Tuesday, December 15, 2020

Imported post: Facebook Post: 2020-12-15T00:36:31

బిక్కవోలు ఐకనోగ్రఫీ . వేదాలలో చెప్పిన రుద్రుడు పురాణాలకాలానికి త్రిమూర్తులలో ఒకడైన శివునిగా పరిణామం చెందాడు. నేడు హిందూమతంలో ఇది ప్రధాన ఆరాధన విధానం. ఇది కాక వేదాలను ప్రామాణికంగా అంగీకరించని పాశుపత, లకులీశ, కాపాలిక, కంకాళులు, కాలముఖ, భైరవ, లింగాయత్, సిద్ధాంత మార్గులు, జంగములు లాంటి పేర్లతో అనేక శైవ సంప్రదాయాలు ఉండేవి. కొన్ని సంప్రదాయాలు కొన్నికాలాలలో ప్రబలంగా ఉండి సమాజాన్ని ప్రభావితం చేసాయి. ఈ లోకానికి చెందని పారలౌకిక విషయాలకన్నా లౌకిక విషయాల పట్లే ఈ కల్ట్ లన్నీ దృష్టి పెట్టేవి. అందుచేత ఈ సంప్రదాయాలకు చెందిన వ్యక్తులు జైన, బౌద్ధ, హిందూ మతాచారాలను వ్యతిరేకించేవారు. ఆంధ్రప్రదేష్ లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గుణగ విజయాదిత్యుడు (క్రీశ. 848-891) నిర్మించిన ఒక ఆలయగోపురంపై (ఊలపల్లి వెళ్ళే దారిలో) లకులీశ సంప్రదాయానికి చెందిన వివిధ చిహ్నాలు కలవు. . 1. లకులీశ సంప్రదాయం . క్రీశ. ఒకటో శతాబ్దంలో లకులీశ ( Lakulisha Lord of the Club) అనే రుషి పశుపతి సూత్ర అనే గ్రంధాన్ని రచించి లకులీశ ఆరాధనా శాఖను ఏర్పరిచాడు. లింగపురాణంలో లకులీశుడు శివుని చివరిదైన 28 వ అవతారంగాను; వాయుపురాణంలో వ్యాసుని సమకాలీనుడుగాను చెప్పబడ్డాడు. లకులీశ సంప్రదాయంలో ఆరు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. 1. కారణ (ఈశ్వరుడు) 2. కార్య (జీవుడు) 3. కాల (అభేదం) 4. విధి (పద్దతి) 5. యోగ (జీవుడు ఈశ్వరునిలో కలవటం) 6. దుఃఖాంత (దుఃఖం నుండి విముక్తమవ్వటం) లకులీశ ఆరాధన నాలుగో శతాబ్దంనాటికి ఉత్తరభారతదేశంలో విస్త్రుతంగా ప్రచారం పొందింది. ఆరోశతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన బదామి కొండగుహలలో లకులీశుని శిల్పాలు కనిపించటాన్ని బట్టి- చాళుక్యులు ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించినట్లు అర్ధమౌతుంది. గుణగవిజయాదిత్యుడు కూడా ఆ వంశానికి చెందినవాడే. ఆంధ్రప్రదేష్ లో ఈ లకులీశ శిల్పాలు బిక్కవోలు కాక శ్రీకాకుళం జిల్లా ముఖలింగేశ్వర ఆలయం, కడప పుష్పగిరి ఆలయాలలో కనిపిస్తాయి. . 2. లకులీశ శిల్ప శైలి . లకులీశ విగ్రహాలు ప్రత్యేకమైన నిర్మాణశైలిని కలిగి ఉంటాయి. అవి ఎ. పద్మాసనంలో కూర్చున్న భంగిమ బి. పద్మ పీఠము సి. తలపై సర్ప కిరీటము డి. చేతిలో లకుటము (దుడ్డుకర్ర) ఇ. చెవులకు కుండలాలు ఎఫ్. ధర్మచక్ర ప్రవర్తనా ముద్ర (రెండు చేతుల వేళ్ళు ఎదురెదురుగా ఉంచి ఏదో భోధిస్తున్న భంగిమ) జి. చుట్టూ నలుగురు శిష్యులు . 3. బిక్కవోలులో ఉన్న లకులీశ శిల్పాలు , * ఆలయాద్వారానికి కుడివైపున కొద్దిగా శిధిలమైన లకులీశుని శిల్పం కలదు. ఇదు సుమారు నాలుగడుగుల ఎత్తు ఉంటుంది. తలపై ఉన్న కిరీటము సర్పమో కాదో తెలియటం లేదు. చెవులకు పొడవైన కుండలాలు ఉన్నాయి. చేతులు ధర్మచక్ర ప్రవర్తనా ముద్రలో కలవు. చేతిలో దండము ఉంది. రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. వజ్రాసనము, పద్మపీఠము కలవు. పీఠం క్రింద ఇద్దరు శిష్యులు మాత్రమే ఉన్నారు. (ఫొటో 1) * ఆలయగోపురంపై లకులీశ శిల్పాలుగా అనిపించే చిన్నచిన్నవి రెండు మూడు కనిపించాయి. (ఫోటోలు 2, 3) * ఇవి కాక చేత దండం, ఢమరుకం ధరించి నర్తించే భంగిమలో ఉన్న శిల్పమొకటి కలదు. ఇది బహుసా లకులీశ మూర్తికి రూపాంతరం కావొచ్చనుకొంటాను. (ఫొటో 4) * ఈ శిల్పాలలో జంధ్యం ఉండటం గమనార్హం. . 4. లకులీశ కల్ట్ పరిణామం . లకులీశుడు తన బోధనల ద్వారా అప్పటికే ఉన్న పాశుపత ఇంకా ఇతర శైవ కల్ట్ లను ఏకంచేసి ఒకే తాటిపైకి తెచ్చాడు. దానివల్ల ఈ కల్ట్ నాలుగో శతాబ్దానికి బలం పుంజుకొని ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. లకులీశ కల్ట్ ఆరాధకులు వంటిపై బూడిద పూసుకొని, ఓంకారాన్ని జపిస్తూ, శివుణ్ని స్తుతించేవారు. ఏడో శతాబ్దంలో ఆంధ్రను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాంత్సాంగ్ "లకులీశ ఆరాధకులకు రాజాదరణ ఉన్నదని, సమాజంపై వీరి ప్రభావం బలంగా ఉందని" వ్యాఖ్యానించాడు. లకులీశ సంప్రదాయం పదో శతాబ్దం వరకూ కొనసాగింది. ఈ శాఖ నుంచే కాపాలిక, కాలముఖ శైవ శాఖలు వచ్చాయంటారు. చివరలో వీరు తాంత్రిక పద్దతులు అవలంబించటంతో ఈ కల్ట్ క్రమేపీ ప్రజల ఆదరణ కోల్పోయింది. దక్షిణ భారతదేశంలో ఆ తదనంతరం వచ్చిన వీరశైవం, లింగాయత్ ఉద్యమాలకు లకులీశ కల్ట్ ప్రేరణగా పనిచేసిందనటంలో సందేహం లేదు. ఉత్తరభారతదేశంలో కనిపించే లకులీశ శిల్పాలలో Erect penis ను symbol of vigour గా చెక్కటం చూడవచ్చు. కానీ బిక్కవోలులోని లకులీశ శిల్పాలలో అలా లేకపోవటం గమనార్హం. *** హిందూ మతం అనేక భక్తిమార్గాల సంగమం. బహుదేవతారాధన హిందూమత బలం. ఉపనదులన్నీ జీవనదిలో కలిసినట్లు ఎన్నో కల్ట్స్ వచ్చి చేరగా నేడు మనం అనుకొంటున్న హిందూ మతం ఏర్పడింది. ఈ క్రమంలో ఒక్కోకాలంలో ఒక్కో భక్తి మార్గం ప్రముఖంగా నిలిచింది. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. అలా కనుమరుగైన ఒక శైవ సంప్రదాయం లకులీశ మతం. ఒకనాటి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటించారనటానికి బిక్కవోలులో గుణగవిజయాదిత్యుడు తొమ్మిదో శతాబ్దంలో కట్టించిన ఆలయం నేడు సాక్ష్యంగా నిలుస్తూఉన్నది. బొల్లోజు బాబా



No comments:

Post a Comment