Wednesday, February 25, 2009

రహస్య సృష్టి


అంతవరకూ విడివిడిగా
ఎగిరిన తూనీగలు
జంటగా అదృశ్యమయ్యాయి.

గులాబీ రేకలపై కూర్చొని లేచిన
కోతులు కూడా కిచకిచమంటో
వనమంతా తిరుగాడుతున్నాయి.

ఇరు తనువుల్లో ఎగసిపడిన
మోహకీల
తన్మయత్వపు మంచుకొండపై
వెన్నెల పూలు పూయించింది.
పారవశ్యపు మైదానాలపై
నిశ్శబ్ధ సౌందర్యాన్ని వర్షించింది.

రాత్రి పగిలి, ముక్కలు చెదిరి
చీకట్లో కరిగి, వేకువలో అదృశ్యమయ్యింది.
నీ జడలో మల్లియల్లా.

నెమలీక నీలి కనులు
సగం తెరచీ, సగం మూసీ
ఆదిమ లౌల్యాన్ని ఆఘ్రాణిస్తున్నాయి.

వసంతం తన రహస్య అందాలతో
సృష్టిని సుసంపన్నం చేస్తోంది.


పై కవిత పై ఈ క్రింది లింకులో మంచి చర్చ జరిగింది. తమ్మినేని యదుకుల భూషణ్ గారు అద్భుతమైన విశ్లేషణ చేసారు. ఎన్నో కొత్తవిషయాలు తెలిపారు. ఆశక్తి కలిగిన మిత్రులు చూడండి.


http://groups.google.com/group/tamasavirodhi/browse_thread/thread/463cfbd7e98ff0e9?hl=en

బొల్లోజు బాబా


Friday, February 20, 2009

నీవు లేవు .....

పక్షుల్ని, పండుటాకుల్ని, నా ప్రశాంత క్షణాల్నీ
ఈ పిచ్చి తుఫాను గాలులు వేటాడుతున్నాయి.
పక్షులు దారితప్పాయి.
పండుటాకులు నేలరాలాయి.
నా ప్రశాంత క్షణాల ఏకాంతం లోంచి
నువ్వూ అదృశ్యమయ్యావు.

చీకటితో పిటపిట లాడే తుఫాను రాత్రీ
నేనూ మిగిలాం ఇక.

బొల్లోజు బాబా

Monday, February 9, 2009

సూర్య నమస్కారం


రోజుకూడా
సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.
మోరెత్తి
సూర్యుడ్ని చూసి ఎన్నాళ్లయిందో!

టన్నులకొద్దీ వెలుగుని కుమ్మరిస్తూ
దినాన్ని స్ఫటికంలా మెరిపించి
అనంతాంధకారాల్నీ కలుగులోకి తరిమేసిన
సూర్యుడ్ని పలకరించి చాన్నాళ్లయింది.

నీడలు, గోడలు, నేలను తప్ప మరొకటెరుగని కనులు
ధవళ కాంతి రహస్యాలను పరిమళించలేవు.

గదుల్లోంచి, గదుల్లోంచి, గదుల్లోంచి గదుల్లోకి జారే
మన దైనందిక ఇనపక్షణాల్లో
మసకవెలుతురే అన్నిచోట్లా రాజ్యమేలుతుంది.

చలువ కనులజోడు కిటికీ కర్టెనై
కిరణ విహంగాల రెక్కలు కత్తిరిస్తుంది.
పడమటి నల్లబల్ల రంగుల్ని చెరిపేసుకొన్నాకా
మసక చీకటి మరింత చిక్కబడుతుంది.

అయినా భ్రమ కాకపోతే కానీ
నగర జీవనాంధకారారణ్యంలో
కాంతి తన కిరణ పాదాలతో సంచరించగలిగే
ఆరుబయళ్లెక్కడున్నాయి
ఇళ్ల మధ్య పిచ్చిగా పరుగులెత్తే రోడ్లు తప్ప.

వెలుగు రేకలు ఈతలు కొట్టటానికై
విశాలమైదానాలెక్కడున్నాయి
తేనెగూళ్ల లాంటి ఇరుకు హర్మ్యాలు తప్ప.

నగర మనిషికసలు మోరెత్తి
సూర్యుడ్ని చూసే
తీరికేదీ? ధైర్యమేదీ?

బొల్లోజు బాబా