Monday, November 30, 2020

Imported post: Facebook Post: 2020-11-30T01:57:11

ఒక పుస్తకాన్ని వెలువరించటానికి ఎతనయో వెలివేషంగళ్ ఆవిష్కరణ సభ, ఫ్లెక్స్ లు, వక్తల ప్రసంగాలు, శాలువాలు, ప్రెస్ కవరేజ్ వాటిఫొటోలు, వీడియోలు మరలా సోషల్ మీడియాలో షేర్ చేయటం, పుస్తకం పలానా 9866115655 నంబరులో లభిస్తుంది సంప్రదించండీ అంటూ ప్రకటనలు ..... ఎల్లాం వెలివేషం.... *** మరి ఇంట్లో ఏంజరుగుతుంది? కొన్ని విషయాలు వీళ్లకే తెలుస్తాయి వేళకాని వేళల్లో ఎన్నెన్ని టీలు కాఫీలు.... ఏదో అర్ధరాత్రిపూట మేల్కొని నా గదిలో లైటు ఫాను కట్టేసి రెక్కపట్టుకొని లాక్కొని పోవటం... ఏ రామకృష్ణతోనో, శివకామేశ్వరరావు గారితోనో గంటలతరబడి ఫోన్ చర్చలు... మీరు వెళ్ళి వచ్చేయండి.... నాక్కొంచెం పని ఉంది అంటూ నే చేసిన అభ్యర్ధనలూ.... ఇవన్నీ వీళ్లకే తెలుస్తాయి... బయట వాళ్లకేం తెలుస్తాయి.... అక్కడ నేను కట్టే వేషం వేరు కదా! *** కరోనా కాలం కదా సభ జరుపుకొనే అవకాశం ఉండకపోవచ్చు అంటూ పుస్తకాలు ప్రెస్ నుంచి వచ్చిన రోజే ఇంట్లో మా పిల్లలు ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసేసారు. మా ఆవిడ ఆవిష్కర్త... ఒక శాలువా, రచయితగా నాకు మూడు శాలువాలు....ముగ్గురినుంచీ... ఉపన్యాసాలేమీ లేవు.... ఉత్త ప్రేమ, కొన్ని ఘనీభవించిన క్షణాలు తప్ప బొల్లోజు బాబా









Friday, November 27, 2020

Imported post: Facebook Post: 2020-11-27T15:18:21

ప్రెస్ కవరేజ్ - తాంక్యూ పాత్రికేయ మిత్రులారా పుస్తకం కొరకు 9866115655 లో పల్లవి పబ్లికేషన్స్ వారిని సంప్రదించగలరు. బొల్లోజు బాబా





Tuesday, November 24, 2020

Imported post: Facebook Post: 2020-11-24T14:05:48

తాంక్యూ డాక్టరు గారు For your kind gesture కృష్ణా జిల్లా కైఫీయ్యతులు ఇప్పటికే పుస్తకం గా వచ్చాయండి. Baba

Monday, November 23, 2020

Imported post: Facebook Post: 2020-11-23T10:57:11

Using sentences,incidents,descriptions of other contemporary writer or even paraphrasing them to create another work comes under ipr act. Whether it is for monitory or not. Present incident is not an act of Citing the original work. It is violation of intellectual property rights. One can create another story from a different point of view of the original, without using names of characters, same incidents, same descriptions, sentences..... It will be perfectly ok To do so one should have tons of creativity. DUMB HEADS should not try 😎

Sunday, November 22, 2020

Imported post: Facebook Post: 2020-11-22T17:06:39

మిత్రులారా ఈ రోజు జరగనున్న పుస్తకావిష్కరణ సభ లైవ్ నా వాల్ పై ఉండబోతున్నది.

Saturday, November 21, 2020

Imported post: Facebook Post: 2020-11-21T16:15:54

మేకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి పుస్తక ఆవిష్కరణ విజయవాడలో 22 నవంబరున పల్లవి ప్రచురణల ఆధ్వర్యంలో జరగనుంది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణం గా నేను రాలేక పోతున్నాను. ఈ సభలో పుస్తకంపై మాట్లాడనున్న డా.కె బాలకృష్ణ గారికి, డా.మొవ్వ శ్రీనివాస రెడ్డి గారికి నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను బొల్లోజు బాబా

Friday, November 20, 2020

Imported post: Facebook Post: 2020-11-20T23:55:40

“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్” – సారంగ కొన్ని ప్రశ్నలు ఇవి సారంగ నిర్వాహకులకు 1. ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా? 2. ఒక వేళ ఉన్నట్లయితే ... ఆ కథకు ఇంట్రో వాక్యాలలో ఒరిజినల్ రచయిత గౌరవానికి భంగం కలిగించే విధంగా దూషించవచ్చా? 3. పై రెండు ప్రశ్నలకు అవునని నమ్మితే - అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా? 4. పై మూడు ప్రశ్నలకు సమాధానం సారంగ వద్ద లేకపోతే.... సారంగ నిర్వాహకులు నైతిక నియమావళి తప్పినట్లుగా, ఇది సాహిత్యద్రోహంగా భావించవలసి వస్తుంది. http://nerdwriter.blogspot.com/2010/07/is-rewriting-same-as-plagiarism-answer.html బొల్లోజు బాబా https://magazine.saarangabooks.com/%e0%b0%8f-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b0/

Wednesday, November 18, 2020

Imported post: Facebook Post: 2020-11-18T20:17:34

మిత్రులకు విన్నపం నేను ఇంతవరకూ ఏడు పుస్తకాలు వెలువరించాను - రెండు చరిత్రపై, మూడు కవిత్వసంపుటులు, ఒక అనువాదం, మరొకటి సాహిత్య వ్యాసాలు. ఇవన్నీ నేను సొంతంగా ప్రచురించుకొన్నవి. నా ఎనిమిదవ పుస్తకం "మెకంజి కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా". ఈ పుస్తకావిష్కరణ ఈ రోజు కాకినాడలో జరిగింది. ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్, అధినేత Sri. Sv Narayana గారు ముద్రించారు. ఖరీదైన పేపరు, మంచి ప్రింటింగ్ క్వాలిటీ. ఈ పుస్తకం విజయవాడ పుస్తక ప్రదర్శనలో పల్లవి స్టాల్ నందు లభిస్తుంది. శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 98661 15655 ఫేస్ బుక్: https://www.facebook.com/sv.narayana.9400 . మిత్రులారా...... దయచేసి...... ఈ పుస్తకాన్ని కొని చదవండి. . మీరు నేరుగా కొనటం కానీ, ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవటం కానీ చేస్తారని ఆశిస్తున్నాను. *** ఈ రోజు పుస్తకావిష్కరణ సభా విశేషాలు ఇవి. . మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా పుస్తకావిష్కరణ తూర్పుగోదావరిజిల్లా చరిత్ర-సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ, కార్యదర్శి డా. పి.చిరంజీవిని కుమారి అధ్యక్షతలో జరిగిన సభలో ప్రముఖ కవి, చరిత్రకారుడు శ్రీ బొల్లోజు బాబా రచించిన "మెకంజీ కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా" పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. పి. చిరంజీవిని కుమారి మాట్లాడుతూ "బ్రిటిష్ వారు భారతీయులకు చరిత్ర లేదు అనే అభిప్రాయాలను కలిగి ఉండేవారు, కానీ మన ప్రాచినులు దండకవిలెలలో అనూచానంగా మన చరిత్రను లిఖించుకొంటూ వచ్చేవారు. వాటిని బ్రిటిష్ అధికారి కాలిన్ మెకంజీ సేకరించి కైఫియ్యతుల పేరుతో భద్రపరిచాడు. ఈ కైఫియ్యతుల అధ్యయనంలో ఒక ప్రాంతపు ప్రజలు తమచరిత్రను ఏ విధంగా సృష్టించుకొన్నారు అనేది తెలుస్తుందని, ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశంలోని ప్రాంతాలు, గ్రామాలు, వాడలలో జనం ఎలా జీవించారు, ఏ విధంగా పాలించబడ్డారు, మరి ఏ విధంగా మలుపు తీసుకుంటూ వచ్చారు అనేది వెలికితీయటం చరిత్రకారుల విధి - ఆ విధంగా రెండువందల ఏండ్ల క్రితం బ్రిటిష్ అధికారి కొలిన్ మెకంజీ సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్థానికచరిత్రల కైఫియ్యతులను శ్రీ బొల్లోజు బాబా పుస్తకరూపంలోకి తీసుకురావటం అభినందనీయమని" అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గనరా మాట్లాడుతూ "తూర్పుగోదావరి జిల్లాచరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఎంతో విలువైనదని, దీనిద్వారా ఒకప్పటి ఈ ప్రాంత సామాన్య ప్రజలు ఎలాజీవించారు, వారి అనుభవాలు, ఆనాటి రాజకీయాలు అర్ధం చేసుకోవటానికి ఎంతో సహకరిస్తుందని, ఆంధ్రప్రదేష్ కు చెందిన పదమూడు జిల్లాలలో ఇంతవరకూ పది జిల్లాలకు చెందిన కైఫియ్యతులు పుస్తకరూపంలో వచ్చాయని, మన జిల్లాకు చెందిన కైఫియ్యతులు ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదని- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మెకంజీ కైఫియ్యతులను ఎంతో శ్రమకోడ్చి శ్రీ బొల్లోజు బాబా సేకరించి వాటిని, సమకాలీన భాషలోకి మార్చి, లోతైన విశ్లేషణలతో, సమగ్రంగా చేసిన ఈ రచన కైఫియ్యతులను ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా సమకాలీన పఠితలకు అందించాలి అనే విషయంలో ఒక నమూనాగా నిలిచిపోతుందని" అన్నారు. పుస్తక రచయిత శ్రీ బొల్లోజు బాబా మాట్లాడుతూ - భారతదేశ సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కాలిన్ మెకంజీ మొత్తం రెండువేలకు పైబడి కైఫియ్యతులు అని పిలవబడే స్థానిక చరిత్రలను సేకరించాడు. వీటిలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన రాజమహేంద్రవరం, కోరుకొండ, సామర్లకోట లాంటి మొత్తం పది ప్రాంతాల స్థానికచరిత్రలను 1814-15 ప్రాంతాలలో సేకరించాడు. ఇవి సమగ్రంగా ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదు. "మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నానని, ఈ పుస్తక ఆవిష్కర్తకు, ప్రచురించిన పల్లవి పబ్లికేషన్స్, ఫోన్:9866115655 వారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సభలో ఇంకా ప్రముఖకవి విమర్శకులు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, ప్రముఖరచయిత్రి పద్మజావాణి, ఐడియల్ కాలేజ్ అధికారి శ్రీ వర్మ, శ్రీ గౌరినాయుడు, శ్రీ సుబ్బారావు, శ్రీ సరిపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. **** కాపీల కొరకు శ్రీ ఎస్వి నారాయణ ఫోన్ నంబరు: 98661 15655 పల్లవి పబ్లికేషన్స్ పేజీలు-192. వెల 200/- దయచేసి సంప్రదించండి. . బొల్లోజు బాబా

Tuesday, November 17, 2020

Imported post: Facebook Post: 2020-11-17T19:49:23

దర్శనం దైవదర్శనం ముగించుకొని కోనేరు మెట్లపై కూర్చొన్నాను. ఎవరో భక్తుడు కొట్టిన గంట నిశ్శబ్దంలో మెరుపులా మెరిసి కోనేటి నీటిపై తరంగాలు తరంగాలుగా కంపించింది కాసేపు. ప్రదక్షిణాలు చేస్తున్న మువ్వల సవ్వడి ఒక క్రమవిరామంతో దగ్గరగా వచ్చి దూరమౌతోంది. కొబ్బరినీళ్ళ వాసనను మోసుకొచ్చిన గాలి చెంపలను తాకి ఎటో సాగిపోయింది. ఉడతల జంట ఒకటి చెట్టు మొదలువద్ద కనిపించినట్లే కనిపించి రెప్పపాటులో కొమ్మల్లోకి అదృశ్యమైంది. పసుపుపచ్చని సీతాకోక చిలుక నా భుజంపై కాసేపు తచ్చాడి కలువల్ని కూడా కనికరించేందుకు కదిలింది. ఒక్కసారిగా గుడిలో ఎలెక్ట్రిక్ భజంత్రీలు మోగటం మొదలైంది ఢంకాలు, గంటలు, మువ్వలు ఏకకాలంలో ఒకదానిలోకి ఒకటి లయమౌతూ - ఒక శబ్దబీభత్సం గోపురంపై రామచిలుకలు పైకి లేచాయి నేనూ లేచాను .... ఇది నా సమయం కాదని. బొల్లోజు బాబా

Sunday, November 15, 2020

Imported post: Facebook Post: 2020-11-15T15:48:51

చందమామ, బాలమిత్ర పత్రికల తరువాత నా పఠనాసక్తిని మరో దశాబ్దం పాటు పొడిగించి నన్ను సాహిత్యంవైపు నడిపించిన యండమూరి వీరేంద్రనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. యండమూరి రచనలు చదువుతూ పెరిగిన తరంలో నేనూ ఉన్నాను. ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం ఆయన చేతులమీదుగా ఆవిష్కరణ జరగటం ఒక మధురానుభూతి.

Friday, November 13, 2020

Imported post: Facebook Post: 2020-11-13T18:59:08

Indian Literature, Sahitya Akademi's Bimonthly Journal. నేను డిగ్రీ చదువుతున్నప్పటినుంచి ఈ పత్రికను ఫాలో అయ్యేవాడిని. ఇంటర్ నెట్ రాకముందు సమకాలీన భారతీయ కవిత్వం చదవాలంటే Indian Literature, త్రివేణి పత్రికలే ఆధారంగా ఉండేవి. Indian Literature పత్రికలోని నాకునచ్చిన కవితలను అనేక సందర్భాలలో అనువదించాను. అలా ప్రముఖ భారతీయకవులైన Sri Satchidanandan, Kedarnath singh, Chandrakant Deotale, Vatsyayan Agyeya, P.P. Ramachandran, Surjit pattar, Aashish Thakur, Lal Singh Dil, Eunice de Souza, Kanupriya Dhingra, Subhash Mukhopadhyay వంటి వారి కొన్ని కవితలను అనువదించి నా బ్లాగు https://sahitheeyanam.blogspot.com/ లో పోస్ట్ చేస్తూవచ్చాను. *** Indian Literature మే-జూన్ 2020 సంచిక నాకెంతో ప్రత్యేకమైనది. దీనిలో నా కవితానువాదాలు ప్రచురింపబడటం నా కెంతో ఆనందాన్ని తృప్తిని ఇచ్చిన సందర్భం. ఆ పత్రికా సంపాదకులకు ధన్యవాదములు. ఈ కవితలలో చాలామట్టుకు స్వీయానువాదాలు, మరికొన్నింటిని శ్రీ నౌడూరి మూర్తిగారు, శ్రీ ఆర్య గారు అనువదించారు. వారికి కృతజ్ఞతలు. ఈ పిక్స్ పంపిన మిత్రులు రవీందర్ గారికి ధన్యవాదములు. భవదీయుడు బొల్లోజు బాబా





నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం



నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం
(ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్ట్ చేద్దామనిపించింది, థాట్ కంటిన్యూటీ ఉండాలని… ఇలా)
అఫ్సర్ తాను నలభై ఏళ్ళుగా వెలువరించిన కవిత్వాన్ని “అప్పటినుంచి ఇప్పటి దాకా” పేరుతో ఇటీవల పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. దీనికి రాసుకొన్న ముందుమాటలో “వొక కవి రాస్తున్న కవిత్వమంతా, వొకే గాటన కట్టేయడం కుదురుతుందా?” అని ప్రశ్నిస్తాడు. 660 పేజీల ఈ సంపుటిని చదివినతరువాత కూడా పై ప్రశ్నకు అవుననో కాదనో సమాధానం దొరకదు. అందునా శిల్పరీత్యా, వస్తురీత్యా, అభివ్యక్తిరీత్యా నిత్యచలనశీలత కలిగిన అత్యాధునికుడైన అఫ్సర్ లాంటి కవి గురించి చెప్పటం మరీ కష్టం. ఈ మొత్తం బృహత్ గ్రంధాన్ని చదివినపుడు మాత్రం ఆ కవితలన్నింటినీ కలుపుతున్న కనిపించని దారాలేవో లీలగా తారాడుతాయి.
ఆధునిక కవిత్వం వైయక్తికంగా ఉంటూనే వేదనను పలికించటం ప్రధానలక్షణంగా కలిగి ఉంది. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని విమర్శకులు విభజించారు. ఈ తరహా కవిత్వంలో కవి తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచి కొన్ని రాజకీయ, సామాజిక సత్యాలను ఆవిష్కరిస్తాడు. అంటే ఆ కవిత్వం ఏకకాలంలో వైయక్తికము, సామాజికమూ అవుతుంది. కన్ఫెషన్ అంటే పూర్తిగా కవికిమాత్రమే సంబంధించిన ఒక అనుభవాన్ని సమాజపరం చేయటం. ఈ చేసే క్రమంలో ఈ సమాజం ఎలా ఉండాలని ఆశించాడో, ఎలా ఉందో అనే భిన్న అంశాల మధ్య వైరుధ్యాలను వెలికి తీస్తాడు.
అఫ్సర్ తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించాడు. ఆ కోణం లోంచి చూసినపుడు అఫ్సర్ Confessional Poet గా కనిపిస్తాడు.
ఏది వ్యక్తిగతమూ, ఏది సామాజికము అని సరిహద్దులు చెరిపేస్తుందీ నాలుగు దశాబ్దాల కవిత్వం. చారిత్రిక, రాజకీయ, సామాజిక వాస్తవాలు వ్యక్తిగత సర్కిల్ ను దాటి ఆధునిక మానవ జీవితాన్ని పోతపోసాయి.
అస్తిత్వం కోసం చేసిన అన్వేషణలో ఈ కవిత్వం స్థానీయత పరిధులను దాటిన మానవ అస్తిత్వవేదనను బలంగా ప్రతిబింబించింది. ఇది లోపలనించి మొదలై వెలుపలి సామాజిక వాస్తవికతతో తలపడుతుంది. వ్యాకులత, దుఃఖం, నిస్సహాయత, ధిక్కారం, పరాధీనత, శాంతికాముకత లాంటి ఉద్వేగాలు అంతర్లీనంగా వాక్యాల వెనుక ప్రవహిస్తూంటాయి.
1. మెటొనిమీ అఫ్సర్ కవిత్వ బలం
నలభై ఏళ్ళలో అఫ్సర్ కవిత్వం పొందిన పరిణామం - శిల్పరీత్యా సాంద్రపడటం, వస్తురీత్యా సార్వజనీనతను పొందటం, మానవానుభవం సహజత్వాన్ని సంతరించుకోవటం.
అతనే వినిపించకపోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లిగా కదిలి తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకమై
నడుస్తున్న నిన్ను వెంటాడి వేదిస్తుంది
రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా (సైగల్ – 1985)
వొక మేఘఘర్జననీ
యింకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెనువాన//
ప్రాణం ఉగ్గబెట్టుకొన్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకొన్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేదాకా, నా జహాపనా (భూపేన్ హజారికా కొరకు -2018)
సుమారు ముప్పై అయిదు సంవత్సరాల వ్యవధితో ఇద్దరు గాయకుల గురించి రాసిన కవితా వాక్యాలివి. సైగల్ కవితలో “తిలక్ తనం” కనిపిస్తుంది. అందం, ఆనందం పరమావధిగా ఉంది. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా పై ఇటీవల వ్రాసిన వ్రాసిన ఆ రెండో కవితలో శిల్పం సాంద్రపడింది. పాటను మేఘఘర్జన, గుండెపగులుల సమ్మేళనం, లోపలి వాన అంటూ మెటఫరైజ్ చేయటం టాప్ క్లాస్ వ్యక్తీకరణలు. ఎడతెగని దుఃఖం, వ్యాకులత నిండిన కవి మనఃస్థితిని “పెనువాన”, “చీకటిపరుగు” లాంటి పదాలు సూచిస్తున్నాయి. ఇదంతా అఫ్సర్ నలభై ఏళ్ళలో “తిలక్ తనం” నుంచి “అఫ్సర్ తనం” వరకూ చేసిన ప్రయాణం.
***
అఫ్సర్ డిక్షన్ లో సిమిలీ కన్నా ఇమేజెరీ, మెటాఫర్ కన్నా మెటొనిమీ ప్రముఖంగా కనిపిస్తుంది. “ఏకాంతం” అనే కవితలో ఏకాంతపు స్థితికి “గది” ని మెటొనిమీ (ప్రతీకాత్మకత) చేస్తాడు.
//లోనికి రమ్మని
చేతులు చాస్తుంది గది//
ఎంతకీ చేతులు వెనక్కు లాక్కోదు గది
గదిగోడల మీద అక్కడక్కడా నెత్తుటి మరకలు/
గది నాకంటే వొంటరిదనుకోను
నాకోసమే చేతులు చాచాల్సిన
అవసరమూ లేదు// (ఏకాంతం – 1985)
పై కవితలో గది అన్న పదం చోటులో ఏకాంతం అన్నపదం ఉంచుకొని చదువుకొన్నప్పుడు ఈ కవిత సౌందర్యం అర్ధమౌతుంది. ఇక్కడ కవి, ఏకాంతగది అనో గదిఏకాంతమనో మెటఫరైజ్ చెయ్యడు. ఏకాంతం అనే కవితా వస్తువును గదితో మెటొనిమీ చేసాడు. కవితను విప్పే తాళం చెవి టైటిల్ లో ఉంచాడు.
మెటొనిమీ అనేది అత్యున్నతమైన ఒక కవిత్వీకరణ పనిముట్టు. అందుకనే కవిత్వం “మెటఫర్ నుండి మెటొనిమీకి ప్రయాణించాలి” అంటాడు మో. ఈ మొత్తం కవితలను చదివాకా అఫ్సర్ కవిత్వబలం మెటొనిమీ లోనే ఉందనిపిస్తూంటుంది. ఈ మెటొనిమిలో ఉన్న ప్రమాదం ఏమిటంటే కవి ఉద్దేశించిన ప్రతీకను పాఠకుడు గుర్తించలేకపోయినట్లయితే అది అయోమయానికి దారితీస్తుంది. అఫ్సర్ కవిత్వంపై ఈ తరహా విమర్శ లేకపోలేదు.
2. అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం
ప్రతీ కవికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. అజంతా కవిత్వంలో మృత్యుఊహలు, ఇస్మాయిల్ కవిత్వంలో పిట్ట, చెట్టు ప్రస్తావనలు వంటివి. అఫ్సర్ కవిత్వంలో కూడా “మాట-మాట్లాడు కోవటం, వాన-వర్షించటం” లాంటి విషయాలు పదే పదే వస్తూంటాయి. వచ్చిన ప్రతీ సారీ కొత్త అర్ధంలో, కొత్త కోణంలో, కొత్త మెటానొమికాభివ్యక్తితో దర్శింపచేయటం కవి ప్రతిభ. చాలా చోట్ల “మాటను” ను లోపలిప్రపంచానికి; “వాన” ను బయటిప్రపంచానికి ప్రతీకలుగా చేయటం గమనించవచ్చు.
మాటలకేం,
ఇసుకవేసినా రాలనన్ని మాటలు//
ఎటుచూసినా మాటల వర్షమే
కుంభవృష్టి కురుస్తున్నా
నా మీద ఒక్కచినుకూ తడవదే/
ఈ మాటల ఊరేగింపులో
నా మాటెవరికీ వినిపించదే!/
నా గొంతులో మాటుకాసి
మాటని ఎవరో నులిమేస్తున్నారు/
నా లోపలి మాట మూడంకె వేసింది (నాకు మాటివ్వండి – 1991).
చుట్టూ కుండపోతగా కురిసే మాటల వర్షంలో తడుస్తున్న కవికి సొంత మాటలు మూగపోయాయి అంటున్నాడు. చలం చెప్పిన అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం ఇది. ఊహకు వాస్తవానికి మధ్య దూరాన్ని ఈ కవిత పట్టుకొంటుంది. కవిత చివర్లో “గుండెకు సిజేరియన్ చేసైనా సరే ఒక స్వచ్ఛమైన శిశువులాంటి మాట” ఒకటి కావాలంటాడు కవి.
మాటకి
అక్షరానికి
చెమట చేతుల మోటుదనం కావాలిక!// (యానాం వేమన ఏమనె-1992).
కవిత్వం మట్టివాసనను, కన్నీటి జాడలను ప్రతిబింబించాలని అంటున్నాడు. తెలుగు దళితకవిత్వాన్ని చిక్కబరచిన “చిక్కనవుతున్న పాట” రావటానికి మూడేళ్ల ముందు రాసిన వాక్యాలివి. అఫ్సర్ తన కాలానికి చాలా ముందే ఉన్నాడనటానికి “యానాం వేమన ఏమనె” కవిత చక్కని సాక్షిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిన దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.
మాట రాలిపోయినపుడే
కవిత్వమంతా శిథిలమయిపోయింది (వొకానొక అసందర్భం 2009). ఇక్కడ మాటను వాస్తవం చెప్పటం అనే అర్ధంలో వాడతాడు కవి. వాస్తవాన్ని కప్పిపుచ్చే కవిత్వం మృతప్రాయం అని చెపుతున్నాడు.
అనేక కవితల్లో స్వీయ అస్తిత్వానికి, వ్యక్తీకరణకు, ఆలోచనలకు, అంతర్మధనానికి మాటను పర్యాయపదం చేయటాన్ని గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు…
*/లోగొంతుకల్ని/తోడిపోసే చేదలేదుగా చేతుల్లో/వొక తెగిపడిన మాటనో/వొక రాలిపడిన కేకనో/ తెగనరక్కు దేన్నీ (తెగిపడేవి మాటలే -2009)
*/మాటలొ ఏముందనుకుంటాం కానీ/మాటలోనే అంతా వుంది/అన్నిట్నీ కప్పడం నేర్పుతుంది/దుఃఖం సంతోషంలాగ/సంతోషం దుఃఖంలాగ/అసహనం సహనంలాగ/ ద్వేషం ప్రేమలాగా పలుకుతుంది. (పసి కాళ్ళు నీవీ నావీ)
*/నిండు చీకట్లో/నిలువెత్తు మల్లెలా/నడుచుకుంటూ వస్తావు నువ్వు. పడవనిండా కొన్ని మాటలూ/ఇంకా కొన్ని అరవిరిసిన నవ్వులూ నింపుకొని (గట్లు తెగినాక -2013)
*/నిజానికి మాటలసంచీ ఖాళీ అవ్వనే అవ్వదు/అయినా సరే/వెళ్ళిపోవాలి కదా/తలోదారి తలోదిక్కూ తలో రెక్కా అయిపోయి (వుండనా, మరి – 2015)
కవిగా అఫ్సర్ వ్యక్తీకరణలో కనిపించే మరొక అబ్సెషన్ ‘వాన’. తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలకు వానను ప్రతీకాత్మకంగా వాడుతున్నాడని అర్ధమౌతుంది.
వాన వెలిసిన చీకట్లో
అతని చివరిస్నానం గురించి ఆలోచిస్తో వస్తున్నాను
కడిగిన ముత్యంలాంటి
అతని వొంటిమీద ఎండిన నెత్తుటి చారికలగురించి
మానని గాయాల తెరుచుకున్న నిజాలగురించి
వొళ్లంతా కళ్లయిన ఎదురుచూసిన తల్లిగురించి
పదహారేళ్ళ కాళ్ళకింద హఠాత్తుగా చీలిపోయిన భూమిగురించీ// (చివరి స్నానం -1997).
మత కలహాలలో చంపబడ్డ యువకుని గురించిన కవిత అది. గంభీర విషాదంగా సాగుతుంది. కవిత “వాన వెలిసిన చీకట్లో” అంటూ మొదలౌతుంది. ఇక్కడ వానను లోకం సాగించిన మారణకాండకు ప్రతీకచేయటాన్ని గమనించవచ్చు.
భిన్నకాలాలలో, భిన్న సందర్భాలకు వ్రాసిన అనేక కవితల్లో వాన ప్రస్తావన చేసినచోటల్లా ఖాళీల్లోకి పాదరసం బిందువులు కుదురుకున్నట్లుగా ఒదిగిపోవటం గమనిస్తాం. ప్రతీచోటా బయటజరుగుతున్న విషయాన్ని చెప్పటానికి వానను ప్రతీకగా వాడుకొంటున్నట్లు అర్ధమౌతుంది. కొన్ని ఉదాహరణలు…
*/ఎన్ని వానలు చూళ్ళేదనీ?/ప్రతీవానా/మళ్ళీ అదేదో కొత్తవాసనేస్తుంది (సగమే గుర్తు – 2006)
*/చడీ చప్పుడూ లేకుండా/అలా కురుస్తూనే వుంది వాన/ఎప్పుడు ఎలా కురిసినా వొకేలా వుండటమే తెలుసు వానకి (నీరెండలో వూరు – 2008)
*/యీ వానా యీ జీవితం/నన్ను యెంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను/ వానకు కురవటం వొక్కటే తెలిసినట్టు/నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు (నీదికాని వాన -2013)
*/అక్కడ నువ్వు యింకా కురుస్తున్నావో లేదో కాని/యిక్కడ నేనింకా తడుస్తూనే వున్నాను (అక్కడి వానలో నేను -2015)
*/తొలకరివాన/కొండల్ని తలబాదుకునీ బాదుకునీ/ఏడుస్తుంది/వితంతువులు/ చేతులారా గాజులు పగలగొట్టుకొంటున్నట్టు ( శ్రీనగర్ లో మొహర్రం )
ఒక కవి నలభైఏళ్ళపాటు వ్రాసిన సుమారు 600 పేజీల కవిత్వంలో పదే పదే వచ్చిన ఒక పదాన్నో, పదబంధాన్నో వెలికితీసి చూపటం మర్యాదకాకపోవచ్చు. కానీ చెప్పిన ప్రతీచోటా కవి కొత్తగా చెప్పాడని, ఆయా సందర్భాలకు అద్భుతంగా సింక్ చేసాడని, అక్కడ ఆ పదాలు తప్ప వేరే పదాలు పొసగవనే సంగతి చెప్పటానికే ఇదంతా.
3. నలభై ఏళ్ళ వర్తమానం
అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. అఫ్సర్ కవిత్వం పట్ల ప్రధానంగా వినిపించే విమర్శ సంక్లిష్టత.
ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు.
*/ఉన్నచోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని/ఎక్కడెక్కడో అంటీముట్టని బట్టలా/ విసిరేయొద్దంటాను/నా నవ్వులు నా ఏడ్పులూ/నా అవమానాలు నా అనుమానాలు/నా మానభంగాలు హత్యలూ/అన్నీ మీవి కూడా అంటాను (నాకే జన్మభూమీ లేదు)
*/ఒకే ఆకాశం గొడుగు కింద/మనిద్దరం/నీకో సగం నాకో సగం కాదు/అంతా మనకోసమే//ఇక్కడే/ ఈ ఆకాశం కిందనే నన్నుండనివ్వు (ఆకాశం వొడిలో) -- అనే వాక్యాలలో ఈ కవి నేను ఈ దేశానికి చెందినవాడినే, నేను అన్యుడను కాను నేనూ మీలోని వాడినే నన్నువేరుగా చూడకండి అన్న వేడికోలు స్పష్టంగా వినిపిస్తుంది.
*సరిహద్దులు లేవు లేవు నాకు అని/రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని/భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని/నడుస్తూ పరిగెత్తుతూ వుంటా// నమ్మరా నన్ను నమ్మరా/ నా పేరుచివర మహమ్మదో అహమ్మదో షేకో/సయ్యదో/ ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా// అనే వాక్యాలలో పలికే విషాదం తన అనన్యతను నిరూపించుకోవటం కొరకు కవి పడుతున్నవ్యధను వ్యక్తీకరిస్తాయి.
*/పచ్చపచ్చని నా వొంటిమీద/రాజకీయాలు చేస్తున్నప్పుడు/యా అల్లాహ్/కనీసం నన్ను బతికించలేకపోయావు/కనీసం నీ కళ్ళయినా చమర్చాయా? (ఒక ఖడ్గం స్వగతం -1996) అంటూ దేవుడినే ప్రశ్నిస్తాడు ఒక నిస్సహాయ స్వరంతో.
ఇలాంటి కవితలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమూహపు Psyche ను నిక్షిప్తం చేస్తాడు. ఇవి ఆయా స్థలకాలాదులకు సంబంధించిన ఆ సమూహపు రాజకీయ అభిప్రాయాలుగా భావించవచ్చు.
4. హిస్టారికల్ నేరేటివ్
అఫ్సర్ ఇంతవరకూ వెలువరించిన రక్త స్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర, ఇంటివైపు అనే అయిదు కవితాసంపుటులలోని కవితలను ఈ సమగ్ర సంపుటిలో పొందుపరిచారు. ఈ కవితలను అన్నింటిని ఏకబిగిని చదివినపుడు ఒక Historical narrative అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ నేరేటివ్ లో నాలుగు దశాబ్దాల అభిరుచులు, పఠనాసక్తులు, రాజకీయ, సామాజిక నేపథ్యాలు పరిస్థితులు ఉంటాయి. ఒక పరిణామ క్రమం లీలగా గోఛరిస్తుంది.
1985 లో వచ్చిన “రక్తస్పర్శ” కవితలలో ముస్లిం అస్తిత్వవాద కవితలు కనిపించవు. అలాగని అప్పట్లో మతవాదం లేదని చెప్పలేం కానీ ఆ తరువాత కాలమంతటి కల్లోలంగా లేదనవచ్చు; కనీసం కవిత్వానికి సంబంధించి.
1992 బాబ్రి మసీదు విధ్వంసానికి ముందు జరిగిన హిందువుల పోలరైజేషన్ ప్రక్రియను “ఇవాళ” కవితా సంపుటిలోని కర్ఫ్యూ, సంక్షోభగీతం, ఇదే నా జాతీయగీతం, గాంధీగారి రెండో చెంప, దూరం, నాకు మాటివ్వంటి వంటి కవితలు వ్యక్తీకరిస్తాయి.
“మనసారా అందర్నీ ప్రేమిస్తానని మాటివ్వబోతాను/నా కళ్ళమీద ఒక పంజాబ్ మరో మీరట్/తీతువుల్లా వాలిపోతాయి// అనే వాక్యాలద్వారా ఒక శాంతికాముక ముస్లిం కోరుకొనేదేమిటో, పొందుతున్నదేమిటో; విస్పష్టంగా చెపుతాడు అఫ్సర్.
మతరాజకీయాలు పెచ్చరిల్లుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవటంలో విఫలమైన కమ్యూనిష్టుపార్టీలపై చేసిన విమర్శను “దేవుడు మరణించలేదు” అనే కవితలో గమనించవచ్చు.
“ఇవాళ” సంపుటిలోని- చిన్నప్పటి సంగీతం, చిన్నప్పటి చెరువు లాంటి కవితల్లో కవి నాస్టాల్జియాలోకి జారిపోతాడు నిస్సహాయుడై.
ఆ తరువాత 1999 లో “వలస” సంపుటి వచ్చినకాలం కల్లోలభరితం. అస్తిత్వవాద ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. అగర్ జిందో మె హై, ఇఫ్తార్ సైరన్, ఉష్ మాన్, నాకే జన్మభూమీ లేదు, రెండో విభజన, అజా, నహి మాలూమ్ లాంటి కవితలలో తన మైనారిటీ అస్తిత్వాన్ని నిర్ధ్వంద్వంగా చెప్పుకొన్నాడు. అలాగని అఫ్సర్ కవిత్వంలో రక్తం వచ్చేలా ముక్కుబద్దలు కొట్టేలాంటి మైనారిటీ కవిత్వవాక్యాలు కనిపించవు. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటంద్వారానే ఒక వాదాన్ని పలికించాలనుకోవటం ఇతని విధానం కాదు. చెప్పిందంతా ఒక ఆత్మనివేదనగానే చెప్పాడు. మతం పేరుచెప్పి మనిషి చేసే తప్పించుకోలేని తప్పిదాలను ఒక అండర్ స్టేట్ మెంట్ లా సటిల్ గా ఆవిష్కరిస్తాడు. ఇది అఫ్సర్ ను ఇతర మైనారిటీ కవులనుండి వేరుచేస్తుంది.
మనువాదపోకడలను ఎదుర్కోవటానికి దళిత, ముస్లిమ్ ల ఐఖ్యతను నేడు చాలామంది కోరుకొంటున్నారు. కారం చేడు దాడులపై వ్రాసిన “ఊరవతలి దుఃఖం”, దళితుల శిరోముండనం పై వ్రాసిన “శిరోముండనం” లాంటి కవితలద్వారా దళిత, ముస్లిం ల ఐఖ్యతను తొంభైలలోనే ప్రతిపాదించాడు అఫ్సర్.
2009 లో వచ్చిన “ఊరిచివర” సంపుటి నాటికి సమాజం ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధికవిధానాలు, చిక్కబడిన మతరాజకీయాలతో సంక్షుభితమై ఉంది. పొట్టచేతపట్టుకొని చేసే వలసలు అనివార్యమయ్యాయి చాలామందికి. అందుకే ఇలా అంటాడు “కడుపే దేశం/ఎంగిలి మెతుకే కల//వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికైనా/ఎడారి దేహంలోకి రాకుండా!/దేహం/ఇసుక దిబ్బ కాకుండా// అని.
ఇదే కాలంలో ఉవ్వెత్తున లేచిన తెలంగాణా ఉద్యమంతో అఫ్సర్ ఆ ప్రాంత కవిగా మమేకమయ్యాడు. తెలంగాణ 2002, తెలంగాణా 2009 కవితల్లో తెలంగాణా ఆత్మను పలికించాడు.
మెరుగైన ఉపాధికొరకు అమెరికా వెళ్ళాకా అక్కడినుంచి అంతర్జాతీయంగా వివక్షకు గురౌతున్న ముస్లిం అస్తిత్వాన్ని దర్శించాడు. తానొక దేశద్రిమ్మరి గా అభివర్ణించుకొన్నాడు “జంగమం” అనే కవితలో.
నల్లా నల్లాని నవ్వు, “డౌన్ టౌన్-కొన్ని స్వగతాలు” “తోలుమందం” లాంటి కవితలలో అమెరికాలో వర్ణవివక్షను అనుభవించే నల్లజాతీయుల వేదనతో సహానుభూతి చెందాడు.
2018 లో వచ్చిన “ఇంటి వైపు” సంపుటిలో చిత్రంగా ఏదో వ్యాకులత, ఇంటివైపు బెంగ నిండిన కవితలు కనిపిస్తాయి. నాస్టాల్జియా పొంగిపొర్లుతుంది. ఎక్కువ కవితలు గుండెలు పిండే నేరేటివ్ పద్దతిలో నడుస్తాయి. కొన్నింటిని ప్రేమకవితలుగా పోల్చుకోవచ్చు. కవిగా మరింత మార్మికతలోకి జారిపోయాడు. సందర్భాలకు రాసిన కవితలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలామట్టుకు కన్ఫెషనల్ పొయెమ్స్. ఇది పరిణితా లేక అలసిపోవటమా అనే సందిగ్ధం కలుగుతుంది.
మొత్తంమీద ఆరువందల పేజీల కవిత్వంలో కనిపించే హిస్టారికల్ నేరేటివ్- కవి జీవించిన సమాజాన్ని, జీవితాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
ముగింపు
నాలుగు దశాబ్దాలుగా కవిత, వ్యాసం, కాలమ్, ఎడిటర్, విమర్శ ఏదో రూపంలో అక్షరమై మనకు అనేక దారుల్లో అఫ్సర్ ఎదురవుతూనే ఉన్నాడు.
ఆధునికజీవనంలో అనివార్యమౌతున్న వలసలు, విచ్చిన్నమౌతున్న మానవసంబంధాలు, వివిధ జీవనో ఉద్వేగాలను ఒక కవిగా పలికిస్తూనే, ఒక ముస్లిం కవిగా తన అస్తిత్వాన్ని, సమకాలీన రాజకీయ యవనికపై తనసమూహానికి జరుగుతున్న అన్యాయాలను పదునుగానే పలికించాడు.
Exile లో ఉంటూ కూడా తన మూలాల్ని, సంస్కృతిని, వ్యక్తుల్ని చెరిపేసుకోలేదు. నిజానికి ప్రవాసంలోనే మూలాల విలువ అర్ధమౌతుంది. ఇతనికి జ్ఞపకాలే ఏకకాలంలో వర్తనమానము భవిష్యత్తూ కూడా.
ఈ ప్రపంచాన్ని మెదడు పాయింటాఫ్ వ్యూ లోంచి, హృదయం పాయింటాఫ్ వ్యూ లోంచి దర్శించటం అఫ్సర్ కవిత్వ ప్రయాణం. సత్యాన్ని ఆవరించి ఉన్న నివురుపొరలను ఒక్కొక్కటి వొలుచుకొంటూ నిప్పులపై నడుస్తాడు. ఒక్కోసారి కాంక్రీట్ వ్యక్తీకరణలతో జ్వలించటం, ఒక్కోసారి ఆబ్ స్ట్రాట్ ఊహలతో సోలిపోవటం అఫ్సర్ కవిత్వ శైలి. కాంక్రిట్, ఆబ్ స్ట్రాక్ట్ లు పక్కపక్కనే నిలబెట్టి ఇంతే కదా జీవితం అని మెటఫరైజ్ చేస్తాడు.
కవి అన్నవాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సత్యాన్ని జేబులో దాచుకొని రావాలి. ఒక కొత్త పదం, ఒక కొత్త వాక్యం, ఒక కొత్త పదచిత్రంగా బద్దలవ్వాలన్న రహస్యం తెలిసిన వాడు అఫ్సర్ అందుకనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఒక కంటిన్యూటీ, దృక్కోణం, స్వరం, తీవ్రతా స్పష్టంగా తెలుస్తూంటాయి.
అఫ్సర్ జీవనానుభవాల కవి. కళ, జీవితము పెనవేసుకుపోయిన జీవనానుభవాలు. ఇతని కవిత్వం ఎంత ఆర్థ్రంగా ఉంటుందో, ఇతరులపై వ్రాసిన ఎలిజీలు, భిన్న సందర్భాలకు వ్రాసిన సంఘటనాత్మక కవితలు కూడా అంతే తడితడిగా తగుల్తాయి.
afsar@40 కావొచ్చు గాక ఇప్పటికీ పసితనం, యవ్వనం పచ్చిపచ్చిగానే నిలుపుకొని అనుభవాలను కళ్లతో, చెవులతో, చర్మంతో, హృదయంతో లోలోపలకి పీల్చుకొని అక్షరాలుగా, వాక్యాలుగా పలవరించే మనకున్న మనసున్న మంచి కవి.
“అప్పటినుంచి ఇప్పటి దాకా” అఫ్సర్ కవిత్వం తప్పక చదవాల్సిన పుస్తకం. దాచుకొని మరలా మరలా చదువుకోవాల్సిన పుస్తకం.
బొల్లోజు బాబా
1/3/2020



ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ విజేత Louise Glück కవిత్వం

 ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ విజేత Louise Glück కవిత్వం

.
1968లో Louise Glück ఇరవైదేండ్ల వయసులో Firstborn అనే కవిత్వసంపుటిని వెలువరించింది. ఆమె కవిత్వం ఆనాటి సమకాలీన-ఆధునిక సరిహద్దులను చెరిపేస్తూ, సరళమైన భాష, తక్షణ జీవితానుభవాలు, సార్వజనీన అప్పీల్, కథనాత్మక శైలి, ఐతిహ్యసంబంధ, మానవవిషాదం, కన్ఫెషనల్ ధోరణి లాంటి అంశాలతో అందరినీ ఆకట్టుకొంది. ఆమె కవిత్వం ఆ తరువాతి కాలంలో మరింత చిక్కబడింది.
Louise Glück కవిత్వాన్ని ఇరవయ్యోశతాబ్దపు సాహిత్యప్రపంచంలో ఎక్కడ పెట్టాలి అని విమర్శకులు తర్జనబర్జన పడ్డారు. సాహిత్యవిమర్శలో ఒక కవిస్థానాన్ని అకడమిక్ గా, కళాపరంగా, చారిత్రాత్మకంగా మూల్యాంకనం చేయటంలో – అస్తిత్వరాజకీయాలు, వివిధ భావవాద స్కూల్స్, ఉద్యమాలు, శిబిరాలు నిర్ణయాత్మకంగా ఉండేవి. కానీ ఈమె కవిత్వం అన్నిరకాల వాదాలలో, ఉద్యమనేపథ్యాలలో, శిబిరాలలో- పగుళ్ళలోకి పరుచుకొనే పాదరసంలా ఒదిగిపోవటమే దానికి కారణం
వైయక్తిక అనుభవాలను మాత్రమే చెప్పే కన్ఫెషనిస్టు కవిత్వ ధోరణిని, తమ వర్గ సంస్కృతిని మాత్రమే కవిత్వీకరించే అస్తిత్వవాద ధోరణిని సమ్మిళితం చేసి ఒక సార్వజనీన కవిత్వపాయను లూయిస్ గ్లగ్ నిర్మించుకొన్నదని విమర్శకులు నేడు గుర్తించారు.
లూయిస్ కవిత్వంలో కోర్కెలు, ఆశలు, ప్రేమ, గాయాలు, దుఃఖం, వేదన, జీవనకాంక్ష, వ్యాఖ్యానం, ఆత్మకథనాత్మకత, ప్రకృతి, కాలం, దైవీకదర్శనం లాంటివి పదే పదే వచ్చే థీమ్స్. ఈమె కవిత్వంలో Social Prophecy కన్న Spiritual Prophecy అధికం. ఇది సమకాలీన కవిత్వరీతులకు భిన్నమైన స్వరం.
లూయిస్ తనను ఒక జ్యుయిష్ అమెరికన్ కవిగానో, ఒక స్త్రీవాద కవిగానో, ఒక ప్రాకృతిక కవిగానో గుర్తింపబడటానికి ఇష్టపడలేదు. “in-betweenness” తన లక్షణమని చెప్పుకొన్నది.
తనకవిత్వంలోని అనుభవాలన్నీ తనలోపలి అనుభవాలే తప్ప వెలుపలి అనుభవాలు కాదని లూయిస్ ఒకచోట విస్పష్టంగా పేర్కొంది.
***
Louise Glück వ్రాసిన కొన్ని కవితలకు నేను చేసిన అనువాదాలివి.
.
Lost Love by Louise Glück
నా సోదరి ఈ భూమిపై సంపూర్ణజీవితాన్ని జీవించింది
పుట్టింది, చనిపోయింది.
మధ్యలో
ఒక్క చూపు, ఒక్క వాక్యం ఇక్కడ విడిచివెళ్లలేదు
అందరు శిశువుల్లానే ఆమె కూడా ఏడ్చింది.
పాలు తాగ నిరాకరించింది
మా అమ్మ మొదట్లో తనబిడ్డ తలరాతను మార్చటానికి ప్రయత్నించింది
తరువాత చరిత్రను.
నా సోదరి చనిపోయాకా
మా అమ్మ హృదయం మెడకి వేలాడే ఇనుప బిళ్ళలా
చల్లగా గడ్డకట్టింది
నా సోదరిదేహం ఒక అయిస్కాంతంలా మారి
మా అమ్మ హృదయాన్ని భూమిలోకి లాక్కుని
అక్కడ దాన్ని తిరిగి మొలకెత్తించాలని యత్నించేదేమోనని
ఒక్కోసారి నాకు అనిపించేది.
పుట్టగానే చనిపోయిన తన సోదరిపై వ్రాసిన ఒక కవిత ఇది. చాలా సామాన్యమైన సంసారిక దుఃఖం ఇది. కానీ చెప్పనలవికాని మానవ వేదన. ఇది చావుని గ్లోరిఫై చేయటం కాదు. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన తల్లి ఉద్వేగానికి ఇచ్చిన అక్షర రూపం. ఈ కవితలో “తరువాత చరిత్రను” అన్న రెండు పదాలలో- ఆ తల్లి జరిగిపోయిన విషయాన్ని తలచుకొని ఎంతెలా దుఃఖించిందో అంతటి పెనువేదనా ఇమిడిపోయింది.
***
అర్ధరాత్రి - MIDNIGHT by Louise Glück
గాయపడ్డ హృదయమా! మాట్లాడు
ఎంత తెలివిమాలిన పనిచేస్తున్నావో నీకు అర్ధమౌతోందా
garage లో చెత్తమధ్య కూర్చొని ఏడుస్తూ ఉండటం.
అది నీపని కాదు. నీపని అంట్లుతోమటం
చిన్నతనంలో పెంకెతనం చూపినట్లుగానే ప్రవర్తిస్తున్నావు
నీ క్రీడా స్ఫూర్తి, ఉదాసీన వైఖరి ఎక్కడకు పోయాయి?
విరిగిన కిటికీ అద్దంపై వెన్నెల వాలింది
పలుచని వేసవి వెన్నెల
మెత్తని గుసగుసలతో భూమి తియ్యగా సిద్దమైంది--
నీ భర్తతో సంభాషించే పద్దతి ఇదా- ఫోన్ చేస్తే ఎత్తకపోవటం;
హృదయం గాయపడినప్పుడు garage లో ఒంటరిగా కూర్చోవటం?
నువ్వే నేనైతేనా... భవిష్యత్తు ఊహిస్తాను
మరో పదిహేనేళ్ళ తరువాత
ఏదో ఓ రాత్రి అతని గొంతుక అలసిపోతుంది;
నువ్వు ఫోన్ ఎత్తకపోతే, మరొకరు ఎవరో ఎత్తుతారు.
.
పై కవితలో లూయిస్ పలికించిన ఐరనీ అసమాన్యమైనది. కానీ ఇదే కఠినమైన జీవన వాస్తవికత. నీ పని అంట్లు తోమడం అనే వాక్యం ఈ కవిత మొత్తానికి గరిభనాభి లాంటిది. దాంపత్యజీవితంలో ఉండే ఇంటిమసీ ఒక నిషిద్ద వస్తువు స్త్రీవాదానికి సంబంధించి. దాన్నీ లూయిస్ గమ్మత్తుగా ఉపయోగించుకొందీ కవితలో. “in-betweenness” అంటే ఇదేనేమో!
***
Saints by Louise Glück
మా కుటుంబంలో ఇద్దరు సన్యాసినులు ఉండేవారు
మా మేనత్త, అమ్మమ్మ
కానీ వారి జీవితాలు భిన్నమైనవి
మా అమ్మమ్మ చివరివరకూ ప్రశాంతంగానే ఉండింది.
నిశ్చలజలాలపై నడిచే వ్యక్తిలా అనిపించేది
కారణాలు తెలియవు కానీ
ఏనాడు ఏ సముద్రపు అలలూ ఆమెను తాకలేదు
మా మేనత్త కూడా అదే మార్గంలో నడిచింది కానీ
ఆమెపై కెరటాలు ఉవ్వెత్తున విరుచుకుపడేవి
గాయపరిచేవి.
ఆత్మసంభంద విషయాలకు
విధి ఒక్కోలా స్పందిస్తుంది కాబోలు
మా అమ్మమ్మ జాగ్రత్తపరురాలు, సంప్రదాయవాది
అందుకే బాధలను తప్పించుకొని ఉంటుంది.
మా మేనత్త అన్ని కష్టాలు ఎదుర్కొంది
ఒక్కో కెరటం వెనక్కు వెళుతూ వెళుతూ
ఆమె ప్రేమించే ఎవరినో ఒకరిని తీసుకొని పోయేది.
అయినప్పటికీ
ఆమె సముద్రాన్ని ఒక దుష్టశక్తిగా అనుకోదు.
ఆమెకు సముద్రం ఒక సముద్రం అంతే.
తీరాన్ని తాకినప్పుడల్లా విలయాన్ని సృష్టించితీరాల్సిందే.
.
పై కవిత చాలా ఆలోచనల్ని కలిగిస్తుంది. సంప్రదాయక విలువలు గొప్పవని చెపుతోందా కవయిత్రి ఇక్కడ; సముద్రం దేనికి ప్రతీక కాలానికా, ఆధునికతకా, స్త్రీజీవితంలో ఎదురయ్యే పురుషునికా; . ఆత్మసంభంద విషయాలు ఏమిటి? (Original-which is how Fates respond to a true spiritual nature). ఎన్నిరకాల భాష్యాలు చెప్పుకొన్నా ఈ కవితలోని స్వరం భిన్నమైనది. సమకాలీన ధోరణులకు వ్యతిరిక్తప్రవాహం వంటిది
***
.
కలయిక - The Encounter by Louise Glück
నువ్వు మంచం వద్దకు వచ్చి కూర్చొని
నన్ను తేరిపారచూస్తూ
నా మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దాడతావు.
కరిగిన మైనం నుదిటిపై తెలుస్తుంది నాకు
అది అక్కడ ఒక మచ్చను మిగల్చాలి అని కోరుకొంటాను
నిన్ను ప్రేమించటం అంటే నాకంతే తెలుసు
ఎందుకంటే
దహింపబడి, ఏదో ముద్రవేయించుకొని
చివరలో దేన్నో పొందాలని వాంఛిస్తాను నేను...
నా దుస్తులు తొలగిస్తాను
నా చెక్కిళ్లపై ఎరుపుదనం
అలా నిప్పులదారిలో ప్రయాణించి
భృకుటిపై చల్లని నాణెమై కుదురుకొంటుంది.
అదే అనుభవాన్ని పొందిన నువ్వూ నా పక్కనే పడుకొని
నా ముఖాన్ని చేతులతో తడుముతావు
నేను నిన్ను ఎంతగా కోరుకొన్నానో
నీకూ అర్ధమౌతుంది
మనకు ప్రతీసారీ తెలుస్తూనే ఉంటుంది... నీకూ నాకూ
దీనికి సాక్ష్యం నా దేహమే.
.
తెలుగునాట ఇలాంటి మానవానుభవాల్ని వ్యక్తీకరించటాన్ని బూతుగా ముద్రలు వేసారు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా. ఇలాంటి అభివ్యక్తులను తీరిక వర్గాల కవిత్వంగా, సామాజిక స్పృహలేని ఉత్త కాల్పనిక సాహిత్యంగా ఇంకొంచెం ముందుకు పోయి దోపిడీ వర్గాలకు దోహదపడే కవిత్వంగా తీర్మానాలు చేసారు చాలామంది విమర్శకులు.
మానవానుభవాల్ని వ్యక్తీకరించటమే కవిత్వ లక్ష్యంగా, ప్రయోజనంగా నేడు ప్రపంచం గుర్తించింది. in-betweenness, inclusivity, simplicity నేటి కవిత్వరీతి. తెలుగు కవులు ఈ bastion ను అందిపుచ్చుకొంటారా ఇంకా తాము గీసుకొన్న వృత్తాలలోనే ఉండిపోతారా అనేది కాలమే తేల్చాలి.
బొల్లోజు బాబా

#కులపురాణం

 #కులపురాణం

Bolloju Baba
గారు ముందటి
Chilekampalli Kondareddy
గారు రాసిన జాంబవపురాణంపై పెట్టిన టపాలో ఇచ్చిన సమాధానం.
.
కులాలు పదో శతాబ్దం తరువాత వచ్చిన సామాజిక పరిణామం. అంతవరకూ అందరూ శూద్రులే (వేదకాలంనుండి ఊరివెలుపల ఉన్న చండాల, పుళింద/ట్రైబల్ వర్గాలు తప్ప). అందరిమధ్యా కంచం పొత్తు మంచం పొత్తు ఉండేది.
కులస్థిరీకరణ జరిగి కంచం పొత్తు మంచం పొత్తు ఆగిపోయాకా ఎవరి కుల ప్రాశస్త్యా న్ని చెప్పుకొనే పురాణాలు వారు రాసుకోవటం జరిగింది.
అదే సమయంలో ఈ విభజనలను వ్యతిరేకించే వీరశైవ ఉద్యమం వచ్చింది. పల్నాడు చాపకూడు ఉదంతం, వీరబ్రహ్మేంద్ర స్వామి భోధనలు సమాజాన్ని ఒక రకంగా అంచెల వ్యవస్థ అయిన హిందూ ధర్మాన్ని అతలాకుతలం చేసాయి. సవాల్ చేసాయి.
ఇదే సమయంలో భిన్న కులాలమధ్య సమన్వయం కొరకు హిందూ మతం ఇలాంటి కులపురాణాలను పుట్టించి ఉండొచ్చు తెలివిగానో లేక సహృదయంతోనో ఈనాడు చెప్పలేం..... ప్రతి కులాన్నీ ఇంకో కులంతో ముడివేయటం జరిగింది.
ఈ ముడివేయటం అనేది పై గాథలో చూడవచ్చు. సమాజంలో పైతరగతిలో ఉండే బ్రాహ్మణుల ఇంట పెండ్లికి (కోమట్లకు కూడా) మాదిగ కులస్తుని అవసరం ఉండేలా లింక్ చేసింది. ఒక్క మాదిగే కాదు మన హిందూ సంస్కృతిని గమనిస్తే ప్రతి కులంలోని ఇంట్లో జరిగే శుభ, అశుభ కార్యాలకు మాల, మాదిగ, మంగలి, చాకలి, కంసాలి, కుమ్మరి లాంటి వారి ప్రమేయం లేకుండా జరగకూడదనే ఆచారాల్ని సృష్టించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఇతర ప్రతిఒక్కరి అవసరం ఉండేలా అందరినీ సంప్రదాయాలు/ఆచారాలు పేరిట ముడివేసారు. ఆఖరుకు అడుక్కుతినే హక్కు కలిగిన కులం, దొంగతనాలు చేసుకొనే హక్కుకలిగిన కులం లాంటివి కూడా ఉండటం దీనికి పరాకాష్ట.
ఈ close knitted వ్యవస్థ - కులవృత్తులు ఉండే అతి చిన్న యూనిట్ అయిన గ్రామాలలో ఒకప్పుడు సమర్ధవంతంగానే పనిచేసింది.
ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవంతో కులవృత్తులు పోయాయో సమాజంలోని మనుషులందరూ సాఫుగా తాపీ చేయబడి సమానం అయిపోయి.... ఇలా కులాలుగా మిగిలిపోయాం. ఎక్కువతక్కువలతో. ఎవరి అవసరం ఎవరికీ లేదీనాడు.
నా ఉద్దేశం ఇక్కడ పుట్టుకతో ఎక్కువతక్కువలు నిర్ణయించే కులాలు ఉండాలని కాదు... ఉపాధులు, స్వావలంబనా జీవనాలు పోయాయని. రెండిటికీ చాలా తేడా ఉంది.
ప్రతీ కులపురాణం అందరినీ కలిపి ఉంచుతూ, స్వాభిమానాన్ని పెంచే "కథలుగా అనిపిస్తాయి నాకు.

బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి?!

 

బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి?!

మూలం: లూయిస్ గ్లుక్

 

అతడు రెండువారాలుగా ఆ అమ్మాయినే గమనిస్తున్నాడు

తరచూ ప్లాజాకు వచ్చే ఆ అమ్మాయిని.

బహుశా ఇరవైలలో ఉంటుందేమో ఆమె.

మధ్యాహ్నం వేళ కాఫీతాగుతూనో,

తన చామనఛాయ మొఖంతో ఏదో పత్రికలోకి తొంగిచూస్తూనో కనిపించేది.

సిగరెట్లో లేదా ఏ పూలబొకేనో కొనే నెపంతో అతడు

అక్కడే తచ్చాడుతూ దూరంనుంచి ఆమెనే గమనించేవాడు

 

తాను అబలనని అనుకొనేదామె అంతవరకు

అతని ఊహాలోకపు అవసరాలకు ఆమె జతపడటంతో

ఆమె మహాశక్తివంతురాలయింది.

ఇపుడు అతడు ఆమెకు బంధీ.

అతడు బహూకరించిన పదాలను

అతను ఊహించుకొన్న స్వరంతో మెత్తగా, ముద్దుముద్దుగా పలికేది

 

క్రమేపీ ఆమె అతణ్ణి గుర్తుపట్టేది, ఎదురుచూసేది

ప్రతీరోజు తలస్నానం చేసి అలంకరించుకొని వచ్చేదేమో కూడా.

ప్లాజాలో ఇదివరకట్లా తలదించుకొని కాక

గుమ్మం వైపు పదే పదే చూసేది.

ఆ తరువాత వారిద్దరూ ప్రేమికులు అయ్యారు.

 

ఇది ఇంత తొందరగా జరుగుతుందని అతనుకూడా ఊహించి ఉండడు.

ఆమె తనని తాను అతనికి అర్పించుకొన్న మరుక్షణం

అతని శరీరంపై, అతని ఉద్వేగాలపై ఆమె  చేస్తున్న అధికారం

ఒక్కసారిగా అంతమైంది.

 

ఆమె మాత్రం ఒక స్త్రీ మొదటిసారిగా ప్రేమలోకి నడిచిన క్షణాలలోకి

కొంచెంకొంచెంగా ముడుచుకుపోయింది.

నీడకూడా లేని వ్యక్తిగా, ఈ లోకానికి చెందనిదానిలా అక్కడే ఉండిపోయింది

అతనికి ఇంకేమాత్రం ఉపయోగపడప్పుడు

ఆమె బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి.

***

ఈ కవితచదివాకా నా మూడుదశాబ్దాల పఠనానుభవం ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది.  ఇది పెసిమిజమా? సినిసిజమా? నార్సిసిజమా? ఏమో తెలియలేదు నా శక్తి సరిపోలేదు తేల్చుకోవటానికి.

ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమైంది.  ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి సంపూర్ణంగా అర్పించుకోవటం అనేది ఆత్మవినాశనానికి దారితీస్తుంది అని,  అలా అర్పించుకోవటం ద్వారా వచ్చే అధికారం శాశ్వతంగా నిలిచిఉండదని. అది భౌతికం కావొచ్చు, మానసికం కావొచ్చు.  చలం చెప్పిన ఆత్మలోకంలో దివాళా లాంటిది.

అతని ఊహాలోకపు “అవసరాలకు” ఆమె జతపడటం, ముద్దుముద్దుగా,  అర్పించుకొన్న మరుక్షణం అధికారం అంతమవ్వటం, ముడుచుకుపోవటం,  ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఎన్నెన్ని కిటికీలను తెరిచే వాక్యాలివి.   జెన్యూన్ మానవోద్వేగాలు ఎంతబలంగా చెప్పబడ్డాయీ! “మోజు తీరాకా వదిలేసాడు” అనే సామాన్యవాక్యాన్ని  కళాత్మకంగా చెబుతూనే ఎంత విశాలమైన కాన్వాస్ ను పరచిందీ!

*

 

Avatar

బొల్లోజు బాబా

పాతికేళ్ల ఏళ్ళ జర్నీ



పాతికేళ్ళ ప్రస్థానం
చదువు పూర్తయ్యాక యానాం ప్రభుత్వడిగ్రీకళాశాలలో కొన్నాళ్ళు తాత్కాలిక లెక్చరర్ గా పనిచేసాను. ఆ తరువాత అనేక పాత్రలు అనేక ఊర్లు. ఇటీవల ఆ కాలెజ్ కు వెళ్లాను. పాతికేళ్ళ క్రితం తీయించుకొన్న ఫొటో వద్ద అదే చోట్లో, కొత్తఫొటో.
కాలం తెలియకుండానే భలే జారిపోయింది అనిపించింది. ముసుగులు, ముడతల మాటున ఆ నవ్వు నేడు కనిపించదు. దేహం నెమ్మదిగా శిథిలమౌతోంది.
.......there is still fire in your tombs - Neruda. ఏమో ఆనాటి నిప్పు ఇంకా లోలోపల ఉందేమో... ఉందని అనుకోవాలేమో!












థాంక్యూ కవిసంగమం

 


Imported post: Facebook Post: 2020-11-13T11:12:39

మొదటి కలయికలో వారిచ్చిన గాఢాలింగనాన్ని మరచిపోలేను ఎన్నటికీ..... బాధగా ఉంది ఈ నిష్క్రమణ