Friday, July 17, 2009

సూఫీ కవిత్వం - - జామీ

నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)

జామీ పదిహేనవ శతాబ్దానికి చెందిన పెర్షియన్ సూఫీకవి. సూఫీ కవులలో చివరి తరానికి చెందిన తాత్వికుడు.
“నా స్వస్థానం జామ్ (ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది). నా జ్ఞాన దాహాన్ని తీర్చిన గురువు పేరు అహ్మద్ జామీ. రెండూ కలిపితే నా కలంపేరు జామీ” అని తనను తాను పరిచయం చేసుకొంటాడు.

ఒకనాడు తనవద్ద శిష్యరికం చేయటానికి వచ్చిన విద్యార్ధితో నీవు ఎవరినైనా ప్రేమించావా అని అడిగగా, “నేనెవరినీ ఇంతవరకూ ప్రేమించలేదు” అని అంటే, “ వెళ్లు, ఈ ప్రపంచాన్ని ప్రేమించి రా, అపుడు నీకు మార్గాన్ని నే చూపిస్తాను” అని అన్నాట్ట జామీ.

జ్ఞానయానానికి ప్రేమే ప్రధమ సోపానం అని, విశ్వజనీన ప్రేమే ఈశ్వరునికి దగ్గరదారి అని జామీ భోదించేవాడు.

జామీ మొత్తం 87 పుస్తకాలు రచించాడు. వాటిలో బహారిస్తాన్ (Adobe of spring), హాప్త్ అవ్రాంగ్ (Seven Thrones) వంటివి ప్రముఖమైనవి. జామీ కవిగానే కాక, ఖగోళ శాస్త్రం, సంగీతం, చిత్రలేఖనం, తర్కశాస్త్రము వంటి వివిధరంగాలలో ప్రావీణ్యతను కలిగిఉండి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకొన్నాడు.

జామీ గురించి మరింత సమాచారం కోసం ఈ క్రింది లింకులో చూడండి


1.
నీవు పొందినవాటినన్నింటినీ
ఏదో ఒకనాడు మృత్యువో లేక జీవితమో
దొంగిలించుకుపోతుంది. ఆ లోపు
నిత్యం నీతోనే ఉండే ఆ సర్వాంతర్యామి వద్ద
నీ హృదయాన్ని దాచుకో.

--- జామీ


2.

ప్రభూ
నీవు నా హృదయాన్ని వేయిసార్లు
విరిచినా నాకేం భయంలేదు.
కానీ ఇక్కడ నేనిలా తయారయినందుకు
నన్ను ఏవగించుకొని విడిచిపెట్టకు
ఈ తోటలోని ప్రతీపూవు తమ వేర్లను
రొచ్చులోనే కలిగిఉన్నాయి.

---- జామీ

3.
మానవ మూలాల అన్వేషణ లేని వాడు
రూపాన్ని మాత్రమే పొంది,
మిగిలినదంతా పోగొట్టుకొన్నట్లు.
అన్నిబాధలను జీవితం స్వస్థపరుస్తుంది
కానీ బాధలేనితనానికి మందు లభించదు.
----జామి

4.

అనామకునిగా మారే రహస్యాన్ని
ఛేదించినవాడు అదృష్టవంతుడు.
ఎవరో ఒకనిగా ఉండటం ద్వారా సాధించేదేముంది!

నిష్కామము, అనాశక్తత తప్ప మిగిలినదంతా
భ్రమ లేదా భ్రమ ను చేరే దారి.
నీ మోముపై ప్రసరించే కాంతి
దైవ జ్వాల గురించి గుసగుసలాడుతుంది.
ఎవ్వరి నుంచి నువ్వూ నేను వచ్చామో
ఆ ఈశ్వరుడే దీనికి సాక్షి.

పంజరపక్షి పరిమళ పూదోటను చేరాలంటే
ఊహాలోకాలను దాటుకొంటూ వేళ్లాల్సిందే.
మానవ లలాట లిపి ఇంకా ఉన్నతమైనది
ఎందుకంటే నీ ఒప్పందం
సాటి మానవునితో కాదు ఈశ్వరునితో

ప్రియవిభుని రధాన్నధిరోహించే
అనుమతి నీకింకా లేకపోతే దాని
ఘలంఘలలు వింటూ తృప్తిపడు.

హృదయరాజ్యాన్ని పగటివేళ పాలించే రాజు
రాత్రి పూట దానికి జీవాన్నిచ్చే రజనీచరుడు
మరెవ్వరో కాదు మన ప్రభువే.

--- జామి


5.

నీ గమ్యం ఉన్నతమో లేక అవమానకరమో
ఏమైనా కానీ,
రాగ, విరాగాల నుంచి
నిన్ను నీవు శుద్దిచేసుకో
నీ అద్దాన్ని స్వచ్చంగా ఉంచుకో.
యోగులకు, ప్రవక్తలకూ జరిగినట్లుగా
రహస్య లోకాల అద్భుత సౌందర్యం
నీ హృదయంలో ప్రకాశించనీ

ఆ సౌందర్యజ్వాలలో దహించబడే
నీ హృదయంలో నీ విభుని చిరునామా
ఇంక ఏమాత్రమూ దాగి ఉండలేదు.
---- జామీ

6.

మాయ అనే తెరవెనుక దాగిఉన్న సౌందర్యం అఖిలమైనది. ఈ లోకపు మట్టితో ఈశ్వరుడు అసంఖ్యాక దర్పణాలను సృష్టించాడు. ప్రతీ దర్పణంలో తన ప్రతిబింబాన్ని ఉంచాడు. నీ కంటికి కనిపించిన సౌందర్యం అంతా ఆయన ప్రతిబింబమే. ఇపుడు నీవు ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తున్నావు. దాని మూలమెక్కడుందో అన్వేషించు. మూలానికి దూరంగా సంచరించవద్దు, చీకటిలోకి జారిపోగలవు. ఈ ప్రతిబింబం రోజా దరహాసంలా క్షణ భంగురం. నీకు శాశ్వతత్వం కావాలా మూలాన్ని చేరుకోవాల్సిందే. యధార్ధం తెలుసుకోవాలనిఉందా, అయితే విశ్వాసమనెడి గనిని తవ్వు. ఇలాగ వచ్చి అలాగ పోయే వాటికై ఎందుకు నీ ఆత్మను మలినం చేసుకొంటావు?

--- జామీ

బొల్లోజు బాబా


7 comments:

  1. Did somebody sing them? I am a big fan of Nusrat Fateh Ali Khan

    ReplyDelete
  2. Baba garu,

    Thanks for introducing Jami, very interesting and deep heart touching writings...

    Thanks,
    Ramesh

    ReplyDelete
  3. మాతృకలకు link ను ఇవ్వగలరా. రంధ్రాణ్వేషణకు కాదు సుమా..

    ReplyDelete
  4. "అనామకునిగా మారే రహస్యాన్ని
    ఛేదించినవాడు అదృష్టవంతుడు.
    ఎవరో ఒకనిగా ఉండటం ద్వారా సాధించేదేముంది!"

    ఈ తత్త్వాన్ని మన బ్లాగర్లు మహ బాగా వంటపట్టించుకున్నారు :-) ఇలాంటి టపాలో ఇలాంటి కామెంటు పెట్టినందుకు క్షమించండి. I just could not resist!

    అసలు విషయానికొస్తే, జామీ తత్త్వాలు చదివితే అచ్చు అద్వైత సిద్దాంతంలాగనే అనిపిస్తోంది!

    ReplyDelete
  5. నరహరి గారికి
    నమస్కారములు
    మీరడిగిన ప్రశ్నకు నావద్ద సమాధానం లేదండి. మరో విషయమేమంటే గూగిల్లితే నాకు లభించిన ఈ లింకులోని Nusrat Fateh Ali Khan యొక్క ఖవ్వాలీలు అద్బుతంగా ఉండి, ప్రస్తుతం నేను వాటిని ఎంజాయ్ చేస్తున్నాను. ఒక గొప్పగాయకుని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు.
    లింకు: http://www.youtube.com/watch?v=51a7f7-h7Jc
    http://thecorner.wordpress.com/muslim-art-music-culture/

    రమేష్ గారికి
    థాంక్సండీ.

    మినర్వాగారికి
    ఈ కవితల మాతృకల లింకును సూఫీ కవిత్వ మొదటి టపాలో ఇచ్చాను. కానీ తరువాత తరువాత మరిన్ని కవితలను వివిధ సైట్లనుంచి సేకరించేవాడిని. ఓ నాలుగైదు చదివి నాకు నచ్చిన, నేను అనువదించగలను అనుకొన్నవాటిని కాపీ పేస్టు చేసుకొనేవాడిని. ఆయా సైట్ల లింకులు మీరెంత తోడుకొంటే అంత అమృతం ఉంది.
    ttp://www.poetseers.org/spiritual_and_devotional_poets/sufi
    http://thecorner.wordpress.com/2007/01/
    http://thecorner.wordpress.com/2007/03/27/
    http://thecorner.wordpress.com/category/muslim-sufi-poetry/page/5/
    http://www.oshoworld.com/biography/innercontent.asp?FileName=biography7/07-49-discourses.txt

    భైరవభట్ల గారికి
    నమస్కారములు,
    మీ కామెంటు అదిరింది. ఆలోచిస్తూంటే కొంతమంది బ్లాగర్లు దీన్నే పాలో అవుతున్నట్లే ఉంది.

    జామీ తత్త్వాలు చదివితే అచ్చు అద్వైత సిద్దాంతంలాగనే అనిపిస్తోంది! ----
    నేనూ అదే అనుకొంటున్నాను.
    సూఫీ తత్వానికి ఆద్యులలో ఒకరయిన సనాయ్ ఇలా అంటాడు..
    ఒకటి ఎప్పటికీ ఒకటే
    ఎక్కువా కాదు తక్కువా కాదు.
    ద్వైతం తోనే పొరపాటు మొదలౌతుంది.
    ఏకత్వానికి ఆ సమస్య రాదు.
    ఇక మీకూ నాకు మధ్య నలుగుతున్న జామి పద్యాన్ని ఇందులో ఉంచలేదు. దానికింకా మెరుగులు కావాలనిపిస్తుంది. అలాంటివి మరికొన్ని కలిపి విడిగా టపాయించాలనుకొంటున్నాను.

    వికాసం గారికి
    మీరి జీడిపప్పుగారి బ్లాగులో చేసిన కామెంటు చూసాను.  . రవీంద్రుని రచనలు చదువుతున్నపుడు, ఒకచోట చదివాను, ఆయన రచనలు కొన్ని సూఫీ తత్వానికి దగ్గరగా ఉంటాయి అని. అప్పుటినుంచీ వీటిని అక్కడా ఇక్కడా చదువుతూనే ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే లాక్కోబడ్డాను. ఎలాగా పడ్డాను కదా అని, ఆ బాధను మీక్కూడా పంచుదామని ఇలా ............. అంతే అంతకు మించి మరేం లేదండీ.
    మరో విషయం, మా ఆవిడ నా వైపు అనుమానంగా చూస్తుంది. 

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. "ఘలంఘలలు " idi kotta padamaa! neaneppudu vinaleadu andukani adugutunnaa? suufi kavitalu baagunnaayi!

    ReplyDelete