మెకంజీ కైఫియ్యతులు-తూర్పుగోదావరి పుస్తకంపై మిత్రులు శ్రీ బెన్ జాన్సన్ గారు ఒక వాట్సప్ గ్రూపులో చేసిన పరిచయ వాక్యాలు ఇవి. వారి సహృదయతకు సదా నమస్సులు.
వీరు జిల్లాకు చెందినవారు కావటంచే వారి సొంతవూర్లని కైఫీయ్యతులలోని వివరాలతో పోల్చుకొని విశ్లేషించారు. ఈ వాక్యాల వెనుక ఒక అనిర్వచనీయమైన ఆత్మీయ స్పర్శ తెలుస్తోంది. జాన్సన్ మిత్రమా థాంక్యూ సో మచ్.
బొల్లోజు బాబా
****
కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం
జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /యాదవులు,మత్య్సకారులు నివశిస్తూ ఉన్నారు. 1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బొల్లోజు బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది.
1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా. ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి, వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి. ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి (గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు.
ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.
చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.
చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేదట. జమిందారులు మహా ఇష్టంగా తినేవారట
తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది. ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు. కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు, తుమ్మచెట్లు, అడవి ఎద్దులు, గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి.
తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?
మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా, పూరి, మచిలీపట్నం, యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850 తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.
కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం
తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి.
కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో
అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈ దండకవిలలనే మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది.
మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి.
క్రీశ. 600 సంవత్సరంలో కాకినాడకు కొంకిపర్రు అని, 1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ అని పిలిచే కాకినాడలో ఉండే బొల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు.
తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం.
1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీ మాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ, కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు.
కొమరిగిరి
క్రీశ. 1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి, పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు.
కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు.
నిస్సంకుల నాయన
కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య ,నండూరి తిమ్మరాజు, తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు.
1671-79 లోప్రోలునాడు పరిపాలిస్తున్నపు జంమిందారు తెలుగు రాయినంగారు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు. హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు.
వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం.
పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.
బొల్లోజు బాబా రచించిన, తూర్పుగోదావరి జిల్లా కైఫియ్యత్తులు నుండి
వ్యాసకర్త
సిద్దాంతపు బెన్ జాన్ సన్
బాలసాహితీ రచయిత
పుస్తకం కోసం కాంటాక్ట్ 9866115655
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment