తిరుగుబాటు కవి - ఖాజి నజ్రుల్ ఇస్లాం
ప్రతి ఉద్యమంలోంచి ఒక కవి పుడతాడు. ఆ ఉద్యమానికి సరిపడా జవసత్వాలను అందిస్తాడు. అలా స్వరాజ్య ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బెంగాలి కవి, ఖాజి నజ్రుల్ ఇస్లాం తన “విద్రోహి” కవితతో ఉద్యమాన్ని పరుగులెత్తించాడు. 1921 డిసెంబరులో నజ్రుల్ “విద్రోహి” కవిత వ్రాసాడు. ఈ కవితలో స్వాతంత్రేచ్ఛ, వైయక్తిక స్వేచ్ఛ జమిలి నేతగా కలిసిపోయి ఉంటాయి. ఇది ప్రజలను ఆకర్షించింది. అప్పటి ప్రజలు అలాంటి కవితకొరకే ఎదురుచూస్తున్నారా అన్నట్లు, అచ్చయిన అనతి కాలంలోనే నజ్రుల్ కు తిరుగులేని తిరుగుబాటు కవిగా పట్టం కట్టారు.
ఈ నజ్రుల్ కవిత్వాన్ని బెంగాలీ తెలిసిన శ్రీ పురిపండా అప్పలస్వామి ద్వారా శ్రీ శ్రీ, నారాయణబాబు, చాసో, రోణంకి వినేవారు. “విద్రోహి” కవిత నన్ను ప్రేరేపించిందని నారాయణ బాబు బాహాటంగా చెప్పుకొన్నాడు. “నజ్రుల్ ఇస్లాం గీతాలు నా మనస్సులో ఏదో మారుమూలల్లో మారు మోగుతూ ఉండి ఉండాలి” అని శ్రీశ్రీ ఒప్పుకొన్నాడు. అభ్యుదయ తెలుగు కవిత్వానికి ఒక దీపస్థంభంలా నిలిచిన కవిత ఇది. ఒక వైయక్తిక వాక్యాన్ని సామాజికం చేసిన ఆధునిక రచనలలో విద్రోహి కవిత, మహాప్రస్థాన కవితల కంటే ముందుంటుంది. అది చరిత్ర.
నేడు యూట్యూబ్ లో “Bidrohi poem by Kazi Nazrul Islam” అని వెతికితే- ఎంతో మంది యువకులు బెంగాలీలో విద్రోహి కవితను ఆవేశంగా, ఉద్వేగభరితంగా స్టేజ్ పై గానం చేస్తోన్న వీడియోలు అనేకం కనిపిస్తాయి. (ఒక్కో వీడియోకి లక్షల కొద్దీ వీక్షణలు ఉన్నాయని తెలిసాక తెలుగు సమాజం ఆ స్థాయికి ఎప్పటికి ఎదుగుతుందా అని బెంగ పడతాం).
ఒక కవిత దాదాపు శతాబ్దకాలం తరువాత కూడా యువత నాలుకలపై బ్రతికి ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ కవిత ఆనాటి సమాజానికి ఎంతైతే రిలవెన్స్ ఉండిందో, సమకాలీన సమాజానికి కూడా అంతే రిలవెన్స్ ఉంది.
ద రెబెల్ - (Bidrohi by Kazi Nazrul Islam, 1921)
ప్రకటించు వీరుడా ప్రకటించు
నా శిరస్సు మహోన్నతము!
నన్ను చూసి హిమాలయ శిఖరం తల దించుకొంది.
ప్రకటించు వీరుడా ప్రకటించు
ఖగోళమండలాన్ని బద్దలు కొట్టి
సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలను తరిమేస్తాను.
భూమ్యాకాశాలను చీల్చుకొని
దేవుడి పవిత్ర పీఠాన్ని పక్కకునెట్టి
పుడమితల్లి అంతులేని అద్భుతంలా
పైకి లేస్తాను.
కోపోద్రిక్త దేవుడు నా నుదుటిపై మెరుస్తూంటాడు
యుద్ధవిజేతకు దక్కిన కీర్తి పతకంలా.
ప్రకటించు వీరుడా
నా శిరస్సు సర్వోన్నతము!
నేను నిరంకుశుడను నిర్దయుడను అహంకారిని
నేను ప్రళయకాలంలో నర్తించే నటరాజును
నేను ఝుంఝూమారుతాన్ని నేను విధ్వంసాన్ని
నేను శ్రేష్ఠమైన భయాన్ని, ఈ ప్రపంచపు శాపాన్ని
నేను కృపారహితుణ్ణి అన్నిటినీ తుత్తునియలు చేస్తాను
నేను అవ్యవస్థను, అవిధేయుడను
నేను నిబంధనల్ని మర్యాదల్ని కాళ్ళతో మర్దిస్తాను
నేను లయకారక ధూర్జటిని, గ్రీష్మకాలపు ఉత్పాత ప్రభంజనాన్ని
నేను విద్రోహిని, ప్రపంచ విప్లవానికి పుట్టిన పుత్రుడిని
ప్రకటించు వీరుడా
నా శిరస్సు సర్వోన్నతము!
నేను రాక్షస తుఫానును, ఉగ్ర ఉప్పెనను
నా దారికి అడ్డం వచ్చిన అన్నింటినీ ధ్వంసం చేస్తాను
నేను నాట్యంతో మత్తెక్కిన లయ ను
నేను నా తాళానికే నాట్యం చేసుకొంటాను
నేను విశృంఖల జీవన పారవశ్యాన్ని
నేను హమీరాన్ని* నేను ఛాయానాదాన్ని* నేను హిందోళాన్ని*
నేను అవిశ్రాంతాన్ని
నా నడకా నృత్యం ఒక కేళీవిలాసం
నేను శత్రువును కౌగిలించుకొంటాను, మృత్యువుతో యుద్ధం చేస్తాను
నేను ఉన్మత్తుడను. నేను కుంభవృష్టిని
నేను భయపెట్టే మహమ్మారిని
నేను రక్తపాత నియంతల మృత్యువును
నేను ఎప్పటికీ ఒక వెచ్చని అశాంతిని
ప్రకటించు వీరుడా
నా శిరస్సు సర్వోన్నతము!
నేను సృష్టిని నేను విలయాన్ని
నేను ఇల్లుని నేను స్మశానాన్ని
నేను అంతాన్ని నేను ఉదయాన్ని
నేను స్వర్గలోక మహారాజ్ఞి ఇంద్రాణి పుత్రుణ్ణి.
తలపై చంద్రుడు, నుదుటిపై సూర్యునితో
ఒక చేత మెత్తని మురళి, మరో చేత యుద్ధ శంఖంతో
నేను Bedouin1 ని Chengis ని
నేను నాకు తప్ప మరెవ్వరికీ తలవంచను
నేను ఉరుమును
నేను భూమిపై, ఆకాశంపై ధ్వనించే బ్రహ్మ శబ్దాన్ని
నేను Israfil2 వాయిద్యపు మహా ఘర్జనను
నేను పినాకపాణి త్రిశూలాన్ని
నేను సత్యదేవత సేవకుడను
నేను శంఖు చక్రాన్ని
నేను బలమైన అనాది అరుపును
నేను విశ్వామిత్రుని శిష్యుడను, కోపిష్టి దూర్వాసుడను
నేను దావానలపు ఆగ్రహాన్ని
నేను విశ్వాన్ని బూడిదచేస్తాను
నేను హృదయాంతరాళంలోంచి ఉబికిన అట్టహాసాన్ని
నేను సృష్టికి శత్రువుని, భయహేతువుని
నేను యుగాంతాన ద్వాదశాదిత్యులకు పట్టే గ్రహణాన్ని
నేను అప్పుడప్పుడు ప్రసన్నుడను, ఒక్కొకపుడు అస్థిరబుద్దుడను
నేను ప్రాతఃకాల నూత్న యవ్వనాన్ని
నేను మహాబలి గర్వాన్ని పాదాల క్రిందపడేసి తొక్కుతాను
నేను ప్రచండ పవన ప్రకోపాన్ని
నేను అల్లకల్లోలిత సముద్రపు ఘోషను
నేను అనంత తేజో ప్రకాశాన్ని
నేను గలగల పారే సెలయేరుని
నేను కన్నియ మెరిసేనల్లని వాల్జడను
నేను నిలువరించే ఆమె కన్నుల వెలుగును
నేను పదహారేళ్ల చిన్నదాని హృదయంలో పుష్పించే మెత్తని ప్రేమను
నేను అప్రమేయ ఆనందాన్ని
నేను భగ్న ప్రేమికుని విరహ గీతాన్ని
నేను అనాధల హృదయాల చేదు కన్నీటిని
నేను అభాగ్యుల నిస్సయాహ నిట్టూర్పుని
నేను నిరాశ్రయుల శోకాన్ని వేదనని
నేను అవమానింపబడిన హృదయ క్షోభను
నేను మోసగించబడిన ప్రేమికుల విషాదాగ్నిని
నేను సంబాళించుకోలేని పరితాపాన్ని
నేను అక్షతయోని వణికే ప్రధమ స్పర్శను
నేను ఆమె నుండి దొంగిలించిన నునులేత మొదటి చుంబనాన్ని
నేను రహస్య ప్రేమికురాలి క్షణమాత్రపు వాలు చూపు మెరుపుని
నేను ఆమె విప్పారిన కన్నులతో రెప్పవేయక చూసే వాంఛను
నేను యవ్వనవతి రసిక బిగి కౌగిలిని
నేను ఆమె గలగలలాడే గాజుల సంగీతాన్ని
నేను అనశ్వర శిశువును, నిత్య యవ్వనుడను
నేను మొలకెత్తుతోన్న యవ్వనాన్ని భయంతో దాచుకొనే బాలిక సిగ్గును
నేను మెత్తని దక్షిణ గాలులను
నేను వ్యాకుల పరచే తూర్పు పవనాలను
నేను దేశద్రిమ్మరి కవిగాయకుని గంభీర గీతాన్ని
నేను అతను సారంగిపై పలికించే మృదు సంగీతాన్ని
నేను నడివేసవి మద్యాహ్నపు తీరని మొండి దాహాన్ని
నేను ప్రజ్వలించే ప్రచండ మార్తాండుడిని
నేను ఎడారిలో ఉబికే నీటి చెలమను, చల్లని శాద్వలము ని
నేను ఆనంద పరవశంతో అటూ ఇటూ పర్వులిడతాను
ఒక్కసారిగా నన్ను నేను తెలుసుకొంటాను
అన్ని శృంఖలాలు తెగిపోతాయి
నేనే ప్రారంభాన్ని నేనే ముగింపును
నేనే మానసిక అంతఃశ్చేతనలోని చైతన్యాన్ని
నేనే ఈ ప్రపంచపు వాకిట ఎగురుతోన్న విజయకేతనాన్ని
నేనే మానవజాతి గెలుపుకు గౌరవ చిహ్నాన్ని
విజయోత్సాహంతో ఉచ్ఛైశ్రవం అధిరోహించి భూమి ఆకాశాలపై
తుఫానులా కలియదిరుగుతాను
నేను భూమి వక్షస్థలంపై రగిలే అగ్నిపర్వతాన్ని
నేను మహారణ్యాలను దహించే దావానలాన్ని
నేను నరకలోకపు ఉన్మత్త మహోగ్ర క్రోధాన్ని
నేను మెరుపు రెక్కలపై విహరిస్తాను
నేను దుఃఖాన్ని, భయాన్ని ఎల్లెడలా వెదజల్లుతాను
నేను భూకంపాలు పుట్టిస్తాను
నేను Orpheus3 వేణువుని
నేను జ్వరపడిన ప్రపంచాన్ని నిద్రపుచ్చుతాను
నరకలోకం నన్ను చూసి హడిలి చస్తుంది
నేను ఈ లోకానికి తిరుగుబాటు నేర్పుతాను
నేను జలప్రళయాన్నిఒక్కోసారి ఈ భూమిని సారవంతం చేస్తాను
మరోసారి నష్టాన్ని కలిగిస్తాను
నేను విష్ణుమూర్తి ఇద్దరు దేవి లను కబళిస్తాను
నేను అధర్మాన్ని, నేను ఉల్కాపాతాన్ని నేను శనిని
నేను తోకచుక్కను, నేను విషనాగును
నేను తల తెగిన చండిని
నేను నరకలోక జ్వాలల మధ్య కూర్చొన్న యుద్ధదేవతను
నేను అందమైన పూవులా నవ్వుతాను
నేను పరశురాముని గండ్రగొడ్డలిని
యోధుల్ని సంహరించి ఈ లోకంలో శాంతిని స్థాపిస్తాను
నేను బలరాముని భుజాలపై నాగలిని
నేనీ ప్రపంచాన్ని పెళ్ళగించి శాంతి సౌభాగ్యాలను పండిస్తాను
పోరాటాలతో అలసిపోయిన నేను.. గొప్ప విప్లవకారుడిని
పీడితుల రోదనలు ఈ గాలిలో ప్రతిధ్వనిస్తున్నంత వరకూ
నేను విశ్రమించను
క్రూర పాలకులు యుద్ధాలలో కత్తులు ఝుళిపిస్తున్నంత కాలమూ
నేను నిద్రపోను
నేను గొప్ప విప్లవకారుడిని
ఈ లోకం కన్నా చాలా ఉన్నతంగా ఎదిగాను .. ఒంటరిగా
నా శిరస్సు సర్వోన్నతము!
అనువాదం: బొల్లోజు బాబా,
మూలం:1. Bidrohi by Kazi Nazrul Islam
2. Kabir Chowdhury ఇంగ్లీషు అనువాదం
3. Rezaul Karim Talukdar ఇంగ్లీషు అనువాదం
4. Sajed Kamal ఇంగ్లీషు అనువాదం
సూచికలు: * రాగాల పేర్లు
1. అరబ్ సంచార తెగ
2. దేవుని అంతిమతీర్పు రోజున బూరా ఊదెడి దేవదూత
3. గ్రీకు పురాణగాథలలోని సంగీత దేవత
ఈ గీతం బెంగాలి మాతృకలో ఆలపిస్తున్న వీడియో లింకులు
https://www.youtube.com/watch?v=RYTqnT_uTLU&t=84s
https://www.youtube.com/watch?v=xhcQonDcFfo&t=1s
No comments:
Post a Comment