Tuesday, July 14, 2009

సూఫీ కవిత్వం - - సనాయ్

హకిమ్ అబుల్ మజ్డ్ మజ్దూద్ ఇబ్న్ ఆదం సనాయ్ ఘాజ్నావి (సనాయ్) 1080 (?) -1131

సనాయ్ రచనలు పర్షియన్ సాహిత్యానికి దిశానిర్ధేశం చేసాయని పరిశీలకులు భావిస్తారు. వచన రూపంలో సూఫీతత్వాన్ని వెలువరించిన మొదటి కవి, సనాయ్. కోరికలు, ఉద్వేగాలు, అత్యాశ మానవుని దేవుని నుంచి దూరంచేస్తాయని సనాయ్ రచనలు ప్రవచిస్తాయి.
ఘాజ్నావిద్ కి రాజయిన బహ్రామ్ షా కొలువులో సనాయ్ ఆస్థాన కవి. బహ్రామ్ షా భారతదేశంపై దండెత్తటానికి బయలు దేరే సమయాన సనాయ్ రాజుగారి విజయాన్ని కాంక్షిస్తూ వ్రాసిన పద్యాలను చదవటానికి రాజ దర్భారుకు వెళుతున్నప్పుడు, లై ఖూర్ అనే ఓ సూఫీ “ ఎందుకయ్యా ఈ అశాశ్వత రాజులను, రాణులను కీర్తిస్తూ నీ ప్రతిభను వృధా చేసుకొంటున్నావు?” అని సనాయ్ కళ్లు తెరిపించి, ఈయనను భక్తి మార్గంలోకి మళ్లించాడని అంటారు.

ఆ తరువాత సనాయ్ రాజకొలువును, తన ఐశ్వర్యాన్ని త్యజించి, ఈశ్వరారాదనలో మునిగి, అనేక రచనలు చేసాడు. వాటిలో ఉత్కృష్టమైనదిగా The Walled Garden of Truth ను పేర్కొంటారు. మరో ప్రముఖ సూపీ కవి రూమి ఒకచోట “అత్తర్ నాకు ఆత్మ, సనాయ్ నా రెండు నేత్రాలు” అని చెప్పుకొంటాడు. సనాయ్ రచనలను ఓషో ఎక్కువగా ఇష్టపడి తన ఉపన్యాసాలలో ఉటంకించేవారట.
సనాయ్ తన జీవితకాలంలో మొత్తం ముప్పై వేల పద్యాలను రచించాడని ఒక అంచనా.

సనాయ్ గురించి మరింత సమాచారం కోసం ఈ క్రింది లింకులో చూడండి
http://en.wikipedia.org/wiki/Sanai

1.
మన కలయికను ఆటంకపరచే
కలలను తరిమేయటానికి నేనెంత
మనసారా యత్నిస్తానో!
నిన్ను తెలుసుకొనే అన్వేషణలో
నీవు నా అంచులవరకూ నిండిపోయావు.

ఈ అన్వేషణే నీకూ నాకూ మధ్య
అడ్డునిలుస్తుందేమోనని సంశయం గా ఉంది.

సనాయ్ -- వాల్డ్ గార్డెన్ ఆఫ్ ట్రూత్ నుండి.

2.
విశ్వాసం ద్వారా
నీకు దగ్గరగా చేరతాను.
కానీ గుమ్మం వరకు మాత్రమే.
నీ రహస్యంలోకి
ఇంకి పోవటం ద్వారానే
ప్రవేశం లభిస్తుంది.

సనాయ్ -- వాల్డ్ గార్డెన్ ఆఫ్ ట్రూత్ నుండి.

3.
నీ బాధలగురించి మాట్లాడకు
ఆయనకు తెలుసు
ఆయనగురించి అన్వేషించకు
ఆయనే నీకొరకు ఎదురుచూస్తున్నాడు.

చీమకాలు ఆకును తాకింది
ఆయన గమనించాడు.
సెలయేటి గర్భంలో గులకరాయి కదిలింది
ఆయన గుర్తించాడు.
రాతిలో దాక్కున చిన్ని పురుగు కూడా
ఆయనకు పరిచయమే.
దాని కీర్తనల ధ్వనులు, ఆనందరహస్యాలు
ఆయనకు విదితమే.
ఆ చిన్ని క్రిమికీ తిండినందిస్తున్నాడాయన
పవిత్రమార్గాలను నీకు తెరచినట్లుగానే!

సనాయ్ -- ది పజిల్

4.
ఎవరైతే శోకించలేరో
తమ ప్రేమను తెలుపుకోలేరో
విశ్వాసంగా ఉండలేరో లెక
అన్నింటికీ మూలం
ఈశ్వరుడేనని గుర్తుంచుకోరో,
వాళ్లు ఓ ఖాళీ గాలి
లేక చలిపెట్టే లోహ ముద్దలు
లేదా భయపడే వృద్దుల గుంపు.

ఆయన నామాన్ని ఉచ్చరించు.
నీ నాలుకను కీర్తనలతో తడిచేసుకో.
నిదురలేస్తున్న పుష్పించే మన్నుగా మారు
అడవిగులాబీల స్వర్ణపుప్పొడిని
నీ పెదాలతో అందుకో.

జ్ఞానంతో నీవు
ప్రేమతో నీ హృదయం నిండినపుడు
ఇక దాహం వేయదు.

పధికుల సలహాలను పెడచెవినిపెడుతూ
దయగల తాళిమి నిశ్శబ్ధంగా గుమ్మం వద్ద
ఎదురు చూస్తోంది-నీ కొరకై

సనాయ్ -- “పెర్షియన్ పోయమ్స్” నుండి

5.
బాధలనుంచి పారిపోయేవాడు
ప్రేమికుడు కాలేడు.
నేను మాత్రం అన్నింటినీ మించి
నీ ప్రేమనే కోరుకొంటాను.
సంపదలు రావొచ్చు, పోవొచ్చు
అది వేరే సంగతి.
ప్రేమ, సంపదలు వేర్వేరు లోకాల విషయాలు.

నీవు నాలో ఉన్నంత కాలమూ
నేను బాధపడుతున్నానని అనలేను.

సనాయ్ -- “పెర్షియన్ పోయమ్స్” నుండి


6.
తర్కం ద్వారా ఈశ్వరుని చేరాలనుకొంటాం
విఫలమయ్యామని తెలుసుకొన్న మరుక్షణం
అవరోధాలన్నీ తొలగిపోతాయి.
ఆయన మనపట్ల వాత్సల్యముతో
దర్శనమిస్తున్నాడు.
లేకపోతే మనం తెలుసుకోగలమా?
తర్కం గుమ్మంవరకూ తీసుకుపోతుంది
ఆయన దయే మనలను లోనికి అనుమతిస్తుంది.
******
ఒకటి ఎప్పటికీ ఒకటే
ఎక్కువా కాదు తక్కువా కాదు.
ద్వైతం తోనే పొరపాటు మొదలౌతుంది.
ఏకత్వానికి ఆ సమస్య రాదు.
******
నీ ఆత్మ ప్రయాణించాల్సిన మార్గం
హృదయాన్ని మెరుగుపెట్టుకోవటంలోనే ఉంది.
హృదయ అద్దాన్ని మెరుగు పెట్టుకోవటం అంటే
దానిపై చేరిన కపటత్వం, అవిశ్వాసం అనే మురికి పట్ల
కలత చెందటమో లెక దిక్కరించటమో కాదు,
ఈశ్వరునిపై నిశ్చయమైన పరిశుద్ద నమ్మిక నుంచటమే.
*******
నీ చుట్టూ నీవు సృష్టించుకొన్న శృంఖలాలను ఛేధించు.
మన్నునుండి స్వేచ్చనొందితే నీవు విముక్తుడవైనట్లే.
ఈ దేహం చీకటి . హృదయం ప్రకాశిస్తూంటుంది.
దేహం ఉత్త పెంట. హృదయం పువ్వుల తోట.

సనాయ్ -- వాల్డ్ గార్డెన్ ఆఫ్ ట్రూత్ నుండి.బొల్లోజు బాబా1 comment:

  1. బాబా గారు చాలా బాగుంది. నాకు తెలియని చాల విషయాలు తెలుసుకుంటున్నాను మీ కవితలతొ.
    Please watch my latest posting

    ReplyDelete