Saturday, December 26, 2020

Imported post: Facebook Post: 2020-12-26T01:51:18

పెయింటరు ఒకప్పుడు గోడలు, బేనర్లు, సైను బోర్డులూ కటౌట్లపై వాడి సంతకం ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా వెలిగిపోతుండేది. నీలిమందు నీళ్ళలో ముంచిన పురికొస సాయంతో వాడు గీసిన సరళరేఖలమధ్య అక్షరాలు గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి. కుంచెలోని ఉడుతవెంట్రుకల మధ్య వర్ణాలు సురక్షిత సైనిక కవాతులా కదిలేవి. బేసిక్ కలర్స్ నుండి డిరైవ్డ్ రంగుల్ని సృష్టించడం వాడికి మాత్రమే తెలిసిన ఓ రసవిద్య. అతడు గీసిన చిత్రాలముందు ఎవరెవరోపారేసుకున్న ఓ పది పన్నెండు కళ్ళూ, రెండు మూడు హృదయాలూ ప్రతిరోజూ తుడుపులో దొరుకుతుండేవి. కొత్తవారికి వాడి రాతలు నిశ్శబ్దంగా, నిర్దుష్టంగా దారిచూపేవి. వాడి చెక్కపెట్టినిండా రంగురంగుల డబ్బాలే! ఇంద్రధనుస్సుని నిలువునా చీరి ఒక్కో ముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది. పెట్టెలో వివిధ సైజుల్లో బ్రష్షులు ఉండేవి సన్నని గీతనుండి ఆకాశమంత పెద్దరేఖ వరకూ గీయటానికై వాడి బట్టలపై, వంటిపై, హృదయంపై చిలికిన రంగుల మరకలు వాడికో దివ్యత్వాన్నిస్తున్నట్లు మురిసిపోయేవి. కానీ ఇప్పుడు వినైల్ ప్రింట్లూ, ఫ్లెక్సీ బేనర్లూ ఫోటో షాపులూ, కోరల డ్రాలూ, అన్నివైపులనుండీ కమ్ముకునే శీతవేళలా వాడిని మింగేశాయి. వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది. వాడి జీవితంలోకి థిన్నర్ కలుపని చిక్కని నల్లని రంగు ఎగజిమ్మింది. ఎప్పుడో ఎక్కడో వాడు రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో కళాత్మకంగా మనదారికడ్డంపడతాడు ఇంకే చెయ్యాలో తెలియక! బొల్లోజు బాబా "ఆకుపచ్చని తడిగీతం" సంపుటి నుంచి . (పెయింటర్ మిత్రుడు కీ. శే. పట్నాల రమణ ప్రసాద్ కు వెబ్ పత్రిక తెలుగుజ్యోతి సెప్టెంబరు-అక్టోబరు 2008)

No comments:

Post a Comment