Monday, February 9, 2009
సూర్య నమస్కారం
ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.
మోరెత్తి సూర్యుడ్ని చూసి ఎన్నాళ్లయిందో!
టన్నులకొద్దీ వెలుగుని కుమ్మరిస్తూ
దినాన్ని స్ఫటికంలా మెరిపించి
అనంతాంధకారాల్నీ కలుగులోకి తరిమేసిన
సూర్యుడ్ని పలకరించి చాన్నాళ్లయింది.
నీడలు, గోడలు, నేలను తప్ప మరొకటెరుగని కనులు
ధవళ కాంతి రహస్యాలను పరిమళించలేవు.
గదుల్లోంచి, గదుల్లోంచి, గదుల్లోంచి గదుల్లోకి జారే
మన దైనందిక ఇనపక్షణాల్లో
మసకవెలుతురే అన్నిచోట్లా రాజ్యమేలుతుంది.
చలువ కనులజోడు కిటికీ కర్టెనై
కిరణ విహంగాల రెక్కలు కత్తిరిస్తుంది.
పడమటి నల్లబల్ల రంగుల్ని చెరిపేసుకొన్నాకా
మసక చీకటి మరింత చిక్కబడుతుంది.
అయినా భ్రమ కాకపోతే కానీ
ఈ నగర జీవనాంధకారారణ్యంలో
కాంతి తన కిరణ పాదాలతో సంచరించగలిగే
ఆరుబయళ్లెక్కడున్నాయి
ఇళ్ల మధ్య పిచ్చిగా పరుగులెత్తే రోడ్లు తప్ప.
వెలుగు రేకలు ఈతలు కొట్టటానికై
విశాలమైదానాలెక్కడున్నాయి
తేనెగూళ్ల లాంటి ఇరుకు హర్మ్యాలు తప్ప.
నగర మనిషికసలు మోరెత్తి సూర్యుడ్ని చూసే
తీరికేదీ? ధైర్యమేదీ?
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
అంతా బాగుంది బాబాగారూ.."మోర ఎత్తడం" అన్నది మటుకు నాకు నచ్చలేదని మనవి చేసుకుంటున్నా..ఇంకేదన్నా పదం పడుతుందేమో సూడండి...ఎట్టాగంటే "పూర్ణచంద్రముఖీ" కి "నిండు నెల మూతిదానా" లాగా అన్న మాట... ఆన్ నీకు నచ్చకపోతే నాకేటి అంటే సెప్పేదేమీ లేదని..ఇంతే సంగతులు సిత్తగించవలెను..
ReplyDeleteఅబ్బ,.. చక్కటి దృశ్యాన్ని చెప్పి చూపించారు. చాలా అందంగావుంది మాస్టారు. పోలికల అలంకారం మెరిసిపోతున్నది. ‘సూర్యనమస్కారం’ తలుక్కుమన్నది.
ReplyDeleteవిన సొంపైన అలంకారాలు. చాలా బాగుంది. పదాల నడవడి నచ్చింది బాబా గారు
ReplyDeleteకనులు కాంతి రహస్యాలని పరిమళించలేవు... నాకు అర్థం కాలేదండీ.
ReplyDeleteకిరణమంటే కరమనడం విన్నాను కానీ పాదమనే ఊహ చదవడం ఇదే తొలిసారి!
సర్ !వాస్తవాన్ని ,నగర జీవన విధానాన్ని ,అపార్ట్ మెంట్స్ వచ్చాక కనపడని సూర్య కాంతిని చాలా చక్కగా వర్ణించి చెప్పారండీ .
ReplyDeleteకాంతి తన కిరణ పాదాలతో సంచరించగలిగే
ReplyDeleteఆరుబయళ్లెక్కడున్నాయి
ఇళ్ల మధ్య పిచ్చిగా పరుగులెత్తే రోడ్లు తప్ప.
బావుందండీ
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో...
ReplyDeleteI can see real 'Master' here... Good one Baba garu.
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు
I can see a good staff person here
మసకవెలుతురే అన్నిచోట్లా రాజ్యమేలుతుంది... aaha excellent...
GoodOne
మోర అనే మాట నాకూ బావుండలేదు.ఇంకొకటేమైనా బాగుంటుందేమో చూడండి.
ReplyDeleteబహుసాలో స వర్ణానికి బదులు శ వర్ణం ఉండాలనుకుంటా.ఓసారి సరి చూడండి.
ReplyDeleteకిరణ పాదాలు ప్రయోగాన్నికూడా ఓ సారి పునరాలోచించగలరు.
ReplyDeleteదైనందిక ఇనపక్షణాలలో చిక్కుకోవటం వలన తొందరగా స్పందించలేకపోతున్నాను. మిత్రులు మన్నించాలి.
ReplyDeleteవంశీగారికి
మోర ఎత్తి అన్న మాట నచ్చలేదు అన్నారు. ఆ పదం ఎందుకు తప్పుగా శబ్ధిస్తున్నదో మీరిచ్చిన వివరణ సరిపోయింది.
నేనెందుకు వాడానన్నది బ్రౌను నిఘంటువునుండి ఈ అర్ధంలో
మోర (p. 1053) [ mōra ] mōra. [Tel.] n. The projecting face of animals. Phiz, a word of contempt for face, మూతి. (నిందయందు) మనుష్యముఖము.
నిందయందు మనుష్యముఖము అనే అర్ధంలో వాడటం జరిగింది.
మీ ఉపమానం తో నా పొరపాటు తెలిసింది. తెలిపినందుకు ధన్యవాదములు.
వర్మగారు ధన్యవాదములండీ
భాస్కరరామిరెడ్డి గారు
మీ బ్లాగు చూసానండీ, తెలుగుభాషపై మీకు చాలా పట్టు ఉన్నది. మీ భాషాసేవ గొప్పగా ఉన్నది. అభినందనలు. ధన్యవాదములు.
పరిమళంగారు,
థాంక్సండి.
లలిత గారు,
ఇళ్ల మధ్య పిచ్చిగా పరుగులెత్తే రోడ్లు తప్ప అన్న ప్రయోగం నాకెంత ఇష్టమంటే, అదే భావాన్ని ఫుల్ లెంగ్త్ కవితగా వ్రాయాలని ఆశ.
రమేష్ గారు
అంతే నంటారా. :-))
నరసింహగారు
మోర అన్న ప్రయోగం గురించి పైన వివరించానండీ
బహుశా యే కరక్టు, గూగిల్లితే బహుసాకి ఓ వెయ్యి, బహుశాకి ముప్పైఆరువేలు వచ్చాయి. నా బ్లాగునుంచే బహుసా అనే పదానికి ఓ పది ఫలితాలు ఉన్నాయి. :-).
కిరణ పాదాలు అనే ప్రయోగం: ఇక్కడ కవిత లో సూర్యుడు ఒక వస్తువు కనుక, సూర్యకాంతి నగర నేలపై స్వేచ్చగా నడయాడే పరిస్థితి లేదు అని చెప్పటం కోసం కిరణపాదాలు అనే పోలికను వాడానండి.
మీరు ఒక దృశ్యాన్ని ఊహించండి, సూర్యుడు, తన కిరణాలు అనే పాదాలతో సంచరిస్తున్నాడు అని. బహుశా పాదాలు బదులుగా కాళ్లు అని ఉండాలనా లాజిక్. అలా అయితే మొత్తం పదచిత్రాన్నే మార్చెయ్యాలి. కదండీ?
భవదీయుడు
బొల్లోజు బాబా
ఆలస్యంగా స్పందిస్తున్నాను. నాకు వచ్చిన రెండు సందేహాలకూ, అడిగే అవసరం లేకుండానే, మీరు సమాధానం ఇచ్చేశారు. కవిత బాగుంది.
ReplyDeleteఅద్భుతంగా ఉందండీ. నాకు కిరణ పాదాలు ప్రయోగం చాలా బాగా నచ్చింది.. కొత్తగా ఉంది చాలా..
ReplyDelete"ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు."
రెండు సంతకాలు ఎలాగ??