Friday, November 13, 2020

బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి?!

 

బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి?!

మూలం: లూయిస్ గ్లుక్

 

అతడు రెండువారాలుగా ఆ అమ్మాయినే గమనిస్తున్నాడు

తరచూ ప్లాజాకు వచ్చే ఆ అమ్మాయిని.

బహుశా ఇరవైలలో ఉంటుందేమో ఆమె.

మధ్యాహ్నం వేళ కాఫీతాగుతూనో,

తన చామనఛాయ మొఖంతో ఏదో పత్రికలోకి తొంగిచూస్తూనో కనిపించేది.

సిగరెట్లో లేదా ఏ పూలబొకేనో కొనే నెపంతో అతడు

అక్కడే తచ్చాడుతూ దూరంనుంచి ఆమెనే గమనించేవాడు

 

తాను అబలనని అనుకొనేదామె అంతవరకు

అతని ఊహాలోకపు అవసరాలకు ఆమె జతపడటంతో

ఆమె మహాశక్తివంతురాలయింది.

ఇపుడు అతడు ఆమెకు బంధీ.

అతడు బహూకరించిన పదాలను

అతను ఊహించుకొన్న స్వరంతో మెత్తగా, ముద్దుముద్దుగా పలికేది

 

క్రమేపీ ఆమె అతణ్ణి గుర్తుపట్టేది, ఎదురుచూసేది

ప్రతీరోజు తలస్నానం చేసి అలంకరించుకొని వచ్చేదేమో కూడా.

ప్లాజాలో ఇదివరకట్లా తలదించుకొని కాక

గుమ్మం వైపు పదే పదే చూసేది.

ఆ తరువాత వారిద్దరూ ప్రేమికులు అయ్యారు.

 

ఇది ఇంత తొందరగా జరుగుతుందని అతనుకూడా ఊహించి ఉండడు.

ఆమె తనని తాను అతనికి అర్పించుకొన్న మరుక్షణం

అతని శరీరంపై, అతని ఉద్వేగాలపై ఆమె  చేస్తున్న అధికారం

ఒక్కసారిగా అంతమైంది.

 

ఆమె మాత్రం ఒక స్త్రీ మొదటిసారిగా ప్రేమలోకి నడిచిన క్షణాలలోకి

కొంచెంకొంచెంగా ముడుచుకుపోయింది.

నీడకూడా లేని వ్యక్తిగా, ఈ లోకానికి చెందనిదానిలా అక్కడే ఉండిపోయింది

అతనికి ఇంకేమాత్రం ఉపయోగపడప్పుడు

ఆమె బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి.

***

ఈ కవితచదివాకా నా మూడుదశాబ్దాల పఠనానుభవం ఒక్కసారిగా కుప్పకూలినట్లయింది.  ఇది పెసిమిజమా? సినిసిజమా? నార్సిసిజమా? ఏమో తెలియలేదు నా శక్తి సరిపోలేదు తేల్చుకోవటానికి.

ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమైంది.  ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి సంపూర్ణంగా అర్పించుకోవటం అనేది ఆత్మవినాశనానికి దారితీస్తుంది అని,  అలా అర్పించుకోవటం ద్వారా వచ్చే అధికారం శాశ్వతంగా నిలిచిఉండదని. అది భౌతికం కావొచ్చు, మానసికం కావొచ్చు.  చలం చెప్పిన ఆత్మలోకంలో దివాళా లాంటిది.

అతని ఊహాలోకపు “అవసరాలకు” ఆమె జతపడటం, ముద్దుముద్దుగా,  అర్పించుకొన్న మరుక్షణం అధికారం అంతమవ్వటం, ముడుచుకుపోవటం,  ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఎన్నెన్ని కిటికీలను తెరిచే వాక్యాలివి.   జెన్యూన్ మానవోద్వేగాలు ఎంతబలంగా చెప్పబడ్డాయీ! “మోజు తీరాకా వదిలేసాడు” అనే సామాన్యవాక్యాన్ని  కళాత్మకంగా చెబుతూనే ఎంత విశాలమైన కాన్వాస్ ను పరచిందీ!

*

 

Avatar

బొల్లోజు బాబా

No comments:

Post a Comment