Sunday, June 25, 2023

ప్రతివాది వెంకట భయంకరాచారి (1910-1978)

ప్రతివాది వెంకట భయంకరాచారి 1910 ఆగస్టు 28 న సామర్లకోటలో పండిత కుటుంబంలో జన్మించారు. సంస్కృత పాండిత్యమే కాక ఇంగ్లీషు చదువులు కూడ నేర్చుకొన్నారు. విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో చదువుకొనేటపుడు ఆంధ్రవిశ్వవిద్యాలయ విద్యార్ధి నాయకునిగా ఎన్నికయ్యారు. కొంతకాలానికి చదువు నిలిచిపోయింది. శ్రీ భయంకరాచారి పద్దెనిమిదేళ్ల వయసులోనే “ప్రమధ్వర పరిణయం” అనే కావ్యాన్ని రచించి, దానిని ప్రచురించమని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావును అభ్యర్ధించాడు. భయంకరాచారి లోని ఉత్సాహము, చురుకుదనం గమనించిన కాశీనాధుని నాగేశ్వరరావు తనవెంట తిప్పుకోవటం మొదలుపెట్టాడు. అలా భయంకరాచారి కాశీనాథుని నాగేశ్వరరావుతో కలసి 1929లో లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొన్నాడు. ఈ సమావేశాలలోనే గాంధి మహాత్ముని ప్రసంగాలు విని భారతదేశానికి స్వాతంత్ర్యం యొక్క అవసరాన్ని గుర్తించాడు. దేశసేవ చేయటంలో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు.

భయంకరాచారి లాహోర్ నుండి స్వగ్రామం చేరుకొని కాకినాడలో శ్రీ బులుసు సాంబమూర్తి నాయకత్వంలో ఉప్పుసత్యాగ్రహ ఉద్యమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నాడు. 1930 మే నెలలో గురజనాపల్లిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కొద్దిమంది అనుచరులతో కలిసి ప్రభుత్వ ఉప్పు గొడౌన్లపై దాడి చేసాడు. పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న వేదాంతం నిత్యానందం అనే యువకుని బుర్ర బద్దలు కొట్టారు. ప్రజలపై విచ్చలవిడిగా లాఠి చార్జి చేసారు. ఈ దాడిలో భయంకరాచారి తీవ్రంగా లాఠీదెబ్బలు తిని, ఎనిమిది గంటలు స్పృహకోల్పోయి, హాస్పటలులో చేరగా; ప్రభుత్వంవారు తెలవారుతుండగానే కేసువిచారణ జరిపి రెండుసంవత్సరముల కారాగార శిక్ష విధించి తిరుచునాపల్లి జైలుకు తరలించారు[1]. అక్కడ భయంకరాచారికి లాహోర్ కుట్రకేసులో నిందితులుగా ఉన్న బెంగాల్ విప్లవకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి ప్రభావంతో భయంకరాచారి మనస్సులో గాంధేయ అహింసా మార్గం వీడి హింస ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలన్న ఆలోచనకు బీజం పడింది. దాని పర్యవసానమే భయంకరాచారి ప్రధాన నిందితునిగా ఉన్న కాకినాడ బాంబు కుట్రకేసు[2].

కాకినాడ బాంబు కుట్రకేసు

భయంకరాచారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన కాకినాడ బాంబు కుట్రకేసు. అప్పట్లో ప్రజలను బాధలకు గురిచేస్తున్న బ్రిటిష్ అధికారులపై దాడి చేసి వారిని హతమార్చటం యువకులకు ఆదర్శప్రాయంగా ఉండేది. లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్ అనే పోలీసు అధికారిని భగత్ సింగు; జులియన్ వాలాబాగ్ ఉదంతాన్ని సమర్ధించిన జనరల్ డయ్యర్ ఉన్నతాధికారి అయిన Michael O’Dwyer ను ఉద్ధంసింగ్ హతమార్చాలని పథకాలు రచించటం ఈ కోవకు వస్తాయి. అలా ప్రతీకారం తీర్చుకోవటం వారి ఆత్మగౌరవ ప్రకటనగా భావించేవారు..

1930 లలో తూర్పుగోదావరి జిల్లా డిఎస్పి ముస్తాఫా ఆలీఖాన్, కాకినాడ ఇన్ స్పెక్టర్ డప్పుల సుబ్బారాయడు అనే ఇద్దరు పోలీసు అధికారులు బ్రిటిష్ ప్రభువుల మన్ననలు పొందటం కొరకు, సాగించిన దమనకాండ ప్రజలకు కంటకప్రాయంగా ఉండేది. ప్రజలు, ఉద్యమకారులు వీరంటే ద్వేషంతో రగిలిపోయేవారు. వీరు సాగించిన దుశ్చర్యలలో మచ్చుకు ఇవి కొన్ని.

1931, మార్చ్ 30న వాడపల్లి వెంకటేశ్వరస్వామి రథోత్సవ సమయంలో రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయనాయకుల ఫొటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నందుకు, ముస్తఫా అక్కడకు చేరుకొని జాతీయనాయకుల ఫొటోలను తొలగించమని ఆదేశించాడు. అప్పుడు జరిగిన ఘర్షణలో నలుగురు మరణించారు. చాలామంది గాయపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జాతీయోద్యమకారులు ఆశ్రయం పొందుతున్నారనే సాకుపై ముస్తాఫా 1932 జనవరి 19 న ఆశ్రమవాసులపై విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయలపాలు చేసాడు.

ముస్తాఫా రాజమండ్రిలో నాళం భీమరాజు ఇంటిలో ఉన్న డాక్టరు బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యంను బయటకు పిలిచి, జాతీయోద్యమకారులకు వైద్యం అందిస్తున్నాడనే కారణంగా అమానుషంగా చావమోదాడు. "ఏరా ఎక్కడ నీ గాంధీ? ఇప్పుడు వచ్చి నిన్ను రక్షిస్తాడా? అని దుర్భాషలాడుతూ క్రిందవేసి బూటుకాళ్ళతో తొక్కుతూ పక్కటెముకలు విరిగిపోయేలా చిత్రహింసలు పెట్టాడు. ఆ గాయాలకు డా. సుబ్రహ్మణ్యం ఊపిరితిత్తులు దెబ్బతిని, కొద్దిరోజులకే చనిపోయారు[3]

విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం చేస్తున్న కాశీభట్ల జగన్నాధం ధరించిన స్వదేశీ వస్త్రాలను ముస్తాఫా బలవంతంగా వలిపించి, విదేశీ దుస్తులు ఇచ్చి వాటిని ధరించమని ఆజ్ఞాపిస్తూ, లాఠీలతో చితకబాదాడు. కొట్టే ప్రతీ లాఠీదెబ్బకూ "గాంధీ, గాంధీ" అని బిగ్గరగా ఉచ్ఛరిస్తూ మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించాడట జగన్నాధం.

కాకినాడ పోలీసు సర్కిల్ ఇనస్పెక్టరు సుబ్బారాయుడు. ఇతను జిల్లాలో ఎక్కడైనా జాతీయోద్యమ సభలు జరుగుతుంటే అక్కడకు వెళ్ళి పదిమందితో చెవులు చిల్లులుపడేలా డప్పులు వాయింపచేసి సభను భగ్నం చేసేవాడు. అందుచేత ఇతన్ని డప్పుల సుబ్బారాయుడు అని ప్రజలు పిలుచుకొనేవారు.

శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న శ్రీ బులుసు సాంబమూర్తిని, శ్రీమతి గుమ్మిడిదల దుర్గాబాయమ్మను ఈ డప్పుల సుబ్బారాయుడు పోలీసు స్టేషనులో పెట్టి అమానుషంగా లాఠీలతో స్పృహపోయేవరకూ కొట్టాడు. వీరి దమనకాండకు ఆనాటి యువకుల రక్తం ఉడికిపోయి. ఎలాగైనా వీరిద్దరిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూడసాగారు.[4] ఆ యువతరానికి భయంకరాచారి నాయకత్వం వహించాడు. ఆ పోలీసు అధికారులను హతమార్చటం ద్వారా యువకులలో ధైర్యాన్ని నింపి, వారిని సమీకరించి హింసాపూరిత పద్దతులద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించటమే ఆశయంగా పెట్టుకొన్నాడు భయంకరాచారి. వారి హత్యకు రచించిన పథకమే కాకినాడ బాంబు కుట్రకేసుగా చరిత్రలో మిగిలిపోయింది.

భయంకరాచారి, ముస్తఫాను హతమార్చటానికి- కాకరాల కామేశ్వరశాస్త్రి, బోయిన సుందరం, చల్లా అప్పారావు, వడ్లమాని శ్రీరామమూర్తి, చిలకమర్రి సత్యనారాయణాచార్యులు, నండూరి నరసింహాచార్యులు వంటి మిత్రులతో ఒక బృందంగా ఏర్పడి, కలకత్తా, బొంబాయి, పాండిచేరీలనుండి బాంబుల తయారీ పదార్ధాలు తెప్పించుకొని, బాంబులు తయారు చేసి అవకాశం కొరకు ఎదురుచూడ సాగాడు.

భయంకరాచారి అతని మిత్ర బృందం, 1933 ఏప్రిల్ 6 రాత్రి వేళ, ఏప్రిల్ 14 పగటిపూట బాంబులు విసిరి ముస్తాఫాను హతమార్చుదామని ప్రయత్నించారు. వీరు అనుకొన్న ప్రదేశాలకు ముస్తాఫా రాలేదు. కాకినాడ ఉప్పుటేరును ముస్తాఫా రోజు చిన్ని పడవలో దాటుతాడని గమనించిన భయంకరాచారి బృందం, 15 వ తారీఖున తాము తయారు చేసిన బాంబులను ఆ పడవలో పెట్టి ఒక హొటల్ లో టీ తాగటానికి వెళ్లారు. ఇంతలో ఒక రేవు కూలి కుతూహలం కొద్దీ పడవలో ఉన్న బాంబులను బయటకు తీయగా ఒక బాంబు పేలింది. ఆ కూలీ కన్ను పోగా స్పృహకోల్పోయి పడిపోయాడు, ఇంకా 8 మంది గాయపడ్డారు. అక్కడకు వందమీటర్ల దూరంలోనే ఉన్న ముస్తాఫా ఘటనా స్థలానికి వచ్చి పేలకుండా ఉన్న మిగిలిన బాంబులను, పెట్టెలో దాచిన బాంబు తయారీ పదార్ధములను స్వాధీనం చేసుకొని కేసు విచారణ చేపట్టాడు. భయంకరాచారి, అతని మిత్రులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నందుకు, బాంబులను తయారుచేసినందుకు, ప్రభుత్వంపై కుట్రపన్నినందుకు- అంటూ వివిధ నేరాలను ఆరోపించి వారిపై కేసులు కట్టారు.

తెలంగాణా కొత్తగూడెంలో భయంకరాచారికి బంధువులు ఉండేవారు. అక్కడకు రహస్యంగా చేరటానికి వెళుతున్నప్పుడు, ఖాజీపేట రైల్వే స్టేషనులో డప్పుల సుబ్బారావు భయంకరాచారిని స్వయంగా అరస్టు చేసాడు. అరెస్టయినపుడు భయంకరాచారి వద్ద ఆరు రివాల్వర్లు, అనేక ఉత్తరాలు దొరికాయి.

ఈ కేసులో భయంకరాచారితో సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. ఇది మేజిస్ట్రేటు కోర్టునుండి, హైకోర్టు దాకా కాకినాడ బాంబుకుట్రకేసు పేరుతో నడిచింది. ప్రభుత్వం తరపున శ్రీ బి.ఎల్ యతిరాజు వాదించగా, నిందితుల పక్షాన శ్రీ జగన్నాధ దాసు వాదించారు. జస్టిస్ మాధవన్ నాయర్, జస్టిస్ బర్న్ ఈ కేసులో కుట్ర కోణాన్ని కొట్టివేసి- ఆయుధాలు కలిగి ఉన్నందుకు, బాంబులు తయారుచేసినందుకు, రేవుకూలీలను గాయపరచినందుకు- భయంకరాచారికి ఏడేండ్ల అండమాన్ ద్వీపాంతరవాస శిక్షను విధించి మిగిలిన వారు అప్పటికే రెండేళ్లు జైలులో ఉన్నారు కనుక వారిని విడుదల చేస్తున్నట్లు తుదితీర్పును వెలువరించారు. ఆ విధంగా తెలుగు గడ్డపై జరిగిన మొట్టమొదటి విప్లవ టెర్రరిస్టు చర్యగా కాకినాడ బాంబు కుట్రకేసు చరిత్రలోకి ఎక్కింది. [5]

అండమాను జీవితం[6]

కాకినాడ బాంబు కుట్రకేసు కోర్టు తీర్పు వెలువడేనాటికి భయంకరాచారి కోయంబత్తూరు జైలులో ఉన్నాడు. అక్కడి నుంచి 1936 జనవరి 11 న వీరిని అండమాన్ సెల్యులార్ జైలుకు కాళ్ళు, చేతులకు సంకెళ్ళు వేసి ఓడలో తరలించారు. సముద్రప్రయాణం కొత్తకనుక మొదటి రెండురోజులు విపరీతమైన వాంతులు వచ్చాయి. 16, జనవరిన అండమాన్ సెల్యులార్ జైలుకు చేరుకొన్నారు. Pi 323 అనేది వీరికి ఇవ్వబడిన ఖైదీ నంబరు. జైలు వార్డు yard No 5. Pi అంటే Permanently incarcerated అని అర్ధం. ఈ అక్షరాలు కలిగిన ఖైదీలు శిక్ష ముగిసేవరకూ జైలుగదిలోనే ఉండాలి. భయంకరాచారి రాజకీయ ఖైదీ కనుక ఇతర ఖైదీలవలే కఠినమైన పనులు చేయనవసరం లేదు. దినచర్య ఉదయం అల్పాహారం అయ్యాక చదువుకోవటం లేదా రాసుకోవటం. మధ్యాహ్న భోజనమయ్యాక మరలా చదువుకోవటం లేదా రాసుకోవటం. సాయింత్రం ఆటలు గార్డెనింగ్. రాత్రి పది వరకూ సత్సంగ కాలక్షేపం. చిన్న జైలుగదిలో ఒక పరుపు, దోమతెర, బల్బు, ఒక కుర్చీ, టేబులు ఉండేవి. కామన్ డైనింగ్ రూములో భోజనం. కామన్ లెట్రిన్ వాడుకోవాలి. గుండ్రని రంద్రం ఉన్న చెక్కపై కూర్చుని క్రింద ఉండే పెద్ద డ్రమ్ములోకి మలవిసర్జన చేయాలి. ఎనిమిది మంది ఒకేసారి పక్కపక్కన కూర్చునే వీలుండే చిన్న పాక అది.

అండమాన్ వాతావరణం భయంకరాచారికి పడలేదు. నెలలతరబడి జైలు హాస్పటల్ లో ఉండవలసి వచ్చేది. 1937 జూలై 17 న తీవ్రజ్వరంతో హాస్పటల్ లో ఉండగా, హాస్పటలును సందర్శించటానికి వచ్చిన బ్రిటిష్ అధికారికి- జైలులో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులను మెరుగుపరచమని, ఖైదీలను భేషరతుగా విడుదల చేయాలనే, డిమాండ్లతో నిరాహారదీక్షకు ఉపక్రమిస్తున్నట్లు ఒక కాగితంపై వ్రాసి ఇచ్చి తాను ఒక్కడే నిరాహారదీక్షకు ఉపక్రమించాడు. మిత్రులు వచ్చి వారించారు. ఆరోగ్యం బాగాలేదు కదా ఇప్పుడు ఇలాంటివి చేస్తే పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. భయంకరాచారి ఎవరి మాటా లెక్కచెయ్యక పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నిరాహారదీక్ష చేయనారంభించాడు.

భయంకరాచారిని ఆదర్శంగా తీసుకొని ఇతరఖైదీలు ఒక్కొక్కరు నిరాహారదీక్ష చేయనారంభించారు. కొద్దిరోజులకే వారిసంఖ్య 235 కు చేరుకొంది. “మహాత్మాగాంధీ గారు నిరాహారదీక్ష చేసినపుడు మంచి నీరు తీసుకొంటారు, కనీసం నీళ్లైనా తాగమని” ఎంతమంది చెప్పినా భయంకరాచారి వినలేదు. రక్తవాంతులతో భయంకరాచారి పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ఎనిమా ద్వారా శరీరానికి అవసరమైన నీటిని బలవంతంగా ఎక్కించటం మొదలుపెట్టారు. ఆరోగ్యం మరింత క్షీణించటంతో అతికష్టం మీద గొట్టం సాయంతో కడుపులోకి సూపు, హార్లిక్స్ పట్టించ సాగారు.

అండమాన్ ఖైదీల నిరాహారదీక్ష భారతదేశమంతటా దావానలంలా వ్యాపించింది. ఒకరోజు డాక్టరుగారు తెరుపు మరుపుగా ఉంటూన్న భయంకరాచారి చెవిలో- అండమాన్ లో నిరాహారదీక్ష చేస్తున్న ఖైదీలను ఉద్దేశించి వారిని దీక్షవిరమించమని విజ్ఞప్తి చేస్తూ మహాత్మాగాంధి ఇచ్చిన టెలిగ్రామును చదివి వినిపించాడు. దాన్ని ఒకటికి రెండుసార్లు చదివించుకొన్న భయంకరాచారి నిరాహార దీక్షను విరమించాడు. దీక్షాసమయంలో భయంకరాచారి బరువు 14 కేజీల బరువు తగ్గటం జరిగింది[7].

ఖైదీలు చేసిన దీక్షలు మరియు గాంధి ఒత్తిడి కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి, అండమాన్ రాజకీయ ఖైదీలను భారతదేశ జైళ్లకు తరలించాలని నిర్ణయించింది. అలా 1937 సెప్టెంబరు 22 న భయంకరాచారి అండమాన్ జైలునుంచి మద్రాసు జైలుకు పంపబడ్డాడు.

1937 ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ విజయం సాధించి సి. రాజగోపాలాచారి నేతృత్వంలో మద్రాస్ ప్రొవెన్షియల్ ప్రభుత్వం ఏర్పడినపుడు, రాజకీయ ఖైదీగా ఉన్న భయంకరాచారి విడుదల అయ్యారు.

కాకినాడ బాంబు కుట్రకేసు దేశవ్యాప్తంగా ప్రచారం పొందటంతో స్వాతంత్ర్యపోరాటంలో క్రియాశీలకపాత్ర పోషించినందుకు భయంకరాచారికి, కాకినాడకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. దేశద్రోహ కేసులోంచి విడుదలయ్యారు కనుక భయంకరాచారిపై అనునిత్యం సి ఐ డి నిఘా ఉండేది. అందువల్ల జాతీయోద్యమంలో పాల్గొనటానికి రహస్యజీవనం గడపవలసి వచ్చేది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

స్వాతంత్ర్యానంతర జీవనం

భయంకరాచారి ప్రకాశం పంతులు గారి వద్ద చాలాకాలం సహాయకునిగా ఉన్నారు. కొంతకాలం ఒక పత్రికను నడిపారు. 1952 లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. వివాహం కాలేదు. ఏ రకమైన ఉద్యోగం లేక బాధపడుతూంటే అనంతశయనం అయ్యంగార్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈయనను నెహ్రూ వద్దకు తీసుకొని వెళ్ళి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కోరాడు. అప్పట్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఎందరికో ప్రభుత్వోద్యోగాలు ఇప్పించేవాడు నెహ్రు. అలా భయంకరాచారికి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసరుగా ఉద్యోగం వేయించాడు నెహ్రూ. తరువాత భయంకరాచారి పెళ్లిచేసుకొని కుటుంబజీవనం సాగించసాగాడు. ముక్కుసూటిగా వ్యవహరించటం భయంకరాచారి నైజం. ఈ గుణం చేత ఒకసారి ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది. మరలా నెహ్రూయే కల్పించుకొని తిరిగి ఉద్యోగబాధ్యతలు ఇప్పించాడు[8].

యానాం విమోచనోద్యమంలో శ్రీ భయంకరాచారి పాత్ర:

కాకినాడకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాం ఒకనాటి ఫ్రెంచి కాలని. బ్రిటిష్ వారు 1947 లో భారతదేశాన్ని విడిచి వెళిపోయినా ఫ్రెంచి వారు 1954 వరకు భారతదేశంలోని ఫ్రెంచి కాలనీలైన పాండిచేరి, కారైకాల్, మాహె యానాం లను పాలించారు. సమీప బ్రిటిష్ పాలిత ప్రాంతాలనుంచి బ్రిటిష్ వారు వెళిపోవటాన్ని గమనించిన యానాం ప్రజలలో కూడా క్రమేపీ జాతీయ భావనలు పెరిగి, ఫ్రెంచిపాలన నుండి విముక్తమవ్వాలని ఉద్యమాన్ని చేసారు. అలా జరిగిన యానాం విమోచనోద్యమానికి శ్రీ దడాల రఫేల్, శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కామిశెట్టి పరశురామ నాయుడు వంటి స్థానిక నాయకులు నాయకత్వం వహించారు. శ్రీ భయంకరాచారి స్వాతంత్ర్యపోరాటంలో తనకున్న అపారమైన అనుభవంతో వారికి తన సలహాలు, సహకారాన్ని అందించేవారు. వీరందరూ కలిసి “యానాం విలీన కార్యాచరణ కమిటీ” నొకదానిని ఏర్పాటుచేసుకొని యానాన్ని ఫ్రెంచిపాలననుండి విమోచనం చెందించి భారతావనిలో విలీనం చేయటానికి ఉద్యమం నడిపారు. శ్రీ భయంకరాచారి ఈ కమిటీకి సెక్రటరీగా వ్యవహరించారు[9]. వీరు అనేక సభలు నిర్వహించి యానాం ఉద్యమనాయకులకు వెన్నుదన్నుగా నిలిచారు.

1954 ఏప్రిల్ 24 న శ్రీ పి.భయంకరాచారి, శ్రీదడాల, డి. ఎస్. ఆర్ సోమయాజులు ఆధ్వర్యంలో కాకినాడనుంచి యానాంకు సరుకులు చేరవేస్తున్న బళ్లను నిలిపివేసి యానాంను దిగ్భంధనం చేసారు. ఈ పికెటింగ్ లో సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు[10] . 1954 మే 14 న యానాం వంతెన వద్ద జరిగిన పెద్ద బహిరంగ సభలో శ్రీ పి.వి. భయంకరాచారి ఫ్రెంచిపాలన అంతమవుతున్నదని యానాం ప్రజలు గ్రహించాలని చెప్పారు. ( 21, మే, 1954 ఆంధ్రపత్రిక)

యానాం విలీన కార్యాచరణ కమిటీ సెక్రటరీగా శ్రీ భయంకరాచారి అనేక సందర్భాలలో ఫ్రెంచి అనుకూల, ఫ్రెంచి వ్యతిరేక వర్గాల మధ్య ఏ రకమైన అవాంఛనీయ ఘర్షణలు తలెత్తకుండా పెద్దమనిషిగా సర్దిచెప్పేవారు. 1954, మే 20 న భారత పతాకాలు ధరించి సుమారు 500 మంది కార్యకర్తలు యానాం లోకి ప్రవేశించి కదం తొక్కుతున్న సందర్భంలో యానాం పోలీసులకు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలందరూ సంయమనం వహించాలని శ్రీ భయంకరాచారి మైకు తీసుకొని కోరటంతో ఇరువర్గాలు శాంతించాయి[11].

జూన్ 13, 1954 న యానాం కలక్టరు బంగళా వద్ద ఉండే ఫ్రెంచి జండాను తొలగించి భారతదేశ జండాను ప్రతిష్టించే బృహత్తర కార్యక్రమానికి- యానాం విమోచనోద్యమ నాయకులతో పాటు శ్రీ భయంకరాచారి కూడా పాల్గొన్నారు[12].

ముగింపు

శ్రీ ప్రతివాది భయంకరాచారి అసలు పేరు ప్రతివాది భయంకర వెంకటాచార్యులు. అజ్ఞాత కార్యక్రమాలు కొరకు పేరును భయంకరాచారి గా మార్చుకొన్నారు. వీరు రేడియోకి ఇచ్చిన ఇంటర్వూలో తాను తీవ్రవాదిని కాదని ధర్మవాదిని అని చెప్పుకొన్నారు. అండమాను జైలులో నిరాహారా దీక్ష సమయంలో వీరు ప్రదర్శించిన దీక్ష పట్టుదలలు ఆదర్శనీయం. వీరు సుభాష్ చంద్రబోస్ సైన్యంలో చేరదామని భగవాన్ దాస్ అనే మారుపేరుతో చిట్టగాంగ్ వరకూ వెళ్ళి పరిస్థితులు అనుకూలించ వెనక్కుతిరిగి వచ్చేసారు. శ్రీ భయంకరాచారి స్వాతంత్ర్యపోరాటంలో పోషించిన పాత్రను గుర్తించి భారత ప్రభుత్వం వీరికి తామ్రపత్రం ఇచ్చి గౌరవించింది. శ్రీ భయంకరాచారి సతీమణి మరణించిన తరువాత ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చి చివరకు 1978 మే నెలలో తుదిశ్వాస విడిచారు. తుదిశ్వాస వరకూ జాతీయవాదిగానే ఉన్నారు. శ్రీ ప్రతివాది భయంకరాచారి నిజమైన దేశభక్తుడు. నిస్వార్ధంగా జాతీయోద్యమంలో పాల్గొన్న మహనీయుడు. స్వధర్మమెరిగిన ధర్మవాది.

****

References
[1] సజీవ స్వరాలు పేరుతో శ్రీ భయంకరాచారి ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూ

[2] ఆత్మగౌరవ రణభేరి… భయంకరాచారి, August 6, 2021, VSK Telangana

[3] భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర-ప్రచురణ కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం - పే.నం 97-98

[4] ఆంధ్రప్రదేశ్ మాగజైన్ Volume 17 Issue 07 పే.నం. 13

[5] ఆంధ్రప్రదేశ్ మాగజైన్ Volume 17 Issue 07

[6] శ్రీ ప్రతివాది భయంకరాచారి రచించిన “Craiks Paradise” పుస్తకం. 1938 లో రాసిన ఈ పుస్తకంలో అండమాన్ లో తాను ఎదుర్కొన్న అనుభవాలను, అక్కడి ఖైదీల దయనీయ స్థితిని అక్షరబద్దం చేసారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ పత్రికా సంపాదకుడు శ్రీ కేఎస్‌ ‌కామత్‌ ‌ప్రచురించారు. మద్రాస్ ప్రొవెన్షియల్ ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ రాజగోపాలాచారి ముందుమాట రాశారు. (అప్పట్లో మద్రాసు ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రి అనేవారు). ఈ పుస్తకం ద్వారా సెల్యులార్ జైలులోని ఖైదీల దయనీయ పరిస్థితులు, అధికారుల క్రౌర్యం ప్రపంచానికి తెలిసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

[7] . మహాత్మా గాంధి అండమాన్ ఖైదీల దీక్షను విరమించుకొమ్మని, 1937 ఆగస్టు 27న, 1937 ఆగస్టు 30న మరలా 1937 సెప్టెంబరు 8 న టెలిగ్రాముల ద్వారా విజ్ఞప్తిచేసాడు.- mahatma-gandhi-collected-works-volume-72

[8] The Great Indian Patriots, by P. Rajeswar Rao p.n 49-50

[9] Gazetteers of India, Union Territory of Pondicherry Volume I by by Francis Cyril Antony p.n 285

[10] హిందు, 28, ఏప్రిల్ 1954

[11] యానాం విమోచనోద్యమం, బొల్లోజు బాబా

[12] యానాం విమోచనోద్యమం, శ్రీ దడాల రఫేల్ రమణయ్య ఆత్మకథ