Friday, November 13, 2020

ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ విజేత Louise Glück కవిత్వం

 ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ విజేత Louise Glück కవిత్వం

.
1968లో Louise Glück ఇరవైదేండ్ల వయసులో Firstborn అనే కవిత్వసంపుటిని వెలువరించింది. ఆమె కవిత్వం ఆనాటి సమకాలీన-ఆధునిక సరిహద్దులను చెరిపేస్తూ, సరళమైన భాష, తక్షణ జీవితానుభవాలు, సార్వజనీన అప్పీల్, కథనాత్మక శైలి, ఐతిహ్యసంబంధ, మానవవిషాదం, కన్ఫెషనల్ ధోరణి లాంటి అంశాలతో అందరినీ ఆకట్టుకొంది. ఆమె కవిత్వం ఆ తరువాతి కాలంలో మరింత చిక్కబడింది.
Louise Glück కవిత్వాన్ని ఇరవయ్యోశతాబ్దపు సాహిత్యప్రపంచంలో ఎక్కడ పెట్టాలి అని విమర్శకులు తర్జనబర్జన పడ్డారు. సాహిత్యవిమర్శలో ఒక కవిస్థానాన్ని అకడమిక్ గా, కళాపరంగా, చారిత్రాత్మకంగా మూల్యాంకనం చేయటంలో – అస్తిత్వరాజకీయాలు, వివిధ భావవాద స్కూల్స్, ఉద్యమాలు, శిబిరాలు నిర్ణయాత్మకంగా ఉండేవి. కానీ ఈమె కవిత్వం అన్నిరకాల వాదాలలో, ఉద్యమనేపథ్యాలలో, శిబిరాలలో- పగుళ్ళలోకి పరుచుకొనే పాదరసంలా ఒదిగిపోవటమే దానికి కారణం
వైయక్తిక అనుభవాలను మాత్రమే చెప్పే కన్ఫెషనిస్టు కవిత్వ ధోరణిని, తమ వర్గ సంస్కృతిని మాత్రమే కవిత్వీకరించే అస్తిత్వవాద ధోరణిని సమ్మిళితం చేసి ఒక సార్వజనీన కవిత్వపాయను లూయిస్ గ్లగ్ నిర్మించుకొన్నదని విమర్శకులు నేడు గుర్తించారు.
లూయిస్ కవిత్వంలో కోర్కెలు, ఆశలు, ప్రేమ, గాయాలు, దుఃఖం, వేదన, జీవనకాంక్ష, వ్యాఖ్యానం, ఆత్మకథనాత్మకత, ప్రకృతి, కాలం, దైవీకదర్శనం లాంటివి పదే పదే వచ్చే థీమ్స్. ఈమె కవిత్వంలో Social Prophecy కన్న Spiritual Prophecy అధికం. ఇది సమకాలీన కవిత్వరీతులకు భిన్నమైన స్వరం.
లూయిస్ తనను ఒక జ్యుయిష్ అమెరికన్ కవిగానో, ఒక స్త్రీవాద కవిగానో, ఒక ప్రాకృతిక కవిగానో గుర్తింపబడటానికి ఇష్టపడలేదు. “in-betweenness” తన లక్షణమని చెప్పుకొన్నది.
తనకవిత్వంలోని అనుభవాలన్నీ తనలోపలి అనుభవాలే తప్ప వెలుపలి అనుభవాలు కాదని లూయిస్ ఒకచోట విస్పష్టంగా పేర్కొంది.
***
Louise Glück వ్రాసిన కొన్ని కవితలకు నేను చేసిన అనువాదాలివి.
.
Lost Love by Louise Glück
నా సోదరి ఈ భూమిపై సంపూర్ణజీవితాన్ని జీవించింది
పుట్టింది, చనిపోయింది.
మధ్యలో
ఒక్క చూపు, ఒక్క వాక్యం ఇక్కడ విడిచివెళ్లలేదు
అందరు శిశువుల్లానే ఆమె కూడా ఏడ్చింది.
పాలు తాగ నిరాకరించింది
మా అమ్మ మొదట్లో తనబిడ్డ తలరాతను మార్చటానికి ప్రయత్నించింది
తరువాత చరిత్రను.
నా సోదరి చనిపోయాకా
మా అమ్మ హృదయం మెడకి వేలాడే ఇనుప బిళ్ళలా
చల్లగా గడ్డకట్టింది
నా సోదరిదేహం ఒక అయిస్కాంతంలా మారి
మా అమ్మ హృదయాన్ని భూమిలోకి లాక్కుని
అక్కడ దాన్ని తిరిగి మొలకెత్తించాలని యత్నించేదేమోనని
ఒక్కోసారి నాకు అనిపించేది.
పుట్టగానే చనిపోయిన తన సోదరిపై వ్రాసిన ఒక కవిత ఇది. చాలా సామాన్యమైన సంసారిక దుఃఖం ఇది. కానీ చెప్పనలవికాని మానవ వేదన. ఇది చావుని గ్లోరిఫై చేయటం కాదు. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన తల్లి ఉద్వేగానికి ఇచ్చిన అక్షర రూపం. ఈ కవితలో “తరువాత చరిత్రను” అన్న రెండు పదాలలో- ఆ తల్లి జరిగిపోయిన విషయాన్ని తలచుకొని ఎంతెలా దుఃఖించిందో అంతటి పెనువేదనా ఇమిడిపోయింది.
***
అర్ధరాత్రి - MIDNIGHT by Louise Glück
గాయపడ్డ హృదయమా! మాట్లాడు
ఎంత తెలివిమాలిన పనిచేస్తున్నావో నీకు అర్ధమౌతోందా
garage లో చెత్తమధ్య కూర్చొని ఏడుస్తూ ఉండటం.
అది నీపని కాదు. నీపని అంట్లుతోమటం
చిన్నతనంలో పెంకెతనం చూపినట్లుగానే ప్రవర్తిస్తున్నావు
నీ క్రీడా స్ఫూర్తి, ఉదాసీన వైఖరి ఎక్కడకు పోయాయి?
విరిగిన కిటికీ అద్దంపై వెన్నెల వాలింది
పలుచని వేసవి వెన్నెల
మెత్తని గుసగుసలతో భూమి తియ్యగా సిద్దమైంది--
నీ భర్తతో సంభాషించే పద్దతి ఇదా- ఫోన్ చేస్తే ఎత్తకపోవటం;
హృదయం గాయపడినప్పుడు garage లో ఒంటరిగా కూర్చోవటం?
నువ్వే నేనైతేనా... భవిష్యత్తు ఊహిస్తాను
మరో పదిహేనేళ్ళ తరువాత
ఏదో ఓ రాత్రి అతని గొంతుక అలసిపోతుంది;
నువ్వు ఫోన్ ఎత్తకపోతే, మరొకరు ఎవరో ఎత్తుతారు.
.
పై కవితలో లూయిస్ పలికించిన ఐరనీ అసమాన్యమైనది. కానీ ఇదే కఠినమైన జీవన వాస్తవికత. నీ పని అంట్లు తోమడం అనే వాక్యం ఈ కవిత మొత్తానికి గరిభనాభి లాంటిది. దాంపత్యజీవితంలో ఉండే ఇంటిమసీ ఒక నిషిద్ద వస్తువు స్త్రీవాదానికి సంబంధించి. దాన్నీ లూయిస్ గమ్మత్తుగా ఉపయోగించుకొందీ కవితలో. “in-betweenness” అంటే ఇదేనేమో!
***
Saints by Louise Glück
మా కుటుంబంలో ఇద్దరు సన్యాసినులు ఉండేవారు
మా మేనత్త, అమ్మమ్మ
కానీ వారి జీవితాలు భిన్నమైనవి
మా అమ్మమ్మ చివరివరకూ ప్రశాంతంగానే ఉండింది.
నిశ్చలజలాలపై నడిచే వ్యక్తిలా అనిపించేది
కారణాలు తెలియవు కానీ
ఏనాడు ఏ సముద్రపు అలలూ ఆమెను తాకలేదు
మా మేనత్త కూడా అదే మార్గంలో నడిచింది కానీ
ఆమెపై కెరటాలు ఉవ్వెత్తున విరుచుకుపడేవి
గాయపరిచేవి.
ఆత్మసంభంద విషయాలకు
విధి ఒక్కోలా స్పందిస్తుంది కాబోలు
మా అమ్మమ్మ జాగ్రత్తపరురాలు, సంప్రదాయవాది
అందుకే బాధలను తప్పించుకొని ఉంటుంది.
మా మేనత్త అన్ని కష్టాలు ఎదుర్కొంది
ఒక్కో కెరటం వెనక్కు వెళుతూ వెళుతూ
ఆమె ప్రేమించే ఎవరినో ఒకరిని తీసుకొని పోయేది.
అయినప్పటికీ
ఆమె సముద్రాన్ని ఒక దుష్టశక్తిగా అనుకోదు.
ఆమెకు సముద్రం ఒక సముద్రం అంతే.
తీరాన్ని తాకినప్పుడల్లా విలయాన్ని సృష్టించితీరాల్సిందే.
.
పై కవిత చాలా ఆలోచనల్ని కలిగిస్తుంది. సంప్రదాయక విలువలు గొప్పవని చెపుతోందా కవయిత్రి ఇక్కడ; సముద్రం దేనికి ప్రతీక కాలానికా, ఆధునికతకా, స్త్రీజీవితంలో ఎదురయ్యే పురుషునికా; . ఆత్మసంభంద విషయాలు ఏమిటి? (Original-which is how Fates respond to a true spiritual nature). ఎన్నిరకాల భాష్యాలు చెప్పుకొన్నా ఈ కవితలోని స్వరం భిన్నమైనది. సమకాలీన ధోరణులకు వ్యతిరిక్తప్రవాహం వంటిది
***
.
కలయిక - The Encounter by Louise Glück
నువ్వు మంచం వద్దకు వచ్చి కూర్చొని
నన్ను తేరిపారచూస్తూ
నా మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దాడతావు.
కరిగిన మైనం నుదిటిపై తెలుస్తుంది నాకు
అది అక్కడ ఒక మచ్చను మిగల్చాలి అని కోరుకొంటాను
నిన్ను ప్రేమించటం అంటే నాకంతే తెలుసు
ఎందుకంటే
దహింపబడి, ఏదో ముద్రవేయించుకొని
చివరలో దేన్నో పొందాలని వాంఛిస్తాను నేను...
నా దుస్తులు తొలగిస్తాను
నా చెక్కిళ్లపై ఎరుపుదనం
అలా నిప్పులదారిలో ప్రయాణించి
భృకుటిపై చల్లని నాణెమై కుదురుకొంటుంది.
అదే అనుభవాన్ని పొందిన నువ్వూ నా పక్కనే పడుకొని
నా ముఖాన్ని చేతులతో తడుముతావు
నేను నిన్ను ఎంతగా కోరుకొన్నానో
నీకూ అర్ధమౌతుంది
మనకు ప్రతీసారీ తెలుస్తూనే ఉంటుంది... నీకూ నాకూ
దీనికి సాక్ష్యం నా దేహమే.
.
తెలుగునాట ఇలాంటి మానవానుభవాల్ని వ్యక్తీకరించటాన్ని బూతుగా ముద్రలు వేసారు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా. ఇలాంటి అభివ్యక్తులను తీరిక వర్గాల కవిత్వంగా, సామాజిక స్పృహలేని ఉత్త కాల్పనిక సాహిత్యంగా ఇంకొంచెం ముందుకు పోయి దోపిడీ వర్గాలకు దోహదపడే కవిత్వంగా తీర్మానాలు చేసారు చాలామంది విమర్శకులు.
మానవానుభవాల్ని వ్యక్తీకరించటమే కవిత్వ లక్ష్యంగా, ప్రయోజనంగా నేడు ప్రపంచం గుర్తించింది. in-betweenness, inclusivity, simplicity నేటి కవిత్వరీతి. తెలుగు కవులు ఈ bastion ను అందిపుచ్చుకొంటారా ఇంకా తాము గీసుకొన్న వృత్తాలలోనే ఉండిపోతారా అనేది కాలమే తేల్చాలి.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment