.
ఆటముగిసింది, తెరపడింది
హాలంతా నిశ్శబ్దం మంచులా పరుచుకొంది
అంతవరకూ కాంతులతో, ఉద్వేగాలతో
సజీవంగా నిలిచిన రంగస్థలం
కొద్దికొద్దిగా చీకటిలోకి కూలిపోతుంది
చప్పట్లు ఆగిపోతాయి, గొంతులు మూగబోతాయి
నటులు భారమైన హృదయాలతో తమ తమ
పాత్రలనుండి బయటకు వచ్చేసి
సిగరెట్లు కాల్చుకొంటూ, కాఫీలు తాగుతూ
మెచ్చుకోళ్ళగురించి, పొరపాట్లగురించి
చర్చించుకొంటూ ఉంటారు
పాత్రలు మాత్రం నిశ్శబ్దంగా
ప్రేక్షకుల హృదయాలలోకి ఇంకిపోతాయి
జ్జాపకాలలో కరిగిపోతాయి
ఖాళీ సీట్లు, రంగస్థల దుస్తులు, నాటక సామాగ్రి
యుద్ధానంతరం విస్మరించబడే యోధునిలా
అలా ఏదో మూల సర్దుకొంటాయి.
రంగస్థలంపై ఆటముగిసినా
జీవితం కొనసాగుతూనే ఉంటుంది
అవిచ్ఛిన్నంగా సాగే కథలు
పదే పదే పుట్టే కొత్త పాత్రలతో
మరిన్ని రంగులతో, మరిన్ని ఉద్వేగాలతో
అలరించే కొత్త ఆటకొరకు
రంగస్థలం ఎదురుచూస్తూంటుంది
The show must go on....
బొల్లోజు బాబా
No comments:
Post a Comment