
నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ
అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?
రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.
ఇంటి చూరుకు వేలాడదీసిన
వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.
నీ అవిశ్రాంత మైధున సంగీతానికి
ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.
చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు
ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.
మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.
పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?
నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.
బొల్లోజు బాబా
అవునండీ, నిజంగా కరువు మొదట ఈ పిచ్చుకలపైనే ప్రభావితంచూపిందేమో.!! ఇంటివాకిట్లో బియ్యపు ముగ్గు, నూకగింజలు లోపం కంటికి కనిపించకుండ చేసాయి, పాపం పిచ్చుకలు,..ఫోటోను చూస్తుంటే నేనూ వాటినే చూసానేమో అనిపిస్తుంది!..
ReplyDeleteబాబా గారు చాలా బాగుంది. చిన్నప్పుడు మేము రక్షించిన పిచ్చికపిల్ల కధ గుర్తొచ్చింది.
ReplyDelete" వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది."
అద్భుతమయిన ముగింపు ఇచ్చారు. అభినందనలు.
మొన్న మొన్నటివరకు వరి కంకులు కడుతుండేవాళ్ళం.ఇప్పటి సంగతి తెలిదుకానీ మూడేళ్ళ క్రితం మా ఊర్లో బాగానే వుండేవి పిచ్చుకలు.ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అవి కనిపిస్తే ఈ కవిత చదివి వినిపిస్తా వాటికి.
ReplyDelete"చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా"....జువాలజీ మాష్టారూ...:)
"తరువాత 'మీవంతు' అంటూ
ReplyDeleteభయపెడుతూంది." నిజమే..తరువాత మనవంతే కాబోలు!
చాలా రోజుల తర్వాత మా ఇంటి backyardలో ఓ పది పిచ్చికలు కనపడేసరికి ఎంత సరదా పడ్డానో. మీ ఈ కవిత చదివి మా వూరి వాటి మీద నాకు తోచినట్లు వ్రాసుకున్నా. ఒకసారి నా మరువం పుఠల్లో వెదికి చదివిచూడండి మరి.
ReplyDeleteఅప్పుడెప్పుడో ఈనాడు ఆదివారం పుస్తకంలో దీని గురించే ఒక కథ చదివా. మనసు ఏదోలా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మీ ద్వారా మళ్లీ ఇప్పుడు ఇలా. పాకలు పోయి డాబాలు పెరిగి ఉళ్లో కనబడటం లేదు అనుకునేవాడిని. కానీ తర్వాత ఎక్కడో చదివా, పొలాల్లొ కెమికల్స్(ఎరువులు) కొట్టిన గింజలు ఈ ఘోరానికి కారణమట.
ReplyDeletesuperb baba garu
ReplyDeleteబాబా గారూ!చాలా బాగుంది.ఫోటోను చూస్తుంటే మా ఊర్లో పిచ్చుకలు గుర్తొచ్చి బాథగా అనిపించిoది.
ReplyDeleteచాలా బాగుంది...చాలాబాథగా అనిపించిoది.
ReplyDelete:(
బాబాగారు... మీ కవిత చదివాక రేపు తెల్లవారాక ఎలాగైనా ఒక్క పిచ్చుకనైనా చూడాలని నిర్ణయించుకున్నానండి. చాలా బాగుంది.
ReplyDeleteఇంత మంచి కవిత- అదీ గుండెలోతుల్లోకి వెళ్ళి అక్కడ గుచ్చుకొని మనస్సును కలిచివేసేలా చేసే కవితను- ఎలా రాయగలుగుతున్నారు మాష్టారూ.మీకు మీకవితకు నా సాష్టాంగ నమస్కారాలు.
ReplyDeleteబాబా గారు
ReplyDeleteమీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!
మా ఇంటి ముందున్న జమ్మిచెట్టుకు రకరకాల ఆకృతులలో గూడు కట్టుకునేవి. ఏ ఇంజినీరు అంతబాగా డిసైన్ చేయలేడేమో? అలా వేలాడుతున్న గూటిలోకి వెళుతూ వస్తూ అవి చేసే సవ్వడి నాకైతే ఎంత అపురూపంగా ఉండేదో. వరిగడ్డి లో వచ్చే వడ్లగింజను ముక్కుతో పొడిచి బియ్యం తినే దృశ్యం నిజంగా అద్భుతం. ఇక పిల్లలు పెట్టే సమయంలో ఐతే ఇల్లంతా వెతికి ఇంటిచూరులో ఒక చోట పిల్లలు పొదిగి, వాటికి ఆహారం అందించేటప్పుడు చూడాలి. ఓహ్! ఎర్రటి నొరు తెరుచుకుని కిచ్ కిచ్ మంటూ తల్లి కోసం అరిచే అరుపులు, వాటి నోట్లో జాగ్రత్తగా తల్లి పిచుక వదిలే గింజలు నిజంగా మరో లోకంలోకి వెళ్ళినట్లుండెది.
ReplyDeleteఇవ్వాళ మీ బ్లాగ్లో మళ్ళీ మా పిచుకమ్మను చూశను. చాలా బాధగా ఉంది. నేను ఎన్నో సార్లు చెప్తుంటాను నాన్నతో పొలంలో పచ్చి రొట్ట వాడండి, కృత్రిమ ఎరువులు వద్దు అని. కాని పిల్లకాయవు పైగా ఆడపిల్లవు నీకెం తెలుసు అనేవాళ్ళు.
ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది కదా!
చూద్దాం. ఎమైనా మార్పు వస్తుందేమో!
స్పందించిన అందరికీ ధన్యవాదములు
ReplyDeleteవర్మ గారు, ఆత్రేయగారు, రాధికగారు, మహేష్ గారు, ఉష గారు, నరేష్ గారు, గిరీష్ గారు, పరిమళం గారు, నేస్తంగారు, పద్మార్పిత గారు, నరసింహగారు, శృతిగారు, మీ మీ అభిప్రాయాలను వెలిబుచ్చినందుకు పంచుకొన్నందుకు సదా కృతజ్ఞుడను.
భవదీయుడు
బొల్లోజు బాబా
బాబాగారు చాలా బాగుంది.
ReplyDeletekonni saMvatsaraala nuMDI, "pichchukalu" guriMchi nEnu eMtO gaalistuunE unnaa!
ReplyDelete'vaaTini kaapaaDina baalyaaluu.." adbhuta vaakyaM,
"kaala paatrikalO ' saagara kavita chaalaa baagunnadaMDI!
AAva kaaya.com lO mIrachanalu chaduvutuuMTAnu; pariNata Saili, BAshapaina paTTu, kaavyatvamu paTla mii avagaahana ,unnata sthaayilO unnaayi.
బాబా గారు..
ReplyDeleteచక్కటి విషయాన్ని ఎంచుకుని మంచి టెక్నిక్ తో కవితను నడిపించారు.
ఇది నోస్టల్జియా లో నడిచిన కవిత గనుక పాఠకున్ని కవిత తన వెంట గొరగొరా లాక్కెలుతుంది.
అక్కడక్కడ ప్రొజాయిక్ గా తోచింది, మీరు ఈ కవితను ఇంకా చిక్కగా రాయగలరు, మీ మీది కన్నా మీ కవిత్వం మీద గౌరవం తో (చదివాను గనుక) చెబుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు మిత్రమా. ఈ కవిత బాలేదనికాదు, నా ఉద్దేశ్యం, పిచుక మీద ఎక్స్ట్రార్డినరీ పోయం చెప్పి పిచుక అంటే బొల్లోజు గుర్తురావాలని నా ఉద్దేశ్యం, అంతే మిత్రమా. మంచి కవిత్వమన్నా, కవిమిత్రుడన్నా నాకు చాలా గౌరవం అని సవినయంగా తెలియచేసుకుంటూ...
మీ
ఈగ హనుమాన్.
ఒక్కసారే నా జ్ఞాపకాల్లోకి తరిమేసారండి ....మీరు రాసినదంతా నాకు అనుభవమే .....మీ కవిత అధ్బుతం .ధన్యవాదములండి .
ReplyDelete