ఖ్వాజా షామ్సుద్దీన్ మొహమ్మద్ హాఫీజ్ సిరాజి (1315-1390)
ఒక పర్షియన్ కవిగా హాఫీజ్ కు మంచి పేరు ఉంది. అది ఎంతంటే ఈతని పుస్తకాలు, ఖురాను కంటే ఎక్కువగా అమ్ముడు పోయేవట.
హాఫీజ్ కవిత్వంలో సౌందర్యం, మార్మికత, ప్రేమ, కరుణ వంటి విశ్వజనీన భావాలు పరిమళిస్తూంటాయి. నిశిత దృష్టి, ఆహ్లాదమైన శైలి, లయ, సరళ భాషతొ ఉండే హాఫీజ్ కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. మరో పర్షియన్ కవి, అత్తర్ వద్ద హఫీజ్ శిష్యరికం చేసాడు.
భారతదేశపు యోగి శ్రీమెహర్ బాబా , హఫీజ్ గీతాలను పాడేవారట.
హఫీజ్ " అశరీర వాణి" అనీ (Tongue of the Invisible), "కవులకే కవి" అని కీర్తి గడించాడు. దేవునిలో లీనమయ్యే మార్గాలను అన్వేషిస్తూ హఫీజ్ ఎన్నో వందల గీతాలను రచించాడు. హఫీజ్ సుమారు 5000 గీతాలు వ్రాసినట్లు ఒక అంచనా. హఫీజ్ తన గీతాలలో ఎక్కడో ఒక చోట తన పేరును పొందుపరచుకొనే వాడు.
మతపెద్దల ధ్వంధ్వ ప్రవృత్తులను తన వ్రాతలలో విమర్శించినందుకు హఫీజ్ తన చరమాంకంలో రాజదండనకు గురి అయ్యాడని అంటారు.
హాఫీజ్ కొరకు మరింత సమాచారం ఇక్కడ
http://en.wikipedia.org/wiki/Hafez
1.
నీ చేతులలో ఒక శిశువు
నా ప్రేమ కెరటం
ఎంతో ఎత్తుకు లేచింది
నిన్ను ఉప్పెనలా ముంచెత్తనీ.
కనులు మూసుకో
బహుసా నీ భయాలు, కల్పనలు
ముగియవచ్చేమో!
అదే కనక జరిగితే
ఈశ్వరుడే నీ చేతులలో
ఓ శిశువు అవుతాడు.
అపుడు
ఈ సృష్టినంతా నీవే
లాలించవలసి ఉంటుంది.
హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి
2.
ఒకే ఒక నియమం
ఆకాశం
ఓ వేలాడదీయబడ్డ నీలి సంద్రం
నక్షత్రాలు ఈదులాడే చేపలు.
ఒక్కోసారి నేను స్వారీచేసే గ్రహాలేమో
తెల్లని తిమింగలాలు.
సూర్యుడు, కాంతి మొత్తమూ
నా హృదయంలో, నా దేహంతో
శాశ్వతంగా పెనవేసుకున్నాయి.
ఈ ఎడారి క్రీడాస్థలంలో
హఫీజ్ కి ఒకే ఒక నియమం
ఇంతవరకూ కనిపించింది.
అదేమిటంటే
ఈశ్వరుని ఆటలో
ఆనందించు మిత్రమా ఆనందించు.
ప్రియవిభుని అద్బుతమైన ఆటలో
ఆనందించు.
హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి
3.
సూర్యుడు ఏనాడూ అనలేదు
ఇంతకాలంగా
సూర్యుడు భూమితో
నీవు నాకు ఋణపడి ఉన్నావని
ఏనాడూ అనలేదు.
అటువంటి ప్రేమలో
ఏం జరుగుతున్నదో గమనించావా!
మొత్తం ఆకాశం అంతా వెలుగే
హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి
4.
సూర్యుడు సౌందర్యపోటీలో నెగ్గి
ఈశ్వరుని చేతి రత్నమై నిలిచాడు.
భూమి తన విభుని కాలి కడియమై
ఉండటానికి అంగీకరించింది.
తన నిర్ణయానికి ఏనాడూ చింతించలేదు.
నిదురించే ప్రేక్షకుల మధ్య కూర్చొని కూర్చొని
పర్వతాలు విసిగిపోయాయి.
తమ చేతులను పైకప్పు వైపు సారిస్తున్నాయి.
మబ్బులు నా ఆత్మ కి ఓ సలహా ఇచ్చాయి.
వెంటనే నేను నా మధుపాత్రను తాకట్టు పెట్టి
రెక్కలు తొడుక్కొన్న వజ్రమై పైకి ఎగసాను.
నా ప్రయత్న్మమంతా ముంచెత్తే ప్రేమకు
దగ్గరగా ఉండటానికే -- నీలానే.
నాలోని నిదురించే జనాల మధ్య ఉండటం
పర్వతానికి విసుగనిపించిందేమో!
సూర్యునిలా నా కనులలోకి ఎగసింది.
నా ఆత్మ నా హృదయానికిచ్చిన గొప్ప సలహాతో
హఫీజ్ రెక్కల వజ్రమై పైకి లేస్తున్నాడు.
హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి
5.
రావోయి మిత్రమా!
గులాబీలను వెదజల్లి, గ్లాసులనిండా
ద్రాక్షమధువుని నింపుకుందాం.
స్వర్గలోకపు పై కప్పును ధ్వంసం చేసి
కొత్త పునాదులు నిర్మిద్దాం.
విషాదం తన సైన్యంతో దండెత్తి
ప్రేమికుల రక్తాన్ని చిందిస్తే
సాకితో చేయికలిపి, దానిని మట్టి కరిపిద్దాం.
మిత్రమా, చేత వాయిద్యముతో,
మధుగీతాన్ని పాడుతూ
ఆనంద నృత్యంలో సోలిపోదాం.
హఫీజ్ ' పెర్షియన్ పోయమ్స్ ' నుండి
6.
నేను చాలా తెలుసుకొన్నాను
నేను ఈశ్వరుని ద్వారా
ఎంతో తెలుసుకొన్నాను.
ఇకపై నన్ను నేను
ఓ క్రిష్టియననో, హిందువుననో, ముస్లిముననో
బౌద్దుడననో, యూదుడిననో
పిలిపించుకోను.
సత్యం తనని తాను
ఎంతగానో నాతో పంచుకొంది.
ఇకపై నన్ను నేను
ఓ పురుషునిగానో, స్త్రీగానో, దేవదూతగానో
లేదా ఒక స్వచ్చమైన ఆత్మగానో
అనుకోవటం లేదు.
హఫీజ్ తో ప్రేమ ఎంతో స్నేహించి
తాను దహింపబడి,
నామనసు తెలుసుకొన్న
ప్రతిఒక్క ఆలోచన, స్వరూపాల నుండి
నన్ను విముక్తుడిని చేసింది
హఫీజ్ - 'ది గిఫ్ట్ ' నుండి
7.
ఆతని సౌందర్యానికి మనం కావలిదారులం
తేజో మూర్తికి మనం రక్షకులం.
కారణమొకటే
మనం ఈశ్వరుని అనుసరిస్తూ
ఈ లోకంలోకి వచ్చాం.
ఆనందాన్ని, స్వేచ్ఛను, నాట్యాన్ని
ప్రేమను పెంపొందించటానికి. అంతే.
నీలో ఏదో ఓ ఉన్నత స్వరం
నాతో ఇలా మాట్లాడనీ!
"హఫీజ్! ఈ వెన్నెల రాత్రి అలా ఖాళీగా కూర్చోకు
నా హృదయాన్ని మన విభుని
మనసులో విచ్చుకొనేలా చేయి.
గాయపడిన నా రెక్కలను స్వస్థపరచు."
మనమాతని సౌందర్యానికి సహచరులము.
సత్యానికి సంరక్షకులము.
ప్రతి పురుషుడు, మొక్క, క్రిమి
ప్రతి స్త్రీ, శిశువు, నరము , నాదము
మన ప్రియ విభుని సేవకులే.
అదిగొ ఆనందము
అల్లదిగో వెలుతురు.
హఫీజ్ -- 'సబ్జక్ట్ టునైట్ ఈజ్ లవ్' నుండి
బొల్లోజు బాబా
కొత్త విషయాలని మీదైన శైలిలో..... బాగున్నాయండి.
ReplyDeleteఒక్కొక్కటీ విడిగాను మళ్ళీ అన్ని కలిపి వరసగాను చదివి వ్యఖ్య వ్రాయటానికి కూడా ఒకింత సంశయం. మహనీయుల చరితము, వారి అమలిన రచనలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ మచ్చుతునకలు రుచి చూపి మొత్తం రచనని చదవాలన్న కాంక్షని మాత్రం పెంచేసారండి. For now I am in love with #7
ReplyDelete