Showing posts with label అనువాదం. Show all posts
Showing posts with label అనువాదం. Show all posts

Wednesday, January 6, 2010

రూమీ గీతాలు

సూఫీ కవిత్వం పేరిట నేచేసిన సూఫీ గీతాల అనువాదాలు ఈ క్రింది లింకులో గమనించవచ్చు.

http://www.scribd.com/doc/23859189/Sufi-Poetry-Telugu-translations


నాకు నచ్చిన మరికొన్ని రూమీ గీతానువాదాలు ఇవి.
1
అంతులేదు.
యానానికి అంతం లేదు.
ఎన్నటికీ ముగింపు రాదు.
ప్రేమలో పడిన హృదయం
తెరుచుకోవటం నిలిపివేయగలదా?
నీవు నన్ను ప్రేమిస్తూంటే
నీవు ఒక్కసారిగా చచ్చిపోవు.
ప్రతీ క్షణం నాలో మరణిస్తూ
తిరిగి జన్మిస్తూంటావు.
నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
పని ఇప్పుడే చేయి.
రూమీ

2
రాత్రివేళ
మనం ఒకరినొకరం గొప్ప లౌల్యంతో పెనవేసుకొంటాం
వెలుతురొచ్చాకా నువ్వు నన్ను తోసేస్తావు
నీ కురులను వెనక్కు విదిలించినట్లుగా.
నీ కనులు ఈశ్వరునితో మత్తెక్కి ఉంటాయి.
నావి నిన్ను చూస్తూ,
ఒక తాగుబోతుకు మరొకరు తోడు.
రూమీ

3
రోజంతా నీతో కలసి పాడుతూ ఉన్నాను
రాత్రి నీ తల్పం పైనే నిద్రించాను.
అది రాత్రో పగలో కూడా తెలియలేదు నాకు.
నేనెవరో నాకు తెలుసని అనుకొన్నాను
కానీ నేనే నీవు.
రూమీ

4
నేను పోగొట్టుకొన్నాను, నా ప్రపంచాన్ని, నా కీర్తిని, నా హృదయాన్ని.....
సూర్యుడు ఉదయించాడు, అన్ని నీడలు పరుగులెత్తాయి.
నేనూ వాటివెనుక పడ్డాను. అవి అందకుండా అదృశ్యమయ్యాయి......
కాంతి నా వెంటబడి వేటాడింది.
రూమీ

5
నేను రూపసిని కాను అందవికారినీ కాను.
అదీ కాదు ఇదీ కాదు.
నేను బజారులో పధికుడినీ కాను
లేక ఉద్యానవనంలో కోయిలనూ కాను.
నా గురువు నాకో పేరు పెట్టాడు కనుక
నన్ను నేను ఎలా సంభోదించుకోవాలో తెలుసంతే.
నేను బానిసనూ కానూ స్వతంత్రుడినీ కాను.
మైనాన్ని కాను లోహాన్ని కాను.
నేనెవరినీ ప్రేమించిందీ లేదు,
నన్నెవరూ ప్రేమిస్తూనూ లేరు.
నేను పాపినా లేక పుణ్యాత్ముడనా
పాప పుణ్యాలు మరొకరిద్వారా వస్తాయి
నానుంచి రావు.
ఆయన నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడకు
మారు మాట్లాడక వెళుతూంటాను. అంతే!
రూమీ

6
తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి
ఎవరదీ అని చూసే దాకా!
రూమీ


భవదీయుడు

బొల్లోజు బాబా


Wednesday, August 26, 2009

చేజార్చుకొన్నాం...... పాబ్లో నెరుడా

ఈ సంధ్యను కూడా మనం చేజార్చుకొన్నాం.
లోకంలోంచి నీలి రాత్రి ఊడిపడే సాయింత్రపువేళ
మనం చేతిలో చేయివేసుకొని సాగటాన్ని ఎవరూ గమనించలేదు.

ఆ దూరపు కొండల అంచులపై సూర్యాస్తమయ ఉత్సవాన్ని
నా కిటికీ లోంచి చూసాను.

ఒక్కోసారి ఒక సూర్యుని ముక్క నా చేతిలో నాణెమై మండేది.
నీకూ తెలిసిన నా విషాద హృదయంతో
నిన్ను నేను గుర్తుచేసుకొంటాను.

అప్పుడెక్కడున్నావు నీవు?
అక్కడ ఇక వేరే ఎవరున్నారూ?
ఏం చెపుతున్నారూ?
నీ వియోగంతో నే దుఖి:స్తున్నపుడు అకస్మాత్తుగా
మొత్తం ప్రేమంతా నన్ను ఎందుకు ముంచెత్తుతుందీ?

చేజార్చుకొన్న పుస్తకం ఎప్పుడూ సంధ్య పుటనే చూపిస్తూంటుంది.
నా పాదాలవద్ద తీరం, గాయపడ్డ కుక్కలా దొర్లుతుంది.

పాలరాతి శిల్పాలను అదృశ్యం చేసే వెన్నెలలోకి
నీవు సాయింత్రాల గుండా ప్రతీసారీ జారిపోతూంటావు...... ప్రతీ సారి.


బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా - We Have Lost Even కు స్వేచ్చానువాదం

Wednesday, July 8, 2009

సూఫీ కవిత్వం - - అత్తర్


ఫరిదుద్దీన్ అత్తర్ ( అబు హమీద్ బిన్ అబుబక్ర్ ఇబ్రహీం) 1120-1229

1229 లో పెర్షియాను చెంఘీస్ ఖాన్ ఆక్రమించుకొన్నపుడు, ఓ వృద్దుని యుద్దఖైదీగా రాజుగారి వద్దకు తీసుకొచ్చారు. ఆ వృద్దుని పట్ల జాలిపడ్డ ఒక పౌరుడు ఆతనిని ఒదిలివేయండి, అందుకు ప్రతిఫలంగా నేను వెయ్యి వెండినాణాలు ఇస్తాను అన్నాడట. అపుడా వృద్దుడు " నన్ను అంత తక్కువకు అమ్మకండి, నా నిజమైన విలువను కట్టేవారు రావొచ్చు" అన్నాడట. మరొక వ్యక్తి ఒక మోపుడు ఎండు గడ్డి ఇస్తాను ఆ వృద్దుడిని వదిలివేయండి అన్నాడు. అపుడా వృద్దుడు " నా విలువ ఇదే ప్రభూ నన్ను ఇప్పుడు అమ్మివేయవచ్చు" అని చెప్పగా తాను మోసపోయినట్లు భావించిన రాజుగారు ఆ వృద్దుని శిరచ్ఛేదనం గావించమని ఆదేశించాడట.

ఆ వృద్దుడే ప్రముఖ సూఫీ కవి ఫరిదుద్దీన్ అత్తర్.

ఈ ఉదంతం జరిగిందో లేదో చారిత్రిక ఆధారాలైతే లేవు కానీ అత్తర్ కవిత్వం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అత్తర్ కవిత్వంలో ప్రాపంచిక సంపదల పట్ల తృణీకారము కనపడుతుంది. అధికారము, కీర్తి, భోగలాలస భక్తిమార్గానికి మనిషిని దూరంచేస్తాయని చెపుతుంది.

భూమిపై ఉండే సంపదల అశాశ్వత గురించి , ఒక చోట అత్తర్

" ఈ ప్రపంచైశ్వర్యం అంతా నీదైనప్పటికీ
అది రెప్పపాటులో నీనుంచి అదృశ్యం కాగలదు"
అంటాడు

ఈ దేహంలో బంధింపబడ్డ ఆత్మ ను ప్రక్షాళనం చేసుకోవటం ద్వారానే దైవసాయుజ్యం పొందగలమన్న సూఫీ తత్వాన్ని అత్తర్ తన గీతాలద్వారా ప్రవచించాడు. అత్తర్ రచనల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ బర్డ్స్ ఒక గొప్ప సృష్టి.

అత్తర్ గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.
http://en.wikipedia.org/wiki/Farid_al-Din_Attar

1.

నడిరేయిలో ఓ సూఫీ ఇలా విలపిస్తున్నాడు.
ఈ ప్రపంచం మూత వేసిన ఓ శవపేటిక
దానిలోనే మనమందరమూ ఉన్నాం.
అజ్ఞానం కొద్దీ మనజీవితాల ను
అవివేకంతో అధ్వాన్నంగా గడిపేస్తున్నాం.

మృత్యువు ఈ పేటిక మూత తెరువంగానే
రెక్కలు ధరించిన వారు అనంతంలోకి
ఎగిరిపోతారు.
లేని వారు పేటికలోనే మిగిలిపోతారు.

కనుక మిత్రులారా!
ఈశ్వరుని చేరే త్రోవలో పక్షిగా మారటానికై
అవసరమైనవన్నీ చేయండి.
రెక్కలు , తూలికలు పొందటానికి
ఏంచేయాలో అన్నీ చేయండి.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


2.
హృదయం చొక్కా పట్టుకొని
ఈ ప్రపంచపు తలను కాలితో తంతాను.
భూమిని, ఆకాశాన్ని నా గుర్రం కాళ్లక్రింద పడేసి తొక్కిస్తాను.
అందరినీ మించి బిగ్గరగా అరుస్తాను.
మరుక్షణం నేను ఈశ్వరుని ఎదుట
ఒంటరిగా మౌనంగా నిలుచుని ఉంటాను.

-- అత్తర్


3.

హతీమ్ అల్ అసామ్
"నేను నాలుగువిషయాలు ఎంచుకొని
మిగిలిన జ్ఞానాన్నంతా వదిలేసాను" అన్నాడు.

మొదటిది: నా దినసరి తిండి నిర్ణయింపబడ్డది.
అది పెంచబడదు, తగ్గించబడదు.
కనుక నేను దానిని పెంపుచేసే
ప్రయత్నాలు విరమించుకొన్నాను.

రెండవది: ఈశ్వరునికి నే పడ్డ బాకీ
మరెవరూ తీర్చరని తెలుసుకొన్నాను.
కనుక దానిని తీర్చటంలో నిమగ్నమయ్యాను.

మూడవది: నేనెప్పటికీ తప్పించుకోలేని,
ఒకరు తరుముతున్నారు , అదే మృత్యువు.
అందుకే తనను కలసుకోవటానికి
సిద్దపడుతున్నాను.

నాల్గవది: నాకు తెలుసు ఈశ్వరుడు
నన్ను పరిశీలిస్తున్నాడని.
అందుకే నేను చేయకూడని పనులు
చేయటానికి సిగ్గు పడతాను.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


4.

నీ మొఖము
అనంతమూ కాదు తాత్కాలికమూ కాదు.
నీ మొఖాన్ని నీవేనాడూ చూడలేవు,
నీవు చూసేది దాని ప్రతిబింబాన్ని మాత్రమే.

దర్పణం ముందు నిట్టూరుస్తూ
నీ ఊపిరి గాలులతో దాని ఉపరితలాన్ని
మసకబారేలా చేస్తున్నావు.
శ్వాసను నిదానముగా ఉంచు.
బంధించు, సాగర గజఈతగాని వలె.

కదిలావా, దర్పణ ప్రతిబింబం చెదిరిపోతుంది.

చనిపోకు, నిదురపోకు, మేల్కొనీ ఉండకు
ఏమీ చేయకు.

ప్రేమికులు ఒకరికొరకు మరొకరు ఓడినట్లుగా
నిన్ను నీవు పోగొట్టుకో,
అదే నీవు.
అదే నీకు కావలసినది.
దానికోసమే నీవు అన్వేషిస్తున్నావు.

-- అత్తర్


5.

అహాన్ని చంపుకోనంత కాలమూ
ఇతరులతో పోల్చుకొంటూ ఉన్నంత కాలమూ
మనం స్వేచ్ఛ నొందలేము.

బాహ్య ప్రపంచాన్ని తొడుక్కొన్నవారు
భక్తి మార్గంలో నడవలేరు.

-- అత్తర్

6.

నీ నుంచి జీవితాన్ని లాగేసుకొనే లోపే
ఈ మర్మాన్ని ఛేదించటానికి శ్రమించు.

నీవేమిటో బతికుండగా తెలుసుకోలేకపోతే
నీ ఉనికి రహస్యాన్ని ఎలా
అర్ధం చేసుకోగలవూ? చచ్చాకా!

----అత్తర్

బొల్లోజు బాబా




Saturday, July 4, 2009

సూఫీ కవిత్వం - - హాఫీజ్

ఖ్వాజా షామ్సుద్దీన్ మొహమ్మద్ హాఫీజ్ సిరాజి (1315-1390)

ఒక పర్షియన్ కవిగా హాఫీజ్ కు మంచి పేరు ఉంది. అది ఎంతంటే ఈతని పుస్తకాలు, ఖురాను కంటే ఎక్కువగా అమ్ముడు పోయేవట. 

హాఫీజ్ కవిత్వంలో సౌందర్యం, మార్మికత, ప్రేమ, కరుణ వంటి విశ్వజనీన భావాలు పరిమళిస్తూంటాయి. నిశిత దృష్టి, ఆహ్లాదమైన శైలి, లయ, సరళ భాషతొ ఉండే హాఫీజ్ కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.    మరో పర్షియన్ కవి, అత్తర్ వద్ద హఫీజ్ శిష్యరికం చేసాడు.

భారతదేశపు యోగి శ్రీమెహర్ బాబా , హఫీజ్ గీతాలను పాడేవారట.

హఫీజ్ " అశరీర వాణి" అనీ (Tongue of the Invisible), "కవులకే కవి" అని కీర్తి గడించాడు. దేవునిలో లీనమయ్యే మార్గాలను అన్వేషిస్తూ హఫీజ్ ఎన్నో వందల గీతాలను రచించాడు. హఫీజ్ సుమారు 5000 గీతాలు వ్రాసినట్లు ఒక అంచనా. హఫీజ్ తన గీతాలలో ఎక్కడో ఒక చోట తన పేరును పొందుపరచుకొనే వాడు. 

మతపెద్దల ధ్వంధ్వ ప్రవృత్తులను తన వ్రాతలలో విమర్శించినందుకు హఫీజ్ తన చరమాంకంలో రాజదండనకు గురి అయ్యాడని అంటారు. 

హాఫీజ్ కొరకు మరింత సమాచారం ఇక్కడ 
http://en.wikipedia.org/wiki/Hafez

1.

నీ చేతులలో ఒక శిశువు

నా ప్రేమ కెరటం
ఎంతో ఎత్తుకు లేచింది
నిన్ను ఉప్పెనలా ముంచెత్తనీ.

కనులు మూసుకో
బహుసా నీ భయాలు, కల్పనలు
ముగియవచ్చేమో!

అదే కనక జరిగితే
ఈశ్వరుడే నీ చేతులలో 
ఓ శిశువు అవుతాడు.

అపుడు 
ఈ సృష్టినంతా నీవే
లాలించవలసి ఉంటుంది.

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 


2.

ఒకే ఒక నియమం

ఆకాశం
ఓ వేలాడదీయబడ్డ నీలి సంద్రం
నక్షత్రాలు ఈదులాడే చేపలు.
ఒక్కోసారి నేను స్వారీచేసే గ్రహాలేమో 
తెల్లని తిమింగలాలు.

సూర్యుడు, కాంతి మొత్తమూ
నా హృదయంలో, నా దేహంతో
శాశ్వతంగా పెనవేసుకున్నాయి.

ఈ ఎడారి క్రీడాస్థలంలో
హఫీజ్ కి ఒకే ఒక నియమం 
ఇంతవరకూ కనిపించింది.

అదేమిటంటే
ఈశ్వరుని ఆటలో 
ఆనందించు మిత్రమా ఆనందించు.
ప్రియవిభుని అద్బుతమైన ఆటలో
ఆనందించు.

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 


3.

సూర్యుడు ఏనాడూ అనలేదు

ఇంతకాలంగా
సూర్యుడు భూమితో 
నీవు నాకు ఋణపడి ఉన్నావని
ఏనాడూ అనలేదు.

అటువంటి ప్రేమలో 
ఏం జరుగుతున్నదో గమనించావా!

మొత్తం ఆకాశం అంతా వెలుగే

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


4.

సూర్యుడు సౌందర్యపోటీలో నెగ్గి
ఈశ్వరుని చేతి రత్నమై నిలిచాడు.

భూమి తన విభుని కాలి కడియమై
ఉండటానికి అంగీకరించింది.
తన నిర్ణయానికి ఏనాడూ చింతించలేదు.

నిదురించే ప్రేక్షకుల మధ్య కూర్చొని కూర్చొని
పర్వతాలు విసిగిపోయాయి.
తమ చేతులను పైకప్పు వైపు సారిస్తున్నాయి.

మబ్బులు నా ఆత్మ కి ఓ సలహా ఇచ్చాయి.
వెంటనే నేను నా మధుపాత్రను తాకట్టు పెట్టి
రెక్కలు తొడుక్కొన్న వజ్రమై పైకి ఎగసాను.
నా ప్రయత్న్మమంతా ముంచెత్తే ప్రేమకు 
దగ్గరగా ఉండటానికే -- నీలానే.

నాలోని నిదురించే జనాల మధ్య ఉండటం
పర్వతానికి విసుగనిపించిందేమో!
సూర్యునిలా నా కనులలోకి ఎగసింది.
నా ఆత్మ నా హృదయానికిచ్చిన గొప్ప సలహాతో
హఫీజ్ రెక్కల వజ్రమై పైకి లేస్తున్నాడు. 

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


5.

రావోయి మిత్రమా!
గులాబీలను వెదజల్లి, గ్లాసులనిండా 
ద్రాక్షమధువుని నింపుకుందాం.

స్వర్గలోకపు పై కప్పును ధ్వంసం చేసి 
కొత్త పునాదులు నిర్మిద్దాం.

విషాదం తన సైన్యంతో దండెత్తి 
ప్రేమికుల రక్తాన్ని చిందిస్తే
సాకితో చేయికలిపి, దానిని మట్టి కరిపిద్దాం.
మిత్రమా, చేత వాయిద్యముతో, 
మధుగీతాన్ని పాడుతూ
ఆనంద నృత్యంలో సోలిపోదాం.

హఫీజ్ ' పెర్షియన్ పోయమ్స్ ' నుండి 


6.

నేను చాలా తెలుసుకొన్నాను


నేను ఈశ్వరుని ద్వారా 
ఎంతో తెలుసుకొన్నాను.
ఇకపై నన్ను నేను
ఓ క్రిష్టియననో, హిందువుననో, ముస్లిముననో
బౌద్దుడననో, యూదుడిననో
పిలిపించుకోను.

సత్యం తనని తాను 
ఎంతగానో నాతో పంచుకొంది.

ఇకపై నన్ను నేను
ఓ పురుషునిగానో, స్త్రీగానో, దేవదూతగానో
లేదా ఒక స్వచ్చమైన ఆత్మగానో 
అనుకోవటం లేదు.

హఫీజ్ తో ప్రేమ ఎంతో స్నేహించి
తాను దహింపబడి, 
నామనసు తెలుసుకొన్న 
ప్రతిఒక్క ఆలోచన, స్వరూపాల నుండి
నన్ను విముక్తుడిని చేసింది 

హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి


7.

ఆతని సౌందర్యానికి మనం కావలిదారులం
తేజో మూర్తికి మనం రక్షకులం.

కారణమొకటే
మనం ఈశ్వరుని అనుసరిస్తూ 
ఈ లోకంలోకి వచ్చాం. 
ఆనందాన్ని, స్వేచ్ఛను, నాట్యాన్ని
ప్రేమను పెంపొందించటానికి. అంతే.

నీలో ఏదో ఓ ఉన్నత స్వరం 
నాతో ఇలా మాట్లాడనీ!

"హఫీజ్! ఈ వెన్నెల రాత్రి అలా ఖాళీగా కూర్చోకు
నా హృదయాన్ని మన విభుని 
మనసులో విచ్చుకొనేలా చేయి. 
గాయపడిన నా రెక్కలను స్వస్థపరచు."

మనమాతని సౌందర్యానికి సహచరులము.
సత్యానికి సంరక్షకులము.
ప్రతి పురుషుడు, మొక్క, క్రిమి
ప్రతి స్త్రీ, శిశువు, నరము , నాదము 
మన ప్రియ విభుని సేవకులే.

అదిగొ ఆనందము
అల్లదిగో వెలుతురు. 

హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి 

బొల్లోజు బాబా


Friday, July 3, 2009

సూఫీ కవిత్వం - - రూమి


ఇస్లాం మతంలో ఒక ఆద్యాత్మిక అధ్యాయం సూఫీతత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందటం ధ్యేయం. ఐహిక బంధాల నుంచి విముక్తమై మనసును దేవుని వైపు ప్రయాణింపచేయటం సూఫీల జీవన విధానంగా ఉంటుంది.
సూఫీలు ఆడంబరాలకు దూరంగా ముతక దుస్తులు ధరించి స్వాములుగా జీవితాన్నిగడిపేవారు. సూఫీకవులు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, దైవచింతనను ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేసారు. రూమీ, అత్తర్, హఫీజ్, జామీ, సనాయ్, సాదీ, రబియా మొదలగువారు ప్రముఖులు.
వారు వ్రాసిన కవితలలో నాకు నచ్చిన కొన్నింటి అనువాదాలు ఇవి. మిగిలినవారిగురించి మరో సారి......

జలాలుద్దీన్ మహమ్మద్ రూమి (1207-1273)
రూమి పదమూడవ శతాబ్ధానికి చెందిన పర్షియన్ కవి. దేవుని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం ప్రధాన సాధనాలని రూమీ భావించాడు. ఈతని కవిత్వం ఏమతానికి చెందక మానవత్వాన్ని ప్రతిబింబించటం ఒక ప్రత్యేకత. జీవితాన్ని అక్షరాలుగా మలచి అందించాడు రూమి. ఆయనకవితలలో మార్మికత, భావుకత, మానవత్వంపై అచంచల విశ్వాసం, దేవుని పై ఆరాధనా కనిపిస్తాయి. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వానికి ఆదరణ ఉన్నదంటే దానికి కారణం ఆయన కవిత్వంలో పరచుకొన్న మానవజీవన చిత్రణే.

రూమీ గురించి మరిన్ని వివరాలు ఈ లింకులో చూడవచ్చును. http://te.wikipedia.org/wiki/జలాలుద్దీన్_ముహమ్మద్_రూమి
రూమీ పూర్తి రచనలను శ్రీ దీవి సుబ్బారావు అనువదించారట.

1.
వెలిగించటానికి సిద్దంచేసిన
ఓ దీపముంది నీ హృదయంలో.
నింపేందుకు సిద్దంగా
శూన్యముంది నీ ఆత్మలో
నీకూ తెలుస్తూంది కదూ!


ఈశ్వరునితో నీ వియోగం
నీకు అర్ధమౌతూంది కదూ!
నిను నింపటానికి అతనిని ఆహ్వానించు.
అగ్నిని కౌగిలించుకో.


ప్రేమ తనంత తానే వస్తుందనీ
దానికై నీ తపన పాఠశాలల్లో నేర్పరనీ

గుర్తుచేసుకో.

రూమి - పాషనేట్ పోయమ్స్ ఆఫ్ రూమి" నుండి

2.
ఉదయపు గాలులు వీస్తున్నాయి.
ఉదయపు గాలులు తమ తాజా
వాసనలను పంచుతున్నాయి.
నిదుర లేచి వాటిని ఆహ్వానించు.
మనలను బ్రతికించే గాలులవి.
అవి వెళ్లిపోయే లోగా పీల్చుకో.

రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

3.
నదిని ఆలకించు
ఈ ఒడ్డుపై మరణించి
సముద్రాన్ని చేరే
నదుల మార్గాన్ని
అనుసరించమని
చెపుతూంది అది


రూమీ - " సే ఐ ఆమ్ యూ" నుండి

4.
నీకు ఏదైనా కానుక నీయాలని
నేనెంత అన్వేషించానో నీకు తెలియదు.
సరైనదేదీ దొరకలేదు.
బంగారు గనికి బంగారాన్నీ,
జలనిధికి నీటినీ కాన్కలుగా ఈయటం
ఏం బాగుంటుంది.
అన్నీ అలానే అన్పించాయి.
నా హృదయాన్నో, ఆత్మనో ఇవ్వాలనుకోవటం
ఉచితం కాదు, ఎందుకంటే
అవి ఇప్పటికే నీకు సమర్పించేసాను.


అందుకే, ఒక దర్పణాన్ని తీసుకొచ్చాను.
దానిలో నిన్ను చూసుకొని
నన్ను గుర్తుచేసుకో.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

5.
ఆశే ఈ రహస్యానికి కేంద్రబిందువు
ఆశే స్వస్థత నిస్తుంది కూడా చిత్రంగా.


నియమేమిటంటే
బాధ అనుభవించాలి.
నీ కోర్కె క్రమశిక్షనొందాలి.
భవిష్యత్తులో ఏమి జరగాలనుకొంటావో
దానిని త్యాగం చేయాలి.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

6.
ఒంటరిగా దుఖించే ఈ జనులు నన్ను
అలసిపోయేలా చేస్తున్నారు.
మత్తెంక్కించే నీ ప్రేమ మైకంలో తేలియాడాలని
యోధుని బలాన్ని నా చేతులతో తాకాలని నా ఆశ.


ఈ అశాశ్వత రాజులతో విసిగిపోయాను.
నీ కాంతిని చూడాలనుకొంటున్నాను.

ఈ షేకులు, ముల్లాలు దీపాలు చేతబూని
వారువెతికేది ఎంతకీ దొరకక
చీకటి సందుగొందులలో
తిరుగాడుతున్నారు.

నీవు తత్వ సారానివి. ప్రేమ మైకానివి.
నీ కీర్తనలు పాడాలనుకొంటాను.
కానీ, హృదయంలో బాధించే కోర్కెతో
మౌనంగా నిలుచుండిపోతాను.


రూమి -- ద లవ్ పోయమ్స్ ఆఫ్ రూమి నుండి.

7.
ఈ నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
ఆ పని ఇప్పుడే చేయి.


నీవు దట్టమైన మేఘంతో కప్పబడ్డావు.
పక్కకు జరుగు. మరణించు.
మౌనంగా ఉండు.
నీవు మరణించావనటానికి మౌనమే ఋజువు.
నీ పాత జీవితమనేది
మౌనంనుండి చేసిన ఓ పిచ్చి పరుగు.

మౌన చందమామ ఇప్పుడు ఉదయించింది.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

బొల్లోజు బాబా


Sunday, April 5, 2009

పాబ్లో నెరుడా "ONLY DEATH" తెలుగులో......


పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.
నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.

నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.
నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.


మృత్యువు మాత్రమే


మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.

సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.

గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.

స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.

ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.

నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.

మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.

మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.

మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.

నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.

మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.

అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.

బొల్లోజు బాబా



ఆశక్తి ఉన్నట్లయితే అంతర్జాలంలో ఈ క్రింది లింకులలోని నెరుడా కవితల అనువాదాల్ని కూడా చదవండి బాగున్నాయి.

http://prajakala.org/mag/2008/02/pablo_neruda1

http://www.eemaata.com/em/issues/200209/595.html

http://www.pranahita.org/2007/08/nee_navvu/