సొరంగం చివర
వెలుతురు ఉండి తీరాలి” అన్నాడతను
“ఒకప్పుడు ఉండేదట!
చెదలు తినేసాకా వెలుతురంతా
అయిపోయింది” అన్నారు కొంతమంది వృద్ధులు.

వెలుతురుని వెతుక్కుంటూ సాగిన ఆ యువకుడు
చెదపురుగులకు బలయ్యాడు.
ప్రజలు పడీ పడీ నవ్వుకొన్నారు
అయినవాళ్ళే మూర్ఖత్వమని
గుసగుసలాడుకొన్నారు చాలాకాలం.

కొన్నేళ్ళ తరువాత
వెలుతురు రాజ్యంలో, నగరం మధ్యలో
ఆ యువకుని విగ్రహం
“వెలుతుర్ని స్వప్నించిన వీరుడు”
అనే అక్షరాలతో

బొల్లోజు బాబా

Wednesday, September 23, 2015

వెచ్చని కన్నీరు




జ్ఞాపకం ఒక చీకటి రాత్రి
వెలుతురు దుస్తులు తీసేసిన పగల్లాంటి
చిక్కని చీకటి రాత్రి జ్ఞాపకం

ఏం చూసావో నీకు గుర్తుండదు
ఇసుకపై బజ్జున్న పసి పిల్లాడ్నో లేక
చెట్టుకొమ్మకు వేలాడుతున్న పిడికెడు మట్టినో
కానీ దాని జ్ఞాపకం మాత్రం
చీకటి రాత్రిలా నీలో విచ్చుకొంటుంది.
లోహ శబ్దాలు నిండిన మెలకువ
నిశ్శబ్దంగా పరచుకొంటుంది నీ చుట్టూ.

చరిత్ర నదిలో వెచ్చని కన్నీరు
ప్రవహించే సందర్భమది.

బొల్లోజు బాబా





Friday, September 18, 2015

“నీలో కొన్నిసార్లు” కలిగే ఆలోచనలే – బి.వి.వి. ప్రసాద్ కవిత్వం

ప్రముఖ కవి Bvv Prasad గారి "నీలో కొన్నిసార్లు" కవితా సంపుటి పై నా పరిచయ వ్యాసం ఈ నెల కవితా పత్రికలో ప్రచురింపబడింది. Bandla Madhava Rao గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
“నీలో కొన్నిసార్లు” కలిగే ఆలోచనలే – బి.వి.వి. ప్రసాద్ కవిత్వం
బి.వి.వి. ప్రసాద్ కవిత్వం లో ఏముంటాయి? ఈ లోకంపై కాస్తంత దయ, సన్నజాజి తీగలా చుట్టుకొన్న తాత్వికత, గొంతు విప్పి హాయిగా గానం చేసే జీవనానుభవాలు. ఇంతే! ఇంకేమీ కనిపించవు.
బి.వి.వి ఒక హైకూ కవిగా మంచి పేరు తెచ్చుకొన్నారు. నిమ్మముల్లులా గుచ్చుకొనేవి అతని హైకూలు. బాధగా అనిపించేది కాదు కానీ, ఈ కవి ఇంత సున్నితంగా, సూక్ష్మంగా లోకాన్ని ఎలా దర్శించగలుగుతున్నడా అని విస్మయం కలిగేది.
తాత్విక ధోరణిలో సాగే బి.వి.వి “ఆరాధన” తెలుగు సాహిత్యంలో విలక్షణంగా సాగే రచన. “గీతాంజలి” లోని ప్రాణవాయువుని బి.వి.వి “ఆరాధన” అణువణువూ నింపుకొంది. చలం తరువాత, గీతాంజలి సారాన్ని పీల్చుకొన్న మరో తెలుగు వ్యక్తి బి.వి.వి మాత్రమే అనిపిస్తుంది.
మొత్తం 84 కవితలతో కూడిన బి.వి.వి కొత్తపుస్తకం పేరు “నీలో కొన్నిసార్లు. ఆర్థ్రత, సౌందర్యం, తాత్వికతా అనే మూడు వంకలు కలవగా ఏర్పడ్డ సెలయేరులా అనిపిస్తుంది ఈ “నీలో కొన్నిసార్లు”. - స్వచ్చంగా, గలగలలాడుతూ, చెట్లనీడల్ని ప్రతిబింబిస్తూ ప్రవహించే కవిత్వ సెలయేరు.
ఈ సంకలనంలో జీవితం అనే మాట పలుమార్లు కన్పిస్తుంది. కానీ వచ్చిన ప్రతీసారి ఒక కొత్తఅర్ధంతో, కొత్త కోణంలో, ఒక కొత్త మెటఫర్ తో కనిపించటం బి.వి.వి ప్రతిభకు తార్కాణం.
జీవితమింతే
ఇది ఒక దిగంబర దేవత
ఇది నిన్ను రమ్మనదు, పొమ్మనదు
ఇది కావాలనదు, ఇది వద్దనదు
మతిలేని యాచకురాలి నవ్వులా నీ కలలన్నిటినీ కోసుకొంటూ తరలిపోతుంది
--- (జీవితం ఇలాగే)……… అంటూ జీవితంలో నిండిన శూన్యతను వర్ణిస్తాడు కవి
జీవితమొక మహా విహంగం
దాని రెక్కలు విప్పినప్పుడు, అది పగలు, మూసినపుడు రాత్రి
…. (విహంగ దర్శనం) అంటూ ఒక సర్రియల్ పదచిత్రంతో జీవితాన్ని ముడిపెడతాడు.
జీవించడమంటే, మరేం కాదు
గాలిలా, నేలలా, నీటిలా ఉండటం
ఉండటమే ఉత్సవమైనట్టు ఉండటం
మిగిలిన పనులన్నీ నిద్రపోయాక నీ ప్రక్కలో ఒంటరివైన ఆటబొమ్మలు …
. (బ్రతకాలి)…. జీవితాన్నిఉత్సవంలా జీవించటమే జీవన వాస్తవికత, అదే జీవితాదర్శం అంటుందీ కవిత. ఈ కవితలో ఎంతో లోతైన చింతనను చిన్న చిన్న పదాలద్వారా పలికిస్తాడు బి.వి.వి.
జీవితం భయ, విషాదాలలో పొరలే పాత్రను తలదాల్చి నర్తించే కళ
గెలిచేందుకు ఏ నియమాలూ లేని, గెలిచే హామీ లేని నవ్వుకొనే క్రీడ …..
(అలా ఆకాశం వరకూ...)…. అంటూ నిస్పృహ నిండిన స్వరంతో జీవితాన్ని వర్ణిస్తాడు కవి. ఇది జీవితం పట్ల నైరాశ్యం కాదు. మాయలమారి అయిన ఆధునిక జీవనం పై కవి చేసిన వ్యాఖ్యానం. ఈ కవిత చివరలో “నాతో రా ఒకసారి, ఆకాశం లా మారిచూద్దాం” అనటం ద్వారా కవి ఈ స్థితి పట్ల తన దిక్కారాన్ని వినిపిస్తున్నాడు.
జీవితమంటే ఏమిటని ప్రశ్నించుకొన్న ప్రతిసారీ
దిగులు మేఘాలపై ఓ కొత్త జవాబు
ఇంద్రధనస్సులా మెరుస్తూవుంటుంది. …… (జీవితార్ధం)
…… జీవితమంటే ఏమిటన్న దానికి యోగులు, వేదాంతులు, ప్రవక్తలూ అనాదిగా ఎన్ని నిర్వచనాలిచ్చినా, ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. ఆ ప్రశ్నకు జవాబుగా జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో జవాబు మెరుస్తూండటం కూడా సహజమే. ఇదే విషయాన్ని వేదాంతి అయిన కవి ఈ కవితలో గొప్ప లాఘవంగా పలికించాడు.
వెనుతిరిగి చూసుకొంటే
బాల్యాన్ని కోల్పోవటమే ఉంటుంది కానీ
పెద్దవాళ్ళు కావటం ఉండదని అర్ధమైంది ….(గాజుగోళీ)
….. ఈ వాక్యాలలో పెద్దవాళ్లవటం కంటే బాల్యమే ఉన్నతమైన స్థితి అన్న అర్ధం ద్వనిస్తుంది. కవులు సదాబాలకులు అనే ఒక అందమైన ఊహకు ఒక అద్భుతమైన పొడిగింపు ఈ వాక్యాలు.
మనమంతే
నదినీ, జీవితాన్నీ
ప్రేమించటమెలానో మాట్లాడుకొనే సందడిలో
వాటిని ప్రేమించటం మరచిపోయి పడవదిగి వెళ్ళిపోతాము
….. (మనమంతే)…. మన జీవితాలలోని అరాసిక్యాన్ని ఒడుపుగా బంధించిన కవిత ఇది. నిజమే మరి! సౌందర్యాన్ని ఆస్వాదించటం మాని సెల్పీలు దిగటంలోనో లేక కబుర్లు చెప్పుకోవటంలోనో కాలాన్ని వృధాచేసుకొంటాం చాలాసార్లు.
కవీ నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
దానినే గలగల లాడించి సెలయేరని భ్రమింపచెయ్యకు
నీముందు, నదుల్ని తాగి ఏమీ ఎరుగనట్లు చూస్తున్నవారుంటారు…
… (వర్థమాన కవికి)— పై కవితలో ఓ వర్ధమానకవిని హెచ్చరిస్తున్నాడు ఈ కవి. కీర్తికాంక్ష, చప్పట్లహోరు వంటి విషవలయాల్లోకి వెళ్ళొద్దనీ, కవిత్వాన్ని వెలిగించే అగ్ని కోసం అన్వేషించమనీ సూచిస్తాడు.
“ఈ సిమెంటు మెట్లపై నీకేం పని సీతాకోకా” అంటూ మొదలయ్యే “సీతాకోక చిలుకా”- వార్ధక్యం పై వ్రాసిన “అవతలి తీరం గుసగుసలు - తాత్వికత నిండిన “రాక”-అన్యోన్య సహచర్యాన్ని అద్భుతంగా నిర్వచించిన “ఒకే సంతోషానికి”- బెంగగా ఉంది డాడీ అని హాస్టల్ నుండి అర్ధరాత్రి ఫోన్ చేసిన అమ్మాయి గురించి వ్రాసిన “బెంగటిలిన వేళ”- అక్షరాలను అద్దాలతో పోలుస్తూ చెప్పిన “అక్షరాశ్రమం” – పిల్లలగురించి చెప్పే “పసిదనపు స్వర్గం”--- వంటి కవితలు హృదయాన్ని తాకి అనుకంప రగిలిస్తాయి.
స్వచ్చమైన కవిత్వాన్ని ఇష్టపడే వారికి ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది. కవి మాటల్లోని నిజాయితీ, సత్యాన్వేషణా చదువరులను ధ్యానంలోకో, మౌనంలోకో లాక్కెళ్లతాయి. శాంతికి, నెమ్మదికి జీవితంలో ఇవ్వాల్సిన విలువను గుర్తుచేస్తాయి. ఒక్కోసారి జీవితంలోని నైరాశ్యం పట్ల హృదయంలో జ్వలించే అనేక ప్రశ్నలకు సమాధానాలు కన్పిస్తాయి ఈ కవిత్వంలో. ఈ పుస్తకాన్నీ ఏకబిగిన చదివినపుడు కొంత ఏకరీతిగా ఉన్నట్లు అనిపించినా, మరల మరల చదివినపుడు ఆ భావాల లోతు, పొరలు ఆస్వాదించవచ్చు.
ఈ కవిత్వ సంపుటి లభించే చోట్లు:
వాసిరెడ్డి పబ్లికేషన్స్, హైదరాబాద్
నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్
ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ బుక్ షాప్స్, విజయవాడ
ఈ పుస్తకం: కినిగే.కాం
బొల్లోజు బాబా
http://online.fliphtml5.com/ymxa/inav/#p=29
    Comments
  • Bolloju Baba
    Write a comment...