Saturday, May 30, 2009

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.

నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.

స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Beginning అనే గీతం

Sunday, May 24, 2009

స్వస్థానము (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

పిసినారి సాయింసంధ్య తన స్వర్ణ వర్ణాలను వెనక్కి తీసేసుకొంటున్నవేళ,
మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను.

పంటకోసిన పొలాలు బోసిపోయి, మౌనంగా పడిఉన్నాయి.
చీకటి లోలోతుల్లోకి, పగటి కాంతి మునిగిపోతోంది.

ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది.
సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి
అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు.

మైదానపు ఆవలి అంచున , చెరుకు తోటల కవతల కనిపిస్తున్న
పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగొని ఉన్నదట వాని ఇల్లు.

తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక క్షణం నిలిపి పరికించాను.
నల్లని నేల బాహువులు అక్కున చేర్చుకొన్న గృహ సముదాయం
కనిపించింది.
ఊయలలు, మంచాలు, సాయింత్రపు దీపాలు, మాతృహృదయాలు,
తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో
అది పరిమళిస్తోంది.

బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Home. అనే గీతం

Wednesday, May 20, 2009

నిద్ర దొంగ (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

\పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరూ? నాకు తెలియాలి.

ఊరి చివరి చెరువు నీళ్ళు తేవటానికై అమ్మ బిందె తీస్కొని వెళ్ళింది.
మద్యాహ్నమైంది. పిల్లల ఆటలు ముగిసాయి.
చెరువులోని బాతులు నిశ్శబ్ధంగా ఉన్నాయి.
రావిచెట్టునీడలో పసులు గాసే పిలగాడు కునుకు తీస్తున్నాడు.
మామిడితోపుల చిత్తడిలో ఓ కొంగ నిశ్చల గాంభీర్యంతోజపం చేస్తున్నది.

ఇదే అదుననుకొన్నదో ఏమో!
పాపాయి కనులనుండి నిదుర దొంగ
నిదురను దొంగిలించి మాయమయ్యింది.
అమ్మతిరిగి వచ్చేసరికి , పాపాయి గదిలో కలియపాకుతూ తిరుగుతోంది.

పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరు? నాకు తెలియాలి.

ఆమెను కనుగొని గొలుసులతో బంధించాలి. ఆమెవరో నాకు తెలియాలి.
ఆ చీకటి కొండగుహలో గులకరాళ్ళ మధ్య
ఓ చిరుసెలయేరు పారాడుతున్నది. అచట వెతకాలి.

ప్రశాంత రాత్రివేళ సంచరించే నిశి మోహిని కాలిమువ్వల గలగలలకూ
గూటి పావురాల గుబగుబలకూ మత్తుగొలిపే నీడనిస్తున్న ఆ పొగడ తోపులో వెతకాలి.
సాయింకాల వేళ మిణుగురుల కాంతి తారాడే
వెదురుపొదల గుసగుసల మౌనంలోకి తొంగి చూస్తాను.
కనపడిన ప్రతి జీవినీ "నిదుర దొంగ ఎక్కడ నివసిస్తుందో చెప్పండి" అని ప్రశ్నిస్తాను.

పాపాయి కనులనుండి నిదురను దొంగిలించింది ఎవరో నాకు తెలియాలి.
ఆమె గానా నాకు దొరికిందా, మంచి గుణపాఠమే చెపుతాను.
ఆమె గూటిపై దాడిచేసి తాను దొంగిలించిన నిద్రలను
ఎక్కడ దాచుకొందో పట్టుకుంటాను.
దానిని కొల్లగొట్టి, ఆమెను ఇంటికి తీసుకొని వెళతాను.

ఆమె రెండు రెక్కలను బంధించి, ఏటిఒడ్డున కూర్చోపెట్టి
రెల్లు గుబుర్లతో, చేపలతో ఆడుకొమ్మని, పేక బెత్తంతో శాసిస్తాను.

సాయింత్రం బజారులు ఖాళీ అయిపోయాకా
పిల్లగాండ్రు తల్లుల ఒడిలో చేరేవేళ
ఆ నిదురదొంగ చెవులలో రాత్రిపక్షులు
"ఇక ఇపుడు ఎవరి నిద్రనూ నీవు దొంగిలించలేవు" అని అరుస్తో పరిహసిస్తాయి.


బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sleep Stealer

అనే గీతంMonday, May 18, 2009

శిశువు రీతి - (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

శిశువు తలచుకొంటే
క్షణమే స్వర్గానికి ఎగురుకుంటూ పోగలడు
.
మనలను విడువకపోవటం మరెందుకోకాదు.
తల్లి చనవులపై తలాన్చి పరుండటం తనకెంతో ఇష్టం కనుక.
ఆమె వియోగాన్ని భరించలేడు కనుక.

శిశువుకు ఎన్నెన్ని గొప్పమాటలు తెలుసో!
కానీ వాటికి భాష్యం చెప్పగలిగేది కొద్దిమందే
.
తను మాట్లాడాలనుకోకపోవటం మరెందుకో కాదు.
మాతృభాషను ఆమె పెదాలనుండే నేర్చుకోవాలని.
అందుకే అతడు ఏమీ ఎరుగని వానివలే అగుపిస్తాడు.

శిశువు పసిడి ముత్యాలకధిపతియైనప్పటికీ
లోకంలోకి ఒక యాచకుని వలే అరుదెంచాడు.
అట్టి మారు వేషం మరెందుకో కాదు.
చిన్నారి దిశమొల యాచకుడై నిస్సహాయత నటిస్తూ,
తల్లి ప్రేమ నిధిని పొందటానికే
.

చిరునెలవంక లోకంలో శిశువు విశృంఖల విహారియే!
తన స్వేచ్ఛను త్యజించింది మరెందుకో కాదు.
తల్లి హృదయాంతరాళంలో అనంతమైన ఆనందమున్నదనీ
ఆమె బాహువులలో ఒదిగి అదుముకోబడటం
స్వేచ్ఛకన్నా మధురమనీ తెలుసుకనుక.

బ్రహ్మానందలోకంలో ఉండేపుడు శిశువుకు ఏడవటమే తెలియదు
కానీ ఇపుడు కన్నీరు చిందించటం మరెందుకో కాదు.
శిశువు తన రోదనలతో దయ, ప్రేమ బంధాలను అల్లుకుంటూ
తనబోసినవ్వులతో అమ్మ కరుణాహృదయాన్ని తనవైపుకు ఆకర్షించటానికే.

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
BABY'S WAY
అనే గీతం

Friday, May 15, 2009

పుస్తకం.నెట్ లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ పై నా వ్యాసం

Crescent Moon అనే వచన గీతాల సంకలనం 1903 లో రవీంద్రనాధ్ టాగోర్ రచించిన “శిశు అనే బెంగాలీ రచనకు స్వీయ ఇంగ్లీషు అనువాదం.

ఈ గీతాలలో టాగోర్ ఒక అద్భుతమైన చిన్నారి ప్రపంచాన్ని సృష్టించి అనేక పాత్రల్ని అందులో సంచరింపచేస్తాడు. ..............

పూర్తి వ్యాసాన్ని, కొన్ని గీతాల అనువాదాన్ని ఇక్కడ చదవండి.


http://pustakam.net/?p=976


క్రిసెట్ మూన్ లో మొత్తం నలభై గీతాలున్నాయి. వాటి తెలుగు అనువాదం పూర్తయింది. త్వరలోనే వాటిని మీతో పంచుకొంటాను.

భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, May 10, 2009

పోలవరం కవితలు

గోదావరి నది పై ప్రయాణించటం ఒక మంచి అనుభూతి. ఇంతవరకూ బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తూ గోదావరిని దాటటం తప్ప బోట్ పై పాపికొండల వరకూ వెళ్లటం జరగలేదు. మొన్న సాధ్యపడింది. ఎత్తైన కొండలు, వాటిమధ్య పరవళ్లుతొక్కుతూ ప్రవహించే అఖండ గోదావరి, దారిపొడుగునా ఒడ్డుపై కనిపించే పల్లెటూర్లు, అక్కడక్కడా కనువిందు చేసే పక్షుల నడుమ సాగిన మా ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.

బహుసా ఈ అనుభూతి ఇంత డీప్ గా ఉండటానికి కారణం పోలవరం ప్రోజెక్టు కావొచ్చు. ఎందుకంటే దాని నిర్మాణం పూర్తయ్యే సరికి సుమారు 450 గ్రామాలు నీటమునిగి, ఇప్పుడు కనిపిస్తున్న పాపికొండల అందాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.

ఆ సందర్భంగా నాలో కలిగిన ఆలోచనల శకలాలను ఇలా మీతో పంచుకోవాలనిపించి........

బోటు ఎక్కగానే నది నీటిని చూస్తున్నప్పుడు, రాజమండ్రిలో పుట్టి, గతించిన మా పూర్వీకులు జ్ఞాపకం వచ్చారు. భద్రాచలంలో ఆలయ పునర్నిర్మాణంలో పన్నెండేళ్ల పాటు శిల్పిగా పనిచేసిన మా తాతగారి రూపం కదలాడింది. ధవళేశ్వరంలో పుట్టిన మా అమ్మమ్మ తలపుల్లోకి వచ్చింది. వీళ్లందరకూ ఈ గోదావరి తెలుసు/గోదావరికి వీళ్లందరూ తెలుసు అనిపించింది.
అలా ఎన్ని కోట్ల జీవితాలతో ఈ గోదావరి పెనవేసుకుపోయి ఉంటుందో కదా అన్ ఊహకు .......

ఆమెను తాకగానే,
ఓ నీటి బిందువులోంచి
నా ప్రవర వినిపించింది.
ఇక్కడి ప్రజల గుండెల్లో
గోదావరి ఉత్త నదే కాదు, మరింకేదో!

*********

నదిపై లారీ టైర్లలో గాలినింపి దానిపై ఒక చెక్కవేసుకొని కూర్చొని చేపలు పడుతున్న జాలరులను చూసి ముచ్చటేసింది. చిన్నప్పుడు మా వూరి చర్చి ఫాదరు జేబునిండా చాకలేట్ లు వేసుకొని, స్కూలు నించి వచ్చే మాకు పంచిపెట్టేవారు. మేము కూడా స్కూలు అవ్వగానే బిళ్లలకోసం చర్చివీధి గుండా ఇళ్లకు చేరేవాళ్లం. నదినీ, జాలర్లను చూసినపుడు ఎందుకో నది చాక్లెట్లిచ్చే చర్చి ఫాదరులాగా కనిపించింది.

పిల్లలకు చాక్లెట్లు
పంచిపెట్టే చర్చి ఫాదర్ లా
జాలర్లకు చేపలు
పంచిపెడుతోంది, నది.
********

పాపికొండల మధ్య ఒక చోట గోదావరి దాదాపు తొంభై డిగ్రీల టర్న్ తీసుకొంటుంది. దూరంనుంచి చూస్తుంటే నదికి అడ్డంగా ఓ పెద్ద కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. నది అక్కడతో అంతం అయినట్లు అనిపిస్తుంది. దానినే చిన్న చిన్న మాటలలో ఇలా.

నదికి అడ్డంగా పెద్ద కొండ.
ప్రవాహం ఆగలేదు
మలుపు తీసుకొంది.

ఇక్కడ నదీ ప్రవాహం జీవితం కావొచ్చు. అడ్డంకుల వద్ద జీవితం ఆగిపోదుగా. మలుపు తీసుకోవటమూ ఒక వ్యూహమే. అలా మలుపు తీసుకొన్నచోట గోదావరి లోతు వంద మీటర్ల పైన ఉంటుందట. మన జీవన మార్గాన్ని మళ్లించే ఏ అనుభవమైనా ఆ మాత్రం లోతుగానే ఉంటుంది.
**********

పర్యావరణ విచ్చిన్నం వలన వర్షాలు పడకపోవటం, ఎక్కడికక్కడ డాములు కట్టటమూ వంటి కారణాల వల్ల నదుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పరిణామం.

తమిళ కవి వైరముత్తు వ్రాసిన ఒక అద్బుతమైన కవితలో తన ఊరి నది గురించి వర్ణిస్తూ --- 1967 లో పాలనురుగులాంటి పౌర్ణమి రాత్రుల్లో వెన్నెల కరిగించుకొని తెల్లగా ప్రవహించిందని, 1977 లో కాల ప్రవాహంలో కాలువలా మారిందని, 1987 లో జలదానం కోల్పోవటంతో ఇసుక దానం చేస్తున్నదనీ, 1997 ఎక్కడకు మాయమయ్యావో చెప్పవా నదీ --- అంటూ ఆర్తిగా ప్రశ్నిస్తారు.

గోదావరికి కూడా నీటి కరువు వచ్చి (ప్రస్తుత ఎండాకాలం కాదు ప్రధాన కారణం) అక్కడక్కడా నదీ గర్భం బయట పడి వికృతంగా కనిపించటం ఒక విషాద దృశ్యం. దాని పదచిత్రం ఇలా....

నీరులేక బయటపడ్డ నదీగర్భం.
రాచపుండు గుంతల్లోంచి
కనిపించే వెన్నెముకలా ఉంది.
**********


ఈ నదిపై డామ్ నిర్మాణం పూర్తయితే ఇలా ప్రవహించే ఈ అఖండ గోదావరి జలాలు రిజర్వాయిర్ లో మురిగిపోవాల్సిఉంటుందేమో. అవసరాలకు తగ్గట్టుగా వేసిన కూడికలు తీసివేతల ప్రకారం ప్రవహించవలసి ఉంటుంది. ఇప్పటి స్వేచ్ఛ, విశృంఖలత్వం ఉండదు. అలాంటి పరిస్థితి ఊహకు వచ్చి, ఇలా

డామ్ సంకెళ్లు
వేయించుకోబోతున్న
ఈ నదీ ప్రవాహాన్ని
చూస్తూంటే జాలేస్తుంది.
ఇంకా మరికొన్ని

సముద్రానికి దారెటని
అడిగిన వాన చినుకుకు
దారి చూపుతోంది, నది.
******

బరువైన దినాల మధ్య
ప్రవహించే నీ జ్ఞాపకాల్లా
చుట్టూ కొండల మధ్య
అఖండ గోదావరి.
*******

ఒక్క క్షణం ఆగానో లేదో
నది నన్ను దాటుకొని
నవ్వుకొంటూ వెళ్లిపోయింది.
*********


ప్రస్తుతానికి ఇంతే.
పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో ఏర్పడే వాక్యూం గురించి వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను.
అది కూడా త్వరలో.......

బొల్లోజు బాబా

Sunday, May 3, 2009

జీవనమాధుర్యం


చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉంటాయి.

కెరటాలు ఒకదానివెనుక ఒకటి
పరుగులేడుతూనే ఉన్నాయి.
నెలనెలా వెన్నెల కుబుసం
ఆకాశం నుండి రాలిపడుతూనేఉంది.
వర్షాకాలంనుంచి తీసుకొన్న పగ్గాల్ని
వేసవికిచ్చేసి సాగిపోతుంది శీతాకాలం.

చేయాల్సిన పనులలా
పేరుకుపోతూనే ఉంటాయి.

కొన్నిపనులు
మరుపులోయల్లోకి జారినట్లే జారి
ఫీనిక్స్ పక్షుల్లా పైకి లేస్తున్నాయ్.

రేపు, వచ్చేఏడాది, ఎప్పటికైనా - అంటూ
చేయాల్సిన పనులు
భవిష్యత్తునిండా
చిక్కుడుపాదులా
అల్లుకొని బిగుసుకొన్నాయి.
జీవితాన్ని అడ్డంగా, నిలువుగా
అడ్డదిడ్డంగా పరుగులెట్టిస్తూన్నాయి.


రెండుకాళ్లపై నించొని
ఆకులనందుకో
యత్నించే మేకపిల్లలా
హృదయం శ్రమిస్తూనే ఉంది.

అయినా సరే
చేయాల్సిన పనులలా
మిగిలిపోతూనే ఉన్నాయి.బొల్లోజు బాబా

Saturday, May 2, 2009

శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా.......అక్షరాలనిండా నమ్మకాన్ని
జనుల అగాధ గాధల్నీ నింపిన కవీ
నీవు లోహ స్వరంతో చేసిన
జయగీతాలాపన ఇప్పటికీ
అమృతవర్షిణియే.

పాదముద్రలూ, పనిముట్లూ
రక్తపుచుక్కా, రొట్టెముక్కా,
గద్దరెక్కా, చమట చుక్కా
మానవత్వం, కరుణలతో
జలజలలాడిన నీ కవిత్వం
మరో వందేళ్లయినా
నిత్యనూతనమే.

విరహ సుఖాలు, జ్ఞాపకాల శోకాలూ
ప్రణయవేదనలు, సానుభూతి ప్రవచనాలూ
లేకుండా నీవు చేసిన కొత్త టానిక్
జీవనయానపు జాడీలో ఊరే కొద్దీ
దాని విలువ పెరుగుతూనే ఉంది.

ఉదయాస్తమయాలను పొదువుకొన్న
నీ కవిత్వం కాలమున్నంత కాలమూ
జనహృదయాల మధ్య
ప్రవహిస్తూనే ఉంటుంది.

చుట్టూ దగా ఉందని హెచ్చరించి
ప్రజకు ముందూవెనుకా కవిత్వాన్ని నిలిపిన
కవీ, రవీ, నీకివే మా జోతలు.


బొల్లోజు బాబా