టేబుల్ పై చేతి వాచీ
నెలవు తప్పిన కలువలా ఉంది.
ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
ఒక్క అడుగు కూడా తిరిగి రాదు కదా!
దాని డయల్ నూతిలో
అనుభవాలు, జ్ఞాపకాలు, కాలపు తునకలు,
మాగ్గట్స్ లా లుకలుకలాడు తున్నాయ్.
ఎంత జీవితాన్ని ముక్కలు ముక్కలుగా
కత్తిరించి ఉంటాయో కదా దీని ముళ్ళు.
టేబుల్ పై చేతి వాచీ
కాలం లా ముసలిదైపోయింది.
ఎంతకాలాన్ని
నిరీక్షణలు, నిస్ఫ్రుహలు, అసహనాలుగా
పోతలు పోసి ఉంటుందో కదా ఈ వాచీ.
ఎన్నిటిక్కట్టు ముక్కల్ని చింపిందో.
ఎన్ని సిగరెట్ పీకల్ని రాల్చుకొందో కదా!
ఎన్ని నిలుపుకోలేని
వాగ్ధానాల్ని పరిహసించి ఉంటుందో కదా.
టేబుల్ పై చేతి వాచీ
అపుడూ, ఇపుడూ అదే మోనాలిసా నవ్వుతో.
గంటల్ని రోజులుగా,
రోజుల్ని ఋతువులుగా
కొన్నింటిని వేగంగా, మరి కొన్నింటిని నీరసంగా
మార్చుకొంటూ సాగిపోయిందీ వాచీ.
కాలాన్ని బంధించాననుకొన్నడు మనిషి, కానీ
దీని డయల్ ఊబిలో పీకలోతు కూరుకుపోయాడు.
టేబుల్ పై చేతి వాచీ
ఒకనాటి పెళ్ళి కానుక.
ఒక వనాన్ని పొడుం చేయగల
ఒడ్రంగి పిట్ట ముక్కంత బలంగా
ఒక జీవితాన్ని పొడుచుకుంటూ
పోయిందీ ముల్లు గర్ర.
దీని రేడియం అంకెల నక్షత్రాల వెలుగులో
రాత్రులు కూడా మినుకు మినుకు మంటూ మెరిసేవి.
టేబుల్ పై చేతి వాచీ
ఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది.
మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది.
యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా.
బొల్లోజు బాబా
ఈ కవిత కొద్ది మార్పులతో ఈమాట జనవరి సంచికలో ప్రచురింపబడినది. సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో
ఆ లింకు ఇక్కడ http://www.eemaata.com/em/issues/200901/1394.html
Subscribe to:
Post Comments (Atom)
"ఎంత జీవితాన్ని ముక్కలు ముక్కలుగా
ReplyDeleteకత్తిరించి ఉంటాయో కదా దీని ముళ్ళు"
అద్భుతంగా వ్రాసారు...
"ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
ReplyDeleteఅపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
ఒక్క అడుగు కూడా తిరిగి రాదు కదా!"
...చాలా చాలా బాగుంది
ఎన్ని నిలుపుకోలేని
ReplyDeleteవాగ్ధానాల్ని పరిహసించి ఉంటుందో కదా.
ఒక వనాన్ని పొడుం చేయగల
ఒడ్రంగి పిట్ట ముక్కంత బలంగా
ఒక జీవితాన్ని పొడుచుకుంటూ
పోయిందీ ముల్లు గర్ర.
మీ భావ సంపదకు నా జోహార్లు. మీ కవితల్ని సంకలనంగా తెచ్చే ఉద్దేశం లేదా కవి గారూ మీకు?
నా చేతి వాచీ నిత్యం నన్ను జాగృతపరిచే కొరడా - కరిగిపోతున్న కాలాన్ని, జీవితాన్ని, కన్నీటిని, కష్టాన్ని, నష్టాన్ని, సంతసాన్ని, సంతృప్తినీ ఒకే మూసలో నిర్లిప్తంగా, నగ్నంగా నాకొదిలి తగు రంగులు నన్నే పూసుకోమన్న నిర్మల నిశ్చలమూర్తి.
ReplyDeleteచంద్ర గారికి,
ReplyDeleteమురళి గారికి,
సుజాత గారికి
ఉష గారికి
స్పందించినందుకు ధన్యవాదములండీ
బాబా గారు చాలా బాగా వ్యక్తీకరించారు. అభినందనలు.
ReplyDeleteటేబుల్ పై చేతి వాచీ
ReplyDeleteఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది.
మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది.
యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా.
ఏం చెప్పమంటారూ... ఏమో! మాట మూగబోయింది!
raghava garu
ReplyDeletethank you very much for catching the soul of the poem
i have been awaiting if any one could do so/and doubted myself whether i could deliver it properly or not
you comment has made me confident that the poem soul is visible
బాబాగారు..... ఆలస్యంగా చూసాను. చాలా బాగుంది అనే పాత పదమే అయినా తప్పదు, ఇంతకన్నా గొప్పపదాలు తెలియని దాన్ని.....మన్నించాలి!!!
ReplyDelete