Wednesday, July 8, 2009

సూఫీ కవిత్వం - - అత్తర్


ఫరిదుద్దీన్ అత్తర్ ( అబు హమీద్ బిన్ అబుబక్ర్ ఇబ్రహీం) 1120-1229

1229 లో పెర్షియాను చెంఘీస్ ఖాన్ ఆక్రమించుకొన్నపుడు, ఓ వృద్దుని యుద్దఖైదీగా రాజుగారి వద్దకు తీసుకొచ్చారు. ఆ వృద్దుని పట్ల జాలిపడ్డ ఒక పౌరుడు ఆతనిని ఒదిలివేయండి, అందుకు ప్రతిఫలంగా నేను వెయ్యి వెండినాణాలు ఇస్తాను అన్నాడట. అపుడా వృద్దుడు " నన్ను అంత తక్కువకు అమ్మకండి, నా నిజమైన విలువను కట్టేవారు రావొచ్చు" అన్నాడట. మరొక వ్యక్తి ఒక మోపుడు ఎండు గడ్డి ఇస్తాను ఆ వృద్దుడిని వదిలివేయండి అన్నాడు. అపుడా వృద్దుడు " నా విలువ ఇదే ప్రభూ నన్ను ఇప్పుడు అమ్మివేయవచ్చు" అని చెప్పగా తాను మోసపోయినట్లు భావించిన రాజుగారు ఆ వృద్దుని శిరచ్ఛేదనం గావించమని ఆదేశించాడట.

ఆ వృద్దుడే ప్రముఖ సూఫీ కవి ఫరిదుద్దీన్ అత్తర్.

ఈ ఉదంతం జరిగిందో లేదో చారిత్రిక ఆధారాలైతే లేవు కానీ అత్తర్ కవిత్వం దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అత్తర్ కవిత్వంలో ప్రాపంచిక సంపదల పట్ల తృణీకారము కనపడుతుంది. అధికారము, కీర్తి, భోగలాలస భక్తిమార్గానికి మనిషిని దూరంచేస్తాయని చెపుతుంది.

భూమిపై ఉండే సంపదల అశాశ్వత గురించి , ఒక చోట అత్తర్

" ఈ ప్రపంచైశ్వర్యం అంతా నీదైనప్పటికీ
అది రెప్పపాటులో నీనుంచి అదృశ్యం కాగలదు"
అంటాడు

ఈ దేహంలో బంధింపబడ్డ ఆత్మ ను ప్రక్షాళనం చేసుకోవటం ద్వారానే దైవసాయుజ్యం పొందగలమన్న సూఫీ తత్వాన్ని అత్తర్ తన గీతాలద్వారా ప్రవచించాడు. అత్తర్ రచనల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ బర్డ్స్ ఒక గొప్ప సృష్టి.

అత్తర్ గురించి మరింత సమాచారాన్ని ఈ క్రింది లింకులో చూడవచ్చును.
http://en.wikipedia.org/wiki/Farid_al-Din_Attar

1.

నడిరేయిలో ఓ సూఫీ ఇలా విలపిస్తున్నాడు.
ఈ ప్రపంచం మూత వేసిన ఓ శవపేటిక
దానిలోనే మనమందరమూ ఉన్నాం.
అజ్ఞానం కొద్దీ మనజీవితాల ను
అవివేకంతో అధ్వాన్నంగా గడిపేస్తున్నాం.

మృత్యువు ఈ పేటిక మూత తెరువంగానే
రెక్కలు ధరించిన వారు అనంతంలోకి
ఎగిరిపోతారు.
లేని వారు పేటికలోనే మిగిలిపోతారు.

కనుక మిత్రులారా!
ఈశ్వరుని చేరే త్రోవలో పక్షిగా మారటానికై
అవసరమైనవన్నీ చేయండి.
రెక్కలు , తూలికలు పొందటానికి
ఏంచేయాలో అన్నీ చేయండి.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


2.
హృదయం చొక్కా పట్టుకొని
ఈ ప్రపంచపు తలను కాలితో తంతాను.
భూమిని, ఆకాశాన్ని నా గుర్రం కాళ్లక్రింద పడేసి తొక్కిస్తాను.
అందరినీ మించి బిగ్గరగా అరుస్తాను.
మరుక్షణం నేను ఈశ్వరుని ఎదుట
ఒంటరిగా మౌనంగా నిలుచుని ఉంటాను.

-- అత్తర్


3.

హతీమ్ అల్ అసామ్
"నేను నాలుగువిషయాలు ఎంచుకొని
మిగిలిన జ్ఞానాన్నంతా వదిలేసాను" అన్నాడు.

మొదటిది: నా దినసరి తిండి నిర్ణయింపబడ్డది.
అది పెంచబడదు, తగ్గించబడదు.
కనుక నేను దానిని పెంపుచేసే
ప్రయత్నాలు విరమించుకొన్నాను.

రెండవది: ఈశ్వరునికి నే పడ్డ బాకీ
మరెవరూ తీర్చరని తెలుసుకొన్నాను.
కనుక దానిని తీర్చటంలో నిమగ్నమయ్యాను.

మూడవది: నేనెప్పటికీ తప్పించుకోలేని,
ఒకరు తరుముతున్నారు , అదే మృత్యువు.
అందుకే తనను కలసుకోవటానికి
సిద్దపడుతున్నాను.

నాల్గవది: నాకు తెలుసు ఈశ్వరుడు
నన్ను పరిశీలిస్తున్నాడని.
అందుకే నేను చేయకూడని పనులు
చేయటానికి సిగ్గు పడతాను.

అత్తర్ --- "పెర్ఫ్యూం ఆఫ్ ద డిసర్ట్ " నుండి


4.

నీ మొఖము
అనంతమూ కాదు తాత్కాలికమూ కాదు.
నీ మొఖాన్ని నీవేనాడూ చూడలేవు,
నీవు చూసేది దాని ప్రతిబింబాన్ని మాత్రమే.

దర్పణం ముందు నిట్టూరుస్తూ
నీ ఊపిరి గాలులతో దాని ఉపరితలాన్ని
మసకబారేలా చేస్తున్నావు.
శ్వాసను నిదానముగా ఉంచు.
బంధించు, సాగర గజఈతగాని వలె.

కదిలావా, దర్పణ ప్రతిబింబం చెదిరిపోతుంది.

చనిపోకు, నిదురపోకు, మేల్కొనీ ఉండకు
ఏమీ చేయకు.

ప్రేమికులు ఒకరికొరకు మరొకరు ఓడినట్లుగా
నిన్ను నీవు పోగొట్టుకో,
అదే నీవు.
అదే నీకు కావలసినది.
దానికోసమే నీవు అన్వేషిస్తున్నావు.

-- అత్తర్


5.

అహాన్ని చంపుకోనంత కాలమూ
ఇతరులతో పోల్చుకొంటూ ఉన్నంత కాలమూ
మనం స్వేచ్ఛ నొందలేము.

బాహ్య ప్రపంచాన్ని తొడుక్కొన్నవారు
భక్తి మార్గంలో నడవలేరు.

-- అత్తర్

6.

నీ నుంచి జీవితాన్ని లాగేసుకొనే లోపే
ఈ మర్మాన్ని ఛేదించటానికి శ్రమించు.

నీవేమిటో బతికుండగా తెలుసుకోలేకపోతే
నీ ఉనికి రహస్యాన్ని ఎలా
అర్ధం చేసుకోగలవూ? చచ్చాకా!

----అత్తర్

బొల్లోజు బాబా
12 comments:

 1. బాబాగారూ

  అత్తర్ గారి పరిచయం బాగుంది ...

  మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు......మీరన్నారే " నీ మొఖాన్ని నీవేనాడూ చూడలేవు, నీవు చూసేది దాని ప్రతిబింబాన్ని మాత్రమే. " అని ...

  సరిగ్గా, అచ్చంగా, నిజంగా ఇలాటి మాటే మా తాతయ్యగారి నోట్లో సుమారు 1994లో విన్నాను....ఆయన అన్నది మరో కోణంలో , మరో సందర్భంలో అనుకోండి...కానీ ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతూనే ఉంటాయి...ఇప్పుడు మళ్ళీ మీరు రాసిన అవే మాటలు చూసాక, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ! ధన్యవాదాలు...

  ReplyDelete
 2. బాబా గారు, మునుపటివలెనే ముందు మాట - మీ ప్రయత్నానికి ఈ అనువాదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వంశీ గారికి వారి తాత గారు గుర్తుకు వచ్చినట్లే, "అహాన్ని చంపుకోనంత కాలమూ
  ఇతరులతో పోల్చుకొంటూ ఉన్నంత కాలమూ
  మనం స్వేచ్ఛ నొందలేము."
  చదువుతుంటే comparison is the death of happiness అని ఈ మధ్యనే విన్న మాట జ్ఞప్తికొచ్చింది. ఇవన్నీ ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ వచ్చి చదువుతున్నాను.

  ReplyDelete
 3. బాబాగారు,

  చాలా మంచి అనువాదాన్ని అందించారు. నిజమే తెలిసింది గోరంత తెలుసుకోవలసింది కొండంత.
  ‌ప్రతి పదం ఒక ఆణి ముత్యంలా ఉంది.

  ReplyDelete
 4. మాగంటి వారికి
  మీ కామెంటు చదివాకా నాకిలా అనిపిస్తుందండి
  కొన్ని అనుభవాలూ, జ్ఞాపకాలూ ఓ జీవితకాలం వెంటాడతాయి.
  వాటిని కవిత్వీకరించినపుడు, ఎన్ని శతాబ్ధాలైనా అలా వెంటపడుతూనే ఉంటాయి.
  "సహనాభవతు సహనౌభునక్తు" అన్నా, లేక ఈ క్రిందిలింకులోని 6 వ గీతంలా చెప్పినా http://sahitheeyanam.blogspot.com/2009/07/blog-post_04.html
  ఒకటే పరమార్ధం, అదే మానవత్వం.
  ఎక్కడో చదివినట్లు మనపూర్వీకులు మనకు అక్షరాలు మాత్రమే ఇచ్చారు, మనం వాటిని అన్వయించుకోవటమే మన పని. అంతే కదు సారూ!

  మీబోటి పెద్దల కామెంటు నాకెంతో ఆత్మస్థైర్యాన్నిచ్చింది. అందుకు కృతజ్ఞుడను.

  ఉషగారూ,
  నేను చాలా సార్లు గమనించాను, your comments never be peripheral. ఇక్కడే కాదు చాలా బ్లాగుల్లో. i wonder how could you absorb the soul of the post so perfectly madam. thank you very much madam.

  శ్రుతి గారికి
  థాంక్సండీ. పై సమాధానం మీకూ వర్తిస్తుంది.

  bolloju baba

  ReplyDelete
 5. మీరు అందించే ప్రతి అనువాదం....
  ప్రతీ ఒక్కటీ ఒక ఆణిముత్యం....
  ఇంతకన్నా వ్రాయడానికి తోచడంలేదు వేరొక పదం.

  ReplyDelete
 6. auvunu andi meru rasindanni chadivina travtha telusukovalsindi chala undi anipinchindi andi chala thanks andi ilnati anuvadanni andichinaduku
  Http:mirchyvarma.blogspot.com
  Untanu andi

  ReplyDelete
 7. మొత్తం చదవలేదండి... కానీ ఈ నిముషంలో ఇలా అనిపిస్తుంది... ఉద్యోగాలు చేస్తూ, సంసారపు భాధ్యతలు మోస్తూ ఇలా క్రమం తప్పకుండా ఎలా రాయగలరో నాకు అర్ధం కాదు... తవ్వే కొద్దీ నీళ్ళొచ్చే బావిలా, ఎప్పుడు మీ బ్లాగు తెరచినా చదవడానికొకటి కొత్తగా ఉంటుంది... ఎంతో ఆసక్తి, క్రమశిక్షణ లేకపోతే ఇలా చెయ్యలేరు... దిష్టి పెట్టేస్తున్నాను కదా :-) మీరు ఇలానే కొనసాగించండి...

  ReplyDelete
 8. చాలా బావుంది బాబా గారు.
  దిలీప్ గారన్నట్టు మీరు టైం ఇంత బాగా ఎలా మ్యానేజె చేస్తారో తెలుసుకోవాలి

  చిన్న చొప్ప ప్రశ్న. ముఖము - మొఖము రెంటికీ ఎమన్నా తేడా ఉందా?

  ReplyDelete
 9. ఒక రిక్వెస్ట్. ఈ వార్త పైన ఒక కవిత వ్రాయగలరా?

  Auto Prakash1
  Auto Prakash2

  ReplyDelete
 10. పద్మార్పితగారు,మంచి పిల్లాడు గారు
  ధన్యవాదములండీ

  dileep gaaru
  it is too much. :-)

  వాసు గారు థాంక్యూ
  సవరించినందుకు ధన్యవాదములు. ముఖము అన్నదే సరిఅయిన పదం. మొఖము వాడుకలో వినిపించే ఒక రూపాంతరం. థాంక్యూ మరోసారి.

  జీడిపప్పుగారు
  మీ కామెంటు చూసి నాకు భయం కలుగుతున్నది. :-) సరదాగా.

  మంచి లింకునిచ్చారు.
  108 సేవలగురించి చాన్నాళ్లుగా కవిత వ్రాయలని అనుకుంటూఊఊఊఊ ఉన్నాను. ఎక్కడో వేరే బ్లాగులో కూడా చెప్పినట్లే గుర్తు. ఎప్పుడో అప్పుడు నన్ను తీసుకెల్తే తప్ప రాదేమో. :-)

  మీరు చెపుతున్న అంశం కూడా చాలా మంచి వస్తువు.
  ప్రయత్నిస్తాను.
  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  భవదీయుడు

  బొల్లోజు బాబా

  ReplyDelete
 11. బాబా గారికి
  అభినందనలు,మంచి పరిచయం మీకు సూఫీ కవిత్వం ఇష్టం అయిఉండాలి.లేకపొతే అంత అరుదైన సమాచారం ఇవ్వలేరు.నాదొక సలహా,చాలా కాలం క్రితం వార్థ ఆదివారం ప్రత్యేక సంచిక లో ఒక ఉర్దూ కవయిత్రి గురించి విష్లెసన బాబా గారికి
  అభినందనలు,మంచి పరిచయం మీకు సూఫీ కవిత్వం ఇష్టం అయిఉండాలి.లేకపొతే అంత అరుదైన సమాచారం ఇవ్వలేరు.నాదొక సలహా,చాలా కాలం క్రితం వార్థ ఆదివారం ప్రత్యేక సంచిక లో ఒక ఉర్దూ కవయిత్రి గురించి విశ్లేషణ చదివాను అమె మొఘల్ చక్రవర్తుల వంశజురాలు,అమె కవితలు అంగ్లం లోకి కూడ అనువదింపబడ్దయి,పేరు గుర్తు లేదు మీకు తెలిస్తే పరిచయం చేయగలరు

  ReplyDelete
 12. అడిగిన వెంటనే ఆణిముత్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు బాబాగారు. మీ కవితను నా బ్లాగులో ప్రచురించాను.

  ReplyDelete