Saturday, December 25, 2021

పుస్తకాలు స్టాల్ నంబర్ 253 254 255 లలో లభిస్తున్నాయి

 ప్రాచీనపట్టణాలు, తూర్పుగోదావరి జిల్లా

మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరి జిల్లా
పుస్తకాలు స్టాల్ నంబర్ 253 254 255 లలో లభిస్తున్నాయి
పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
దయచేసి ఆదరించగలరు.
బొల్లోజు బాబా




అర్బన్ కవిత్వ పలుకుబడి “ నడిచే దారిలో”

 (కవిసంధ్య నిర్వహణలో అక్టోబరు 30న జరిగిన శిఖామణి యువ పురస్కార ప్రధాన సభలో చేసిన ప్రసంగపాఠమిది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన కవిసంధ్య పత్రిక ఎడిటర్ గారికి ధన్యవాదములు; మా రవన్న బిడ్డ సురేంద్రకు మరొక్కసారి

అభినందనలు
తెలుపుతూ-- బొల్లోజు బాబా)
.
అర్బన్ కవిత్వ పలుకుబడి “ నడిచే దారిలో”
ముందుగా కవిసంధ్య యువపురస్కారాన్ని అందుకొంటున్న శ్రీ చెల్లి సురేంద్రదేవ్ కు అభినందనలు. శిఖామణి గారు ఈ పేరును ప్రకటించినపుడు నేనెంతో సంతోషించాను. ఎందుకంటే సురేంద్రదేవ్ ఆధునికులలో అత్యాధునికుడు. సమకాలీన అర్బన్ కవిత్వ పలుకుబడిని సాధించిన యువకవి. ఇతని మూలాలు యానాంకి చెందటం మరింత ఆనందించే సందర్భం. యానాం పేరు చెప్పగానే శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ చెల్లి రామ్ పేర్లు గుర్తుకు రావటం సహజం. వీరి తరానికి ముందు తరంలోని శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ, శ్రీ బొల్లోజు బసవలింగం, శ్రీ చెల్లి కృష్ణమూర్తి గార్ల పేర్లు కూడా ప్రస్తావించుకోవాలి. శ్రీ శిఖామణి, శ్రీ దేవదానం రాజు లు తమకు తెలుగు పాఠాలు చెప్పిన టీచర్ గా నరసమ్మ మాస్టారిని నేటికీ స్మరించుకొంటారు. నాటక రచయితగా పేరుగాంచిన శ్రీ బొల్లోజు బసవలింగం గారు మా తండ్రిగారు.
నేడు కవిసంధ్య యువ పురస్కారం అందుకొంటున్న చెల్లి సురేంద్రదేవ్ తాతగారు శ్రీ చెల్లి కృష్ణమూర్తి గారు. వీరు ప్రముఖ చిత్రకారుడు, అంబేద్కరిస్టు, బౌద్ధ ధర్మ ప్రచారకులు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చెల్లి సురేంద్రదేవ్ కు ఘనమైన సాహిత్య, కళా వారసత్వం ఉన్నది అని చెప్పటానికి.
ఒక కవితలో సురేంద్ర తన తాతగారిని
సంపెంగ నూనె మీసాల మాష్టారి
ఉఛ్వాస-నిశ్వాసాల్లో
బౌద్ధం-అంబేద్కరం
జ్ఞానజ్యోతి ప్రభోధాలు (ఆకాశ దీపం) – అంటూ స్మరించుకొన్నారు.
పై వాక్యాలలో చాలా క్లుప్తంగా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు సురేంద్ర. సంపెంగ నూనె అనే మాటలో ఆర్ధికంగా, సామాజికంగా పెద్ద స్థాయి కాకపోయినా ఆత్మ విశ్వాసంలోను, ఆత్మగౌరవప్రకటనలోను ఏమాత్రం ఎవరికీ తగ్గలేదన్న సూచన చెల్లి కృష్ణమూర్తి గారి వ్యక్తిత్వాన్ని తేజోవంతం చేస్తుంది. బౌద్ధాన్ని-అంబేద్కరిజాన్ని శ్వాసలో నింపుకున్నారనటం కూడా ఏ విలువలకై జీవించారో తెలుపుతుంది. చెల్లి కృష్ణమూర్తి గారు మాకు డ్రాయింగు టీచరు. వారు క్లాసులో అంబేద్కర్ జీవిత చరిత్రను హావభావాలతో అభినయిస్తూ చెప్పటం నాకు ఇంకా కళ్ళల్లో మెదులుతూ ఉంది.
*
చెల్లి సురేంద్ర విస్త్రుతంగా సాహిత్యాన్ని చదువుకొన్నాడు, చరిత్రను, సామాజిక పరిణామాలను ఆకళింపు చేసుకొంటున్నాడు. సమాజం పట్ల, మానవజాతి పయనం పట్ల కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను నిర్మించుకొంటున్నాడు. వాటిని స్పష్టమైన గొంతుతో, సూటైన అభివ్యక్తితో తన కవిత్వంలో నింపుతున్నాడు.
సురేంద్ర కవిత్వంలో US route 50, జపాన్ Kintsugi కళాకారుడు, Death Bears, Elastin, Gecko Lizards, Ondine’s curse, JFK కొన్న 1200 Cubon cigors, The Great Swathes of British Pink, water dropwort plant లాంటి సరికొత్త పరిభాష అలవోకగా ఒదిగిపోయింది. కవి దేనిగురించి చెపుతున్నాడో అర్ధం చేసుకోవాలంటే పాఠకుడు కూడా కొంత శ్రమించాలి. కవిత్వంలో దీన్నొక ఆధునిక పోకడగా గుర్తించక తప్పదు.
గతంలో మో, త్రిపుర వంటి వారు కూడా ఇదేరీతిలో కవిత్వం వెలువరించినా అప్పటి పాఠకలోకం వారిని అందుకోలేకపోవటానికి కారణం ఆ రోజుల్లో అరచేతిలో అంతర్జాలరూపంలో ప్రపంచజ్ఞానం అందుబాటులో లేకపోవటమే. ఈనాడు పైన ఉదహరించిన అంశాల్ని కొద్దిగా శ్రమించి గూగిల్ చేస్తే వాటి అర్ధాలు, సందర్భాలు చిటికలో మనముందుంటాయి. ఏ ఉద్వేగాన్ని పొంది సురేంద్ర వాటిని తన కవితా సందర్భాన్ని ఉద్దీపింపచేయటానికి వాడుకొన్నాడో, అతని ఉద్దేశమేమిటో తద్వారా ఏ అనుభూతిని పాఠకునిలో కలిగించాలని భావిస్తున్నాడో అర్ధమౌతుంది. ఇదంతా ఇంటలెక్చువల్ వ్యవహారం. మూడు ఫైట్లు, నాలుగు డ్యుయెట్స్ సినిమాగా కాక వివిధ ఫ్రేముల్లో props, gestures, colours ద్వారా ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించటం లాంటిది కవిత్వం అంటే.
*
ది బ్రోకెన్ హార్ట్ – అనే కవిత లోని వస్తువు వియోగం వల్ల హృదయం ముక్కలవటం. హ్రుదయం తునాతునకలవ్వటం అనే ఉపమానం అనాదిగా కవులందరూ చేస్తున్నదే. ఈ భావనను కొత్త తీరాలకు చేరుస్తాడు సురేంద్ర ఇలా…
గుండె //తునాతునకలయ్యింది
ఆ పగిలిన పెంకులను గుప్పిట్లో సేకరించి
నా చితికి పోయిన గుండెకు బంగారు తాపడంతో
జ్ఞాపకాలను రిస్టోర్ చేసిన
జపాన్ Kintsugi కళాకారునికి ఒక ముద్దు
Longevity to the బ్రొకెన్ హార్డ్.
పై వాక్యాలలో పగిలిపోయిన గుండెను ఎవరో అతికించారని అర్ధమౌతూంటుంది. Kintsugi అనే పదం వద్ద ఆగిఫోతాం. Kintsugi Art అనేది జపాన్ దేశపు ప్రాచీన కళ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారాన్నుపయోగించి అతికే కళ అది. విలువలేని పింగాణీని అతకటానికి విలువైన బంగారాన్ని ఉపయోగించటం ఆర్ధికంగా సరైన పని కాకపోవచ్చు. కానీ ఈ ఆర్ట్ ముఖ్యోద్దేశం విరిగిపోవటాన్ని కూడా ఒక విలాసంగా, విలువైనదిగా సెలిబ్రేట్ చేసుకోవాలని చెప్పటం. పై వాక్యాలలో ఈ తత్వం ఎక్కడా కవి చెప్పడు. కానీ Kintsugi కళాకారుడు అన్నమాట ఆధారంగా కవి హృదయాన్ని అర్ధం చేసుకోవాలి.
మూన్ బో – అనే కవితలో
నువ్వు లేని జీవితం
US Route 50 అంత నిర్మానుష్యం.
యుఎస్. రూట్ 50 అంటే ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యమైన రహదారి. ఎడారులగుండా, నిర్జన పీఠభూములమీదుగా వెళ్ళే ఒక హైవే. నువ్వు లేని జీవితం ఒక శూన్యం అని చెప్పటానికి పై పరిభాషని వాడుకొన్నాడు.
కెడావర్ అనే కవితలో
నీకు నాకూ ఒక్కటే గోల్
తెలియని తీరాలలో జీవితం తెల్లారిపోయినా
మునిసిపాలిటీ వేన్ లో కాటికి చేరకూడదని
సో….
మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారపు
చెవిపోగులు కుట్టించుకుంటే సరిపోతుంది (కెడావర్)
మనం ఎవరికీ తెలియని చోటమరణిస్తే, మనశవం అన్ క్లైమ్డ్ డెడ్ బాడీగా మారుతుంది. అలా జరగకూడదు అనే ఊహపై వ్రాసిన కవిత ఇది. మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారపు చెవిపోగులు ధరించాలి అనే ఒక హృద్యమైన ఉదంతాన్ని సురేంద్ర ఈ కవితలో పొందుపరచాడు. ఇది ఈ కవితా వస్తువుకు చక్కగా అమరిపోయింది. ఎవరీ మోర్గాను, ఎందుకు బంగారపు చెవిపోగులు ధరిస్తున్నాడు అనే అంశం ఎక్కడా చెప్పడు. మోర్గాన్ ఫ్రీమాన్ ఒక హాలి వుడ్ నటుడు. ఎనభై ఏండ్ల వృద్ధుడు. ఇతడిని “నువు నిత్యం ఎందుకు బంగారు చెవిపోగులు ధరిస్తున్నావు” అని ఒక విలేఖరి ప్రశ్నించగా- “నేనెక్కడైనా అపరిచిత పరిస్థితులలో, అనామకుడిలా చనిపోతే ఒక శవపేటిక కొనటానికి ఆ బంగారు చెవిపోగులు సరిపోతాయి” అని బదులిచ్చాడట. దాన్నే సురేంద్ర “మునిసిపాలిటీ వేన్ లో కాటికి చేరకూడదని మోర్గాన్ ఫ్రీమాన్ లా బంగారు చెవిపోగులు ధరించు” అని అంటున్నాడు. ఈ మొత్తం వ్యక్తీకరణలోని ఉద్వేగం, బలం పాఠకునికి అర్ధం కావాలంటే ఖచ్చితంగా అతను కొంత శోధన చేయవలసి ఉంటుంది.
అలాగని సురేంద్ర కవిత్వం మొత్తం ప్రతీకాత్మక జార్గన్ తో నిండి ఉందని అనుకోవక్కరలేదు. చక్కని భావాల్ని సరళంగా, హాయిగా నోరారా చెప్పుకొన్న కవితలు చాలానే ఉన్నాయి.
బుల్లెట్లలో గన్ పౌడర్ బదులుగా
విత్తనాలను నింపాలి
అవైనా బీడుపడిన
హృదయాంతరాల్లోకి చొచ్చుకెళ్ళి
ఆశను చిగురింపచేస్తాయి. (సహజత్వ ప్లానిటోరియం)
పై వాక్యాలలో యుద్ధాలను నిరసిస్తున్నాడు కవి. యుద్ధాలు కాదు బుద్ధిగా ప్రేమించుకొమ్మని బోధిస్తున్నాడు. సృష్టిని కోరుకొంటున్నాడు. ఆశను చిగురింపచేస్తున్నాడు. ఈ అద్భుతమైన భావాలను అత్యంత సరళంగా లోతుగా చెప్పాడు.
నా అస్తికల్లో కార్బన్ ని
అండర్ ప్రెజర్ తో
డైమెండ్ గా మలిచి
నీ పెళ్ళికి నేను ఉంగరాన్నైతే బాగుండు - Hooker’s lips. చాలా చిత్రమైన ఊహ. దేహం కార్బన్ తో తయారౌతుంది. ఎముకల్లో కూడా కార్బన్ ఉంటుంది. అదే కార్బన్ ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తే డైమండ్ గా మారుతుంది. కృత్రిమ డైమెండ్స్ అలాగ తయారుచేస్తారు. ప్రియుని ఎముకలతో తయారు చేసిన డైమండ్ ప్రియురాలి పెళ్ళి ఉంగరమవ్వటం అనేది ఒక విపరీత ఊహ. ఇది సురేంద్ర గాఢ ఊహాశాలితకు అద్దం పడుతుంది.
రోహిణీకార్తి ఎండలను వర్ణించటానికి ఆకాశం నిప్పులు చెరుగుతున్నది అంటారు సాధారణంగా. సురేంద్ర అదే సందర్భాన్ని ఆకాశదేశం అగ్నిపువ్వుల/ తివాచీలా వుంది అంటూ కొత్త ఉపమానంతో దేదీప్యమానం చేస్తాడు.
*
సురేంద్ర కవిత్వంలో సామాజిక కోణం బలంగా ప్రతిబింబిస్తుంది. అనేక కవితలలో సురేంద్ర ఈ సమాజంలోని అసమానతలకు కారణాలను అన్వేషించటం కనిపిస్తుంది. వాటిని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. వాటికి చికిత్స అవసరమని చెబుతున్నాడు.
టాక్స్ పేయర్స్ డబ్బుతో
నిర్మితమైన ఉపగ్రహాలు
అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను
లొకేట్ చేస్తాయి
ఆదివాసీ నవ్వుల పువ్వులను చిదిమేస్తాయి
అంతా కార్పొరేట్ గారడీ – అనటం ద్వారా ఈ సమాజంలో దోపిడీ ఎక్కడ జరుగుతున్నదో, ఎవరు ఎవరిని దోపిడీ చేస్తున్నారో, ఎవరికొరకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో స్పష్టంగానే గుర్తించి పదునైన వాక్యాలలో వ్యక్తీకరించాడు.
అదే విధంగా గొడ్డుచాకిరీ తప్పలేదు… అనే కవితలో
పొట్టకూటి కొరకు తరిమివేయబడిన చోట్లోనే
పుట్టుకొస్తున్న మల్టీ కాంప్లెక్స్ నిర్మాణంలో
రోజు కూలీలుగా గొడ్డుచాకిరి తప్పలేదు … లాంటి వాక్యాలు ఈ కవి రాజకీయంగా ఎవరివైపు నిలబడి మాట్లాడుతున్నాడో అర్ధం చేయిస్తాయి. చెప్పదలచుకొన్న అంశాన్ని సూటిగా, పదునుగా స్పష్టంగా చెపుతాడు సురేంద్ర.
*
సురేంద్ర సెటైరికల్ టోన్ చాలా పదునుగా ఉంటుంది. కొన్ని కవితలు ఈ వ్యంగ్యం వలన అద్భుతమైన texture ను పొందాయి.
ఏ చట్టసభలలో/ఏమున్నది గర్వకారణం/స్టింగ్ ఆపరేషన్లలో దొరికిన/వాళ్లంతా ఒక దగ్గర చేరడం తప్ప… అనే వాక్యం నేటి రాజకీయ వ్యవస్థపై సంధించిన బలమైన వ్యంగ్యాస్త్రం.
భూమికి ఆరడుగుల క్రింద పడుకుంటే
రోదిస్తావు
పుడమికి 220 అడుగుల క్రింద గ్రాండ్ కెనియన్ గుహల్లో నివసిస్తే
స్టేటస్ సింబల్ - లాంటి వాక్యాలలో ఆధునిక మానవుడు సంపదను/హోదాను ప్రదర్శించుకోవటానికి ఎంచుకొంటున్న పద్దతులపట్ల పదునైన సెటైర్ ఉంది.
*
సురేంద్రవి పల్లెటూరి మూలాలు. దళిత అస్తిత్వం ఇతడిని వెంటాడే నీడ. సురేంద్ర కవిత్వంలో అతని పల్లెటూరి మూలాలు, దళిత అస్తిత్వమూ అనేక కవితలలో పోతపోసుకోవటం గమనిస్తాం.
పాక్డ్ డ్రింకింగ్ వాటర్
త్రాగి త్రాగి చప్పబడిన నాలుకకు
రైతు సొరబుర్రలోంచి
నా దోసెట్లో పోసిన దాహార్తి సంజీవిని
రుచిమొగ్గలకు పునర్జన్మనిచ్చింది…. అంటూ అర్బన్ జీవితానికి మనం ఎంత బానిసగా మారినప్పటికీ నిజమైన జీవన సౌందర్యం గ్రామీణ జీవితంలోనే లోనే ఉందని చెబుతున్నాడు.
అనాది వేదాల ఆవిర్భావంలో
ఉద్భవించిన అంటరానితన
గరళాన్ని మింగిన
నీలకంఠ స్వరూపులం
ఎన్నిసార్లు నన్ను హతమార్చినా
మళ్ళీమళ్ళీ పుట్టుకొస్తాను – అంటూ సెరిబ్రల్ ఘోషగా దళిత అస్తిత్వాన్ని సగర్వంగా నినదిస్తాడు సురేంద్ర.
*
సురేంద్ర దృష్టి సంప్రదాయక పరిధులను దాటి చూస్తుంది. లైంగిక దోపిడీ అనగానే స్త్రీల గురించి మాత్రమే మాట్లాడుకొనే చోట “బచ్చా బాజీ” దృక్కోణంలోంచి మాట్లాడటం సాహసమే. బచ్చాబాజీ అంటే అబ్బాయిలను లైంగిక బానిసలుగా మార్చే ప్రక్రియ. “ ఐ ఆమ్ ఏ రేప్ విక్టిమ్ టూ” అనటం patterns ని బద్దలుగొట్టే ప్రక్రియగా భావించాలి.
సురేంద్ర రాసిన “ఎంగిలి బిర్యాని చేతులు” అనే కవితలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం చూడొచ్చు. ఈ కవిత కావేరి జలవివాదం గురించి. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్యా వివాదంగా మారింది. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఈ కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర. ఈ వివాదంపై ఇంతలోతుగా వచ్చిన తెలుగు కవిత ఇదే కావొచ్చు.
ఈ సంపుటిలో మిరిమిట్లు గొలిపే కవితా వాక్యాలు అనేక కవితలలో దర్శనమిస్తాయి. నాలోమొలకెత్తిన రేపటి ఆశల చిగురు; వైతరిణిలో రోదనలా/మా జీవితం చుట్టూ వివక్షే; రాలిన పువ్వుల ఒడిలో కూర్చుని; కాలం ఆగిన క్షణం; వెన్నెముక లేని అల; ప్రపంచీకరణ ప్రవాహం; లేలేత తామరాకుపై మార్నింగ్ డ్యూ; మడుగు మనస్సులో ఒంటరితనం; మేఘాలు భోరుమని ఏడుస్తూ; కన్నీటి లావా; గుండె గదుల్లో జ్ఞాపకాల రాక్షసస్వరూపిణి; ఒరేయ్ నాన్నా నీ నవ్వు వెన్నపూస లేపనం రా; బ్లాక్ హోల్ లో వెలుగురవ్వ; లాంటి అనేక వ్యక్తీకరణలు.
సురేంద్రకు మనుషులంటే ఇష్టం. వారితో సంభాషించటం ఇష్టం. వారు పంచే ప్రేమ అంటే ఇష్టం. ఆ కారణంగానే వరుసకు తాత అయ్యే శిఖామణిని, ప్రసాదమూర్తిని, అఫ్సర్ ని, అక్బర్ ని చక్కని కవితలుగా పోతపోసి ఈ సంపుటిలో దాచుకొన్నాడు.
సురేంద్ర తొలి సంపుటితోనే తనదైన సొంత దృక్ఫథాన్ని ఏర్పరుచుకొన్నాడు. సమకాలీన సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాడు. ఆ సమస్యలకు కారణాలను పట్ల ఇతను చేస్తున్న అన్వేషణ కూడా సరైనమార్గంలోనే ఉంది. వ్యక్తీకరణలో పరిభాషపరంగా అక్కడక్కడా కొంత క్లిష్టత ఉన్నప్పటికీ దాన్ని ఇతని సిగ్నేచర్ స్వరంగా భావించవచ్చు.
చివరగా- శ్రీ ర్యాలి ప్రసాద్ చెప్పినట్లు- ఇతని కవిత్వంలో కన్నీటికి లిపిని వెతికే ఒక ప్రయత్నం; వెన్నెలమీద చీకటి చేసిన సంతకాల్ని చెరిపేసే ప్రయత్నం; ఒక యుద్ధం నిజరూపం దాల్ఛేటప్పుడు తానొక ఆయుధంలా మారే ప్రయత్నం - కనిపించాయి.
సురేంద్రదేవ్ చెల్లి కవిత్వ సంపుటి "నడిచే దారిలో" ఆధునిక డిక్షన్ అద్బుతంగా ఒదిగిపోయింది. తన అసమాన ప్రతిభతో తెలుగు కవిత్వ భవిష్యత్తు పట్ల భరోసాను కలిగిస్తున్న ఇతనిని కొత్తతరపు ప్రతినిధిగా గుర్తించి, కవిసంధ్య యువ పురస్కారం 2021 అందచేయటం ఎంతో సముచితమనికి భావిస్తున్నాను.
బొల్లోజు బాబా
9849320443



Tuesday, November 16, 2021

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా"

 "ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ప్రెస్ నుండి విడుదలైంది.

తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన ప్రాచీన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన తొమ్మిది ఇతర పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
.
వెల: 150 రూపాయలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
.
"మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
.
భవదీయుడు
బొల్లోజు బాబా





Thursday, October 28, 2021

మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పు గోదావరి జిల్లా' పుస్తక సమీక్ష

 మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పు గోదావరి జిల్లా' పుస్తక సమీక్ష - 24 అక్టోబరు 2021 సంచికలో ప్రచురితమయింది.

ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా
***
కొని, దాచుకొని, బహుమతిగా ఇవ్వదగ్గ "మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పుగోదావరి జిల్లా"
కవిగా, రచయితగా ప్రసిద్ధిపొందిన బొల్లోజు బాబాకు చరిత్ర పరిశోధన ఆసక్తికరమైన విషయం. వ్యక్తిగత ఆసక్తితో ఆయన చరిత్ర విషయాలపై పరిశోధిస్తూ చక్కటి విషయాలను ప్రకటిస్తూంటారు. ఆ పరిశోధనలో భాగమే "మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పుగోదావరి జిల్లా" అన్న పుస్తకం.
కైఫియత్ అన్న పదానికి పలు అర్ధాలున్నాయి........
మిగిలిన భాగాన్ని ఈ లింకులో చదువుకోగలరు దయఛేసి
లింక్:

Friday, October 22, 2021

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" కవర్ పేజ్

 



నా తదుపరి పుస్తకం "ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" కవర్ పేజ్ ఇది.
అందమైన అర్ధవంతమైన ముఖచిత్రాన్ని, గెటప్ ను అందించినందుకు- థాంక్యూ గిరిథర్ గారు, బాల్యమిత్రుడు చిన్నారి ముమ్మిడి.
తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఇతర తొమ్మిది పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
"మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా

Tuesday, October 19, 2021

Bolloju Baba Poetry Quote

 


ఒక apocalypse అనంతరం.....

 ఒక apocalypse అనంతరం.....

అడవి మధ్య పెద్ద మైదానంలో
ఒక గుంపు పోగుబడి ఉంది
పూసలు ధరించిన ఓ ముసలి వ్యక్తి
రాళ్ల మధ్య అటూ ఇటూ తిరిగి
గుండ్రంగా నునుపుగా ఉన్న చిన్న రాయిని ఎంపికచేసి
శుభ్రం చేసిన నేలపై ఉంచాడు.
చుట్టూ నాలుగు పుల్లలు పాతి
పుల్లలపై ఏదో అడవి చెట్టు ఆకులు పేర్చి
ఎదురుగా కూర్చొని ఆ రాయినే చూస్తూ
ఏదో మాట్లాడుతున్నాడు
అతని చుట్టూ అందరూ ఒక వలయాకారంగా కూర్చొని
కనులు మూసుకొని మౌనంగా ఉన్నారు
రకరకాల హావభావాలతో అతనా రాయితో
మెల్లగా మాట్లాడుతున్నాడు- మధ్యమధ్యలో నవ్వుతూ,
ఏడుస్తు, ఒక్కోసారి గంభీరంగా, కొన్ని సార్లు అభావంగా
చివరగా నేలను ముద్దాడి,
తన మనుషులకు నవ్వుతూ సైగ చేసాడు
అందరూ గంతులు వేస్తూ, డప్పులు మోగిస్తూ,
ఆనందించటం మొదలెట్టారు
అతని వద్దకు నెమ్మదిగా వెళ్ళి అడిగాను
ఆ రాయేమిటని
మా దేవుడు
ఎం చేసావు ఇంతసేపూ
మాట్లాడాను
ఏం మాట్లాడావు
పోయినేడు పంపించిన పెద్దలను చల్లగా చూసుకోమని
అడవి పూలు విరగకాయాలని
పిట్టలు, జంతువులూ సంతోషంగా జతకట్టాలని అడిగాను
ఇంకా
జీవులన్నీ పంచుకోగా పళ్ళూ దుంపలు మిగలాలనీ
వానలతో కప్పల నోళ్ళు నిండాలనీ
పుట్టబోయే బిడ్డలకొరకు వారి తల్లుల గర్భాలు గట్టిపడాలని
దేవుడు ఏమన్నాడు?
అలాగేనన్నాడు
మీ దేవుడి పేరేమిటి?
దేవుడు
పేరు
దేవుడికి పేరేమిటి? దేవుడి పేరు దేవుడే!
ఇదిగో జీలుగు రసం తాగు అంటూ
చిన్న తాటాకు దొప్ప చేతిలో ఉంచాడు.
బొల్లోజు బాబా

Friday, October 15, 2021

Bolloju Baba Poetry Quote

 


స్త్రీ

 స్త్రీ

ఎంతకాలం
తన స్వప్నాల్ని
బతికించుకోగలడు
పాపం ఆ కుర్రాడు!
నేత్రాల్ని అమ్ముకొని అంధత్వాన్ని
హృదయాన్ని అమ్ముకొని అల్పత్వాన్ని
కొనుక్కోక తప్పదు ఏనాటికైనా
"నువ్వు ఇదివరకట్లా లేవు
చాలా మారిపోయావు" అంటుందామె ఓ రోజు
కాళ్ల క్రింద నేల కూలినట్లనిపిస్తుంది అతనికి
ఆమె ఒళ్ళో చేరి
వల వలా ఏడ్చేస్తాడు.
ఆమె, తన స్తన్యాన్ని అతని
నోటికి అందించి
ఓదారుస్తుంది.
బొల్లోజు బాబా

Friday, October 8, 2021

Bolloju Baba Poetry Quote

 


Bolloju Baba Poetry Quote

 






Bolloju Baba Poetry Quote

 




బొల్లోజు బాబా - సాహిత్య అనుశీలన

 నేను ఇంతవరకూ

• ఆకుపచ్చని తడిగీతం (2008), వెలుతురు తెర (2016), మూడో కన్నీటిచుక్క (2019) పేరిట మూడు కవిత్వ సంపుటులు
• కవిత్వ భాష పేరుతో కవిత్వ లాక్షణిక వ్యాససంపుటి (2018)
• యానాం విమోచనోద్యమం (2006), ఫ్రెంచి పాలనలో యానాం (2012), మెకంజీ కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా (2020) పేరిట మూడు చరిత్ర పుస్తకాలు
• స్వేచ్ఛావిహంగాలు పేరుతో (2016) విశ్వకవి టాగూర్ స్ట్రే బర్డ్స్ తెలుగు అనువాదం.
ఇదీ దాదాపు పాతికేళ్ల నా సాహితీయానం.
ఈ ebook లో ఉన్నది నా పుస్తకాలపై వచ్చిన వివిధ వ్యాసాలు. చాలా మట్టుకు పత్రికలలో ప్రచురితమైనవి. మిగిలినవి ఆయాపుస్తకాలకు ముందుమాటలు.
ఈ వ్యాసాలన్నీ మరలా తరచిచూసుకొన్నాక నా రచనలన్నింటిలో కవిత్వ సంపుటులను ఎక్కువగా ఆదరించారని అర్ధమైంది.
ఈ వ్యాసాలు వ్రాసినవారికి, ఆయా రచనలను చదివి తమ తక్షణ అభిప్రాయాలను అక్కడకక్కడే తెలిపిన వందలాది మిత్రులకు సదా కృతజ్ఞతలతో
ఇక్కడనుండి దిగుమతి చేసుకొనవచ్చును

Bolloju Baba Poetry Quote

 


Bolloju Baba Poetry Quote

 


Bolloju Baba Poetry Quote