Tuesday, November 17, 2020
Imported post: Facebook Post: 2020-11-17T19:49:23
దర్శనం
దైవదర్శనం ముగించుకొని
కోనేరు మెట్లపై కూర్చొన్నాను.
ఎవరో భక్తుడు కొట్టిన గంట
నిశ్శబ్దంలో మెరుపులా మెరిసి
కోనేటి నీటిపై తరంగాలు తరంగాలుగా
కంపించింది కాసేపు.
ప్రదక్షిణాలు చేస్తున్న మువ్వల సవ్వడి
ఒక క్రమవిరామంతో
దగ్గరగా వచ్చి దూరమౌతోంది.
కొబ్బరినీళ్ళ వాసనను
మోసుకొచ్చిన గాలి
చెంపలను తాకి ఎటో సాగిపోయింది.
ఉడతల జంట ఒకటి
చెట్టు మొదలువద్ద కనిపించినట్లే కనిపించి
రెప్పపాటులో కొమ్మల్లోకి అదృశ్యమైంది.
పసుపుపచ్చని సీతాకోక చిలుక
నా భుజంపై కాసేపు తచ్చాడి
కలువల్ని కూడా కనికరించేందుకు కదిలింది.
ఒక్కసారిగా
గుడిలో ఎలెక్ట్రిక్ భజంత్రీలు మోగటం మొదలైంది
ఢంకాలు, గంటలు, మువ్వలు ఏకకాలంలో
ఒకదానిలోకి ఒకటి లయమౌతూ - ఒక శబ్దబీభత్సం
గోపురంపై రామచిలుకలు పైకి లేచాయి
నేనూ లేచాను .... ఇది నా సమయం కాదని.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment