Sunday, November 1, 2026

అవతారపురుషుడు పరశురాముడు?

పరశురాముడి కథను సాధారణంగా విష్ణువు ఆరవ అవతారం, తండ్రి ఆజ్ఞను పాటించిన ఆదర్శ పుత్రుడు, దుష్ట క్షత్రియులను శిక్షించిన వీరుడు అనే కోణాల్లో వివరిస్తారు. కానీ అదే కథను సామాజిక అధికారం, వర్ణవ్యవస్థ, స్త్రీ శరీరంపై నియంత్రణ, రాజ్యాధికారం అనే కోణాల్లో పరిశీలిస్తే పూర్తిగా కొత్త అర్థాలను ఆవిష్కరిస్తాయి.

జమదగ్ని మహర్షి భార్య రేణుక ఒకసారి నీటికొలను వద్ద ఒక పురుషుడిని చూసి క్షణికమైన ఆకర్షణకు లోనవుతుంది. ఆమె మనసులో కలిగిన ఈ భావాన్ని గ్రహించిన జమదగ్ని, పాతివ్రత్యదోషం కలిగినందుకు ఆమెను హత్య చేయమని తన కుమారులను ఆదేశిస్తాడు. తండ్రి ఆజ్ఞను తిరస్కరించిన కుమారులను శపిస్తాడు. చివరకు పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లి రేణుక శిరస్సును ఖండిస్తాడు. సంతోషించిన జమదగ్ని వరాలు కోరుకోమంటాడు. పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బతికించమని కోరడంతోపాటు, జరిగిన సంఘటన వారి జ్ఞాపకాల్లో లేకుండా చేయాలని కోరతాడు.

ఈ కథలోని అంతర్గత సందేశం ఏమిటి? స్త్రీ మనసులో కలిగే సహజమైన ఆకర్షణ కూడా పురుషుడి అధికారానికి లోబడి విచారించదగిన నేరంగా మారుతుంది. తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం శిక్షార్హం; తల్లిని చంపడం కూడా తండ్రి ఆజ్ఞతో జరిగితే విధేయతగా ప్రశంసించబడుతుంది. అంటే ఇక్కడ నైతికతకు ప్రమాణం హింస మంచిదా, చెడ్డదా అన్నది కాదు; అధికారం ఎవరిది, దానికి ఎవరు విధేయులుగా ఉన్నారు అన్నది మాత్రమే.0

పరశురాముడి కథలోని మరో ప్రధాన ఘట్టం కార్తవీర్యార్జునుడితో ఘర్షణ. జమదగ్ని ఆశ్రమంలోని కామధేనువును కార్తవీర్యార్జునుడు అనే రాజు అపహరించినందుకు పరశురాముడు అతడిని సంహరించడం, ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్నిని హత్య చేయడం ఈ ఘట్టానికి నేపథ్యంగా నిలుస్తాయి. తండ్రి మరణంతో ఆగ్రహించిన పరశురాముడు క్షత్రియులను ఇరవై ఒక్క సార్లు నిర్మూలించాడని, వారి రక్తంతో ఐదు సరస్సులను నింపాడని పురాణ కథనాలు చెబుతాయి. అనంతరం తాను జయించిన భూమిని బ్రాహ్మణులకు దానం చేసి తపస్సుకు వెళిపోతాడు.

ఈ విధంగా పరశురాముడు ఒకవైపు క్షత్రియులను సంహరించే యోధుడిగా, మరోవైపు భూమిని బ్రాహ్మణులకు సమర్పించే ఉద్ధారకుడిగా చిత్రించబడతాడు. విధ్వంసం, భూస్వామ్యం, కొత్త సామాజిక క్రమం — ఈ మూడింటినీ ఒకే పురాణ పాత్రలో కలపడం ఈ కథనంలోని రాజకీయం.
***

వర్ణవ్యవస్థలో బ్రాహ్మణులకు వేదజ్ఞానం, యజ్ఞకర్మలు, ధార్మిక మార్గదర్శకత్వం; క్షత్రియులకు రాజ్యపాలన, యుద్ధం, ప్రజల రక్షణ వంటి బాధ్యతలను కేటాయించబడ్డాయి.
ఆ సరిహద్దులను చెరిపేసాడు పరశురాముడు. అతను బ్రాహ్మణుడు, తపస్సు చేశాడు. కానీ యోధుడు కూడా. రాజులను సంహరించాడు. క్షత్రియ అధికారాన్ని ధ్వంసం చేసి, తాను జయించిన భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. అంటే, బ్రాహ్మణత్వం ఆధ్యాత్మిక ఆధిక్యతకే పరిమితం కాకుండా, అవసరమైతే రాజకీయ అధికారాన్ని కూడా చేపట్టగలదనే భావనకు పరశురాముడి పాత్ర దోహదపడింది.

బౌద్ధ, జైన వంటి శ్రమణ సంప్రదాయాలు భారతీయ మేధోచరిత్రలో కీలక పాత్ర పోషించాయి. మారిన సామాజిక, మతపరమైన పరిణామాల నేపథ్యంలో బ్రాహ్మణుల స్థానం, వేద సంప్రదాయాల ప్రాధాన్యం మారుతూ వచ్చాయి. కొంతమేరకు వాటి ప్రాబల్యం తగ్గింది. ఈ మార్పుల నేపథ్యంలో పరశురాముడి కథ బ్రాహ్మణ శక్తిని, ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి ఒక నమూనాను అందించింది.
 
పౌరాణిక గాథ ఒక చారిత్రక సంఘటనకు సాక్ష్యం కాకపోయినా, ఒక సమాజం తన అధికారాన్ని ఎలా ఊహించుకుంది, ఎలా సమర్థించుకుంది, ప్రజలను ఆ కథనంద్వారా ఎలా ప్రభావితం చేసింది అనే విషయాన్ని తెలియజేయగలదు.
***

పరశురాముడి పురాణంలోని అత్యంత తీవ్రమైన అంశం క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు నిర్మూలించాడనే కథనం. తండ్రి మరణంతో ఆగ్రహించిన పరశురాముడు ఒక వ్యక్తిని లేదా ఒక రాజవంశాన్ని మాత్రమే శిక్షించడు. క్షత్రియ వర్ణానికి చెందిన వారందరిపైనా సామూహిక హింసను ప్రయోగిస్తాడు. క్షత్రియ స్త్రీలను, గర్భవతులను, పిల్లలను కూడా విడిచిపెట్టలేదు. తరిమి తరిమి సంహరించాడు.
 
ఒకవ్యక్తి చేసిన నేరానికి అతని వర్ణానికి చెందిన అనేక తరాల ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఇక్కడ.
 
ఇది ఒక కీలకమైన సైద్ధాంతిక మార్పు. రాజ్యాధికారం కలి`గిన క్షత్రియులను ఓడించడం మాత్రమే కాదు, వారి వర్ణాధిక్యతను పూర్తిగా చెరిపివేసి, వారి స్థానంలో బ్రాహ్మణ అధికారాన్ని ప్రతిష్ఠించగల శక్తిగా పరశురాముడు ఇక్కడ కనిపిస్తాడు. బ్రాహ్మణులు సామాజికంగా ఆధిపత్యం వహించడానికి పరశురాముడి పాత్ర నైతిక సమర్థనను అందించింది. ఈ కారణంగానే పరశురాముడు విష్ణువు అవతారంగా కీర్తించబడ్డాడు.
 
ఇక్కడ బ్రాహ్మణాధిపత్యం అంటే ఆధ్యాత్మిక, ఆచారపరమైన ఆధిక్యత మాత్రమే కాక, అది రాజకీయ అధికారంకూడా కలిగి ఉండటంగా అర్థం చేసుకోవాలి.
 
ఈ కథనంలో బ్రాహ్మణుడైన పరశురాముడు యోధుడిగా మారినా అతని బ్రాహ్మణ గుర్తింపు చెరిగిపోదు. అతని హింసను కేవలం వ్యక్తిగత చర్యగా కాకుండా, విష్ణువు అవతారంగా ఆపాదించడం ద్వారా అతను చేసిన జాతిహననాన్ని ఒక గొప్ప దైవిక కార్యంగా మార్చారు.
అయితే పురాణంలోని క్షత్రియ నిర్మూలనకు చారిత్రిక ఆధారాలు లభించకపోవచ్చు. కానీ సమాజం ఈ కథనాన్ని ఎలా తమ ప్రయోజనానికి అనుగుణంగా మార్చుకొంది అనే అంశం చరిత్రలో స్పష్టంగానే ప్రతిబింబించింది.
***

బౌద్ధ, జైన, ఆజీవిక మతాలు జనాదరణ పొందడంతో వైదిక ధర్మం వెనుకబడింది. బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుడు, జైనమత స్థాపకుడైన వర్ధమాన మహావీరుడు ఇద్దరూ క్షత్రియులే. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు పరశురాముడి చారిత్రక ప్రాధాన్యం అర్థమవుతుంది.

ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను నిర్మూలించడం అంటే, వైదిక క్రతువులకు ఆదరణ తగ్గించిన బౌద్ధ, జైన మతాలను నిర్మూలించడంగా భావించవచ్చు. పరశురాముడు క్షత్రియులను నిర్మూలించి, రాజ్యాధికారాన్ని బ్రాహ్మణులకు అప్పగించడం అంటే, వైదిక ధర్మానికి రాజాదరణ కల్పించడంగా పరశురామ కథనాన్ని అర్థం చేసుకోవాలి.

క్రీపూ రెండో శతాబ్దంలో పుష్యమిత్ర శుంగుడు అశోకుని మునిమనవడైన బృహద్రథ మౌర్యుడిని హత్యచేసి రాజ్యపాలన చేసిన మొదటి బ్రాహ్మణుడిగా చరిత్రలో కనిపిస్తాడు.
తరువాత బ్రాహ్మణ వంశానికి చెందిన కాణ్వులు పాలించారు. మూడవ శతాబ్దం వరకు పాలించిన శాతవాహనులు కూడా బ్రాహ్మణులేనని కొన్ని పురాణాలు చెబుతాయి. మూడవ శతాబ్దం నుంచి ఐదవ శతాబ్దం వరకు విదర్భ, దక్కను ప్రాంతాలను పాలించిన వాకాటకులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు. ఐదవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండినులు బ్రాహ్మణులు.

కేరళలోని నంబూదిరి బ్రాహ్మణులు, మహారాష్ట్రలోని చిత్పావన్ బ్రాహ్మణులు పీష్వాలుగా పరిపాలన చేపట్టడం ఇటీవలి చరిత్రలో కనిపిస్తుంది.
 
పరశురాముడి కథకు ప్రతివిమర్శగా జైన సాహిత్యం ఆయనను కోపిష్ఠిగా, హింసాత్ముడిగా వర్ణిస్తుంది. క్షత్రియులను ఇరవై ఒక్కసార్లు నిర్మూలించిన పరశురాముడికి ప్రతిగా, జైన పురాణ సంప్రదాయంలోని సుభూముడు అనే క్షత్రియుడు బ్రాహ్మణులను ఇరవై ఒక్కసార్లు నిర్మూలించినట్లు ఒక పోటీ కథనం ఉంది.

తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించిన కుమారుడు విష్ణువు అవతారంగా దైవీకరించబడితే, అదే కథలో బాధితురాలైన రేణుక మాదిగల వంటి అణగారిన సమూహాల జానపద సంప్రదాయాల్లో ఎల్లమ్మగా ఆరాధించబడటం గమనార్హం. ఇది మరొక ప్రత్యామ్నాయ కథనం.
***

పరశురాముడి పాత్ర సామాజికంగా బ్రాహ్మణాధిపత్యం శతాబ్దాల క్రితం ఎలా ప్రారంభమైందో, ఎలా కొనసాగిందో, ఎలాంటి నైతిక మద్దతు పొందిందో తెలియజేసే ఒక గ్రాండ్ నెరేటివ్. రాజును విష్ణువు’గా కొలిచిన బ్రాహ్మణులు అవసరమైతే ఆ రాజునే సంహరించి, బ్రాహ్మణుడు అతనికన్నా ఉన్నతమైన వర్ణానికి చెందినవాడని చెప్పటానికి చేసిన హెచ్చరికే పరశురాముడి కథగా భావించవచ్చు.
 
విష్ణుమూర్తి ఆరవ అవతారంగా పూజలందుకొంటున్న పరశురాముడిని బ్రాహ్మణాధిపత్యానికి సంబంధించిన రాజకీయ కథనంగా విశ్లేషించడాన్ని పురాణ సాహిత్యం, సామాజిక చరిత్ర, రాజకీయ అధికార మార్పిడి అధ్యయనంగా గుర్తించాలే తప్ప మతవిశ్వాసాలను ప్రశ్నించడంగా కాదు. .
 
ముగింపు
.
హిందుత్వ రాజకీయాల్లో అందరి ఐక్యతను ప్రకటిస్తూనే బ్రాహ్మణ ప్రత్యేకతను ముందుకు తెచ్చే ప్రతీకగా పరశురాముడిని మళ్లీ ఆవిష్కరిస్తున్నారు.
 
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో Parshuram Samaj, Parshuram Community, Parshuram Sena, Bhagwan Parshuram వంటి పేర్లతో ఉన్న కొన్ని ఖాతాలు పరశురాముడి పేరును కులరాజకీయాలకు ఉపయోగిస్తున్నాయి. ఈ ఖాతాల్లో బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ రాజ్యం, కులగౌరవం వంటి నినాదాలతో పాటు దళితులు, ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి.
 
పరశురాముడిని ఆధునిక హిందుత్వ రాజకీయాల్లో ఒక ఐకాన్‌గా ఎంచుకోవడం వెనుక ఆయన కథలోని మూడు అంశాలు ముఖ్యమైనవి: బ్రాహ్మణ జన్మ, యోధుడి శక్తి, వర్ణవ్యవస్థను పునరుద్ధరించే పాత్ర.
 
అలాగని బ్రాహ్మణులందరూ పరశురాముడిని ఒకే విధంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పలేం. ఆయనను విష్ణువు అవతారంగా కొలిచేవారు కూడా ఉన్నారు.
 
నేడు పరశురాముడి గురించి తెలుసుకోవడం అంటే ఉట్టి పురాణ పరిశీలన మాత్రమే కాదు. పురాణాలు ఎలా రాజకీయ శక్తులుగా మారతాయో, పురాణ పురుషులు కులగుర్తింపునకు ఐకాన్‌లుగా ఎలా మారతారో, ఐక్యత పేరుతో సామాజిక అసమానతలు ఎలా కొనసాగుతాయో అనే ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడం కూడా.

బొల్లోజు బాబా



No comments:

Post a Comment