Tuesday, June 20, 2023

ప్రాచీన పట్టణాలు - తూర్పుగోదావరిజిల్లా, పుస్తక పరిచయం

.
Publishing a volume of verse is like dropping a rose-petal down the Grand Canyon and waiting for the echo అంటారు కానీ ఒక్కోసారి ఎవరో సహృదయుని చేతికి ఆ పుస్తకం చేరినపుడు ఇదిగో ఇలాంటి ప్రతిధ్వని వినిపిస్తుంది.
శ్రీనివాస్ గారికి అనంతానంత కృతజ్ఞతలతో.....
బొల్లోజు బాబా
ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకొనే లింకు మొదటి కామెంటులో కలదు.
.
ప్రాచీన పట్టణాలు - తూర్పుగోదావరిజిల్లా
శ్రీ బొల్లోజు బాబా
నేను ప్రస్తుతం ఉద్యోగ రీత్యా చైనా లో కొన్ని వారాలు ఉండటం, దానితో తోచక, వారాతంతరంలో ఎదో వెతుకుతుంటే, ఈ ఆణిముత్యం నాకు దొరకడం, వెంటనే చదవటం చకచకా జరిగిపోయింది.
ఈ రకంగా నైనా కొన్ని నెలల తర్వాతా మళ్ళీ ఓ పుస్తకం చదవటం జరిగింది , అందునా చాలా మంచి పుస్తకం, మళ్ళీ అందులోనూ మా జిల్లా ఆ పై మా వూరు (పిఠాపురం) గూర్చి చాలా చాలా విపులంగా వివరించారు కూడా కామోసు ఇహ అస్సలాగలేకపోయానంటే అతిశయోక్తికాదు,
ఈ కవి ,అధ్యాపక మరియూ చరిత్రకారుని నెమ్మదితనం, మర్యాద & సౌశీల్యత ప్రస్పుటంగా కానవచ్చి, “మనవి మాటే” ముత్యాలకోవా గా తోచాయి నాకు.
నేను సమ్మోహనం అవ్వటానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి, ప్రధానంగా ఈ రచయిత గారు కవియట, రచయిత యట, మరీ ముఖ్యంగా జంతుశాస్త్ర అధ్యాపకులట , వీటికీ చరిత్ర పై ఆసక్తి కీ ఎంత వ్యత్యాసం, ఆసక్తి ఉండటమేకాక అందులో ఎంతో పరిశ్రమ చేసి ఈ పుస్తకానికి ఓ రూపం తెచ్చారంటే , తేవడంలోనూ ఎంతో అద్భుతంగా ఎన్నో చక్కని పదలాతో బహు భంగిమలతో వ్రాయగలిగారంటే, వీరికి చరిత్ర పై మరియూ ఈ , మా జిల్లా పై యున్న అవిభాజ్య ప్రేమకు ఇంతకంటే ఇంకేమి నిదర్శనం కావాలి.
ఇక పుస్తకం లోని విషయాలకు వస్తే, రెండు విషయాలు నన్ను ప్రధానంగా ఆకర్షించాయి, ఒకటి కొన్ని చక్కని, కొత్త వింత నాకు ఇంతకుమునుపును తెలియని పదాలు, మరియొకటి నాకు తెలియని మన గొప్ప చరిత్ర సంస్కృతి , ఆ విషయాలు చదువుతుంటే, పూర్వజన్మలలో నేనెక్కడైనా ఉండిఉంటినా ఆ ప్రాంతాలలో, ఆ యా కాలాలలో, ఉండి ఉంటే ఎంత బావుణ్ణు, ఉండి, ఇప్పుడు యొకపరి నాకు జ్ఞప్తికి వస్తే ఇంకెంత బావుణ్ణు అనిపించింది, ఆ రోజులు, మహారాజులు మారాజులై వెలిగిన మా రాజుల గొప్ప కాలమది.
ఇంకొక ప్రధానమైన విషయమేమంటే,
తటవర్తి గురుకులపతి ఆదేశంతో , "ఘనవరమ్ము పీఠికాపురమ్ము" అనే మకుటంతో నాచేత ఈశ్వరుడు వ్రాయిస్తున్నటువంటి శతకము చక్కగా వెలిగి ప్రకాశించుటకు, ఒక విధంగా ఈ పుస్తకం కాలుష్యం లేని చమురునిచ్చి నన్ను కూడా ఉత్సుకుడను చేసిందని చెప్పడంలో ఎంత మాత్రం నాకు సందేహం లేదు.
చరిత్ర పరంగా క్రీ.శ. 2 వ శతాబ్దం నుంచి రాచరికము ముగిసినవరకూ చాలా శూలంకుషంగా మొత్తం చరిత్ర కళ్ళకు కట్టినట్టు చూపారు.
ఆ రోజులలోనే మన కోరంగి ఓడరేవు ఎంత పెద్ద దో , ఎంత విలువైన వాణిజ్యవ్యాపారాలు ఇక్కడ నుంచి వివిధ దేశాలకు జరిగేవో, అప్పటిలోనే, రాజులు (కాకతీయులు) పన్ను రాయితీలు ఎలా ఇచ్చి వ్యాపారాన్ని, ఆదాయాన్ని పెంచేవారో, ఎంత చక్కని నేర్పరులైన వడ్రంగి వారు, నౌకా నిర్మాణ నిపుణులు ఇక్కడ ఉండేవారో, కాల క్రమేణా ఆ రేవు ఎలా పతనమైందో ఇలా అనేక విషయాలనూ చక్కగా వివరించారు.
అలాగే 1787, 1839 లలో వచ్చి న పెను తుఫానులూ వాటివల్ల ఏర్పడ్డ అపార ప్రాణ, ఆస్తి నష్టాలూ కళ్ళకు కట్టారు.
ఇక ఆ రోజులలోనే ప్రజలలో, రైతులలో వున్న విప్లవ భావాలు, చైతన్యం వాటి ద్వారా సాధించిన విజయాలూ, ప్రభువులు కూడా వీరి భావాలను అర్థం చేసుకుని పట్టింపులకు పోక ప్రజల బాగోగులు చూడటం అన్ని కూడా, నేటి తరానికి ఓ చక్కని మార్గనిర్దేశకత్వం చేస్తున్నట్టు గా తోచాయి నాకు.
ఇక చరిత్ర చూస్తే , ఈ జిల్లాలో ని వివిధ పట్టణాలను, కళింగలు, మౌర్యులు, శాతవాహనులు, సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు, మాథరులు, వేంగి, తూర్పు చాళుక్య వంశాలు, కాకతీయులు, కొప్పుల వంశము, ఆపై రాజమహేంద్రవరపు రెడ్లు, , గజపతులు, వెలమదొరలు, ఆపై పరోక్షంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన పరిణామ క్రమాన్ని చక్కగా చూపారు.
పట్టణ, పుర, నగర, వ్రేలు, హారము, రాష్ట్రము, నగరము, సీమ, రాజ్యము, స్థలము ఇలా అనేక పేర్లకు మూలమేమిటి అవెలా వచ్చాయి అన్న వివరణ ఎంతో శాస్త్రీయంగా వివరించారు. నా కడుపు నిండిపోయింది ప్రత్యేకం గా ఇవి తెలిసాక,
నేటి నవ్యాంధ్రప్రదేశ్ కి మూలాలు క్రీ.శ 642 లోనే ఎలాపడ్డాయన్న విషయం కూడా చక్కగా వివరించారు,
ఇక పిఠాపురమే కాక, కోరంగి (మనం ఎంతో పెద్దవనుకొనే ముంబాయి , విశాఖ ఓడరేవులు ఈ కోరంగి ముందు దిగదిడుపు అన్న విషయం నాకు అవగతమైంది) రాజమహేంద్రి, బిక్కవ్రోలు, దాక్షారామం, ఆదుర్రు, చాళుక్యభీమవరం, సర్పవరం, బెండపూడి , పలివెల, తొలి తిరుపతి, పెద్దాపురం మొదలగు పట్ట ణా లు, రాజ్యాలుగా ఎలా వెలిగాయో ఈనాడు మనం చూస్తున్న అనేక పట్టణలకంటే కొన్ని వందల, వేల స.రాల పూర్వమే వాటి వైభవము, మరియూ అప్పటి పండుగలు, సంస్కృతి, హిందూ, బుద్ద, జైన, సైవ, విష్ణు మతాలు శాఖలూ ఎంతటి అన్యోన్యతతో ఉండేవో, వాటిపై ప్రభువులు చూపిన సమభావన అద్భుతం.
ఇక కొన్ని చక్కని పదాలు, పదబంధాలూ, విషయాలు..
పగోడాలు,
ప్రోలునాడు,
వివిధ “విషయ” అనే చివరతో ఏర్పడ్డ ప్రాంతలపేర్లు,
కోనసీమ పేరు ఎలా వచ్చింది,
ఆంధ్రమండల ద్వాదశసహస్రగ్రామసంపాదిత
విఫణివీధులు
ఆనాటి రాజముద్రలు,
నరపతులు, గజపతులు & అశ్వపతులు వివరాలు, అనగానెవరు.
వివిధ శాసనాలు వాటి విషయాలు వాటివారా చరిత్రను ఎలా సమీకరించవచ్చు.
ఇలా అనేక విషయాల భాండాగారము ఈ పుస్తకం.
ఈ పుస్తకం చదివాక, చరిత్రపై ఎంతో మక్కువ పెరుగునన్నది ముమ్మాటికీ సత్యమే.
ఏతావాతా: సాంఘిక, రాచరిక, భౌతిక, సంస్కృతిక, ధార్మిక మేళవింపే ఈ పుస్తకం, మరి ఇంక ఆలస్యమెందుకండీ , చదివేయండి యొకపరి.
ఇక చివరగా మా పిఠాపురము చివరి ప్రభువులు కీ.శే. శ్రీ శ్రీ శ్రీ రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరు గారిని మనసారా ఎంతో భక్తితో ఒకసారి స్మరిస్తూ , వారిని చూడలేకపోయినా, కనీసం వారి జూ.కాలేజి లోచదివే భాగ్యము, వారి పుత్రిక పేరు మీద కట్టిన "మంగయమ్మరావు పేట" నివసించే భాగ్యము, పలు మార్లు కోట్లో తిరిగే భ్యాగ్యమైనా వచ్చినందుకు ఎంతో సంతసిస్తూ ..
సెలవు.
జై శ్రీరామ
సర్వే జనాః సుఖినోభవంతు
మీ
శ్రీనివాస్ లింగం
శుభకృత సంవత్సర , జ్యేష్ఠ బహుళ షష్ఠి.
09 జూన్ 2023
ఈ పుస్తకం లభించు చోటు
వెల: 150 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


No comments:

Post a Comment