Saturday, January 30, 2010

రచన (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అమ్మా,
నాన్న బోలెడన్ని పుస్తకాలు రాస్తారని నీ వంటావు కానీ ఆయనేం రాస్తారో నాకెపుడూ అర్ధం కాదు.
సాయింత్రం వేళలో నీకు చదివి వినిపిస్తూంటారు, ఆయన చెప్పేవన్నీ నీకు అర్ధమౌతాయా?

అమ్మా! నువ్వు మాకెంతో మంచి మంచి కధలు చెపుతావు! నాన్నెందుకలా రాయరూ అని నాకు ఆశ్చర్యమేస్తుంటుంది.

రాక్షసులు, రాకుమారిలు, మాంత్రికుల గురించిన కధల్ని నాన్న నాయినమ్మవద్ద వినలేదా?
అన్నీ మరచిపోయారా?

స్నానానికి ఆలస్యమౌతుందని వందసార్లన్నా పిలుస్తావు నీవు.

ఆయనకై ఎదురుచూస్తూ నీవు భోజనాన్ని వెచ్చచేస్తూ ఉంటావా, నాన్న మాత్రం అలా రాసుకుంటూనే ఉండి ఆ విషయాన్నే మరచిపోతారు. పుస్తకాలు రాసుకోవటం అనే ఆటలో నాన్న మునిగిపోతారు.

నేనెప్పుడయినా నాన్న గదిలో ఆడుకోవటానికి వెళితే “అల్లరెక్కువయింది నీకు” అంటూ నన్ను బయటకు పిలిచేస్తావు.
నేనేదైనా చిన్న శబ్దం చేస్తే చాలు “నాన్న పనిలో ఉన్నారు” కనపడటం లేదా” అంటావు.

ఎపుడు చూసినా అలా రాస్తూ ఉండటంలో ఏమానందముందీ?
నేనెపుడైనా నాన్న పెన్ను తీసుకొని ఆయన పుస్తకంపై తను రాసినట్లుగానే అ ఆ ఇ ఈ లు రాస్తే, నన్నెందుకు కోప్పడతావు? నాన్న రాస్తుంటే ఒక్కమాట కూడా అనవు.
నాన్న అలా కట్టలు కట్టలు కాగితాల్ని వృధా చేస్తుంటే నువ్వసలు పట్టించుకోవు.
కానీ నేనెపుడైనా పడవ చేసుకోవటానికి ఒకే ఒక్క కాగితం తీసుకుంటే మాత్రం “ఎన్ని తిప్పలు పెడుతున్నావురా కన్నా” అని కోప్పడతావు.

నాన్న అలా బోల్డన్ని కాగితాలను రెండువైపులా నల్లని రాతలతో నాశనం చేయటం పట్ల నీవేమనుకొంటున్నావూ?



మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని AUTHORSHIP

బొల్లోజు బాబా

1 comment: