కాలం కుబుసం విడిచి
ముందుకు సాగే ఈ వేళ
ఒక్కసారి లెక్కించుకొందాం మిత్రమా!
ఎన్ని సార్లు ఆకులమై నేల రాలామో
చేపపిల్లలమై ఏటికెదురు కిలకలు వేసామో
వాంఛలమై పరిమళించామో
అలలగా విరిగిపడ్డామో
కలలుగా వాస్తవం నుండి జారిపోయామో
పరుగెత్తలేక వీడ్కోలు చెబుతూ
ఒడ్డునే మిగిలిపోయామో
ఒక్కసారి లెక్కించుకొందాం మిత్రమా!
లోతుగా పాతపెట్టినా ఆకుపచ్చని స్వప్నంగా
ఎలా నేలని చొచ్చుకొని రాగలిగామో
కుండపోతగా ఎండకాచిన రోజున
వర్షించే రాళ్ళని, దుఃఖకాంతిని దాటుకొని
ఆకాశంలో రంగు పతంగాలుగా ఎలా విచ్చుకొన్నామో
ఇంకా బరిలోనే ఎలా మిగిలున్నామో
ఒక్క సారి లెక్కించుకొందాం మిత్రమా!
బొల్లోజు బాబా
No comments:
Post a Comment