Showing posts with label అనువాదాలు. Show all posts
Showing posts with label అనువాదాలు. Show all posts

Tuesday, February 16, 2010

రెండు నిముషాల మౌనం -Two minutes silence by కేదార్ నాథ్ సింగ్

సోదర సోదరీ మణులారా 

ఈ రోజు మరణిస్తున్నది మరణిస్తున్న ఈ దినం కోసం రెండు నిముషాల మౌనం

ఎగిరిపోతూన్న పక్షికోసం నిశ్చల జలాల కోసం మీద పడుతున్న రాత్రికోసం రెండు నిముషాల మౌనం

దాని కోసం కాని దాని కోసం అయిఉండాల్సిన దానికోసం రెండు నిముషాల మౌనం

విసిరేసిన తొక్కకోసం నలిగిపోయిన గరిక కోసం ప్రతీ యత్నం కోసం ప్రతీ పధకం కోసం రెండు నిముషాల మౌనం

ఈ గొప్ప శతాబ్దం కోసం ఈ శతాబ్దపు ప్రతీ గొప్ప ఆలోచన కోసం దాని గొప్ప పదాలకోసం ఇంకా గొప్ప ఉద్దేశాలకోసం రెండు నిముషాల మౌనం

సోదర సోదరీమణులారా ఈ గొప్ప విజయాలకోసం

రెండు నిముషాల మౌనం రెండు నిముషాల మౌనం

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్,  Kedarnath Singh -- A Two-Minute Silence

అనువాదం:  బొల్లోజు బాబా

Saturday, February 13, 2010

రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్

1. రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్ 
 రండి మీకు వీలు కుదిరినపుడు రండి 
మీకు వీలు కుదరనప్పటికీ రండి 
చేతులలో శక్తిలా 
నాళాలలో రక్తంలా రండి 
కుంపట్లోని సన్నని మౌన జ్వాలల్లా 
 రండి రండి 
వానల తరువాత మొలిచే తాజా తుమ్మ ముళ్లల్లే 
 రాలిపోయే రోజుల్లారా 
కూలిపోయే వాగ్దానాల్లారా 
రండి రండి 
మంగళవారం తరువాత వచ్చే 
బుధవారంలా రండి రండి 

 మూలం: COME WHEN YOU FIND THE TIME - KEDARNATH SINGH 

 2. పండు రుచి లా.... 
 ఆకాశంలో తారలు 
నీళ్లల్లో చేపలు 
గాలిలో ప్రాణవాయువు 
 సరిగ్గా అలానే 
ఈ భూమిపై నేను నువ్వు 
అనిలము 
మరణము 
దిరిసెన పూలు 
 అగ్గిపుల్ల తల 
ఇంటి తలుపు 
వీపుపై కురుపు 
పండు రుచి 
 సరిగ్గా అలానే...... సరిగ్గా అలానే....... 

 మూలం:LIKE FLAVOUR OF FRUIT - KEDARNATH SINGH 

 భవదీయుడు బొల్లోజు బాబా

Wednesday, February 10, 2010

పదాలు చలికి చచ్చిపోవు - శ్రీ కేదార్ నాధ్ సింగ్

పదాలు చలికి చచ్చిపోవు
ధైర్యం లోపించటం వల్ల చస్తాయంతే
పదాలు తడి కాలంలో
చెడిపోతాయి ఎక్కువగా

మా ఊరి ఏటిగట్టుపై
ఒకసారి నేనో పదాన్ని కలిసాను
మెరిసే ఎర్రపిట్టలా ఉందది
ఇంటికి తీసుకొచ్చాను
గుమ్మం వద్దకు చేరగానే
వింతైన బెదురు చూపులతో
నన్ను చూస్తూ చచ్చిపోయింది అది

అప్పటి నుంచీ పదాలంటే భయం నాకు
వాటి మధ్యకు వెళ్లినా వెంటనే వెనక్కు వచ్చేస్తాను
రంగు రంగుల దుస్తులు వేసుకొని
జుట్టు విరబోసుకున్న పదం నా వైపు రావటం చూస్తే
వెంటనే నా కనులు మూసేసు కొంటాను

నెమ్మది నెమ్మదిగా
ఈ ఆటను ఆనందించటం మొదలెట్టాను
నేనో రోజు గడ్డి మేటు కింద
పాములా నక్కిన ఓ అందమైన పదాన్ని
రాయితో గాయపర్చాను అకారణంగా

దాని చక్కని మెరిసే కళ్ళను
ఈ నాటికీ నేను మరచిపోలేదు

కాలం గడిచే కొద్దీ
నా భయం తగ్గసాగింది
ఈ రోజు పదాలు ఎదురైతే
కుశల ప్రశ్నలు వేసుకుంటాం

ఇపుడు నాకు
అవి దాక్కునే చోట్లెన్నో తెలిసాయి
వాటి వివిధ వర్ణాలు చాలామట్టుకు
నాకు పరిచితమయ్యాయి
సాదా పదాలు, గోధుమ చామనిచాయ రంగుల్లోను
విధ్వంశక పదాలు, లేత పసుపు పింక్ రంగుల్లోను
ఉంటాయని నేనిప్పుడు చెప్పగలను

విషాదకర, గంభీర సందర్భాలకోసం
మనం దాచుకొన్న పదాలు
వాటికుద్దేశింపబడిన సందర్భాలలో
చాలా జుగుప్స కలిగించే పదాలే కావటం
తరచూ జరిగేదే


బొత్తిగా పనికి రానివనీ
హీన వర్ణాలను తొడుక్కొన్నాయనీ
చెత్తలో పారేసిన పదాలే

నా ఆపత్కాలలో సహాయపడ్డాయన్న 
నిజాన్ని కనుగొన్నాను
ఇపుడేం చేయగలను నేను

నిన్నేం జరిగిందంటే
ఓ అరడజను సొగసైన పదాలు
చీకటి వీధిలో అకస్మాత్తుగా
నన్ను చుట్టు ముట్టాయి
భయమేసింది నాకు

మాటల్లేకుండా కొద్దిసేపు వాటిముందు
అలా నిలచుండి పోయాను, చమటతో తడుస్తో
తేరుకొని పరుగు ప్రారంభించాను
నా పాదాలు గాల్లోకి లేస్తుండగా
రక్తంలో తడిచిన ఓ చిన్నారి పదం
ఎక్కడినుంచో ఆయాసపడుతూ నన్ను చేరి
" రా, నేను నిన్ను ఇంటికి చేరుస్తాను" అంది.

మూలం: WORDS DON’T DIE OF COLD - KEDARNATH SINGH


భవదీయుడు
బొల్లోజు బాబా

Saturday, October 10, 2009

నిన్ను కప్పే కాంతి

(పాబ్లో నెరుడా The Light Wraps You కు తెలుగు అనువాదం)


కాంతి తన మృత్యు జ్వాలతో నిన్ను పెనవేసుకొంటుంది.

నీ చుట్టూ తిరిగే వెన్నెల కు అడ్డుగా

ఎవరో పరధ్యాన దు:ఖితుడు నిలచాడు.

గతించిన ఘడియ ఏకాంతంలో ఒంటరివై

జీవ జ్వాలలు నింపుకొని,

శిధిల దినపు నిజమైన వారసునిగా

మాటల్లేక మిగిలిపోయావా మిత్రమా.


నీ చీకటి దుస్తులపై ఫలమేదో సూర్యునినుండి రాలిపడింది.

రాత్రి వేళ్లు, అకస్మాత్తుగా నీ ఆత్మలోంచి మొలచుకొచ్చాయి.

నీలో దాగున్నవన్నీ మరలా బయటకు వచ్చేస్తున్నాయి.

ఒహ్! ఘనమైన, ఫలవంతమైన, ఆకర్షణీయమైన

చీకటి వెలుగులలో తిరుగాడుతూండే ఈ వలయం

పెంచి, నడిపించే ఈసృష్టి విషాదంతో నిండి ఉంది,

దాని పువ్వులు వాడిపోతూంటాయి



బొల్లోజు బాబా

Saturday, May 30, 2009

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.

నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.

స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Beginning అనే గీతం