Saturday, May 30, 2009

ప్రారంభం (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

"నేనెక్కడి నుండి వచ్చాను? నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.

నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.

స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Beginning అనే గీతం

2 comments:

  1. మంచి ప్రారంభం. ఒక్క సలహా చెప్పనా .. మొదటి వెర్షను రాశాక మళ్ళీ ఆ భావననంతా ఇంకోసారి మీ మదిలో సుడులు తిరగనివ్వండి. అటుపైన మీ సొంతమాటల్లో (తర్జుమా మాటలు కాక) బయటికి రానీయండి. అప్పుడు మరింత మధురంగా ఉంటుంది.

    ReplyDelete
  2. చాలా బాగుంది. Now I wish to read original.

    ReplyDelete