ఆ మైదానపు మార్గాన ఏకాకినై నేను సాగుతున్నాను.
పంటకోసిన పొలాలు బోసిపోయి, మౌనంగా పడిఉన్నాయి.
చీకటి లోలోతుల్లోకి, పగటి కాంతి మునిగిపోతోంది.
ఉన్నట్టుండి ఒక పిల్లగాని కీచు స్వరం గాలిలోకి లేచింది.
ఆ సాయింత్రపు నిశ్శబ్ధంలోకి తన పాట జాడను విడిచి
అగుపించని చీకట్లలోకి వాడు కనుమరుగయ్యాడు.
ఆ మైదానపు ఆవలి అంచున , ఆ చెరుకు తోటల కవతల కనిపిస్తున్న
పోక, పనస, కొబ్బరి చెట్ల నీడల మధ్య దాగొని ఉన్నదట వాని ఇల్లు.
తారల కాంతిలో సాగుతున్న నా ఏకాకి యానాన్ని ఒక క్షణం నిలిపి పరికించాను.
నల్లని నేల బాహువులు అక్కున చేర్చుకొన్న ఓ గృహ సముదాయం
కనిపించింది.ఊయలలు, మంచాలు, సాయింత్రపు దీపాలు, మాతృహృదయాలు,
తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో
అది పరిమళిస్తోంది.
బొల్లోజు బాబా
మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Home. అనే గీతం
చదువుతున్నా, చదువుతున్నా!
ReplyDelete>> తమ విలువ తమకే తెలియని బ్రహ్మానందంతో నిండిన పసి హృదయాలతో
ReplyDeleteఅది పరిమళిస్తోంది.
పాపలు మంచి రూపాలు
దేముని గుడిలో దీపాలు
మచ్చలేని మాణిక్యాలు
ముచ్చటైన అరవిందాలు
కరుణకు ప్రతిరూపాలు
కనిపించే దేవతలు
అపుడో విన్న పాట. మళ్ళీ గుర్తుకి వచ్చింది
తర్జుమా చాలా బావుంది. భావం పొల్లు పోలెదు. అభినందనలు.
ReplyDelete