Wednesday, December 30, 2020

Imported post: Facebook Post: 2020-12-30T00:55:59

యానాం మన్యవోరి మేడ – ఇకపై ఒక జ్ఞాపకం . ఫ్రెంచియానం చరిత్రలో మన్యం జమిందారి, మన్యవోరి మేడ పోషించిన పాత్ర మరువలేనిది. నేడు యానాంలో ఆనాటి స్మృతులకు ఆనవాలుగా మిగిలున్న మేడను కూలగొడుతున్నారన్న వార్త బాధకలిగించింది. అది ప్రెవైట్ ప్రోపర్టీ కావొచ్చు. దానిపైన ప్రజలకు ఏ హక్కు లేకపోవచ్చు. చరిత్ర తెలిసిన వ్యక్తులకు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఒక హెరిటేజ్ బిల్డింగ్ గా దాన్ని నిలుపుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇది వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు. వ్యవస్థలు చేయాల్సినది. *** గోదావరి జిల్లాల్లో వైశ్యసామాజిక వర్గానికి చెంది జమీందారులుగా పేర్గాంచిన ఒకేఒక కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్దఎత్తున వ్యాపారాలు సాగించి గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈయన యానాంకు మకాం మార్చి తన వ్యాపారాలు మరింత వృద్దిచేసాడు. వీరి కుమారుడు సత్యలింగం తండ్రిలానే మంచి పేరు తెచ్చుకొన్నాడు. 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని ఈయన 2,30, 000 రూపాయిలకు కొన్నాడు. జమిందారీ చిహ్నాలయిన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి ఇతనికి బ్రిటిష్, ఫ్రెంచి ప్రభుత్వాలు అనుమతించాయి. ఇతని తరంలోనే యానాం మన్యం మహల్ నిర్మించబడిందంటారు. దీనిని స్థానికులు “మన్యవోరిమేడ” అని పిలుచుకొంటారు. ఇతని కుమారుడు మన్యం కనకయ్య. ఈయన మనవడు మన్యం చినకనకయ్య. 1865 లో ఈయనకు మహలక్ష్మమ్మతో వివాహం అయింది. అటుపిమ్మట ఎనిమిదేళ్లకు చినకనకయ్య మరణించారు. మన్యం మహలక్ష్మమ్మ గొప్ప సౌశీల్యవంతురాలు. అనేక దానధర్మాలు చేసారు. 1890 లలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొని, కొత్తదివానుగా శ్రీ బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి ని నియమించుకొన్నాక పరిస్థితులు చక్కబడి మరలా జమిందారీ కళకళలాడటం మొదలైంది. 1949 లో మన్యం జమిందారీ విలువ 6,42,487 రూపాయిల విలువ ఉన్నట్లు లెక్కించబడింది. ఆ తరువాత మన్యం జమిందారి వారసత్వహక్కుల కొరకు అనేక కోర్టుకేసులు నడిచాయి. ఫ్రెంచి యానాం చరిత్రలో మన్యం జమిందారీ, మన్యంవోరి మేడ కు సంబందించిన కొన్ని విస్మరించరాని ఘట్టాలు 1. 1828 లో బ్రిటిష్ ప్రభుత్వం కల్పించినట్లుగానే తనకు జమిందారి హోదాకల్పించమని మన్యం జమిందారు ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. ఈ హోదా అంటే పల్లకిలో తిరగడం, వెండిరాజదండాన్ని కలిగి ఉండటం, రెండుకాగడాలతో పల్లకి ప్రయాణం వంటి, ఇతరులకు లేని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఫ్రెంచి యానాం కలక్టరు డిలార్ష్ 1828 ఆగస్టు 18 న ఒక ఉత్తర్వు ద్వారా ఈ సదుపాయాలను మన్యం జమిందారుకు కల్పించాడు. దీనిపై యానాం సమాజం భగ్గుమంది. హిందూ వర్ణవ్యవస్థ ధర్మాలను బట్టి మన్యం జమిందారు వర్ణానికి (వైశ్య) అలాంటి సదుపాయాలు లేవని పాండిచేరీకి తొంభైమంది యానాంప్రముఖులు కంప్లైంట్ చేసారు. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాటిని చక్కబెట్టటానికి పాండిచేరీనుంచి లెస్పార్డా అనే అధికారి వచ్చి సయోధ్య కుదర్చవలసి వచ్చింది. 2. 1839 నవంబరు 16-17 లలో వచ్చిన సూపర్ సైక్లోను వల్ల యానాం చుట్టూ సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగాయి. ఆ రాత్రి ఫ్రెంచి యానాం కలక్టరు తన బంగ్లా సురక్షితం కాదని తలచి, రాత్రి 11 గంటలకు బంగళా ఖాళీచేసి మన్యవోరి మేడలో తలదాచుకొని ప్రాణాలు కాపాడుకొన్నాడు. 3. 1856 లో మన్యం జమిందారుకు జబ్బు నయమవటం కొరకు మన్యవోరి మేడలో మానవబలి జరిందని యానాం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి పాండిచేరికి పిర్యాదులు చేయటంతో 1858 నవంబరులో పాండిచేరి కోర్టు ప్రధానన్యాయమూర్తి Ristle Hueber విచారణ జరిపి ఆ మంత్రగాళ్ళకు మూడునెలల జైలుశిక్ష, మృతురాలి తల్లికి వెయ్యిరూపాయిలు పరిహారం ఇప్పించటంతో సమస్యకు తెరపడింది. ఇది ఆనాటి సమాజంలోని ప్రజల రాజకీయ అవగాహనకు, జాగృతికి నిదర్శనంగా నిలుస్తుంది. 4. మన్యం జమిందారు ఫ్రెంచి వ్యాపారస్తులకు ఆర్ధికసహాయం చేస్తూండేవారు. అలా కుర్ సన్ అనే వ్యక్తికి ఇచ్చిన అప్పును 12 శాతం వడ్డీతో చెల్లించమని 1859 పాండిచేరీ కోర్టు తీర్పునిచ్చింది. అప్పటికి కుర్సన్ చనిపోయి 29 సంవత్సరాలు అయింది. 5. 1873 లో మన్యం కనకయ్య యానాంలో బాలికల స్కూలు నిర్మాణం కొరకు భారీ నిధులు సమకూర్చారు. కనకాల పేటలో 1880 లో ఒక బాలుర హైస్కూలు నెలకొల్పారు. 6. 1930 లలో మన్యం జమిందారిణి మహలక్ష్మమ్మ యానాంలోని రాజరాజేశ్వరీ ఆలయానికి, శివాలయానికి, అన్నదాన సత్రానికి భూరి విరాళాలు, భూములు దానం చేసారు. 7. అప్పట్లో ఫ్రెంచి గవర్నరు, ఇతర అధికారులు యానాం వచ్చినప్పుడు వారందరికీ మన్యవోరి మేడ విడిదిగా ఉండేది. వారి గౌరవార్ధం విందులు, వినోదాలు ఇక్కడే జరిగేవి. 8. ఒకనాటి జమిందారీ చిహ్నాలయిన ఫిరంగులు మన్యవోరి మేడకు ఇరువైపులా ఉండేవి. *** కొన్ని కట్టడాలు ఒక ప్రాంత చరిత్రను నడిపిస్తాయి. ఆ ప్రాంతప్రజల సంస్కృతికి, సామాజిక స్పృహకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. నేను పుట్టిపెరిగిన యానాం ఈ రోజు తన పూర్వీకుల జ్ఞాపకాలను చెరిపేసుకొంది. నిజంగా ఇదొక దుర్దినం. Any how GOODBYE TO MY DEAR FRIEND. YOU LIVE IN ME FOREVER… బొల్లోజు బాబా పిఎస్: దయచేసి ఎవరినీ దూషిస్తూ కామెంట్లు పెట్టకండి ప్లీజ్.





No comments:

Post a Comment