ఈ సముద్రం ఒక దట్టమైన నీలి కలువై
తన రేకల అలల అంచులతో
అచల ఏకాంత తీర సైకత మౌనాన్ని ముద్దిడి
తన హృదయలోతుల్లో జనించిన గవ్వల పుప్పొడితో
అభిషిక్తం చేస్తోంది, ఒకానొక ఆదిమ లాలసగా.
మానవజాతి కర్మజలాలన్నీ
ఈ సువిశాల కాలపాత్రికలో
కెరటాలు కెరటాలు గా మరుగుతున్నాయి.
నిర్జన సాగర మైదానాల అనంత దూరాల్ని
ప్రయాణించి అలసిన గాలి మేని నిండా చమట జిడ్డు.
గవ్వల శూన్యపు నిర్జీవ హోరులో
సరుగుడు చెట్ల గాలి ఊళలపై
నీలాంబరపు పారదర్శకతపై
నిర్లిప్త శిలల మౌన చర్మంపై
ఈ లోతైన క్షణాల కలంతో
ఈ సాగర తీర సాయింత్రం తన
మృత్యుగీతాన్ని లిఖించుకొంటోంది.
సూర్యుని కొల్లగొట్టి పిటపిటలాడుతూ
ప్రకాశించిన పగలు పగుళ్లు తీసింది.
పగుళ్లలోంచి రాత్రి మౌన చీకట్లు ఊరుతున్నాయి.
చలితడి ప్రవహిస్తూంది. వెలుగు వర్ణాలు కారిపోతున్నాయి.
వార్ధక్యంతో వంగిపోయిన
ఈ సాయింత్రానికవతల సుదూరంగా
వెన్నెల సంగీతంతోనూ, నిశ్శబ్ధ అలల పరిమళంతోనూ
నీ జ్ఞాపకమొకటి నా స్వప్న దారులలో
మిల మిలా మెరుస్తూ జ్వలిస్తూంది.
బొల్లోజు బాబా
బాబాగారు, భలేగా రాసారు!!!
ReplyDeleteఒక చిన్న అల పాదాలను తడిపి వెళ్ళిపోయినట్టుంది.
ReplyDeleteచాలా గంభీరంగా వుందండీ బబాగారూ కృష్ణ శాస్త్రి ని గుర్తుకుతెచ్చారు
ReplyDeletesir!excellent! mana kakinada beachena sir?
ReplyDeleteకాటికి కాళ్ళు జాపిన బ్రతుకు సాయంత్రాన్ని,
ReplyDeleteగుర్తొచ్చిన యవ్వన మధ్యాహ్నాన్ని,
కలగలిసిన జీవిత తీరాన్ని,
కాల సాగర కావ్యాన్ని
అందించారు. హృద్యంగానూ, హృదయం కదిలించేది గాను ఉంది. అభినందనలు.
స్పందించిన అందరకూ ధన్యవాదములు
ReplyDeleteపరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. కొంచెం బిజీగా ఉండి బ్లాగులవైపు చూడటం వీలు పడటం లేదు. మిత్రులు మన్నించాలి. నా ఆలస్యాలకు.
బొల్లోజు బాబా