Saturday, January 30, 2010

రచన (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అమ్మా,
నాన్న బోలెడన్ని పుస్తకాలు రాస్తారని నీ వంటావు కానీ ఆయనేం రాస్తారో నాకెపుడూ అర్ధం కాదు.
సాయింత్రం వేళలో నీకు చదివి వినిపిస్తూంటారు, ఆయన చెప్పేవన్నీ నీకు అర్ధమౌతాయా?

అమ్మా! నువ్వు మాకెంతో మంచి మంచి కధలు చెపుతావు! నాన్నెందుకలా రాయరూ అని నాకు ఆశ్చర్యమేస్తుంటుంది.

రాక్షసులు, రాకుమారిలు, మాంత్రికుల గురించిన కధల్ని నాన్న నాయినమ్మవద్ద వినలేదా?
అన్నీ మరచిపోయారా?

స్నానానికి ఆలస్యమౌతుందని వందసార్లన్నా పిలుస్తావు నీవు.

ఆయనకై ఎదురుచూస్తూ నీవు భోజనాన్ని వెచ్చచేస్తూ ఉంటావా, నాన్న మాత్రం అలా రాసుకుంటూనే ఉండి ఆ విషయాన్నే మరచిపోతారు. పుస్తకాలు రాసుకోవటం అనే ఆటలో నాన్న మునిగిపోతారు.

నేనెప్పుడయినా నాన్న గదిలో ఆడుకోవటానికి వెళితే “అల్లరెక్కువయింది నీకు” అంటూ నన్ను బయటకు పిలిచేస్తావు.
నేనేదైనా చిన్న శబ్దం చేస్తే చాలు “నాన్న పనిలో ఉన్నారు” కనపడటం లేదా” అంటావు.

ఎపుడు చూసినా అలా రాస్తూ ఉండటంలో ఏమానందముందీ?
నేనెపుడైనా నాన్న పెన్ను తీసుకొని ఆయన పుస్తకంపై తను రాసినట్లుగానే అ ఆ ఇ ఈ లు రాస్తే, నన్నెందుకు కోప్పడతావు? నాన్న రాస్తుంటే ఒక్కమాట కూడా అనవు.
నాన్న అలా కట్టలు కట్టలు కాగితాల్ని వృధా చేస్తుంటే నువ్వసలు పట్టించుకోవు.
కానీ నేనెపుడైనా పడవ చేసుకోవటానికి ఒకే ఒక్క కాగితం తీసుకుంటే మాత్రం “ఎన్ని తిప్పలు పెడుతున్నావురా కన్నా” అని కోప్పడతావు.

నాన్న అలా బోల్డన్ని కాగితాలను రెండువైపులా నల్లని రాతలతో నాశనం చేయటం పట్ల నీవేమనుకొంటున్నావూ?మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని AUTHORSHIP

బొల్లోజు బాబా

Sunday, January 24, 2010

ఫ్రాగ్మెంట్స్ 5

1.
నేల సంకెళ్లను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతూంటాయి తరువులు.

చెట్టుని మించిన
వ్యక్తిత్వ వికాస పుస్తకం ఏది?

2.
జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది.
ఆ ముఖంపై ముడుతలన్నీ
దాని పాదముద్రలే.

3.
ఒక్క ప్రార్ధనతో
ఈ గాజుపెంకులు
తొలగిపోతాయంటే
ఆత్మను కొవ్వొత్తిలా
మండించటానికి
నెనెప్పుడూ తయారే!

కానీ బెల్లు నొక్కితే
ఈశ్వరుడు ప్రత్యక్షమౌతాడా?

4.

అందరూ ఏదో ఒకనాడు
సూదిబెజ్జంలోంచి సాగాల్సిందే
వెలుగులోకో, చీకట్లోకో!

ఆ దినాంతాన
ఇచ్చిన వాటిని
పంచావా అంటే
ఏం చెప్పాలీ?


5.
తేనెటీగ కుట్టిన బాధలో
నాకు గుర్తుకే రాలేదు
అది కాసేపట్లో
అది చచ్చిపోతుందని.


భవదీయుడు
బొల్లోజు బాబా

Thursday, January 21, 2010

భువనఘోష - పాబ్లో నెరుడా కవితానువాదాలు - పుస్తక సమీక్ష


పాబ్లోనెరుడా - కవిత్వానికొక చిరునామాగా నిలచిన పేరది. గత శతాబ్దపు ఉత్తమ ప్రపంచ కవిగా గుర్తింపబడ్డ వ్యక్తి పాబ్లో. ఆయన కవిత్వం రుచి చూడని కవి ఏ దేశంలోనూ ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో కూడా ఆయనకవిత్వానువాదాల్ని చాలామందే చేసారు. శ్రీశ్రీ, ఆవంత్స, ఇస్మాయిల్ వంటి ఆనాటి కవుల నుండి, యదుకుల భూషణ్, రవి ప్రకాష్, మందలపర్తి వంటి ఈనాటి కవుల వరకూ చాలామంది ఆ కవిత్వ సాగరంలో మునిగి తేలిన వారే! బహుసామరో పది తరాలను కూడా ప్రభావితం చేయగల సత్తా పాబ్లో కవిత్వానికుంది. చిక్కదనం వెచ్చదనంల కలబోత పాబ్లోకవిత్వం.

పాబ్లో గతించి 35 సంవత్సరములు దాటుతున్నా తెలుగులో ఆయన కవిత్వ సంకలనం లేదన్న లోటును శ్రీ విరియాలలక్ష్మీపతి గారి సంపాదకత్వంలో వచ్చిన " భువన ఘోష" (పాబ్లో నెరుడా కవిత్వానువాదాలు) తీరుస్తుంది. ఒక ప్రపంచసాహితీ పాయను తెలుగుగడ్డపై ప్రవహింపచేసినట్లయింది. దీనికి డా. ఏటుకూరి ప్రసాద్ గారు, కా. జె.వి సత్యనారాయణ మూర్తి గారు ముందుమాటలు వ్రాసారు.

భువనఘోషలో మొత్తం 95 కవితలున్నాయి. వీటిని 52 మంది ప్రముఖ కవులు అనువదించారు. ఇస్మాయిల్ శ్రీ శ్రీ ల వంటి వారు ఇదివరలో చేసిన అనువాదాలను యధాతధంగా వాడుకొన్నారు. మిగిలినవి విరియాల లక్ష్మీ పతి గారి బృహత్ ప్రయత్నమనే చెప్పుకోవాలి.

ఇక అనువాదం గురించయితే
నెరుడా కవిత్వం ఓ మహానది వంటిది. నదీ గమనాన్నో గానాన్నో అనువాదం చేయటం ఆషామాషీ కాదు. దాని ఒడ్డుననిలచి ఆ సౌందర్యాన్ని ఆనందించాలి అంతే! అలాంటి ఒక దివ్యానుభూతిని నిజాయితీగా ఈ అనువాదాలు మనముందుకు తీసుకొచ్చాయి.

ఒక మహాకవి వ్రాసిన అనేక కవితలలోకొన్నింటిని అనువదించి ఒక సంకలనంద్వారా తీసుకురావటంలో ఉండే ప్రధానసమస్య " ఎంపిక". ఈ ఎంపిక అనేది ఎలా ఉండాలంటే ఆ కవి ఫిలాసఫీనో లేక ఆత్మనో అద్దంలో చూపించే విధంగాఉండాలి. ఈ విషయంలో ఈ కవితాసంకలనం ఎందుకో పాబ్లోని ఒక కమ్యూనిష్టు కవిగా "ప్రొజెక్ట్" చేయయత్నించినట్లనిపిస్తుంది. పాబ్లో కవిత్వం బంధింపజాలని జలపాతం వంటిది. అది ఒక విశ్వజీవన గీతం. మానవమహేతిహాసం.

ఒకే కవితకు రెండు అనువాదాలు ఇవ్వటం కూడా కొంత బాధ్యతా రాహిత్యమే. (రెండూ గొప్పగా ఉన్నాయి అది వేరేవిషయం). దేవరాజు మహారాజు, చంద్రమౌళి, ఎన్. అరుణ, నిర్మలానంద, మందలపర్తి కిషోర్ వంటి వారల అనువాదాలు అద్బుతంగా ఉన్నాయి. మన అంతర్జాల మిత్రులు భూషణ్, గరికపాటి ల ఒక్కో కవిత - ముకుందరామారావు, హెచ్చార్కెల రెండేసి కవితల చొప్పున ఈ సంకలనంలో ఉన్నాయి.
అవి మంచి తెలుగు నుడికారంతో తేటగా ప్రకాశిస్తున్నాయి.

ఈ సంకలనంలో చాలా కవితలు చదువుతూంటే పాబ్లో తెలుగులో వ్రాసాడా అన్నంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. అది ఆయా అనువాదకుల ప్రతిభే. ఉదా: రాచకొండ నరశింహశర్మ గారి " మేమనేకమంది" (we are many) అన్నకవితను చదువుతూంటే పాబ్లో తెలుగువాక్యాల్లో ఇమిడిపోయిన తీరు విశ్మయపరుస్తుంది. ఆ కవితలోంచి కొన్ని పాదాలు

నాలో ఉన్న అనేకమందిలో
మా అందరిలో
అవసరానికి అగుపించడు
ఏ ఒక్కడైనా.
అదృశ్యమౌతారు
నా దుస్తులలో దూరి
వెళిపోతారు-ఇంకో ఊరికి ///

ఎపుడైన ఒక కొలిక్కి
నన్నునేను తెచ్చుకోగలనా ///

ఇది వ్రాస్తునపుడు
నేనిక్కడలేను
ఎంతో దూరంలో ఉన్నాను
తిరిగివచ్చేటప్పటికి
వెళ్లిపోయిఉంటాను నేను.
మీ అందరిపరిస్థితీ ఇంతేనా అని
తెలుసుకోవాలని ఉంటుంది నాకు.

పాబ్లో కవిత్వాన్ని తెలుగులో వినాలనుకుంటే ఈ పుస్తకాన్ని తప్పని సరిగా చదవాల్సిందే. పాబ్లో కవిత్వానువాదాలసంకలనం ఇంతవరకూ ఎవరూ తీసుకురాకపోవటం నిజంగా సిగ్గుచేటే. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా ఇప్పటికైనా విరియాలలక్ష్మీపతిగారి కృషి వలన జరగటం గర్వించదగిన విషయం, హర్షించదగిన ప్రయత్నం.

పాబ్లో ని ప్రేమించే వారికి, పాబ్లో అంటే పడిచచ్చేవారికి, పాబ్లో అంటే ఏమీ తెలియని వారికీ కూడా నచ్చే విధంగా ఈ పుస్తకంఉంది అనటంలో సందేహం లేదు.

లభించు చోటు
విశాలాంద్ర అన్ని బ్రాంచీలు
కామ్రేడ్ జె.వి. సత్యనారాయణ మూర్తి
మార్క్సిష్టు అధ్యయన కేంద్రం
అల్లిపురం, విశాఖపట్నం 530004
ఫోన్స్: 0891 2523262

వెల : వంద రూపాయిలు.

బొల్లోజు బాబా

Wednesday, January 6, 2010

రూమీ గీతాలు

సూఫీ కవిత్వం పేరిట నేచేసిన సూఫీ గీతాల అనువాదాలు ఈ క్రింది లింకులో గమనించవచ్చు.

http://www.scribd.com/doc/23859189/Sufi-Poetry-Telugu-translations


నాకు నచ్చిన మరికొన్ని రూమీ గీతానువాదాలు ఇవి.
1
అంతులేదు.
యానానికి అంతం లేదు.
ఎన్నటికీ ముగింపు రాదు.
ప్రేమలో పడిన హృదయం
తెరుచుకోవటం నిలిపివేయగలదా?
నీవు నన్ను ప్రేమిస్తూంటే
నీవు ఒక్కసారిగా చచ్చిపోవు.
ప్రతీ క్షణం నాలో మరణిస్తూ
తిరిగి జన్మిస్తూంటావు.
నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
పని ఇప్పుడే చేయి.
రూమీ

2
రాత్రివేళ
మనం ఒకరినొకరం గొప్ప లౌల్యంతో పెనవేసుకొంటాం
వెలుతురొచ్చాకా నువ్వు నన్ను తోసేస్తావు
నీ కురులను వెనక్కు విదిలించినట్లుగా.
నీ కనులు ఈశ్వరునితో మత్తెక్కి ఉంటాయి.
నావి నిన్ను చూస్తూ,
ఒక తాగుబోతుకు మరొకరు తోడు.
రూమీ

3
రోజంతా నీతో కలసి పాడుతూ ఉన్నాను
రాత్రి నీ తల్పం పైనే నిద్రించాను.
అది రాత్రో పగలో కూడా తెలియలేదు నాకు.
నేనెవరో నాకు తెలుసని అనుకొన్నాను
కానీ నేనే నీవు.
రూమీ

4
నేను పోగొట్టుకొన్నాను, నా ప్రపంచాన్ని, నా కీర్తిని, నా హృదయాన్ని.....
సూర్యుడు ఉదయించాడు, అన్ని నీడలు పరుగులెత్తాయి.
నేనూ వాటివెనుక పడ్డాను. అవి అందకుండా అదృశ్యమయ్యాయి......
కాంతి నా వెంటబడి వేటాడింది.
రూమీ

5
నేను రూపసిని కాను అందవికారినీ కాను.
అదీ కాదు ఇదీ కాదు.
నేను బజారులో పధికుడినీ కాను
లేక ఉద్యానవనంలో కోయిలనూ కాను.
నా గురువు నాకో పేరు పెట్టాడు కనుక
నన్ను నేను ఎలా సంభోదించుకోవాలో తెలుసంతే.
నేను బానిసనూ కానూ స్వతంత్రుడినీ కాను.
మైనాన్ని కాను లోహాన్ని కాను.
నేనెవరినీ ప్రేమించిందీ లేదు,
నన్నెవరూ ప్రేమిస్తూనూ లేరు.
నేను పాపినా లేక పుణ్యాత్ముడనా
పాప పుణ్యాలు మరొకరిద్వారా వస్తాయి
నానుంచి రావు.
ఆయన నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడకు
మారు మాట్లాడక వెళుతూంటాను. అంతే!
రూమీ

6
తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి
ఎవరదీ అని చూసే దాకా!
రూమీ


భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, January 3, 2010

నా కవితాసంకలనంపై శ్రీ పి.ఆర్.ఎల్. స్వామి గారి స్పందన

శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి గారు యానాం కు చెందిన ప్రముఖ కవి. పాండిచేరీ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే కలైమామణి" బిరుదాంకితులు.వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరి కవిత్వం సరళంగా జీవితంలోని భిన్నపార్శ్వాలను తాకుతూ అలరింప చేస్తుంది . ఆధునిక, ప్రాచీన కవిత్వ ధారణ వీరి ప్రత్యేకత. ప్రముఖ కవుల కవితలను అనర్ఘళంగా గానం చేస్తూ అనేక ప్రదర్శనలను ఇచ్చారు. పలువురి ప్రశంసలు పొందారు.

నా కవితా సంకలనాన్ని చదివి మెచ్చుకొంటూ వారు వ్రాసి ఇచ్చిన కొన్ని వాక్యాలు ఇవి. వీటిలోని దాదాపు అన్ని పదాలు నా కవితా శీర్షికలైనప్పటికీ, దీనిని విడిగ చదివినా ఒక కవితలాగ అనిపించటం వీరి ప్రతిభకు నిదర్శనంగా, నా కవిత్వానికి లభించిన గౌరవంలా నేను భావిస్తున్నాను.

వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ......

భవదీయుడు
బొల్లోజు బాబా

తడి గీతం మీద పొడి సంతకం

మిత్రుడు......
సహృదయుడు....
బొల్లోజు బాబా వెన్నెల నావనెక్కి
ఆకుపచ్చని తడిగీతాన్ని శిల్పంలా చెక్కాడు
ఆ శబ్దానికి రాలిన పూలు
సుగంధాలను గానం చేస్తున్నాయి
కవికి అపరిచిత ప్రపంచంలో
బతకడం ఇష్టం ఉండదు.
అందుకే మట్టికనుల పల్లెతో
నిరంతరం కరచాలనం చేస్తూంటాడు.
ఇన్నాళ్లూ తనలో దాచుకున్న అనేకానేక
రహస్యాలతో పొగడ చెట్టుమీద
వెన్నెల పిట్టలా కాగితాలమీద వాలాడు.
అతని అక్షరాల సంగీతమేఘం
తేనెపాటాల్ని వర్షిస్తోంది.
అతని వాక్యాల వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతున్నాయి.
ఖాళీ రాత్రులలోంచి ఉదయించే జ్ఞాపకాలన్నీ
హాయగా సలపడం కోసం
బాబా జీవితాన్ని పుటలు పుటలు గా పరిచాడు
అతడికి ఒకే ఒక ఆశ
పుస్తకంలోకి నడవటం
ప్రతివేకువ జామున ముళ్లగాయాలను
స్పర్శిస్తూంటాడు.
కాంక్షాతీరా వెతుకులాటలో అతడి నిరీక్షణ
ఆకాశంలోకి తెరుచుకుంటుంది.
అతని గుండెలో
సుళ్లు తిరిగే కన్నీళ్లని, ఆశల్ని, ఆవేశాల్ని
కలల తెరపై చిత్రించుకుంటాడు.
కవి "సాహితీయానాన్ని"
గాలి, చెట్టు,పిట్టా
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
పోలవరం నిర్వాసితులకోసం
జీవనసౌందర్యాన్నే నిర్మించగల
ఈ కవి హృదయం
ఒక సూర్యుడు
ఒక నది.

కలైమామణి పి.ఆర్.ఎల్. స్వామి