Friday, November 13, 2020

నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం



నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం
(ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్ట్ చేద్దామనిపించింది, థాట్ కంటిన్యూటీ ఉండాలని… ఇలా)
అఫ్సర్ తాను నలభై ఏళ్ళుగా వెలువరించిన కవిత్వాన్ని “అప్పటినుంచి ఇప్పటి దాకా” పేరుతో ఇటీవల పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. దీనికి రాసుకొన్న ముందుమాటలో “వొక కవి రాస్తున్న కవిత్వమంతా, వొకే గాటన కట్టేయడం కుదురుతుందా?” అని ప్రశ్నిస్తాడు. 660 పేజీల ఈ సంపుటిని చదివినతరువాత కూడా పై ప్రశ్నకు అవుననో కాదనో సమాధానం దొరకదు. అందునా శిల్పరీత్యా, వస్తురీత్యా, అభివ్యక్తిరీత్యా నిత్యచలనశీలత కలిగిన అత్యాధునికుడైన అఫ్సర్ లాంటి కవి గురించి చెప్పటం మరీ కష్టం. ఈ మొత్తం బృహత్ గ్రంధాన్ని చదివినపుడు మాత్రం ఆ కవితలన్నింటినీ కలుపుతున్న కనిపించని దారాలేవో లీలగా తారాడుతాయి.
ఆధునిక కవిత్వం వైయక్తికంగా ఉంటూనే వేదనను పలికించటం ప్రధానలక్షణంగా కలిగి ఉంది. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని విమర్శకులు విభజించారు. ఈ తరహా కవిత్వంలో కవి తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచి కొన్ని రాజకీయ, సామాజిక సత్యాలను ఆవిష్కరిస్తాడు. అంటే ఆ కవిత్వం ఏకకాలంలో వైయక్తికము, సామాజికమూ అవుతుంది. కన్ఫెషన్ అంటే పూర్తిగా కవికిమాత్రమే సంబంధించిన ఒక అనుభవాన్ని సమాజపరం చేయటం. ఈ చేసే క్రమంలో ఈ సమాజం ఎలా ఉండాలని ఆశించాడో, ఎలా ఉందో అనే భిన్న అంశాల మధ్య వైరుధ్యాలను వెలికి తీస్తాడు.
అఫ్సర్ తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించాడు. ఆ కోణం లోంచి చూసినపుడు అఫ్సర్ Confessional Poet గా కనిపిస్తాడు.
ఏది వ్యక్తిగతమూ, ఏది సామాజికము అని సరిహద్దులు చెరిపేస్తుందీ నాలుగు దశాబ్దాల కవిత్వం. చారిత్రిక, రాజకీయ, సామాజిక వాస్తవాలు వ్యక్తిగత సర్కిల్ ను దాటి ఆధునిక మానవ జీవితాన్ని పోతపోసాయి.
అస్తిత్వం కోసం చేసిన అన్వేషణలో ఈ కవిత్వం స్థానీయత పరిధులను దాటిన మానవ అస్తిత్వవేదనను బలంగా ప్రతిబింబించింది. ఇది లోపలనించి మొదలై వెలుపలి సామాజిక వాస్తవికతతో తలపడుతుంది. వ్యాకులత, దుఃఖం, నిస్సహాయత, ధిక్కారం, పరాధీనత, శాంతికాముకత లాంటి ఉద్వేగాలు అంతర్లీనంగా వాక్యాల వెనుక ప్రవహిస్తూంటాయి.
1. మెటొనిమీ అఫ్సర్ కవిత్వ బలం
నలభై ఏళ్ళలో అఫ్సర్ కవిత్వం పొందిన పరిణామం - శిల్పరీత్యా సాంద్రపడటం, వస్తురీత్యా సార్వజనీనతను పొందటం, మానవానుభవం సహజత్వాన్ని సంతరించుకోవటం.
అతనే వినిపించకపోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లిగా కదిలి తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకమై
నడుస్తున్న నిన్ను వెంటాడి వేదిస్తుంది
రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా (సైగల్ – 1985)
వొక మేఘఘర్జననీ
యింకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెనువాన//
ప్రాణం ఉగ్గబెట్టుకొన్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకొన్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేదాకా, నా జహాపనా (భూపేన్ హజారికా కొరకు -2018)
సుమారు ముప్పై అయిదు సంవత్సరాల వ్యవధితో ఇద్దరు గాయకుల గురించి రాసిన కవితా వాక్యాలివి. సైగల్ కవితలో “తిలక్ తనం” కనిపిస్తుంది. అందం, ఆనందం పరమావధిగా ఉంది. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా పై ఇటీవల వ్రాసిన వ్రాసిన ఆ రెండో కవితలో శిల్పం సాంద్రపడింది. పాటను మేఘఘర్జన, గుండెపగులుల సమ్మేళనం, లోపలి వాన అంటూ మెటఫరైజ్ చేయటం టాప్ క్లాస్ వ్యక్తీకరణలు. ఎడతెగని దుఃఖం, వ్యాకులత నిండిన కవి మనఃస్థితిని “పెనువాన”, “చీకటిపరుగు” లాంటి పదాలు సూచిస్తున్నాయి. ఇదంతా అఫ్సర్ నలభై ఏళ్ళలో “తిలక్ తనం” నుంచి “అఫ్సర్ తనం” వరకూ చేసిన ప్రయాణం.
***
అఫ్సర్ డిక్షన్ లో సిమిలీ కన్నా ఇమేజెరీ, మెటాఫర్ కన్నా మెటొనిమీ ప్రముఖంగా కనిపిస్తుంది. “ఏకాంతం” అనే కవితలో ఏకాంతపు స్థితికి “గది” ని మెటొనిమీ (ప్రతీకాత్మకత) చేస్తాడు.
//లోనికి రమ్మని
చేతులు చాస్తుంది గది//
ఎంతకీ చేతులు వెనక్కు లాక్కోదు గది
గదిగోడల మీద అక్కడక్కడా నెత్తుటి మరకలు/
గది నాకంటే వొంటరిదనుకోను
నాకోసమే చేతులు చాచాల్సిన
అవసరమూ లేదు// (ఏకాంతం – 1985)
పై కవితలో గది అన్న పదం చోటులో ఏకాంతం అన్నపదం ఉంచుకొని చదువుకొన్నప్పుడు ఈ కవిత సౌందర్యం అర్ధమౌతుంది. ఇక్కడ కవి, ఏకాంతగది అనో గదిఏకాంతమనో మెటఫరైజ్ చెయ్యడు. ఏకాంతం అనే కవితా వస్తువును గదితో మెటొనిమీ చేసాడు. కవితను విప్పే తాళం చెవి టైటిల్ లో ఉంచాడు.
మెటొనిమీ అనేది అత్యున్నతమైన ఒక కవిత్వీకరణ పనిముట్టు. అందుకనే కవిత్వం “మెటఫర్ నుండి మెటొనిమీకి ప్రయాణించాలి” అంటాడు మో. ఈ మొత్తం కవితలను చదివాకా అఫ్సర్ కవిత్వబలం మెటొనిమీ లోనే ఉందనిపిస్తూంటుంది. ఈ మెటొనిమిలో ఉన్న ప్రమాదం ఏమిటంటే కవి ఉద్దేశించిన ప్రతీకను పాఠకుడు గుర్తించలేకపోయినట్లయితే అది అయోమయానికి దారితీస్తుంది. అఫ్సర్ కవిత్వంపై ఈ తరహా విమర్శ లేకపోలేదు.
2. అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం
ప్రతీ కవికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. అజంతా కవిత్వంలో మృత్యుఊహలు, ఇస్మాయిల్ కవిత్వంలో పిట్ట, చెట్టు ప్రస్తావనలు వంటివి. అఫ్సర్ కవిత్వంలో కూడా “మాట-మాట్లాడు కోవటం, వాన-వర్షించటం” లాంటి విషయాలు పదే పదే వస్తూంటాయి. వచ్చిన ప్రతీ సారీ కొత్త అర్ధంలో, కొత్త కోణంలో, కొత్త మెటానొమికాభివ్యక్తితో దర్శింపచేయటం కవి ప్రతిభ. చాలా చోట్ల “మాటను” ను లోపలిప్రపంచానికి; “వాన” ను బయటిప్రపంచానికి ప్రతీకలుగా చేయటం గమనించవచ్చు.
మాటలకేం,
ఇసుకవేసినా రాలనన్ని మాటలు//
ఎటుచూసినా మాటల వర్షమే
కుంభవృష్టి కురుస్తున్నా
నా మీద ఒక్కచినుకూ తడవదే/
ఈ మాటల ఊరేగింపులో
నా మాటెవరికీ వినిపించదే!/
నా గొంతులో మాటుకాసి
మాటని ఎవరో నులిమేస్తున్నారు/
నా లోపలి మాట మూడంకె వేసింది (నాకు మాటివ్వండి – 1991).
చుట్టూ కుండపోతగా కురిసే మాటల వర్షంలో తడుస్తున్న కవికి సొంత మాటలు మూగపోయాయి అంటున్నాడు. చలం చెప్పిన అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం ఇది. ఊహకు వాస్తవానికి మధ్య దూరాన్ని ఈ కవిత పట్టుకొంటుంది. కవిత చివర్లో “గుండెకు సిజేరియన్ చేసైనా సరే ఒక స్వచ్ఛమైన శిశువులాంటి మాట” ఒకటి కావాలంటాడు కవి.
మాటకి
అక్షరానికి
చెమట చేతుల మోటుదనం కావాలిక!// (యానాం వేమన ఏమనె-1992).
కవిత్వం మట్టివాసనను, కన్నీటి జాడలను ప్రతిబింబించాలని అంటున్నాడు. తెలుగు దళితకవిత్వాన్ని చిక్కబరచిన “చిక్కనవుతున్న పాట” రావటానికి మూడేళ్ల ముందు రాసిన వాక్యాలివి. అఫ్సర్ తన కాలానికి చాలా ముందే ఉన్నాడనటానికి “యానాం వేమన ఏమనె” కవిత చక్కని సాక్షిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిన దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.
మాట రాలిపోయినపుడే
కవిత్వమంతా శిథిలమయిపోయింది (వొకానొక అసందర్భం 2009). ఇక్కడ మాటను వాస్తవం చెప్పటం అనే అర్ధంలో వాడతాడు కవి. వాస్తవాన్ని కప్పిపుచ్చే కవిత్వం మృతప్రాయం అని చెపుతున్నాడు.
అనేక కవితల్లో స్వీయ అస్తిత్వానికి, వ్యక్తీకరణకు, ఆలోచనలకు, అంతర్మధనానికి మాటను పర్యాయపదం చేయటాన్ని గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు…
*/లోగొంతుకల్ని/తోడిపోసే చేదలేదుగా చేతుల్లో/వొక తెగిపడిన మాటనో/వొక రాలిపడిన కేకనో/ తెగనరక్కు దేన్నీ (తెగిపడేవి మాటలే -2009)
*/మాటలొ ఏముందనుకుంటాం కానీ/మాటలోనే అంతా వుంది/అన్నిట్నీ కప్పడం నేర్పుతుంది/దుఃఖం సంతోషంలాగ/సంతోషం దుఃఖంలాగ/అసహనం సహనంలాగ/ ద్వేషం ప్రేమలాగా పలుకుతుంది. (పసి కాళ్ళు నీవీ నావీ)
*/నిండు చీకట్లో/నిలువెత్తు మల్లెలా/నడుచుకుంటూ వస్తావు నువ్వు. పడవనిండా కొన్ని మాటలూ/ఇంకా కొన్ని అరవిరిసిన నవ్వులూ నింపుకొని (గట్లు తెగినాక -2013)
*/నిజానికి మాటలసంచీ ఖాళీ అవ్వనే అవ్వదు/అయినా సరే/వెళ్ళిపోవాలి కదా/తలోదారి తలోదిక్కూ తలో రెక్కా అయిపోయి (వుండనా, మరి – 2015)
కవిగా అఫ్సర్ వ్యక్తీకరణలో కనిపించే మరొక అబ్సెషన్ ‘వాన’. తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలకు వానను ప్రతీకాత్మకంగా వాడుతున్నాడని అర్ధమౌతుంది.
వాన వెలిసిన చీకట్లో
అతని చివరిస్నానం గురించి ఆలోచిస్తో వస్తున్నాను
కడిగిన ముత్యంలాంటి
అతని వొంటిమీద ఎండిన నెత్తుటి చారికలగురించి
మానని గాయాల తెరుచుకున్న నిజాలగురించి
వొళ్లంతా కళ్లయిన ఎదురుచూసిన తల్లిగురించి
పదహారేళ్ళ కాళ్ళకింద హఠాత్తుగా చీలిపోయిన భూమిగురించీ// (చివరి స్నానం -1997).
మత కలహాలలో చంపబడ్డ యువకుని గురించిన కవిత అది. గంభీర విషాదంగా సాగుతుంది. కవిత “వాన వెలిసిన చీకట్లో” అంటూ మొదలౌతుంది. ఇక్కడ వానను లోకం సాగించిన మారణకాండకు ప్రతీకచేయటాన్ని గమనించవచ్చు.
భిన్నకాలాలలో, భిన్న సందర్భాలకు వ్రాసిన అనేక కవితల్లో వాన ప్రస్తావన చేసినచోటల్లా ఖాళీల్లోకి పాదరసం బిందువులు కుదురుకున్నట్లుగా ఒదిగిపోవటం గమనిస్తాం. ప్రతీచోటా బయటజరుగుతున్న విషయాన్ని చెప్పటానికి వానను ప్రతీకగా వాడుకొంటున్నట్లు అర్ధమౌతుంది. కొన్ని ఉదాహరణలు…
*/ఎన్ని వానలు చూళ్ళేదనీ?/ప్రతీవానా/మళ్ళీ అదేదో కొత్తవాసనేస్తుంది (సగమే గుర్తు – 2006)
*/చడీ చప్పుడూ లేకుండా/అలా కురుస్తూనే వుంది వాన/ఎప్పుడు ఎలా కురిసినా వొకేలా వుండటమే తెలుసు వానకి (నీరెండలో వూరు – 2008)
*/యీ వానా యీ జీవితం/నన్ను యెంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను/ వానకు కురవటం వొక్కటే తెలిసినట్టు/నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు (నీదికాని వాన -2013)
*/అక్కడ నువ్వు యింకా కురుస్తున్నావో లేదో కాని/యిక్కడ నేనింకా తడుస్తూనే వున్నాను (అక్కడి వానలో నేను -2015)
*/తొలకరివాన/కొండల్ని తలబాదుకునీ బాదుకునీ/ఏడుస్తుంది/వితంతువులు/ చేతులారా గాజులు పగలగొట్టుకొంటున్నట్టు ( శ్రీనగర్ లో మొహర్రం )
ఒక కవి నలభైఏళ్ళపాటు వ్రాసిన సుమారు 600 పేజీల కవిత్వంలో పదే పదే వచ్చిన ఒక పదాన్నో, పదబంధాన్నో వెలికితీసి చూపటం మర్యాదకాకపోవచ్చు. కానీ చెప్పిన ప్రతీచోటా కవి కొత్తగా చెప్పాడని, ఆయా సందర్భాలకు అద్భుతంగా సింక్ చేసాడని, అక్కడ ఆ పదాలు తప్ప వేరే పదాలు పొసగవనే సంగతి చెప్పటానికే ఇదంతా.
3. నలభై ఏళ్ళ వర్తమానం
అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. అఫ్సర్ కవిత్వం పట్ల ప్రధానంగా వినిపించే విమర్శ సంక్లిష్టత.
ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు.
*/ఉన్నచోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని/ఎక్కడెక్కడో అంటీముట్టని బట్టలా/ విసిరేయొద్దంటాను/నా నవ్వులు నా ఏడ్పులూ/నా అవమానాలు నా అనుమానాలు/నా మానభంగాలు హత్యలూ/అన్నీ మీవి కూడా అంటాను (నాకే జన్మభూమీ లేదు)
*/ఒకే ఆకాశం గొడుగు కింద/మనిద్దరం/నీకో సగం నాకో సగం కాదు/అంతా మనకోసమే//ఇక్కడే/ ఈ ఆకాశం కిందనే నన్నుండనివ్వు (ఆకాశం వొడిలో) -- అనే వాక్యాలలో ఈ కవి నేను ఈ దేశానికి చెందినవాడినే, నేను అన్యుడను కాను నేనూ మీలోని వాడినే నన్నువేరుగా చూడకండి అన్న వేడికోలు స్పష్టంగా వినిపిస్తుంది.
*సరిహద్దులు లేవు లేవు నాకు అని/రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని/భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని/నడుస్తూ పరిగెత్తుతూ వుంటా// నమ్మరా నన్ను నమ్మరా/ నా పేరుచివర మహమ్మదో అహమ్మదో షేకో/సయ్యదో/ ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా// అనే వాక్యాలలో పలికే విషాదం తన అనన్యతను నిరూపించుకోవటం కొరకు కవి పడుతున్నవ్యధను వ్యక్తీకరిస్తాయి.
*/పచ్చపచ్చని నా వొంటిమీద/రాజకీయాలు చేస్తున్నప్పుడు/యా అల్లాహ్/కనీసం నన్ను బతికించలేకపోయావు/కనీసం నీ కళ్ళయినా చమర్చాయా? (ఒక ఖడ్గం స్వగతం -1996) అంటూ దేవుడినే ప్రశ్నిస్తాడు ఒక నిస్సహాయ స్వరంతో.
ఇలాంటి కవితలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమూహపు Psyche ను నిక్షిప్తం చేస్తాడు. ఇవి ఆయా స్థలకాలాదులకు సంబంధించిన ఆ సమూహపు రాజకీయ అభిప్రాయాలుగా భావించవచ్చు.
4. హిస్టారికల్ నేరేటివ్
అఫ్సర్ ఇంతవరకూ వెలువరించిన రక్త స్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర, ఇంటివైపు అనే అయిదు కవితాసంపుటులలోని కవితలను ఈ సమగ్ర సంపుటిలో పొందుపరిచారు. ఈ కవితలను అన్నింటిని ఏకబిగిని చదివినపుడు ఒక Historical narrative అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ నేరేటివ్ లో నాలుగు దశాబ్దాల అభిరుచులు, పఠనాసక్తులు, రాజకీయ, సామాజిక నేపథ్యాలు పరిస్థితులు ఉంటాయి. ఒక పరిణామ క్రమం లీలగా గోఛరిస్తుంది.
1985 లో వచ్చిన “రక్తస్పర్శ” కవితలలో ముస్లిం అస్తిత్వవాద కవితలు కనిపించవు. అలాగని అప్పట్లో మతవాదం లేదని చెప్పలేం కానీ ఆ తరువాత కాలమంతటి కల్లోలంగా లేదనవచ్చు; కనీసం కవిత్వానికి సంబంధించి.
1992 బాబ్రి మసీదు విధ్వంసానికి ముందు జరిగిన హిందువుల పోలరైజేషన్ ప్రక్రియను “ఇవాళ” కవితా సంపుటిలోని కర్ఫ్యూ, సంక్షోభగీతం, ఇదే నా జాతీయగీతం, గాంధీగారి రెండో చెంప, దూరం, నాకు మాటివ్వంటి వంటి కవితలు వ్యక్తీకరిస్తాయి.
“మనసారా అందర్నీ ప్రేమిస్తానని మాటివ్వబోతాను/నా కళ్ళమీద ఒక పంజాబ్ మరో మీరట్/తీతువుల్లా వాలిపోతాయి// అనే వాక్యాలద్వారా ఒక శాంతికాముక ముస్లిం కోరుకొనేదేమిటో, పొందుతున్నదేమిటో; విస్పష్టంగా చెపుతాడు అఫ్సర్.
మతరాజకీయాలు పెచ్చరిల్లుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవటంలో విఫలమైన కమ్యూనిష్టుపార్టీలపై చేసిన విమర్శను “దేవుడు మరణించలేదు” అనే కవితలో గమనించవచ్చు.
“ఇవాళ” సంపుటిలోని- చిన్నప్పటి సంగీతం, చిన్నప్పటి చెరువు లాంటి కవితల్లో కవి నాస్టాల్జియాలోకి జారిపోతాడు నిస్సహాయుడై.
ఆ తరువాత 1999 లో “వలస” సంపుటి వచ్చినకాలం కల్లోలభరితం. అస్తిత్వవాద ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. అగర్ జిందో మె హై, ఇఫ్తార్ సైరన్, ఉష్ మాన్, నాకే జన్మభూమీ లేదు, రెండో విభజన, అజా, నహి మాలూమ్ లాంటి కవితలలో తన మైనారిటీ అస్తిత్వాన్ని నిర్ధ్వంద్వంగా చెప్పుకొన్నాడు. అలాగని అఫ్సర్ కవిత్వంలో రక్తం వచ్చేలా ముక్కుబద్దలు కొట్టేలాంటి మైనారిటీ కవిత్వవాక్యాలు కనిపించవు. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటంద్వారానే ఒక వాదాన్ని పలికించాలనుకోవటం ఇతని విధానం కాదు. చెప్పిందంతా ఒక ఆత్మనివేదనగానే చెప్పాడు. మతం పేరుచెప్పి మనిషి చేసే తప్పించుకోలేని తప్పిదాలను ఒక అండర్ స్టేట్ మెంట్ లా సటిల్ గా ఆవిష్కరిస్తాడు. ఇది అఫ్సర్ ను ఇతర మైనారిటీ కవులనుండి వేరుచేస్తుంది.
మనువాదపోకడలను ఎదుర్కోవటానికి దళిత, ముస్లిమ్ ల ఐఖ్యతను నేడు చాలామంది కోరుకొంటున్నారు. కారం చేడు దాడులపై వ్రాసిన “ఊరవతలి దుఃఖం”, దళితుల శిరోముండనం పై వ్రాసిన “శిరోముండనం” లాంటి కవితలద్వారా దళిత, ముస్లిం ల ఐఖ్యతను తొంభైలలోనే ప్రతిపాదించాడు అఫ్సర్.
2009 లో వచ్చిన “ఊరిచివర” సంపుటి నాటికి సమాజం ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధికవిధానాలు, చిక్కబడిన మతరాజకీయాలతో సంక్షుభితమై ఉంది. పొట్టచేతపట్టుకొని చేసే వలసలు అనివార్యమయ్యాయి చాలామందికి. అందుకే ఇలా అంటాడు “కడుపే దేశం/ఎంగిలి మెతుకే కల//వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికైనా/ఎడారి దేహంలోకి రాకుండా!/దేహం/ఇసుక దిబ్బ కాకుండా// అని.
ఇదే కాలంలో ఉవ్వెత్తున లేచిన తెలంగాణా ఉద్యమంతో అఫ్సర్ ఆ ప్రాంత కవిగా మమేకమయ్యాడు. తెలంగాణ 2002, తెలంగాణా 2009 కవితల్లో తెలంగాణా ఆత్మను పలికించాడు.
మెరుగైన ఉపాధికొరకు అమెరికా వెళ్ళాకా అక్కడినుంచి అంతర్జాతీయంగా వివక్షకు గురౌతున్న ముస్లిం అస్తిత్వాన్ని దర్శించాడు. తానొక దేశద్రిమ్మరి గా అభివర్ణించుకొన్నాడు “జంగమం” అనే కవితలో.
నల్లా నల్లాని నవ్వు, “డౌన్ టౌన్-కొన్ని స్వగతాలు” “తోలుమందం” లాంటి కవితలలో అమెరికాలో వర్ణవివక్షను అనుభవించే నల్లజాతీయుల వేదనతో సహానుభూతి చెందాడు.
2018 లో వచ్చిన “ఇంటి వైపు” సంపుటిలో చిత్రంగా ఏదో వ్యాకులత, ఇంటివైపు బెంగ నిండిన కవితలు కనిపిస్తాయి. నాస్టాల్జియా పొంగిపొర్లుతుంది. ఎక్కువ కవితలు గుండెలు పిండే నేరేటివ్ పద్దతిలో నడుస్తాయి. కొన్నింటిని ప్రేమకవితలుగా పోల్చుకోవచ్చు. కవిగా మరింత మార్మికతలోకి జారిపోయాడు. సందర్భాలకు రాసిన కవితలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలామట్టుకు కన్ఫెషనల్ పొయెమ్స్. ఇది పరిణితా లేక అలసిపోవటమా అనే సందిగ్ధం కలుగుతుంది.
మొత్తంమీద ఆరువందల పేజీల కవిత్వంలో కనిపించే హిస్టారికల్ నేరేటివ్- కవి జీవించిన సమాజాన్ని, జీవితాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
ముగింపు
నాలుగు దశాబ్దాలుగా కవిత, వ్యాసం, కాలమ్, ఎడిటర్, విమర్శ ఏదో రూపంలో అక్షరమై మనకు అనేక దారుల్లో అఫ్సర్ ఎదురవుతూనే ఉన్నాడు.
ఆధునికజీవనంలో అనివార్యమౌతున్న వలసలు, విచ్చిన్నమౌతున్న మానవసంబంధాలు, వివిధ జీవనో ఉద్వేగాలను ఒక కవిగా పలికిస్తూనే, ఒక ముస్లిం కవిగా తన అస్తిత్వాన్ని, సమకాలీన రాజకీయ యవనికపై తనసమూహానికి జరుగుతున్న అన్యాయాలను పదునుగానే పలికించాడు.
Exile లో ఉంటూ కూడా తన మూలాల్ని, సంస్కృతిని, వ్యక్తుల్ని చెరిపేసుకోలేదు. నిజానికి ప్రవాసంలోనే మూలాల విలువ అర్ధమౌతుంది. ఇతనికి జ్ఞపకాలే ఏకకాలంలో వర్తనమానము భవిష్యత్తూ కూడా.
ఈ ప్రపంచాన్ని మెదడు పాయింటాఫ్ వ్యూ లోంచి, హృదయం పాయింటాఫ్ వ్యూ లోంచి దర్శించటం అఫ్సర్ కవిత్వ ప్రయాణం. సత్యాన్ని ఆవరించి ఉన్న నివురుపొరలను ఒక్కొక్కటి వొలుచుకొంటూ నిప్పులపై నడుస్తాడు. ఒక్కోసారి కాంక్రీట్ వ్యక్తీకరణలతో జ్వలించటం, ఒక్కోసారి ఆబ్ స్ట్రాట్ ఊహలతో సోలిపోవటం అఫ్సర్ కవిత్వ శైలి. కాంక్రిట్, ఆబ్ స్ట్రాక్ట్ లు పక్కపక్కనే నిలబెట్టి ఇంతే కదా జీవితం అని మెటఫరైజ్ చేస్తాడు.
కవి అన్నవాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సత్యాన్ని జేబులో దాచుకొని రావాలి. ఒక కొత్త పదం, ఒక కొత్త వాక్యం, ఒక కొత్త పదచిత్రంగా బద్దలవ్వాలన్న రహస్యం తెలిసిన వాడు అఫ్సర్ అందుకనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఒక కంటిన్యూటీ, దృక్కోణం, స్వరం, తీవ్రతా స్పష్టంగా తెలుస్తూంటాయి.
అఫ్సర్ జీవనానుభవాల కవి. కళ, జీవితము పెనవేసుకుపోయిన జీవనానుభవాలు. ఇతని కవిత్వం ఎంత ఆర్థ్రంగా ఉంటుందో, ఇతరులపై వ్రాసిన ఎలిజీలు, భిన్న సందర్భాలకు వ్రాసిన సంఘటనాత్మక కవితలు కూడా అంతే తడితడిగా తగుల్తాయి.
afsar@40 కావొచ్చు గాక ఇప్పటికీ పసితనం, యవ్వనం పచ్చిపచ్చిగానే నిలుపుకొని అనుభవాలను కళ్లతో, చెవులతో, చర్మంతో, హృదయంతో లోలోపలకి పీల్చుకొని అక్షరాలుగా, వాక్యాలుగా పలవరించే మనకున్న మనసున్న మంచి కవి.
“అప్పటినుంచి ఇప్పటి దాకా” అఫ్సర్ కవిత్వం తప్పక చదవాల్సిన పుస్తకం. దాచుకొని మరలా మరలా చదువుకోవాల్సిన పుస్తకం.
బొల్లోజు బాబా
1/3/2020



No comments:

Post a Comment