Friday, July 3, 2009

సూఫీ కవిత్వం - - రూమి


ఇస్లాం మతంలో ఒక ఆద్యాత్మిక అధ్యాయం సూఫీతత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందటం ధ్యేయం. ఐహిక బంధాల నుంచి విముక్తమై మనసును దేవుని వైపు ప్రయాణింపచేయటం సూఫీల జీవన విధానంగా ఉంటుంది.
సూఫీలు ఆడంబరాలకు దూరంగా ముతక దుస్తులు ధరించి స్వాములుగా జీవితాన్నిగడిపేవారు. సూఫీకవులు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, దైవచింతనను ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేసారు. రూమీ, అత్తర్, హఫీజ్, జామీ, సనాయ్, సాదీ, రబియా మొదలగువారు ప్రముఖులు.
వారు వ్రాసిన కవితలలో నాకు నచ్చిన కొన్నింటి అనువాదాలు ఇవి. మిగిలినవారిగురించి మరో సారి......

జలాలుద్దీన్ మహమ్మద్ రూమి (1207-1273)
రూమి పదమూడవ శతాబ్ధానికి చెందిన పర్షియన్ కవి. దేవుని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం ప్రధాన సాధనాలని రూమీ భావించాడు. ఈతని కవిత్వం ఏమతానికి చెందక మానవత్వాన్ని ప్రతిబింబించటం ఒక ప్రత్యేకత. జీవితాన్ని అక్షరాలుగా మలచి అందించాడు రూమి. ఆయనకవితలలో మార్మికత, భావుకత, మానవత్వంపై అచంచల విశ్వాసం, దేవుని పై ఆరాధనా కనిపిస్తాయి. ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా రూమీ కవిత్వానికి ఆదరణ ఉన్నదంటే దానికి కారణం ఆయన కవిత్వంలో పరచుకొన్న మానవజీవన చిత్రణే.

రూమీ గురించి మరిన్ని వివరాలు ఈ లింకులో చూడవచ్చును. http://te.wikipedia.org/wiki/జలాలుద్దీన్_ముహమ్మద్_రూమి
రూమీ పూర్తి రచనలను శ్రీ దీవి సుబ్బారావు అనువదించారట.

1.
వెలిగించటానికి సిద్దంచేసిన
ఓ దీపముంది నీ హృదయంలో.
నింపేందుకు సిద్దంగా
శూన్యముంది నీ ఆత్మలో
నీకూ తెలుస్తూంది కదూ!


ఈశ్వరునితో నీ వియోగం
నీకు అర్ధమౌతూంది కదూ!
నిను నింపటానికి అతనిని ఆహ్వానించు.
అగ్నిని కౌగిలించుకో.


ప్రేమ తనంత తానే వస్తుందనీ
దానికై నీ తపన పాఠశాలల్లో నేర్పరనీ

గుర్తుచేసుకో.

రూమి - పాషనేట్ పోయమ్స్ ఆఫ్ రూమి" నుండి

2.
ఉదయపు గాలులు వీస్తున్నాయి.
ఉదయపు గాలులు తమ తాజా
వాసనలను పంచుతున్నాయి.
నిదుర లేచి వాటిని ఆహ్వానించు.
మనలను బ్రతికించే గాలులవి.
అవి వెళ్లిపోయే లోగా పీల్చుకో.

రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

3.
నదిని ఆలకించు
ఈ ఒడ్డుపై మరణించి
సముద్రాన్ని చేరే
నదుల మార్గాన్ని
అనుసరించమని
చెపుతూంది అది


రూమీ - " సే ఐ ఆమ్ యూ" నుండి

4.
నీకు ఏదైనా కానుక నీయాలని
నేనెంత అన్వేషించానో నీకు తెలియదు.
సరైనదేదీ దొరకలేదు.
బంగారు గనికి బంగారాన్నీ,
జలనిధికి నీటినీ కాన్కలుగా ఈయటం
ఏం బాగుంటుంది.
అన్నీ అలానే అన్పించాయి.
నా హృదయాన్నో, ఆత్మనో ఇవ్వాలనుకోవటం
ఉచితం కాదు, ఎందుకంటే
అవి ఇప్పటికే నీకు సమర్పించేసాను.


అందుకే, ఒక దర్పణాన్ని తీసుకొచ్చాను.
దానిలో నిన్ను చూసుకొని
నన్ను గుర్తుచేసుకో.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

5.
ఆశే ఈ రహస్యానికి కేంద్రబిందువు
ఆశే స్వస్థత నిస్తుంది కూడా చిత్రంగా.


నియమేమిటంటే
బాధ అనుభవించాలి.
నీ కోర్కె క్రమశిక్షనొందాలి.
భవిష్యత్తులో ఏమి జరగాలనుకొంటావో
దానిని త్యాగం చేయాలి.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

6.
ఒంటరిగా దుఖించే ఈ జనులు నన్ను
అలసిపోయేలా చేస్తున్నారు.
మత్తెంక్కించే నీ ప్రేమ మైకంలో తేలియాడాలని
యోధుని బలాన్ని నా చేతులతో తాకాలని నా ఆశ.


ఈ అశాశ్వత రాజులతో విసిగిపోయాను.
నీ కాంతిని చూడాలనుకొంటున్నాను.

ఈ షేకులు, ముల్లాలు దీపాలు చేతబూని
వారువెతికేది ఎంతకీ దొరకక
చీకటి సందుగొందులలో
తిరుగాడుతున్నారు.

నీవు తత్వ సారానివి. ప్రేమ మైకానివి.
నీ కీర్తనలు పాడాలనుకొంటాను.
కానీ, హృదయంలో బాధించే కోర్కెతో
మౌనంగా నిలుచుండిపోతాను.


రూమి -- ద లవ్ పోయమ్స్ ఆఫ్ రూమి నుండి.

7.
ఈ నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
ఆ పని ఇప్పుడే చేయి.


నీవు దట్టమైన మేఘంతో కప్పబడ్డావు.
పక్కకు జరుగు. మరణించు.
మౌనంగా ఉండు.
నీవు మరణించావనటానికి మౌనమే ఋజువు.
నీ పాత జీవితమనేది
మౌనంనుండి చేసిన ఓ పిచ్చి పరుగు.

మౌన చందమామ ఇప్పుడు ఉదయించింది.


రూమీ - "ది ఎస్సెన్సియల్ రూమి" నుండి.

బొల్లోజు బాబా


6 comments:

  1. Chaalaa Baagunnayi, indulO evannaa sangeetam to unnaayaa, unte links ivvandi, I like sufi music, Nusrat fateh Alikhan, taditarulavi

    ReplyDelete
  2. దా. నరహరి గారికి
    నమస్తే
    రూమీ కవితానువాదాలు మీకు నచ్చినందుకు ధన్యవాదములండీ.
    మీరు కోరినట్లుగా, వీటి పాటలరూపాలు ఉన్నావో లేవో నాకు తెలియదండీ. ఉంటే బ్లాగ్మిత్రులెవరైనా తెలియచేస్తారని ఆశిస్తాను. ఇకపోతే నేను అనువదించింది ఈక్రింది లింకులోని కవిత్వాన్నండి.
    ధన్యవాదములతో

    http://www.poetseers.org/spiritual_and_devotional_poets/sufi

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. చాలాబాగుంది...మీ అనువాదాలతో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. బాబాగారు,

    మంచి ప్రయత్నం!

    తెలుగులో ఉమర్ ఆలి షా కవి సూఫీతత్త్వ ప్రభావంతో గేయ పద్య రూపంలో కవిత్వం రాసారు (ఈ మధ్యనే నాకు తెలిసింది). అందులో సూఫీ వేదాంత దర్శనం ఒకటి. ఇతని రచనలు Digital Libraryలో దొరుకుతున్నాయి.
    నేరుగా పారశీకంనుండి ఉమర్ ఖయాముని కూడా ఇతను పద్యాలలో అనువదించారు.

    ReplyDelete
  5. భైరవభట్లగారికి
    ధన్యవాదములు.
    ఉమర్ అలిషా గారు వ్రాసినవి చూసానండీ. అవి చందోబద్దంగా (మీబోటి వాండ్లకు అతి మధురంగా - నా బోటి వాడికి కష్టంగా) ఉన్నాయండీ. ఆయన మా తూగోజీ నే. వారి వారసులు నడుపున్న ఆశ్రమం పిఠాపురంలో ఉంది. దాని ద్వారా మతాలకతీతంగా చాలా మంది పేదవిద్యార్ధులకు చదువుల నిమిత్తమై ఆర్ధిక సహాయం చేస్తున్నగొప్ప కుటుంబం వారిది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. ఈ అనువాద కవితా పరంగాను, వ్యాఖ్యల్లోని చర్చాపరంగాను కొంగ్రొత్త విషయాలు తెలిసాయండి. తెలిసింది పిడికెడు తెలుసుకోవాల్సింది అనంతం అనిపించేది ఈ తరుణాల్లోనే. అదే సమయాన మీవంటి మిత్రులుండగా ఆ లోటూవుండదనీ అనిపిస్తుంది.

    ReplyDelete