Thursday, January 21, 2010

భువనఘోష - పాబ్లో నెరుడా కవితానువాదాలు - పుస్తక సమీక్ష


పాబ్లోనెరుడా - కవిత్వానికొక చిరునామాగా నిలచిన పేరది. గత శతాబ్దపు ఉత్తమ ప్రపంచ కవిగా గుర్తింపబడ్డ వ్యక్తి పాబ్లో. ఆయన కవిత్వం రుచి చూడని కవి ఏ దేశంలోనూ ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో కూడా ఆయనకవిత్వానువాదాల్ని చాలామందే చేసారు. శ్రీశ్రీ, ఆవంత్స, ఇస్మాయిల్ వంటి ఆనాటి కవుల నుండి, యదుకుల భూషణ్, రవి ప్రకాష్, మందలపర్తి వంటి ఈనాటి కవుల వరకూ చాలామంది ఆ కవిత్వ సాగరంలో మునిగి తేలిన వారే! బహుసామరో పది తరాలను కూడా ప్రభావితం చేయగల సత్తా పాబ్లో కవిత్వానికుంది. చిక్కదనం వెచ్చదనంల కలబోత పాబ్లోకవిత్వం.

పాబ్లో గతించి 35 సంవత్సరములు దాటుతున్నా తెలుగులో ఆయన కవిత్వ సంకలనం లేదన్న లోటును శ్రీ విరియాలలక్ష్మీపతి గారి సంపాదకత్వంలో వచ్చిన " భువన ఘోష" (పాబ్లో నెరుడా కవిత్వానువాదాలు) తీరుస్తుంది. ఒక ప్రపంచసాహితీ పాయను తెలుగుగడ్డపై ప్రవహింపచేసినట్లయింది. దీనికి డా. ఏటుకూరి ప్రసాద్ గారు, కా. జె.వి సత్యనారాయణ మూర్తి గారు ముందుమాటలు వ్రాసారు.

భువనఘోషలో మొత్తం 95 కవితలున్నాయి. వీటిని 52 మంది ప్రముఖ కవులు అనువదించారు. ఇస్మాయిల్ శ్రీ శ్రీ ల వంటి వారు ఇదివరలో చేసిన అనువాదాలను యధాతధంగా వాడుకొన్నారు. మిగిలినవి విరియాల లక్ష్మీ పతి గారి బృహత్ ప్రయత్నమనే చెప్పుకోవాలి.

ఇక అనువాదం గురించయితే
నెరుడా కవిత్వం ఓ మహానది వంటిది. నదీ గమనాన్నో గానాన్నో అనువాదం చేయటం ఆషామాషీ కాదు. దాని ఒడ్డుననిలచి ఆ సౌందర్యాన్ని ఆనందించాలి అంతే! అలాంటి ఒక దివ్యానుభూతిని నిజాయితీగా ఈ అనువాదాలు మనముందుకు తీసుకొచ్చాయి.

ఒక మహాకవి వ్రాసిన అనేక కవితలలోకొన్నింటిని అనువదించి ఒక సంకలనంద్వారా తీసుకురావటంలో ఉండే ప్రధానసమస్య " ఎంపిక". ఈ ఎంపిక అనేది ఎలా ఉండాలంటే ఆ కవి ఫిలాసఫీనో లేక ఆత్మనో అద్దంలో చూపించే విధంగాఉండాలి. ఈ విషయంలో ఈ కవితాసంకలనం ఎందుకో పాబ్లోని ఒక కమ్యూనిష్టు కవిగా "ప్రొజెక్ట్" చేయయత్నించినట్లనిపిస్తుంది. పాబ్లో కవిత్వం బంధింపజాలని జలపాతం వంటిది. అది ఒక విశ్వజీవన గీతం. మానవమహేతిహాసం.

ఒకే కవితకు రెండు అనువాదాలు ఇవ్వటం కూడా కొంత బాధ్యతా రాహిత్యమే. (రెండూ గొప్పగా ఉన్నాయి అది వేరేవిషయం). దేవరాజు మహారాజు, చంద్రమౌళి, ఎన్. అరుణ, నిర్మలానంద, మందలపర్తి కిషోర్ వంటి వారల అనువాదాలు అద్బుతంగా ఉన్నాయి. మన అంతర్జాల మిత్రులు భూషణ్, గరికపాటి ల ఒక్కో కవిత - ముకుందరామారావు, హెచ్చార్కెల రెండేసి కవితల చొప్పున ఈ సంకలనంలో ఉన్నాయి.
అవి మంచి తెలుగు నుడికారంతో తేటగా ప్రకాశిస్తున్నాయి.

ఈ సంకలనంలో చాలా కవితలు చదువుతూంటే పాబ్లో తెలుగులో వ్రాసాడా అన్నంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. అది ఆయా అనువాదకుల ప్రతిభే. ఉదా: రాచకొండ నరశింహశర్మ గారి " మేమనేకమంది" (we are many) అన్నకవితను చదువుతూంటే పాబ్లో తెలుగువాక్యాల్లో ఇమిడిపోయిన తీరు విశ్మయపరుస్తుంది. ఆ కవితలోంచి కొన్ని పాదాలు

నాలో ఉన్న అనేకమందిలో
మా అందరిలో
అవసరానికి అగుపించడు
ఏ ఒక్కడైనా.
అదృశ్యమౌతారు
నా దుస్తులలో దూరి
వెళిపోతారు-ఇంకో ఊరికి ///

ఎపుడైన ఒక కొలిక్కి
నన్నునేను తెచ్చుకోగలనా ///

ఇది వ్రాస్తునపుడు
నేనిక్కడలేను
ఎంతో దూరంలో ఉన్నాను
తిరిగివచ్చేటప్పటికి
వెళ్లిపోయిఉంటాను నేను.
మీ అందరిపరిస్థితీ ఇంతేనా అని
తెలుసుకోవాలని ఉంటుంది నాకు.

పాబ్లో కవిత్వాన్ని తెలుగులో వినాలనుకుంటే ఈ పుస్తకాన్ని తప్పని సరిగా చదవాల్సిందే. పాబ్లో కవిత్వానువాదాలసంకలనం ఇంతవరకూ ఎవరూ తీసుకురాకపోవటం నిజంగా సిగ్గుచేటే. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా ఇప్పటికైనా విరియాలలక్ష్మీపతిగారి కృషి వలన జరగటం గర్వించదగిన విషయం, హర్షించదగిన ప్రయత్నం.

పాబ్లో ని ప్రేమించే వారికి, పాబ్లో అంటే పడిచచ్చేవారికి, పాబ్లో అంటే ఏమీ తెలియని వారికీ కూడా నచ్చే విధంగా ఈ పుస్తకంఉంది అనటంలో సందేహం లేదు.

లభించు చోటు
విశాలాంద్ర అన్ని బ్రాంచీలు
కామ్రేడ్ జె.వి. సత్యనారాయణ మూర్తి
మార్క్సిష్టు అధ్యయన కేంద్రం
అల్లిపురం, విశాఖపట్నం 530004
ఫోన్స్: 0891 2523262

వెల : వంద రూపాయిలు.

బొల్లోజు బాబా

6 comments:

 1. nice review.

  నెరుడా కవిత్వం ఓ మహానది వంటిది. నదీ గమనాన్నో గానాన్నో అనువాదం చేయటం ఆషామాషీ కాదు.

  you are absolutely correct

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. నాకు పాబ్లో నెరుడా కవిత్వం అంత తేలికగా అర్థం కాదు. చాలా ఉన్నత స్థాయిలో ఉంటుందనిపిస్తుంది. నాకు ఆయన గురించి తెలిసిందే మీ ద్వారా అనుకోండి. మీరు చెప్పినవి, ఇతరత్రా చదివినవీ చూస్తే మరీ అంత చిక్కటి కవిత్వం జీర్ణించుకోవడానికి నాకు చాలా టైం పడుతున్దనిపిస్తుంది

  ReplyDelete
 4. బాగుందండి పరిచయం. మీ పుణ్యాన ఏంత మంది గొప్ప కవులు పరిచయమవుతున్నారు మాకు. చాలా థ్యాంక్స్ బాబా గారు.

  ReplyDelete
 5. "ఇది వ్రాస్తునపుడు
  నేనిక్కడలేను
  ఎంతో దూరంలో ఉన్నాను
  తిరిగివచ్చేటప్పటికి
  వెళ్లిపోయిఉంటాను నేను.
  మీ అందరిపరిస్థితీ ఇంతేనా అని
  తెలుసుకోవాలని ఉంటుంది నాకు."

  బలే వుంది చదువుతుంటే. ఎక్కడో ఎదో తీరానికి వెళ్ళి కనపడని అంచులను లాగి ఒక దగ్గర చేరుస్తున్నట్లు వుంది.

  ReplyDelete
 6. మానస సంచర గారూ

  పాబ్లో కవిత్వంలో సంక్లి్ష్టత పాళ్లు కొంచెం ఎక్కువే. అయినా దానిలో ఏదో తెలియని గొప్ప అందం, అనుభూతీ ఉంటాయి. ఒకే కవితకు రెండుమూడు భాష్యాలు కూడా సాధ్యమే.

  మీకు వీలైతే పాబ్లో వ్రాసిన odes on common things (ఉప్పు, స్పూను, కత్తెర, సబ్బు, అత్తరు వంటి దైనందిక వస్తువులపై కవిత్వం) చదవండి. చాలా సరళంగా అనంతమైన లోతుల్నీ అందాల్ని కలిగి ఉండి, ఆయా వస్తువులని అంత అద్బుతంగా ఎలా కవిత్వీకరించారో అర్ధమై పాబ్లో గొప్పతనం తెలుస్తుంది. ఇక ప్రేమించటం మొదలు పెడతారు. ఏమో పిచ్చిలో పడతారేమో కూడా. :-)

  భావనగారూ
  మనలో ఉండే మల్టిపుల్ ముఖాల్ని ఆకవిత అత్యద్బుతంగా ఆవిష్కరిస్తుంది.

  దాదాపు ఇదే భావని ప్రముఖ సూఫీ కవి సుమారు ఆరు శతాబ్దాలక్రితం ఇలా అంటాడు

  "ఇన్ని వేల నేనుల్లో ఏ నేను నేనా అని ఆశ్చర్యపోతుంటాను"

  ఎంత రమ్యమైన భావన. ఒక సంక్లి్ష్ట భావనని ఎంత దూరం తీసుకెళ్లాడు పాబ్లో చాలా స్పష్టంగా, ముఖాన గుద్దినట్లు ......

  స్పందించిన మిత్రులకు ధన్యవాదములu

  బొల్లోజు బాబా

  ReplyDelete