Wednesday, August 26, 2026

హరప్పా నుండి హిందుత్వ వరకూ

బొల్లోజు బాబా

అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వ్యవస్థాపక అధిపతి.  ఇతను హరప్పాను 1853లో సందర్శించాడు. 1872-73లో కొన్ని ట్రయల్ తవ్వకాలు నిర్వహించాడు. అక్కడ సీల్స్ (ముద్రలు), ఇతర పురావస్తువులను గమనించాడు. బ్రాహ్మీ లిపి కంటే పురాతనమైన లిపిలాంటిదేదో

ఉన్నట్లు గుర్తించాడు. 1920లలో ASI డైరెక్టర్ సర్ జాన్ మార్షల్, హరప్పా  మొహెంజోదారోల వద్ద నిర్వహించిన తవ్వకాల ద్వారా సింధు నాగరికత  చారిత్రక  ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది.

సింధులోయ నాగరికత (Indus Valley Civilization), హరప్పా నాగరికత అనేవి ఒకే నాగరికతను సూచించే రెండు పేర్లు. సింధులోయలో విస్తరించింది కనుక సింధులోయ నాగరికత అని సర్ జాన్ మార్షల్ పిలిచాడు. హరప్పా అనే పురాతన నగరం ఈ నాగరికతలో ప్రముఖ కేంద్రంగా ఉంది కనుక దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. హరప్పా కాక ఇంకా మొహెంజొదారో, లఖన్ జొదారో,  థోలావిరా, లోథాల్, రాఖిగఢీ, కలిబంగన్, బనవాలి సుర్కొతడ వంటి ఇతర ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి. హరప్పా నాగరికతకు సంబంధించి నేటివరకూ సుమారు 2000 సైట్లను గుర్తించారు. ఇంకా చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి.

హరప్పా నాగరికతా అధ్యయనం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొనింది ఎందుకంటే ప్రపంచంలోని ప్రారంభ నాగరికతా కేంద్రాలైన ఈజిప్టు, మొసొపొటేమియ, చైనాల సరసన హరప్పా నాగరికత కూడా ఒకటి. ఇది విస్తీర్ణంలో ఈజిప్టు, మొసొపొటేమియాల కన్న పెద్దది, ఎక్కువజనాభా కలిగినది. ఇంకా చెప్పాలంటే హరప్పా నాగరికత ఆ రెండు ప్రాచీననాగరికతలకన్నా భౌగోళికంగా చాలా పెద్దది.  సుమారు పదిలక్షల చదరపు కిలోమీటర్లమేర విస్తరించి ఉండేది. ప్రధాననగరాలలో లక్షల జనాభా నివసించేవారు. ఇంతపెద్దది కనుక వివిధ భాషలు విశ్వాసాలనుకలిగి

ఉండేదని భావిస్తారు. అంటే భారతదేశ బహుళత్వం అనేది అప్పటినుంచే ఉందని అనుకోవచ్చు.

విభజనానంతరం మొహెంజొదారొ, హరప్పా నగరాలు పాకిస్తానుకు వెళిపోయినా, భారతదేశంలో పంజాబ్, హర్యానాలలో అనేక సైట్లు బయటపడి  హరప్పా నాగరికత ఏమేరకు భౌగోళికంగా విస్తరించిందో ప్రపంచానికి తెలిసింది. గగ్గర్-హక్ర నదీతీరంపై (వేదాలలో చెప్పబడిన సరస్వతి నది) అనేక సింధు గ్రామాలు విస్తరించి ఉన్నాయి కనుక ఈ నాగరికతను సింధు-సరస్వతి నాగరికతగా ఎస్.పి. గుప్తా, బి.బి. లాల్ లాంటి చరిత్రకారులు పిలిచారు.  నేడు హరప్పా సంస్కృతి ఉత్తర భారతదేశంలోనే కాక దక్షిణాన తమిళనాడు, తూర్పున బెంగాలు వరకు తదనంతరకాలంలో విస్తరించిందని గుర్తించారు.

హరప్పా  ప్రజలు ఎవరు?

మూడు విడతలుగా జరిగిన వలసల వలన భారత ఉపఖండం ఆధునిక మానవులతో (homo sapiens) జనావాసంగా మారింది. మొదటివలస- 65 వేలఏండ్లక్రితం Out of Africa వలస ద్వారా ఆఫ్రికానుంచి భారతదేశంలోకి ప్రవేశించిన మొదటిమానవులు వీరు Hunter-gatherers. రెండవ వలస - 9000-5000 ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి  వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. మూడవ వలస- c4000-3500 సంవత్సరాల క్రితం మధ్య ఆసియా స్టెప్పీల నుండి వచ్చిన ఋగ్వేదఆర్యులు.  వీరు పశుపోషకులు.

హరప్పా నాగరికతకు చెందిన ప్రజలు ఆర్యులరాకకు ముందునుంచీ ఇక్కడ జీవిస్తున్న ఈ దేశ మÖలవాసులని, వీరు నేటి దళిత, ఆదివాసి, బహుజనులు అని ఈ క్రింది జన్యుశోధనల ద్వారా అవగతమౌతుంది.

1. హరప్పా నాగరికతకు చెందిన రాఖిగరి అనే చోట 2800-2300 BCEకి  చెందిన ఒక స్త్రీ మృతదేహం దొరికింది. దీని అవశేషాలపై జరిపిన DNA  పరీక్షలలో ఆమె జన్యువులలో మొదటి రెండవ వలసల ద్వారా వచ్చిన ఆఫ్రికా Hunter-gatherers, Iranian Agriculturalists జన్యు మూలాలు ఉన్నాయి తప్ప మూడవ వలస ద్వారా వచ్చిన ఆర్యుల జన్యువులు లేవు అని గుర్తించారు.[1]  (Cell Journal, 2019). అంటే హరప్పా ప్రజల జన్యువులు 65 వేల ఏళ్ళ క్రితం వచ్చిన మొదటి వలసదారులతోను, c9000 ఏళ్ళక్రితం వచ్చిన రెండవ వలసదారులతో మాత్రమే నిర్మితమైనవని తెలుస్తుంది. ఈ ఫలితం మరోలా చెప్పాలంటే హరప్పా ప్రజలు ఈ దేశానికి మూలవాసులు (aboriginals) అని ప్రతిపాదిస్తుంది.

2. భారతదేశ SC, ST, Brahmin సామాజిక వర్గాలలో జన్యుపరమైన వ్యత్యాసాలను Swarkar Sharma బృందం చేసిన అధ్యయనం తెలియచేసింది. ఈ అధ్యయనంద్వారా మూడవవలసలో వచ్చిన R1a1 స్టెప్పీ ఆర్యజన్యువులు బ్రాహ్మలలో ఎక్కువగాను, SC, ST ప్రజలలో తక్కువగాను అదేవిధంగా వేదపూర్వ (హరప్పా నాగరికత) H1, O జన్యువులు SC, ST ప్రజలలో ఎక్కువగాను, బ్రాహ్మలలో తక్కువగాను ఉన్నట్లు గుర్తించారు.  (టేబుల్ చూడుడు)

ఇదే తరహా జన్యు పరీక్షలు Lower Castes  (OBC) లపై కూడా జరిగాయి. Lower Castes లో మూలవాసుల H1 జన్యువు SC,ST లతో సమానంగా 20-30% వరకు ఉన్నట్లు గుర్తించారు.[2]  (Sengupta et al., Thanseem et al. (2006). మరో అధ్యయనం ప్రకారం Middle Castes (OBC)  జన్యువులు ASI (Ancestral South Indian) జన్యువులతో సుమారు 40-70% సారూప్యత చూపాయి.[3]  (Narasimhan et.al 2019, Reich et al 2009). ఇది OBCలను హరప్పా ప్రజలతో నేరుగా కలుపుతుంది.

ఈ జన్యు అధ్యయనాలన్నీ హరప్పా ప్రజలు ఈ దేశ మూలవాసులని, నేటి దళిత, ఆదివాసీ, బహుజనుల సుదూర పూర్వీకులని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి.

వివిధ దశలు

హరప్పా నాగరికత 6000-1300 BCE మధ్య మూడు దశలలో జరిగింది. (BCE, Before Common Era /క్రీస్తుపూర్వ,  CE, Common Era/ క్రీస్తుశక)

ఎ. 6000-2600 BCE మధ్య  ప్రారంభ దశ: ఈ దశలో గోధుమలు బార్లీ, పప్పుధాన్యాల వ్యవసాయం ప్రారంభమైంది. మెహర్ గఢ్ వంటి చిన్నచిన్న గ్రామాలు ఏర్పడ్డాయి.  ఇళ్ళు మట్టి ఇటుకలతో నిర్మించుకొన్నారు. సిరామిక్ వస్తువులు, చిన్నచిన్న ఆభరణాలు ఉండేవి.  సరళ సమాజం.

బి. 2600-1900 BCE మధ్య రెండవ దశ లేదా మెచ్యూర్ దశ: ఈ పరిపక్వ దశలో హరప్ప, మొహెంజోదారో, ధోలావిరా లాంటి పెద్దనగరాల నిర్మాణం, డ్రైనేజి వ్యవస్థ, గ్రిడ్ లాంటి పాటర్న్‌తో  రోడ్లు నిర్మించుకొన్నారు. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని జలాశయాలలో నిలువచేసి వ్యవసాయం కొరకు వినియోగించుకొన్నారు.  మొసపటోనియా, ఈజిప్టులతో సముద్ర వ్యాపారం చేసారు.

హరప్పా సమాజం సంక్లిష్ట సమాజం. బహుశా పాలకవర్గం, వర్తకులు, కార్మికులుగా విభజన కలిగి ఉండొచ్చు.

సి. 1900-1300 BCE మధ్య క్షీణ దశ: నగరాలు క్షీణించాయి. వాణిజ్యం తగ్గిపోయింది.  నదులు ఎండిపోవటం, అనావృష్టి వల్ల వ్యవసాయం తగ్గిపోయింది. నగర సంస్కృతి కనుమరుగై గ్రామీణజీవనం పెరిగింది.

c2000 BCE లో వచ్చిన  ఈ వాతావరణ మార్పులు ఒక్క హరప్పా  నాగరికతనే కాదు యురేషియా మొత్తాన్ని ప్రభావితం చేసింది. c2000 BCE కాలంలో సరస్సులలో ఆక్సిజన్ ఐసోటోపు పరీక్షలు తీవ్రమైన కరువును సూచిస్తున్నాయి.  అదే సమయంలో Carpinus betulus [4] లాంటి ఎడారి వృక్షాలు అధికంగా పెరటం అనేది ఆనాటి వర్షాభావ పరిస్థితులను తెలుపుతుంది. సింధులోయలో నివసించిన ప్రజలు పాకిస్తాన్ మైదానాలలోకి, తూర్పుఉత్తర, దక్షిణ భారతదేశంవైపుకు చెదిరిపోయారు.

1000 BCE నాటికి భారత ఉపఖండంలోకి ఇనుము వాడకంతో  కొత్త శకం మొదలైంది.

నగరాలు, ఇళ్ళ నిర్మాణం

హరప్పా  ప్రజలు పెద్దపెద్ద నగరాలను ప్రణాళికాబద్ద విశాలమైన రోడ్లతో నిర్మించారు. హరప్పా నగరం దిక్సూచి (కార్డినల్ డైరెక్షన్) ప్రకారం నిర్మించబడింది.  తూర్పు పడమర ప్రధాన రోడ్లు, వాటిని కలుపుతూ ఉత్తర దక్షిణ అనుసంధాన రోడ్లతో నగరం మొత్తం ఒక గ్రిడ్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. హరప్పా ప్రజలకు ఖగోళశాస్త్ర అవగాహన ఉంది. కృత్తిక నక్షత్రం ఆ కాలంలో తూర్పువైపున ఉండేది.  (క్రమేపీ 72 ఏళ్ళకు ఒక డిగ్రీచొప్పున తూర్పఉత్తరం వైపు జరుగుతూ ఇప్పుడు తూర్పుకు సుమారు 52 డిగ్రీల ఉత్తరం వైపున ఉంది). ఈ నక్షత్రదిశను కాలగణన, దిక్కులను గుర్తించటానికి, నగరాల ప్లానింగ్‌కు ఆనాటి ప్రజలు ఉపయోగించుకొన్నారు.

ఇదే తరహా నగర నిర్మాణ శైలి హరప్పా పతనమైన  వెయ్యేళ్లతరువాత నిర్మించిన తక్షశిల, పాటిలిపుత్ర, ఉజ్జయిని వంటి నగరాలలో కనిపిస్తుంది.  ద్పుీజు 4వ శతాబ్దానికి చెందిన అర్థశాస్త్రంలో నగర ప్రణాళిక తూర్పు-పడమర ప్రాధాన్యంతో ఉండాలని సూచిస్తుంది.

కాల్చిన ఇటుకలు, కొన్ని చోట్ల పచ్చి ఇటుకలతో ఇళ్ళను  నిర్మించారు. ఒకేపరిమాణం కలిగిన ఇటుకలను ఉపయోగించారు.  వీరి ఇటుకలు 1:2:4 నిష్పత్తిని (ఉదా. 7ఞ 14 ఞ 28 సెం.మీ.) కొలతలతో ఉండేవి. గదులు, ఇళ్ళు, ప్రజాభవనాలకు (కోటలు?) ఇవే కొలతలు కనిపిస్తాయి. ఇళ్ళు బలమైన పునాదులు అనేక గదులతో రెండు అంతస్థులవరకు ఉండేవి. నీటి కొరకు ఇళ్ళలో బావులు ఉన్నాయి.

హరప్పానగరాలలో వేలకొలది బావులు, నీటిని నిల్వ ఉంచే చెరువులు, సామÖహిక స్నానవాటికలు (మతపరమైన?) కలవు. మురుగునీటి వ్యవస్థ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిఉండి లీకేజులు కాకుండా లోపలి వైపున  జిప్సమ్ పూత ఉంది.   నీటి నిర్వహణకు వీరు ఇచ్చిన ప్రాముఖ్యత అది. ఇంటిలోపల వ్యక్తిగత స్నానగదులు, టాయిలెట్లు ఉండటం హరప్పానగరాల ప్రత్యేకత. ఇవి ఘనవ్యర్ధాలకు కాక మురుగునీటిని బయటకు పంపించే నిర్మాణాలు. ఘనవ్యర్ధాలను తొలగించటానికి బహుశా మాన్యువల్ స్కావెంజెర్స్ ఉండేవారని భావించవచ్చు.

హరప్పా ప్రజలు మతపరంగా ఆలయాలు, పిరమిడ్లు, సమాధులు లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టలేదు. దీనికి కారణం  రాజు, సైన్యం లాంటి బలమైన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉండేది కాదు అని Gregory L Possehl లాంటి చరిత్రకారులు భావించారు. నగరంలో అక్కడక్కడా ఎత్తైన ప్లాట్‌ఫార్మ్‌లు కలవు. ఇవి వరదల నుండి కాపాడే నిర్మాణాలా లేక సామÖహిక ఆచారాలు లేదా సామాజిక కార్యకలాపాల కోసం ఉద్దేశించినవా అనేది  చర్చనీయాంశం.

ఇంటిమధ్య విశాలమైన మండువ (courtyard) దాని చుట్టూ మÖడువైపులా గదులు, ఒకవైపున విశాలమైన గుమ్మంతో హరప్పా ఇళ్ళనిర్మాణం ఉంది. ఈ గుమ్మం సాధారణంగా తూర్పువైపు ఉంది.  ఇలాంటి మండువా లోగిలి ఇళ్ళు నేటికీ గ్రామాలలో చూడవచ్చు.

సముద్రవ్యాపారం అంతర్జాతీయ సంబంధాలు

హరప్పా ప్రజలు గుజరాత్‌లోని లోథాల్, ధోలోవిరా ఓడరేవులద్వారా ప్రపంచదేశాలతో సముద్రవ్యాపారం చేసారు. వీరు  ఆఫ్ఘనిస్తాన్  నుంచి ఆభరణాల తయారీకి వాడే ఇంద్రనీలమణులను (Lapis lazuli) దిగుమతి చేసుకొని వాటిని తిరిగి మొసొపొటేమియా, ఈజిప్టులకు ఎగుమతి చేసారు.

ఈజిప్టు నుంచి రాగులు, జొన్నలు దిగుమతి చేసుకొన్నారు.  ఓమన్ నుండి రాగిలోహాన్ని దిగుమతి చేసుకొన్నారు.

హరప్పా ప్రజలు గవ్వలు, విలువైన రత్నాలతో చేసిన బంగారు ఆభరణాలు, ఏనుగుదంతాలు, విలువైన పూసలు, కాటన్ వస్త్రాలు, రంగులు, ఉన్ని,  నూనెగింజలు, కలప ధాన్యాలు మొదలైనవాటిని మొసపటోనియా, ఈజిప్టు లాంటి ప్రాంతాలకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు. ఈజిప్షియన్ మమ్మీలపై నేడు కనిపించే Cornelian పూసలు హరప్పా ప్రజలు అందించినవే అని కొందరి అభిప్రాయం.

సుమేరియన్ నాగరికత మెసొపొటేమియా ప్రాంతంలో ప్రపంచంలోని తొలి నాగరికతలలో ఒకటి. ఇది BCE 4500-1900 మధ్య ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. సుమేరియన్లు సింధులోయనాగరికతను “మెలుహా” అని పిలుచుకొనేవారు.

మెలుహా నుండి ఆభరణాలకు ఉపయోగపడే  విలువైన ‘కర్నెలియన్ స్ఫటిక రాళ్ళు’, అధికనాణ్యత కలిగిన ‘మెస్ కలప’ ఓడలలో సుమేరియాకు ఎగుమతి అయ్యేది. హరప్పా ముద్రలు/సీళ్లు మెసొపొటేమియాలో దొరికాయి. అదే విధంగా మెసొపొటేమియన్ తూనికరాళ్ళు హరప్పన్ సైట్‌లలో కనుగొన్నారు. సుమేరియన్  పురాణ గాథలలో- మెసపొటేమియా హరప్పా నాగరికత (మెలుహా) మధ్య వాణిజ్య సంబంధాలను సంబంధించిన వివరాలు కలవు.

“మెలుహా భూమి నీ కోసం విలువైన కార్నెలియన్ రత్నాలు, మెస్ కలప, ఇంకా ఉత్తమమైన అబ్బా కలప పెద్ద పెద్ద నౌకలలో పంపించుగాక.” Enki and Ninhursag సుమేరియన్ పురాణగాథ, cBCE.. 2000. [5]

హరప్పా వ్యాపారులు ఎప్పటినుంచి మెసొపొటేమియాతో వ్యాపారం సాగిస్తున్నారో తెలియదు కానీ ద్పుీజు 4100 నాటికే వీరు ఎగుమతి చేసిన Lapis lazuli అనే ఇంద్రనీలమణులు మెసొపొటేమియా నగరమైన Tepe Gawra వద్ద లభించాయి.

మొసొపొటేనియాలో సుమేరియన్ల అనంతరం వచ్చిన  అక్కాడియన్ సామ్రాజ్య స్థాపకుడు సర్గన్ BCE 2300లో వేయించిన శాసనంలో, ఆయన రాజ్యంలోకి దూరప్రాంతాల నుండి వచ్చిన నౌకల వివరాలు కలవు.  ఆ నౌకలు వచ్చిన ప్రాంతాల జాబితాలో అత్యంత దూరంగా ఉన్న దేశంగా మెలూహా పేరు ఉన్నది.

BCE 2300 కాలానికి చెందిన ఒక అక్కడియన్ గ్రంథంలో మెలుహాకు చెందిన లూ-సున్జిదా (Lu-Sunzida) [6] అనే వ్యక్తి తన విరిగిపోయిన దంతాన్ని బాగుచేయించుకొన్నందుకు పది వెండినాణాలు చెల్లించినట్లు ఉంది.  ఇతను బహుశా హరప్పా నుంచి సుమేరియాకు వ్యాపారనిమిత్తం వచ్చిన వ్యక్తి కావొచ్చు (Medical tourism?). ఈ ఉదంతం ఆ కాలంలో ఈ రెండు ప్రాచీననాగరికతల మధ్య జరిగిన రాకపోకలను తెలియచేస్తుంది.

హరప్పా వ్యాపారులు సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న  మొసొపొటేమియాతో అరేబియా సముద్రం ద్వారా ప్రయాణించి వ్యాపారం చేసారు.  కృత్తిక నక్షత్రం, దృవనక్షత్రం ఆధారంగా ప్రయాణాల్లో దిశల్ని గుర్తించేవారు. వీరు విదేశీవ్యాపారానికి ఉపయోగించిన నౌకలు పొడవుగా ఉండి మధ్యన కేబిన్ ను కలిగి ఉన్నట్లు మట్టిఅచ్చుల ద్వారా తెలుస్తుంది. ఇవి నేటికీ వినియోగంలో ఉన్న “హౌస్ బోట” ను పోలి ఉన్నాయి.  ఏ రకమైన నౌకా శిథిలాలు లభించలేదు.  

కంచుని తయారుచేయటానికి ఉపయోగపడే సీసము, పూసలతయారీలో

ఉపయోగపడే lapis lazuli లపై హరప్పన్‌లకు మోనోపొలి ఉండేది. వీటిని మొసపటేమియాకు, ఈజిప్టుకు ఎగుమతి చేసి బంగారము వెండి బదులుగా పొందేవారు.

వ్యాపారాల ఎగుమతి దిగుమతులకు తూనికలు ప్రధానము.  హరప్పా ప్రజలు తూనికరాళ్ళను ప్రమాణీకరించారు.  సింధుప్రాంత Rohri పర్వతాలవద్ద లభించే రాతితో ఈ తూనికరాళ్లను తయారు చేసారు. ఇవేరాళ్లు మొసొపొటేమియాలో కూడా లభించడాన్ని బట్టి తూనికల ప్రమాణీకరణలో హరప్పా ప్రజల పాత్ర అవగతమౌతుంది. హరప్పానాగరికత శిథిలమైన అనంతరం కూడా నేటికీ వారి కొలతలే కనిపిస్తాయి. అర్థశాస్త్రంలో చెప్పిన అంగుళం కొలత హరప్పాకాలం నుండి ఉన్నదే.

హరప్పా ప్రజల సామాజిక వ్యవస్థ

హరప్పానాగరికత లిపి ఇంకా కనుగొనబడని కారణంగా వారిగురించిన సామాజిక వివరాలు నేటికీ స్పష్టాస్పష్టమే. ఈ నగరాల చుట్టూ బలమైన గోడలు ఉండటాన్ని బట్టి ‘లోపలి ప్రజలు’ ‘బయట ప్రజలు’ అనే విభజన ఉండేది అని భావించాలి. హరప్పా నాగరికతకు చెందిన ప్రజలలో హెచ్చుతగ్గుల అంతస్థులు  ఉన్నవో లేవో తెలియరాదు.

వారి ప్రభుత్వం, మతవిశ్వాసాలు, భాష, పరిపాలన యుద్ధ తంత్రాలులాంటి వివరాలు పెద్దగా తెలియరావు

హరప్పా  ప్రజలు అద్భుతమైన హస్తకళలు కలిగి ఉన్నారు.  రత్నాల హారాలు, శంఖాలతో చేసిన గాజులు, జంతువులు, మానవ ఆకృతులు, పిల్లల ఆటబొమ్మలు లాంటి ఎన్నో అవశేషాలు దొరికాయి.   

హరప్పా  ప్రజలు  పత్తిని పండించారు. కాటన్ వస్త్రాలు ధరించారు. పట్టు, ఉన్నిలను ఉత్పత్తి చేసారు.

హరప్పా తవ్వకాలలో పాచికలు, చదరంగం లాంటి ఆటలకు సంబంధించిన అనేక పావులు లభించాయి. ఇవి పెద్దల కోసం రూపొందించినవి కావొచ్చు.  పిల్లల కోసం మట్టితో చేసిన అనేక ఆట బొమ్మలు దొరికాయి. ఇవన్నీ ఆనాటి సమాజంలో పిల్లల ఆటలు, పెద్దల వినోదం పట్ల ఉన్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తాయి.

హరప్పా ప్రజలు నేటి స్త్రీల వలె పాపిటమొదట్లో సింధూరాన్ని, చేతులకు గాజులను, మెడలో పూసల దండలను ధరించారు. హరప్పన్లు ఇరాన్‌లోని దరెస్తాన్ అనే ప్రాంతం నుండి ఈ సింధూరాన్ని దిగుమతి చేసుకొని ఉండవచ్చునని దేవ్‌దత్ పట్టనాయక్ అభిప్రాయపడ్డాడు. పురుషులు నుదురుపై బొట్టు, జబ్బలకు తాయెత్తులు లాంటివి కట్టుకొనేవారు. (Priest King)

నేడు మనం ఇంటిముందు వేసుకొనే ముగ్గుల డిజైన్లు, స్వస్తిక చిహ్నం లాంటివి అనేకం హరప్పాలో కనిపించాయి.

రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఉండే భంగిమతో ఒక బొమ్మ హరప్పా శిథిలాలలో దొరికింది.  ఇది భారతదేశానికి ప్రత్యేకమైన సాంస్కృతిక సంజ్ఞ.

హరప్పన్లు వ్యవసాయం చేసారు. ఋతువుల ప్రారంభం, వ్యవసాయ కాలాలను నిర్ణయించటానికి  ఖగోళపరిజ్ఞానాన్ని  ఉపయోగించుకొన్నారు.  వారు వాడిన నాగలి, నీటిపారుదల విధానాలు నేటికీ మారలేదు. ఎద్దులబండ్లు ఏ మార్పులు లేకుండా అదే నిర్మాణంతో నేటికీ కొనసాగుతున్నాయి. నాగలి చాళ్లు ఉన్న పొలం తవ్వకాలలో బయటపడింది. 

హరప్పా  నాగరికత కాలంలోనే ఈజిప్టులో పిరమిడ్లు లాంటి బృహత్ నిర్మాణాలు జరిగాయి కానీ హరప్పా ప్రజలు అలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చెయ్యలేదు కారణాలు తెలియరావు.

కొన్ని సమాధులలో శంఖం, గాజులు, మృతుల తాలూకు గిన్నెలు, ఆభరణాలు, రాగిదర్పణం లాంటివి దొరకడాన్ని బట్టి హరప్పా ప్రజలు Death rituals ని పాటించేవారని, మరణానంతర జీవితం పట్ల వారు విశ్వాసం కలిగిఉండేవారని అర్థమౌతుంది. జనాభాకు అనుగుణంగా అధికసంఖ్యలో సమాధులు లభించకపోవటాన్ని బట్టి ఈ ప్రజలు ఖననం మాత్రమే  కాక దహనసంస్కారాన్ని పాటించి ఉంటారు.

హరప్పా ప్రజల మత విశ్వాసాలు

హరప్పా ప్రజలు తమ నమ్మకాలను, ఆలోచనలను, విలువలను చిన్న చిన్న సంకేతాత్మక చిత్రాలలో నిక్షిప్తం చేసారు. వీటిని మోటిఫ్స్ అంటారు. మోటిఫ్స్ అనేవి పునరావృతమయ్యే చిహ్నాలు.  ఇవి ముద్రలు, అచ్చులు, కుండలపై డిజైన్ల రూపంలో నేడు లభిస్తున్నాయి. వీటిలో ముద్రలు, అచ్చులు “steatite”అనే రాయిపై చెక్కబడిన ఒకటి రెండు అంగుళాల చతురస్రాకారపు బిళ్ళలు. వ్యాపారులు తమ సరుకులను  మÖటలుగా కట్టి వాటిని విప్పటానికి వీలు లేకుండా  ఈ మట్టి ముద్రలను సీల్స్‌గా వేసేవారు. ఇది ఒక రకంగా దృశ్యభాష. హరప్పన్ ముద్రలలో హింస, యుద్ధబీభత్సం, స్త్రీపురుషుల శృంగార దృశ్యాలు, దంపతులు లాంటివి  కనిపించవు.

హరప్పా లిపి ఇంకా డీకోడ్ కాని కారణంగా ఆనాటి ప్రజల సంస్కృతి, ఆచారాలను, పురాణ కథనాలను అర్ధం చేసుకోవటానికి పురావస్తు తవ్వకాలో లభించే మోటిఫ్స్,  ఆటబొమ్మలు, వస్తువులు, నిర్మాణాల మాత్రమే ఆధారం. వీటిలో ముఖ్యంగా యూనికార్న్ జంతువు, మహాయోగి, వృక్షదేవత, అమ్మదేవత లాంటి చిహ్నాలు ముఖ్యమైనవి.

యూనికార్న్ ముద్ర (ఒకే కొమ్ముకలిగిన జంతువు). హరప్పా ముద్రలలో యూనికార్న్ థీమ్‌కి సంబంధించిన సీల్స్ వెయ్యికిపైగా దొరకగా ఇతర సీల్స్ ఒక్కొక్కటి వందకు లోపే దొరికాయి. యూనికార్న్‌కు అర్ధం స్పష్టంగా తెలియదు. ఇది మÖపురం లేని ఎద్దుకు, కృష్ణజింకకు మధ్యంతరంగా ఉంటుంది  ఈ మోటిఫ్ ఒక తెగ, వంశానికి లేదా ఈ ముద్రలను వేయించిన యజమానికి ప్రతీకగా భావిస్తారు. అనేక ముద్రలలో ఈ  ఏకశృంగ జీవికి ఎదురుగా ఒక పాత్ర (Manger నీటిపాత్ర లేదా సాంబ్రాణిపాత్ర) ఉండటాన్ని బట్టి దీన్ని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఒక మిథికల్ జీవిగా పరిగణిస్తారు. ఇలాంటి చిహ్నం తమిళ సంగంకాల (BCE 300) నాణాలపై  ఉన్నట్లు గుర్తించారు.

 ఈ యూనికార్న్ జంతువు జెబు ఎద్దుకి (humped bull మోపురము కలిగిన ఎద్దు) కళాత్మక రూపమని Gregory L Possehl అభిప్రాయపడ్డాడు. ఈ వాదనకు ఆధారంగా రెండు కొమ్ములు కలిగిన జెబు ఎద్దుల బొమ్మలు కొన్ని చూపిస్తారు. జెబు ఎద్దులకు ఎత్తైన మూపురము, గంగడోలు ఉంటాయి. వీటిని దున్నలను వినియోగించినట్లే బరువులు లాగటానికి, భూమిదున్నడానికి,  మాంసం కొరకు వినియోగించేవారు.

ఆధునిక భారతదేశంలో జెబు ఎద్దులు పవిత్రంగా భావించబడతాయి.  సంక్రాంతి కనుమపండుగరోజున ఈ ఎద్దులను అలంకరించి ఊరంతా తిప్పటం ఆచారం. గంగిరెద్దుగా, నందీశ్వరునిగా, వెంకన్నబాబుగా జెబు ఎద్దులను పూజించటం మనం హరప్పా కాలం నుంచి నిలుపుకొంటూ వచ్చిన ఒక బహుజన సంస్కృతి.

ప్రోటో-శివ:   హరప్పా ముద్రలలో అత్యంత చర్చనీయ చిహ్నాలలో ఇది ఒకటి. ఇది 3.5 సెం.మీ చతురస్రాకారపు ముద్ర. ఈ భంగిమలో ఒక వ్యక్తి ఒక వేదికపై యోగ భంగిమలో ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఈ వ్యక్తి తలపై గేదె కొమ్ముల శిరస్త్రాణం ఉంది. అతని చుట్టూ ఏనుగు, ఖడ్గమృగం, పులి, గేదె వంటి జంతువులు, వేదిక కింద జింకలు ఉన్నాయి. ఆ యోగి చుట్టూ జంతువులు ఉన్నాయి కనుక అతను “పశుపతి” కావచ్చునని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడి, ప్రొటో-శివ అని పేరుపెట్టాడు. ఆ ముద్ర స్త్రీ బొమ్మ కావొచ్చునని, తపస్సుచేసుకొనే ఋషి అని,  శిరస్త్రాణంలో గేదె కొమ్ములు ఉన్నాయి కనుక ఆ మనిషి “గేదె దేవుడు మహిష” కావొచ్చునని కొందరు ప్రతిపాదించారు.  ఇది మతపరమైన చిహ్నం అని అందరూ అంగీకరించారు.

చెట్టు దేవత: హరప్పా ప్రజలు చెట్లను గౌరవించారు. బహుశా పూజించారు. రావిచెట్లు అనేక ముద్రలలో కనిపిస్తాయి. తుమ్మ, వేపచెట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. ఒక ముద్రలో రావిచెట్టు మధ్యలో ఒక దేవత ఉండటం, దానిముందు మోకరిల్లి ప్రార్ధిస్తున్న భంగిమలో ఒక వ్యక్తి అతని వెనుక ఏడుగురు సహాయకులు, ఒకమేక నిలుచుని  ఉండటం కనిపిస్తుంది.  ఈ ఏడుగురు సప్తసింధు/ఏడునదులు, ఏడుగురు ఋషులు, సప్తమాతృకలు  లాంటి భావనలతో సంబంధం కలిగి

ఉండొచ్చు. మొత్తం దృశ్యం ఒక సామÖహిక మతక్రతువును తెలియచేస్తుంది.  (వృక్షారాధన, వృక్షదేవత బొమ్మలు చూడుడు).

రావిచెట్టు ఆ తరువాత వచ్చిన బౌద్ధమతంలో ఆరాధనీయ బోధివృక్షంగా పూజలందుకొంది. నేటికీ గ్రామాలలో రావి, వేప, తుమ్మచెట్లను పూజిస్తారు. 

మరొక ప్రముఖమైన ముద్ర కింద పులి చూస్తుండగా చెట్టుపై  దాక్కొన్న  మనిషి ముద్ర.  ఈ ముద్రకు ఆ తరువాతి కాలానికి చెందిన శివరాత్రి మహాత్య్మానికి సంబంధం చెబుతారు. ఒక వేటగాడు పులిని తప్పించుకోవటానికి ఒక చెట్టు ఎక్కుతాడు. పులి చెట్టుకిందే తచ్చాడటంతో అతను  ఆ రాత్రంతా ఆ చెట్టుమీద గడపగలసి  వస్తుంది.  నిద్రరాకుండా చెట్టు ఆకులు తెంపి కిందవేస్తుంటాడు. తెల్లారే సరికి తాను కూర్చున్నది మారేడు చెట్టని, దానిఆకులు తెంపి కింద ఒక శివలింగంపై వేసి పూజచేసినట్లు తెలుసుకొంటాడు. ఇది మహా శివరాత్రి రోజున జరగటంచే ఆ వేటగాడు శివుని అనుగ్రహం పొందాడని ఐతిహ్యం.

అమ్మదేవత: సంతానోత్పత్తి, వ్యవసాయ దిగుబడులకొరకు అమ్మదేవతలను ఆరాధించటం మానవనాగరికతలో అనాదిగా వస్తూన్న ఆచారం. పెద్ద వక్షోజాలు, విశాలమైన పిరుదులు,  ఆభరణాలు, పూల అలంకరణ వంటి లక్షణాలతో అమ్మదేవతలను గుర్తించవచ్చు.

హరప్పాలో కూడా అమ్మదేవత ఆకారాలతో ఉన్న అనేక మట్టి ముద్రలు, టెర్రకోట బొమ్మలు దొరికాయి.  

కొన్ని ముద్రలలో స్త్రీ గొప్ప శక్తులు కలిగినట్లు చిత్రించబడింది.  వృక్షంలో నిలుచుని పూజలందుకొంటున్న స్త్రీ (వృక్షదేవత?), రెండు చేతులతో పులులను  నిలువరిస్తున్న స్త్రీ, సగం పులి సగం స్త్రీ దేహంతో ఉన్న పులిదేవత (Mythical Tiger Sphynx?) లాంటి ముద్రల ద్వారా  హరప్పన్లలో అమ్మదేవతారాధన

ఉన్నట్లు నిర్ధారించారు.

హరప్పా వద్ద లభించిన అమ్మదేవతా మట్టిప్రతిమ నగలు,  శిరోజాలంకరణతో ఉంది. నేటి గ్రామదేవతారాధనకు మÖలాలు హరప్పానాగరికతో ఉన్నాయని Asco Parpola అభిప్రాయపడ్డాడు. హరప్పా అమ్మదేవతా ప్రతిమకు ఆ తరువాత మౌర్యుల కాలానికి చెంది తక్షశిల వద్ద దొరికిన అమ్మదేవతా ప్రతిమకు పోలికలు కనిపిస్తాయి. ఇదే తరహా ప్రతిమలు బౌద్ధ జైనాలలో యక్షిణి దేవతలతో సామ్యాలు ఉంటాయి. ఆ తదనంతర కాలంలో హైందవీకరణ చెందిన అమ్మదేవతలు ఆయుధాలు ధరించి ఉండటం గమనార్హం. ఈ రోజు దేశవ్యాప్తంగా కనిపించే గ్రామదేవతల సంస్కృతి  హరప్పాకు కల్చరల్ కంటిన్యూటీ. 

స్త్రీకొరకు యుద్ధం చేసుకునే ఇద్దరు వీరులు ఒక ముద్రలో కనిపిస్తారు.  నూరుకొనే రాయిపై ధాన్యం విసురుతున్న మహిళ మట్టిబొమ్మ, ఆనాటి కుటుంబంలో స్త్రీపోషించిన పాత్రను చెబుతుంది. తవ్వకాలలో లభించిన స్త్రీల అవశేషాలద్వారా వారు పురుషులకంటే తక్కువ పోషకపదార్ధాలు తీసుకొన్నట్లు గుర్తించారు. 

నీటి గేదె: అనేక ముద్రలలో కొమ్ములు కలిగిన గేదెలు /దున్నలు కనిపిస్తాయి. తవ్వకాలలో గేదె ఎముకలు లభించాయి. దేశం నలుమÖలలా గ్రామాలలో ఎక్కడైనా జాతర్లు జరిగే  దున్నలను బలి ఇవ్వటం ఆచారంగా వస్తుంది.  దీనికి మÖలాలు హరప్పా నాగరికతలో కనిపిస్తాయి. 

ఒక వ్యక్తి ఒకకాలితో దున్న తలను అణిచిపెడుతూ, బల్లెంతో తలనరకే దృశ్యంలో హరప్పా ప్రజలు బలులు ఇచ్చారనే సూచనలు ఉన్నాయి. (చూడుడు: దున్నను చంపుతున్న దృశ్యం)

హరప్పాలో దొరికిన పశువుల ఎముకలపై నరికిన గుర్తులు (Butching/slaughtering cuts) ఉన్నాయి. ఇది కూడా వారు జంతువులను బలి ఇచ్చి మాంసాన్ని తినేవారని అర్థమౌతుంది. ఈ అలవాటు నేటికీ దళిత బహుజన సమాజాల ఆహారపుటలవాట్లలో సజీవంగా ఉంది. హరప్పన్లకు వైదిక క్రతువులు యజ్ఞాలు, సంస్కృతం తెలిసినట్లు ఆధారాలు లభించలేదు.

దున్నరూపం కల ముద్రలు, దున్నలుకట్టిన బండి ఆటబొమ్మలు అనేకం లభించాయి. కొన్ని ముద్రలపై దున్నపోతుతో పోరాడుతున్న దృశ్యాలను బట్టి, అప్పట్లో  bull fight (జల్లికట్టు) వంటి పోరాటాలు ఉండేవి అనికూడా ఊహించవచ్చు. వంటపాత్రలలో దున్నమాంస అవశేషాలను డిఎనఎ పరీక్షల ద్వారా గుర్తించారు.

హరప్పా నాగరికత తవ్వకాలలో దొరికిన ఎముకలలో 50 నుంచి 60% వరకూ దున్నలు, Zebu ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు లాంటి మచ్చికచేయబడిన జంతువులకు సంబంధించినవి. వీటిలో దున్నల ఎముకలు అధికంగా ఉన్నట్లు గుర్తించడాన్ని బట్టి హరప్పా ప్రజలు పశుమాంసాన్ని ఇష్టపడేవారని భావించవచ్చు. అడవి పందులు, కుందేళ్ళు, లేళ్ళు, దుప్పులు, లాంటి అడవి జంతువుల ఎముకలు కూడా దొరికాయి. సుదూరంగా ఉన్న సముద్రపు చేపల ఆనవాళ్ళ ఆధారంగా చేపలను ఎండబెట్టి రవాణా చేసేవారని తెలుస్తుంది.

నాగారాధన: హరప్పా ప్రజలు సర్పాలను ఆరాధించేవారని కొన్ని ముద్రలద్వారా తెలుస్తుంది.  ఒక ముద్రలో ఎద్దు తల కలిగిన ప్రధాన దైవానికి ఇరువైపులా ఇద్దరు భక్తులు చేతులుజోడించి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి వెనుక ఒక్కో సర్పము నిలబడి వారి శిరస్సును కప్పుతూ ఉండటం గమనించవచ్చు.  మరొక ముద్రలో కూడా సర్ప ఆకృతి కనిపిస్తుంది. 

మేకలు, గొర్రెలు: వీటిని మాంసం, పాలు, ఉన్ని కొరకు హరప్పన్‌లు పెంచుకొనేవారు.  కొన్ని ముద్రలలో మెడపట్టీలు కలిగిన కుక్కబొమ్మలు కూడా  ఉన్నాయి. చేపలు, నక్షత్రాలు అనేక ముద్రలలో బాక్‌గ్రౌండ్ గా ఉన్నాయి.

హరప్పన్ ముద్రలలో ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగము, పులి, గేదె, మేక, దుప్పి, మొసలి, చేప, తాబేలు, కుక్క, లేడి లాంటి జంతువులు కనిపించాయి కానీ గుర్రం మాత్రం ఎక్కడా కనిపించలేదు.  సింధులోయ నాగరికత అవశేషాలు లభించిన చోట్ల ఇంతవరకూ జరిగిన తవ్వకాలలో  గుర్రానికి సంబంధించి ఒక్క అస్థిపంజరంకానీ, ఎముకలు కానీ లభించలేదు. ఈ దృగ్విషయం  ఆర్యులు గుర్రాలపై హరప్పా అనంతరకాలంలో వచ్చారనటానికి ఆధారంగా నిలుస్తుంది.  1999లో,  NS Rajaraman, హరప్పాలో గుర్రాల ఉనికి ఋజువులు ఉన్నాయని, గుర్రం ముద్ర కూడా ఉందని పేర్కొన్నారు. కానీ, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన ఇండాలజిస్టు Micheal Witzel, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించిన  ఆ ముద్ర ఒక నకిలీ అని నిరూపించారు.[7]

కంచుతో చేసిన ఆటకత్తె విగ్రహం (Dancing girl): హరప్పా నాగరికతలో అత్యంత ఆకట్టుకొనే కళాకృతి కంచుతో చేసిన ఆటకత్తె బొమ్మ (ఇది 11 సెంటీ మీటర్ల ఎత్తు ఉంది. లాస్ట్ వాక్స్ పద్ధతి ఉపయోగించి పోతపోసిన విగ్రహం ఇది. ఇది సన్నగా నిటారుగా, తలకొద్దిగా వెనుకకు తిప్పి, మోకాలివద్ద ఒంగుని, కుడిచేయి నడుముపై, ఎడమచేయి మోకాలిపైభాగంపైన ఉంచి నగ్నంగా నిలుచుని ఉన్న యువతి బొమ్మ ఇది. మెడలో పూసల నెక్లెస్ ఉంది. ఎడమచేతికి ఇరవై ఐదు గాజులు, కుడిచేతికి నాలుగు గాజులు కలవు. జుట్టు వదులుగా ముడివేయబడి ఉంది. ఈ బొమ్మలోని యువతి బాడిలాంగ్వేజ్ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖలక్షణాలు ఆదివాసీ జాతికి చెందినవారిని పోలి ఉన్నాయి.  ఈ బొమ్మను ఒక నృత్యభంగిమగా భావించి జాన్ మార్షల్  దీనికి Dancing girl అని పేరు పెట్టాడు. ఇంతవరకు మొత్తం రెండు ఆటకత్తెల విగ్రహాలు మాత్రమే దొరికాయి.  ఇది ఆటకత్తె బొమ్మ కాకపోవచ్చునని ఉన్నతకుటుంబానికి చెందిన స్త్రీ బొమ్మ కావొచ్చునని ఉపేందర్ సింగ్ (2008) అభిప్రాయపడ్డాడు. 

హరప్ప ప్రజలు లోహశాస్త్రంపై సాధించిన ప్రగతిని ఈ విగ్రహం ఒక సాక్ష్యం.  Dancing girl ను పోతపొయ్యటం  కొరకు ఉపయోగించిన ost wax technique ను తమిళనాడు స్థపతులు ఇంకా వాడుతూ ఉన్నారు. భుజాలవరకూ గాజులు ధరించే ఆచారం రాజస్తాన్, గుజరాత్ రబారి సంచారతెగ స్త్రీలు, రాజస్తాని మార్వారి, బంజారా స్త్రీలు, తెలుగు ప్రాంతాలలో లంబాడి స్త్రీలలో నేటికీ గమనించవచ్చు.

పూజారి రాజు (Priest King): ఇతను పూజారి కాని రాజు కానీ కాకపోవచ్చు కూడా. ఈ విగ్రహం 18 సెం.మీ ఎత్తు ఉంది. భుజంపై పువ్వుల శాలువా కప్పి  ఉంది. ఈ బొమ్మకు విశాలమైన అరమోడ్పు కళ్ళు, ఆభరణాలు తగిలించటానికి చెవుల కింద రంద్రాలు, నుదుట బొట్టు, కుడిచేతికి తాయెత్తు,  విరిగిపోయిన నిటారు ముక్కు, మీసం, గెడ్డం ఉన్నాయి.  దీనిని  పూజారి రాజు అని మార్షల్ పిలిచాడు.  ఇది అసంపూర్ణ విగ్రహం అని కొందరు భావించారు. పార్పొలా దీనిని కూర్చుని ఉన్న దేవుని విగ్రహం అని ప్రతిపాదించాడు.

పూజారిరాజు బొమ్మ హరప్పా విగ్రహాలలోకెల్లా అత్యంత నిగూఢమైనది. ఆడంబరమైన వేషధారణను బట్టి ఈ బొమ్మ  ఒక ఆధ్యాత్మికస్థాయి వ్యక్తిదా లేక పాలకుడిదా అనే చర్చజరిగింది. ఇతరముద్రలలో వలే ఇది ఏ రకమైన గాథను తెలియచేయదు.  ఒకే ఒకటి దొరికింది.  ఈ విగ్రహం ద్వారా ఆనాటి శిల్పచాతుర్యం తెలుస్తుంది తప్ప మరేరకమైన వివరాలు లభించవు.

***

జాన్ మార్షల్ తన తవ్వకాలలో లభించిన లింగ, యోని ఆకారాల కొన్ని శిల్పాలను చూపి హరప్పా  ప్రజలు లింగారాధకులు అని ప్రతిపాదించాడు.8  వీటికి సంబంధించిన మరేవిధమైన ఇతర సమాంతర ఆధారాలు లభించకపోవటంతో ఆ తదుపరి చరిత్రకారులు ఈ ఊహను తిరస్కరించారు.

హరప్పా సంస్కృతి వ్యాప్తి-  కొనసాగింపు

హరప్పా నాగరికత 1900-1300 BCE మధ్య క్షీణించటానికి పర్యావరణ మార్పులు ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్యులు వీరిపై దండయాత్రచేసి సామÖహిక హననం జరిపారనటానికి ఏ విధమైన పురావస్తు ఆధారాలు లభించలేదు.  అప్పటికే వాణిజ్యం తగ్గి వనరులు క్షీణించి  కరువుకాటకాలతో  క్షీణదశలో ఉన్న హరప్పా  ప్రజలను, భరతఖండంలోకి  ప్రవేశించిన ఆర్యులు స్థానిక ఘర్షణలతో చెల్లాచెదురు చేసి ఉండొచ్చు అని చరిత్రకారుల ఆధునిక అవగాహన.

హరప్పా నాగరికత క్షీణించిన అనంతరం ఆ ప్రజలు నగరాలను వదిలేసి తూర్పువైపు గుజరాత్,  రాజస్థాన్, హర్యానా, పంజాబ్, గంగా బేసిన్ ప్రాంతాలకు, మరికొంతమంది  దక్షిణభారతదేశానికి తరలిపోయారు.  

తమిళనాడులో కీళడి వద్ద జరిపిన తవ్వకాలలో BCE ఆరోశతాబ్దానికి చెందిన ఒక పట్టణ నాగరికత బయటపడింది. ఇక్కడలభించిన కొన్ని కుండపెంకులపై హరప్పాలిపిలోని కొన్ని గుర్తులను పోలిన సంజ్ఞలు ఉన్నాయి. ప్రముఖ ఇండాలజిస్ట్ ఆర్. బాలకృష్ణన్ కీళడి-హరప్ప నాగరికతల మధ్య సామ్యాలను గుర్తించాడు.

2006లో సెంబియన్-కండియార్‌లో నాలుగు హరప్పా లిపి గుర్తులు లభించాయి, ఇవి BCE 1500కి చెందినవి. వీటిని ఎపిగ్రాఫిస్ట్ ఇరవతం మహదేవన్ హరప్పా-ద్రావిడ సంబంధానికి ముఖ్యమైన ఆధారాలుగా పేర్కొన్నాడు. అడిచనల్లూర్, కొర్కై వంటి సైట్‌లలో కుండలు, పూసలు వంటి వస్తువులు హరప్పా శైలితో పోలికలు కలిగి ఉన్నాయి.  హరప్పా పతనానంతరం అక్కడి ప్రజలు తమిళనాడు వలస వచ్చారని  తమిళనాడు చరిత్రకారులు బలమైన సాక్ష్యాలను చూపుతున్నారు.  అంతేకాదు BCE 3345 నాటికే కీళడిలో ఇనుము తయారీ ఆనవాళ్ళు లభించాయని కె.అమర్‌నాథ్ రామకృష్ణ ప్రతిపాదించారు. ఈ అంశం భారతదేశ చరిత్ర గమనాన్ని మార్చేంత కీలకమైనది.

హరప్పాస్త్రీలు గాజులు ధరించారు, పాపిటిలో సింధూరం పెట్టుకొన్నారు,  సిగలో పూలు ధరించారు, మెడలో హారాలు వేసుకొన్నారు, నల్లపూసలు ధరించారు. తిరగలిపై పిండివిసిరారు, మట్టిపొయ్యలపై బహుశా చపాతీలు  చేసారు,  కవ్వంతో మజ్జిగ చిలికారు, ఆటబొమ్మలతో పిల్లలను సాకారు, ఇంటిముందు అందమైన ముగ్గులు వేసారు, అమ్మదేవతలను కొలిచారు, చెట్లను సర్పాలను ఆరాధించారు, పూజారి రాజు ప్రతిమలో దేహంపై చుట్టబడి ఉండే వస్త్రం  నేటి స్త్రీలు ధరించే చీరకు పూర్వరూపంగా కొందరు చెబుతారు - ఈరోజు మనం దేనినైతే భారతీయ సంస్కృతి అని పిలుస్తున్నామో దానిని హరప్పన్ స్త్రీలు నిర్మించారని  ప్రముఖ మైథాలజిస్ట్ దేవదత్ పట్టానాయక్ అంటారు.

శివుడు, దుర్గ, కృష్ణుడు, నాగపూజ లాంటి ఆరాధనలు వేదపూర్వమÖలాలు

ఉన్నాయని డి.డి. కొశాంబి అభిప్రాయపడ్డాడు.

హరప్పా నుండి హిందుత్వ వరకు

ఈ దేశంలోకి ఆర్యులు రావటానికి సుమారు రెండువేల ఏళ్ళక్రితమే హరప్పన్లు ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతను నిర్మించారు. ఇది గ్రామీణ వ్యవసాయాధారిత సమాజాలు, నగరసంస్కృతి, వ్యాపారులు, వృత్తిపనివారు, కార్మికులతో కూడిన నాగరికత. హరప్పానాగరికతలో ఉత్పత్తికులాలు ప్రధానపాత్ర వహించాయి.  హరప్పాలో వ్యవసాయం, పశుపోషణ, భవననిర్మాణం, పడవలు, ఎడ్లబళ్ళు నిర్మించి వస్తువుల రవాణా చేయటం, చేపలవేట, ఇటుకలు కుండల తయారీ,  తోలు, లోహకారపని, వడ్రంగి, బుట్టల అల్లిక, సారాయి తయారీ, చేనేత పట్టు పరిశ్రమ, పూసలతయారీ, గాజులు, పింగాణివస్తువులు, ఆటవస్తువులు, డప్పులు, బూరలు, తంత్రీవాయిద్యముల తయారీ,  ఖనిజ  పరిశ్రమలు వంటి ఉత్పత్తికులాల సంస్కృతి ప్రబలంగా ఉండేది. ఉత్పత్తిదారులు హరప్పన్ సమాజ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు. వారి, నైపుణ్యాలు,  శ్రమ, జ్ఞానం హరప్పా నాగరికత పురోగతికి దోహదపడ్డాయి. ఈ వృత్తులను నేటికీ సమాజంలో శూద్ర, అతిశూద్రకులాలే నిర్వహిస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ గ్రామాలలో హరప్పానాటి శాస్త్ర పరిజ్ఞానమే కొనసాగింది.   

తదనంతరం వచ్చిన ఆర్యబ్రాహ్మణులు ఉత్పత్తికి కాక ఆధ్యాత్మికతకు, పారలౌకిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తమనుతాము ఉత్పత్తి కార్యకలాపాలనుంచి మినహాయించుకొని అధ్యయనం, అధ్యాపనం, యజనం లాంటి అనుత్పాదక ఆధ్యాత్మిక పనులకు  పరిమితమయ్యారు. ఇవి నిత్యజీవితానికి, వ్యవసాయానికి, వాణిజ్యానికి ఉపయోగపడే ఆచరణాత్మక ఉత్పత్తిజ్ఞానం కాదు. ఈ బౌద్ధికజ్ఞానాన్ని కూడా ఆర్యబ్రాహ్మణులు సంస్కృతంలో రాసుకొని, అది తమకు మాత్రమే సొంతం చేసుకొన్నారు.  అంతే కాక హరప్పాకాలంనుంచి ఉత్పత్తిదారులైన శూద్ర, అతిశూద్ర వర్గాలను ధర్మశాస్త్రాలద్వారా  నాలుగవ శ్రేణి మనుషులుగా నిర్వచించి, విద్యకు దూరం చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు సేవలు చేయటమే వారి ధర్మంగా నమ్మించారు. ప్రజలలో మÖఢవిశ్వాసాలు, దైవభీతి, కర్మకాండలు, కర్మ సిద్ధాంతం వంటివి పెరిగి, హేతుబద్ధమైన ఆలోచనలు, వైజ్ఞానిక దృక్పథం క్షీణించాయి. ఈ చారిత్రక పరిణామం హరప్పన్ వారసులను దస్యులుగా, ద్విజుల ఆధ్యాత్మిక ఆధిపత్యానికి లోబడి జీవించేలా చేసింది, ముఖ్యంగా దళిత బహుజనులను.

హరప్పా నాగరికత పతనానంతరం భారతదేశంలోని గ్రామీణ దళిత,  బహుజనులు  సామాజిక ఉత్పత్తిదారులుగా ఉండటమే కాక-  వృక్ష,  జంతు, అమ్మతల్లి పూజలు, జాతరలలో బలులు లాంటి తమసాంస్కృతిక వారసత్వాన్ని  కొంతమేరకు సజీవంగా నిలుపుకొన్నారు.

***

A right-wing nationalist agenda would make us believe Dwijas alone were civilisation builders in India. But Indian civilisation began with the Harappan culture, whose inheritors are the present-day Shudras, Dalits, and Adivasis.[9] - Dr. Kancha Ilaiah

హిందుత్వ అనేది సాంస్కృతిక జాతీయవాద ఉద్యమం, ఇది హిందూ ఔన్నత్యం, సంస్కృతి, వేదాలు, పురాణాలు, భారతీయ చరిత్ర ఆధారంగా హిందువులను సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా గుర్తించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

“ఈ దేశాన్ని పితృభూమిగా, పవిత్రభూమిగా కలిగిఉన్న వ్యక్తే హిందువు” అంటూ హిందువుని నిర్వచిస్తారు సాంస్కృతిక జాతీయవాదులు. ఈ దేశంలో తరతరాలుగా నివసిస్తున్న ముస్లిములను, క్రిస్టియన్లను వేరు చేయడానికే ఈ నిర్వచనం అన్నది స్పష్టం.

హిందుత్వ సిద్ధాంతకర్తలు హైందవ మÖలాలను ఆర్యులు, వేదసంస్కృతి  నుంచి మొదలుపెడతారు. వేదాలు అత్యంత ప్రాచీనమైనవిగా, బారతీయసంస్కృతికి ఆధారంగా, ఆర్యబ్రాహ్మణులు ఈ దేశ సాంస్కృతిక నిర్మాతలుగా చెబుతారు.  అయితే ఇటీవలి జన్యుశాస్త్ర పరిశోధనలు ఆర్యులవలస సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయి.  దీనితో వారు హిందువుకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆర్యబ్రాహ్మణుల పితృభూమి సింధునదీ తీరమైనప్పటికి వారి  పవిత్రభూమి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఆర్యులు మధ్య ఆసియానుంచి భరతఖండానికి వలసవచ్చిన యోధ జాతిగా అంగీకరిస్తే - ఆర్యబ్రాహ్మణుల పవిత్రభూమి Khorezm అవుతుందంటూ  కృత్రిమమేధ చాట్ జిపిటి ఇలా సమాధానం చెప్పింది.  ''Khorezm is in the  present-day Uzbekistan and Turkmenistan, which is described as the ''land of the Aryans'' (Ariana Vaychoh) and is widely regarded as the birthplace of Zoroaster (Zarathustra), the founder of Zoroastrianism. It is also associated with the composition of the Avesta (the sacred texts of Zoroastrianism) and possibly early Vedic hymns''

సావర్కర్ “హిందుత్వ” పుస్తకం రాసే కాలానికి (1923) ఆర్యులరాక  కంటే సుమారు రెండువేల సంవత్సరాల పూర్వం భారత ఉపఖండంలో  విలసిల్లిన హరప్పనాగరికత గురించి స్పష్టమైన అవగాహన లేదు కనుక హరప్పన్ల ప్రస్తావన తేలేదు.  ఆ తరువాతి హిందుత్వసిద్ధాంత రచనలలో కూడా హరప్పాప్రజల గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించలేదు. హరప్పాసంస్కృతిని హిందుత్వవాదులు హిందూ సంస్కృతిలో భాగంగా చూడలేదు.

హరప్పా ప్రజలు ఈ నేల మÖలవాసులు. ఆర్య సంస్కృతి ఆధారంగా ప్రతిపాదించిన ఈ హిందుత్వ పరిధిలో ఈ దేశమÖలవాసులైన హరప్పాప్రజల స్థానం ఎక్కడ అనేది చర్చనీయం.  హరప్పా గురించి తెలిసికూడా  వైదిక ఆర్యులే ఈ దేశనాగరికతా నిర్మాతలుగా భావించటం ప్రాచీన భారతదేశ వైవిధ్యభరిత వారసత్వాన్ని నిరాకరించటమే. 

భారతీయ సంస్కృతి వేదకాలపూర్వం హరప్పానాగరికతతో ప్రారంభమైందని, ఋగ్వేదఆర్యులు విదేశీమÖలాలు కలిగి ఉన్నారనే సత్యాలను అంగీకరించటానికి పండితులు సిద్ధంగాలేరు సరికదా` ఆర్యులు స్థానికులేనని, హరప్పానాగరికత కూడా ఆర్యులు నిర్మించినదే అని నిరూపించటానికి కొందరు హిందూ చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ ప్రతిపాదనలను సమర్థించే సరైన శాస్త్రీయ, జన్యుపరమైన ఆధారాలు లేక అలాంటి వాదనలు భావజాల ప్రేరణతో కూడినవని పరిగణించాల్సి వస్తుంది.

***

ఈ దేశాన్ని హిందురాజ్యంగా మార్చే ప్రయత్నంలో ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారపు అలవాట్లను ప్రజలపై బలవంతంగా అమలుచేస్తే - ఈ దేశానికి గర్వకారణమైన  మతం, భాష, సంస్కృతులలోని వైవిధ్యం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.  మైనారిటీల భద్రత, ప్రజలందరూ సమానులే అనే భావనపై ఆందోళనలు తలెత్తుతాయి. రాజ్యాంగం హామీపడ్డ సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది. మహిళలు, వెనుకబడిన కులాలపై ఆంక్షలు పెరుగుతాయి. రాజ్యాంగవిలువలకు, దేశసమైక్యత, సమగ్రతలకు భంగం వాటిల్లుతుంది. హిందుత్వభావజాలం దళితులు ఆదివాసీలు ఓబీసీలు మైనారిటీల చారిత్రక గుర్తింపును చెరిపివేస్తుంది.   

ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన డా. బి.ఆర్. అంబేడ్కర్ ఇలా అన్నారు-  “హిందూరాజ్యం నిజంగా ఏర్పడితే, అది ఈ దేశానికి గొప్ప విపత్తుగా పరిణమిస్తుంది.  హిందువులు ఎన్నిమాటలు చెప్పినా హిందూమతం స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలకు ముప్పు. ప్రజాస్వామ్యానికి హిందూయిజానికి పొసగదు.[10] ”

***

జన్యు ఆధారాలు ఎన్ని తెరలు తొలగించినా,  నేల పొరల్లో ఇంకా విచ్చుకోని ఎన్నో రహస్యాలను దాస్తున్న హరప్పా - కాలపు అద్దంలో నిలిచి ఉన్న ఒక అద్భుత దృశ్యం. ఊహల రెక్కలతో మనం ఈరోజు హరప్పా వీధులలో నడొచ్చు, మట్టి గోడలు మౌనంగా చెప్పే కథలు వినొచ్చు. వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన ఆనాటి మెట్లు ఎక్కొచ్చు,  పురాతన బావులలోకి తొంగి చూడవచ్చు,  విశాలమైన ఆనాటి స్నానపు గదులలో నిలబడవచ్చు, వారి పరిపూర్ణ జీవనశైలిని ఊహించుకోవచ్చు.

హరప్పా కేవలం ఒక శిథిల నగరం కాదు,  నిరంతర పరిశోధనలకు నిలయం. మౌనంగా ఉన్నా అది మన మÖలాలను, గత వైభవాన్ని, మన స్థానికతను, మన వైవిధ్యాన్ని సగర్వంగా ప్రకటిస్తూనే ఉంటుంది.

హరప్పా కేవలం చరిత్ర కాదు, సజీవంగా మనతో నడుస్తున్న మన వారసత్వ ప్రయాణం.

(ఈ వ్యాసం "హరప్పా నుండి నేటి వరకూ" అనే పుస్తకం నుండి- అమజాన్ లింక్ కామెంటులో కలదు)

బొల్లోజు బాబా

21/06/2025

 































Footnotes

1. An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers. Authors: Vasant Shinde, Vagheesh M. Narasimhan, Nadin Rohland. Cell October, 2019

2. Sengupta et al. (2006): published in the American Journal of Human Genetics, Thanseem et al. (2006): Published in BMC Genetics, Genetic Affinities among the Lower Castes and Tribal Groups of India: Inference from Y Chromosome and Mitochondrial DNA

3. Narasimhan et al. (2019): Published in Science, The Formation of Human Populations in South and Central Asia

Reich et al. (2009):Title: Reconstructing Indian Population History Journal: Nature

4. New Perspectives on the Harappan Culture in Light of Recent Excavations at Rakhigarhi: 2011–2017 Edited by Vasant Shinde, Pno. 15

5. The Roots of Hinduism, Asko Parpola, pn 250

6. The Ancient Indus Valley New Perspectives, JANE R. McINTOSH, pn 183

7. Scroll.in, Jun 14, 2018

8. Mohenjo-daro and the Indus civilization by Marshall, John పేట్ నం. 13

9. The India Forum, A New Civilisational Discourse for India, February 08, 2022

10. డా. అంబేడ్కర్ పాకిస్తాన్ ఒర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, పే 354



Further Reading

1. The Harappan Legacy, Michel Danino
2. Ancient Cities of the Indus, Gregory L Possehl
3. Rethinking the Indus, Edward Cork
4. The Ancient Indus, Urbanism, Economy and Society Rita P Wright
5. The Ancient Indus Valley, New Perspectives, Jane R McIntosh
6. Mohenjo-daro and the Indus Civilization, edited by John Marshal
7. The Indus Civilization, Irfan Habib
8. The Decline and Fall of the Indus Civilization, by Nayanjot Lahiri
9. The Indian origin of paternal haplogroup R1a1* substantiates the autochthonous origin of Brahmins and the caste system, Swarkar Sharma et al
10. Deciphering Indus Script, Asco Parpola
11. A New Civilisational Discourse for India, Kancha Ilaiah
12. Harappa.com
13. Ahimsa: 100 Reflections on the Harappan Civilization, Devdutt Pattanaik