Friday, December 18, 2020

Imported post: Facebook Post: 2020-12-18T23:02:20

బిక్కవోలు ఐకనోగ్రఫీ 2 బిక్కవోలు హైస్కూలు సమీపంలో ఉన్న విజయేశ్వర ఆలయానికి ద్వారపాలకులుగా గంగయమున విగ్రహాలు కలవు. గంగయమున ప్రతిమలను పూజించటం ఉత్తరభారతదేశంలో గుప్తుల కాలం నుంచే ఉంది. (క్రీశ. 3-5 శతాబ్దాలు). వారినుండి బదామి చాళుక్యులు గ్రహించి తమ రాజచిహ్నాలుగా చేసుకొన్నారు. వారి వారసులైన రాష్ట్రకూటులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. క్రీశ 880 లో చాళుక్యరాజైన గుణగవిజయాదిత్యుడు రాష్ట్రకూటులను జయించి, వారి సామ్రాజ్య చిహ్నాలను గైకొని బిక్కవోలులో తనవిజయానికి గుర్తుగా నిర్మించిన విజయేశ్వర ఆలయంలో ద్వారపాలకులుగా ప్రతిష్టించుకొన్నాడు. గంగ, యమున శిల్పాలు త్రిభంగ భంగిమలో ఉంటాయి. (దేహం మూడు ఒంపులతో). గంగ ఒకచేత కలశం ధరించి, మరొక చేయిని ఒక పరిచారిక తలపై ఆనించి మకరవాహనంపై నిలుచొని ఉండగా, యమున తాబేలు వాహనంపై చేత కలశం ధరించి నిలబడి ఉంటుంది. *** గుణగ విజయాదిత్యుడు - అసలైన ఆంధ్రతేజం . గుణగవిజయాదిత్యుడు కలివిష్ణువర్ధనుడి కొడుకు. క్రీశ.848 లో సింహాసనాన్ని అధిష్టించాడు. 44 ఏండ్లు పరిపాలించాడు. ఇతను తూర్పుచాళుక్య రాజులలో సుదీర్ఘకాలం పాలించి, రాజనీతిజ్ఞుడిగా, గొప్ప యుద్ధవీరుడిగా అత్యంత పేరు ప్రఖ్యాతులు గడించాడు. అరవీరభయంకరుడైన పండరంగడు ఇతని సేనాని. ఇతడు నెల్లూరు కోటను ధ్వంసం చేసి బోయకొట్టములను జయించి వేంగి రాజ్యంలో విలీనంచేసాడు. క్రీశ 866 లో గుణగవిజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి చాన్నాళ్లు అతనికి సామంతుగా వ్యవహరించాడు. క్రీశ 880 లో అమోఘవర్షుడు మరణించాక గుణగవిజయాదిత్యుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని రాష్ట్రకూటులపై దండెత్తి విజయం సాధించాడు. వారి రాజ్య చిహ్నాలయిన గంగ, యమునలను తనవిగా స్వీకరించి తాను నివసిస్తున్న బిక్కవోలు పట్టణంలో నిర్మించిన ఆలయానికి ద్వారపాలకులుగా చెక్కించాడు. గుణగవిజయాదిత్యుడు తెలుగు భాషను ప్రోత్సహించాడు. ఇతని కాలంలో వేయించిన అద్దంకి పండరంగని శాసనంలో ఆనాటి తెలుగుభాష తరువోజ చందస్సులో మొదటి సారిగా శాసనాలకు ఎక్కింది. నన్నయపూర్వుడైన నన్నెచోడుడు చాళుక్యరాజులు తెలుగుభాషను ప్రోత్సహించారు అన్నాడు. ఏ చాళుక్యరాజో తెలపలేదు. అది బహుసా గుణగవిజయాదిత్యుడే కావొచ్చు. ఇతని సాతులూరు తామ్రశాసనంలోని భాష సంస్కృతమైనప్పటికీ అంత్యప్రాసలున్న చంపకమాల లక్షణాలు ఉండటంచే అది ఎవరో తెలుగు కవి వ్రాసిందేనని అంటారు. గుణగవిజయాదిత్యుని తమ్ముడు యుద్ధమల్లుడు విజయవాడలో కుమారస్వామి ఆలయం కట్టించి అక్కడ వేయించిన శాసనం మధ్యాక్కర తెలుగుచందస్సులో ఉంది. గుణగవిజయాదిత్యుడు ఒక యుద్ధంలో శతృరాజైన మంగిరాజ తలను నరికి దానితో బంతి ఆట ఆడుకొన్నాడని, చక్రకూటాన్ని దగ్ధం చేసాడని పిఠాపురం శాసనంలో కలదు . ఇతను శివభక్తుడు. జైన మతాన్ని సమాదరించాడు. అనేక గ్రామాలను వేదవేదాంగాలు నేర్చిన బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు , కట్లపర్రు, సాతలూరు, పొన్నగి, సిసలి తామ్రశాసనాలు ద్వారా తెలుస్తున్నది. *** తెలుగు వారి చరిత్రలో రాజరాజ నరేంద్రుని (1019-1061) గురించి ఎందుకో చాలా ఎక్కువచేసి మాట్లాడుకొంటాం. కానీ రాజరాజ నరేంద్రుడు ఆంధ్రదేశాన్ని తమిళరాజులకు తాకట్టు పెట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇతని కాలంలో ఇక్కడ నుంచి అపారమైన సంపదలు తమిళ రాజ్యానికి తరలిపోయాయి. ఏ రకమైన పెద్ద ఆలయాలు ఇతని పాలనలో ఆంధ్రలో నిర్మించబడలేదు. ఇదే కాలంలో తమిళనాట ఆలయాల నిర్మాణం జరగటం కాకతాళీయం కాకపోవచ్చు. దాయాదుల గొడవలలో మామగారైన చోళరాజు సహాయం చేస్తే తప్ప సింహాసనం నిలుపుకోలేని పరిస్థితి ఉండేది. తన జీవిత చరమాంకంలో రాజమహేంద్రవరం నుండి తంజావూరు తరలిపోయాడు. మహాభారత అనువాదం ప్రారంభింప చేయటం ఇతడు తెలుగునేలకు చేసిన మేలుగా చెబుతారు కానీ దాని కర్తృత్వం, కాలం విషయాలలో అనేక వివాదాలు ఉన్నాయి. రాజరాజ నరేంద్రుని విషయంలో అర్హతకు మించిన అందలం ఎక్కించామేమో మనం అని అనిపించకమానదు. నిజానికి ఈ రోజు ఉత్తరాంద్రనుంచి రాయలసీమ అంటూ ఆంధ్రప్రదేష్ అని దేన్నైతే మనం పిలుచుకొంటున్నామో ఆ మేప్ నిర్మాత గుణగ విజయాదిత్యుడు. చోళ, పల్లవరాజులపై దండెత్తి జయించి అపారమైన బంగారాన్ని ఆంధ్రకు తీసుకొచ్చాడు. ఒకానొక దశలో తన మేనమామ అయిన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి సుమారు పదిహేనేళ్ళు అతను బ్రతికున్నంతకాలమూ సామంతుగా కట్టుబడి ఉన్నాడు. ఇదొక మానవీయకోణంగా అనుకోవచ్చు. తరువాత విజృంభించి జైత్రయాత్ర చేసి తూర్పు ఉత్తర, కర్ణాటక ప్రాంతాలను జయించి తనరాజ్యాన్ని విస్తరింపచేసాడు. బిక్కవోలులో ఇతను మూడు ఆలయాలు నిర్మించాడు. రాజమహేంద్రవరం పట్టణాన్ని నిర్మించింది గుణగవిజయాదిత్యుడే అవ్వటానికి అవకాశాలు ఎక్కువ. ఆంధ్రతేజంగా పిలువబడటానికి రాజరాజ నరేంద్రునికంటే గుణగవిజయాదిత్యునికే ఎక్కువ అర్హత ఉందనటం అతిశయోక్తి కాదు. బిక్కవోలులో గుణగవిజయాదిత్యుడు ప్రతిష్టించిన గంగ యమున శిల్పాలు సుమారు పన్నెండుశతాబ్దాల క్రితపు ఈ ప్రాంత వైభవానికి సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి. (రానున్న "తూర్పుగోదావరి జిల్లా -ప్రాచీనపట్టణాలు" పుస్తకం నుంచి) బొల్లోజు బాబా



No comments:

Post a Comment