Wednesday, December 30, 2020

Imported post: Facebook Post: 2020-12-30T00:55:59

యానాం మన్యవోరి మేడ – ఇకపై ఒక జ్ఞాపకం . ఫ్రెంచియానం చరిత్రలో మన్యం జమిందారి, మన్యవోరి మేడ పోషించిన పాత్ర మరువలేనిది. నేడు యానాంలో ఆనాటి స్మృతులకు ఆనవాలుగా మిగిలున్న మేడను కూలగొడుతున్నారన్న వార్త బాధకలిగించింది. అది ప్రెవైట్ ప్రోపర్టీ కావొచ్చు. దానిపైన ప్రజలకు ఏ హక్కు లేకపోవచ్చు. చరిత్ర తెలిసిన వ్యక్తులకు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఒక హెరిటేజ్ బిల్డింగ్ గా దాన్ని నిలుపుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇది వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు. వ్యవస్థలు చేయాల్సినది. *** గోదావరి జిల్లాల్లో వైశ్యసామాజిక వర్గానికి చెంది జమీందారులుగా పేర్గాంచిన ఒకేఒక కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్దఎత్తున వ్యాపారాలు సాగించి గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈయన యానాంకు మకాం మార్చి తన వ్యాపారాలు మరింత వృద్దిచేసాడు. వీరి కుమారుడు సత్యలింగం తండ్రిలానే మంచి పేరు తెచ్చుకొన్నాడు. 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని ఈయన 2,30, 000 రూపాయిలకు కొన్నాడు. జమిందారీ చిహ్నాలయిన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి ఇతనికి బ్రిటిష్, ఫ్రెంచి ప్రభుత్వాలు అనుమతించాయి. ఇతని తరంలోనే యానాం మన్యం మహల్ నిర్మించబడిందంటారు. దీనిని స్థానికులు “మన్యవోరిమేడ” అని పిలుచుకొంటారు. ఇతని కుమారుడు మన్యం కనకయ్య. ఈయన మనవడు మన్యం చినకనకయ్య. 1865 లో ఈయనకు మహలక్ష్మమ్మతో వివాహం అయింది. అటుపిమ్మట ఎనిమిదేళ్లకు చినకనకయ్య మరణించారు. మన్యం మహలక్ష్మమ్మ గొప్ప సౌశీల్యవంతురాలు. అనేక దానధర్మాలు చేసారు. 1890 లలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొని, కొత్తదివానుగా శ్రీ బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి ని నియమించుకొన్నాక పరిస్థితులు చక్కబడి మరలా జమిందారీ కళకళలాడటం మొదలైంది. 1949 లో మన్యం జమిందారీ విలువ 6,42,487 రూపాయిల విలువ ఉన్నట్లు లెక్కించబడింది. ఆ తరువాత మన్యం జమిందారి వారసత్వహక్కుల కొరకు అనేక కోర్టుకేసులు నడిచాయి. ఫ్రెంచి యానాం చరిత్రలో మన్యం జమిందారీ, మన్యంవోరి మేడ కు సంబందించిన కొన్ని విస్మరించరాని ఘట్టాలు 1. 1828 లో బ్రిటిష్ ప్రభుత్వం కల్పించినట్లుగానే తనకు జమిందారి హోదాకల్పించమని మన్యం జమిందారు ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. ఈ హోదా అంటే పల్లకిలో తిరగడం, వెండిరాజదండాన్ని కలిగి ఉండటం, రెండుకాగడాలతో పల్లకి ప్రయాణం వంటి, ఇతరులకు లేని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఫ్రెంచి యానాం కలక్టరు డిలార్ష్ 1828 ఆగస్టు 18 న ఒక ఉత్తర్వు ద్వారా ఈ సదుపాయాలను మన్యం జమిందారుకు కల్పించాడు. దీనిపై యానాం సమాజం భగ్గుమంది. హిందూ వర్ణవ్యవస్థ ధర్మాలను బట్టి మన్యం జమిందారు వర్ణానికి (వైశ్య) అలాంటి సదుపాయాలు లేవని పాండిచేరీకి తొంభైమంది యానాంప్రముఖులు కంప్లైంట్ చేసారు. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాటిని చక్కబెట్టటానికి పాండిచేరీనుంచి లెస్పార్డా అనే అధికారి వచ్చి సయోధ్య కుదర్చవలసి వచ్చింది. 2. 1839 నవంబరు 16-17 లలో వచ్చిన సూపర్ సైక్లోను వల్ల యానాం చుట్టూ సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగాయి. ఆ రాత్రి ఫ్రెంచి యానాం కలక్టరు తన బంగ్లా సురక్షితం కాదని తలచి, రాత్రి 11 గంటలకు బంగళా ఖాళీచేసి మన్యవోరి మేడలో తలదాచుకొని ప్రాణాలు కాపాడుకొన్నాడు. 3. 1856 లో మన్యం జమిందారుకు జబ్బు నయమవటం కొరకు మన్యవోరి మేడలో మానవబలి జరిందని యానాం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి పాండిచేరికి పిర్యాదులు చేయటంతో 1858 నవంబరులో పాండిచేరి కోర్టు ప్రధానన్యాయమూర్తి Ristle Hueber విచారణ జరిపి ఆ మంత్రగాళ్ళకు మూడునెలల జైలుశిక్ష, మృతురాలి తల్లికి వెయ్యిరూపాయిలు పరిహారం ఇప్పించటంతో సమస్యకు తెరపడింది. ఇది ఆనాటి సమాజంలోని ప్రజల రాజకీయ అవగాహనకు, జాగృతికి నిదర్శనంగా నిలుస్తుంది. 4. మన్యం జమిందారు ఫ్రెంచి వ్యాపారస్తులకు ఆర్ధికసహాయం చేస్తూండేవారు. అలా కుర్ సన్ అనే వ్యక్తికి ఇచ్చిన అప్పును 12 శాతం వడ్డీతో చెల్లించమని 1859 పాండిచేరీ కోర్టు తీర్పునిచ్చింది. అప్పటికి కుర్సన్ చనిపోయి 29 సంవత్సరాలు అయింది. 5. 1873 లో మన్యం కనకయ్య యానాంలో బాలికల స్కూలు నిర్మాణం కొరకు భారీ నిధులు సమకూర్చారు. కనకాల పేటలో 1880 లో ఒక బాలుర హైస్కూలు నెలకొల్పారు. 6. 1930 లలో మన్యం జమిందారిణి మహలక్ష్మమ్మ యానాంలోని రాజరాజేశ్వరీ ఆలయానికి, శివాలయానికి, అన్నదాన సత్రానికి భూరి విరాళాలు, భూములు దానం చేసారు. 7. అప్పట్లో ఫ్రెంచి గవర్నరు, ఇతర అధికారులు యానాం వచ్చినప్పుడు వారందరికీ మన్యవోరి మేడ విడిదిగా ఉండేది. వారి గౌరవార్ధం విందులు, వినోదాలు ఇక్కడే జరిగేవి. 8. ఒకనాటి జమిందారీ చిహ్నాలయిన ఫిరంగులు మన్యవోరి మేడకు ఇరువైపులా ఉండేవి. *** కొన్ని కట్టడాలు ఒక ప్రాంత చరిత్రను నడిపిస్తాయి. ఆ ప్రాంతప్రజల సంస్కృతికి, సామాజిక స్పృహకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. నేను పుట్టిపెరిగిన యానాం ఈ రోజు తన పూర్వీకుల జ్ఞాపకాలను చెరిపేసుకొంది. నిజంగా ఇదొక దుర్దినం. Any how GOODBYE TO MY DEAR FRIEND. YOU LIVE IN ME FOREVER… బొల్లోజు బాబా పిఎస్: దయచేసి ఎవరినీ దూషిస్తూ కామెంట్లు పెట్టకండి ప్లీజ్.





Tuesday, December 29, 2020

Imported post: Facebook Post: 2020-12-29T16:08:38

మెకంజీ కైఫియ్యతులు-తూర్పుగోదావరి పుస్తకంపై మిత్రులు శ్రీ బెన్ జాన్సన్ గారు ఒక వాట్సప్ గ్రూపులో చేసిన పరిచయ వాక్యాలు ఇవి. వారి సహృదయతకు సదా నమస్సులు. వీరు జిల్లాకు చెందినవారు కావటంచే వారి సొంతవూర్లని కైఫీయ్యతులలోని వివరాలతో పోల్చుకొని విశ్లేషించారు. ఈ వాక్యాల వెనుక ఒక అనిర్వచనీయమైన ఆత్మీయ స్పర్శ తెలుస్తోంది. జాన్సన్ మిత్రమా థాంక్యూ సో మచ్. బొల్లోజు బాబా **** కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /యాదవులు,మత్య్సకారులు నివశిస్తూ ఉన్నారు. 1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బొల్లోజు బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. 1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా. ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి, వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి. ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి (గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి. చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి. చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేదట. జమిందారులు మహా ఇష్టంగా తినేవారట తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది. ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు. కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు, తుమ్మచెట్లు, అడవి ఎద్దులు, గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి? మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా, పూరి, మచిలీపట్నం, యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850 తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు. కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి. కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈ దండకవిలలనే మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది. మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి. క్రీశ. 600 సంవత్సరంలో కాకినాడకు కొంకిపర్రు అని, 1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ అని పిలిచే కాకినాడలో ఉండే బొల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు. తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం. 1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీ మాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ, కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు. కొమరిగిరి క్రీశ. 1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి, పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు. కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు. నిస్సంకుల నాయన కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య ,నండూరి తిమ్మరాజు, తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు. 1671-79 లోప్రోలునాడు పరిపాలిస్తున్నపు జంమిందారు తెలుగు రాయినంగారు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు. హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు. వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం. బొల్లోజు బాబా రచించిన, తూర్పుగోదావరి జిల్లా కైఫియ్యత్తులు నుండి వ్యాసకర్త సిద్దాంతపు బెన్ జాన్ సన్ బాలసాహితీ రచయిత పుస్తకం కోసం కాంటాక్ట్ 9866115655

Saturday, December 26, 2020

Imported post: Facebook Post: 2020-12-26T01:51:18

పెయింటరు ఒకప్పుడు గోడలు, బేనర్లు, సైను బోర్డులూ కటౌట్లపై వాడి సంతకం ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా వెలిగిపోతుండేది. నీలిమందు నీళ్ళలో ముంచిన పురికొస సాయంతో వాడు గీసిన సరళరేఖలమధ్య అక్షరాలు గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి. కుంచెలోని ఉడుతవెంట్రుకల మధ్య వర్ణాలు సురక్షిత సైనిక కవాతులా కదిలేవి. బేసిక్ కలర్స్ నుండి డిరైవ్డ్ రంగుల్ని సృష్టించడం వాడికి మాత్రమే తెలిసిన ఓ రసవిద్య. అతడు గీసిన చిత్రాలముందు ఎవరెవరోపారేసుకున్న ఓ పది పన్నెండు కళ్ళూ, రెండు మూడు హృదయాలూ ప్రతిరోజూ తుడుపులో దొరుకుతుండేవి. కొత్తవారికి వాడి రాతలు నిశ్శబ్దంగా, నిర్దుష్టంగా దారిచూపేవి. వాడి చెక్కపెట్టినిండా రంగురంగుల డబ్బాలే! ఇంద్రధనుస్సుని నిలువునా చీరి ఒక్కో ముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది. పెట్టెలో వివిధ సైజుల్లో బ్రష్షులు ఉండేవి సన్నని గీతనుండి ఆకాశమంత పెద్దరేఖ వరకూ గీయటానికై వాడి బట్టలపై, వంటిపై, హృదయంపై చిలికిన రంగుల మరకలు వాడికో దివ్యత్వాన్నిస్తున్నట్లు మురిసిపోయేవి. కానీ ఇప్పుడు వినైల్ ప్రింట్లూ, ఫ్లెక్సీ బేనర్లూ ఫోటో షాపులూ, కోరల డ్రాలూ, అన్నివైపులనుండీ కమ్ముకునే శీతవేళలా వాడిని మింగేశాయి. వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది. వాడి జీవితంలోకి థిన్నర్ కలుపని చిక్కని నల్లని రంగు ఎగజిమ్మింది. ఎప్పుడో ఎక్కడో వాడు రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో కళాత్మకంగా మనదారికడ్డంపడతాడు ఇంకే చెయ్యాలో తెలియక! బొల్లోజు బాబా "ఆకుపచ్చని తడిగీతం" సంపుటి నుంచి . (పెయింటర్ మిత్రుడు కీ. శే. పట్నాల రమణ ప్రసాద్ కు వెబ్ పత్రిక తెలుగుజ్యోతి సెప్టెంబరు-అక్టోబరు 2008)

Tuesday, December 22, 2020

Imported post: Facebook Post: 2020-12-22T23:18:44

బిక్కవోలు ఐకనోగ్రఫీ - 3 బిక్కవోలు గోలింగేశ్వరుని ఆలయ ఉత్తరగోడపై ఏకపాదంతో ఉండే శివుని ప్రతిమ ఉంటుంది. హిందూ దేవుళ్ల రూపాలు అనేక చేతులతో వివిధ ఆయుధాలు ధరించి ఉంటాయి కానీ కాళ్ళుమాత్రం సాధారణంగా రెండే ఉంటాయి. ఈ ప్రతిమకు ఒకే కాలు, నాలుగు చేతులు కలవు. ఈ రూపాన్ని ఏకపాద మూర్తి అంటారు. ఇది ఈశ్వరుని ప్రాచీనమైన రూపము. వేదాలలో "అజ ఏకపాద" పేరుతో రుద్రుని వర్ణనలు కలవు. విశ్వకర్మ రచించిన శిల్పశాస్త్రంలో ఈశ్వరుని పదకొండురూపాల్లో ఏకపాద మూర్తి ఒకటి. ఇది కఠోరతపస్సు చేస్తున్న స్థితికి సంకేతం. ఈ మూర్తిని పూజించినట్లయితే ఐహిక సుఖాలను కలగచేస్తాడని ప్రతీతి. ఏక పాదంతో ఉండే ఈశ్వర రూపాలు మూడురకాలుగా ఉంటాయి. అవి ఏకపాద శివమూర్తి, ఏకపాద భైరవ, ఏకపాద త్రిమూర్తి. బిక్కవోలు ఆలయంలో ఉన్న రూపం ఏకపాద శివమూర్తి. ఏకపాద శివమూర్తి శిల్పాలు భారతదేశంలో మూడుచోట్ల మాత్రమే ఉన్నాయి. 1. ఒరిస్సా Chaunsanth Yogini Temple 2. ఆంధ్రప్రదేష్ లోని ముఖలింగం వద్ద సోమేశ్వర ఆలయం 3. బిక్కవోలు గోలింగేశ్వర ఆలయం. బిక్కవోలులోని ఆలయాల శిల్పసంపద చాలా ప్రత్యేకమైనది. హిందూ మత శిల్పాకృతులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొనక ముందు నిర్మించిన ఆలయం కనుక అత్యంత ప్రాచీనమైన, అరుదైన దేవతా రూపాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. బొల్లోజు బాబా Ref: "Single Footed Deities: Glimpses from Art and Literature" by Prachi Virag Sontakke - Heritage: Journal of Multidisciplinary Studies in Archaeology 3: 2015 (రానున్న తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు పుస్తకం నుంచి)

Friday, December 18, 2020

Imported post: Facebook Post: 2020-12-18T23:02:20

బిక్కవోలు ఐకనోగ్రఫీ 2 బిక్కవోలు హైస్కూలు సమీపంలో ఉన్న విజయేశ్వర ఆలయానికి ద్వారపాలకులుగా గంగయమున విగ్రహాలు కలవు. గంగయమున ప్రతిమలను పూజించటం ఉత్తరభారతదేశంలో గుప్తుల కాలం నుంచే ఉంది. (క్రీశ. 3-5 శతాబ్దాలు). వారినుండి బదామి చాళుక్యులు గ్రహించి తమ రాజచిహ్నాలుగా చేసుకొన్నారు. వారి వారసులైన రాష్ట్రకూటులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. క్రీశ 880 లో చాళుక్యరాజైన గుణగవిజయాదిత్యుడు రాష్ట్రకూటులను జయించి, వారి సామ్రాజ్య చిహ్నాలను గైకొని బిక్కవోలులో తనవిజయానికి గుర్తుగా నిర్మించిన విజయేశ్వర ఆలయంలో ద్వారపాలకులుగా ప్రతిష్టించుకొన్నాడు. గంగ, యమున శిల్పాలు త్రిభంగ భంగిమలో ఉంటాయి. (దేహం మూడు ఒంపులతో). గంగ ఒకచేత కలశం ధరించి, మరొక చేయిని ఒక పరిచారిక తలపై ఆనించి మకరవాహనంపై నిలుచొని ఉండగా, యమున తాబేలు వాహనంపై చేత కలశం ధరించి నిలబడి ఉంటుంది. *** గుణగ విజయాదిత్యుడు - అసలైన ఆంధ్రతేజం . గుణగవిజయాదిత్యుడు కలివిష్ణువర్ధనుడి కొడుకు. క్రీశ.848 లో సింహాసనాన్ని అధిష్టించాడు. 44 ఏండ్లు పరిపాలించాడు. ఇతను తూర్పుచాళుక్య రాజులలో సుదీర్ఘకాలం పాలించి, రాజనీతిజ్ఞుడిగా, గొప్ప యుద్ధవీరుడిగా అత్యంత పేరు ప్రఖ్యాతులు గడించాడు. అరవీరభయంకరుడైన పండరంగడు ఇతని సేనాని. ఇతడు నెల్లూరు కోటను ధ్వంసం చేసి బోయకొట్టములను జయించి వేంగి రాజ్యంలో విలీనంచేసాడు. క్రీశ 866 లో గుణగవిజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి చాన్నాళ్లు అతనికి సామంతుగా వ్యవహరించాడు. క్రీశ 880 లో అమోఘవర్షుడు మరణించాక గుణగవిజయాదిత్యుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని రాష్ట్రకూటులపై దండెత్తి విజయం సాధించాడు. వారి రాజ్య చిహ్నాలయిన గంగ, యమునలను తనవిగా స్వీకరించి తాను నివసిస్తున్న బిక్కవోలు పట్టణంలో నిర్మించిన ఆలయానికి ద్వారపాలకులుగా చెక్కించాడు. గుణగవిజయాదిత్యుడు తెలుగు భాషను ప్రోత్సహించాడు. ఇతని కాలంలో వేయించిన అద్దంకి పండరంగని శాసనంలో ఆనాటి తెలుగుభాష తరువోజ చందస్సులో మొదటి సారిగా శాసనాలకు ఎక్కింది. నన్నయపూర్వుడైన నన్నెచోడుడు చాళుక్యరాజులు తెలుగుభాషను ప్రోత్సహించారు అన్నాడు. ఏ చాళుక్యరాజో తెలపలేదు. అది బహుసా గుణగవిజయాదిత్యుడే కావొచ్చు. ఇతని సాతులూరు తామ్రశాసనంలోని భాష సంస్కృతమైనప్పటికీ అంత్యప్రాసలున్న చంపకమాల లక్షణాలు ఉండటంచే అది ఎవరో తెలుగు కవి వ్రాసిందేనని అంటారు. గుణగవిజయాదిత్యుని తమ్ముడు యుద్ధమల్లుడు విజయవాడలో కుమారస్వామి ఆలయం కట్టించి అక్కడ వేయించిన శాసనం మధ్యాక్కర తెలుగుచందస్సులో ఉంది. గుణగవిజయాదిత్యుడు ఒక యుద్ధంలో శతృరాజైన మంగిరాజ తలను నరికి దానితో బంతి ఆట ఆడుకొన్నాడని, చక్రకూటాన్ని దగ్ధం చేసాడని పిఠాపురం శాసనంలో కలదు . ఇతను శివభక్తుడు. జైన మతాన్ని సమాదరించాడు. అనేక గ్రామాలను వేదవేదాంగాలు నేర్చిన బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు , కట్లపర్రు, సాతలూరు, పొన్నగి, సిసలి తామ్రశాసనాలు ద్వారా తెలుస్తున్నది. *** తెలుగు వారి చరిత్రలో రాజరాజ నరేంద్రుని (1019-1061) గురించి ఎందుకో చాలా ఎక్కువచేసి మాట్లాడుకొంటాం. కానీ రాజరాజ నరేంద్రుడు ఆంధ్రదేశాన్ని తమిళరాజులకు తాకట్టు పెట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇతని కాలంలో ఇక్కడ నుంచి అపారమైన సంపదలు తమిళ రాజ్యానికి తరలిపోయాయి. ఏ రకమైన పెద్ద ఆలయాలు ఇతని పాలనలో ఆంధ్రలో నిర్మించబడలేదు. ఇదే కాలంలో తమిళనాట ఆలయాల నిర్మాణం జరగటం కాకతాళీయం కాకపోవచ్చు. దాయాదుల గొడవలలో మామగారైన చోళరాజు సహాయం చేస్తే తప్ప సింహాసనం నిలుపుకోలేని పరిస్థితి ఉండేది. తన జీవిత చరమాంకంలో రాజమహేంద్రవరం నుండి తంజావూరు తరలిపోయాడు. మహాభారత అనువాదం ప్రారంభింప చేయటం ఇతడు తెలుగునేలకు చేసిన మేలుగా చెబుతారు కానీ దాని కర్తృత్వం, కాలం విషయాలలో అనేక వివాదాలు ఉన్నాయి. రాజరాజ నరేంద్రుని విషయంలో అర్హతకు మించిన అందలం ఎక్కించామేమో మనం అని అనిపించకమానదు. నిజానికి ఈ రోజు ఉత్తరాంద్రనుంచి రాయలసీమ అంటూ ఆంధ్రప్రదేష్ అని దేన్నైతే మనం పిలుచుకొంటున్నామో ఆ మేప్ నిర్మాత గుణగ విజయాదిత్యుడు. చోళ, పల్లవరాజులపై దండెత్తి జయించి అపారమైన బంగారాన్ని ఆంధ్రకు తీసుకొచ్చాడు. ఒకానొక దశలో తన మేనమామ అయిన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి సుమారు పదిహేనేళ్ళు అతను బ్రతికున్నంతకాలమూ సామంతుగా కట్టుబడి ఉన్నాడు. ఇదొక మానవీయకోణంగా అనుకోవచ్చు. తరువాత విజృంభించి జైత్రయాత్ర చేసి తూర్పు ఉత్తర, కర్ణాటక ప్రాంతాలను జయించి తనరాజ్యాన్ని విస్తరింపచేసాడు. బిక్కవోలులో ఇతను మూడు ఆలయాలు నిర్మించాడు. రాజమహేంద్రవరం పట్టణాన్ని నిర్మించింది గుణగవిజయాదిత్యుడే అవ్వటానికి అవకాశాలు ఎక్కువ. ఆంధ్రతేజంగా పిలువబడటానికి రాజరాజ నరేంద్రునికంటే గుణగవిజయాదిత్యునికే ఎక్కువ అర్హత ఉందనటం అతిశయోక్తి కాదు. బిక్కవోలులో గుణగవిజయాదిత్యుడు ప్రతిష్టించిన గంగ యమున శిల్పాలు సుమారు పన్నెండుశతాబ్దాల క్రితపు ఈ ప్రాంత వైభవానికి సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి. (రానున్న "తూర్పుగోదావరి జిల్లా -ప్రాచీనపట్టణాలు" పుస్తకం నుంచి) బొల్లోజు బాబా



Tuesday, December 15, 2020

Imported post: Facebook Post: 2020-12-15T00:36:31

బిక్కవోలు ఐకనోగ్రఫీ . వేదాలలో చెప్పిన రుద్రుడు పురాణాలకాలానికి త్రిమూర్తులలో ఒకడైన శివునిగా పరిణామం చెందాడు. నేడు హిందూమతంలో ఇది ప్రధాన ఆరాధన విధానం. ఇది కాక వేదాలను ప్రామాణికంగా అంగీకరించని పాశుపత, లకులీశ, కాపాలిక, కంకాళులు, కాలముఖ, భైరవ, లింగాయత్, సిద్ధాంత మార్గులు, జంగములు లాంటి పేర్లతో అనేక శైవ సంప్రదాయాలు ఉండేవి. కొన్ని సంప్రదాయాలు కొన్నికాలాలలో ప్రబలంగా ఉండి సమాజాన్ని ప్రభావితం చేసాయి. ఈ లోకానికి చెందని పారలౌకిక విషయాలకన్నా లౌకిక విషయాల పట్లే ఈ కల్ట్ లన్నీ దృష్టి పెట్టేవి. అందుచేత ఈ సంప్రదాయాలకు చెందిన వ్యక్తులు జైన, బౌద్ధ, హిందూ మతాచారాలను వ్యతిరేకించేవారు. ఆంధ్రప్రదేష్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గుణగ విజయాదిత్యుడు (క్రీశ. 848-891) నిర్మించిన ఒక ఆలయగోపురంపై (ఊలపల్లి వెళ్ళే దారిలో) లకులీశ సంప్రదాయానికి చెందిన వివిధ చిహ్నాలు కలవు. . 1. లకులీశ సంప్రదాయం . క్రీశ. ఒకటో శతాబ్దంలో లకులీశ ( Lakulisha Lord of the Club) అనే రుషి పశుపతి సూత్ర అనే గ్రంధాన్ని రచించి లకులీశ ఆరాధనా శాఖను ఏర్పరిచాడు. లింగపురాణంలో లకులీశుడు శివుని చివరిదైన 28 వ అవతారంగాను; వాయుపురాణంలో వ్యాసుని సమకాలీనుడుగాను చెప్పబడ్డాడు. లకులీశ సంప్రదాయంలో ఆరు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. 1. కారణ (ఈశ్వరుడు) 2. కార్య (జీవుడు) 3. కాల (అభేదం) 4. విధి (పద్దతి) 5. యోగ (జీవుడు ఈశ్వరునిలో కలవటం) 6. దుఃఖాంత (దుఃఖం నుండి విముక్తమవ్వటం) లకులీశ ఆరాధన నాలుగో శతాబ్దంనాటికి ఉత్తరభారతదేశంలో విస్త్రుతంగా ప్రచారం పొందింది. ఆరోశతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన బదామి కొండగుహలలో లకులీశుని శిల్పాలు కనిపించటాన్ని బట్టి- చాళుక్యులు ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించినట్లు అర్ధమౌతుంది. గుణగవిజయాదిత్యుడు కూడా ఆ వంశానికి చెందినవాడే. ఆంధ్రప్రదేష్ లో ఈ లకులీశ శిల్పాలు బిక్కవోలు కాక శ్రీకాకుళం జిల్లా ముఖలింగేశ్వర ఆలయం, కడప పుష్పగిరి ఆలయాలలో కనిపిస్తాయి. . 2. లకులీశ శిల్ప శైలి . లకులీశ విగ్రహాలు ప్రత్యేకమైన నిర్మాణశైలిని కలిగి ఉంటాయి. అవి ఎ. పద్మాసనంలో కూర్చున్న భంగిమ బి. పద్మ పీఠము సి. తలపై సర్ప కిరీటము డి. చేతిలో లకుటము (దుడ్డుకర్ర) ఇ. చెవులకు కుండలాలు ఎఫ్. ధర్మచక్ర ప్రవర్తనా ముద్ర (రెండు చేతుల వేళ్ళు ఎదురెదురుగా ఉంచి ఏదో భోధిస్తున్న భంగిమ) జి. చుట్టూ నలుగురు శిష్యులు . 3. బిక్కవోలులో ఉన్న లకులీశ శిల్పాలు , * ఆలయాద్వారానికి కుడివైపున కొద్దిగా శిధిలమైన లకులీశుని శిల్పం కలదు. ఇదు సుమారు నాలుగడుగుల ఎత్తు ఉంటుంది. తలపై ఉన్న కిరీటము సర్పమో కాదో తెలియటం లేదు. చెవులకు పొడవైన కుండలాలు ఉన్నాయి. చేతులు ధర్మచక్ర ప్రవర్తనా ముద్రలో కలవు. చేతిలో దండము ఉంది. రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. వజ్రాసనము, పద్మపీఠము కలవు. పీఠం క్రింద ఇద్దరు శిష్యులు మాత్రమే ఉన్నారు. (ఫొటో 1) * ఆలయగోపురంపై లకులీశ శిల్పాలుగా అనిపించే చిన్నచిన్నవి రెండు మూడు కనిపించాయి. (ఫోటోలు 2, 3) * ఇవి కాక చేత దండం, ఢమరుకం ధరించి నర్తించే భంగిమలో ఉన్న శిల్పమొకటి కలదు. ఇది బహుసా లకులీశ మూర్తికి రూపాంతరం కావొచ్చనుకొంటాను. (ఫొటో 4) * ఈ శిల్పాలలో జంధ్యం ఉండటం గమనార్హం. . 4. లకులీశ కల్ట్ పరిణామం . లకులీశుడు తన బోధనల ద్వారా అప్పటికే ఉన్న పాశుపత ఇంకా ఇతర శైవ కల్ట్ లను ఏకంచేసి ఒకే తాటిపైకి తెచ్చాడు. దానివల్ల ఈ కల్ట్ నాలుగో శతాబ్దానికి బలం పుంజుకొని ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. లకులీశ కల్ట్ ఆరాధకులు వంటిపై బూడిద పూసుకొని, ఓంకారాన్ని జపిస్తూ, శివుణ్ని స్తుతించేవారు. ఏడో శతాబ్దంలో ఆంధ్రను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాంత్సాంగ్ "లకులీశ ఆరాధకులకు రాజాదరణ ఉన్నదని, సమాజంపై వీరి ప్రభావం బలంగా ఉందని" వ్యాఖ్యానించాడు. లకులీశ సంప్రదాయం పదో శతాబ్దం వరకూ కొనసాగింది. ఈ శాఖ నుంచే కాపాలిక, కాలముఖ శైవ శాఖలు వచ్చాయంటారు. చివరలో వీరు తాంత్రిక పద్దతులు అవలంబించటంతో ఈ కల్ట్ క్రమేపీ ప్రజల ఆదరణ కోల్పోయింది. దక్షిణ భారతదేశంలో ఆ తదనంతరం వచ్చిన వీరశైవం, లింగాయత్ ఉద్యమాలకు లకులీశ కల్ట్ ప్రేరణగా పనిచేసిందనటంలో సందేహం లేదు. ఉత్తరభారతదేశంలో కనిపించే లకులీశ శిల్పాలలో Erect penis ను symbol of vigour గా చెక్కటం చూడవచ్చు. కానీ బిక్కవోలులోని లకులీశ శిల్పాలలో అలా లేకపోవటం గమనార్హం. *** హిందూ మతం అనేక భక్తిమార్గాల సంగమం. బహుదేవతారాధన హిందూమత బలం. ఉపనదులన్నీ జీవనదిలో కలిసినట్లు ఎన్నో కల్ట్స్ వచ్చి చేరగా నేడు మనం అనుకొంటున్న హిందూ మతం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక్కోకాలంలో ఒక్కో భక్తి మార్గం ప్రముఖంగా నిలిచింది. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. అలా కనుమరుగైన ఒక శైవ సంప్రదాయం లకులీశ మతం. ఒకనాటి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటించారనటానికి బిక్కవోలులో గుణగవిజయాదిత్యుడు తొమ్మిదో శతాబ్దంలో కట్టించిన ఆలయం నేడు సాక్ష్యంగా నిలుస్తూఉన్నది. బొల్లోజు బాబా



Saturday, December 12, 2020

Imported post: Facebook Post: 2020-12-12T23:01:21

కోరంగి సెమెటరీ లో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు. "తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు" అనే పుస్తకం కొరకు సమాచార సేకరణలో భాగంగా పై సమాధుల ఫొటోలను తీసుకొందామని కోరింగ సెమిటరీలను సందర్శించాను కొన్నేళ్ళక్రితం ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో, అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. అది కూడా వీధి కరంటు స్తంభానికి నిలబెట్టి ఉంది. 4X3‍X0.5 అడుగుల కొలతలతో ఉన్న నల్ల రాయి అది. దానిపై . "Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810, aged 11 months" అని ఉన్నది. ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణకేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant). 1817 నాటి Asiatic Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, Lark అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది. పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండునెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారుచేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్ధంగా పాతించి ఉంటారు. *** . కోరంగిలో 1827 చనిపోయిన Charles Eaton సమాధిఫలకం దొరుకుతుందని ఆశపడ్డాను. ఇతను కోరంగి ఓడరేవు అధికారిగా యాభైఏళ్ళు పనిచేసాడు. ఈ రేవుని ఎంతగానో అభివృద్దిపరిచాడు. ఇతని జ్ఞాపకార్ధం 1833 లో కోరంగిలో నిర్మితమైన ఒక ఓడకు " Charles Eaton" అనే పేరు పెట్టారు. ఆ ఓడ ఏలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి... . "Charles Eaton 350 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి 1827 లో ఇక్కడే మరణించిన Charles Eaton పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకు తో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడముందరి భాగము ఎత్తుగా అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండటం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి. ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ప్రయాణికులు బసచేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన Toilet కలిగి ఉండటం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా Gledstanes & Co అనే కంపనీ కొనుగోలు చేసింది" *** కోరంగికి కనీసం రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కళింగ రాజ్యంలో ఉండేది. మధ్యమధ్యలో కొన్ని గేప్స్ ఉన్నప్పటికీ మరలా తిరిగి ఈస్ట్ ఇండియా కంపనీ పాలనలో పెద్ద ఓడరేవుగా, నౌకానిర్మాణ కేంద్రంగా కోరంగి పునరుజ్జీవనం పొందింది. ఇక్కడ తయారైన ఓడలు విదేశాలలో విక్రయించబడేవి. సైక్లోనులు, ఉప్పెనల ప్రభావం, క్రమేపీ ఇసుకమేటలు వేయటంతో ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంనాటికి కోరంగి తన ప్రాభవం కోల్పోయింది. నేడు గతవైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ లేవు. సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం. బొల్లోజు బాబా యానాం సెమెటరీ వివరాలు https://sahitheeyanam.blogspot.com/2011/10/my-paper-presentation-in-centenary.html భీమిలి సెమెటరీ వివరాలు https://www.facebook.com/bolloju.baba/posts/10214592656154902

Thursday, December 10, 2020

Imported post: Facebook Post: 2020-12-10T03:07:53

ప్రముఖ హిందీకవి మంగలేష్ దబ్రాల్ కు నివాళిగా ఆయన కవిత్వానువాదాలు బొల్లోజు బాబా . 

1. ఈ శీతాకాలం - This winter by Mangalesh Dabral పోయిన శీతాకాలం చాలా బాధపెట్టింది దాన్ని తలచుకొంటేనే వణుకు వస్తోంది గత శీతాకాలం అమ్మ వెళ్ళిపోయింది ఒక ప్రేమలేఖ కనపడకుండాపోయింది ఒక ఉద్యోగం పోయింది ఆ రాత్రులు ఎక్కడెక్కడ తిరిగానో గుర్తే లేదు నేను చేసిన ఫోన్ కాల్స్, నా ఆత్మశకలాలూ నాపై కుప్పకూలాయి గత ఏడాది వేసుకొన్న దుస్తుల మూటల్ని విప్పదీసాను దుప్పట్లు, మఫ్లర్లు, మంకీ కేప్ లు వాటికేసి అలా తేరిపార చూసాను ఆ రోజులు ముగిసిపోయాయి ఈ శీతాకాలం అంత కఠినంగా ఉండదు... నిజంగానే! . 

2. తాత గారి ఫొటో - Grandfather's Photograph by Mangalesh Dabral మా తాతగారికి ఫొటోలు తీయించుకోవటం పెద్దగా ఇష్టం ఉండేది కాదేమో లేదా టైమ్ చిక్కలేదో ఒకే ఒక ఫొటో ఉంది ఆయనిది నీళ్ళబరువుతో వేలాడే మబ్బులా రంగువెలసిన గోడకి తగిలించి మా తాతగారి గురించి మాకు తెలిసిందల్లా ఆయన బిచ్చగాళ్ళకు దానాలు చేసేవాడని రాత్రుళ్ళు నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేవాడని ఉదయం తన పక్కను చక్కగా సర్దుకొనేవాడనీ.. అంతే నేను అప్పటికి చాలా చిన్నపిల్లాడ్ని ఆయన అమాయికత్వం కానీ కోపం కానీ ఎప్పుడూ చూడలేదు ఫొటోలు మనుషుల అంతరంగాల్ని ఎన్నటికీ చెప్పలేవు. అమ్మ అంటూండేది మేం నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట మమ్మల్ని చుట్టుముట్టే వింత వింత జీవుల్ని మా తాత ఫొటోలో మెలకువుగా ఉండి కాపలా కాస్తాడని నేను మా తాత అంత ఎత్తు అవ్వలేదు అంత శాంతంగానూ, గంభీరంగాను కూడా కానీ ఆయన లక్షణాలు నాలో ఏమూలో ఉన్నాయనే అనుకొంటాను ఆ అమాయికత్వం, ఆ కోపం. నేనూ తలదించుకొనే నడుస్తాను ప్రతీరోజూ ఒక ఖాళీ ఫొటో ఫ్రేములో నన్ను నేను చూసుకొంటూంటాను. మూలం. Mangalesh Dabral అనువాదం: బొల్లోజు బాబా

Wednesday, December 9, 2020

Imported post: Facebook Post: 2020-12-09T14:38:32

దాక్షారామ భీమేశ్వర ఆలయం, చాళుక్య భీమవరంలో కుమారారామ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించిన చాళుక్య భీముని ప్రతిమ

Friday, December 4, 2020

Imported post: Facebook Post: 2020-12-04T11:39:29

యానానికి చెందిన ప్రముఖ కవయిత్రి శ్రీమతి కె. విజయలక్ష్మి గారు, వారి భర్త ప్రసాద్ గారు, చిన్నకుమారుడు కారు ప్రమాదంలో మరణించారన్న వార్త కలచివేసింది. యానాం కాలేజీ లో పనిచేసిన నరసమ్మ మేస్టారిని శిఖామణి తెలుగు సాహిత్యంలో యానాం సరస్వతిగా ప్రతిష్ఠించారు. ఆ తరువాతి తరంలో అదే కళాశాలలో, తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసిన వ్యక్తి శ్రీమతి విజయలక్ష్మి గారు. వీరిని కూడా నరసమ్మ గారి స్థానంలో ఊహించుకొనే వాళ్లం. అదే ఆదరణ, అంతే పాండిత్యం, అంతే విదుషీమత్వం. గొప్ప సమయస్ఫూర్తి, వాగ్ధాటి, సమయోచిత కవిత్వ ఉటంకింపులు, స్పష్టమైన ఉచ్ఛారణలతో తాను వ్యాఖ్యాతగా వ్యవహరించే ఏ సభకైనా ఒక సాహిత్య ఆంబియన్స్ కలిగించేవారు. పదేళ్లక్రితం యానాం ఉగాది ఉత్సవాల సభలో నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకాన్ని ఆవిష్కరించుకోవటానికి ఓ పదినిముషాలు సమయాన్ని దక్కించుకొన్నాను. ఆ సభకు విజయలక్ష్మి గారు వ్యాఖ్యాత. మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ముఖ్య అతిధులు, ఎమ్మెల్యేలు, వేలమంది ఆహూతులు ఉన్న సభ అది. రచయితనైన నన్ను వేదికపైకి ఆహ్వానిస్తూ ఈమె సుమారు ఐదు నిముషాలపాటు నన్ను సభకు పరిచయం చేసారు. ఆ గళ గాంభీర్యానికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా విన్నారు. సభ అయిపోయాకా- మేడమ్ గారు మీరు నాగురించి చాలా ఎక్కువ చెప్పారు అంటే 'నా తమ్ముడి గురించి నేను కాక మరెవ్వరు చెబుతారు" అని ప్రేమగా నవ్వేసారు. విజయలక్ష్మి గారి అమ్మగారు మా అమ్మా క్లాస్ మేట్స్. ఏదో మాటల్లో ఆవిడనంబరు కావాలని మా అమ్మ అడిగింది. తీసుకొని ఇచ్చాను. జీవితాన్ని సంపూర్ణంగా పండించుకొన్న డబ్బై ఏండ్లు దాటిన ఇద్దరు స్త్రీలు "ఏవే.... పోవే" అంటూ ఆరుదశాబ్దాల క్రితపు ముచ్చట్లను ఫోనులో మాట్లాడుకోవటం ఆశ్చర్యంగా అనిపించేది. (నిజానికి వ్యక్తిగతంగా కలుసుకోకుండానే ఇద్దరూ కాలగతులయ్యారు). విజయలక్ష్మి గారి మాతామహులు శ్రీ మహేంద్రవాడ వీరగణపతి శాస్త్రి గారు (1911-1976) ఫ్రెంచి ప్రభుత్వంచే బెస్ట్ టీచర్ అవార్డు పొందారు. ఆంధ్రదేశం గర్వించదగిన జ్యోతిష్యశాస్త్ర పండితులు. వీరు హస్తసాముద్రికము, బృగురాజకాండ, సంఖ్యా జ్యోతిష్యసారము, అరచేతిలో అదృష్టము వంటి గ్రంధాలు వ్రాసారు. విజయలక్ష్మి గారి తండ్రిగారు శ్రీ టి. శ్రీరామచంద్రకీర్తి మా తెలుగు మాస్టారు. వీరు "శ్రీ వెంకటేశ్వర శతకం" అనే గ్రంధాన్ని రచించారు. మా క్లాసులో అప్పుడప్పుడూ దానిలోని ఒక్కో పద్యం చెప్పి మాకు అర్ధం విడమరచి చెప్పేవారు. విద్యార్ధులను ఎన్నడూ పల్లెత్తు మాట అనేవారు కాదు. బాగా కోపం వస్తే చేతిలో సుద్దముక్కను వేళ్లమధ్య బలంగా నలుపుతూ అది పొడుం అయ్యేవరకూ మౌనంగా ఉండేవారు. విజయలక్ష్మి గారు కూడా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్నారు. విద్వత్తు, సౌశీల్యం, ప్రేమ కలబోసిన వ్యక్తిత్వం ఆమెది. "యానాం కవులు" అనే వ్యాసంలో ఆమె గురించి ఇలా వ్రాసాను. . శ్రీమతి కె. విజయలక్ష్మి చక్కని కవిత్వం, మేలైన అనువాదాలతో శ్రీమతి కె. విజయలక్ష్మి గారు తెలుగు సాహిత్యాన్ని పరిమళింపచేస్తున్నారు. వీరు 2005 లో “కదిలేమేఘం” పేరుతో కవితాసంపుటి తీసుకొచ్చారు. ప్రముఖ తమిళకవి అమృత గణేషన్ పుస్తకాన్ని “ఊయలలో సూర్యుడు” గా తెలుగులోకి అనువదించారు. విజయలక్ష్మిగారి కవిత్వంలో సందేశాత్మక సామాజిక ప్రయోజనం అంతర్లీనంగా కనిపిస్తుంది. బలహీనవర్గాలపట్ల సహానుభూతి, సమాజపోకడలపై తనదైన వ్యాఖ్యానం, లోతైన వివేచనతో కూడిన హృదయసంస్కారం వీరికవిత్వ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. స్త్రీవాదదృక్పథంతో ప్రత్యేకించి కవితలు వ్రాయకపోయినా వీరికవిత్వంలో స్త్రీవాదం స్వాభావికంగా పలుకుతుంది. వృత్తిపరంగా తెలుగు అధ్యాపకురాలు కావటంతో వీరి కవిత్వం చక్కని పదచిత్రాలు, ఉపమానాలు, భాషాగరిమ, భావపటిమలతో ఉంటూ అలరిస్తుంది. . శ్రీమతి విజయలక్ష్మి గారి మృతి యానాం సాహిత్యలోకానికే కాదు, వ్యక్తిగతంగా నాకూ వెలితిగానే ఉంది. వారి ఆత్మకు శాంతికలగాలని కోరుకొంటున్నాను. బొల్లోజు బాబా

Wednesday, December 2, 2020

Imported post: Facebook Post: 2020-12-02T11:15:14

నేను నిత్యం స్ఫూర్తి పొందే వ్యక్తులతో శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ముఖ్యులు. కవిగా, కాలమిస్ట్ గా, కథకునిగా, చరిత్రకారునిగా వారి కృషి అసమాన్యమైనది. సమకాలీన చరిత్రకారునిగా వారు చేసిన ఈ సమీక్ష నాకెంతో విలువైనది. రాజు గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను బొల్లోజు బాబా **** . చదవాల్సిన పుస్తకాలు ఎదురుగా వేచి చూస్తున్నాయి. వాటిని పక్కనబెట్టి బొల్లోజు బాబా 'తూర్పుగోదావరి జిల్లా - మెకంజీ కైఫియ్యతులు' చేతిలోకి తీసుకొన్నాను. దానికి కారణం మా ప్రాంతం గతం తాలూకు విశేషాల్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఒక్కటే కాదు మా బాబా ఏం రాశారో చూడాలని ఆతురత కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం దినపత్రికలో ఒక వార్త నన్నెంతో ఆకర్షించింది. రాజస్థాన్ ప్రభుత్వం ఎనభై ఏళ్ళ వయసు ఉన్నవారి దగ్గర్నుంచి ఆయా గ్రామాల విశేషాల్నీ స్థలపురాణాల్నీ తెలుసుకుని గ్రంథస్థం చేస్తే ప్రభుత్వమే ముద్రిస్తుందని ఆ వార్త సారాంశం. ఆ తరం గతిస్తే వారితోనే అవి మురుగుపోతాయని భావించి వారుండగానే నమోదు చేయాలనే మహత్తర ఆలోచన అది. నాకు చాలా ఆనందం అనిపించింది. అది నన్ను యానాం చరిత్ర రాయడానికి పురిగొల్పడం కూడా జరిగింది. అది వేరే సంగతి. కైఫియ్యతుల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మెకంజీకి ఏం అవసరం ఉండి వీటి పట్ల ఆసక్తి చూపించాడో తెలియదు. సేకరణ పనిని గ్రామకరణాలకు అప్పగించాడు. వారు రాసిందాన్ని జాగ్రత్త చేశాడు. భాషకు సంబంధించి పండితులు కారు వారు. విన్నది విన్నట్టుగా ప్రచలితంలో ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన భాషలో రాశారు. రాసేటప్పుడు వారి నమ్మకాలూ విశ్వాసాలూ అందులో చోటు చేసుకోవడం తప్పదు. వాటిని మరలా నేటికాలానికి సరిపడా వాడుకభాషలో మార్చి రాయడం లోనే అసలు ప్రతిభ ఉంటుంది. బొల్లోజు బాబా తన ముందుమాట లోనే చెప్పారు. పొడవుగా ఉన్న వాక్యాన్ని తను ఎలా విడగొట్టి రాయడం జరిగిందో అసలు వాక్యంతో బాటు తిరగ రాసిన వాక్యం ఉదహరించారు. తన విధానం చెప్పారన్నమాట. జరిగుండొచ్చు భావించొచ్చు అనుకోవచ్చు అంటూ తను రాసింది తన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప నిర్ధారణ కాదు అన్నట్టుగానే చెప్పారు. చరిత్రను కొన్ని చోట్ల ఊహించాల్సి ఉంటుందన్నది నిజమే. ఆ ఊహకు కొన్ని ప్రాతిపదికలుండాలనేది ఒక వాస్తవం. సర్కారు జిల్లాల నుంచి ఫ్రెంచి వారి నిష్క్రమణ చరిత్ర ఆధారంగానే (కైఫియతులు ఆధారం కాదు) చక్కగా చెప్పారు. ఇక గ్రామ కైఫియ్యతులు ద్వారా మనం కొత్తగా తెలుసుకునే అంశాలేమిటో చదివితేనే అర్ధం అవుతుంది. స్థల పురాణాలు అంటే కొన్ని కట్టుకథలు వ్యాప్తిలోకి తెచ్చి ఆయా దేవాలయాలకు మహిమలు కలిగించడం ద్వారా భక్తి వ్యాప్తి చేయడానికే అనుకొంటాను. ఇవన్నీ వాస్తవానికి దూరంగానే ఉంటాయి. సరదాగా చదువుకోడానికి ఉపయోగపడ్తాయి. బొల్లోజు బాబా దృష్టి ఎప్పుడూ ఖాళీలను భర్తీ చేసే దాని మీదే ఉంటుంది. మెకంజీ ఎక్కువ కాలం సీమ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడి కైఫియ్యతులనే ఎక్కువగా సేకరించాడు. తూర్పుగోదావరి జిల్లా కైఫీయతులు చాలా తక్కువగానే లభిస్తున్నాయి. వాటిని శ్రమకోర్చి, అంతర్జాలం, శాసనాలు, గ్రంధాల ద్వారా సేకరించి ఒక చోట గుదిగుచ్చి మనకు అందించారు. ఇప్పటి వరకు వెలుగు చూడని వీటిని సంస్కరించి రాయడంలో బాబా చేసిన విశేష కృషి ప్రతి పేజీలోనూ చూస్తాం. ఆధారాలను ఎక్కడికక్కడ ఇవ్వడం బావుంది. తర్వాత చరిత్రపరంగా బొల్లోజు బాబా చూపు ఇపుడు దేని మీద పడుతుందో చూడాలి. ఇంత శ్రమనూ కాలాన్నీ వినియోగించి చేసిన కృషి తప్పక మంచి గుర్తింపును తెస్తుందని నమ్ముతున్నాను. కవిగా కవిత్వం, విమర్శకునిగా కవిత్వభాష, చరిత్రకారునిగా చారిత్రక విశేషాల్నీ అందించడం సృజననూ అవగాహనా పరిధినీ పెంచుకుంటూ వెళుతున్న బొల్లోజు బాబాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. . - దాట్ల దేవదానం రాజు (పుస్తకం దొరుకు చోటు - పల్లవి ప్రచురణలు, 9866115655)

Monday, November 30, 2020

Imported post: Facebook Post: 2020-11-30T01:57:11

ఒక పుస్తకాన్ని వెలువరించటానికి ఎతనయో వెలివేషంగళ్ ఆవిష్కరణ సభ, ఫ్లెక్స్ లు, వక్తల ప్రసంగాలు, శాలువాలు, ప్రెస్ కవరేజ్ వాటిఫొటోలు, వీడియోలు మరలా సోషల్ మీడియాలో షేర్ చేయటం, పుస్తకం పలానా 9866115655 నంబరులో లభిస్తుంది సంప్రదించండీ అంటూ ప్రకటనలు ..... ఎల్లాం వెలివేషం.... *** మరి ఇంట్లో ఏంజరుగుతుంది? కొన్ని విషయాలు వీళ్లకే తెలుస్తాయి వేళకాని వేళల్లో ఎన్నెన్ని టీలు కాఫీలు.... ఏదో అర్ధరాత్రిపూట మేల్కొని నా గదిలో లైటు ఫాను కట్టేసి రెక్కపట్టుకొని లాక్కొని పోవటం... ఏ రామకృష్ణతోనో, శివకామేశ్వరరావు గారితోనో గంటలతరబడి ఫోన్ చర్చలు... మీరు వెళ్ళి వచ్చేయండి.... నాక్కొంచెం పని ఉంది అంటూ నే చేసిన అభ్యర్ధనలూ.... ఇవన్నీ వీళ్లకే తెలుస్తాయి... బయట వాళ్లకేం తెలుస్తాయి.... అక్కడ నేను కట్టే వేషం వేరు కదా! *** కరోనా కాలం కదా సభ జరుపుకొనే అవకాశం ఉండకపోవచ్చు అంటూ పుస్తకాలు ప్రెస్ నుంచి వచ్చిన రోజే ఇంట్లో మా పిల్లలు ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసేసారు. మా ఆవిడ ఆవిష్కర్త... ఒక శాలువా, రచయితగా నాకు మూడు శాలువాలు....ముగ్గురినుంచీ... ఉపన్యాసాలేమీ లేవు.... ఉత్త ప్రేమ, కొన్ని ఘనీభవించిన క్షణాలు తప్ప బొల్లోజు బాబా









Friday, November 27, 2020

Imported post: Facebook Post: 2020-11-27T15:18:21

ప్రెస్ కవరేజ్ - తాంక్యూ పాత్రికేయ మిత్రులారా పుస్తకం కొరకు 9866115655 లో పల్లవి పబ్లికేషన్స్ వారిని సంప్రదించగలరు. బొల్లోజు బాబా





Tuesday, November 24, 2020

Imported post: Facebook Post: 2020-11-24T14:05:48

తాంక్యూ డాక్టరు గారు For your kind gesture కృష్ణా జిల్లా కైఫీయ్యతులు ఇప్పటికే పుస్తకం గా వచ్చాయండి. Baba

Monday, November 23, 2020

Imported post: Facebook Post: 2020-11-23T10:57:11

Using sentences,incidents,descriptions of other contemporary writer or even paraphrasing them to create another work comes under ipr act. Whether it is for monitory or not. Present incident is not an act of Citing the original work. It is violation of intellectual property rights. One can create another story from a different point of view of the original, without using names of characters, same incidents, same descriptions, sentences..... It will be perfectly ok To do so one should have tons of creativity. DUMB HEADS should not try 😎

Sunday, November 22, 2020

Imported post: Facebook Post: 2020-11-22T17:06:39

మిత్రులారా ఈ రోజు జరగనున్న పుస్తకావిష్కరణ సభ లైవ్ నా వాల్ పై ఉండబోతున్నది.

Saturday, November 21, 2020

Imported post: Facebook Post: 2020-11-21T16:15:54

మేకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి పుస్తక ఆవిష్కరణ విజయవాడలో 22 నవంబరున పల్లవి ప్రచురణల ఆధ్వర్యంలో జరగనుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణం గా నేను రాలేక పోతున్నాను. ఈ సభలో పుస్తకంపై మాట్లాడనున్న డా.కె బాలకృష్ణ గారికి, డా.మొవ్వ శ్రీనివాస రెడ్డి గారికి నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను బొల్లోజు బాబా

Friday, November 20, 2020

Imported post: Facebook Post: 2020-11-20T23:55:40

“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్” – సారంగ కొన్ని ప్రశ్నలు ఇవి సారంగ నిర్వాహకులకు 1. ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా? 2. ఒక వేళ ఉన్నట్లయితే ... ఆ కథకు ఇంట్రో వాక్యాలలో ఒరిజినల్ రచయిత గౌరవానికి భంగం కలిగించే విధంగా దూషించవచ్చా? 3. పై రెండు ప్రశ్నలకు అవునని నమ్మితే - అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా? 4. పై మూడు ప్రశ్నలకు సమాధానం సారంగ వద్ద లేకపోతే.... సారంగ నిర్వాహకులు నైతిక నియమావళి తప్పినట్లుగా, ఇది సాహిత్యద్రోహంగా భావించవలసి వస్తుంది. http://nerdwriter.blogspot.com/2010/07/is-rewriting-same-as-plagiarism-answer.html బొల్లోజు బాబా https://magazine.saarangabooks.com/%e0%b0%8f-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b0/

Wednesday, November 18, 2020

Imported post: Facebook Post: 2020-11-18T20:17:34

మిత్రులకు విన్నపం నేను ఇంతవరకూ ఏడు పుస్తకాలు వెలువరించాను - రెండు చరిత్రపై, మూడు కవిత్వసంపుటులు, ఒక అనువాదం, మరొకటి సాహిత్య వ్యాసాలు. ఇవన్నీ నేను సొంతంగా ప్రచురించుకొన్నవి. నా ఎనిమిదవ పుస్తకం "మెకంజి కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా". ఈ పుస్తకావిష్కరణ ఈ రోజు కాకినాడలో జరిగింది. ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్, అధినేత Sri. Sv Narayana గారు ముద్రించారు. ఖరీదైన పేపరు, మంచి ప్రింటింగ్ క్వాలిటీ. ఈ పుస్తకం విజయవాడ పుస్తక ప్రదర్శనలో పల్లవి స్టాల్ నందు లభిస్తుంది. శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 98661 15655 ఫేస్ బుక్: https://www.facebook.com/sv.narayana.9400 . మిత్రులారా...... దయచేసి...... ఈ పుస్తకాన్ని కొని చదవండి. . మీరు నేరుగా కొనటం కానీ, ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవటం కానీ చేస్తారని ఆశిస్తున్నాను. *** ఈ రోజు పుస్తకావిష్కరణ సభా విశేషాలు ఇవి. . మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా పుస్తకావిష్కరణ తూర్పుగోదావరిజిల్లా చరిత్ర-సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ, కార్యదర్శి డా. పి.చిరంజీవిని కుమారి అధ్యక్షతలో జరిగిన సభలో ప్రముఖ కవి, చరిత్రకారుడు శ్రీ బొల్లోజు బాబా రచించిన "మెకంజీ కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా" పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. పి. చిరంజీవిని కుమారి మాట్లాడుతూ "బ్రిటిష్ వారు భారతీయులకు చరిత్ర లేదు అనే అభిప్రాయాలను కలిగి ఉండేవారు, కానీ మన ప్రాచినులు దండకవిలెలలో అనూచానంగా మన చరిత్రను లిఖించుకొంటూ వచ్చేవారు. వాటిని బ్రిటిష్ అధికారి కాలిన్ మెకంజీ సేకరించి కైఫియ్యతుల పేరుతో భద్రపరిచాడు. ఈ కైఫియ్యతుల అధ్యయనంలో ఒక ప్రాంతపు ప్రజలు తమచరిత్రను ఏ విధంగా సృష్టించుకొన్నారు అనేది తెలుస్తుందని, ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశంలోని ప్రాంతాలు, గ్రామాలు, వాడలలో జనం ఎలా జీవించారు, ఏ విధంగా పాలించబడ్డారు, మరి ఏ విధంగా మలుపు తీసుకుంటూ వచ్చారు అనేది వెలికితీయటం చరిత్రకారుల విధి - ఆ విధంగా రెండువందల ఏండ్ల క్రితం బ్రిటిష్ అధికారి కొలిన్ మెకంజీ సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్థానికచరిత్రల కైఫియ్యతులను శ్రీ బొల్లోజు బాబా పుస్తకరూపంలోకి తీసుకురావటం అభినందనీయమని" అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గనరా మాట్లాడుతూ "తూర్పుగోదావరి జిల్లాచరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఎంతో విలువైనదని, దీనిద్వారా ఒకప్పటి ఈ ప్రాంత సామాన్య ప్రజలు ఎలాజీవించారు, వారి అనుభవాలు, ఆనాటి రాజకీయాలు అర్ధం చేసుకోవటానికి ఎంతో సహకరిస్తుందని, ఆంధ్రప్రదేష్ కు చెందిన పదమూడు జిల్లాలలో ఇంతవరకూ పది జిల్లాలకు చెందిన కైఫియ్యతులు పుస్తకరూపంలో వచ్చాయని, మన జిల్లాకు చెందిన కైఫియ్యతులు ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదని- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మెకంజీ కైఫియ్యతులను ఎంతో శ్రమకోడ్చి శ్రీ బొల్లోజు బాబా సేకరించి వాటిని, సమకాలీన భాషలోకి మార్చి, లోతైన విశ్లేషణలతో, సమగ్రంగా చేసిన ఈ రచన కైఫియ్యతులను ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా సమకాలీన పఠితలకు అందించాలి అనే విషయంలో ఒక నమూనాగా నిలిచిపోతుందని" అన్నారు. పుస్తక రచయిత శ్రీ బొల్లోజు బాబా మాట్లాడుతూ - భారతదేశ సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కాలిన్ మెకంజీ మొత్తం రెండువేలకు పైబడి కైఫియ్యతులు అని పిలవబడే స్థానిక చరిత్రలను సేకరించాడు. వీటిలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన రాజమహేంద్రవరం, కోరుకొండ, సామర్లకోట లాంటి మొత్తం పది ప్రాంతాల స్థానికచరిత్రలను 1814-15 ప్రాంతాలలో సేకరించాడు. ఇవి సమగ్రంగా ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదు. "మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నానని, ఈ పుస్తక ఆవిష్కర్తకు, ప్రచురించిన పల్లవి పబ్లికేషన్స్, ఫోన్:9866115655 వారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సభలో ఇంకా ప్రముఖకవి విమర్శకులు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, ప్రముఖరచయిత్రి పద్మజావాణి, ఐడియల్ కాలేజ్ అధికారి శ్రీ వర్మ, శ్రీ గౌరినాయుడు, శ్రీ సుబ్బారావు, శ్రీ సరిపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. **** కాపీల కొరకు శ్రీ ఎస్వి నారాయణ ఫోన్ నంబరు: 98661 15655 పల్లవి పబ్లికేషన్స్ పేజీలు-192. వెల 200/- దయచేసి సంప్రదించండి. . బొల్లోజు బాబా

Tuesday, November 17, 2020

Imported post: Facebook Post: 2020-11-17T19:49:23

దర్శనం దైవదర్శనం ముగించుకొని కోనేరు మెట్లపై కూర్చొన్నాను. ఎవరో భక్తుడు కొట్టిన గంట నిశ్శబ్దంలో మెరుపులా మెరిసి కోనేటి నీటిపై తరంగాలు తరంగాలుగా కంపించింది కాసేపు. ప్రదక్షిణాలు చేస్తున్న మువ్వల సవ్వడి ఒక క్రమవిరామంతో దగ్గరగా వచ్చి దూరమౌతోంది. కొబ్బరినీళ్ళ వాసనను మోసుకొచ్చిన గాలి చెంపలను తాకి ఎటో సాగిపోయింది. ఉడతల జంట ఒకటి చెట్టు మొదలువద్ద కనిపించినట్లే కనిపించి రెప్పపాటులో కొమ్మల్లోకి అదృశ్యమైంది. పసుపుపచ్చని సీతాకోక చిలుక నా భుజంపై కాసేపు తచ్చాడి కలువల్ని కూడా కనికరించేందుకు కదిలింది. ఒక్కసారిగా గుడిలో ఎలెక్ట్రిక్ భజంత్రీలు మోగటం మొదలైంది ఢంకాలు, గంటలు, మువ్వలు ఏకకాలంలో ఒకదానిలోకి ఒకటి లయమౌతూ - ఒక శబ్దబీభత్సం గోపురంపై రామచిలుకలు పైకి లేచాయి నేనూ లేచాను .... ఇది నా సమయం కాదని. బొల్లోజు బాబా

Sunday, November 15, 2020

Imported post: Facebook Post: 2020-11-15T15:48:51

చందమామ, బాలమిత్ర పత్రికల తరువాత నా పఠనాసక్తిని మరో దశాబ్దం పాటు పొడిగించి నన్ను సాహిత్యంవైపు నడిపించిన యండమూరి వీరేంద్రనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. యండమూరి రచనలు చదువుతూ పెరిగిన తరంలో నేనూ ఉన్నాను. ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం ఆయన చేతులమీదుగా ఆవిష్కరణ జరగటం ఒక మధురానుభూతి.

Friday, November 13, 2020

Imported post: Facebook Post: 2020-11-13T18:59:08

Indian Literature, Sahitya Akademi's Bimonthly Journal. నేను డిగ్రీ చదువుతున్నప్పటినుంచి ఈ పత్రికను ఫాలో అయ్యేవాడిని. ఇంటర్ నెట్ రాకముందు సమకాలీన భారతీయ కవిత్వం చదవాలంటే Indian Literature, త్రివేణి పత్రికలే ఆధారంగా ఉండేవి. Indian Literature పత్రికలోని నాకునచ్చిన కవితలను అనేక సందర్భాలలో అనువదించాను. అలా ప్రముఖ భారతీయకవులైన Sri Satchidanandan, Kedarnath singh, Chandrakant Deotale, Vatsyayan Agyeya, P.P. Ramachandran, Surjit pattar, Aashish Thakur, Lal Singh Dil, Eunice de Souza, Kanupriya Dhingra, Subhash Mukhopadhyay వంటి వారి కొన్ని కవితలను అనువదించి నా బ్లాగు https://sahitheeyanam.blogspot.com/ లో పోస్ట్ చేస్తూవచ్చాను. *** Indian Literature మే-జూన్ 2020 సంచిక నాకెంతో ప్రత్యేకమైనది. దీనిలో నా కవితానువాదాలు ప్రచురింపబడటం నా కెంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చిన సందర్భం. ఆ పత్రికా సంపాదకులకు ధన్యవాదములు. ఈ కవితలలో చాలామట్టుకు స్వీయానువాదాలు, మరికొన్నింటిని శ్రీ నౌడూరి మూర్తిగారు, శ్రీ ఆర్య గారు అనువదించారు. వారికి కృతజ్ఞతలు. ఈ పిక్స్ పంపిన మిత్రులు రవీందర్ గారికి ధన్యవాదములు. భవదీయుడు బొల్లోజు బాబా